డంబాలు పలికే విషయంలో జాగ్రత్తగా ఉండండి
నేడు, డంబాలు చెప్పుకోవడం ఓ సత్ప్రవర్తన అని అనేకులు దృష్టిస్తున్నారు. ఒకరి నైపుణ్యాలనూ సామర్థ్యాలను, తాము సాధించిన వాటినీ గొప్పగా చూపుకోవడం ఫ్యాషనైపోయింది. సాధించినవాటిని గూర్చి డంబాలు చెప్పడం అవసరం అని కొందరి విశ్వాసం. ఇతరులు, అది ఒకరి స్వాభిమానాన్ని పైకెత్తుతుందని భావిస్తున్నారు. టైమ్ పత్రిక యిలా పేర్కొంటోంది: నమ్రత అనే ఆలోచన యిప్పుడు వాడుకలో ఉన్నప్పటికీ, యిప్పటికే అది పాతబడిపోయినట్లనిపిస్తోంది. రచయిత్రియైన జోడి గేలిన్ యిలా వ్యాఖ్యానిస్తుంది: “విషాదకరంగా, సిగ్గులేకుండా డంబాలు చెప్పుకోవడం . . . సరికొత్త ఫ్యాషనయ్యింది. స్నేహితులతో లేక పరిచయస్తులతో సంభాషించడం కొత్తదాన్నొకదాన్ని సాధిస్తుంది: అదే బాకా ఊదుకోవడం.”
మాదిరిగా అనుకరించబడేవారు, కొన్ని నియమాలను సృష్టించారు. బహుశా మీరు, బాక్సింగ్‌లో మునుపటి ఛాంపియన్ చెప్పిన మాటలను విని ఉండవచ్చు: “చరిత్రలోని ఈ సమయమందు ప్రపంచంలో నేనే అందరికంటే గొప్ప వ్యక్తి కావడం యాదృచ్ఛికం కాదు.” బీటిల్స్ అనే సంగీత గుంపులోని ఓ సభ్యుని వ్యాఖ్యానం కూడా ప్రఖ్యాతిగాంచిందే: “ఇప్పుడు యేసుక్రీస్తు కంటే కూడా మేమే ఎక్కువ ప్రఖ్యాతి గాంచాము.” అలాంటి వ్యాఖ్యానాలు అమాయకంగా చెప్పినవని కొందరు దృష్టిస్తే, ఆ మాటలు పలికినవారు, స్వంత గొప్పలు చెప్పుకునే విషయంలో అనుకరించదగిన ఉదాహరణలుగా పరిగణించబడుతున్నారు.
డంబాలు చెప్పడం ప్రబలి ఉండడం, ఈ ప్రశ్నను లేవదీస్తుంది: స్వంత కళలనూ సామర్థ్యాలనూ గూర్చి డంబాలు పలకడం మంచిదేనా? నిస్సందేహంగా, ఒకరు తాము సాధించినవాటిని చూసి గర్వపడడం, వాటిని తమ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోవడం సహజమే. అయితే, “మీకు ఓ సామర్థ్యం ఉంటే, దాని డప్పు కొట్టించు” అనే మాటకు అనుగుణంగా జీవించేవారి విషయమేంటి? అంతేకాకుండా, బహిరంగంగా డంబాలు చెప్పుకోకపోయినా, యితరులు తమ సామర్థ్యాలను గూర్చి తాము సాధించిన వాటిని గూర్చి తప్పకుండా తెలుసుకునేట్లు చూసుకునే వారి విషయమేంటి? కొందరు చెప్పేట్లుగా అలాంటి స్వయం ప్రకటనలు మంచివేనా, అవి అవసరమేనా?
సంబంధాలపైపడే ప్రభావం
ఇతరులు డంబాలు చెప్పుకోవడం మీపై ఎలాంటి ప్రభావాన్ని కల్గివుంటుందో ఒక్కసారి పరిశీలించండి. ఉదాహరణకు, ఈ కింది వ్యాఖ్యానాలకు మీరెలా ప్రతిస్పందిస్తారు?
“నేను రాయని పుస్తకాలు, యితరులు రాసినవాటి కంటే చాలా మెరుగు.”—పేరుగాంచిన రచయిత.
“సృష్టి సమయంలో నేను ఉండివుంటే, విశ్వాన్ని అమర్చే రీతిలో కొన్ని శ్రేష్ఠమైన ఉపయుక్తమైన సూచనలను యిచ్చివుండేవాణ్ణి.”—మధ్యయుగంలోని రాజు.
“దేవుడనేవాడు ఉండడు, ఎందుకంటే, అతను ఉంటే, నేను అతన్ని కాదన్న విషయాన్ని నమ్మలేకపోయి ఉండేవాణ్ణి.”—19వ శతాబ్దపు తత్వవేత్త.
ఈ వ్యక్తుల వ్యాఖ్యానాలవల్ల మీరు వారిని యిష్టపడతారా? వారి సహవాసాన్ని ఆనందించగలరని మీరనుకుంటున్నారా? బహుశా కాదు. సహజంగా మనఃపూర్వకంగానైనా లేక సరదాకైనా డంబాలు పలకడం, యితరులకు ప్రయాసను విసుగును బహుశా ఈర్ష్యను కలిగిస్తుంది. కీర్తన గ్రంథకర్తయైన ఆసాపు మీద కూడా యిదే ప్రభావం ఉండేది, ఆయన యిలా ఒప్పుకున్నాడు: “గర్వించువారిని బట్టి నేను మత్సరపడితిని.” (కీర్తన 73:3) తప్పకుండా, మన స్నేహితులు, సహవాసులలో చెడు భావాలు కలిగేలా చేయాలని మనమెవ్వరమూ కోరుకోము! మొదటి కొరింథీయులు 13:4 యిలా చెబుతోంది: “ప్రేమ డంబముగా ప్రవర్తింపదు.” దైవిక ప్రేమ, యితరుల భావాల యెడల మన శ్రద్ధ, మనం మన నైపుణ్యాలు, సామర్థ్యాల విషయంలో గొప్పలు చెప్పుకోకుండా నివారిస్తుంది.
ఒక వ్యక్తి తన్ను తాను అదుపులో పెట్టుకుని నమ్రతగా మాట్లాడినపుడు, తన చుట్టూ ఉన్న యితరులు సౌఖ్యంగానూ, తమను గూర్చి తాము మంచిగానూ భావించుకునేలా చేస్తాడు. ఇది అమూల్యమైన సామర్థ్యము. బహుశా, బ్రిటీష్ రాజనీతిజ్ఞుడైన లార్డ్ చెస్టర్‌ఫీల్డ్ తన కుమారున్ని యిలా ఉపదేశించినప్పుడు ఆయన మనస్సులో అదే ఉండి ఉంటుంది: “నీకు వీలైతే యితరులకంటే జ్ఞానవంతుడవవ్వు; కానీ అలాగని వారితో చెప్పకు.”
ప్రజలందరికీ ఒకే విధమైన సామర్థ్యాలుండవు. ఒకరు సులభంగా చేయగల్గిన పని మరొకరు చేయలేరు. ప్రేమ, తనకు ఏ రంగాల్లో సామర్థ్యముందో అవి లేని వారి యెడల అతను దయాపూర్వకంగా వ్యవహరించేట్లు చేస్తుంది. బహుశ, ఎదుటి వ్యక్తి మరో రంగంలో సామర్థ్యాన్ని కల్గి ఉండవచ్చు. అపొస్తలుడైన పౌలు మనకు యిలా చెప్పాడు: “తన్ను తాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.”—రోమీయులు 12:3.
డంబాలు పలకడం బలహీనతనుండి పుట్టుకొస్తుంది
డంబాలు చెప్పుకునేవారు ఉన్నప్పుడు తాము తక్కువగా భావించుకుంటామని కొందరు వారికి దూరంగా ఉంటారు, అయితే కొందరు వేరుగా ప్రతిస్పందిస్తారు. డంబాలు పలికే వారికి భద్రత లేదని తేల్చిచెబుతారు. రచయితయైన ఫ్రాంక్ ట్రిప్పెట్, తన స్వంత డబ్బాను తానే కొట్టుకునే వ్యక్తి తన అభిమానాన్ని యితరుల ఎదుట ఎందుకు పోగొట్టుకుంటాడో యిలా వివరించారు: “డంబాలు పలకడం, దయనీయమైన వ్యక్తిగత బలహీనతయని తమ హృదయాంతరాల్లో అందరికీ తెలుసు.” అనేకులు, డంబాలు చెప్పుకునే వాని మేలిముసుగు గుండా చూడగలరు గనుక, గాలికి కొట్టుకుపోయే స్వయం ఘనత నుండి వైదొలగడం వివేకయుక్తం కాదా?
“కానీ అది నిజం!”
అలాగని కొందరు తమ స్వయం మహిమను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని విషయాల్లో నిజంగానే వారికి సామర్థ్యం ఉంది గనుక, లేనట్లు ప్రవర్తించడం వేషధారణ అవుతుందని వారు భావిస్తారు.
అయితే వారి డంబం నిజమైందేనా? తనను తాను గొప్పగా ఎంచుకోవడం, వ్యక్తిగత అభిప్రాయాలు భావాలపై ఆధారపడి ఉంటుంది. ఎంతో విశిష్టమైన సామర్థ్యమని మనం అనుకునేది, యితరుల కంటికి సామాన్యంగా కనిపించవచ్చు. ఓ వ్యక్తి తన సామర్థ్యాలను గూర్చి డంబాలు చెప్పుకోడానికి బలవంతం చేయబడుతున్నట్లు భావించడం, అది అంతపెద్ద సామర్థ్యం కాదని, అంటే, దాన్ని గూర్చి చెప్పుకోకుండా విడిగా అది గమనించదగినంత గొప్ప విషయం కాదని కూడా సూచిస్తుంది. “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను,” అని బైబిలు అన్నప్పుడు, స్వయం అంచనా విషయంలో మానవ దృక్పథాన్ని అది హెచ్చరిస్తుంది.—1 కొరింథీయులు 10:12.
ఒక మనిషికి నిజంగానే ఒక రంగంలో అనూహ్యమైన కళ ఉండడం, డంబాలు చెప్పుకోవడంలో తప్పులేదని చూపుతుందా? లేదు. ఎందుకంటే, డంబాలు చెప్పుకోవడం మానవులను ఘనపరుస్తుంది, అయితే మనకున్న ఏ సామర్థ్యాలైనా దేవున్నుండి వచ్చినవే. ఆయనే ఘనతను పొందాలి. పుట్టుకతో మనకు వచ్చినదాన్ని చూసి మనం ఎందుకు గర్వపడాలి? (1 కొరింథీయులు 4:7) అంతేకాకుండా, మనకు సామర్థ్యాలున్నట్లే మనకు బలహీనతలు కూడా ఉన్నాయి. అయితే న్యాయంగా, మన తప్పులకు లోపాలకు కూడా అవధానాన్ని ఆకర్షించాలా? డంబాలు చెప్పుకునే వారిలో కొందరు మాత్రమే అలా ఆలోచిస్తారు. జ్ఞాపకముంచుకోండి, హేరోదు అగ్రిప్పా I నిజంగానే చక్కటి సామర్థ్యంగల ప్రసంగీకుడు అయ్యుండవచ్చు. అయితే అతనికి నమ్రత లేని కారణంగా అతి ఘోరంగా మరణించాడు. ఆ అసహ్యమైన సంఘటన, అహంభావము దేవునికి అంతేకాక అనేకమంది మానవులకూ ఎంత అప్రీతికరమో చూపుతోంది.—అపొస్తలుల కార్యములు 12:21-23.
ప్రతిభా సామర్థ్యాలు స్వయం ప్రకటన అవసరం లేకుండానే నలుగురికీ తెలుస్తాయి. ఇతరులు వారి లక్షణాలనూ సాధించినవాటిని గుర్తించి, వారిని మెచ్చుకున్నపుడు, అది దాన్ని పొందేవానిపై మరింత ఘనంగా ప్రతిబింబిస్తుంది. సామెతలు 27:2 జ్ఞానయుక్తంగా యిలా అంటుంది: “నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.”
సాధించడానికి అవసరమా?
పోటీగల నేటి సమాజంలో, నమ్మకంతో కూడిన గొప్పలు చెప్పుకోవడం అవసరమని కొందరు చెబుతున్నారు. వారి సామర్థ్యాలను గూర్చి మాట్లాడకుండా, ప్రకటించకుండా ఉంటే అవి గమనించబడకుండా మెప్పు పొందకుండా మిగిలిపోతాయని వారు బాధపడుతున్నారు. వోగ్ పత్రిక నుండి తీసుకున్న వ్యాఖ్యానం వారి శ్రద్ధకు ప్రాతినిధ్యం వహిస్తోంది: “ఒకనాడు నమ్రత ఓ సద్గుణం అని మనం నేర్చుకున్నాం, ఈనాడు, మౌనం ఓ లోపం కాగలదని నేర్చుకుంటున్నాము.”
ఈ లోక నియమాల ప్రకారం అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి, ఈ శ్రద్ధ ప్రాముఖ్యమైంది కావచ్చు. కానీ క్రైస్తవుని పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. దేవుడు, అహంకారులను కాదుగానీ వినయులైనవారి సామర్థ్యాలను ఉపయోగించుకోడానికి ఎన్నుకుంటాడు, వారిపై శ్రద్ధ కనపరుస్తాడు. కాబట్టి, క్రైస్తవుడు స్వయం స్తుతి తంత్రాలను ఆశ్రయించనవసరం లేదు. నిజమే, అతి నమ్మకంగల వ్యక్తి, అదిరించి మాట్లాడి, లేక నేర్పుతో తాత్కాలిక ప్రతిష్టను సంపాదించుకోవచ్చు. అయితే, సమయం వచ్చినప్పుడు అతను బయల్పర్చబడి, తగ్గించబడి, అవమానించబడతాడు కూడా. ఇది యేసు పేర్కొన్నట్లుగా ఉంటుంది: “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”—మత్తయి 23:12; సామెతలు 8:13; లూకా 9:48.
నమ్రతను బట్టి కలిగే ప్రయోజనాలు
రాల్ఫ్ వాల్‌డో ఎమర్సన్ యిలా రాశాడు: “నేను కలిసే ప్రతి మనిషి నాకంటే ఏదో ఒక రీతిలో గొప్పవాడే. అందుకని నేను అతన్నుండి నేర్చుకుంటాను.” ఆయన చేసిన వ్యాఖ్యానం, “కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచు”కోవాలని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకిచ్చిన దైవప్రేరేపిత ఉద్బోధతో ఏకీభవిస్తుంది. (ఫిలిప్పీయులకు 2:3) ఈ నమ్రతతో కూడిన దృక్కోణం, ఒకరిని యితరుల నుండి నేర్చుకునే స్థానంలో ఉంచుతుంది.
కనుక మీ సామర్థ్యమే మీ బలహీనత కాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాలనూ మీరు సాధించినవాటినీ డంబాలతో అపనిందపాలు చేయకండి. మీ సద్గుణాలకు నమ్రత అనే లక్షణాన్ని చేర్చండి. ఇతరుల దృష్టిలో ఒకరి అభిమానాన్ని నిజంగా పెంచేది యిదే. అది, ఒకరు తమ తోటి మానవులతో మరి శ్రేష్ఠమైన సంబంధాలను కల్గివుండడానికి, యెహోవా దేవుని అంగీకారాన్ని పొందడానికి సహాయపడుతుంది.—మీకా 6:8; 2 కొరింథీయులు 10:18.