మీరు క్షమిస్తున్నారా?
బిల్‌కు అతని 16 సంవత్సరాల కుమార్తె లీసాకు ఎప్పుడూ పడేదికాదు. వారిద్దరి మధ్య వచ్చే చిన్న వివాదాలు తరచూ పెద్ద కలహాలుగా మారేవి. చివరకు, పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందంటే, అతడు లీసాను యింట్లోనుండి వెళ్లిపోమ్మని అడిగాడు.a
కొంతకాలానికి, లీసా తప్పు తనదేనని గుర్తెరిగి, తన తండ్రిని క్షమాపణ అడిగింది. కానీ లీసా చేసిన మునుపటి తప్పిదాలను మర్చిపోయే బదులు, కోపోద్రేకుడైన ఆమె తండ్రి సఖ్యత కొరకు ఆమె చేసిన ప్రయత్నాలను త్రోసిపుచ్చాడు. ఊహించండి! అతను తన స్వంత కూతురుపట్ల కరుణ చూపడానికి విముఖంగా ఉన్నాడు!
శతాబ్దాల క్రితం నిందారహితుడైన ఒక వ్యక్తి, తాను చేయని నేరానికి మరణశిక్ష పొందాడు. సాక్షులు అబద్ధ సాక్ష్యం పలికారు, రాజకీయ అధికారులు న్యాయబద్ధంగా తీర్పు తీర్చడానికి నిరాకరించారు. ఆ నిరపరాధియగు వ్యక్తి యేసుక్రీస్తే. తాను మరణించక ముందు, ఆయన దేవున్ని ప్రార్థనా పూర్వకంగా యిలా అడిగాడు: “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు.”—లూకా 23:34.
యేసు, ఉదారంగా హృదయ పూర్వకంగా క్షమించాడు, మరియు ఆయన అనుచరులు కూడా ఈ విషయంలో ఆయనను పోలినడుచుకోవాలని కోరబడ్డారు. (ఎఫెసీయులు 4:32) అయితే బిల్ వలె, అనేకమంది కఠిన హృదయులై క్షమించడానికి విముఖంగా ఉన్నారు. ఈ విషయంలో మీరెంత యోగ్యంగా ఉన్నారు? ఇతరులు మీపట్ల తప్పు చేసినప్పుడు మీరు వాళ్లను క్షమించడానికి యిష్టత చూపిస్తారా? మరి గంభీరమైన తప్పిదాల విషయమేమిటి? వాటిని కూడా క్షమించాలా?
క్షమించడం ఒక సవాలే
క్షమించడం అన్ని సమయాల్లో సులభంగా ఉండదు. మరి యీ అపాయకరమైన కాలాల్లో, మానవ సంబంధాలు మరీ సమస్యలతో కూడినవిగా ఉన్నాయి. ప్రాముఖ్యంగా కుటుంబ జీవితం, కష్టాలు వత్తిడులతో నిండి ఉంది. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు చాలాకాలం పూర్వం, “అంత్యదినములలో” అటువంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నాడు. ఆయనిలా చెప్పాడు: “మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు . . . సజ్జనద్వేషులు, ద్రోహులు మూర్ఖులు గర్వాంధులై,” యుందురు.—2 తిమోతి 3:1-4.
అలాంటప్పుడు నిస్సందేహంగా, యితరులను క్షమించగల మన సామర్థ్యాన్ని పరీక్షించే బాహ్య ఒత్తిళ్లను మనమందరం ఎదుర్కొంటాము. అంతేకాకుండా, మనం అంతర్గత ఒత్తిళ్లకు విరుద్ధంగా కూడా పోరాడతాము. పౌలు యిలా విలపించాడు: “నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.” (రోమీయులు 7:19, 20) తత్ఫలితంగా, మనలో అనేకులం మనము ఉండాలని అనుకునేంత క్షమించే వారంగా ఉండలేక పోతున్నాము. ఏదేమైనా, మనం సంతరించుకున్న అసంపూర్ణత, పాపము మనందరిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపించి, కొన్నిసార్లు తోటి మానవులపట్ల క్షమాగుణాన్ని కలిగి లేకుండా చేస్తాయి.
ఒక చిన్న తప్పు చేసినందుకు క్షమించవలసిందిగా ప్రోత్సహింపబడినప్పుడు ఒక స్త్రీ యిలా జవాబిచ్చింది: “క్షమించడానికి ప్రయాసపడాల్సినంత యోగ్యులెవ్వరూ లేరు.” పైకి గమనిస్తే అటువంటి వ్యాఖ్యానం కఠినత్వం, నిర్దయ, ద్వేషంతో కూడినదిగా కూడా అనిపించవచ్చు. అయితే లోతుగా పరిశీలిస్తే, స్వార్థపూరితమైనదని, శ్రద్ధలేనిదని, ప్రతికూలమైనదని పరిగణించే ప్రపంచాన్ని వారు ఎదుర్కొనప్పుడు అనేకమంది ప్రజలకు కలిగే ఆశాభంగాన్ని అది తెలియజేస్తుందని మనం చూస్తాము. ఒక మనిషి యిలా అన్నాడు: “మీరు ప్రజలను క్షమిస్తే వాళ్లు మీనుండి ప్రయోజనం పొందాలని చూస్తారు. మిమ్మల్ని అమాయకున్ని చేసి ఆడిస్తారు.”
కాబట్టి, ఈ అంత్య దినాల్లో క్షమాగుణాన్ని పెంపొందించుకోడం చాలా కష్టమైనదిగా ఉండటంలో ఆశ్చర్యంలేదు. అయినా, దయతో క్షమించాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (2 కొరింథీయులు 2:7 పోల్చండి.) మనమెందుకు ఈ క్షమాగుణాన్ని కలిగి ఉండాలి?
[అధస్సూచీలు]
a పేర్లు మార్చబడ్డాయి.