యెహోవాను ఎన్నుకొనుటకు మీరు మీ పిల్లవానికి సహాయం చేస్తున్నారా?
“బైబిలు చదవడం నిజంగా విసుగు కలిగించేదిగా, అలసట కలిగించేదిగా ఉంటుందని నేను భావించాను. రహస్యంగా, నేను పెద్దయ్యాక యెహోవాసాక్షిని కాకూడదని నా హృదయంలో నిశ్చయించుకున్నాను,” అని ఒక యౌవనుడు తెలియజేశాడు. క్రైస్తవ గృహాల్లోని ఎక్కువమంది పిల్లలు చివరికి యెహోవావైపు ఉండడానికే ఎన్నుకున్నప్పటికీ, అతని వంటి యౌవనులు యెహోవాను తమ దేవునిగా ఎన్నుకోవడంలో కష్టసమయాన్ని ఎదుర్కొంటారు.
తమ పిల్లలను ప్రభావవంతంగా ఎలా నడిపించాలి అనే విషయంలో తలిదండ్రులు కొన్నిసార్లు అనిశ్చయతను ఎదుర్కొంటారు. ఒకసారి యిలా చెప్పిన వ్యాకులతగల తండ్రిలా వారు ఎంతో ఆత్మపరిశీలన చేసుకుంటారు: “యథార్థంగా చెప్పాలంటే, నిద్రిస్తున్న నా పిల్లల మొహాలవైపు చూసినప్పుడు, వారి బుగ్గలపై యింకా నిరుత్సాహంతో కూడిన కన్నీళ్లు ఉండేవి, నేను మరీ అంత సౌమ్యంగా ఉండకుండా ఉండాల్సిందా అని తలంచిన సమయాలు కూడా ఉన్నాయి.” ఆయన యిద్దరు కుమారులు ఎదిగి, యెహోవాను సేవించడానికి ఎన్నుకున్నారు.
యెహోవాను వదిలిపెట్టి, సాతాను లోకం కొరకు క్రైస్తవ సంఘాలను విడిచిపెట్టిన యౌవనులు కూడా ఉన్నారు. యెహోవాను ఎన్నుకొనుటకు తమ పిల్లలకు సహాయం చేయడంలో తలిదండ్రులు ఎలా విజయవంతం కాగలరు? ఆ ప్రశ్నకు సమధానమివ్వడానికి, యెహోవాను హత్తుకుని ఉండాలని తమ తలిదండ్రులు ఎంతో కోరుకున్నప్పటికీ, కొంతమంది యౌవనులు ఎందుకు ఆయనను విడిచిపెడుతున్నారో మనం ముందు కనుగొందాము.
కొంతమంది యౌవనులు ఎందుకు యెహోవాను విడిచిపెడతారు
ఎంతో సామాన్యమైన కారణాల్లో ఒకటి ఏమిటంటే కొంతమంది యౌవనులు యెహోవాను లేక ఆయన మార్గాలను నిజంగా ఎన్నడూ తెలుసుకోరు. పసితనం నుండి క్రైస్తవ కూటాలకు హాజరౌతున్నప్పటికీ, వారు దాన్ని యాంత్రికంగా చేస్తారు, యెహోవా కొరకు నిజంగా వెదకరు. (యెషయా 55:6; అపొస్తలుల కార్యములు 17:27) వేదిక మీది ప్రసంగీకుడు ఏమి చెబుతున్నాడో పైన ప్రస్తావించిన యౌవనునికి అర్థమయ్యేది కాదు గనుక అతడు క్రైస్తవ కూటాలలో విసుగు చెందేవాడు.
కొందరిలో సత్య విత్తనాలు నాటబడతాయి, కాని వారు తమ హృదయాలను సాతాను ప్రపంచం యొక్క పూర్తిగా శ్రద్ధలేని, వస్తుసంబంధ జీవన విధానంచే ఆకర్షింపబడుటకు అనుమతిస్తారు. తమ స్నేహితుల వలె, స్నేహితులతో ఉండాలనే అత్యంత బలమైన కోరికను కొందరు అధిగమించలేరు.—1 దినవృత్తాంతములు 28:9; లూకా 8:12-14; 1 కొరింథీయులు 15:33.
అయితే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ గృహాల్లోని పిల్లలు యెహోవా వైపు నిలబడుటకు ఎన్నుకున్నారు. వారి తలిదండ్రులు తీసుకున్న అనుకూల చర్యల నుండి ఏమైనా నేర్చుకోవచ్చా?
త్వరగా మొదలుపెట్టండి
మీ పిల్లలు యెహోవాను ఎన్నుకొనుటకు సహాయం చేయడంలో ఒక కీలకం ఏదనగా, త్వరగా మొదలుపెట్టడం. అనేక సందర్భాల్లో, హృదయం లేతగా, స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడే పొందిన భావనలు, నేర్చుకొన్న పాఠాలు జీవితాంతం మిగిలివుంటాయి. (సామెతలు 22:6) యెహోవా యొక్క మంచితనాన్ని గూర్చి, ఆయన ప్రేమ మరియు మహోన్నతత్వాన్ని గూర్చి మీ పిల్లలకు చెప్పడం, యెహోవా యెడల వారి హృదయాల్లో ప్రేమను, తమ కొరకు యెహోవా చేసిన వాటియెడల మెప్పును పెంపొందింపజేయడం వంటివి త్వరగా మొదలు పెట్టండి. దీనిని చేయడానికి, అనేకమంది తలిదండ్రులు వాచ్‌టవర్ సంస్థ యొక్క సాహిత్యాలలో యెహోవా సృష్టిపైనున్న శీర్షికలను అనేకం విజయవంతంగా ఉపయోగించారు.
యెహోవా మరియు ఆయన ఆరాధన యెడల విధేయత, గౌరవం వంటి యితర లక్షణాలు జీవితంలోని తొలిభాగంలోనే పెంపొందింపజేయాలి. యింకా బడికి వెళ్లడం ప్రారంభించని పిల్లలు క్రైస్తవ కూటాలలో చిన్న చిన్న నోట్సు వ్రాసుకోడానికి, తమ స్వంత బైబిళ్లలో లేఖనాలను చూసుకోడానికి లేక నిద్రవస్తున్నప్పుడు చన్నీటితో తమ మొహాలను కడుగుకొనేందుకు తమ తలిదండ్రుల సహాయంతో బాత్రూమ్కు వెళ్లడం వంటివి చేయడానికి పోరాడుతుండడాన్ని చూడడం హృదయాన్ని ఉత్తేజపర్చేదిగా ఉంటుంది. ఇవి చిన్న విషయాలే, కాని యెహోవా యెడల చూపించవలసిన గౌరవాన్ని, విధేయతను ఆ చిన్న హృదయాలపై కలిగించడానికి అవి ఎంత ప్రాముఖ్యమైనవి!
గంభీరమైన వ్యక్తిగత బైబిలు ఉపదేశం కూడా త్వరగా ప్రారంభించాలి. ఒక జంట తమ పిల్లలు రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే వారితో గొప్ప ఉపాధ్యాయుడు చెప్పేది వినడం అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభించారు.a తర్వాత, పిల్లలు బడికి వెళ్లడం ప్రారంభించినప్పుడు, వారు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి తమ తల్లితో కలిసి నా బైబిలు కథల పుస్తకం మరియు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాలను పఠించేవారు.* దాని తర్వాత అల్పాహారానికి ముందు తండ్రి నిర్వహించే దినవచన చర్చ ఉండేది. ఇటీవల వారి కుమారులు 10, 11 సంవత్సరాల వయస్సులో తమ సమర్పణను నీటి బాప్తిస్మంతో సూచించడం ద్వారా యెహోవాను సేవించడానికి ఎన్నుకున్నప్పుడు ఆ తలిదండ్రుల ప్రయత్నాలు గొప్పగా ఆశీర్వదింపబడ్డాయి.
జపాను నందలి వాచ్‌టవర్ సంస్థ బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న ఒక మంచి యౌవనుడు, తాను చాలా చిన్నగా ఉన్నప్పుడు, తాను యెహోవాతో సంబంధాన్ని ఏర్పరచుకోడానికి తన తల్లి రాత్రిలో తన ప్రక్కన కూర్చుని ప్రార్థించడానికి తనకు ఎలా సహాయం చేసిందో గుర్తుచేసుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినప్పటికీ లేక ఏమి చేసినప్పటికీ యెహోవా తనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఎల్లప్పుడు సన్నిహితంగా ఉన్నాడని నేర్పబడిన ఆ పాఠాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు.
విజయవంతమైన తలిదండ్రులు తమ పిల్లలకు వారసత్వ అపరిపూర్ణత వల్ల వచ్చే చెడు గుణాలను గుర్తించడాన్ని తెలుసుకుంటారు, వీటిని సరిచేసుకోడానికి పిల్లలకు సహాయం చేయడానికి తలిదండ్రులు త్వరగా మొదలుపెడతారు. (సామెతలు 22:15) స్వార్థం, మూర్ఖత్వం, గర్వం, యితరులను అతిగా విమర్శించడం వంటి గుణాలతో త్వరగా వ్యవహరించాలి. లేనట్లైతే, అలాంటి విత్తనాలు ఆ తర్వాత దేవునికి, ఆయన మార్గాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా ఎదుగుతాయి. ఉదాహరణకు, మంచి దృక్పథంగల, కాని ఎక్కువ గారాబం చేసే తలిదండ్రులు తరచు తమ పిల్లలలో ఆత్మాభిమాన దృక్పథాలు ఎదుగుటకు అనుమతిస్తారు. ఈ పిల్లలు తమ తలిదండ్రులనుగాని లేక యెహోవానుగాని గౌరవించడం కష్టమన్నట్లు భావిస్తారు, వారు బైబిలు నందు చెప్పబడిన ‘కృతజ్ఞత లేనివాని’ వలె తయారౌతారు. (సామెతలు 29:21) మరోవైపు, యింటిపనులు చేయించబడిన పిల్లలు, యితరుల అవసరతల యెడల ఎక్కువ శ్రద్ధ చూపించేలా పెంచబడిన పిల్లలు తమ తలిదండ్రుల యెడల, అలాగే యెహోవా యెడల ఎక్కువ కృతజ్ఞత గలవారిగా ఉంటారు.
ఒక పిల్లవాడు కారణసహితంగా చేరుకోగల దైవపరిపాలనా గమ్యాలను త్వరగా అతని ముందుంచడం మరో ప్రాముఖ్యమైన విషయం. ఇది త్వరగా, తదేకంగా చేయకపోతే, యితరులు అతని మనస్సు, హృదయాలను వేరే గమ్యాలతో నింపివేయవచ్చు. బైబిలు మొత్తం చదవడం, వాచ్‌టవర్ సంస్థ సాహిత్యాలలో ఒకదాన్ని వ్యక్తిగతంగా పఠించడం, దైవపరిపాలనా పాఠశాలలో చేరడం, సువార్త ప్రచారకునిగా తయారు కావడం, బాప్తిస్మం తీసుకోవడం వంటివి ఈ గమ్యాలలో చేరివుండాలి.
తాను బడి నుండి వచ్చే సరికి అతని తల్లి వంటగది బల్లపై చిన్న చిన్న ప్రశ్నలు సిద్ధం చేసి ఉంచడం ద్వారా అతడు వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలను చదివే అలవాటు చేసిందని టాకెఫూమి గుర్తుచేసుకుంటున్నాడు. క్రైస్తవ పరిచారకుల అవసరత ఎక్కువగా ఉన్న స్థలాల్లో పయినీర్లతోb కొద్దిరోజులు కలిసి పనిచేయడం, పరిచర్యకు వారితో కలిసి వెళ్లడం, మంచి భోజనం వారు సిద్ధం చేసుకోవడాన్ని చూడడం, వారి ఆనందాన్ని, ఆసక్తిని గమనించడం వంటివి యెహోవాను అలాగే సేవించాలనే తన కోరికను గొప్పగా ప్రభావితం చేశాయని యూరీ గుర్తు చేసుకుంటున్నది. ఇతర యౌవన పురుషులు, స్త్రీలు యెహోవాను ఆనందంగా సేవించడాన్ని గమనించగలిగేలా బేతేలు అని పిలువబడే వాచ్‌టవర్ సంస్థ ప్రధాన కార్యాలయం మరియు బ్రాంచి కార్యాలయాలకు తమ తలిదండ్రులు తమను తరచూ తీసుకువెళ్లేవారని అనేకమంది యౌవనులు గుర్తుతెచ్చుకుంటున్నారు. పిల్లలుగా దర్శించిన అనేకులు నేడు ప్రపంచవ్యాప్తంగా బేతేలు గృహాల్లో సేవ చేస్తున్నారు.
మీ పిల్లలకు మీ సమయాన్ని యివ్వండి
మీరు మీ పిల్లలతో గడిపే సమయం యొక్క మోతాదు, గుణము అనేవి వారు యెహోవాను సేవించడానికి ఎన్నుకుంటారా లేదా అనేదానిపై సూటియైన ప్రభావాన్ని చూపిస్తుంది. వారితో చేసే బైబిలు పఠనానికి మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తారు, ఎంతగా సిద్ధపడతారు అనేది వారు త్వరగా గ్రహించగలరు. మీరు మునుపటి పఠనం ఎక్కడ ఆపారు అన్నది జ్ఞాపకం ఉంచుకోకపోతే లేక అనావశ్యకమైన కారణాలను బట్టి మీరు పఠనాన్ని రద్దు చేస్తే, పఠనం అంత ప్రాముఖ్యమైంది కాదన్న విషయాన్ని మీరు తెలియజేస్తున్నారు. అయితే, తలిదండ్రులు పఠనం కొరకు త్యాగాలు చేస్తున్నారని, దాని కొరకు బాగా సిద్ధపడుతున్నారని, ఏమి వచ్చినప్పటికీ క్రమంగా పఠనం చేస్తున్నారని చూసినప్పుడు పూర్తిగా వేరే సందేశం అందజేయ బడుతుంది. ఇది అవసరత కాకపోయినప్పటికీ, కొంతమంది తల్లులు కూటాలకు వెళ్తున్నప్పుడు లేక పొరుగువారితో బైబిలు పఠనం నిర్వహిస్తున్నప్పుడు తయారైనట్లే తమ పిల్లల పఠనం కొరకు కూడా తయారౌతారు. దాని ద్వారా వ్యక్తమయ్యే భావం ఏమిటంటే యెహోవా ఆరాధన ప్రాముఖ్యమైనది అని.
మీ పిల్లల బైబిలు పఠనం ఆనందించ దగినదిగా చేయడానికి, వారి హృదయాలను చేరడానికి ఎంతో సమయము, ప్రయత్నము అవసరమౌతాయి. ప్రాముఖ్యంగా చిన్న పిల్లలు తాము నేర్చుకుంటున్న విషయాలు తమ యెదుట ప్రదర్శించబడినప్పుడు ప్రభావితులౌతారు. ఉదాహరణకు, ఒక తండ్రి లాజరు పునరుత్థానాన్ని గూర్చిన బైబిలు వృత్తాంతాన్ని అభినయంచేసి చూపడం ద్వారా తన పిల్లలు దాన్ని దృశ్యీకరించుకోడానికి సహాయం చేశాడు. ఆయన గదిలోకి వెళ్లి పునరుత్థానం చేయబడినట్లు బయటికి వచ్చాడు.—యోహాను 11:17-44.
పిల్లలు పెద్దవారవుతుండగా, వారి భావనల ఉప్పెనతో, వారి సందేహాలతో, వారు ఎదుర్కొనే సమస్యలతో వ్యవహరించడానికి మరింత సమయం, నైపుణ్యం అవసరమౌతాయి. పిల్లలు యెహోవా యెడల నమ్మకాన్ని పెంపొందించుకోవాలంటే ఈ దశలో ప్రేమగల, శ్రద్ధగల తలిదండ్రులు వెచ్చించే సమయం అత్యంత ప్రాముఖ్యమైనది. తన పిల్లలు విభిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, ఆయన పరిశీలన చేసి, ఆ సమస్య పూర్తిగా తీరిపోయే వరకు వాచ్‌టవర్ సాహిత్యంలో దానికి సంబంధించిన విషయాన్ని వారితో ప్రతిదినం చర్చించేవాడినని నలుగురు పిల్లలను విజయవంతంగా పెంచిన ఒక తండ్రి గుర్తు చేసుకుంటున్నాడు.
ఇద్దరు పిల్లల తల్లియైన ఒక పనిరద్దీగల పయినీర్ తన కుమార్తె వెనుకబడిపోతున్నదని, దైవపరిపాలనా చర్యల్లో ఆనందాన్ని కోల్పోయిందని గమనించింది. కాబట్టి ప్రతి మధ్యాహ్నం కుమార్తె బడి నుండి యింటికి వచ్చే సమయానికి యింటివద్దనే ఉండి, టీ త్రాగే సమయంలో కుమార్తెతో మాట్లాడాలని తల్లి నిశ్చయించుకుంది. తల్లీ కూతుళ్ల సన్నిహిత సంభాషణ ద్వారా, కుమార్తె తనకు అవసరమైన సహాయాన్ని పొందింది. ఇప్పుడు, పాఠశాల విద్య ముగించిన తర్వాత, పయినీర్ సేవ చేయడంలో ఆమె తన తల్లితో కలిసింది.—సామెతలు 20:5.
మంచి సహవాసము, మాదిరి
తలిదండ్రులు తమ పిల్లలకు తమ సమయాన్ని యివ్వడమే కాక వారికి మంచి సహవాసమును ఏర్పాటు చేయాలి. సామెతలు 13:20 యిలా చెబుతున్నది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”
విజయవంతమైన తలిదండ్రులు అనేకులు ఆ సామెత యొక్క సత్యాన్ని గుర్తిస్తారు. నలుగురు పిల్లలుగల ఒక తండ్రి యిలా చెబుతున్నాడు: “నేను గతాన్ని తలంచినప్పుడు, మా పిల్లలు సత్యములోనున్న అనేకమంది స్నేహితులను కలిగియుండడం వారు యెహోవాను సేవించేలా పురికొల్పడానికి సహాయపడిందని నేను అనుకుంటాను. వేరే సంఘాల్లో, అలాగే మా స్వంత సంఘంలో స్నేహితులను చేసుకుని, ఆ స్నేహాలను కాపాడుకోమని నేను ప్రోత్సహించేవాడిని.” అనేక సంవత్సరాలు బేతేలు నందు సేవచేసిన ఒక క్రైస్తవ పెద్ద యిలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నేను చిన్నవయస్సులో ఉన్నప్పుడు, మేము చిన్న యింట్లో ఉండేవాళ్లము, కాని ప్రయాణ కాపరులకు ఎల్లప్పుడు ఆతిధ్యం యిచ్చేవాళ్లం. అంతేగాక, మా సంఘంలోని ప్రత్యేక పయినీర్లు క్రమంగా మాతో భోజనానికి వచ్చేవారు. వారు మా యింటి వద్ద స్నానాలు చేసేవారు, మాతో సహవసించేవారు. పూర్తికాల సేవ యెడల మెప్పు పెంపొందించుకోడానికి వారి అనుభవాలు వినడం, వారి ఆనందాన్ని చూడడం నాకు సహాయం చేశాయి.”
కష్టాలు ఎదుర్కొంటున్నవారికి మంచి సహవాసం సహాయం చేస్తుంది. కష్టసమయాన్ని ఎదుర్కొంటున్న కుమారుడుగల తల్లి యెహోవాసాక్షుల ప్రయాణ కాపరితో ఆ సమస్యను చర్చించింది. ఆమెతోపాటు అబ్బాయిని ప్రాంతీయ సేవకు తీసుకువెళ్లమని ఆయన సలహా యిచ్చాడు. “మీరు అలా చేస్తే, అతని ఆత్మీయత, మరితర విషయాలు మెరుగౌతాయి,” అని కాపరి చెప్పాడు. ఆమె యిలా తెలియజేస్తుంది: “మా సంఘంలో సాయంకాల సాక్ష్యపు పనికి ఏర్పాటు ఉంది, పాఠశాలకు వెళ్లే వయస్సు పిల్లలు, కొంతమంది పెద్ద వయస్సు గల క్రమ పయినీర్లు, కనీసం ఒక పెద్ద, దానిలో భాగం వహించేవారు. మొదట్లో మా కుమారున్ని క్రమంగా వెళ్లేలా చేయడానికి పోరాడవలసి వచ్చేది, మంచి సహవాసాన్ని బట్టి ప్రోత్సహింపబడి, ఆనందంగా యింటికి వచ్చేవాడు గనుక త్వరలోనే పరిస్థితి మారిపోయింది. అతడు ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, బాప్తిస్మం తీసుకుని ప్రతి నెల సహాయ పయినీర్‌గా సేవచేసేవాడు, అతడు ఉన్నత విద్య ముగించినప్పుడు క్రమ పయినీరు అయ్యాడు.” యెహోవా చిత్తం చేయడంతో జత చేయబడిన మంచి సహవాసం మంచి ఫలితాలను తెచ్చింది.
మీ పిల్లవానిపై మంచి ప్రభావాన్ని చూపే యౌవనులు స్థానికంగా లేకపోవచ్చు, కాని యెహోవాను సేవించడానికి ఎన్నుకున్న అనేకమంది యౌవనులు పదేపదే చెప్పినది వారి తలిదండ్రుల మాదిరికి సంబంధించింది. అనేకమంది యౌవనులు తమ తలిదండ్రులను ప్రశంసించారు, వారు తమ తలిదండ్రుల మాదిరిని అనుసరించాలని కోరుకున్నారు. యూరి తన తల్లి ఆతిధ్యమిచ్చే గుణాన్ని, యితరుల యెడల ఆమె శ్రద్ధ వహించడాన్ని, టెలిఫోనులో వారితో మాట్లాడడాన్ని, రోగులైనవారికి భోజనం సిద్ధం చేయడాన్ని గుర్తు చేసుకుంటున్నది. ఇప్పుడు అందరూ ఎదిగి యెహోవాను సేవిస్తున్న నలుగురు మగపిల్లలున్న కుటుంబం నుండి వచ్చిన టాట్సువో యిలా చెప్పాడు. “మా అమ్మ మాతో ఎప్పుడూ పఠించలేకపోయేది ఎందుకంటే, మానాన్న అవిశ్వాసి, బంధువుల నుండి ఆమె ఎంతో వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చేది. కాని సత్యం యెడల ఆమె చేపట్టిన స్థానాన్ని, యెహోవాను సేవించడంలో ఆమె పొందే ఆనందాన్ని చూడడం నన్ను బాగా ప్రభావితం చేశాయి. మా సమస్యలతో మాకు సహాయం చేయడానికి ఉదయకాలం వరకు మేలుకుని ఉండడానికి కూడా ఆమె యిష్టపడేది.” విశ్వాస సంబంధ క్రియలు జ్ఞానంతో కూడిన తలిదండ్రుల మాటలకు జత చేయబడినప్పుడు శక్తివంతమౌతాయి. యోచించారో తన తలిదండ్రుల గురించి యిలా చెప్పాడు: “సంఘంలోని యితరుల యెడల అననుకూల దృక్పథాన్ని వ్యక్తపర్చడం నాకు గుర్తులేదు; పిల్లలమైన మేము యితరుల తప్పులను గూర్చి మాట్లాడుకోవడం కూడా వారు అనుమతించేవారు కాదు.”—లూకా 6:40-42.
పిల్లలు యెహోవాను ఎన్నుకోవడాన్ని చూడ్డంలోని ఆనందం
మీ పిల్లలు యెహోవాను ఎన్నుకోవడానికి సహాయపడేందుకు ఖచ్చితమైన సిద్ధాంతాలేమి లేవు. వత్తిడితో కూడిన సమయాలు అనేకం ఉంటాయి. కాని మునుపు ప్రస్తావించిన కలత చెందిన తండ్రి యిలా చెప్పాడు: “యెహోవా దృశ్య సంస్థ యిచ్చే సలహాలన్నీ నమ్మకంగా పాటించడానికి తలిదండ్రులుగా మేము ఎల్లప్పుడూ ప్రయత్నించాము. సమస్యలను ఎదుర్కోవడంలో యిది గొప్ప సహాయం చేసింది.” వారి ప్రయత్నాలు విజయం సాధించాయి.
అవును, బైబిలు సూత్రాలను అనుసరించడానికి మీరు చేయగలిగిన శ్రేష్ఠమైనది చేయడం ద్వారా, యెహోవాను ప్రేమించడానికి మీ పిల్లలకు తగిన కారణాలను యిస్తూ, మీ నమ్మకమైన మాదిరితో, సహాయం చేయాలనే యథార్థమైన ప్రయత్నాలతో, మీ ప్రయత్నాలు కూడా చివరికి విజయవంతమవడాన్ని మీరు కనుగొంటారు. యెహోవాసాక్షులలో ఒకరు కాకూడదని నిశ్చయించుకున్న మునుపు ప్రస్తావించిన అబ్బాయి గుర్తున్నాడా? అతని కష్ట సంవత్సరాల్లో అతని తల్లి విజయవంతంగా సహాయం చేసిన తర్వాత, అతనిలా చెప్పాడు: “ఆమె ఎన్నడూ విడిచిపెట్టలేదని నేను ఆనందిస్తున్నాను!” మీ పిల్లల విషయంలో కూడా మీకు యిదే ఫలితం రాగలదు.—గలతీయులు 6:9.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ యింకార్పొరేటెడ్ ప్రచురించినవి.
b యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులు పయినీర్లని పిలువబడుతున్నారు. ఒక సహాయ పయినీర్ ప్రతినెల పరిచర్యలో 60 గంటలు క్రమ పయినీర్ 90 గంటలు, ప్రత్యేక పయినీర్ 140 గంటలు గడుపుతారు.
[30వ పేజీలోని చిత్రం]
మీరు పిల్లల పెంపకాన్ని ఆనందకరమైన జ్ఞాపకాలతో గుర్తుచేసుకోగలరా?