శరణార్థులైనప్పటికీ, దేవున్ని సేవిస్తున్నందుకు సంతోషిస్తున్నారు
యుద్ధాలు, కరవులు, విపత్తులు, అలజడి. కొంతమంది ప్రజలకు అవి కేవలం వార్తా శీర్షికలు మాత్రమే. అనేకమంది యితరులకు మాత్రం అవి అనుదిన జీవితంలో ఒక భాగంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహవాసంలో ఉన్నందున, ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు లేక విపత్తు సంభవించినప్పుడు తమ అంతర్జాతీయ సహోదరత్వంలోని ఒక భాగం కష్టాన్ని అనుభవించవచ్చని యెహోవాసాక్షులకు తెలుసు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోడానికి పారిపోవలసి వచ్చినప్పుడు, మన సహోదరులు కూడా అదే చేయవలసి రావచ్చు.
కొన్ని సంవత్సరాలుగా ఆఫ్రికాలోని అనేక దేశాల్లో, సాక్షులు అటువంటి అనుభవాలను చవిచూడవలసి వచ్చింది. వారిలో అనేకమంది తాము తీసుకెళ్లగల్గినవన్నీ తీసుకుని వేరొకచోటికి శరణు కొరకు వెళ్లవలసి వస్తుంది. కొంతమందికి కొన్ని రవాణా సౌఖర్యాలు, బహుశా ఒక సైకిలు ఉన్నప్పటికీ, అనేకమంది తమ గమ్యాన్ని చేరుకోడానికి నడిచీ, నడిచీ, నడిచీ—దినాలు, మరి వారాలు కూడా నడవవలసి వచ్చేది.
మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లోని బోకి అనే పేరుగల చిన్న పట్టణం అటువంటి గమ్యాల్లో ఒకటి. కొన్ని సంవత్సరాల్లో, పురుషులు, స్త్రీలు, యౌవనులు మరియు పెద్దలు వేలకొలది మంది వచ్చారు. వారిలో మన క్రైస్తవ సహోదరసహోదరీలతో కలిసి వచ్చిన ఆసక్తిగలవారు చాలామంది ఉన్నారు. అయితే మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ యొక్క రాజధాని అయిన బంగుయీనందలి వాచ్‌టవర్ సంస్థ యొక్క బ్రాంచి కార్యాలయంలోని తోటి క్రైస్తవులు, ఈ శరణార్థులకు సహాయాన్ని అందించడానికి వారిని కలిసేందుకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. మరి 1,130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగుయీలోని సాక్షులు ఉదారంగా అందజేసిన డబ్బు, ఆహారం, బట్టలు, మరియు మందులను ఒక ప్రతినిధికి యిచ్చి, అతన్ని ఐదుసార్లు పంపారు. ఈ ఉదార సహాయాన్ని అందించే వారు స్థితిమంతులు కాకపోయినా, తమకు వీలైనది చేయడానికి వారు సంతోషంగా ఉన్నారు.
బోకిని చేరడం
బ్రాంచి కార్యాలయంలోని సహోదరులు, యింకా ఏమి చేయవలసి ఉందో, శరణార్థులకు ఆత్మీయంగా ఎలా సహాయం చేయవచ్చో చూడటానికి యిష్టపడ్డారు. కావున నా భార్య, నేను ఒక జీపులో, ఒక ప్రత్యేక పయినీరైన సింఫొరీన్, అతని భార్యతో కలిసి బయల్దేరాము. సింఫొరీన్కు దారి బాగా తెలుసు, బోకిలోని శరణార్థుల భాషైన జాండే అతనికి తెలుసు. అక్కడికి చేరడానికి మాకు సుదీర్ఘమైన నాలుగు రోజులు పట్టాయి.
చివరి 400 కిలోమీటర్లు అందమైన పల్లె ప్రాంతం, పెద్ద బావొబాబ్ చెట్ల నడుమనుండి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడక్కడా చిన్న గ్రామాలు కనిపించాయి. ఈ మార్గంలో నా భార్య కచ్చితంగా 50 వంతెనలను లెక్కించింది—వాటిలో అనేకం చాలా పాడై, దాటడానికి వీలులేని స్థితిలో ఉన్నాయి. మేము కొన్ని వంతెనలను అక్కడున్న కర్రలు, కుళ్లిన దూలాలను పెట్టి బాగుచేసి, నాలుగు చెక్రాలున్న కారును ట్రాక్షన్‌లో వేసి, ప్రార్థించి, చాలా జాగ్రత్తగా బయల్దేరాము. దగ్గర్లో చిన్న గ్రామం గనుక ఉంటే, చిన్న మొత్తాన్ని తీసుకుని—సహాయం చేయడానికి చిన్న పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తారు. వాళ్లు వంతెనలోని లంబర్, బోర్డ్ ముక్కలను ఎప్పుడూ ఎత్తు గడ్డిలోనో, దగ్గర్లోని పొదల క్రిందనో కనుగొనడాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము. ఇది వాటిని వంతెననుంచి తొలగించి, అవసరంలో ఉన్న ప్రయాణికులకు అమ్మడానికి అక్కడ ఉంచారేమోనని మేము ఆలోచించేలా చేసింది.
మూడు సందర్భాల్లో మేము ఆ చిన్న పిల్లల సహాయాన్ని నిరాకరించాము, ఎందుకంటే ఆ వంతెనలు దాటేందుకు మరీ ప్రమాదకరమైనవిగా కన్పించాయి. అందుకని మేము రోడ్డునుండి క్రిందకు ప్రయాణించి, చిన్న నదిలోకి వెళ్లి, గుట్టలను దాటి, కొండ ఎక్కి, మళ్లీ రోడ్డు మీదకు వచ్చాము. అది ఎండాకాలం అయినందుకు మేమెంత సంతోషించామో, ఎందుకంటే అలా కాకపోతే, మేము ప్రయాణించడానికి బహుశా హెలీకాప్టరు ద్వారా కాక మరొక మార్గం ఉండేది కాదు!
బోకి ఎలా ఉంటుంది? ఈ అంతంలేని “పిస్టే”లో ప్రయాణిస్తుండగా ఆ విషయాన్ని గూర్చి మేము ఎంతో ఆలోచించాము. అది ఒక ఫ్రెంచి పదము, యిక్కడ మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో, యిసుక, రాళ్లు, గులక రాళ్లు—మరి వేలాది గుంటలు ఉన్న రోడ్డును గురించి చెప్పడానికి అది ఉపయోగించబడుతుంది.
నాల్గవ రోజు మధ్యాహ్నమైన తర్వాత, చుట్టూ పప్పాయి చెట్లతో, కసావా పొలాల మధ్య ఉన్న కొన్ని గడ్డి గుడిసెలను సింఫొరిన్ చూపించాడు. “వ్యాలా! బోకి యిక్కడినుండే ప్రారంభమౌతుంది,” అని ఆయన అరిచాడు. మేము చూచిన దాన్నిబట్టి మేమెంతో ఆశ్చర్యపోయాము. “యిదా బోకి? శిబిరం ఎక్కడా?” అని మేము అడిగాము, ఎందుకంటే మేము చూసినది శిబిరం కాదుగానీ, కేవలం అక్కడక్కడా ఉన్న యిల్లులు. అవి చిన్నవైనా గడ్డి పైకప్పులుండే శుభ్రమైన చిన్న గుడిసెలు. ఎక్కడ చూసినా చెట్లు, పొదలు ఉన్నాయి. ప్రజలు తమ యిల్లుకు ప్రక్కనే పంటలు పండించుకుంటారు. బోకి మేము చూస్తామని ఊహించినటువంటి శిబిరం కాదు; అది దాదాపు 35 కిలోమీటర్ల పొడవుగల, పెద్ద గ్రామము.
సహోదరులను కలుసుకోవడం
మేము రావడానికి ఐదు రోజులు పడుతుందని వాళ్లు అంచనా వేసినా, మేము వస్తున్నామని బోకిలోని సహోదరులకు తెలుసు. మా కారు శబ్దం విన్నప్పుడు, వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు. మమ్మల్ని నమస్కరించడానికి పురుషులు, స్త్రీలు, పిల్లలు తమ గుడిసెలు, ఆవరణల్లోంచి, పొలాల్లోనుంచి వచ్చారు. అందరూ చిరునవ్వులు చిందిస్తూ, నవ్వుతూ, వీలైతే అనేకసార్లు కరచాలనం చేశారు. తల్లులు తమ పిల్లలను చేతుల్లో చాచి మాకు అభివాదం చేయాలని ప్రయత్నించారు. అందరు మమ్మల్ని పలకరించాలని యిష్టపడ్డారు, వాళ్లు మాకు ఎంతో హృదయ పూర్వక ఆహ్వానం యిచ్చారు.
భాషాసమస్య ఉన్నందుకు, నేను నా భార్య ప్రస్తుతానికి ఎక్కువేమి చేయడానికి లేదు. మేము కొంచెం ఫ్రెంచి, సాంగో, ఇంగ్లీష్, అరబిక్ భాషలతో ప్రయత్నించాం. మన సహోదరుల్లో చాలామంది జాండే భాషలో మాట్లాడగలరు, చదవగలరు, వ్రాయగలరు. మా సందర్శనా కార్యక్రమాన్ని వివరించడానికి సింఫొరీన్ అనువదించవలసి వచ్చింది.
మేము మరికొన్ని కిలోమీటర్లు ప్రయాణించి రాజ్యమందిరం వద్దకు చేరాము. బోకిలోని ఏ మతానికి సంబంధించిన శరణార్థులైనా కట్టిన మొదటి “చర్చి” అదే. కరచాలనం చేయడానికి ఎక్కువమంది సహోదరులు, వారి పిల్లలు, ఆసక్తిగల వారు వచ్చారు. మాతో కరచాలనం చేయడానికి అనేకమంది ప్రక్కింటివారి పిల్లలు కూడా సహోదరులతో కలిసి వచ్చారు.
వారిని దర్శించడానికి వెళ్లిన మా కొరకు, మన సహోదరులు రెండు చిన్న యిళ్లను సిద్ధం చేశారు. అవి పరిశుభ్రంగా ఉన్నాయి. శుభ్రమైన నీళ్లున్న బకెట్లు సిద్ధంగా ఉండి, మాకొరకు వేచి ఉన్నాయి. పరిస్థితి మరీ క్షీణించి ఉంటుందని, మన సహోదరులకు యిబ్బంది కలిగించకుండా ఉండడానికి మేము మా కొరకు ఆహారం మరియు త్రాగే నీళ్లు తెచ్చుకున్నాము. మేము మా వాహనంలోని సామాన్లను క్రిందకు దింపుతుండగా, ఆ రాత్రికి మేము కోడివేపుడా లేక సాస్‌లో వండిన దాన్ని యిష్టపడతామా అని ఒక యౌవనురాలు వచ్చి మమ్మల్ని అడిగింది? మేము దాన్ని ఎన్నడూ అపేక్షించలేదు, వాళ్లు దానితోపాటు ఏమి తినడానికి ఏర్పాటు చేశారని అడిగాము. జవాబు: కసావా. కాబట్టి మేము సాస్‌లో వండిన కోడిని యిష్టపడ్డాము. ఆ రాత్రి మా క్షుద్భాద తీరింది. కానీ వాళ్లు మాకు ప్రతిరోజు భోజనం పెడుతూనే ఉన్నారు—మధ్యాహ్నం, సాయంత్రం. మేము దాన్ని నమ్మలేకపోయాము—శరణార్థులు తమకు ఎక్కువ లేకపోయినప్పటికీ మాపట్ల శ్రద్ధ వహించి మాకు ఆతిథ్యమిస్తున్నారు.
సంతోషకరమైన ఒక చిన్న సంఘం
ఇక్కడ మేము ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాము, కానీ 21 మంది మన సహోదరుల మధ్య ఉన్నాము. వాళ్లలో కేవలం యిద్దరు మాత్రమే బాప్తిస్మం తీసుకుని అక్కడికి వచ్చారు. మిగతా వారు, వారు వచ్చినప్పుడు కేవలం ఆసక్తిగలవారే. వాళ్లు పఠించడం కొనసాగించారు, గత రెండు సంవత్సరాల్లో వాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. మా సందర్శనా సమయమందు, దగ్గర్లోని నదిలో నలుగురు బాప్తిస్మం తీసుకున్నారు.
ఒక ప్రత్యేకమైన మాదిరి ఫావుస్టెనో. బోకికి రాకముందు, ఆయన ఒక స్నేహితుడినుండి బైబిలు మూల సత్యాలను నేర్చుకున్నాడు. తాను నేర్చుకుంటున్న దానిని ఫాపుస్టెనో గుణగ్రహించాడు. త్వరలోనే ఆయన, ఆయన స్నేహితుడు యితరులకు ప్రకటించడం ప్రారంభించారు, కానీ వాళ్లకు వ్యతిరేకత ఎదురై, తమ మతంచేత “ప్రజలను కల్లోలపరుస్తున్నందుకు,” వాళ్లు చెరసాలలో పెట్టబడ్డారు. చెరసాలలో ఉన్నప్పుడు, ఫాపుస్టెనో స్నేహితుడు భయంవలన విశ్వాస విషయంలో రాజీపడినందున, వదిలివేయబడ్డాడు. రెండునెల్ల తర్వాత ఫాపుస్టెనో కోర్టులో ప్రవేశపెట్టబడ్డాడు. అయితే, ఆయనపై మోపబడిన నేరాలు నిరాధారమైనవని తేలింది గనుక ఆయన వదిలివేయబడ్డాడు. తన ప్రాంతంలో యుద్ధం చెలరేగినప్పుడు, ఫాపుస్టెనో మధ్య ఆఫ్రికా రిపబ్లిక్కు పారిపోయాడు, అక్కడ ఆయన సహోదరులను కనుగొని తన బైబిలు పఠనాన్ని కొనసాగించాడు. ఆయన జూలై 1991లో బాప్తిస్మం తీసుకున్నాడు, 1992లో ఆయన క్రమ పయినీర్‌గా పూర్తికాల సేవ చేపట్టాడు.
ఆనందంగా, స్నేహపూర్వకంగా ఉండే బోకిలోని చిన్న సంఘంలో ఒక స్పెషల్ పయినీర్, 21 మంది ప్రచారకులు ఉన్నారు. ఆంగ్లం మాట్లాడే యిద్దరు సహోదరులు పెద్దలుగా సేవచేస్తున్నారు, బంగుయీలోని బ్రాంచి కార్యాలయంతో వారు మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. మన శరణార్థ సహోదరులు ఘోరమైన, దయనీయమైన స్థితిలో ఉంటారని మేము ఊహించాము, కాని పరిస్థితి అలా లేదు. వారు వస్తుదాయకంగా పేదవారైనప్పటికీ, ఎవ్వరూ ఫిర్యాధు చేయడంలేదు, చింతించడంలేదు, లేక సణగడంలేదు. సహోదరులు వచ్చినప్పటినుండి తమ గుడిసెలను, యిల్లులను కట్టుకుని, ఆహారం పండించి, కోళ్లను పెంచడం ప్రారంభించారు. వాళ్లకు ముందు ఉండిన దానికంటే యిప్పుడు వాళ్లదగ్గర తక్కువే ఉంది, కాని వాళ్లు బ్రతికే ఉన్నారు, తోటి సహోదరులతో కలిసి ఉన్నారు.
బోకిలో 17,000 నుండి 20,000 వరకూ శరణార్థులు ఉన్నారు, మరి ప్రతి నెలా యింకా ఎక్కువమంది వస్తున్నారు గనుక, మన సహోదరులకు పరిచర్య కొరకు ఎక్కువ క్షేత్రం ఉంది. మేము వారివెంట ప్రకటించడానికి వెళ్లాము, వాస్తవంగా అది ఎంతో ఆసక్తికరంగా ఉండినది. వాళ్లు తరచూ జాండే భాషలోని బైబిలును ఉపయోగిస్తారు, ఈ అనువాదంలో దేవుని నామం హెబ్రీ లేఖనాల్లో, మరి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అనేక ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రజలకు, దేవుడు కేవలం “బోలి” (జాండేలో “దేవుడు”) కాదుగానీ “యెకోవా,” వారు దేవుని వ్యక్తిగత నామాన్ని అలా పలుకుతారు. “బోలి యెకోవా” అనేది సామాన్య పదం. అనేక యితర ఆఫ్రికా భాషల్లోని ప్రొటెస్టెంటు తర్జుమాల్లో యిలా సరైన విధంగా వ్రాయబడలేదు; దానికి భిన్నంగా, “యెహోవా”కు బదులు వాళ్లు “జాపా,” “జాంబే,” లేక ఆఫ్రికా భాషలో దేవుని కొరకున్న యితర నామాలను వాడతారు.
యేసు ప్రవచనానికి అనుగుణంగా, రాజ్య సువార్త బోకితో సహా లోకమందంతట ప్రకటించబడుతుంది. (మత్తయి 24:14) సంఘంలో వారికి అవసరమైన భాషలన్నింటిలో బైబిళ్లు, పుస్తకాలు, పత్రికలు, చిన్న పుస్తకాలు, మరియు కరపత్రాలు సమృద్ధిగా అందజేయబడుతున్నాయి. బహుశా భవిష్యత్తులో, జాండే భాషలో మరి ఎక్కువ ప్రచురణలు లభ్యమవ్వవచ్చు.
ఒక నిత్యమైన గృహంకొరకు ఎదురుచూడడం
మొదటిరోజు సాయంత్రం, సంస్థ యొక్క “హేపీ కన్వెన్షనర్స్ ఇన్ ఈస్టన్ యూరప్ ప్రెయిజ్ జెహోవా” అనే స్లైడ్ కార్యక్రమాన్ని చూపాము. మర్నాటి రాత్రి కార్యక్రమం “బ్రింగింగ్ ది మెనీ టు రైట్యస్నెస్స్ యిన్ ది టైమ్ ఆఫ్ ది ఎండ్.” స్లైడ్ ప్రదర్శన ఆరు బయట, రాజ్య మందిరానికి ప్రక్కన, ఆరుబయట పండు వెన్నెల్లో జరిగింది. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం! ఈ స్లైడ్ ప్రదర్శనలను చూడడానికి వందలాదిమంది వచ్చారు, ప్రజలకు సరిక్రొత్త విషయాలను అందజేసినందుకు మన సహోదరులు ఎంతో ఆనందంగా, సగర్వంగా భావించారు.
సోమవారం వచ్చేసరికల్లా, మేము తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాము. అంటే మళ్లీ అదే మార్గాన్ని, అవే 50 వంతెనలను దాటుతూ నాలుగు దినాలు ప్రయాణించాలి. ఒక సహోదరి మా తిరుగు ప్రయాణం కొరకు ఆహారాన్ని సిద్ధం చేస్తానని పట్టుపట్టింది—ఆమె అప్పటికే రెండు కోళ్లను వెల్లుల్లి పూసి వేయించి ఉంచింది. వాహనంలో ఉదయ ప్రయాణం చేస్తున్నప్పుడు అవి ఎంతో కమ్మని సువాసనలిచ్చాయి. మధ్యాహ్నం బోకిలోని సహోదరులను గురించి ఆలోచిస్తూ, వేయించిన కోడిని తినడానికి మేము పొదల దగ్గర ఆగాము. శరణార్థులుగా ఉండవలసి వస్తున్నా, దేవుడు వాగ్దానం చేసిన నూతన భూమిపై నిత్యమైన శాంతియుత గృహం కొరకు ఎదురు చూస్తూ, వాళ్లు యెహోవాను నమ్మకంగా సేవించడంలో కొనసాగుతున్నారు. (2 పేతురు 3:13)—ఉచిత వ్యాసం.