యథార్థతను కాపాడుకుని, సజీవులుగా ఉండండి!
‘దేవుని దూషించి మరణము కమ్ము!’ తన భర్తపై ఈ మాటలతో దాడి చేసిన యోబు భార్య, ఈ మా పత్రిక కవరు మీద చిత్రీకరించబడింది. అది సుమారు 3,600 సంవత్సరాల క్రితం జరిగింది. అయినా, అలా దేవుని నమ్మకమైన సేవకునిపై జరిపిన ఆ మౌఖిక దాడి, నేటివరకూ కూడా మానవ జాతి ఎదుర్కొంటున్న వివాదాంశాన్ని ఎత్తి చూపుతోంది. నమ్మకస్థుడైన యోబు ఘోర నష్టాలను అనుభవించాడు—తన ఎడ్లనూ తన యింటినీ, తన పిల్లలను కోల్పోయాడు. ఇక ఆయనను పూర్తిగా పరీక్షిస్తూ ఆయన శరీరాన్ని ఓ దీర్ఘకాలీన వ్యాధి చిత్రహింసలు పెట్టింది. కారణం? తీవ్రమైన పరీక్షా సమయంలో మానవుడు తన యథార్థతను కాపాడుకోలేడని దేవునికీ, మానవునికీ ప్రధాన శత్రువైన సాతాను, సవాలు చేస్తూనే ఉన్నాడు.—యోబు 1:11, 12; 2:4, 5, 9, 10.
యోబు దినంలోలా నేడు, “లోకమంతయు” అపవాదియగు సాతాను అయిన ‘దుష్టుని యందున్నది.’ (1 యోహాను 5:19) నిజానికి, నేడు అది మరింత వాస్తవంగా ఉంది, ఎందుకంటే ‘సర్వలోకమును మోసపుచ్చు అపవాదియనియు సాతాననియు పిలువబడే’ వాడు పరలోకంనుండి ఈ భూమ్మీదికి పడద్రోయబడ్డాడు. (ప్రకటన 12:9) మన కాలంలోని మానవజాతిని పట్టిపీడిస్తున్న తీవ్రమైన శ్రమలకు యిది కారణమౌతోంది. మొదటి ప్రపంచ యుద్ధం, 1914లో ప్రారంభమై ఈ 20వ శతాబ్దంలోకి కొనసాగిన ‘వేదనలకు ప్రారంభమును’ సూచించింది.—మత్తయి 24:7, 8.
ఈ క్రూరమైన, నీచమైన లోకంలో మానవుడు యిక ఎంతమాత్రమూ సహించలేడని మీరెప్పుడైనా భావించారా? ‘జీవితానికి సంకల్పం ఉందా’ అని మీరెప్పుడైనా తలంచారా? యోబు అలా భావించి ఉండవచ్చు, అయితే ఆయన పొరపాట్లు చేసినప్పటికీ ఎన్నడూ దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. ఈ మాటల్లో ఆయన తన నిశ్చయతను వ్యక్తపర్చాడు: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.” దేవుడు ‘తాను యథార్థుడై యున్నాడని తెలుసుకొంటాడని’ ఆయనకు నమ్మకం ఉంది.—యోబు 27:5; 31:6.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా, భూమ్మీద ఉన్నప్పుడు శ్రమలను సహించాల్సివచ్చింది. సాతాను యేసును అన్ని విధాల ముట్టడించాడు. శోధనా పర్వతం వద్ద చేసినట్లుగా, అతడు యేసు శారీరక అవసరతలతో ఆడుకున్నాడు, అంతేకాకుండ దేవుని వాక్యంపై ఆయన కల్గివున్న విశ్వాసాన్ని అతడు పరీక్షించాడు. (మత్తయి 4:1-11) మతభ్రష్టులైన శాస్త్రులూ పరిసయ్యులూ అలాగే తాము వంచించినవారు ఆయన్ను హింసించి, దేవదూషణ చేశాడని నిందించి, ఆయన్ను చంపేందుకు కుట్ర పన్నేలా చేయడం ద్వారా యేసును అతడు బాధపెట్టాడు. (లూకా 5:21; యోహాను 5:16-18; 10:36-39; 11:57) యోబును ఓదార్చేందుకు వచ్చిన ముగ్గురు అబద్ధ ఆదరణకర్తలు ఆయన యెడల చేసిన దానికంటే కూడా, వారు యేసుతో మరి దారుణంగా వ్యవహరించారు.—యోబు 16:2; 19:1, 2.
గెత్సేమనే తోటలో ఈ పరీక్ష ముగింపుకు చేరుకున్నప్పుడు తన శిష్యులతో ఆయన యిలా చెప్పాడు: “మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది.” ఆ తర్వాత, “సాగిలపడి—నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.” చివరికి, హింసాకొయ్యపై, కీర్తన 22:1 నందలి ప్రవచనార్థకమైన మాటల నెరవేర్పు ప్రకారం యేసు యిలా మొర్రపెట్టాడు: “నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి.” అయితే చివరికి దేవుడు యేసును విడువ లేదు ఎందుకంటే నిజమైన క్రైస్తవులందరు అనుభవించేందుకుగాను ఓ మాదిరిని అందిస్తూ యేసు ఆయనకు పరిపూర్ణ యథార్థతను కనపర్చాడు. యేసు తన యథార్థతను కాపాడుకోవడం వల్ల యెహోవా ఆయన్ను పునరుత్థానం చేయడం, మరియు పరలోకంలో ఉన్నతమైన స్థానాన్నిచ్చి ఆయన్ను ఉన్నతపర్చడం ద్వారా ప్రతిఫలమిచ్చాడు. (మత్తయి 26:38, 39; 27:46; అపొస్తలుల కార్యములు 2:32-36; 5:30; 1 పేతురు 2:21) అదే విధంగా తన యెడల యథార్థంగా ఉండేవారందరికీ దేవుడు ప్రతిఫలమిస్తాడు.
యేసు యథార్థత సాతాను సవాలుకు పూర్తి జవాబునివ్వడమే కాక, తన పరిపూర్ణ మానవ జీవితపు బలి విమోచనను అందించింది, దాని ఆధారంగా యథార్థతను కాపాడుకునే మానవులు నిత్య జీవితాన్ని పొందగలరు. (మత్తయి 20:28) పరలోక రాజ్యంలో తనతో పాటు రాజ్యాధికారులయ్యే, అభిషేకించబడిన ‘చిన్నమందను’ యేసు మొదట సమకూరుస్తాడు. (లూకా 12:32) ఆ తర్వాత, “గొప్ప సమూహము” “మహా శ్రమలను” తప్పించుకునేందుకు సమకూర్చబడుతుంది, మరి వారు భూమిపై ఉన్న దేవుని రాజ్యంలో నిత్యజీవితాన్ని పొందేందుకు దానినుండి బయటికి వస్తారు.—ప్రకటన 7:9, 14-17.
ఆ శాంతియుతమైన “క్రొత్త భూమి”లోని సమాజమందు భాగస్వాములయ్యేందుకు పునరుత్థానం కాబోయే కోటాను కోట్ల మృతులలో యోబు ఉంటాడు. (2 పేతురు 3:13; యోహాను 5:28, 29) మా పత్రిక వెనక పేజీలో చూపించబడినట్లుగా, యెహోవా యోబును ‘మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించినప్పుడు’ ఆయన కాలంలో యథార్థతకు ప్రతిఫలం లభించింది. ‘నోటిమాటతో నైనను పాపము చేయని’ వానిగా ఆయన ఆత్మీయ శక్తిని పొందాడు. దేవుడు ఆయన జీవితాన్ని మరి 140 సంవత్సరాలకు పొడిగించాడు. వస్తుపరంగా, యోబుకు ముందున్న దానికంతటికీ రెండింతలిచ్చాడు, అంతేకాకుండ యోబుకు “ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి,” మరి ఆ కుమార్తెలు ఆ ప్రాంతంలో ఉన్నవారందరికంటే అందమైనవారిగా పరిగణించబడేవారు. (యోబు 2:10; 42:12-17) ఈ సంపత్తి, “క్రొత్త భూమి” నందలి పరదైసులో యథార్థతను కాపాడుకునేవారు అనుభవించబోయే ఆశీర్వాదాల పూర్వానుభవమే. తదుపరి పేజీలు వివరించినట్లుగా మీరు కూడా ఆ ఆనందాన్ని పంచుకోగలరు!
[4వ పేజీలోని చిత్రం]
యథార్థతను కాపాడుకున్న వానిగా యేసు పరిపూర్ణ మాదిరినుంచాడు