నిర్బంధాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయా?
నిర్బంధాలు! నిజంగా వాటినెవరూ ఇష్టపడరు; అయినా ప్రతి ఒక్కరం కొంత మేరకు వాటిని సహించవలసిందే. అయితే, మీ జీవితం మరీ పరిమితం చేయబడినట్లు అనిపించి మీరు కొన్నిసార్లు నిరుత్సాహపడతారా? మీరు మీ దృక్పథాన్ని మార్చుకుంటే బహుశా మీరు మంచిగా భావిస్తారేమో. మీరు చేయలేని దాని గురించి కలతచెందే బదులు, మీరు అనుభవించే స్వేచ్ఛలన్నిటి పూర్తి ప్రయోజనాన్ని ఎందుకు పొందకూడదు?
ఉదాహరణకు, ఆర్థికంగా పేదవారైన అనేకులు ధనవంతులమై వుండాలని కోరుకుంటారు. అయితే, ఈ విధానంలో మనం చేయగలిగే వాటిని పేదరికం పరిమితం చేయవచ్చు, జీవితంలో ప్రాముఖ్యమైనవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. పేదవారు, అలాగే ధనికులు కూడా ప్రేమించుకుంటారు, వివాహం చేసుకుంటారు, పిల్లలను పెంచుతారు, మంచి స్నేహసంబంధాలు మొదలైనవి కల్గివుంటారు. మరీ ప్రాముఖ్యంగా, పేదవారు, ధనికులు కూడా యెహోవాను తెలుసుకొని, వాగ్దానం చేయబడిన నూతన లోకం కొరకు ఎదురుచూస్తారు. ధనం కంటే శ్రేష్ఠమైన క్రైస్తవ వివేచన, జ్ఞానములలో పేదవారు, అలాగే ధనికులు కూడా అభివృద్ధి చెందుతారు. (సామెతలు 2:1-9; ప్రసంగి 7:12) ధనికులు, పేదవారు అందరూ యెహోవా యొద్ద తమ కొరకు శ్రేష్ఠమైన పేరును సంపాదించుకోగలరు. (ప్రసంగి 7:1) పౌలు దినాల్లో క్రైస్తవ సంఘంలో ఎక్కువమంది తక్కువ స్థాయినుండి వచ్చినవారు—వారిలో కొందరు సేవకులు—తమ పరిస్థితులు అనుమతించిన కొలది స్వేచ్ఛను యుక్తిగా ఉపయోగించుకున్నారు.—1 కొరింథీయులు 1:26-29.
లేఖనాధారమైన శిరసత్వము
ఒక క్రైస్తవ వివాహంలో, భార్య భర్తకు లోబడివుండాలి—ఈ ఏర్పాటు మొత్తం కుటుంబానికంతటికీ ప్రయోజనం కలిగేలా రూపొందించబడింది. (ఎఫెసీయులు 5:22-24) దీన్ని బట్టి భార్య తక్కువ చేయబడినట్లు భావించాలా? ఎంతమాత్రం కాదు. భర్త, భార్య ఒక జట్టు. పురుషుని శిరసత్వం క్రీస్తువంటి మాదిరిలో నిర్వహించబడినట్లైతే, అది అతని భార్యపై తక్కువ నిర్బంధాలను వుంచి, ఆమె తన శక్తిసామర్థ్యాలను తెలుసుకోవడానికి అనేక అవకాశాలను ఆమెకు యిస్తుంది. (ఎఫెసీయులు 5:25, 31) సామెతలు 31వ అధ్యాయంలోని “గుణవతియైన భార్య” ఎన్నో ఆసక్తిదాయకమైన, సవాలుతో కూడిన పనులను కల్గివుంది. స్పష్టంగా, తన భర్తకు లోబడడం ఆమెకు కష్టంగాలేదు.—సామెతలు 31:10-29.
అలాగే, క్రైస్తవ సంఘంలో అర్హతగల పురుషులపై స్త్రీ ఆధిపత్యం వహించే ఏర్పాటు లేదు. (1 కొరింథీయులు 14:34; 1 తిమోతి 2:11, 12) ఆ నిర్బంధాన్ని బట్టి క్రైస్తవ స్త్రీలు విసుగుచెందాలా? కాదు. క్రైస్తవ సేవ యొక్క ఆ అంశమందు దైవపరిపాలనా పద్ధతిలో శ్రద్ధ వహించటాన్ని బట్టి అనేకులు కృతజ్ఞులైవున్నారు. నియమిత పెద్దల కాపుదల, బోధల నుండి ప్రయోజనం పొంది, ప్రాముఖ్యమైన పనియైన ప్రకటించేపని, శిష్యులను చేసే పనులలో శ్రద్ధ కల్గివుండడానికి వారు ఆనందిస్తున్నారు. (మత్తయి 24:14; 28:19, 20) క్రైస్తవ స్త్రీలు ఈ క్షేత్రంలో ఎంతో చేస్తారు, యిది వారికి యెహోవా దేవుని దృష్టిలో గౌరవాన్ని తెస్తుంది.—కీర్తన 68:11; సామెతలు 3:35.
చిన్నవారిపై నిర్బంధాలు
చిన్నవారు తమ తల్లిదండ్రుల అధికారం క్రింద ఉన్నారు గనుక తరచూ తమ జీవితం మరీ కట్టుదిట్టం చేయబడిందని వారు కూడా కొన్నిసార్లు ఫిర్యాదు చేస్తారు. అయినప్పటికీ, యిది కూడా లేఖనాధారమైనదే. (ఎఫెసీయులు 6:1) జ్ఞానవంతులైన క్రైస్తవ యౌవనులు, తమ తల్లిదండ్రులు తమపై విధించే కట్టుబాట్లను బట్టి చిరాకుపడడానికి బదులు, సాధారణంగా భారమైన బాధ్యతల నుండి వారికున్న స్వేచ్ఛతో సహా, వారికున్న ఇతర స్వేచ్ఛలను అనుభవించడంపై కేంద్రీకరిస్తారు. ఆ విధంగా వారు తమ యౌవన బలం నుండి, వయోజన జీవితానికి వారిని సిద్ధం చేసే పరిస్థితుల నుండి ప్రయోజనం పొందుతారు.
తాను చేయగల దానిలో పరిమితం చేయబడిన ఒక చిన్న ఒంటరి గుంపులోని 12 సంవత్సరాల బాలుడి గురించి బ్రెజిల్‌లోని ఒకప్పటి ప్రయాణ కాపరికి బాగా గుర్తుంది. రికార్డులను చూసే బాధ్యతగల వ్యక్తి తన ఉద్యోగంలో చాలా ఎక్కువ పని కల్గివుండి, గుంపు యెడల ఎక్కువ శ్రద్ధ చూపించలేక పోతున్నాడు. కాని ఆయన ఈ యౌవనుడు సహాయం చేసేలా ఏర్పాటు చేసుకున్నాడు. సంఘ ఫారమ్‌లు ఎక్కడ ఉన్నాయో అతను తెలుసుకున్నాడు, సహాయం చేయడానికి ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు. అతని ఆసక్తి ప్రోత్సాహకరమైనది, ఆయన ప్రాంతీయ సేవలో నమ్మకమైన సహచరునిగా ఉండేవాడు. ఆ యౌవనుడు యిప్పుడు నియమించబడిన పెద్ద.
ఒక వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేయగల సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది అనారోగ్యంతో నిర్బంధించబడి ఉంటారు. కొందరు విభాగింపబడిన గృహాలలో జీవిస్తారు, అవిశ్వాసియైన జత కోరేవాటిని బట్టి వారి స్వేచ్ఛ పరిమితం చేయబడుతుంది. నిర్బంధాల్లో జీవిస్తున్నవారు పరిస్థితులు వేరుగా ఉండాలని కోరుకోవచ్చు, అయినప్పటికీ వారు సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. యెహోవాపై ఆధారపడి, తమ పరిస్థితుల నుండి ప్రయోజనం పొందినందున ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉన్న వ్యక్తుల వృత్తాంతాలు అనేకం ఈ పత్రిక అందజేసింది.
తన కాలంనాటి సామాన్యమైన పరిస్థితిని గురించి మాట్లాడుతూ, అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.” (1 కొరింథీయులు 7:21) ఎంతటి సమతూకం గల దృష్టి! కొన్ని పరిస్థితులు మారతాయి. యౌవనులు పెద్దవారౌతారు. వ్యతిరేకించే జత కొన్నిసార్లు సత్యాన్ని అంగీకరిస్తారు. ఆర్థిక పరిస్థితులు మారతాయని చెప్పబడుతోంది. అనారోగ్యవంతులు బాగుపడవచ్చు. ఇతర సందర్భాల్లో, యెహోవా నూతన లోకం వచ్చేవరకు పరిస్థితులు మారకపోవచ్చు. అయినప్పటికీ, ఇతరులు చేయగల దాన్ని తాము చేయలేనందుకు కలతచెందడం ద్వారా ఏమి సాధించబడుతుంది?
నేలకుపైగానున్న నింగిలో పక్షులు పైకెగరడాన్ని చూసి, వాటి కదలికల అందాన్ని, స్వేచ్ఛను మీరెప్పుడైనా మెచ్చుకున్నారా? మీరు కూడా అలా ఎగరగలిగితే బాగుండునని బహుశా మీరు భావించియుండవచ్చు. మీరు పక్షులవలే ఎగరలేరు, మీరు ఎన్నటికీ అలా చేయలేరు! కాని బహుశా మీరు దాని గురించి ఫిర్యాదు చేయరు. బదులుగా, దేవుడిచ్చిన సామర్థ్యాలను బట్టి ఆనందిస్తారు. భూభాగంపై విజయవంతంగా జీవించగలుగుతారు. అలాగే, జీవితంలో మన స్థితి ఏదైనప్పటికీ, మనం చేయ లేని దాని గురించి కలతచెందే బదులు మనం చేయ గల దానిపై శ్రద్ధ నిలిపినట్లైతే, జీవితం సంతృప్తికరంగా ఉంటుంది, మనం యెహోవా సేవలో ఆనందాన్ని కనుగొంటాము.—కీర్తన 126:5, 6.
[28వ పేజీలోని చిత్రం]
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నిర్బంధిస్తున్నట్లు మీరు భావిస్తున్నారా?