కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 10/15 పేజీలు 12-15
  • యేసుకు దేవునిపై విశ్వాసం ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసుకు దేవునిపై విశ్వాసం ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్వాసం లేని ప్రార్థనలా?
  • “మన విశ్వాసమును పరిపూర్ణం చేయువాడు” పరిపూర్ణుడయ్యాడు
  • ఆయన దేవుని వాక్యాన్ని నమ్మలేదా?
  • అనుకరించదగిన యేసు విశ్వాస మాదిరి
  • యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • విశ్వాసం​—మనల్ని బలపర్చే లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “మా విశ్వాసము వృద్ధి పొందించు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 10/15 పేజీలు 12-15

యేసుకు దేవునిపై విశ్వాసం ఉందా?

త్రిత్వ సిద్ధాంత విశ్వాసుల సందిగ్ధావస్థ

“యేసు విశ్వాసాన్ని ఎలా కల్గివుంటాడు? ఆయనే దేవుడు; ఎవరి మీద ఆధారపడకుండానే ఆయనకు అన్నీ తెలుసు, అన్నింటినీ చూడగలడు. అసలు, విశ్వాసమంటే మరొకరిపై ఆధారపడడం, కంటికి కనిపించనిది ఉందని ఒప్పుకోవడం; కనుక, దేవుడైన యేసుకు విశ్వాసం ఉండవచ్చుననే విషయాన్ని ప్రక్కకు నెట్టవచ్చు.”

ఫ్రెంచి వేదాంతియైన జాక్‌ గీయి ప్రకారం, కాథోలిక్కు మతమందు అది ప్రభలమైన దృక్పథం. ఈ వివరణ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? యేసు అన్ని విషయాల్లోనూ క్రైస్తవులకు మాదిరి గనుక విశ్వాసం విషయంలో కూడా ఆయన మాదిరియై ఉండాలి అని మీరు అనుకుని ఉండవచ్చు. మీరలా అనుకున్నట్లైతే, క్రైస్తవమత సామ్రాజ్యపు త్రిత్వ సిద్ధాంతాన్ని మీరు పరిగణలోకి తీసుకోలేదన్నమాట.

త్రిత్వాన్ని “క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి కేంద్ర మర్మంగా” విశ్వసించే కాథోలిక్కు, ప్రొటెస్టెంటు, ఆర్థడాక్స్‌ వేదాంతులకు, యేసుకు విశ్వాసం ఉందా లేదా అన్న ప్రశ్న నిజంగానే గూఢమైనది.a అయితే, యేసు విశ్వాసాన్ని అందరూ తృణీకరించరు. “యేసుకు విశ్వాసముందన్న విషయాన్ని గ్రహించలేకపోవడం అసాధ్యం,” అని జాక్‌ గీయి నిశ్చయతతో చెబుతున్నాడు. గీయి దాన్ని అంగీకరించినప్పటికీ, త్రిత్వ సిద్ధాంతపు వెలుగులో యిది “విరుద్ధంగా ఉంది” అని ఆయన అంగీకరిస్తున్నాడు.

ఫ్రెంచ్‌ జెసూటైన జాన్‌ గాలో మరియు అలాంటి అనేకమంది వేదాంతులు, “నిజమైన దేవుడును నిజమైన మానవుడునైన . . . క్రీస్తు, తనను తాను విశ్వసించలేడు” అని స్పష్టంగా చెబుతున్నారు. “విశ్వాసమంటే మరొకనిలో విశ్వసించడమేగానీ తనయందు తాను విశ్వసించడముకాదు,” అని ల సివిల్తా కతోలికా అనే మాసపత్రిక తెలియజేస్తుంది. అలాంటప్పుడు యేసు విశ్వాసాన్ని గుర్తించకుండా నిరోధించేది త్రిత్వ పిడివాదము, ఎందుకంటే ఆ రెండు భావనలూ ఒకదానికొకటి పూర్తివిరుద్ధంగా ఉన్నాయి.

“యేసు విశ్వాసాన్ని గూర్చి సువార్తలు ఎన్నడూ మాట్లాడలేదు,” అని వేదాంతులు చెబుతారు. దాని ఫలితంగా, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉపయోగించబడిన పిస్టియో (నమ్మకం, విశ్వాసం కల్గివుండడం) పిస్టిస్‌ (విశ్వాసం) అనే పదాలు, దేవుని యందు లేక క్రీస్తు యందు శిష్యులు విశ్వాసాన్ని కల్గివుండడం అనే వాటినే సూచిస్తున్నాయిగానీ తన పరలోకపు తండ్రి యందు యేసు విశ్వాసాన్ని కల్గివున్నాడని సూచించడం లేదు. కాబట్టి దేవుని కుమారునికి విశ్వాసం లేదని మనం నిర్ణయించాలా? ఆయన చేసిన వాటి నుండి చెప్పినవాటి నుండి మనం ఏమి అర్థం చేసుకోగలము? లేఖనాలు ఏమి చెబుతున్నాయి?

విశ్వాసం లేని ప్రార్థనలా?

యేసు ఎల్లప్పుడు ప్రార్థించే వ్యక్తి. ఆయన ప్రతి సందర్భంలోనూ ప్రార్థించాడు—ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు (లూకా 3:21); తన పన్నెండు మంది అపొస్తలులను ఎన్నుకునే ముందు రాత్రంతా (లూకా 6: 12, 13); అపొస్తలులైన పేతురు, యోహాను, యాకోబులతో ఉన్నప్పుడు కొండమీద తన అద్భుతమైన రూపాంతరానికి ముందు ప్రార్థించాడు. (లూకా 9:28, 29) ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, తన శిష్యుల్లో ఒకరు ఆయన్ను యిలా అడిగారు: “మాకును ప్రార్థనచేయ నేర్పుము,” అప్పుడు ఆయన వారికి ప్రభువు ప్రార్థన (“మా తండ్రి”) నేర్పించాడు. (లూకా 11:1-4; మత్తయి 6:9-13) ఆయన పెందలకడనే ఒంటరిగా చాలా సేపటివరకు ప్రార్థించాడు (మార్కు 1:35-39); తన శిష్యులను పంపించిన తర్వాత సాయంకాలంలో ఓ కొండమీద ప్రార్థించేవాడు (మార్కు 6:45, 46); తన శిష్యులతో కలిసి మరియు తన శిష్యుల కొరకు ప్రార్థించేవాడు. (లూకా 22:32; యోహాను 17:1-26) అవును, యేసు జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైన భాగము.

అద్భుతాలను చేసే ముందు ఆయన ప్రార్థించాడు, ఉదాహరణకు, లాజరును పునరుత్థానం చేసే ముందు యిలా ప్రార్థించాడు: “తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిని.” (యోహాను 11:41, 42) తన తండ్రి ప్రార్థనకు జవాబిస్తాడన్న నిశ్చయత ఆయన విశ్వాసానికున్న బలాన్ని సూచిస్తోంది. దేవునికి ప్రార్థించడం ఆయన యందు విశ్వసించడం మధ్యగల సంబంధం యేసు తన శిష్యులతో చెప్పిన దాన్ని బట్టి స్పష్టమౌతుంది: “అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి.”—మార్కు 11:24.

యేసుకు విశ్వాసం లేకపోతే, ఆయన దేవునికి ఎందుకు ప్రార్థించి ఉండేవాడు? యేసు ఒకేసారి అటు దేవుడూ యిటు మానవుడూ అనే క్రైస్తవమత సామ్రాజ్యపు లేఖన రహితమైన త్రిత్వ బోధ, బైబిలు వర్తమానాన్ని మరుగున పడేస్తుంది. ప్రజలు బైబిలు సరళత్వాన్ని, శక్తిని అర్థం చేసుకోనివ్వకుండా అది ఆటంకపరుస్తుంది. మానవుడైన యేసు ఎవరికి ప్రార్థించాడు? తనకు తానేనా? తాను దేవుడన్న సంగతి ఆయనకు తెలియదా? ఆయన దేవుడైతే, మరి ఆ విషయం ఆయనకు తెలిస్తే, ఆయన ఎందుకు ప్రార్థించాడు?

భూ జీవితంలోని చివరి రోజున యేసు చేసిన ప్రార్థనలు తన పరలోకపు తండ్రి యందు ఆయనకున్న దృఢమైన విశ్వాసాన్ని గూర్చి మరింత లోతైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. నిరీక్షణను, నమ్మకంతో కూడిన అపేక్షను కనపరుస్తూ ఆయన యిలా వేడుకున్నాడు: “తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము.”—యోహాను 17:5.

అతి కష్టతరమైన శ్రమలు, మరణం రాబోతున్నాయని తెలిసి ఆయన ఒలీవ కొండపై గెత్సెమనే అనే తోటలో ఆ రాత్రి “దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను,” అప్పుడు ఆయన యిలా అన్నాడు: “మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది.” (మత్తయి 26:36-38) ఆ తర్వాత ఆయన మోకాళ్లూని యిలా ప్రార్థించాడు: “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.” అప్పుడు “పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.” దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన భావోద్రేకాల తీవ్రత, అలాగే ఆయన అనుభవించే శ్రమ తీవ్రతవల్ల, “ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.”—లూకా 22:42-44.

యేసు అనుభవించిన బాధలు ఆయన బలపర్చబడవల్సిన అవసరం, ఆయన యాచనలు దేన్ని సూచిస్తున్నాయి? “ఒక్క విషయమైతే నిశ్చయంగా చెప్పవచ్చు, యేసు ప్రార్థించాడు, ఆయన జీవితమూ ఆయన క్రియల్లో ప్రార్థన అతి ప్రాముఖ్యమైన విషయం. మానవులు ప్రార్థించేలా ఆయన ప్రార్థించాడు, ఆయన మానవుల కొరకు ప్రార్థించాడు. విశ్వాసంలేని మానవుల ప్రార్థనలు ఫలించవు. విశ్వాసంలేకుండ యేసుకు చేసిన ప్రార్థనలు ఫలించివుండేవా?” అని జాక్‌ గీయి రాస్తున్నారు.

తన మరణానికి కొంచెం ముందు హింసాకొయ్యపై వేలాడుతూ, దావీదు కీర్తనను ఎత్తి చూపుతూ యేసు ఎలుగెత్తి చెప్పాడు. అప్పుడు, విశ్వాసంతో పెద్దగా తన చివరి యాచనను ఆయన ఎలుగెత్తి పలికాడు: “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.” (లూకా 23:46; మత్తయి 27:46) యేసు తన తండ్రికి ‘తన జీవితాన్ని అప్పగించాడని’ ఒక ఇటాలియన్‌ యింటర్డినామినేష్నల్‌ అనువాదమైన పరోలా డెల్‌ సిగ్నోర్‌ చెబుతోంది.

జాక్‌ గీయి యిలా వ్యాఖ్యానించాడు: “ఇశ్రాయేలీయుల కీర్తనలను సూచిస్తూ తన తండ్రికి మొర్రపెట్టుకున్న మ్రానుపై వేలాడదీయబడిన యేసును గూర్చిన సమాచారాన్ని మనకు చూపడం ద్వారా అద్వితీయకుమారుని మొర, పూర్తి బాధతో కూడిన మొరని, నమ్మకంతో కూడిన మొర, ఆ మొరని, విశ్వాసం కలదనీ, విశ్వాసంలో మరణించే మొర అని సువార్త రచయితలు మనలను ఒప్పింపజేస్తున్నారు.”

విశ్వాసం యొక్క ఈ స్పష్టమైన, నాటకీయమైన రుజువును ఎదుర్కొన్నప్పుడు, కొందరు వేదాంతులు విశ్వాసానికి “నమ్మకానికీ” మధ్య తేడాను ఏర్పర్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే, అలాంటి తేడా లేఖనాధారమైనదికాదు.

అయితే యేసు అనుభవించిన తీవ్రమైన శ్రమలు ఆయన విశ్వాసాన్ని గూర్చి కచ్చితంగా ఏమి బయల్పరుస్తున్నాయి?

“మన విశ్వాసమును పరిపూర్ణం చేయువాడు” పరిపూర్ణుడయ్యాడు

హెబ్రీయులకు రాసిన తన లేఖలో పదకొండో అధ్యాయమందు అపొస్తలుడైన పౌలు, క్రైస్తవత్వానికి ముందున్న కాలంనాటి గొప్ప మేఘములాంటి స్త్రీపురుషుల సమూహాన్ని ప్రస్తావించాడు. ఆయన విశ్వాసానికి అతి గొప్ప, పరిపూర్ణ మాదిరిని సూచిస్తూ యీ నిర్ణయానికొచ్చాడు: “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, . . . ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి, . . . మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.”—హెబ్రీయులు 12:1-3.

ఈ లేఖనం “యేసు వ్యక్తిగత విశ్వాసాన్ని” గూర్చి చెప్పడం లేదుగానీ, “విశ్వాసాన్ని ప్రవేశపెట్టినవానిగా లేక దాని స్థాపకునిగా” ఆయన పాత్రను గూర్చి అనేకమంది వేదాంతులు చెబుతున్నారు. ఈ వాక్యంలో కనిపించే టెలియోటెస్‌ గ్రీకు పదం, పరిపూర్ణం చేసేవాణ్ణి, గ్రహించేవాణ్ణి లేక ఒక దాన్ని పూర్తిచేసేవాణ్ణి సూచిస్తుంది. “పరిపూర్ణం చేయు”వానిగా యేసు విశ్వాసాన్ని పూర్ణం చేశాడు అంటే, ఆయన భూమ్మీదికి రావడం బైబిలు ప్రవచనాలను నెరవేర్చింది ఆ విధంగా అది విశ్వాసానికి మరింత గట్టి పునాదిని వేసింది. అయినా ఆయనకు విశ్వాసం లేదని దీని భావమా?

పదిహేనవ పేజీలో మీకు కనిపించే బాక్సులో హెబ్రీయులకు రాసిన పత్రికల్లోని కొన్ని భాగాలు ఏ సందేహాన్ని మిగల్చవు. యేసు తాను అనుభవించిన బాధలు, తన విధేయత వల్ల పరిపూర్ణుడయ్యాడు. ఆయన అప్పటికే పరిపూర్ణ మానవుడైనప్పటికీ, నిజ క్రైస్తవుల రక్షణకొరకు ప్రధాన యాజకుడయ్యేలా పూర్తి అర్హతను పొందేందుకుగాను ఆయన అనుభవాలు, విశ్వాసంతో సహా ఆయన అన్ని విషయాల్లోనూ సంపూర్ణుడును, పరిపూర్ణుడు అయ్యేలా చేశాయి. “మహా రోదనముతోను కన్నీళ్లతోను,” ఆయన తన తండ్రికి యాచన చేశాడు, ఆయన దేవునికి “నమ్మకంగా” ఉండి, “భయభక్తులు” కల్గివున్నాడు. (హెబ్రీయులు 3:1, 2; 5:7-9) ఆయన “సమస్త విషయములలోనూ మనవలెనే శోధింప”బడ్డాడు అని హెబ్రీయులు 4:15 అంటుంది అంటే తన విశ్వాసం కూడా “నానా విధములైన శోధన”లకు గురికాగల యథార్థ క్రైస్తవుని వలెనే గురికాగలదని భావము. (యాకోబు 1:2, 3) యేసు అనుచరుల్లా విశ్వాస మందు పరీక్షించబడకుండానే వారి “వలె” శోధించబడగలడని నమ్మడం సమంజసమేనా?

యాచనలు, విధేయత, బాధలు, శ్రమలు, యథార్థత, దైవభయం యేసు పూర్ణ విశ్వాసాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆయన తన స్వంత విశ్వాసంలో పరిపూర్ణునిగా చేయబడిన తర్వాతనే “మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేవాడు” అయ్యాడని అవి సూచిస్తున్నాయి. స్పష్టంగా త్రిత్వ సిద్ధాంతం చెప్పునట్లు ఆయన కుమారుడైన దేవుడు కాదు.—1 యోహాను 5:5.

ఆయన దేవుని వాక్యాన్ని నమ్మలేదా?

త్రిత్వ సిద్ధాంతం వేదాంతుల ఆలోచనను ఎంతగా మలచిందంటే, యేసు “తానే దేవుని వాక్యంగా, దాన్ని ప్రకటించ గలడు” తప్ప “దేవుని వాక్యాన్ని దాని వర్తమానాన్ని నమ్మలేడు” అనే విపరీత దృక్పథానికి వారు చేరుకున్నారు.—క్రైస్తవ మతానికి సంబంధించిన ముద్రణా అనుమతిగల ఆంజిలో అమాటొ రచించిన జెజ్యూ యిల్‌ సిన్యొరె.

అయినప్పటికీ, యేసు ఎడతెగక లేఖనాలను సూచించడం నిజంగా దేన్ని చూపుతోంది? ఆయన శోధించబడినప్పుడు, ఆయన మూడుసార్లు లేఖనాలనుండి ఎత్తి చూపించాడు. మూడవ జవాబు, యేసు కేవలం దేవుణ్ణే ఆరాధిస్తాడని సాతానుకు తెలిపింది. (మత్తయి 4:4, 7, 10) యేసు ప్రవచనాల నెరవేర్పులో విశ్వాసాన్ని కనపరుస్తూ అనేక సందర్భాల్లో తనకు అన్వయించే ప్రవచనాలను ప్రస్తావించాడు. (మార్కు 14:21, 27; లూకా 18:31-33; 22:37; లూకా 9:22; 24:44-46 పోల్చండి.) ఈ పరిశీలన నుండి, తన తండ్రి ప్రేరేపించిన లేఖనాలు యేసుకు తెలుసని, దాన్ని ఆయన విశ్వాసంతో పాటించాడనీ, మరి తన శ్రమలు, బాధలు, మరణ పునరుత్థానాలను గూర్చి ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పులో ఆయన పూర్తి నమ్మకాన్ని ఉంచాడనే నిర్ణయానికి మనం రావాలి.

అనుకరించదగిన యేసు విశ్వాస మాదిరి

తన తండ్రి యెడల యథార్థతను కాపాడుకోడానికీ అలాగే ‘లోకాన్ని జయించడానికి’ యేసు చివరి వరకూ విశ్వాస పోరాటాన్ని పోరాడవల్సి ఉండింది. (యోహాను 16:33) విశ్వాసం లేకుండా, అలాంటి విజయాన్ని పొందడం అసాధ్యం. (హెబ్రీయులు 11:6; 1 యోహాను 5:4) ఆ విజయవంతమైన విశ్వాసం నిమిత్తం, ఆయన తన నమ్మకమైన అనుచరులకు మాదిరిగా ఉన్నాడు. తప్పకుండా, ఆయనకు సత్య దేవుని యందు విశ్వాసముంది.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి అఫ్‌ న్యూయార్క్‌ యిన్కార్పరేటెడ్‌ ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషూరులో, ఆధారంలేని త్రిత్వ బోధలను గూర్చిన మరింత విస్తృతమైన చర్చ కనిపిస్తుంది.

[15వ పేజీలోని బాక్సు]

“పరిపూర్ణం చేయువాడైన” యేసు పరిపూర్ణుడయ్యాడు

హెబ్రీయులు 2:10: “ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.”

హెబ్రీయులు 2:17, 18: “ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన ‘సహోదరుల’ వంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.”

హెబ్రీయులు 3:2: “దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించినవానికి నమ్మకముగా ఉండెను.”

హెబ్రీయులు 4:15: “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.”

హెబ్రీయులు 5:7-10: “శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, . . . నిత్య రక్షణకు కారకుడాయెను.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి