బైబిలు—అర్థం చేసుకోడానికి వ్రాయబడిన పుస్తకము
బైబిలు స్పష్టమైన దేవుని వాక్యమని, దాన్ని అక్షరార్థంగా అనుసరించాలని కొంతమంది ప్రజలు విశ్వసిస్తారు. మరితరులకు, “బైబిలు సందేశం ఎంతో అస్పష్టమైనది.” కెనడా యొక్క అత్యంత పెద్ద ప్రొటస్టంటు మతశాఖ యొక్క 12 మంది సభ్యుల విశ్వాస మరియు ఆధ్యాత్మిక కమిటి అలాగే తెలియజేసింది. యునైటెడ్ చర్చి యొక్క మతనాయకుడైన క్లిఫెర్డ్ ఎలియోట్ కొంతమందికి “బైబిలు గూఢమైనది, భావరహితమైనది, అసంబద్ధమైనది అవుతుంది” అని భావిస్తున్నాడు.
అలాంటి దృక్పథాలు సమాధానం పొందదగిన ఉపయుక్తమైన ప్రశ్నలను లేవదీస్తాయి. వీటిలో ప్రాముఖ్యమైనవి, బైబిలు ఎందుకు వ్రాయబడింది? అది ఎంతో కలవరపెట్టేది, అర్థం చేసుకోడానికి క్లిష్టమైనది అయ్యుందా? సగటు మనిషి దాన్ని అర్థం చేసుకోవచ్చునా? లేఖనాల భావాన్ని గ్రహించడానికి ఒకరికి ఏ సహాయం అవసరము? ఈ అల్లకల్లోల కాలాల్లో బైబిలును గూర్చిన కచ్చితమైన జ్ఞానం ఎందుకు ఆవశ్యకము?
బైబిలు ఎందుకు వ్రాయబడింది?
అత్యుత్తమమైన దేవుడైన యెహోవా అనుగ్రహము, అంగీకారము పొందాలనుకున్న వారికి దేవుని వాక్యాన్ని పఠించడం ఎల్లప్పుడు ఒక ఆవశ్యకతగా ఉంది. వ్రాయబడిన దేవుని వాక్యానికి గంభీరమైన, ప్రార్థనాపూర్వకమైన శ్రద్ధ నిచ్చుటకు జీవన అనుదిన వ్యవహారాల నుండి సమయం తీసుకోవాలని రాజులు, యాజకులు, తల్లిదండ్రులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వాళ్లు ధనవంతులైనా, బీదలైనా ఒకేలా ఉపదేశించబడ్డారు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7; 17:18-20; 31:9-12; నెహెమ్యా 8:8; కీర్తన 1:1, 2; 119:7-11, 72, 98-100, 104, 142; సామెతలు 3:13-18.
ఉదాహరణకు, యెహోషువకు యిలా చెప్పబడింది: ‘ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీవు వర్ధిల్లి, విజయవంతమగుదువు.’ (యెహోషువ 1:8, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) దేవుని ధర్మశాస్త్రాన్ని అలా జాగ్రత్తగా పఠించడం, అన్వయించడం విజయానికి, ఆనందానికి నడిపిస్తాయి. “మనుష్యులందరు” తన వాక్యమైన బైబిలును అర్థం చేసుకోవడమే కాదు, జీవమనే బహుమానం పొందగలిగేలా దానికి విధేయులై యుండాలని యెహోవా ఉద్దేశించాడు.—1 తిమోతి 2:3, 4; యోహాను 17:3.
అర్థం చేసుకోడానికి మరీ క్లిష్టమైనదా?
యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్లకముందు, ఒక గొప్ప బైబిలు విద్యా కార్యక్రమం భూవ్యాప్తంగా కొనసాగాలనే తన కోరికను ఆయన స్పష్టం చేశాడు. (అపొస్తలుల కార్యములు 1:8) బైబిలు అర్థం చేసుకోడానికి వ్రాయబడినదని ఆయనకు తెలుసు. యెహోవా తనకు పరలోకంలో, భూమి మీద సమస్త అధికారము అనుగ్రహించాడని వివరించిన తర్వాత, ఆయన సూటిగా యిలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా [లేక, నేర్చుకొనేవారిగా] చేయుడి; తండ్రి యొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.
బాప్తిస్మానికి ముందు క్రొత్త శిష్యులకు యెహోవాను గూర్చి, ఆయన కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మ యొక్క క్రియలను గూర్చి బోధించబడాలి. అంతేగాక, వారికి క్రైస్తవ ధర్మశాస్త్రాన్ని గూర్చి కూడా ఉపదేశించబడాలి. (1 కొరింథీయులు 9:21; గలతీయులు 6:2) ఈ ఫలితాన్ని పొందడానికి, అర్హతగలవారు మొదటిగా బైబిలు యెహోవా నుండి వచ్చినదని, రెండవదిగా అది అర్థం చేసుకోడానికి వ్రాయబడిందని నమ్మాలి.—మత్తయి 10:11-13.
బైబిలును అర్థం చేసుకోడానికి మీరేమి చేయవలసివుంది? లేఖనాలను వివరించడానికి దేవుని కుమారుడు ప్రత్యేకమైన ప్రయత్నం చేశాడు. పరిశుద్ధ లేఖనాలు సత్యమైనవని, వాటిలో వ్యక్తపర్చబడిన యెహోవా చిత్తం ఉందని ఆయనకు తెలుసు. (యోహాను 17:17) తనకు అప్పగించబడిన పనిని గురించి యేసు క్రీస్తు యిలా చెప్పాడు: “సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినును.” (యోహాను 18:37, TEV; లూకా 4:43) స్వీకరించే హృదయాలు, మనస్సులు గలవారికి బోధించడానికి యేసు వెనుదీయలేదు. లూకా 24:45 నందు మనకిలా చెప్పబడింది: “అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన [యేసు క్రీస్తు] వారి మనస్సులను” తెరిచాడు.
యేసు పరిచర్య సమయంలో, “మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలలో” నుండి ఎత్తిచూపిస్తూ, వివరిస్తూ ఆయన లిఖిత వాక్యం నుండి విరివిగా ఉల్లేఖించేవాడు. (లూకా 24:27, 44) ఆయన లేఖనాలను వివరించడం విన్నవారు ఆయనకున్న అర్థం చేసుకొనే స్పష్టతనుబట్టి, అలాగే బోధించే ఆయన సామర్థ్యాన్ని బట్టి ఎంతో కదిలించబడ్డారు. (మత్తయి 7:28, 29; మార్కు 1:22; లూకా 4:32; 24:32) ఆయనకు లేఖనాలు ఎంతో సుళువుగా అర్థమయ్యేవిగా ఉండెను.
బైబిలు మరియు యేసు అనుచరులు
యేసు క్రీస్తును అనుకరించేవాడగు అపొస్తలుడైన పౌలు, లేఖనాల్లో ఉన్నదాన్ని యితరులకు బోధించవలసిన అవసరతను గమనించాడు. అవి అర్థం చేసుకోడానికి వ్రాయబడినవని ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన బహిరంగంగా బోధించి, లేఖనాలను అర్థంచేసుకోవాలని కోరుకొనేవారి గృహాల్లో నిస్సందేహంగా వివరించాడు. “ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, యింటింటను మీకు తెలియజేయుచు బోధించుచు నుంటినో యిదంతయు మీకు తెలియును” అని చెప్పడం ద్వారా పౌలు తన స్థానాన్ని తెలియజేశాడు. (అపొస్తలుల కార్యములు 20:20, TEV) తన చర్చలలో తాను చెప్పే విషయాలను ప్రమాణాలతో రుజువుపరుస్తూ, వివరిస్తూ లేఖనాల నుండి తర్కించేవాడు. (అపొస్తలుల కార్యములు 17:2, 3) లేఖనాలను అర్థం చేసుకోడానికి యితరులకు సహాయం చేయడంలో ఆయన ఆసక్తి కలిగివుండేవాడు.
యేసు ఆయన శిష్యులు బోధించిన విషయాలను అర్థంచేసుకోవాలనే కోరిక మీకుందా? (1 పేతురు 2:2) ప్రాచీన బెరయ నివాసులకు అలాంటి కోరిక ఉండేది, క్రీస్తు గురించి అపొస్తలుడైన పౌలు వారికి బోధించినది విశ్వసించడానికి వారు ఆతురత కలిగివుండిరి. కాబట్టి వారు తాము విన్న సువార్త నిజంగా సత్యమని నిశ్చయత కలిగివుండేలా రోజు లేఖనాలను పఠించమని ప్రోత్సహించబడ్డారు. వారి హృదయాలు స్వీకరించేవిగా ఉండెను గనుక, “వారిలో చాలమందియు విశ్వసించిరి.”—అపొస్తలుల కార్యములు 17:11, 12.
బైబిలును అర్థం చేసుకోడానికి ఒకరికి సరైన హృదయ పరిస్థితి, నేర్చుకోవాలనే యథార్థమైన కోరిక, ‘ఆత్మీయ అవసరతను గూర్చిన శ్రద్ధ’ ఉండాలి. (మత్తయి 5:3) “నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని” యేసును అడిగినప్పుడు, ఆయనిలా సమాధానమిచ్చాడు: “పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.” ఆయన ‘తన నోరు తెరచి ఉపమానరీతిగా బోధించును, మరుగుచేయబడిన సంగతులను తెలియ జెప్పును’ అని ప్రవచించబడింది. (మత్తయి 13:10, 11, 34) కేవలం అలా ఉత్సుకతతో వినేవారి నుండి యథార్థంగా తెలుసుకోవాలని ప్రశ్నించే వారిని వేరుచేయడానికి యేసు వారితో ఉపమానాల ద్వారా మాట్లాడేవాడు. యేసు శిష్యులు ఆయనతో ఒక గృహంలోకి వెళ్లి, యిలా అడిగినప్పుడు వారు తమ యథార్థతను చూపించారు: “పొలములోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుము.”—మత్తయి 13:36.
మనం బైబిలును అర్థం చేసుకోవాలంటే మనకు సహాయమవసరమన్నది స్పష్టమే. యునైటెడ్ చర్చి యొక్క ధర్మశాస్త్రము, విశ్వాసము, లోకవ్యాప్త క్రైస్తవ ఐక్యత యొక్క సెక్రెటరీ మరియు మతనాయకుడు అయిన హాల్ లెవ్లిన్ యిలా అన్నాడు: “బైబిలు మనకు ఏ భావాన్ని కల్గివున్నది, దాన్నెలా చదవాలి, ఎలా భావం చెప్పాలి అన్నవి స్పష్టపరచడం ఎంతో ప్రాముఖ్యము.” కాని దాన్ని అందరూ గ్రహించకపోయినప్పటికీ, వాస్తవమేమిటంటే మనం బైబిలును మన స్వంతగా అర్థంచేసుకోలేము. మనకు సహాయం అవసరము.
ఏ సహాయం అందుబాటులో ఉంది?
బైబిలులో కొన్ని బయల్పర్చబడవలసిన చిక్కులబెట్టే మాటలు, కలవరపర్చే ప్రశ్నలు, గంభీరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. అవి వ్రాయబడిన సమయంలో అర్థం చేసుకోడానికి కాకుండా, అర్థవంతమైన సమాంతరాలను ఉపయోగించి బుద్ధిపూర్వకంగానే అస్పష్టపర్చి ఉండవచ్చు. కాని వాటిలో యెహోవా సంకల్పాలు చేరివున్నాయి. ఉదాహరణకు, ప్రకటన 13:18 యిలా చెబుతుంది “మృగము యొక్క సంఖ్య” “ఆరువందల అరువది యారు.” ఆ వచనం “ఇందులో జ్ఞానము కలదు,” అని చెప్పినప్పటికీ అది ఆ సంఖ్య యొక్క విశిష్టతను వివరించడం లేదు. అయితే యెహోవా తన సంస్థ ద్వారా నేడు తన యథార్థ సేవకులు దాని భావాన్ని అర్థం చేసుకోడానికి అనుమతించాడు. (బాక్సు చూడండి, “బైబిలును అర్థం చేసుకోడానికి మార్గము.”) “సత్యవాక్యమును సరిగా ఉపదేశించ”డంలో అనుభవముగల వారి సహాయంతో మీరు కూడా ఈ గ్రహింపును పొందవచ్చును.—2 తిమోతి 2:2, 15, 23-25; 4:2-5; సామెతలు 2:1-5.
రాజ్య వర్తమానం యెడల మెప్పును లేక మెప్పు లేకపోవడాన్ని చూపించడానికి యేసు కొన్నిసార్లు ఉపమానాలను ఉపయోగించాడు. స్నేహితులు లేక బంధువుల నుండి వచ్చే వ్యతిరేకత వల్ల నిరుత్సాహపర్చబడి కొంతమంది అభివృద్ధి చెందరని ఆయన సూచించాడు. ఇతరులు “శ్రమ లేక హింస” రాజ్య వర్తమానం యెడల తమ మెప్పును నాశనం చేయడానికి అనుమతిస్తారు. మరితరులు ప్రతిదిన జీవిత వత్తిడులు, “ఐహికవిచారమును ధనమోసమును” సువార్త కొరకు తమకున్న ప్రేమనంతటిని తీసివేయడానికి అనుమతిస్తారు. మరోవైపు, సంతోషంగా ప్రతిస్పందించి, శ్రేష్ఠమైన వాక్యాన్ని విని దాని భావాన్ని గ్రహించుకోడానికి యిష్టపడే వారు కూడా ఉన్నారు. వారు క్రైస్తవమత సామ్రాజ్యంలో యేసుక్రీస్తు పేరు మీద అన్నట్లుగా, “జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచు”న్నారు. అలాంటి వారు యెహోవా మార్గంలో ఉపదేశించబడాలని, దాని ద్వారా బైబిలులో తాము చదువుతున్న దాన్ని అర్థం చేసుకోవాలని ఆతురతతో ఉన్నారు.—మత్తయి 13:3-9, 18-23; యెహెజ్కేలు 9:4; యెషయా 2:2-4.
యెహోవా సంకల్పాలను గూర్చి వ్యక్తిగతమైన జ్ఞానాన్ని పొందాలనుకునే వారికి, కావలసిన సహాయం అందేలా యెహోవా చేయగలడు. ఉదాహరణకు, యెరూషలేము నుండి ప్రయాణిస్తున్న ఐతియొపీయుడైన ఒక వ్యక్తి బైబిలు పుస్తకమగు యెషయాను చదువుతుండగా అతనికి సహాయం చేయడానికి పంపబడిన సువార్తికుడైన ఫిలిప్పును యెహోవా ఆత్మ ప్రేరేపించిందని బైబిలు తెలియజేస్తుంది. ఆయన తన యింటికి తిరిగి వెళ్తూ, దాన్ని తన రథములో కూర్చుని చదువుతున్నాడు. యెహోవా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు విధేయత చూపిస్తూ, ఫిలిప్పు రథము వెంబడి పరుగెత్తి, యిలా అడిగాడు: ‘నీవు చదువునది గ్రహించుచున్నావా?’ ఆ వ్యక్తి దీనుడు, యథార్థవంతుడు గనుక తనకు సహాయం కావలసి ఉందని అంగీకరించాడు. ఆత్మీయాకలిగల, నేర్పించదగిన ఈ వ్యక్తికి ఫిలిప్పు ఆనందంగా ఉపదేశించాడు. లేఖనాలు అర్థం చేసుకోడానికి ఉపదేశం అతనికి సహాయపడింది. నిత్యజీవం పొందడానికి యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండడానికి యిప్పుడు తానేమి చేయాలో ఆయన నేర్చుకున్నాడు. దేవున్ని ప్రీతిపర్చే జీవితాన్ని వెంబడించిన వ్యక్తిగా ఆయన సంతోషంగల, యెహోవా సమర్పిత సేవకుడయ్యాడు.—అపొస్తలుల కార్యములు 8:26-39.
మీ యింట్లో బైబిలు ఉండివుండవచ్చు, దాన్ని మీరు అనేకసార్లు చదివి ఉండవచ్చు. యథార్థపరుడు, దీనుడు అయిన ఐతియొపీయుడు అనుభవించిన సమస్యనే మీరు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. ఆయన తాను చదివేదాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆయనకు సహాయం అవసరమైంది, యెహోవా దేవుడు అందజేసిన సహాయాన్ని అందుకోడానికి అతడు వెనుదీయలేదు. ఫిలిప్పు వలెనే యెహోవాసాక్షులు, ఆయన వాక్యమైన బైబిలునందు దేవుని గురించి వ్రాయబడిన విషయాలను అర్థంచేసుకోడానికి మీకు సహాయపడేందుకు సంతోషిస్తారు. యెహోవా బైబిలును అనుగ్రహించాడని, అది అర్థంచేసుకోడానికే యిచ్చాడని వారికి తెలుసు.—1 కొరింథీయులు 2:10; ఎఫెసీయులు 3:18; 2 పేతురు 3:16.
బైబిలు ఎందుకు ఆవశ్యకము?
మానవజాతి యొక్క అత్యవసర కాలంలో మనం జీవిస్తున్నాము. బైబిలు దాన్ని “యుగసమాప్తి” అని సూచిస్తుంది. (మత్తయి 24:3) బైబిలు ప్రవచనాల నెరవేర్పుగా 1914 నుండి సంభవిస్తున్న అనేక సంఘటనలు త్వరలోనే దేవుని పరలోక రాజ్యం ‘ఇతర ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేస్తుందని’ చూపిస్తున్నాయి.—దానియేలు 2:44.
మత్తయి 24, మార్కు 13, లూకా 21వ అధ్యాయాలలో ప్రవచింపబడినదాన్ని మీకు మీరే చదవండి. అక్కడ వివరించబడిన సంఘటనలు విశ్వమంతటికి సంబంధించినవని మీరు గ్రహిస్తారు. వాటిలో యితర యుద్ధాలన్నిటి నుండి వేరైన ప్రపంచ యుద్ధాలు చేరివున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం నాటినుండి ప్రవచింపబడిన ఆహార కొరత, భూకంపాలు, అసాధారణమైన అవినీతి మనం చూశాము. ప్రపంచ నాశనం అనివార్యమని సూచించే సరైన సూచనను అందజేసే ప్రకటన చేయడానికి యిప్పుడు దేశాలు సిద్ధమౌతున్నాయి. దీనికి సంబంధించి అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, . . . ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” (1 థెస్సలొనీకయులు 5:2, 3) తప్పించుకోలేనివారు ఎవరు? పౌలు యిలా వివరిస్తున్నాడు: ‘దేవుని నెరుగనివారు, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారు.’ (2 థెస్సలొనీకయులు 1:7-9) “రాజ్యసువార్త సకల జనములకు” ప్రకటించమని మత్తయి 24:14 నందు యివ్వబడిన ఆజ్ఞకు విధేయులయ్యే వారిచే సంయుక్త సూచన యొక్క కొంతభాగం నెరవేర్చబడనైయుంది.
లక్షలాదిమంది యెహోవాసాక్షులు 231 దేశాలలో, యితర సముద్ర ద్వీపాలలో ఈ ఆజ్ఞను పాటిస్తున్నారు. వారు ప్రజల గృహాల వద్దకు వెళ్లి, యెహోవా రాజ్య ప్రభుత్వమును గురించి తెలుసుకోమని వారిని ఆహ్వానిస్తారు. ఈ విధానాన్ని తప్పించుకొని జీవించేవారిలో చేరి ఉండడానికి, బాధ, దుఃఖం, వేదన లేక మరణం వంటివి లేని పరదైసు భూమిపై నివసించడానికి తీసుకోవలసిన చర్య గురించి వారు దయతో తెలియజేస్తారు.—ప్రకటన 21:3, 4.
ఈ దుష్ట ప్రపంచానికి సమయం చాలా త్వరగా గతించిపోతున్నది, ఈ ప్రపంచ నాశనాన్ని తప్పించుకోవాలని కోరుకునే వారందరు ‘సువార్తను అంగీకరించి,’ తద్వారా నాశనాన్ని తప్పించుకోవడంలో ఏమి యిమిడివుందో నేర్చుకోవడం తప్పనిసరి. మరోసారి యెహోవాసాక్షులు మీ యింటికి వచ్చినప్పుడు, వారపు బైబిలు పఠనం కొరకు వారు యిచ్చే ఆహ్వానాన్ని ఎందుకు అంగీకరించకూడదు? ఇంకా శ్రేష్టంగా, దాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలని యిష్టపడుతున్నారు గనుక మీతో కలిసి పఠించమని వారిని ఎందుకు అడగకూడదు?
[8వ పేజీలోని బాక్సు]
బైబిలును అర్థం చేసుకోడానికి మార్గము
యేసు తన మరణ పునరుత్థానముల తరువాత, తన సంభాషణా మార్గముగా పనిచేసే “నమ్మకమైనవాడు, బుద్ధిమంతుడునైన దాసుని” తాను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. (మత్తయి 24:45-47) అపొస్తలుడైన పౌలు ఎఫెసు నందలి క్రైస్తవులకు “దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, . . . సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని,” వ్రాసినప్పుడు ఈ మార్గాన్ని గుర్తించాడు. (ఎఫెసీయులు 3:10, 11) అది పెంతెకొస్తు సా. శ. 33 నాడు ఉద్భవించిన అభిషక్త క్రైస్తవుల సంఘము, దానికి “బయలు పరచబడినవి” అప్పగించబడ్డాయి. (ద్వితీయోపదేశకాండము 29:29) ఒక గుంపుగా అభిషక్త క్రైస్తవులు నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని వలె పనిచేస్తున్నారు. (లూకా 12:42-44) “బయలుపరచబడిన” వాటి గురించిన ఆత్మీయ గ్రహింపును అందజేయడం వారికి దేవుడు నియమించిన పని.
బైబిలు ప్రవచనము మెస్సీయను గూర్చి తెలియజేసినట్లుగానే, నేడు నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునిగా సేవచేస్తున్న అభిషక్త క్రైస్తవుల సన్నిహిత సంఘంవైపుకు కూడా అది మనల్ని నడిపిస్తుంది.a దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోడానికి అది మనకు సహాయం చేస్తుంది. బైబిలును అర్థం చేసుకోవాలని కోరుకునే వారందరు, “తనయొక్క నానావిధమైన జ్ఞానము” కేవలం యెహోవా సంభాషణా మార్గము ద్వారా అంటే నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా మాత్రమే తెలుసుకోగలమని గుణగ్రహించాలి.—యోహాను 6:68.
[అధస్సూచీలు]
a ది వాచ్‌టవర్, మార్చి 1, 1981, 24-30 పేజీలు చూడండి.