కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/15 పేజీలు 27-30
  • మీరు మన మహోపదేశకుని నుండి నేర్చుకుంటున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు మన మహోపదేశకుని నుండి నేర్చుకుంటున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా నుండి ఆచరణాత్మక వివేకము
  • యెహోవా ఉపమానాలను ఉపయోగించడం
  • ఆత్మను పరిశీలించే ప్రశ్నలు
  • నమ్మకాన్ని పెంపొందించడం
  • వస్తుమూలక పాఠము
  • ఓర్పుతో బోధించడం
  • యెహోవానుండి నేర్చుకుంటూనే ఉండండి
  • ఆయన కనికరం గురించిన పాఠం నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • కనికరం చూపించడానికి సంబంధించి ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా యోనాతో ఓపికగా ఉన్నాడు
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/15 పేజీలు 27-30

మీరు మన మహోపదేశకుని నుండి నేర్చుకుంటున్నారా?

“నేను, స్పెయిన్‌ నందలి శ్రేష్ఠమైన విశ్వవిద్యాలయాల్లో ఒక దానిలో న్యాయశాస్త్రాన్ని ఐదు సంవత్సరాలు చదివాను, అయితే బైబిలును పఠించడం ప్రారంభించినప్పటి నుండి నేను నేర్చుకున్నది దాని కంటే ఎంతో గొప్పది. ఎలా చదువుకోవాలో విశ్వవిద్యాలయం నాకు నేర్పింది; బైబిలు నేను ఎలా జీవించాలో నేర్పింది” అని క్యూల్యో వివరించాడు.

బైబిలు ద్వారా దేవుని ఆలోచనలను, ఆయన సూత్రాలను, ఆయన బోధలను మనం తెలుసుకోగలము. విశ్వంలోకెల్లా యెహోవాయే శ్రేష్ఠమైన బోధకుడు గనుక లేఖనాలు ఆయనను “మహోపదేశకుడు” అని వర్ణిస్తున్నాయి. (యెషయా 30:20 NW) అక్షరార్థంగా, హెబ్రీ వచనం ఆయనను “బోధకులు” అని పేర్కొంటోంది, ఈ బహువచనం ఘనతను సూచిస్తోంది. ఇది, ఏ బోధకుని వద్ద నేర్చుకోవడం కంటే కూడా యెహోవా దగ్గర నేర్చుకోవడం అతి శ్రేష్ఠమైనదని యిది మనకు గుర్తుచేయాలి.

యెహోవా నుండి ఆచరణాత్మక వివేకము

దైవిక బోధ ఎందుకంత ప్రయోజనకరం? మొదటిది, దాని అమూల్యమైన సమాచారం. యెహోవా బోధ “ఆచరణాత్మక వివేకాన్ని” యిస్తుంది. అంతేకాకుండా, అది దేవుడిచ్చే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే వారి “ప్రాణమును రక్షించును.”—సామెతలు 3:21, 22 NW; ప్రసంగి 7:12.

కీర్తన 119ని కూర్చిన వ్యక్తి యెహోవా జ్ఞానము జీవితాంతం తనను రక్షించిందని గుర్తించాడు. ఉదాహరణకు, ఆయన యిలా పాడాడు: “వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.”—కీర్తన 119:72, 92, 98, 99.

యెహోవా ధర్మశాస్త్రమే సంతోషమివ్వకపోతే, ‘శ్రమయందు నశించి’ ఉండేది కీర్తన గ్రంథకర్త ఒక్కడేకాడు. స్పెయిన్‌కు చెందిన రోసా అనే ఓ యౌవన స్త్రీ, దైవిక సూత్రాలను అమలుపర్చడం వల్లనే తన జీవితం రక్షించబడిందని నమ్ముతోంది. “ఇరవై ఆరు సంవత్సరాలకే, నేను రెండు సార్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను,” అని ఆమె గుర్తుచేసుకుంటోంది.

రోసా వ్యభిచారంలో అలాగే సురాపానం, మాదక ద్రవ్యాల దుర్వినియోగాల్లో పాల్గొంది. “ఒక రోజు, నేను ఎంతో కృంగిపోయినప్పుడు, మన సమస్యలను పరిష్కరించుకోడానికి బైబిలు ఎలా సహాయపడుతుందన్న విషయంపై సాక్షులైన దంపతులు నాతో మాట్లాడారు. నేను బైబిలును పఠించడం ప్రారంభించాను, అది ఎంతో అద్భుతంగా ఉందని నేను కనుగొన్నాను. కేవలం ఒక్క నెలలోనే, నేను పవిత్రమైన కొత్తదైన జీవితాన్ని ప్రారంభించేందుకు శక్తిని పొందాను. ఇప్పుడు నా జీవితానికి ఓ సంకల్పం ఉంది గనుక, సురాపానం లేక మాదక ద్రవ్యాల ఆధారం నాకిక ఏమాత్రం అవసరంలేదు. నేను యెహోవా స్నేహితురాలిగా ఉండాలని ఎంతగానో కోరుకున్నాను గనుక, ఆయన సూత్రాలకనుగుణంగా జీవించాలని నేను తీర్మానించుకున్నాను. దేవుని వాక్యపు ఆచరణాత్మక జ్ఞానమే లభించియుండకపోతే, ఈపాటికి నేను ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని” అని ఆమె చెప్పింది.

నిజంగా, యెహోవా నుండి వచ్చే జ్ఞానం జీవాన్ని రక్షిస్తుంది. కాబట్టి, అమూల్యమైన దైవిక బోధ యొక్క సమాచారం నుండే గాక యెహోవా తన సేవకులకు బోధించేందుకు ఉపయోగించే మూలం నుండి కూడా మనం ప్రయోజనం పొందగలము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనం బోధకులుగా శిష్యులను తయారు చేసేవారిగా ఉండాలని ఆజ్ఞాపించాడు గనుక, బోధను అందించే ఫలప్రదమైన పద్ధతులను మనం నేర్చుకోవాలని కోరుకుంటాము.—మత్తయి 28:19, 20

యెహోవా ఉపమానాలను ఉపయోగించడం

“ఉపమానము లేక [యేసు] వారికి బోధింపలేదు,” అని మార్కు సువార్త చెబుతోంది. (మార్కు 4:34) యేసు బోధలోని ఈ విశేష విషయం ఆశ్చర్యకరమైనది కాదు. ఆయన, కేవలం ప్రవచన సమాచారాలు ఇశ్రాయేలీయుల జనాంగానికి అందించబడిన యెహోవా పద్ధతుల్లో ఒకదాన్ని అనుసరించాడు. వీటిలో స్పష్టమైన అనేక ఉపమానాలున్నాయి.—యెషయా 5:1-7; యిర్మీయా 18:1-11; యెహెజ్కేలు 15:2-7; హొషేయా 11:1-4.

ఉదాహరణకు, విగ్రహాలు వ్యర్థమని మనకు నేర్పించడానికి యెహోవా ఎంత శక్తివంతమైన ఉపమానాన్ని ఉపయోగిస్తున్నాడో గమనించండి. యెషయా 44:14-17 యిలా పేర్కొంటోంది: “ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును . . . అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును, ఒకడు చెట్టు నాటగా . . . ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంత తీసికొని చలికాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా, . . . దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు—నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.” ఇలాంటి ఉపమానాలు, యథార్థ హృదయులైన వారు విగ్రహారాధన, అబద్ధ సిద్ధాంతాలను తృణీకరించడానికి సహాయపడేందుకు శక్తివంతమైన పనిముట్లుగా ఉంటాయి.

ఆత్మను పరిశీలించే ప్రశ్నలు

ఆలోచనను రేకెత్తించే ప్రశ్నల ద్వారా యెహోవా తన సేవకుల్లో కొందరి ఆలోచనను సరిదిద్దిన ఉదాహరణలు కూడా బైబిలులో ఉన్నాయి. పూర్వకాలపు యోబు వీరిలో ఒకడు. దేవునికి సంబంధించి అతని స్వంత అల్పత్వాన్ని పరిశీలించడానికి యెహోవా అతనికి ఓపికతో సహాయపడ్డాడు. కొన్ని ప్రశ్నల పరంపర ద్వారా అలా చేశాడు, వాటికి జవాబివ్వడానికి యోబు అసలు పనికిరాలేదు.

“నేను భూమికి పునాదులు వేసినపుడు నీవెక్కడ నుంటివి?” అని యెహోవా యోబును ప్రశ్నించాడు. “సముద్రము దాని గర్భమును పొర్లిరాగా తలుపులచేత దానిని మూసిన వాడెవడు? . . . కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? . . . దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా?” అతనిని తగ్గించే ఈ విచారణలో అతి ముఖ్యమైన ప్రశ్న యిమిడివుంది: “నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద [యెహోవా] అపరాధము మోపుదువా?”—యోబు 38:4, 8, 31; 40:8, 9.

పరిశీలించే ఈ ప్రశ్నలు, తాను అవివేకంగా మాట్లాడాడని యోబు గ్రహించేటట్లు చేసింది. కాబట్టి, అతను తన మాటను వెనుకకు తీసుకుని పశ్చాత్తాపపడ్డాడు. (యోబు 42:6) ఈ విషయంలోవలె, చక్కగా ఎన్నుకున్న ప్రశ్నలు, మన పిల్లలు లేక బైబిలు విద్యార్థుల తప్పుడు ఆలోచనను సరిదిద్దడానికి సహాయపడగలవు.

నమ్మకాన్ని పెంపొందించడం

తాను ఎందుకూ పనికిరానని లేక కొరగానివాడిననే భావన గలవారికి తోడ్పడాలంటే మనం ఏమి చేయవల్సిన అవసరముంది? ఈ విషయంలో యెహోవా, ఆయన ప్రవక్తైన మోషే మధ్య జరిగిన సంభాషణ ఉపయుక్తంగా ఉంటుంది. ఫరో ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుట తన పక్షంగా మాట్లాడేవానిగా దేవుడు మోషేను నియమించినప్పుడు, ఆ ప్రవక్త ఆ పనిని నిర్వహించలేనని భావించాడు. “నేను మాట నేర్పరినికాను,” అని ఆయన అన్నాడు. అయినప్పటికీ, దేవుడు యిలా జవాబిచ్చాడు: “మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? . . . యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను.”—నిర్గమకాండము 4:10-12.

మోషే అన్నయైన అహరోనును యెహోవా మోషేకు ప్రతినిధిగా నియమించాడు, కాగా వారు ఐగుప్తులో తమ పనిని సాధించడానికి కొనసాగారు. (నిర్గమకాండము 4:14-16) యెహోవా సాక్షుల్లో అనేకులు మొట్టమొదటి సారిగా యింటింటి పరిచర్యలో లేక వీధి సాక్ష్యంలో భాగం వహించేటప్పుడు మోషే భావించిన కొరగానితనాన్ని భావించారు. మోషే విషయంలోవలె, మనకు యెహోవా మద్దతు ఉందని, మనతోపాటు అనుభవజ్ఞుడైన పరిచారకుడు ఉంటాడని తెలుసుకోవడం మన మొహమాటాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది. బైబిలు పుస్తకమైన ద్వితీయోపదేశకాండము అంతటిలో కనిపించే శక్తివంతమైన ప్రసంగాలను అందించగల్గేంత విశ్వాసాన్ని మోషే పెంపొందించుకోగల్గాడు, యెహోవా సహాయంతో మనం కూడా మాట్లాడే సామర్థ్యాన్ని వృద్ధిచేసుకోవచ్చు.

వస్తుమూలక పాఠము

ఇతరులకు సహాయం చేయాలన్న యథార్థమైన కోరిక కూడా అనివార్యమే. ప్రవక్తైన యోనాకు లేని లక్షణమే అది. యెహోవా నీనెవెపైకి రాబోయే నాశనం గూర్చి ఆ పట్టణ ప్రజలకు హెచ్చరించమని యోనాను నియమించాడు. ఆశ్చర్యకరంగా, నీనెవె పట్టణస్థులు పశ్చాత్తాపపడ్డారు. (యోనా 3:5) తత్ఫలితంగా, యెహోవా ఆ నాశనాన్ని వాయిదావేశాడు. అయితే, తన ప్రకటనా పని సాధించిన విజయానికి సంతోషించే బదులు తన ప్రవచనం నెరవేరదని యోనాకు కోపం వచ్చింది. అతను సరైన దృష్టిని పొందేలా యెహోవా అతనికి ఎలా సహాయపడ్డాడు?

ఇతరులపై శ్రద్ధ కనపర్చే విషయం యొక్క ప్రాముఖ్యతను గూర్చి యోనాకు నేర్పేందుకు యెహోవా ఒక సొరచెట్టును ఉపయోగించాడు. అద్భుతంగా ఆ చెట్టు రాత్రికి రాత్రే పెరిగి, నీనెవె పట్టణ శివార్లలో పందిలి వేసుకున్న యోనాకు మొదట నీడనిచ్చింది. యోనా ఈ చిన్న మొక్కను చూసి “బహు సంతోషించెను.” అయితే, ఒక పురుగు ఆ మొక్కను తిని తద్వారా అది ఎండిపోయేలా యెహోవా చేశాడు. ఎండ, వేడిగాలి తగిలిన యోనాకు కోపంవచ్చి యిలా అన్నాడు: “బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలు.” (యోనా 4:5-8) దీనంతటి పాఠం ఏమిటి?

యెహోవా యోనాతో మాట్లాడి యిలా అన్నాడు: “నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?”—యోనా 4:9-11.

ఎంత శక్తివంతమైన వస్తుమూలక పాఠం! వేలకొలది ప్రజలకంటే యోనా సొరచెట్టుపై ఎక్కువ ఆసక్తిని కల్గివున్నాడు. దేవుని సృష్టిలోని ఏ విషయం యెడలైనా శ్రద్ధకల్గివుండడం ప్రశంసనీయమైనప్పటికీ, ప్రజల జీవితాలను కాపాడడానికి సహాయపడడం మన అతి ప్రాముఖ్యమైన పని.

ఓర్పుతో బోధించడం

యోనా కనుగొన్నట్లుగా, మన పరిచర్యను నెరవేర్చడం అన్ని వేళలా సులభం కాదు. (2 తిమోతి 4:5) అయినప్పటికీ, యితరుల యెడల ఓర్పుతోకూడిన ప్రవర్తన అందుకు తోడ్పడగలదు.

మీ బైబిలు విద్యార్థుల్లో ఒకరు నెమ్మదైనా లేక కొద్దిగా సహేతుకం కాకపోయినా మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? మన మహోపదేశకుడు అలాంటి సమస్యతో ఎలా వ్యవహరించాలో నేర్పుతున్నాడు. సొదొమ గొమొర్రాలపై రాబోయే తీర్పు విషయంలో అబ్రాహాము ఆయనను అదే పనిగా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన అసాధారణమైన ఓర్పును కనపర్చాడు. “దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా?” అని అబ్రాహాము అడిగాడు. “ఆ పట్టణములో ఒక వేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనముచేయక కాయవా?” అని అర్థించాడు అబ్రాహాము. యెహోవా అభయమిచ్చే జవాబు, ఆ సంఖ్య పదికి దిగేంతవరకు అబ్రాహాము వేడుకుంటూ ఉండడానికి పురికొల్పింది. లోతు కుటుంబం ఒక్కటే రక్షించబడడానికి అర్హతగలదని యెహోవాకు తెలుసు, మరి దానికి కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అబ్రాహాము, యెహోవా కనికరం ఎంత విస్తారమైందో గ్రహించేంతవరకూ దేవుడు ఓపికతో ఆయనను ప్రశ్నించనిచ్చాడు.—ఆదికాండము 18:20-32.

అబ్రాహాము మితమైన జ్ఞానాన్ని ఆయన శ్రద్ధాపూర్వక భావాలనూ యెహోవా పరిగణలోకి తీసుకున్నాడు. మన విద్యార్థి హద్దులను మనం అర్థంచేసుకోగలిగితే, అతను ఒక సిద్ధాంతాన్ని అర్థంచేసుకోడానికీ లేక లోతుగా పాతుకుపోయిన ఒక అలవాటును అధిగమించడానికి ప్రయత్నిస్తుండగా మనం ఓర్పును కనపర్చడానికి అది సహాయపడుతుంది.

యెహోవానుండి నేర్చుకుంటూనే ఉండండి

యెహోవా దేవుడు నిస్సందేహంగా మహోపదేశకుడు. ఉపమానాలూ ప్రశ్నలూ వస్తుమూలక పాఠాల వంటి వాటిద్వారా ఆయన ఓపికతో జ్ఞానాన్ని నాటుతాడు. ఆయన బోధనా పద్ధతులను మనం అనుకరించేంత వరకు మనం కూడా శ్రేష్ఠమైన బోధకులమౌతాము.

ఇతరులకు బోధించేవారు తమ్మును తాము బోధించుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కనుక, మనం “యెహోవా చేత ఉపదేశము” పొందుతూనే ఉండాలి. (యెషయా 54:13) యెషయా యిలా రాశాడు: “ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:20, 21) యెహోవా మార్గాల్లో మనం నడుస్తూ యితరులు కూడా అలాగే చేసేందుకు సహాయపడడం వల్ల, మన మహోపదేశకుని నుండి మనం నిత్యం నేర్చుకునే ఆధిక్యతను కల్గివుండగలము.

[28వ పేజీలోని చిత్రం]

యెహోవా యోబును యిలా ప్రశ్నించాడు: “పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?”

[28వ పేజీలోని చిత్రం]

యెహోవా సొరచెట్టు మూలంగా, ప్రజలపై ఎక్కువ శ్రద్ధను కల్గివుండాలని యోనాకు బోధించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి