రాజ్య ప్రచారకుల నివేదిక
“అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును”
మొదటి శతాబ్దంలో, ఎఫెస్సు నందు “మాంత్రిక విద్య” విషయంలో ఆసక్తి గల ఓ గుంపు, తమ మాంత్రిక పుస్తకాలను బహిరంగంగా కాల్చివేయడం ద్వారా క్రైస్తవ సువార్తకు ప్రతిస్పందించారు. (అపొస్తలుల కార్యములు 19:19) లెక్కపెట్టిన విధంగా ఈ పుస్తకాల వెల 50,000 వెండి నాణాలు. బైబిలు వృత్తాంతం రోమా నాణెమైన దేనారాన్ని సూచిస్తున్నట్లు తీసుకుంటే, అది కనీసం 37,000 డాలర్లవుతుంది!
ఒకప్పుడు అభిచార సంబంధమైన పుస్తకాలను కలిగివుండిన అనేక మంది ప్రజలు, ప్రాచీన ఎఫెసీయులు కనపర్చిన నిశ్చయతను నేడు కనపర్చారు. కెనడా నందలి ఈ క్రింది అనుభవాన్ని పరిశీలించండి.
సుమారు అయిదు సంవత్సరాల క్రితం, యెహోవాసాక్షుల్లో ఒకరు యింటింటి సేవ చేస్తుండగా, ఓ యింటి వద్ద, నోరా అనే ఓ స్త్రీ తనను యింట్లోకి లాగేసింది. అనేక సంవత్సరాలుగా నోరా వందలకొలది మత సంబంధిత, దయ్యాల సంబంధిత పుస్తకాలను సేకరించింది కానీ, మరణించినవారి నిరీక్షణ విషయంలో బైబిలేమి చెబుతోందో తెలుసుకోవాలని ఆమెకు ఉండేది. ఆ సాక్షి, ఆమెకు వాట్ హోప్ ఫర్ డెడ్ లవుడ్ వన్స్? అనే కరపత్రాన్ని అందించింది. నోరా ప్రశ్నలకు జవాబు దొరికింది, అంతేకాక ఆమె వాచ్‌టవర్, అవేక్! పత్రికలకు చందా కట్టింది.
తర్వాత ఆమె యిల్లు మారిపోవడంతో యెహోవాసాక్షులతో సంబంధాన్ని పోగొట్టుకుంది. అయినప్పటికి, తన కొత్త చిరునామాకు పత్రికలను పోస్టుద్వారా పొందుతోంది. ఆమె ఆ పత్రికలో ప్రస్తావించిన కొన్ని బైబిలు ఆధారిత ప్రచురణలను కూడా రప్పించుకుంది. కొంత కాలం తర్వాత, యెహోవాసాక్షుల్లో ఒకరు తన యింటికి వచ్చారు. జవాబులు చెప్పే సమయంలో యెహోవాసాక్షులు నేరుగా బైబిలును ఉపయోగించడాన్ని చూసి ముగ్ధురాలైన నోరా, ఆమెను ఆహ్వానించి, చర్చలు యింకా కొనసాగించడానికి మరలా రమ్మని ఆహ్వానించింది.
అయితే, నోరాను మరలా కలవడం ఆ సాక్షికి కష్టమైంది. వేరువేరు సమయాల్లోనూ వారంలో వేరువేరు రోజుల్లోనూ దర్శించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, కొంతకాలానికి తన పట్టుదల ఫలించింది, ఆమె మంచి ప్రతిఫలాలను పొందింది. క్రమమైన బైబిలు పఠనం ప్రారంభించబడింది. నోరా బలవంతం మీద అది తరచుగా వారానికి మూడు సార్లు జరిగేది. ఆమె నేర్చుకునే విషయాలు, ఆమె తన స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మాట్లాడడానికి పురికొల్పాయి, దాని వల్ల యెహోవాసాక్షులతో బైబిలు పఠనాలు చేయాలని వారిలో ముగ్గురు కోరారు.
అనేక అబద్ధ మతాలూ అబద్ధ ప్రవక్తలు ఉన్నారనీ అయితే జీవానికి నడిపించే దారి ఒక్కటే ఉందనీ తన పఠనం ద్వారా ఆమె నేర్చుకుంది. అనేక సంవత్సరాలుగా తన ప్రశ్నల సమాధానం కొరకు ఆమె అబద్ధ మతాలను వెదికింది. అయితే బైబిలు, దయ్యాలను గూర్చి చెప్పే వాటిని నేర్చుకున్నప్పుడు, అపొస్తలుల కార్యములు 19:19 నందు ప్రస్తావించబడిన పురాతన ఎఫెస్సులోని ప్రజల్లా ఆమె ప్రవర్తించింది. ఆమె తన గ్రంథాలయాన్ని శుభ్రం చేసింది, అంతేకాదు కొన్ని రోజుల్లోనే, అభిచారానికి సంబంధించిన మరియు అబద్ధ మత బోధలకు సంబంధించిన వేయికంటే ఎక్కువ పుస్తకాలను ఆమె నాశనం చేసింది. అలా నాశనం చేసిన ప్రచురణల్లో నాలుగు పుస్తకాలున్న ఓ సెట్టు ఖరీదు 800 డాలర్లు!
నోరా చేసిన పనికి ఆగ్రహించిన దయ్యాలు, రెండు వారాలపాటు ఆమెను వేధించాయి. అయినప్పటికీ, బైబిలు పఠనం నుండిగానీ, యెహోవా ఆధునిక దిన సంస్థతో ఆమె సహవాసాన్నుండి గానీ ఆ దుష్టాత్మలు ఆమెను మరల్చలేకపోయాయి.
అలాంటి అనుభవాలు బైబిలు మాటల నిజత్వాన్ని దృష్టాంతపరుస్తున్నాయి: “దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”—యాకోబు 4:7.