రాజ్య ప్రచారకుల నివేదిక
దేవుని వాక్యము బలముగలది
“దేవుని వాక్యము సజీవమై బలముగలది.” (హెబ్రీయులు 4:12) అబద్ధ మతంచే మోసగించబడిన ప్రజలు బైబిలు సత్యాలను తెలుసుకున్నప్పుడు అనేకసార్లు ఈ మాటలు నిజమని నిరూపించబడ్డాయి. డొమెనికన్ రిపబ్లిక్ నుండి వచ్చిన ఈ క్రింది అనుభవంలో చూపబడినట్లుగా, బైబిలు యొక్క బలము ప్రజల జీవితాలను మార్చి నిరీక్షణను యివ్వగలదు.
ఇటీవల యిద్దరు చిన్న పిల్లలను మరణమందు కోల్పోయిన ఒక ప్రముఖ కాథోలిక్ స్త్రీని యెహోవాసాక్షులు దర్శించారు. ఆమె ఎంతో వ్యధ చెంది తన వేదనను బట్టి ప్రతిరోజు విలపించేది. పునరుత్థాన నిరీక్షణను గూర్చి యోహాను 5:28, 29 నందు బైబిలు ఏమి చెబుతుందో సాక్షులు ఆమెకు చూపించారు. సాక్షులతో మరిన్ని చర్చల తర్వాత ఆమె పునరుత్థాన నిరీక్షణ యందు ఓదార్పు పొందడమేగాక, తన కాథోలిక్ మత నాయకులు తనను మోసగిస్తున్నారని గ్రహించింది.
ఆమె వెంటనే కాథోలిక్ చర్చి నుండి రాజీనామా చేసి, యెహోవాసాక్షులతో క్రమబైబిలు పఠనాన్ని అంగీకరించింది. అయితే, ఆమె భర్త ఆమె ఉద్దేశాలతో ఏకీభవించలేదు. ఆయన కూడా ఒక ప్రముఖ కాథోలిక్ గనుక తన భార్యను ఆమె చేస్తున్న పని నుండి నివారించి ఆమెను మళ్లీ కాథోలిక్ మతంలోకి తేవడానికి తన ప్రముఖ రాజకీయ, మతసంబంధమైన స్నేహితులు ఆమెను దర్శించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన విడాకులు యిస్తానని ఆమెను బెదిరించాడు, ఒక సందర్భంలో తన బంధువులకు, తోటి చర్చి సభ్యులకు తాము విడాకులు తీసుకోబోతున్నామని కూడా చెప్పాడు.
కాని ఆయన ప్రయత్నం ఫలించలేదు. దానికి భిన్నంగా, ఆమె తన బైబిలు పఠనాలను కొనసాగించడానికి దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె ఆత్మీయాభివృద్ధి మూలంగా, ఆమె మంచి క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకోవడం వల్ల, ఆమె భర్త విడాకులు తీసుకోవడానికి బదులు ఆమెతోనే ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన ఒక రోజు ఆమె చదువుతున్న బైబిలు సాహిత్యాన్ని పరిశీలించడానికి కూడా అంగీకరించాడు, కాని ఒక షరతు మీద అంగీకరించాడు. ఆయన తన కాథోలిక్ బైబిలును ఉపయోగిస్తానన్నాడు.
ఆయనకు ఆశ్చర్యం కలిగించే రీతిగా, యెహోవాసాక్షుల వద్దనున్న సాహిత్యం సహాయంతో తన స్వంత బైబిలు నుండే క్రొత్త విషయాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. తన భార్య సరైన మార్గాన్ని ఎన్నుకుందని ఆయన గ్రహించాడు, త్వరలోనే ఆమె మాదిరిని అనుసరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. వాస్తవానికి, ఆయన తన స్వంత జీవితంలో మార్పులు చేసుకోవలసిన అవసరత ఉందని గమనించాడు. ఒక కష్టతరమైన పని ఏమిటంటే, తనకున్న సిగరెట్లు త్రాగే అలవాటును మానుకోవడం. “డెత్ ఫర్ సేల్—టెన్ వేస్ టు స్టాప్ స్మోకింగ్” అనే శీర్షికగల అవేక్! పత్రిక జూలై 8, 1989 సంచికను చదివిన తర్వాత ఈ లేఖనాధారంలేని అలవాటును మానుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆయన అలవాటుగా తరచూ జేబులో వుంచుకునే సిగరెట్టు పాకెట్‌కు బదులు అవేక్! పత్రిక యొక్క ఆ సంచికను ఉంచుకోవడం ప్రారంభించాడు. ఆయనకు పొగత్రాగాలని అనిపించినప్పుడెల్లా పొగత్రాగటాన్ని గూర్చి ఉన్న శీర్షికలను చదివేవాడు. ఆ పద్ధతి పనిచేసింది! శీర్షికలను చాలాసార్లు చదివిన తర్వాత, ఆయన పొగత్రాగడం మానివేయ గలిగాడు.
నేడు భార్యాభర్తలిద్దరూ బాప్తిస్మం పొందిన సేవకులుగా యెహోవాను సేవిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు, ఆయన పూర్తికాల సేవకునిగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో ఎక్కువ సమయాన్ని గడుపుతాడు, యెహోవాసాక్షుల స్థానిక సంఘంలో ఆయన పరిచారకునిగా సేవచేస్తున్నాడు. తమ పిల్లలు పునరుత్థానం చేయబడతారని, వారిని నూతనలోకంలో జీవితానికి ఆహ్వానించాలని ఆయన, ఆయన భార్య ఎదురుచూస్తున్నారు. అవును, దేవుని వాక్యమైన బైబిలు సజీవమైనది, బలముగలది!