మృతుల స్థితి ఏమైయుంది?
మృతులను గూర్చిన భయం ఒక ఆధారాంశంపై నిలిచి ఉంది—అదేమంటే చనిపోయిన వారికి మరణం తర్వాత కూడా సజీవంగా ఉండే ఆత్మ (సోల్) లేక ప్రాణం (స్పిరిట్) ఉంటుందనేదే. ఈ సిద్ధాంతం అసత్యమని బైబిలు గనుక సరళంగా బోధిస్తున్నట్లయితే, మృతులు మీకు హాని చేయగలరా అన్న వివాదం సమాప్తమయినట్లే. కాబట్టి, బైబిలేమి చెబుతుంది?
మృతుల స్థితిని గురించి దేవుని వాక్యం యిలా చెబుతుంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యునిక్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.”—ప్రసంగి 9:5, 6.
దాని దృష్ట్యా, మృతులు మీకు సహాయం లేక హాని చేయగలరా? చేయలేరని లేఖనాలు చెబుతున్నాయి. మృతులు అపస్మారకస్థితిలో ఉండి, మౌనులై యున్నారు. జీవించి ఉన్న వారితో మాట్లాడడానికి, లేక—ప్రేమ లేక ద్వేషం—వంటి ఏ భావోద్రేకాలనైనా వ్యక్తం చేయడానికి లేక ఎటువంటి క్రియలు చేయడానికి కూడా వారికి సామర్థ్యం లేదు. మీరు వారికి భయపడనవసరం లేదు.
‘అవును, నిజమే, మీరొకవేళ భౌతిక శరీర మరణాన్ని గురించి మాట్లాడుతుంటే అది వాస్తవమే,’ అని కొందరనవచ్చు. ‘కానీ భౌతిక మరణం జీవితం యొక్క అంతం కాదు; అది ఆత్మను శరీరంనుండి బయటకు వదులుతుంది. ఆ ఆత్మ (స్పిరిట్) జీవించి ఉన్న వారికి సహాయం లేక హాని చేయగలదు.’ భూవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు అలాగే భావిస్తారు.
ఉదాహరణకు, మడగాస్కర్‌నందు జీవితం కేవలం ఒక పరివర్తనంగా భావించబడుతుంది, అందుకే వివాహానికంటే అంత్యక్రియలు, పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయడమే చాలా ప్రాముఖ్యమైనవిగా భావించబడతాయి. ఒక వ్యక్తి తన పూర్వికులనుండి వచ్చాడని, మరణించినప్పుడు వారి వద్దకే వెళ్తాడని భావించబడుతుంది. అందుకే, జీవించివున్న వారి యిల్లులు కొద్ది కాలానికి పాడయ్యే చెక్క, మట్టితో నిర్మింపబడతాయి, కాని, మృతుల “యిల్లైన” సమాధులు, సాధారణంగా చాలా ఘనంగా, మన్నికగలవై ఉంటాయి. పాతిపెట్టబడిన శవాన్ని బయటకు తీసేటప్పుడు, కుటుంబీకులు, స్నేహితులు తాము ఆశీర్వదింపబడతామని భావిస్తారు, మరణించిన బంధువు ఎముకలను స్పర్శిస్తే, తాము సంతానవతులమౌతామని స్త్రీలు విశ్వసిస్తారు. కాని, దేవుని వాక్యం మరలా ఏమి చెబుతుంది?
మరణం మానవజాతి కొరకు ఉద్దేశింపబడలేదు
యెహోవా దేవుడు మానవున్ని జీవించడానికే సృష్టించాడని, మరణాన్ని గురించి ఆయన అవిధేయతకు పర్యవసానంగా మాత్రమే చెప్పాడని గమనించడం ఆసక్తికరంగా ఉంది. (ఆదికాండము 2:17) దుఃఖకరంగా, మొదటి స్త్రీపురుషులు పాపం చేశారు, తత్ఫలితంగా, పాపం మానవజాతికంతటికీ మరణకరమైన వారసత్వంలా వ్యాపించింది. (రోమీయులు 5:12) కావున మొదటి మానవజత అవిధేయత చూపినప్పటినుండి మరణం జీవిత వాస్తవమయ్యిందని అవును, జీవితం యొక్క బాధాకరమైన వాస్తవమయ్యిందని మీరు గ్రహించవచ్చు. మనం జీవించడానికే సృష్టింపబడ్డామన్న విషయం, మరణమే అంతమని అంగీకరించడం లెక్కలేనన్ని లక్షలమందికి ఎందుకంత కష్టమనిపిస్తుందో కొంత మేరకు వివరిస్తుంది.
బైబిలు వృత్తాంతం ప్రకారం, అవిధేయత మరణాన్ని తెస్తుందన్న దేవుని హెచ్చరికకు విరుద్ధంగా మరణాన్ని గురించి మొదటి మానవజతను మోసగించడానికి సాతాను ప్రయత్నించాడు. (ఆదికాండము 3:4) అయితే, సమయం గడిచే కొలది, మానవులు మరణిస్తారని దేవుడు చెప్పిన ప్రకారమే వారు మరణిస్తారని తేటతెల్లమయ్యింది. కాబట్టి, శతాబ్దాలుగా సాతాను మరొక అబద్ధాన్ని ఉపయోగించడం ద్వారా ప్రతిస్పందించాడు—మానవునిలోని ఆత్మ శరీర మరణాన్ని తప్పించుకుంటుందన్నదే. “అబద్ధమునకు జనకుడు” అని యేసు వర్ణించిన అపవాదియగు సాతానుకు అటువంటి మోసము తగినదే. (యోహాను 8:44) దానికి భిన్నంగా, మరణానికి దేవుడిచ్చే జవాబు ఒక ప్రోత్సాహకరమైన వాగ్దానము.
ఏ వాగ్దానము?
అనేకులకు పునరుత్థానాన్ని గూర్చిన వాగ్దానమే అది. “పునరుత్థానం” అని అనువదింపబడిన గ్రీకుపదం అనస్టాసిస్. అది అక్షరార్థంగా “మళ్లీ నిలబడటం,” అనే అర్థాన్నిస్తుంది, మరణంనుండి తిరిగి లేవడాన్ని అది సూచిస్తుంది. అవును, మనిషి మరణమందు నిద్రిస్తాడు, కాని దేవుడు తన శక్తితో ఒక వ్యక్తిని లేపగలడు. మనిషి జీవాన్ని కోల్పోతాడు, కాని దేవుడు అతనికి మళ్లీ జీవాన్ని యివ్వగలడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు” అని చెప్పాడు. (యోహాను 5:28, 29) అపొస్తలుడైన పౌలు “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . దేవునియందు నిరీక్షణ”ను వ్యక్తం చేశాడు. (అపొస్తలుల కార్యములు 24:15) క్రైస్తవత్వానికి ముందున్న కాలాల్లో దేవుని నమ్మకమైన సేవకుడైన యోబు కూడా పునరుత్థానమందు తన నిరీక్షణను వ్యక్తపర్చాడు: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును ఆలాగుండినయెడల నీవు [దేవుడు] పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను.”—యోబు 14:14, 15.
పునరుత్థానాన్ని గూర్చిన స్పష్టమైన వాగ్దానం, మృతులు ఆత్మ రూపంలో ఎక్కడో సజీవంగా ఉన్నారనే తలంపు అబద్ధమని నిరూపించడంలేదా? మృతులు సజీవంగా ఉండి, పరలోకంలో లేక ఏదో ఆత్మీయ లోకంలో ఉనికిలో ఉండి ఆనందిస్తుంటే, పునరుత్థానాన్ని గూర్చిన సంకల్పమేమై ఉంటుంది? వాళ్లు తమ ప్రతిఫలాన్ని లేక అదృష్టాన్ని అప్పటికే పొంది ఉండరా? మృతులు వాస్తవంగా మృతి చెందారని, స్మారకంలో ఉండరని, మన ప్రేమగల తండ్రియైన, యెహోవా వాగ్దానం చేసిన—పరదైసు అయిన నూతన లోకంలోకి పునరుత్థానం ద్వారా గొప్పగా మేల్కొల్పబడటం వరకు నిద్రిస్తుంటారని దేవుని వాక్యపఠనం బయల్పరుస్తుంది. కాని మరణమంటే శరీరం నుండి ఆత్మ వేర్పర్చబడటం కాకపోతే, ఆత్మ జీవించి ఉండకపోతే ఆత్మీయ లోకంనుండి సందేశాలు వచ్చాయని చెప్పబడుతున్న సంగతుల విషయమేమిటి?
ఆత్మీయ లోకంనుండి సందేశాలు
ఆత్మీయ లోకంనుండి సందేశాలను పొందామని లెక్కలేనన్ని సంగతులు చెప్పబడ్డాయి. వాస్తవానికి వాటి ప్రారంభమేమిటి? “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు” అని బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది. (2 కొరింథీయులు 11:14, 15, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) అవును, ప్రజలను మరీ సులభంగా మోసగించి, తప్పుదోవ పట్టించడానికి, దయ్యాలు (తిరుగుబాటు చేసిన దూతలు) జీవించి ఉన్న వారితో సంభాషిస్తూ, కొన్నిసార్లు సహాయకరంగా ఉన్నట్లు నటిస్తాయి.
మోసపూరితమైన ఈ కుట్రను గురించి అపొస్తలుడైన పౌలు అదనపు హెచ్చరికనిస్తున్నాడు: “కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురు.” (1 తిమోతి 4:1) కావున, మృతులనుండి వచ్చే సమాధానమని చెప్పబడేదేదైనా, మతపర అబద్ధాన్ని ప్రోత్సహించి, ప్రజలను దేవుని వాక్యసత్యంనుండి ప్రక్కకు తీసుకుపోయే మూఢనమ్మకాలకు వారిని బానిసలను చేస్తున్న, “నీతి పరిచారకుల” వేషము ధరించే దయ్యాలనుండే వస్తుంది.
మృతులు ఏమి చెప్పలేరు, చేయలేరు, లేక భావించలేరని దృఢపరుస్తూ, కీర్తన 146:3, 4 యిలా చెబుతుంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.” ఈ ‘వెడలిపోయే’ ఆత్మ ఏమిటి? అది శ్వాస ద్వారా బ్రతికి ఉండే ఒక వ్యక్తి యొక్క జీవనశక్తి. అందుకే, మరణించిన వ్యక్తి ఊపిరి తీసుకోవడం మానేసినప్పుడు, అతని యింద్రియాలు యిక ఎంతమాత్రం పని చేయలేదు. అతను పూర్తి అపస్మారకస్థితిలోకి ప్రవేశిస్తాడు. కావున జీవించడాన్ని నియంత్రించడం అతనికి అసాధ్యము.
అందుకే బైబిలు మానవుని మరణాన్ని, జంతువు మరణంతో పోల్చి, మరణించినప్పుడు యిరువురు అపస్మారక స్థితికి వస్తారని, వారు చేయబడిన ఆ మంటికే తిరిగి చేరతారని చెబుతుంది. ప్రసంగి 3:19, 20 యిలా చెబుతుంది: “నరులకు సంభవించునది యేదో అదే, మృగములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరులకేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.”
ప్రజలు మృతులకు సందేశాలు పంపగలమని, వారిచేత ప్రభావితం చేయబడగలమని భావించేలా దయ్యాలు వారిని మోసగించడానికి ప్రయత్నిస్తాయని ఎరిగినవాడై తన ప్రజలైన ప్రాచీన ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు యిలా హెచ్చరించాడు: “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచినడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.”—ద్వితీయోపదేశకాండము 18:10-12.
స్పష్టంగా, మృతులు మనకు హాని చేయగలరనే తలంపు దేవునినుండి వచ్చిందికాదు. ఆయన సత్యదేవుడు. (కీర్తనలు 31:5; యోహాను 17:17) తనను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించేవారి కొరకు, సత్యాన్ని ప్రేమించేవారి కొరకు అద్భుతమైన భవిష్యత్తును ఆయన కలిగి ఉన్నాడు.—యోహాను 4:23, 24.
యెహోవా సత్యదేవుడు, ప్రేమగల వాడు
“అబద్ధమాడనేరని,” మన ప్రేమగల పరలోకపు తండ్రి యిలా వాగ్దానం చేశాడు: చనిపోయి సమాధుల్లో పెట్టబడిన లక్షలాదిమంది, నీతి యుక్తమైన నూతన లోకంలో నిత్య జీవాన్ని పొందే ఉత్తరాపేక్ష కొరకు పునరుత్థానం చేయబడతారు! (తీతు 1:1, 2; యోహాను 5:28) తన మానవ సృష్టియొక్క యోగక్షేమమందు అత్యంతాసక్తి, మరణము, దుఃఖము, వేదనను తీసివేయాలన్న మనఃపూర్వక కోరిక యెహోవాకు ఉన్నాయని, పునరుత్థానాన్ని గూర్చిన ఈ ప్రేమపూర్వక వాగ్దానం తెలియజేస్తుంది. కావున, మృతులకు భయపడవలసిన అవసరంగాని లేక వారినీ, వారి ఉత్తరాపేక్షలను గురించి అతిగా చింతించవలసిన అవసరంగానిలేదు. (యెషయా 25:8, 9; ప్రకటన 21:3, 4) మన న్యాయవంతుడు, ప్రేమగల దేవుడు అయిన యెహోవా, మరణం యొక్క బాధను తీసివేస్తూ, వారిని పునరుత్థానం చేయగలడు, చేస్తాడు.
దేవుని వాక్యమైన బైబిలు, వాగ్దానం చేయబడిన నీతియుక్తమైన ఆ నూతన లోకంలో భూమిపై పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిపే వివరణలతో నిండి ఉంది. (కీర్తన 37:29; 2 పేతురు 3:13) అది తోటి ప్రజలందరికీ సమాధానం, సంతోషం, మరియు ప్రేమ కలిగి ఉండే సమయమై ఉంటుంది. (కీర్తన 72:7; యెషయా 9:7; 11:6-9; మీకా 4:3, 4) అందరు భద్రతతో కూడిన శ్రేష్ఠమైన యిండ్లను అలాగే ఆనందదాయకమైన పనిని కలిగి ఉంటారు. (యెషయా 65:21-23) అందరూ తినడానికి మంచి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. (కీర్తన 67:6; 72:16) అందరూ మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. (యెషయా 33:24; 35:5, 6) అపొస్తలులు మరియు వారితోపాటు పరిమితమైన సంఖ్య, యేసుతో పరలోకంలో పరిపాలించినప్పటికీ, మరణించిన తర్వాత యితరుల ఆత్మలకు (సోల్స్) పరలోకంలో ఆశీర్వదింపబడిన పరిస్థితులు ఉంటాయని బైబిలు చెప్పడంలేదు. (ప్రకటన 5:9, 10; 20:6) మరణించిన కోట్లకొలదిమంది, మరణం తర్వాత జీవించి ఉంటారంటే యిది విచిత్రంగా ఉంటుంది.
కాని బైబిలు యొక్క స్పష్టమైన బోధను మనం తెలుసుకున్నప్పుడు అది విచిత్రంగా ఉండదు: మృతులు సజీవుల్లా యిక ఎంతమాత్రమూ జీవించరు. వారు మీకు హాని చేయలేరు. జ్ఞాపకార్థ సమాధుల్లో ఉన్నవారు దేవుని నియమిత సమయంలో పునరుత్థానం చేయబడేంత వరకు అపస్మారక స్థితిలో, కేవలం విశ్రాంతి తీసుకుంటారు. (ప్రసంగి 9:10; యోహాను 11:11-14, 38-44) కావున, మన నిరీక్షణలు మరియు ఆశలు దేవునిపై ఆధారపడి ఉంటాయి. “ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.”—యెషయా 25:9.
[7వ పేజీలోని చిత్రం]
దేవుని వాక్యం స్పష్టంగా చూపుతున్నట్లు, మృతులు పునరుత్థానం వరకు పూర్తిగా నిష్క్రియులై ఉంటారు