ఎందుకు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి?
యూదా వేదాంతి, రచయిత అయిన జోసఫ్ జేకబ్, ఒకప్పుడు క్షమాగుణాన్ని, “అన్ని నైతిక పాఠాల్లోకెల్లా ఉన్నతమైనది, పాటించడానికి చాలా కష్టతరమైనది” అని వర్ణించాడు. వాస్తవానికి, అనేకమందికి “నేను నిన్ను క్షమించాను” అనే మాటలు చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది.
క్షమాపణ చాలామట్టుకు డబ్బు వంటిదానిగా ఉందనిపిస్తుంది. దాన్ని యితరుల కొరకు ఉచితంగా, దయాపూర్వకంగా ఖర్చుపెట్టవచ్చు లేక లోభత్వంతో తమ కొరకే కూడబెట్టుకోవచ్చు. మొదటిది దైవిక పద్ధతి. క్షమాపణ విషయానికొచ్చినప్పుడు మనం ఉదారంగా ఖర్చుపెట్టే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకు? ఎందుకంటే దేవుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడు మరి క్షమించని, కక్ష తీర్చుకునే స్వభావం పరిస్థితులను పాడు చేస్తుంది.
ఈ మాటలు తరచుగా వినిపిస్తుంటాయి: “నేను కోపం తెచ్చుకోను; నేను కక్ష తీర్చుకుంటాను!” దుఃఖకరమైన విషయమేమంటే, నేడు అనేకమంది జీవితాలకు ఈ వాక్యమే నడిపింపునిస్తుంది. ఉదాహరణకు, ఒక స్త్రీ తన వదినతో ఏడు సంవత్సరాలు మాట్లాడకుండా ఉంది, ఎందుకంటే ఆ స్త్రీ చెబుతున్నట్లు, “ఆమె నాకు తీరని అపకారం చేసింది అందుకు నేను ఆమెను ఎన్నటికీ క్షమించలేకుండా ఉన్నాను.” కానీ అలా మాట్లాడకుండా ఉండడాన్ని, నిందింపబడుతున్న వారు క్షమించమని అడిగేలా చేసేందుకు లేక శిక్షించడానికి ఒక ఆయుధంగా ఉపయోగించడం, కక్ష సాధించాలనే కోరికను తీర్చదు. బదులుగా, అది కేవలం వివాదాన్ని పెంపొందించగలదు, అలా పెద్ద కలహం చెలరేగడానికి దారి తీస్తుంది. బాధ కలిగించే ఈ వలయాన్ని ఛేదించకపోతే, కక్ష తీర్చుకోవాలన్న శక్తివంతమైన ప్రభావం సంబంధాలను, ఒకరి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేయగలదు.
క్షమించకుండా ఉండే స్వభావం యొక్క హాని
ఒక వ్యక్తి క్షమించకుండా ఉంటే, దాని ఫలితంగా వచ్చే గొడవ ఒత్తిడిని సృష్టించగలదు. తద్వారా, ఒత్తిడి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీయగలదు. డా. విలియమ్ ఎస్. సేడ్లర్ యిలా వ్రాశాడు: “ఆశ్చర్యకరంగా, మానవునికి వచ్చే జబ్బులు, అనారోగ్యంలో ఎక్కువ శాతం బాధ, భయము, వివాదం . . . చెడు తలంపులు, తప్పుడు జీవిత విధానం వలననే వచ్చాయని ఒక వైద్యునికంటే సంపూర్ణంగా మరెవ్వరూ గుణగ్రహించలేరు.” అయితే, వాస్తవంగా భావోద్రేక క్షోభలు ఎంత మేరకు నష్టాన్ని కలిగిస్తాయి? ఒక వైద్య ప్రచురణ యిలా జవాబిస్తుంది: “వైద్యుని వద్దకు వెళ్లిన వాళ్లలో మూడింట రెండొంతుల మందికి మానసిక ఒత్తిడివల్లనే అనారోగ్యం ఏర్పడింది లేక అది ఎక్కువయ్యిందని గణాంకాలు సూచిస్తున్నాయి.”
అవును, కఠినత్వం వైరుధ్యం మరియు ద్వేషం ఎంత మాత్రం నిరపాయకరమైనవి కావు. ఈ తీక్షణమైన భావోద్రేకాలు, ఓ కారును నెమ్మదిగా పాడుచేసే తుప్పువంటివి. కారు పైభాగం చూడడానికి అందంగా కనిపించవచ్చు, కానీ పెయింట్ క్రింద మాత్రం ఒక వినాశకరమైన ప్రక్రియ కొనసాగుతోంది.
అంతకంటే ప్రాముఖ్యంగా, కరుణ చూపడానికి ఆధారం ఉన్నప్పుడు మనం క్షమించడానికి నిరాకరించడం మనకు ఆత్మీయంగా కూడా హాని కలిగించగలదు. యెహోవా దేవుని దృష్టిలో, మనం యేసు దృష్టాంతంలోని దాసునిలా ఉంటాము. ఆ దాసుని యజమాని అతని అపరిమితమైన అప్పును రద్దు చేశాడు. అయినా, అతని తోటి దాసుడు తన స్వల్పమైన అప్పును రద్దు చేయమని వేడుకున్నప్పుడు, అతను కఠినుడుగా ఉండి క్షమించలేదు. మనము అలాగే క్షమించడానికి అయిష్టత చూపితే, యెహోవా మన పాపాలను క్షమించడానికి నిరాకరిస్తాడని యేసు స్పష్టపర్చాడు. (మత్తయి 18:21-35) ఒకవేళ మనం క్షమించని వారంగా ఉంటే, అప్పుడు మనం దేవుని యెదుట మన మంచి మనస్సాక్షిని మరి భవిష్యత్తు కొరకున్న మన నిరీక్షణను కూడా కోల్పోవచ్చు. (2 తిమోతి 1:3 పోల్చండి.) అలాంటప్పుడు, మనమేమి చేయగలము?
క్షమించడాన్ని నేర్చుకోండి
నిజమైన క్షమాపణ హృదయంనుండి పుట్టేదైయుంటుంది. తప్పిదస్థుని పొరపాటును క్షమించి, కక్ష తీర్చుకోవాలన్న ఎటువంటి కోరికనైనా వదలుకోడం అందులో యిమిడి ఉంటాయి. ఆవిధంగా, అంతిమ న్యాయం, మరి ఏ విధంగా కూడా కక్ష తీర్చుకోడం వంటివి యెహోవా చేతుల్లోనే విడిచిపెట్టబడతాయి.—రోమీయులు 12:19.
అయితే, “హృదయము అన్నింటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది,” గనుక అది ఎల్లప్పుడూ అనగా క్షమించవలసినప్పుడు కూడా అటువైపు మొగ్గు చూపదు. (యిర్మీయా 17:9) యేసు తానే యిలా చెప్పాడు: “దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును.”—మత్తయి 15:19.
మన హృదయానికి మంచి చేయడం కొరకు తర్ఫీదునివ్వవచ్చు గనుక కృతజ్ఞత కలిగుండవచ్చు. అయితే, మనకు అవసరమైన తర్ఫీదు ఉన్నతమైన మూలంనుండి రావాలి. మనం దాన్ని ఒంటరిగా చేయలేము. (యిర్మీయా 10:23) దైవికంగా ప్రేరేపింపబడిన కీర్తనల గ్రంథకర్త దీన్ని తెలుసుకుని, దేవుని నడిపింపు కొరకు ప్రార్థించాడు. ఆయన యెహోవాను ప్రార్థనలో యిలా వేడుకున్నాడు: “నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము.”—కీర్తన 119:26, 27.
మరొక కీర్తన ప్రకారం, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు, యెహోవా ఉపదేశాలను ‘బోధపర్చుకున్నాడు.’ ఆయన దాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, దానినుండి నేర్చుకున్నాడు. అందుకే, ఆయనిలా చెప్పగలిగాడు: “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.”—కీర్తన 103:8, 13.
మనం రాజైన దావీదు నేర్చుకున్నట్లే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. క్షమాపణ విషయంలో దేవుని పరిపూర్ణ మాదిరిని, అలాగే ఆయన కుమారుని మాదిరిని ప్రార్థనాపూర్వకంగా పఠించండి. అలా, మనం హృదయ పూర్వకంగా క్షమించడాన్ని నేర్చుకోగలము.
అయినా, కొందరిలా అడుగవచ్చు: గంభీరమైన పాపం విషయమేమిటి? అన్ని పాపాలను క్షమించాలా?
సమతూకాన్ని వెదకడం
ఒక వ్యక్తిపట్ల దుఃఖకరమైన తప్పిదం చేయబడితే, బాధ చాలా తీవ్రంగా ఉండగలదు. ఒక నిష్కళంకమైన వ్యక్తి గంభీరమైన పాపానికి గురైతే అది ప్రాముఖ్యంగా నిజమౌతుంది. కొందరిలా కూడా ఆలోచించవచ్చు, ‘నన్ను వంచనతో మోసగించి, గాయపర్చిన వారిని నేనెలా క్షమించాలి?’ బహిష్కరింపబడేంత ఘోరమైన పాపం విషయంలో, బాధితుడు మత్తయి 18:15-17లోని సలహాను అన్వర్తించవలసిన అవసరం ఉండవచ్చు.
సంగతేమైనా, బాధపర్చిన వారిమీదే విషయం చాలావరకూ ఆధారపడి ఉంటుంది. తప్పిదం జరిగిన తర్వాత యథార్థమైన పశ్చాత్తాపం యొక్క సూచనేమైనా కనిపించిందా? ఆ పాపి మారాడా, బహుశా నిజమైన సవరణలు చేయడానికి కూడా ప్రయత్నించాడా? చాలా భయంకరమైన పాపం విషయంలో కూడా క్షమించడానికి యెహోవా దృష్టిలో అటువంటి పశ్చాత్తాపమే కీలకము. ఉదాహరణకు, ఇశ్రాయేలు చరిత్రలోని రాజులందరికంటే చాలా దుష్టుడైన మనష్షేను యెహోవా క్షమించాడు. దేని ఆధారంగా? మనష్షే చివరకు తనను తాను తగ్గించుకుని, తన చెడు నడతను సరిదిద్దుకున్నాడు గనుక దేవుడలా చేశాడు.—2 దినవృత్తాంతములు 33:12, 13.
బైబిలులో యథార్థమైన పశ్చాత్తాపం, ప్రవర్తనలో నిష్కళంకమైన మార్పు, చేసిన తప్పిదాలనుబట్టి హృదయపూర్వకంగా దుఃఖపడడం యిమిడి ఉంటుంది. అవసరమైనప్పుడు, వీలు కలిగినప్పుడు, తప్పు ఎవరిపట్ల చేయబడిందో వారికి పాప క్షమాపణ కొరకు పోగొట్టినది తిరిగి యిచ్చివేయడానికి ప్రయత్నించడం కూడా పశ్చాత్తాపపడడంలో యిమిడి ఉంది. (లూకా 19:7-10; 2 కొరింథీయులు 7:11) ఆ విధంగా పశ్చాత్తాపపడనప్పుడు యెహోవా క్షమించడు.a అంతేకాకుండా, ఒకప్పుడు ఆత్మీయంగా జ్ఞానాభివృద్ధి పొందినవారే కానీ, యిప్పుడు యిష్టపూర్వకంగా, పశ్చాత్తాపం లేకుండా, తప్పిదాన్ని అలవాటుగా చేసేవారిని క్రైస్తవులు క్షమించాలని దేవుడు అపేక్షించడు. (హెబ్రీయులు 10:26-31) తీవ్రమైన కొన్ని పరిస్థితుల్లో, క్షమించడం సముచితంగా ఉండకపోవచ్చు.—కీర్తన 139:21, 22; యెహెజ్కేలు 18:30-32.
క్షమించడం సాధ్యమైనా కాకపోయినా, గంభీరమైన పాపం తనపట్ల చేయబడిన బాధితుడు మరొక ప్రశ్నను పరిగణించాలని యిష్టపడవచ్చు: విషయం పూర్తిగా పరిష్కరింపబడేంత వరకూ, నేను తీవ్రంగా బాధపడుతూ, కోపంగా ఉంటూ, తీక్షణమైన భావోద్రేక క్షోభను అనుభవిస్తూనే ఉండాలా? ఒక ఉదాహరణను గమనించండి. తన సేనాధిపతి అయిన యోవాబు అబ్నేరును, అమాశాయును, అనగా “[యోవాబు] కంటె నీతిపరులును యోగ్యులునగు ఈ ఇద్దరు మనుష్యులమీద పడి” చంపినప్పుడు, రాజైన దావీదు తీవ్రమైన బాధను అనుభవించాడు. (1 రాజులు 2:32) దావీదు తన క్షోభను మాటల ద్వారా వ్యక్తపర్చి ఉంటాడు, నిస్సందేహంగా ప్రార్థనలో యెహోవాకు కూడా చెప్పుకుని ఉంటాడు. సమయం గడిచే కొలది, దావీదు భావాల తీవ్రత తగ్గి ఉండవచ్చు. ఆయన తన జీవిత కాలమంతా కోపంతో వేగిపోలేదు. దావీదు తర్వాత యోవాబుతో కలిసి పనిచేశాడు, కానీ ఆయన పశ్చాత్తాపం చెందని ఈ హంతకున్ని క్షమించలేదు. దావీదు చివరకు న్యాయం జరిగేలా చూశాడు.—2 సమూయేలు 3:28-39; 1 రాజులు 2:5, 6.
ఇతరుల గంభీరమైన పాపాల చేత గాయపడిన వారు మొదట్లో వచ్చిన కోపాన్ని తగ్గించుకోవాలంటే చాలా సమయం, ప్రయాస అవసరమౌతాయి. గాయపర్చినవారు తమ తప్పును అంగీకరించి, పశ్చాత్తాపపడితే, గాయాలు మానడం సులభతరం అవుతుంది. అయితే, తప్పిదస్థుని ప్రవర్తన ఎలా ఉన్నా, నిష్కళంకమైన బాధితుడు యెహోవా యొక్క న్యాయము, మరియు జ్ఞానమును గురించి తనకు తెలిసిన దానినిబట్టి, అలాగే క్రైస్తవ సంఘంలో ఓదార్పును, ఉపశమనాన్ని పొందవచ్చు.
మీరు ఒక పాపిని క్షమిస్తే, మీరు ఆ పాపాన్ని సమర్థిస్తున్నారని దానర్థంకాదని కూడా గుర్తించండి. క్రైస్తవుల దృష్టిలో, క్షమించడమంటే నమ్మకంతో సంగతిని యెహోవాకు వదిలేయడమని అర్థం. ఆయన విశ్వమంతటికీ నీతిపరుడైన న్యాయాధిపతి, ఆయన సరైన సమయంలో న్యాయం తీరుస్తాడు. అందులో మోసకారులైన ‘వేశ్యాసంగులు వ్యభిచారులు’ కూడా యిమిడి ఉంటారు.—హెబ్రీయులు 13:4.
క్షమించడం యొక్క ప్రయోజనాలు
కీర్తనల గ్రంథకర్త అయిన దావీదు యిలా పాడాడు: “ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱ పెట్టువారందరియెడల కృపాతిశయము గలవాడవు.” (కీర్తన 86:5) మీరు, యెహోవావలె, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” వారా? ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.
మొదటిగా, యితరులను క్షమించడం సత్సంబంధాలను వృద్ధి చేస్తుంది. బైబిలు క్రైస్తవులను యిలా పురికొల్పుతుంది: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫెసీయులు 4:32.
రెండవదిగా, క్షమించడం సమాధానాన్ని తెస్తుంది. అది తోటి మానవులతో కలిగి ఉండే సమాధానమే కాదుగానీ, అంతరంగ సమాధానం కూడా.—రోమీయులు 14:19; కొలొస్సయులు 3:13-15.
మూడవదిగా, యితరులను క్షమించడం, మనకు కూడా క్షమాపణ అవసరమన్న విషయాన్ని జ్ఞాపకముంచుకోడానికి మనకు సహాయం చేస్తుంది. అవును, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.”—రోమీయులు 3:23.
చివరిగా, యితరులను క్షమించడం, మన తప్పులు దేవునిచేత క్షమింపబడడానికి మార్గం సుగమం చేస్తుంది. యేసు యిలా అన్నాడు: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.”—మత్తయి 6:14.
యేసు మరణించిన మధ్యాహ్నం ఆయన మదిలో ఎన్ని విషయాలు ఉండి ఉంటాయో ఊహించండి. ఆయన తన శిష్యులను, ప్రకటనా పనిని, ప్రాముఖ్యంగా యెహోవాకు తాను చూపవలసిన యథార్థతను గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయినా, ఆయన హింసా కొయ్యపై తీవ్రంగా శ్రమనొందుతున్నప్పటికీ, ఆయన దేనిని గూర్చి మాట్లాడాడు? ఆయన చివరి మాటల్లో, “తండ్రీ, . . . వీరిని క్షమించుమని” చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. (లూకా 23:34) మనము ఒకరినొకరం హృదయ పూర్వకంగా క్షమించడం ద్వారా యేసు పరిపూర్ణ మాదిరిని అనుకరించగలము.
[అధస్సూచీలు]
a అయితే, యెహోవా క్షమాపణ దయచేసేటప్పుడు యితర విషయాలను కూడా పరిగణిస్తాడు. ఉదాహరణకు, ఒక తప్పిదస్థునికి యెహోవా కట్టడలు తెలియనప్పుడు, అలా తెలియకపోవడం తప్పు యొక్క భారాన్ని తగ్గించవచ్చు. తనను చంపుతున్న వారిని క్షమించమని యేసు తన తండ్రిని అడిగినప్పుడు, యేసు తనను చంపిన రోమా సైనికులను గూర్చి ప్రార్థిస్తున్నాడని స్పష్టమౌతుంది. ‘వాళ్లేమి చేస్తున్నారో వాళ్లకు తెలియదు,’ వాస్తవంగా ఆయనెవరో వాళ్లకు తెలియదు. అయితే, ఆ శిక్ష విధింపబడడానికి కారకులైన మత నాయకులు మాత్రం చాలా ఎక్కువగా నిందింపబడవలసిందే—మరి వారిలో చాలామందికి, క్షమాపణ లభించదు.—యోహాను 11:45-53; అపొస్తలుల కార్యములు 17:30ని పోల్చండి.
[5వ పేజీలోని చిత్రం]
క్షమించని దాసున్ని గూర్చిన యేసు ఉపమానభావాన్ని మీరు అర్థం చేసుకున్నారా?
[7వ పేజీలోని చిత్రాలు]
ఇతరులను క్షమించడం సత్సంబంధాలను వృద్ధి చేస్తుంది మరియు ఆనందాన్ని తెస్తుంది