ఫలింపని నేల ఫలవంతమగుట
ఆర్‌థర్ మెలెన్ చెప్పినది
అది 1930లో ఒక నిర్మలమైన వసంతకాల దినం, బ్రిటిష్ కొలంబియా నందలి ప్రిన్స్ రూపెర్ట్ వద్ద ఒక ఓడరేవు దగ్గర నేను నిలబడి ఉన్నాను. సముద్రం వద్ద నిలువబడి వున్న ఓడవైపు చూస్తూ నేను యిలా అనుకున్నాను, ‘నీరు అంతా ఎక్కడికి పోయింది?’ కేవలం ఆరు గంటల్లో సముద్ర మట్టం దాదాపు 24 అడుగులకు పడిపోయే పసిఫిక్ పశ్చిమ తీర ఆటుపోటులతో యిది నా మొదటి అనుభవము. పచ్చిక బయళ్లలో పెరిగిన ఒక అబ్బాయి పసిఫిక్ మహాసముద్ర తీరానికి ఎలా వచ్చాడు?
నేను షార్‌మియన్ ఓడ సిబ్బందితో కలవడం ద్వారా యెహోవా సేవలో నా పూర్తికాల సేవాధిక్యతను విస్తృతపర్చుకోడానికి ఆహ్వానింపబడ్డాను. పశ్చిమ తీరం వెంబడి ఏకాంత ప్రాంతమైన వాన్‌కోవర్ నుండి అలాస్కా వరకు ప్రకటనా పనిని అభివృద్ధిచేసే బాధ్యత మాకు అప్పగించబడింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా బ్రిటిష్ కొలంబియా యొక్క అనేక మైళ్ల తీరప్రాంతం ఉంది, యిది యెహోవాను చురుకుగా స్తుతించేవారు లేక నిష్ఫలంగా ఉంది. కేవలం ప్రిన్స్ రూపెర్ట్ పట్టణంలో మాత్రం రాజ్య ప్రచారకుల చిన్న గుంపు ఉండేది.
పని మొదలు పెట్టాలని నేను ఉత్సుకత కలిగివున్నాను, గనుక రైలు దిగిన వెంటనే, షార్‌మియన్ ఓడ సిబ్బంది అయిన అర్నే మరియు క్రిస్టీనా బార్‌స్టాడ్‌లను కలవడం కొరకు ఓడరేవుకు వెళ్లాను. నావలో ఎవరూ లేరు, కాబట్టి నేను వెళ్లిపోయాను. తర్వాత ఆరోజే నేను మళ్లీ వచ్చినప్పుడు, నేను అమితాశ్చర్యపోయాను. సముద్రం నీరులేక ఎండిపోతున్నట్లు కనిపించింది!
అయితే ఈ ఆసక్తికరమైన పనిని చేపట్టడానికి ఏది నడిపించింది?
ఆత్మీయ వారసత్వము
ఆత్మీయ విషయాల యెడల నా మెప్పు కెనడా నందలి అల్‌బెర్టా ప్లెయిన్స్ వద్ద మా యింట్లో ప్రారంభమైంది. జాయన్స్ వాచ్‌టవర్ ట్రాక్ట్ సంస్థ యొక్క చార్లెస్ తేజ్ రస్సెల్ వ్రాసిన ఒక కరపత్రాన్ని మా నాన్న కనుగొన్నాడు, అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చి వేసింది. నాన్న అల్‌బెర్టా నందలి కాల్‌మార్‌లో ఎంతో సమయాన్ని తీసుకునే సేద్యపు పని చేస్తూ కూడా తన పొరుగువారికి ప్రకటించడం ప్రారంభించాడు. అది దాదాపు వంద సంవత్సరాల క్రితం, అంటే 1890వ దశాబ్ద తొలిభాగం.
చివరికి పదిమంది సహోదర సహోదరీలుగా తయారైన దైవభయంగల ఈ కుటుంబంలో నేను ఎనిమిదవవానిగా 1905 ఫిబ్రవరి 20న జన్మించాను. నాన్న, అలాగే ఈ స్వీడను సమాజంలోని యితరులు అంతర్జాతీయ బైబిలు విద్యార్థులతో సహవసించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి వారు, ఆ తర్వాత రాజ్య మందిరం అని పిలువబడిన ఒక సమావేశ స్థలాన్ని నిర్మించారు. అది కెనడా నందలి మొట్టమొదటి వాటిలో ఒకటి.
వాచ్‌టవర్ సంస్థచే పంపబడిన సందర్శించే ప్రసంగీకుల ప్రసంగాలు ఉండే క్రైస్తవ కూటాలకు హాజరు కాకుండా పొలం పని మమ్మల్ని ఎన్నడూ ఆటంకపర్చలేదు. ఈ ప్రసంగాలు ప్రకటన పనిలో పాల్గొనాలనే దృఢమైన కోరికను మాలో కలుగజేశాయి. ఫలితంగా, మా కుటుంబంలో దాదాపు అందరూ బైబిలు సత్య వెలుగులో స్థిరంగా నడిచారు.
ప్రకటన పనిలో భాగం వహించుట
తొలి 1920 దశాబ్దంలో, నాకు నా మొదటి సాక్ష్యపు పని అప్పగించబడింది. ఎడ్‌మాన్‌టన్ నగరంలో నేను బహిరంగ ప్రసంగ ఆహ్వానాలను యింటింటికి పంచిపెట్టాలి. నేను ఆ రోజు అక్కడ ఒంటరిగా నిలబడినప్పుడు, ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాను: యెహోవాయందు నమ్మకముంచుము. (సామెతలు 3:5, 6) యెహోవా సహాయంతో నేను ఆ మొదటి పనిని నిర్వహించగలిగినందుకు ఎంతగా సంతోషించాను!
ఆయన వాక్య సత్యంపై మరింత అవగాహన ఏర్పడుతుండగా, యెహోవా దృశ్య సంస్థ యెడల మరియు ఆయన నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని తరగతి నందు నా నమ్మకం పెరిగింది. క్రిస్టమస్, పుట్టినరోజు పండుగల వంటి క్రైస్తవమత సామ్రాజ్య ఆచారాలు తీసివేయబడ్డాయి. వ్యక్తిగత రక్షణ యిక ఎంత మాత్రం అతి ప్రాముఖ్యమైన విషయం కాదు; బదులుగా, రాజ్య ప్రకటన తగిన ప్రాముఖ్యమైన స్థానాన్ని తీసుకోవడం ప్రారంభించింది. ఇదంతా నా జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేసింది. నేను 1923 ఏప్రిల్ 23న నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్న వెంటనే, పూర్తికాల పరిచర్యను నా గమ్యంగా చేసుకున్నాను.
సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతవున్న పచ్చిక బయళ్ల నందలి శీతాకాలంలో, మేము ఒక గుర్రపు బగ్గీతో గ్రామీణ ప్రాంతాల్లో సాక్ష్యపు పని మొదలుపెట్టాము. హౌస్‌కార్ పని అని పిలువబడే పనిలో ఒక గుంపుతో నేను ఒకసారి రెండు వారాలు గడిపాను. కెనడా పచ్చిక బయలు ప్రదేశాల విశాలమైన చెట్లులేని స్థలాల్లో ఈ ప్రత్యేకమైన కార్లు చాలా అనుగుణ్యంగా ఉండేవి. ఆర్ధిక సమస్యలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ప్రయాణించ వలసిన దూరాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పసిఫిక్ పశ్చిమ తీరాన సేవ చేయడానికి 1930లో నేను ఆహ్వానింపబడిన ఆ గుర్తుంచుకోదగిన దినం వరకు నేను దాదాపు మూడు సంవత్సరాలు అల్బెర్టాలో విరామసహితంగా పయినీర్ పరిచర్యలో కొనసాగడానికి పోరాడాను. నాకు సముద్రం లేక ఓడల గురించి ఏమి తెలియదు గనుక ఆ ఆహ్వానం నన్ను కలవరపర్చింది.
నేను ప్రిన్స్ రూపెర్ట్‌కు చేరిన తర్వాత త్వరలోనే నేను నా క్రొత్త తోటి పనివారితో యింటివద్దనే ఉన్నట్లు భావించాను. సహోదరుడు బార్‌స్టాడ్ అనేక సంవత్సరాలు చేపల వ్యాపారంలో ఉన్నందున, అనుభవంగల నావికుడు. వాన్‌కోవర్ నుండి అలాస్కాకు బ్రిటిష్ కొలంబియా తీరమందలి నీటిలో ఓడ ప్రయాణం చేస్తూ, తర్వాతి ఆరు సంవత్సరాలు తీవ్రంగా పరిచర్య చేసాము. మరో పాఠం నేర్చుకున్నాను: యెహోవా నుండి వచ్చిన పనిని ఎల్లప్పుడు చేపట్టాలి, అంగీకరించడానికి ఎన్నడూ వెనుకాడవద్దు.
సముద్ర తీరాన విత్తనాలు నాటడం
ఆ 1930 శీతాకాలంలో మేము దర్శించిన మొదటి ఓడరేవు అలాస్కా నందలి కెట్‌చికాన్, అక్కడ మేము 60 పెట్టెల బైబిలు సాహిత్యాన్ని నింపుకున్నాము. అనేక వారాల వరకు, మేము కెట్‌చికాన్, వ్రాంగెల్, పీటర్స్‌బర్గ్, జునెయూ, స్కాగ్‌వే, హాన్జ్, సిట్కా, మరితర విడిగా ఉన్న కుగ్రామాలలోని గృహాలన్నీ దర్శించాము. తర్వాత మేము పూర్తి బ్రిటిష్ కొలంబియా తీరాన్ని వసంతకాలం ముగిసిసే ముందే ముగించాము. సుదూరంగావున్న యిళ్లస్థలాలను, చేపల పరిశ్రమలను, అమెరికన్ ఇండియన్ గ్రామాలను, చిన్న పట్టణాలను, అలాగే వలసవచ్చినవారి ఒంటరిగా ఉన్న స్థిరనివాసాలను, ఎరలువేసి వేటాడేవారిని దర్శించాము. ఎవరైనా మాట్లాడాలని ఆహ్వానించే ఒంటరి లైట్‌హౌస్ మనుష్యులను విడిచి రావడం కొన్నిసార్లు కష్టంగా ఉండేది.
చివరికి సంస్థ మాకు ఎక్కడికైనా తీసుకుని వెళ్లగల ఫోనోగ్రాఫ్‌లను, రికార్డు చేసిన బైబిలు ప్రసంగాలను అందజేసింది. వీటిని మేము మాతో పాటు అంటే పుస్తకాలు, బైబిళ్లు, పత్రికలతోపాటు తీసుకు వెళ్లేవాళ్లము. మేము తీరప్రాంత కొండలపై ప్రాకుతుండగా తరచూ మేము వాటిని మాతో మోసుకెళ్లేవాళ్లము. నీటిమట్టం తక్కువగావున్న సమయాల్లో, కదులుతున్న నిచ్చెనలపై ఎక్కుతూ ఎత్తుగావున్న ఓడరేవుల్లోకి వాటిని పైకి లాగేవాళ్లము. నేను నా యౌవనంలో వుండగా పచ్చికబయళ్లలో పనిచేసేటప్పుడు పొందిన శారీరక తర్ఫీదును బట్టి నేను సంతోషించాను.
రాజ్య సువార్తను వ్యాప్తి చేయడంలో మా ఓడపైనున్న ధ్వని విస్తర్ణ విధానం ఒక శక్తివంతమైన పరికరంగా పనిచేసింది. రికార్డు చేయబడిన ప్రసంగాల శబ్దతరంగాలు నీటిద్వారా ప్రతిబింబించబడి తరచూ మైళ్ల దూరం వరకు వినిపించేవి. వాన్‌కోవర్ ద్వీపం యొక్క ఒంటరి ఖాతము వద్ద ఆగివున్నప్పుడు, మేము ఈ బైబిలు ప్రసంగాలలో ఒకటి వినిపించాము. మరునాడు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఉత్సాహంతో మాకిలా చెప్పారు: “నిన్న మేము పరలోకం నుండే సూటిగా ప్రసంగం విన్నాము!”
మరో సందర్భంలో ఒక పెద్ద వయస్సుగల జంట తమ పొగగొట్టం నుండి సంగీతం రావడం విన్నామని, కాని వారు బయటికి వచ్చి విన్నప్పుడు ఏమి వినిపించలేదని చెప్పారు. మళ్లీ లోనకి వెళ్లినప్పుడు మళ్లీ వాళ్లు ఒక స్వరం విన్నారు. ఎందుకలా జరిగింది? వాళ్లు బయట వున్నప్పుడు మేము రికార్డును మారుస్తున్నాము. ప్రజల అవధానాన్ని పొందడానికి మేము మొదట సంగీతం వినిపించి, ఆ తర్వాత బైబిలు ప్రసంగాన్ని వినిపించేవాళ్లము.
మరో సందర్భంలో, ఒక ఇండియన్ గ్రామమున్న ద్వీపం వద్ద మేము ఆగివున్నప్పుడు, స్వరాలు ఎక్కడనుండి వస్తున్నాయో చూడడానికి యిద్దరు మగపిల్లలు పడవపై వచ్చారు. ద్వీపంలోవున్న కొందరు, చనిపోయిన తమ పూర్వీకులు జీవానికి వచ్చారేమో, వారి స్వరాలేమో అనుకున్నారు!
సుదూరంగావున్న చేపల పరిశ్రమ వద్ద పనిచేస్తునప్పుడు, ఒకరోజుకు వంద పుస్తకాలు అందజేయడం అసాధారణమేమి కాదు. అవరోధాలు తక్కువగా వుండేవి గనుక ఆత్మీయ విషయాల గురించి ఆలోచించడానికి వారికి సమయం ఉండేది. చివరికి ఈ ఒంటరిగావున్న అనేకులు సాక్య్షులయ్యారు. తర్వాత కొన్నిసార్లు వారిని దర్శించడానికి, “ఆదరణపొందవలెనని” మేము వెళ్లేవాళ్లము.—రోమీయులు 1:12.
జతతో సేవను కొనసాగించుట
నేను 1931లో క్రిస్టీనా బార్‌స్టాడ్ చెల్లెలైన అన్నాను వివాహం చేసుకున్నాను. తర్వాత మేము ఓడపై మా పయినీర్ సేవను కలిసి కొనసాగించి, సంవత్సరాలు గడుస్తుండగా అనేక ఫలవంతమైన అనుభవాలను అనుభవించాము. ఉన్నతమైన పర్వతాలు, వేరు చేయబడిన నీటిప్రవాహాలు, ఆశ్రయమిచ్చే నిశ్శబ్దమైన అఖాతాలు, దేవదారు, అనాస, పెద్ద పెద్ద సస్యశ్యామల వృక్షాలతోవున్న అరణ్యాలు, వంటివాటితో పాటు తిమింగిలాలు, సీలజాతికి చెందిన పెద్ద జంతువులు, సీల్స్, కొన్ని రకాల తిమింగిలాలు, జింకలు, ఎలుగుబంట్లు, పక్షిరాజులు మా సహచరులుగా ఉండేవి. దాడిచేయడానికి వచ్చే మృగాల నుండి తప్పించుకోడానికి వేగంగా ప్రవహిస్తున్న నీటికి ఎదురుగా ఈదలేక అలసిపోతున్న జింకలకు, వాటి పిల్లలకు, మేము అనేకసార్లు సహాయం చేశాము.
ఒక మధ్యాహ్నం మేము నీటిపై క్రిందుగా ఎగురుతున్న ఒక పెద్ద గద్దను చూశాము, దాని గోర్లు ఒక పెద్ద సాల్‌మన్ చేపను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఆ చేపను నీటిలో నుండి పూర్తిగా ఎత్తటానికి చాలా బరువుగా ఉంది, అందుకే గద్ద దాన్ని పట్టుకుని తీరం వైపుకు లాక్కుంటూ వస్తుంది. ఓడ సిబ్బందిలో ఒకరైన ఫ్రాంక్ ఫ్రాన్స్‌కే దాన్ని చూసి తీరం వెంబడి పరుగెత్తి, అలిసిపోయిన గద్ద చేపను విడిచిపెట్టడానికి సహాయం చేశాడు. ఆ సాయంత్రం మా పయినీరు సిబ్బంది రుచికరమైన సాల్‌మన్ చేప భోజనం చేశాము, అయిష్టంగానే అయినప్పటికీ, ఆ గద్ద పంచుకోవడం నేర్చుకుంది.
వాన్‌కోవర్ ద్వీపానికి ఉత్తర తీరాన ఒక చిన్న దీవిపై, తౌట్ అని పిలువబడే ఒక జంట బైబిలు సత్యాన్ని హత్తుకున్నారు. ఆయన నిరక్షరాస్యుడు, దృఢమైన భావాలు గలవాడు, తన 90వ పడి మధ్య భాగంలో ఉన్న ఆయన స్వతంత్ర భావాలు గల వ్యక్తి, ఆమె 80వ పడిలో ఉంది. అయితే, ఆయన సత్యం యెడల ఎంతగా ఆసక్తి కలిగివున్నాడంటే, ఆయన తనను తాను తగ్గించుకుని, తన భార్య తనకు చదువు నేర్పడానికి అంగీకరించాడు. త్వరలోనే ఆయన తనకు తాను బైబిలును, సంస్థ యొక్క సాహిత్యాలు చదవగలిగాడు. మూడు సంవత్సరాల కంటే ముందే, మా పడవను బాప్తిస్మమిచ్చే కొలనుగా ఉపయోగిస్తూ, వారిద్దరికి తమ గ్రామీణ ద్వీప గృహంలో బాప్తిస్మమిచ్చే ఆనందం నాకు లభించింది!
పోవెల్ రివర్ పట్టణంలో రాజ్య వర్తమానానికి ప్రతిస్పందించిన సాల్లిస్ కుటుంబాన్ని చూసే ఆనందం కూడా మాకు లభించింది. వార్ ఆర్ పీస్—విచ్ అనే కరపత్రాన్ని చదివి వాల్టర్ వెంటనే సత్యాన్ని గ్రహించాడు. త్వరలోనే వాల్టర్ కుటుంబం వాన్‌కోవర్‌లో పయినీర్ సేవచేయడంలో వాల్టర్‌తో కలిసింది, మేము శీతాకాలం కొరకు షార్‌మియన్‌ను అక్కడే కట్టేసేవాళ్లము. ఆయన ఎంతో ఆసక్తిగల వానిగా నిరూపించబడ్డాడు, సంవత్సరాలుగా వాన్‌కోవర్ ప్రాంతంలో మొత్తం సహోదరుల సహవాసానికి ప్రీతిపాత్రమైన వ్యక్తిగా తయారయ్యాడు. ఆయన తన భూ జీవితాన్ని 1976లో ముగించాడు, ఆయన తన వెనుక సాక్షుల పెద్ద కుటుంబాన్ని వదిలివెళ్లాడు.
వ్యతిరేకతను అధిగమించుట
ఇండియన్ గ్రామాల్లోని మత నాయకులు తమ ఆత్మీయ సామ్రాజ్యాన్ని మేము దోచుకునేవారమని భావిస్తూ, తరచూ మా పనిని నిరసించేవారు. సింప్‌సన్ తీరం వద్ద మేము యింటింటికి వెళ్లడాన్ని గ్రామ పెద్ద నిషేధించాలని స్థానిక మత నాయకులు కోరారు. మేము పెద్దను దర్శించి, ప్రజలు మరీ తమ గురించి తాము ఆలోచించుకోలేనంత అజ్ఞానంగా ఉన్నారని నిర్ణయించడం సరైనదని మీరు భావిస్తున్నారా అని ఆయనను అడిగాము. దేవుని వాక్యాన్ని విని ఏది నమ్మాలో తమకై తాము నిర్ణయించుకొనే అవకాశాన్ని ప్రజలకు యివ్వమని మేము ఆయనకు సలహా యిచ్చాము. ఫలితం: గ్రామంలో ప్రకటనా పనిచేయడానికి ఆయన మాకు అనుమతి యిచ్చాడు.
తన ప్రజలతో సాక్షులు కలవటానికి చేసే ప్రయత్నాలను ఆటంకపర్చాలని చూసిన కౌన్సిల్ సభ్యుల, మత గుంపుల ప్రయత్నాలను మరో గ్రామ పెద్ద దశాబ్దాలుగా భంగపర్చాడు. ఆయనిలా అన్నాడు: “నేను పెద్దగా ఉన్నంత వరకు, యెహోవాసాక్షులు యిక్కడికి రావచ్చు.” నిజమే, మేము అన్ని చోట్ల ఎల్లప్పుడూ ఆహ్వానింపబడలేదు, కాని వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రాంతాన్ని వదలి వెళ్లమని మేము ఎన్నడూ బలవంతపెట్టబడలేదు. మేము ఆగిన ప్రతిసారి అలా మా పరిచర్యను కొనసాగించగలిగాము.
సముద్రంలో కష్టాలను సహించుట
సంవత్సరాలుగా, మేము తుఫానులు, తరంగాలు, రేఖాపటములో లేని కొండలతో కష్టాలు ఎదుర్కొన్నాము, కొన్నిసార్లు యింజనుతో సమస్యలు ఎదుర్కొన్నాము. ఒకసారి మేము వాన్‌కోవర్‌కు ఉత్తరంగా దాదాపు వంద మైళ్ల దూరంలో ఉన్న లాస్క్వెట్టీ ద్వీపానికి దగ్గరగా కొట్టుకొని పోయాము. ఇసుక దిబ్బలలో అలల ఆటుపోట్లకు చిక్కుకుని మేము వాతావరణ దయపై ఆధారపడ్డాము. వాతావరణం మరీ చెడుగా మారిపోతే, ఓడ రాళ్లపై ముక్కలైపోయి ఉండేది. మేమందరం రాళ్లపైకెక్కి ఆ చెడు పరిస్థితుల్లో మేము చేయగలిగిన మంచి చేశాము. మేము భోజనం చేసి, ఏదోవొకటి చదువుకోవడంలో గడిపాము, మళ్లీ ఆటుపోట్లు రావడానికి ఎదురుచూశాము.
అనేక కష్టాలు, అసౌకర్యాలు ఉన్నప్పటికీ, ఆ జీవితం ఆరోగ్యవంతంగా, ఆనందదాయకమైనదిగా ఉండేది. అయితే, మా యిద్దరు కుమారుల జననం పెద్ద మార్పు తెచ్చింది. మేము ఓడలో నివసించడం కొనసాగించాము, కాని మేము ఉత్తరాన ఓనా నది వరకు ప్రయాణించినప్పుడెల్లా, అన్నా, మగపిల్లలిద్దరూ ఆమె తలిదండ్రులతోపాటు ఉండేవారు, మిగిలినవాళ్లము అలాస్కాకు ఉత్తరంగా కొనసాగేవాళ్లము. తర్వాత మేము దక్షిణానికి వచ్చినప్పుడు, అన్నా, పిల్లలు మళ్లీ మాతో కలిసేవారు.
పిల్లలు ఫిర్యాదు చేయడంగాని లేక అనారోగ్యం కావడంగాని నాకు గుర్తులేదు. వాళ్లు ఎప్పుడూ లైఫ్‌బెల్టులు ధరించేవారు, కొన్నిసార్లు మేము వారి చుట్టూ తాడు కూడా కట్టేవాళ్లం. అవును, కొన్నిసార్లు ఉద్విగ్నమయిన సమయాలు కూడా ఉండేవి.
మరిన్ని సర్దుబాట్లు
మేము 1936లో షార్‌మియన్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది, నేను లౌకిక ఉద్యోగం సంపాదించుకున్నాను. తర్వాత మాకు మూడో కుమారుడు కలిగాడు. కొంతకాలానికి, నేను ఒక చేపలుపట్టే పడవను కొన్నాను, అది మాకు జీవనోపాధిగా ఉండేది, అలాగే తీరం వెంబడి ప్రకటన పనిలో కొనసాగడానికి కూడా సహాయపడేది.
ప్రిన్స్ రూపెర్ట్ వెంబడి, డిగ్‌బే ద్వీపంపై మేము యిల్లు కట్టుకున్నాము, కొంతకాలానికి ఒక చిన్న సంఘం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, కెనడాలో యెహోవాసాక్షుల ప్రకటన పని నిషేధింపబడినప్పుడు, మేము మధ్యరాత్రి తర్వాత ప్రిన్స్ రూపెర్ట్‌కు ఓడ తీసుకుని వెళ్లి, ప్రాంతంపై “తీక్షణమైన దాడి” చేశాము, అంటే ప్రతి గృహం వద్ద సాహిత్యాన్ని ఉంచేవాళ్లము. మేము అర్థరాత్రి చేసే ప్రయాణాలు నిషేధించబడిన సాహిత్యాన్ని వ్యాప్తిచేయడానికని ఎవరూ గుర్తించలేక పోయారు.
నేల ఫలవంతమైంది
మెల్లిగా ఎక్కువమంది ప్రజలు యెహోవాసాక్షులతో సహవసించడం మొదలుపెట్టారు, 1948లో ప్రిన్స్ రూపెర్ట్‌లో రాజ్యమందిరం యొక్క అవసరత ఏర్పడింది. తీరం వెంబడివున్న సైనిక భవనాన్ని కొన్న తర్వాత మేము దాన్ని విడదీసి, నీళ్లపై తరలించి, ట్రక్కులలో భవన నిర్మాణ స్థలానికి మార్చాము. యెహోవా మా కష్టాన్ని దీవించాడు, మేము మా స్వంత రాజ్యమందిరాన్ని ఏర్పరచుకున్నాము.
నేను 1956లో మళ్లీ పయినీర్ సేవలో ప్రవేశించాను, 1964లో అన్నా నాతో కలిసింది. మళ్లీ మేము పసిఫిక్ తీరం వెంబడి ఓడలో ప్రయాణిస్తూ పనిచేశాము. పర్వతాల వెంబడి తూర్పుకు క్వీన్ చార్లోట్ ద్వీపాల నుండి ఫ్రేజర్ సరస్సు వరకు, తర్వాత ప్రిన్స్ జార్జ్, మాకెన్‌జీ పట్టణాల వరకు సంఘాలను దర్శిస్తూ కొంతకాలం మేము ప్రాంతీయకాపరి పనిలో కూడా భాగం వహించాము. సంవత్సరాలుగా మేము వాయవ్య పసిఫిక్ అంతటా, వేలాది మైళ్లు కారులో, ఓడపై, విమానంలో ప్రయాణించాము.
ప్రిన్స్ రూపెర్ట్ నందు పరిచర్యలో మేము మంచి అనుభవాలను పొందాము. నేను, అన్నా యిద్దరమూ పఠించిన అనేకమంది తర్వాత వాచ్‌టవర్ గిలియడ్ పాఠశాలకు హాజరై, ఆతర్వాత మిషనరీలుగా విదేశాలలో సేవచేశారు. మన ఆత్మీయ పిల్లలు ప్రశస్తమైన రాజ్య వర్తమానాన్ని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లడాన్ని చూడటం ఎంత ఆనందదాయకం!
ఇప్పుడు 80 సంవత్సరాలు దాటిన మేమిద్దరం, క్షీణించిపోతున్న ఆరోగ్యంతో పోరాడుతున్నాము, అయినప్పటికీ మేము యెహోవాసేవలో ఆనందంగా ఉన్నాము. అలాస్కా, బ్రిటిష్ కొలంబియాలలో మేము చూసిన సహజ సౌందర్యాలు దాచుకున్న జ్ఞాపకాలను పురికొల్పుతాయి. అయినా ఒక్కప్పుడు ఆత్మీయంగా ఫలించకుండా ఉన్న ఈ విస్తారమైన ప్రాంతం యిప్పుడు యెహోవా స్తుతికర్తల అనేక సంఘాలతో విలసిల్లడాన్ని చూడ్డం గొప్ప ఆనందాన్ని కలుగజేస్తుంది.
ప్రాముఖ్యంగా మా స్వంత పిల్లలు, అలాగే మా ఆత్మీయ పిల్లలు ఎదిగి, యెహోవాను స్తుతించడాన్ని చూడ్డం మమ్మల్ని సంతోషపర్చింది. భూమి యొక్క ఈ భాగంలోని ఆత్మీయ ఎదుగుదలలో చిన్న భాగం కలిగివున్నందుకు మేము ఆనందిస్తున్నాము. ఉదాహరణకు అలాస్కా, దాదాపు 25 కంటే ఎక్కువ సంఘాల పనిని పర్యవేక్షించే స్వంత బ్రాంచి కార్యాలయాన్ని కలిగివుంది.
ఇక్కడ ప్రిన్స్ రూపెర్ట్‌నందు 1988లో, నగరం నడిబొడ్డున ఒక అందమైన క్రొత్త రాజ్య మందిరాన్ని సమర్పించే ఆధిక్యత మాకు లభించింది. అవును, యెషయా వలె, యిలా చెప్పడంలో మేము ఆనందిస్తాము: “యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి . . . దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.”—యెషయా 26:15.
[21వ పేజీలోని చిత్రం]
ప్రాంతీయ కాపరి సేవలో 1964-67 వరకు గడుపుట
[24వ పేజీలోని చిత్రం]
తీరం వెంబడి సాక్ష్యమివ్వడానికి ఉపయోగించినలాంటి పడవ