నిజమైన ప్రపంచవ్యాప్త సహోదరత్వంలోని ఆనందం
విల్లీ డేవిస్ చెప్పినది
పంతొమ్మిది వందల ముఫ్పై నాలుగులో గొప్ప కరువు ప్రపంచాన్ని చుట్టుముడుతుండగా, అమెరికా ఆర్థిక సంక్షోభపు వేదనలో వుంది. ఒహాయో నందలి క్లేవ్‌లాండ్‌లోని “ప్రాస్పెక్ట్ రిలీఫ్ స్టేషన్” వెలుపల పోలీసులకు, కమ్యూనిస్టునని బహిరంగంగా అరుస్తున్న వ్యక్తికి మధ్య గొడవ జరుగుతున్నది. ఆ పోలీసు కమ్యూనిస్టును, ప్రక్కన నిలబడివున్న మా అమ్మమ్మయైన విన్నీ విలియమ్స్‌ను చంపాడు.
మా అమ్మమ్మ నల్లజాతీయురాలు, పోలీసు శ్వేతజాతీయుడు గనుక ఈ మరణాలను జాతికి సంబంధించి జరిగిన మరణాలుగా మార్చడానికి ఆ కమ్యూనిస్టులు ప్రయత్నించారు. “క్లేవ్‌లాండ్ పోలీసు జాతీయవాది,” “ఈ మరణాలకు కక్ష సాధించండి” వంటి పేర్లతో కరపత్రాలను పంచిపెట్టారు. మా అమ్మమ్మ అంత్యక్రియలను కమ్యూనిస్టులే శ్రద్ధ తీసుకుని జరిపించారు. సమాధిపెట్టెను మోస్తున్నవారి ఫోటో నావద్ద ఉంది—వాళ్లంతా శ్వేతజాతీయులు, పార్టీ సభ్యులే. ప్రతి ఒక్కరు తమ పిడికిలి బిగించి చేతిని పైకెత్తి ఉంచారు, తరువాత అదే నల్లజాతి శక్తికి చిహ్నమయ్యింది.
మా అమ్మమ్మ మరణించినప్పుడు, ఆమె కుమార్తె గర్భంలో నేనున్నాను, నాలుగు నెలల తర్వాత నేను జన్మించాను. నేను సరిగ్గా మాట్లాడలేకపోయేవాడిని. నేను నత్తి లేకుండా మాట్లాడలేను, అందుకే నా తొలి పాఠశాల విద్యలో మాట్లాడే శిక్షణ కూడా ఉండేది.
నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు విడిపోయారు, నన్ను మా అక్కను మా అమ్మ పెంచింది. నాకు పది సంవత్సరాలున్నప్పుడు, కుటుంబ ఖర్చులకు సహాయపడడానికి నేను పాఠశాల అయిన తర్వాత సరుకులు అందజేసేవాడిని. రెండేళ్ల తర్వాత, కుటుంబం కొరకు డబ్బు సంపాదించే ముఖ్యునిగా, పాఠశాలకు వెళ్లకముందు, వెళ్లి వచ్చిన తర్వాత పనిచేయడం ప్రారంభించాను. అమ్మ ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు, నేను పాఠశాల మానేసి పూర్తికాలం పనిచేయడం మొదలుపెట్టాను.
సహోదరత్వంతో పరిచయం
ఒక యెహోవాసాక్షి 1944లో మా బావ భార్యకు “ది ట్రూత్ షెల్ మేక్ యు ఫ్రీ” పుస్తకాన్ని యిచ్చాడు, ఆమెతో ప్రారంభించబడిన బైబిలు పఠనంలో నేను కూడా చేరాను. అదే సంవత్సరం నేను తూర్పు ప్రాంత సంఘంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు హాజరు కావడం ప్రారంభించాను. పాఠశాల అధ్యక్షునికి నాకున్నట్లుగానే మాట్లాడే సమస్య వుంది, కాని ఆయన దాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకున్నాడు. ఆయన నాకెంతటి ప్రోత్సాహంగా ఉండేవాడో!
మా ఇరుగుపొరుగున ఇటలీ, పోలండ్, హంగేరి దేశస్థులు మరియు యూదులు ఎక్కువగా ఉండేవారు, అందుకని సంఘంలో వీరు, ఇతర వర్గాలవారు ఉండేవారు. తెల్లజాతి సంఘంతో సహవసించే ఆఫ్రికన్ అమెరికన్లలో మా బావ భార్య, నేను మొదటివారము, కాని సాక్షులు మా యెడల ఎన్నడు జాతి వివక్షత చూపించలేదు. వాస్తవానికి, వారు మమ్మల్ని భోజనానికి తమ గృహాలకు క్రమంగా ఆహ్వానించేవారు.
నేను 1956లో పరిచారకుల అవసరత ఎక్కువగా ఉన్న అమెరికాలోని దక్షిణ ప్రాంతానికి మారాను. ఒక వేసవిలో నేను జిల్లా సమావేశం కొరకు మళ్లీ ఉత్తర ప్రాంతానికి వచ్చినప్పుడు క్లేవ్‌లాండ్‌లోని సహోదరులు నన్ను చూడడానికి వచ్చి, నా పనుల్లో అత్యంత ఆసక్తి కనబర్చారు. వారి శ్రద్ధ నాకు, ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. ఎల్లప్పుడూ “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను”.—ఫిలిప్పీయులు 2:4.
విస్తరించబడిన పూర్తికాల పరిచర్య
పయినీరుగా పూర్తికాల ప్రకటన పనిలో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత, 1959 నవంబరులో, న్యూయార్కులోనున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయమైన బ్రూక్లిన్ బేతేలుకు నేను ఆహ్వానింపబడ్డాను. నాకు షిప్పింగ్ విభాగంలో పని అప్పగించబడింది. నా విభాగానికి అధ్యక్షుడైన క్లాస్ జెన్‌సన్, నాతోపాటు నా గదిలో ఉండే విలియమ్ హన్నన్ ఇద్దరూ శ్వేతజాతీయులు, వారిద్దరు నాకు ఆత్మీయ తండ్రులయ్యారు. నేను అక్కడికి వెళ్లే సమయానికే, వారు ఇద్దరూ దాదాపు 40 సంవత్సరాలు బేతేలులో సేవచేశారు.
పంతొమ్మిదివందల అరవైయవ దశకం తొలి భాగంలో, బేతేలు కుటుంబంలో దాదాపు 600 మంది సభ్యులున్నారు, దాదాపు 20 మంది ఆఫ్రికన్ అమెరికన్లు. ఆ సమయానికి, అమెరికా జాతివైషమ్యాలతో నిండిపోయి, జాతీయ సంబంధాలు అంతరించిపోతున్నాయి. అయినప్పటికీ, బైబిలు యిలా బోధిస్తుంది “దేవుడు పక్షపాతికాడు,” మనం కూడా పక్షపాతం గలవారం కాకూడదు. (అపొస్తలుల కార్యములు 10:34, 35) ప్రతి ఉదయం బేతేలు బల్ల వద్ద మాకుండిన ఆత్మీయ చర్చలు అలాంటి విషయాలపై దేవుని దృక్పథాన్ని అంగీకరించాలనే మా దృఢ నిశ్చయాన్ని బలపర్చడానికి సహాయపడ్డాయి.—కీర్తన 19:7.
నేను బ్రూక్లిన్ బేతేలులో సేవచేసే సమయంలో, వర్జీనియా నందలి రిక్‌మాండ్ నుండి వచ్చిన పయినీరైన లోయిస్ రుఫిన్‌ను కలిశాను, మేము 1964లో వివాహం చేసుకున్నాము. పూర్తికాల పరిచర్యలో కొనసాగాలన్నది మా నిశ్చయం గనుక మా వివాహం తర్వాత మేము అమెరికా దక్షిణ ప్రాంతానికి తిరిగి వెళ్లాము. మొదట మేము ప్రత్యేక పయినీర్లుగా పనిచేశాము, తర్వాత 1965లో సర్క్యూట్ పనిచేయడానికి నేను ఆహ్వానింపబడ్డాను. తర్వాతి పది సంవత్సరాలు మేము కెన్‌టుకీ, టెక్సాస్, లౌసేనా, అల్‌బామా, జార్జియా, ఉత్తర కారోలీనా, మిసిసిపి రాష్ట్రాలలోని సంఘాలను దర్శించాము.
మా సహోదరత్వానికి పరీక్ష
అవి గొప్ప మార్పు జరిగిన సంవత్సరాలు. మేము దక్షిణాదికి వెళ్లకముందు, జాతులు వేరు చేయబడ్డాయి. శ్వేతజాతీయులు వెళ్లే పాఠశాలలకు వెళ్లకుండా, వారు తినే హోటళ్లలో తినకుండా, వారు నిద్రించే వసతి గృహాల్లో నిద్రించకుండా, వారు కొనే అంగళ్లలో కొనకుండా, వారు నీరు త్రాగే కొళాయిల నుండి నీరు త్రాగకుండా నల్లజాతివారిని చట్టం నిషేధించింది. కాని 1964లో అమెరికా కాంగ్రెస్ రవాణా సౌకర్యంతో సహా బహిరంగ స్థలాల్లో వివక్షత చూపడాన్ని నిషేధించిన పౌర హక్కుల నిబంధనను ప్రవేశపెట్టింది. కాబట్టి జాతి విభేధానికి చట్టపరమైన ఆధారం లేకుండా అయ్యింది.
అయితే ప్రశ్నేమిటంటే, అందరూ నల్లజాతివారు అందరూ శ్వేతజాతీయులు ఉండే సంఘాల్లోని మన సహోదర సహోదరీలు కలిసివుండి ఒకరి యెడల ఒకరు ప్రేమ వాత్సల్యాలను చూపించుకుంటారా, లేక గతం నుండి లోతుగా పాతుకుపోయి ఉన్న భావాలు, సమాజం నుండి వస్తున్న ఒత్తిడి వారు ఐక్యతను కోల్పోయేలా చేస్తుందా? “సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి” అనే లేఖనాధార ఆజ్ఞను పాటించడం ఒక సవాలుగా ఉండేది.—రోమీయులు 12:10.
ఎవరైనా గుర్తుంచుకోదగినంత వరకు, యిప్పుడు వ్యాప్తిలో ఉన్న దృక్పథం, ప్రాముఖ్యంగా దక్షిణాదిన నల్లజాతివారు తక్కువవారనే భావం ఉంది. చర్చీలతో సహా, ఆచరణాత్మకంగా సమాజంలోని ప్రతి దశ ద్వారా ఈ దృక్పథం ప్రజల మనస్సుల్లో లోతుగా పాతుకుపోయింది. కాబట్టి కొంతమంది నల్లజాతివారిని సమానులుగా దృష్టించడం శ్వేతజాతీయులకు అంత సులభం కాలేదు. వాస్తవానికి, అది శ్వేతజాతీయులకు, నల్లజాతివారికి ఇద్దరికీ కూడా వారి సహోదరత్వాన్ని పరీక్షించే సమయము.
సంతోషంగా, మొత్తం మీద, మన సంఘాల్లో ఐక్యతకు అద్భుతమైన ప్రతిస్పందన లభించింది. జాతి అహంభావం గురించి శతాబ్దాల నుండి జాగ్రత్తగా ఉపదేశించబడిన దృక్పథాలు వెంటనే సమసిపోలేదు. అయినా ఐక్యత ప్రారంభమైనప్పుడు, దాన్ని మన సహోదరులు చక్కగా స్వాగతించారు, అనేకులు కలవగలిగినందుకు ఆనందించారు.
ఆసక్తిదాయకంగా, సాక్షులు కానివారు కూడా మన సంఘాల ఐక్యతతో సహకరించారు. ఉదాహరణకు, అలబామా నందలి లానెట్‌లో, నల్లజాతివారు కూటాలకు రావడం మీకు అభ్యంతరమా అని రాజ్యమందిరం సమీపంలో ఉన్న పొరుగువారిని అడగడం జరిగింది. ఒక తెల్లజాతి వృద్ధ మహిళ నల్లజాతి సహోదరునితో చెయ్యి కలిపి, యిలా చెప్పింది: “మీరు తప్పకుండా మా పొరుగునకు వచ్చి మీకిష్టమైనట్లు మీ దేవున్ని ఆరాధించుకోండి!”
ఇతియోపియాలోని నమ్మకస్థులైన సహోదరులు
న్యూయార్క్ నగరంలో, 1974లో వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ నందు ఐదున్నర నెలల మిషనరీ తర్ఫీదు నొందుటను మేము ఆనందించాము. తర్వాత మేము ఆఫ్రికా దేశమైన ఇతియోపియాకు పంపబడ్డాము. చక్రవర్తియైన హెయిలే సెలస్సీ ఆ సమయంలోనే గద్దె దించబడి, నిర్బంధంలో వుంచబడ్డాడు. మా ప్రకటన పని నిషేధింపబడింది గనుక, మన క్రైస్తవ సహోదరత్వం యొక్క సన్నిహితత్వాన్ని మేము ఆనందించాము.
సత్యారాధనను హత్తుకొని ఉన్నందున తర్వాత చెరసాలలో వేయబడిన అనేక మందితో మేము కలిసి జీవించి, సేవచేసాము. కొంతమంది మా ప్రియమైన స్నేహితులు ఉరితీయబడ్డారు కూడా. ఆడిస్ అబాబా రాజధానియైన ఇతియోపియాలోని సంఘంలో అడెరా టెషోమ్ నాతోపాటు పెద్దగా ఉన్నాడు.a మూడు సంవత్సరాలు జైలులో ఉన్నతర్వాత, ఆయన ఉరి తీయబడ్డాడు. సహజంగా, అతని భార్య ఎంతో బాధపడింది. కొన్ని సంవత్సరాల తర్వాత పయినీరుగా సేవచేస్తూ ఆమె పొందుతున్న అత్యంత ఆనందాన్ని చూడడం ఎంత సంతోషకరం!
మరో నమ్మకమైన సహోదరుడైన ఒర్కూ ఆబెబెకు ఎనిమిదిసార్లు మరణ శిక్ష విధించబడింది.* కాని ఆయన ఎన్నడూ భయపడలేదు! నేను ఆయనను చివరిసారి చూసినప్పుడు, జైలు కాపలాదారులు తుపాకికొనతో గాయపర్చిన తన చెవులను ఆయన నాకు చూపించాడు. ఆయన తమాషాగా యిలా అన్నాడు, తుపాకికొనతో దెబ్బలు తినడమే నాకు ఉదయ ఫలహారంగా, మధ్యాహ్న భోజనంగా, సాయంకాల భోజనంగా ఉండేది. ఆయన మరణించినప్పటికీ, యిప్పటికి కూడా ఆయనను సహోదరులు ప్రేమపూర్వకంగా గుర్తుచేసుకుంటారు.
నేను ఇష్టంగా గుర్తుచేసుకునే మరో సహోదరుడు, ఫైలు యామెరూ.* ఆయన తన భార్య యెడల విశేషమైన ప్రేమ కనపర్చాడు. ఆమె నిర్బంధించబడింది, ఆమె గర్భవతి త్వరలోనే ప్రసవించనైయుంది గనుక, జైలులో ఆమె స్థానాన్ని నేను తీసుకోవచ్చా అని ఫైలు చెరసాల అధికారులను అడిగాడు. తర్వాత, ఆయన తన విశ్వాసంతో రాజీపడలేనప్పుడు, ఆయన ఉరితీయబడ్డాడు.—యోహాను 15:12, 13; ఎఫెసీయులు 5:28.
ఇతియోపియాలో క్షీణించిపోతున్న రాజకీయ పరిస్థితుల మూలంగా, మేము 1976లో కెన్యాకు వెళ్లాము. కెన్యా, ఇతియోపియా, సుడాన్, సెకెల్లెస్, ఉగాండా, టాంజేనియాలతో సహా అనేక తూర్పు ఆఫ్రికా దేశాల్లోని సహోదరులను దర్శిస్తూ మేము ఏడు సంవత్సరాలు ప్రయాణ కాపరిపనిలో కొనసాగాము. ఆ దేశాల్లో మన పనిని చట్టబద్ధంగా రిజిస్టరు చేయడానికి అధికారులతో మాట్లాడే పనిలో భాగంగా కొన్ని సందర్భాల్లో నేను బురుండీ, రువాండాలకు కూడా ప్రయాణించాను.
మన పనిపై విధించబడిన నిషేధం ఎత్తివేయబడిన తర్వాత జరిగిన మొదటి జిల్లా సమావేశానికి హాజరవ్వడానికి 1992 జనవరిలో మళ్లీ ఇతియోపియాకు వెళ్లడం సంతోషకరంగా వుంది. మునుపు సహోదరులు కేవలం చిన్న గుంపులుగానే కలిశారు గనుక, అక్కడ హాజరైన 7,000 కంటే ఎక్కువమందిలో అనేకులకు ఒకరికొకరు తెలియదు. సమావేశం యొక్క ప్రతి రోజు, మన ప్రేమ పూర్వక సహోదరత్వాన్ని ఆనందించడానికి చాలామంది కార్యక్రమం ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు వచ్చి, సాయంకాలాలు ఎక్కువసేపు ఉండిపోయేవారు.
వర్గవ్యవస్థ జయించబడింది
ఆఫ్రికాలో వర్గవ్యవస్థ శతాబ్దాలుగా ప్రబలి ఉంది. ఉదాహరణకు, బురుండీ, రువాండాలలో ప్రముఖ జాతివర్గాలైన హూటూ, టూట్సీ జాతులవారు ఒకరి నొకరు ఎప్పటినుండో ద్వేషించుకున్నారు. ఈ దేశాలు బెల్జియం నుండి 1962లో స్వాతంత్ర్యం పొందేంత వరకు, రెండు జాతుల వర్గాలవారు ఒకరినొకరు ఎప్పుడూ, వేలకువేల మందిని చంపుకున్నారు. గనుక, ఈ జాతి వర్గాల సభ్యులు యెహోవాసాక్షులైన తర్వాత సమాధానంగా కలిసి పనిచేయడాన్ని చూడడం ఎంత ఆనందకరం! వారు ఒకరి యెడల ఒకరు చూపించుకొనే నిజమైన ప్రేమ బైబిలు సత్యాలు వినడానికి అనేకులను ప్రోత్సహించింది.
అలాగే, కెన్యాలోని జాతి వర్గాలవారు ఎప్పుడూ విభేదాలు కలిగివుండేవారు. కెన్యాలోని యెహోవా ప్రజల క్రైస్తవ సహోదరత్వం మధ్యన ఎంతటి వ్యత్యాసం ఉంది! వివిధ జాతి వర్గాల ప్రజలు రాజ్యమందిరాల్లో ఐక్యంగా ఆరాధించడాన్ని చూడవచ్చు. వీరిలో అనేకులు తమ జాతి విద్వేషాన్ని విడిచిపెట్టి, వేరే జాతివర్గాలకు చెందిన సహోదర సహోదరీల యెడల నిజమైన ప్రేమను కనపర్చడాన్ని చూసి నేనెంతో ఆనందించాను.
మన సహోదరత్వాన్ని బట్టి ఆనందం
దేవుని సంస్థతో 50 సంవత్సరాల నా సహవాసాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవా మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెడల కృతజ్ఞతతో నా హృదయం నిండిపోతుంది. వారు భూమిపై సాధించినదాన్ని చూడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది! దేవుని ప్రజల మధ్య పరిస్థితులు ఎల్లప్పుడూ పరిపూర్ణంగానే లేవు, నేడు కూడా అంతే. కాని వందల సంవత్సరాలుగా సాతాను లోకం నేర్పించిన జాతివైషమ్యాలను గూర్చిన బోధలు ఒక్క రాత్రిలో తుడిచివేయబడాలని నిరీక్షించలేము. ఏదిఏమైనా, మనం ఇంకా అపరిపూర్ణులమే!—కీర్తన 51:5.
నేను యెహోవా సంస్థను లోకంతో పోల్చి చూసినప్పుడు, మన నిజమైన, ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని బట్టి నా హృదయం మెప్పుతో పొంగిపొర్లిపోతుంది. నన్ను సత్యంలో పోషించిన శ్వేతజాతీయులైన క్లేవ్‌లాండ్‌లోని ఆ సహోదరులను నేను యిప్పటికీ ఇష్టంగా జ్ఞాపకం చేసుకుంటాను. దక్షిణ అమెరికాలోని మన సహోదరులు, శ్వేతజాతీయులు నల్లజాతివారు తమ పక్షపాత భావాలను విడిచిపెట్టి హృదయపూర్వక సహోదర ప్రేమను కల్గివుండడం చూసినప్పుడు, నా హృదయం ఉప్పొంగి పోయింది. తర్వాత, ఆఫ్రికాకు వెళ్లి, యెహోవా వాక్యము జాతి విద్వేషాలను తీసివేయడాన్ని చూడడం మన ప్రపంచ వ్యాప్త సహోదరత్వం యెడల నా మెప్పు యింకా పెరిగిపోయేలా చేసింది.
వాస్తవానికి, ప్రాచీనకాల రాజైన దావీదు యిలా చెప్పి దాన్ని చక్కగా వ్యక్తపర్చాడు: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”—కీర్తన 133:1.
[అధస్సూచీలు]
a అడెరా టెషోమ్ మరియు హైలు యెమూరిల చిత్రాలు యెహోవాసాక్షుల 1992 వార్షిక పుస్తకం నందలి 177 పేజీలో ఉన్నాయి; ఒర్కూ అబెబె అనుభవం 178-81 పేజీలలో ఉంది.
[23వ పేజీలోని చిత్రం]
మా అమ్మమ్మ అంత్యక్రియలు
[24వ పేజీలోని చిత్రం]
టూట్సీ మరియు హూటూ సాక్షులు సమాధానంతో కలిసి పనిచేస్తారు
[25వ పేజీలోని చిత్రం]
నా భార్య, లోయిస్‌తో