కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/1 పేజీలు 13-18
  • యెహోవా యందు ఆనందించుడి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా యందు ఆనందించుడి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆనందించడం—ఎందుకు, ఎలా?
  • ఆనందించడానికి లెక్కలేనన్ని కారణాలు
  • ప్రకటన పని—భారమైనదా లేక ఆనందదాయకమైనదా?
  • మనం కలిసి సంతోషిద్దాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • రాజ్య నిరీక్షణయందు సంతోషించుడి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవాను హృదయానందముతో సేవించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవాను గూర్చిన ఆనందమే మన ఆశ్రయదుర్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/1 పేజీలు 13-18

యెహోవా యందు ఆనందించుడి!

“ఎల్లప్పుడును ప్రభువు నందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.”—ఫిలిప్పీయులు 4:4.

1. క్రైస్తవులు ఎల్లప్పుడూ ఆనందించాలని చెప్పినప్పుడు పౌలు భావమేమిటా అని మనమెందుకు ఆశ్చర్యపోవచ్చు?

ఈ రోజుల్లో, ఆనందించడానికి కారణాలు చాలా కొద్దిగా, చాలా అరుదుగా ఉన్నట్లు కన్పించవచ్చు. మంటివారైన మనుష్యులు, చివరికి నిజక్రైస్తవులు కూడా, నిరుద్యోగం, అనారోగ్యం, ప్రియమైనవారి మరణం, వ్యక్తిత్వ సమస్యలు, లేక అవిశ్వాసులైన కుటుంబ సభ్యుల నుండి లేక పాత స్నేహితుల నుండి వచ్చే వ్యతిరేకత వంటి దుఃఖాన్ని కలిగించే పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. గనుక “ఎల్లప్పుడు . . . ఆనందించుడి” అనే పౌలు సలహాను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనమందరం పోరాడవలసిన అసంతోషకరమైన, కష్టతరమైన పరిస్థితుల దృష్ట్యా, ఇది అసలు సాధ్యమేనా? ఈ మాటల సందర్భాన్ని గూర్చిన చర్చ ఆ విషయాన్ని స్పష్టపర్చడానికి సహాయపడుతుంది.

ఆనందించడం—ఎందుకు, ఎలా?

2, 3. యేసు మరియు ప్రాచీన ఇశ్రాయేలీయుల విషయంలో వివరించబడినట్లుగా, ఆనందం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

2 “ఎల్లప్పుడును ప్రభువు నందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.” ఇది 24 శతాబ్దాల క్రితం ఇశ్రాయేలీయులకు చెప్పబడిన మాటలను మనకు గుర్తుచేయవచ్చు: “యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు,” లేదా మొఫాట్‌ అనువాదం ప్రకారం: “నిత్యుని యందు ఆనందించుట మీకు బలము.” (నెహెమ్యా 8:10) ఆనందం బలాన్నిస్తుంది, అది ఓదార్పు భద్రతల కొరకు ఒకరు వెళ్లగల రక్షణ దుర్గమువంటిది. పరిపూర్ణ మానవుడైన యేసు సహితం సహించుకొనుటకు సహాయం చేయడంలో ఆనందం ఒక పరికరంగా ఉంది. “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీయులు 12:2) స్పష్టంగా, కష్టాలు వచ్చినప్పుడు ఆనందించగలగడమన్నది రక్షణ కొరకు ప్రాముఖ్యము.

3 వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు, ఇశ్రాయేలీయులకు యిలా ఆజ్ఞాపించబడింది: “నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింపవలెను.” ఆనందంతో యెహోవాను సేవించుటలో విఫలమైతే వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. “నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా . . . నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు.”—ద్వితీయోపదేశకాండము 26:11; 28:45-47.

4. మనం ఆనందించడానికి ఎందుకు విఫలమౌతాము?

4 గనుక, నేటి అభిషక్త శేషము, వారి సహవాసులైన “వేరే గొర్రెలు” ఆనందించడమన్నది అనివార్యమైనది! (యోహాను 10:16) “మరల చెప్పుదును” అని పౌలు తన సలహాను పునరుద్ఘాటించడం ద్వారా, యెహోవా మనకు చేసిన మంచి అంతటిని బట్టి ఆనందించే ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. మనం ఆనందిస్తున్నామా? లేక ఆనందించడానికి మనకున్న అనేక కారణాలను కొన్నిసార్లు మరచిపోయేలా, జీవితంలోని అనుదిన కార్యకలాపాల్లో మునిగి ఉంటున్నామా? రాజ్యాన్ని, దాని ఆశీర్వాదాలను గూర్చిన మన దృష్టిని అడ్డగించేంతగా సమస్యలు పెరిగిపోతున్నాయా? దేవుని సూత్రాలకు అవిధేయత చూపించడం, దైవిక సూత్రాలను అలక్ష్యం చేయడం, లేక క్రైస్తవ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వంటి యితర విషయాలు మన నుండి మన ఆనందాన్ని తీసివేయడానికి మనం అనుమతిస్తామా?

5. అయుక్తమైన వ్యక్తికి ఆనందించడం ఎందుకు కష్టమౌతుంది?

5 “మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.” (ఫిలిప్పీయులు 4:5) అయుక్తమైన వ్యక్తికి సమతుల్యత ఉండదు. అనవసరంగా తన శరీరాన్ని ఒత్తిడి లేక క్షోభకు గురిచేస్తూ, అతడు తన ఆరోగ్యాన్ని గూర్చి సరైన శ్రద్ధ తీసుకోవడంలో విఫలంకావచ్చు. బహుశా అతడు తన హద్దులను అంగీకరించి, వాటికి అనుగుణ్యంగా జీవించడం నేర్చుకోలేదు. అతడు తన గమ్యాలను మరీ ఉన్నతంగా ఉంచుకొని, మూల్యమెంతైనప్పటికీ వాటిని చేరడానికి ప్రయత్నిస్తుండవచ్చు. లేదా అతడు చురుకుదనాన్ని కోల్పోవడానికి లేదా అశ్రద్ధగా తయారగుటకు తన హద్దులను సాకులుగా ఉపయోగించుకొనవచ్చు. ఏమైనప్పటికీ, సమతుల్యత లేకపోవడం; అయుక్తంగా ఉండడం వల్ల, ఆనందించడం అతనికి కష్టమనిపిస్తుంది.

6. (ఎ) తోటి క్రైస్తవులు మనలో ఏమి చూడాలి, అలా ఎప్పుడు జరుగుతుంది? (బి) 2 కొరింథీయులు 1:24 మరియు రోమీయులు 14:4 నందలి పౌలు మాటలు సహేతుకంగా ఉండడానికి మనకెలా సహాయం చేస్తాయి?

6 వ్యతిరేకులు మనల్ని మతమూఢులుగా దృష్టించినప్పటికీ, తోటి క్రైస్తవులు ఎప్పుడూ మన సహేతుకతను చూడగల్గాలి. మనం సమతుల్యత కల్గివుండి, మన నుండిగాని లేదా యితరుల నుండి గాని మనం పరిపూర్ణతను ఆశించకుంటే వారు మనల్ని అలాగే చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా, మనం దేవుని వాక్యం కోరేవాటికంటే అధిక భారములను ఇతరులపై పెట్టకుండా ఉండాలి. అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము.” (2 కొరింథీయులు 1:24) ఒకప్పుడు పరిసయ్యునిగావున్న పౌలుకు, అధికారంలో ఉన్నవారిచే విధించబడే కఠినమైన కట్టడలు ఆనందాన్ని నిర్మూలిస్తాయని, అయితే తోటి పనివారు యిచ్చే సహాయకరమైన సలహాలు దాన్ని అధికం చేస్తాయని బాగా తెలుసు. “ప్రభువు సమీపంలో ఉన్నాడు” అనే వాస్తవం, మనం ‘పరుని సేవకునికి తీర్పు తీర్చకూడదని. అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే’ అని సహేతుకమైన వ్యక్తికి గుర్తుచేయాలి.—రోమీయులు 14:4.

7, 8. సమస్యలు వస్తాయని క్రైస్తవులు ఎందుకు ఎదురు చూడాలి, అయినా ఆనందించడంలో కొనసాగడం వారికెలా సాధ్యము?

7 “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” (ఫిలిప్పీయులు 4:6) నేడు మనం పౌలు వ్రాసిన “అపాయకరమైన కాలా”ల్లో జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1-5) గనుక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని క్రైస్తవులు ఎదురుచూడవలసిందే. ఒక యథార్థ క్రైస్తవుడు అప్పుడప్పుడు నిరాశ లేక నిరుత్సాహపడాల్సి వస్తుందేమోనన్న సాధ్యతను “ఎల్లప్పుడు . . . ఆనందించుడి” అనే పౌలు మాటలు త్రోసిపుచ్చడంలేదు. పౌలు స్వంత విషయంలోనే, ఆయన వాస్తవంగా యిలా అంగీకరించాడు: “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.” (2 కొరింథీయులు 4:8, 9) అయినను, ఒక క్రైస్తవుని ఆనందం, తాత్కాలికంగా వుండే చింత మరియు దుఃఖాన్ని తగ్గించి, చివరికి వాటిని అధిగమిస్తుంది. ఆనందించడానికున్న అనేక కారణాలను మనం ఎన్నడు మరచిపోకుండా, ముందుకు కొనసాగడానికి అవసరమయ్యే బలాన్ని అది చేకూరుస్తుంది.

8 సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, అవి ఎటువంటివైనా, ఆనందంగల క్రైస్తవుడు ప్రార్థన ద్వారా వినయంగా యెహోవాను సహాయం కోరతాడు. అతడు తీవ్రంగా చింతించడు. సమస్యను పరిష్కరించడానికి అతడు సహేతుకంగా చేయగలిగినదంతా చేసిన తర్వాత, ఈ క్రింది ఆహ్వానంతో పొందికగా ఫలితాన్ని యెహోవా చేతుల్లో విడిచిపెడతాడు: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.” అదే సమయంలో, క్రైస్తవుడు యెహోవా మంచితనమంతటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడంలో కొనసాగుతాడు.—కీర్తన 55:22; మత్తయి 6:25-34 కూడా చూడండి.

9. సత్యాన్ని గూర్చిన జ్ఞానం సమాధానాన్ని ఎలా యిస్తుంది, యిది ఒక క్రైస్తవునిపై ఏ మంచి ప్రభావాన్ని కలుగజేస్తుంది?

9 “అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:7) బైబిలు సత్యాలను గూర్చిన జ్ఞానం క్రైస్తవుని మనసులోని వ్యర్థతను తీసివేసి, ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోడానికి అతనికి సహాయం చేస్తుంది. (2 తిమోతి 1:13) అలా, యితరులతో శాంతియుత సంబంధాలను పాడుచేసే తప్పుడు లేక అజ్ఞానయుక్తమైన ప్రవర్తనను విసర్జించడానికి అతనికి సహాయం లభిస్తుంది. అన్యాయం మరియు దుష్టత్వాన్నిబట్టి నిరాశ చెందే బదులు, అతడు రాజ్యం ద్వారా మానవజాతి సమస్యల పరిష్కారానికి యెహోవాపై నమ్మకముంచుతాడు. అలాంటి సమాధానం అతని హృదయాన్ని కాపాడి, అతని ఉద్దేశాలను పవిత్రంగా వుంచి, అతని ఆలోచనా విధానాన్ని నీతియుక్తమైన మార్గంలో నడిపిస్తుంది. గలిబిలిగావున్న లోకం ద్వారా సమస్యలు, ఒత్తిడులు వచ్చినప్పటికీ పవిత్రమైన ఉద్దేశాలు మరియు సరైన ఆలోచనా విధానం తిరిగి, ఆనందించడానికి లెక్కలేనన్ని కారణాలను దయచేస్తాయి.

10. దేని గురించి మాట్లాడడం, ఆలోచించడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందాన్ని అనుభవించవచ్చు?

10 “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.” (ఫిలిప్పీయులు 4:8) ఒక క్రైస్తవుడు చెడు విషయాలను గూర్చి మాట్లాడడంలో లేదా ఆలోచించడంలో ఆనందించడు. అదే స్వయంగా లోకం అందించే వినోదంలో అధిక భాగాన్ని విసర్జిస్తుంది. అబద్ధాలు, మూర్ఖమైన పరిహాసాలు, అవినీతి, దుర్నీతి, రమ్యముగా లేనటువంటి, ద్వేషించదగిన, అసహ్యమైన విషయాలతో తన మనస్సును, హృదయాన్ని నింపుకుంటే ఏ ఒక్కరూ క్రైస్తవ ఆనందాన్ని కాపాడుకోలేరు. స్పష్టంగా చెప్పాలంటే, తన మనస్సును, హృదయాన్ని అసహ్యమైనవాటితో నింపుకోవడం ద్వారా ఎవరూ కూడా నిజమైన ఆనందాన్ని కనుగొనలేరు. కలుషితమైన సాతాను లోకంలో, క్రైస్తవులకు ఆలోచించడానికి చర్చించడానికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరమైనది!

ఆనందించడానికి లెక్కలేనన్ని కారణాలు

11. (ఎ) దేన్ని తక్కువగా అంచనా వేయకూడదు, ఎందుకు? (బి) అంతర్జాతీయ సమావేశ హాజరు ఒక ప్రతినిధిపై, ఆయన భార్యపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది?

11 ఆనందించడానికి గల కారణాలను గూర్చి మాట్లాడుతున్నప్పుడు, మనం మన అంతర్జాతీయ సహోదరత్వాన్ని మరచిపోకూడదు. (1 పేతురు 2:17) లోకసంబంధమైన జాతీయ, జాతి వర్గాలవారు ఒకరి యెడల ఒకరు తీవ్రమైన ద్వేషాన్ని వ్యక్తపర్చుకుంటుండగా, దేవుని ప్రజలు ప్రేమలో సన్నిహితమౌతారు. వారి ఐక్యత ప్రాముఖ్యంగా అంతర్జాతీయ సమావేశాల్లో కనిపిస్తుంది. యుక్రేయిన్‌ నందలి కీవ్‌లో, 1993లో జరిగిన సమావేశంలో, అమెరికా నుండి వచ్చిన ప్రతినిధి ఒకరు యిలా వ్రాశారు: “ఆనంద బాష్పాలు, ప్రకాశిస్తున్న కళ్లు, కుటుంబ సభ్యులవలె యితరులను ఆలింగనం చేసుకోవడం, మైదానంలో రంగు రంగుల గొడుగులు, చేతిరుమాళ్లను గాలిలో ఊపుకోవడం ద్వారా యిరువర్గాల వారు అందజేసుకున్న అభినందనలు యివన్నీ దైవపరిపాలనా ఐక్యతను గూర్చి స్పష్టంగా తెలియజేశాయి. ప్రపంచ వ్యాప్త సహోదరత్వం ద్వారా యెహోవా అద్భుతరీతిగా సాధించిన దాన్నిబట్టి మా హృదయాలు గర్వంతో పొంగిపోతున్నాయి. ఇది నన్ను, నా భార్యను ఎంతో కదిలించి, మా విశ్వాసానికి కొత్త అర్థాన్ని యిచ్చింది.”

12. యెషయా 60:22 మన కళ్ల యెదుటనే ఎలా నెరవేర్చబడుతున్నది?

12 తమ కళ్ల ముందే బైబిలు ప్రవచనాలు నెరవేరడాన్ని చూడడం నేటి క్రైస్తవులకు విశ్వాసాన్ని ఎంత బలపర్చేదిగా ఉంటుంది! ఉదాహరణకు, యెషయా 60:22 నందలి మాటలను పరిశీలించండి: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” ఆ రాజ్యం 1914లో ఉద్భవించినప్పుడు కేవలం 5,100 మంది అంటే కొద్దిమంది మాత్రమే చురుకుగా ప్రకటిస్తున్నారు. కాని గత ఐదు సంవత్సరాలలో, సగటున ప్రతి వారం 5,628 మంది కొత్తవారు బాప్తిస్మం తీసుకోవడంతో ప్రపంచవ్యాప్త సహోదరత్వపు పరిమాణం వృద్ధిచెందుతున్నది. పంతొమ్మిది వందల తొంభై మూడులో, శిఖరాగ్రంగా 4,709,889 మంది చురుకైన ప్రచారకులయ్యారు. ఒక్కసారి ఊహించండి! అంటే 1914లో “ఒంటిరియైనవాడు” అక్షరార్థంగా “వేయిమంది” కావడానికి సిద్ధంగా ఉన్నాడని దీని భావము.

13. (ఎ) పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి ఏమి జరుగుతున్నది? (బి) 2 కొరింథీయులు 9:7 నందలి పౌలు మాటలలోని సూత్రాన్ని యెహోవాసాక్షులు ఎలా అనుసరిస్తారు?

13 పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి మెస్సీయ రాజు తన శత్రువుల మధ్య పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని, అలాగే అంతర్జాతీయ నిర్మాణ పనిని కొనసాగించడానికి సమయాన్ని, బలాన్ని, డబ్బును స్వచ్ఛందంగా యిచ్చే ఆయన అనుచరుల ద్వారా ఆయన పరిపాలనకు మద్దతు యివ్వబడింది. (కీర్తన 110:2, 3) వారి కూటాల్లో డబ్బు గురించి ఎంతో అరుదుగా చెప్పబడినప్పటికీ, స్వచ్ఛందంగా యివ్వబడిన చందాలవల్ల ఈ పనులు విజయవంతం కావడాన్ని బట్టి యెహోవాసాక్షులు ఆనందిస్తారు.a (1 దినవృత్తాంతములు 29:9 పోల్చండి.) ఇచ్చే విషయంలో నిజ క్రైస్తవులకు గ్రుచ్చి చెప్పనవసరం లేదు; వారి పరిస్థితులు అనుమతించినంత మేరకు “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము” తమ రాజుకు మద్దతునివ్వడాన్ని వారు ఆధిక్యతగా భావిస్తారు.—2 కొరింథీయులు 9:7.

14. ఆనందించడానికి ఏ కారణాన్నిస్తూ, 1919 నుండి దేవుని ప్రజల మధ్య ఏ పరిస్థితి స్పష్టమైంది?

14 దేవుని ప్రజల మధ్య పునఃస్థాపించబడే ప్రవచింపబడిన సత్యారాధన ఆత్మీయ పరదైసు సృష్టికి దారితీసింది. అది 1919 నుండి తన పరిధులను క్రమంగా విస్తృతపర్చుకొన్నది. (కీర్తన 14:7; యెషయా 52:9, 10) దాని ఫలితమేమిటి? నిజ క్రైస్తవులు “సంతోషానందము” ననుభవిస్తారు. (యెషయా 51:11) ఫలితంగా వచ్చే మంచి ఫలాలు అపరిపూర్ణ మానవుల ద్వారా దేవుని పరిశుద్ధాత్మ సాధించే దానికి నిదర్శనమై యున్నాయి. సమస్త ఘనత, గౌరవము యెహోవాకు చెందుతాయి, కాని దేవుని తోటిపని వారవ్వడం కంటే మరే గొప్ప ఆధిక్యత ఉండగలదు? (1 కొరింథీయులు 3:9) అవసరమైతే రాళ్లను సహితం సత్య సమాచారాన్ని ప్రకటించేలా చేయడానికి యెహోవా శక్తిమంతుడే. అయినప్పటికీ, ఈ పద్ధతిని అవలంభించడానికి బదులు మంటితో నిర్మింపబడినవారైన యిష్టపూర్వకంగా పనిచేసే ప్రాణులను తన చిత్తాన్ని నెరవేర్చేలా పురికొల్పడానికి ఆయన ఎంపిక చేసుకున్నాడు.—లూకా 19:40.

15. (ఎ) ఏ ఆధునిక సంఘటనలను మనం ఆసక్తితో అనుసరిస్తాము? (బి) ఏ సంఘటన కొరకు మనం ఆనందంతో ఎదురుచూస్తాము?

15 విశేషమైన బైబిలు ప్రవచనాలను వివరిస్తున్న ప్రపంచ సంఘటనలను యిప్పుడు యెహోవా సేవకులు భక్తిపూర్వకంగా గమనిస్తారు. స్థిరమైన శాంతిని నెలకొల్పడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి, కాని అది వ్యర్థమే. ప్రపంచ కష్టాల సమయంలో చర్య తీసుకొమ్మని ఐక్యరాజ్య సమితిని విజ్ఞప్తి చేయుటకు సంఘటనలు వారిని బలవంత పెడుతున్నాయి. (ప్రకటన 13:15-17) అదే సమయంలో, రోజు రోజుకు దగ్గరౌతున్నటువంటి, మునుపెన్నడు జరుగని అత్యంత ఆనందదాయకమైన సంఘటన కొరకు దేవుని ప్రజలు ఇప్పటికే ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. “గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది; ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము.”—ప్రకటన 19:7.

ప్రకటన పని—భారమైనదా లేక ఆనందదాయకమైనదా?

16. తాను నేర్చుకొన్నది అనుసరించడంలో ఒక క్రైస్తవుడు విఫలం కావడం అతని క్రైస్తవ ఆనందాన్ని ఎలా పోగొడుతుందో వివరించండి?

16 “మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.” (ఫిలిప్పీయులు 4:9) తాము నేర్చుకొన్న వాటిని అభ్యసించడం ద్వారా, క్రైస్తవులు దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి ఎదురుచూడవచ్చు. ఇతరులకు సువార్త ప్రకటించే అవసరత అనేది వారు నేర్చుకొన్న అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి. వాస్తవానికి, దాన్ని వినడంపైనే తమ జీవితాలు ఆధారపడివున్న యథార్థ హృదయులకు ఆ సమాచారాన్ని ప్రకటించకుండా ఉండడం ద్వారా ఎవరు సమాధానాన్ని, లేక ఆనందాన్ని అనుభవించగలరు?—యెహెజ్కేలు 3:17-21; 1 కొరింథీయులు 9:16; 1 తిమోతి 4:16.

17. మన ప్రకటన పని ఎల్లప్పుడు మన ఆనందానికి కారణమెందుకు కావాలి?

17 యెహోవాను గూర్చి నేర్చుకోవాలని యిష్టపడుతున్న గొఱ్ఱెవంటి వారిని కనుగొనడం ఎంతటి ఆనందాన్నిస్తుంది! సరైన దృక్పథంతో సేవచేస్తున్నవారు రాజ్య సేవ ఎల్లప్పుడూ ఆనందానికి కారణమని భావిస్తారు. ఇది ఎందుకంటే, ఆయన నామాన్ని స్తుతించి, సర్వాధికారంగల పరిపాలకునిగా ఆయన స్థానాన్ని ఉన్నతపర్చడమనేది యెహోవాసాక్షిగా ఉండుటకు ముఖ్య కారణమైనందు వల్లనే. (1 దినవృత్తాంతములు 16:31) తాను తీసుకువచ్చిన సువార్తను ప్రజలు అజ్ఞానంగా నిరాకరించినప్పటికీ ఈ వాస్తవాన్ని గుర్తించే వ్యక్తి ఆనందిస్తాడు. అవిశ్వాసులైనవారికి ప్రకటించడం ఒకరోజు ముగింపుకు వస్తుందని, యెహోవా నామాన్ని ఘనపర్చడం నిరంతరం కొనసాగుతుందని అతనికి తెలుసు.

18. యెహోవా చిత్తాన్ని చేయడానికి ఒక క్రైస్తవున్ని ఏది పురికొల్పుతుంది?

18 నిజమైన మతాన్ని అవలంభించేవారిని అది, యెహోవా కోరేవాటిని తప్పనిసరి అని చేయడానికి కాదుగాని, ఇష్టపూర్వకంగా చేయటానికి పురికొల్పుతుంది. (కీర్తన 40:8; యోహాను 4:34) చాలామందికి యిది అర్థం కావడం కష్టము. ఒక స్త్రీ తన వద్దకు వచ్చిన సాక్షితో యిలా చెప్పింది: “నేను మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీరు చేస్తున్నట్లుగా నేను నా మతాన్ని గురించి చెప్పడానికి ఇంటింటికి ఎన్నడూ వెళ్లను.” చిరునవ్వుతో సాక్షి యిలా సమాధానమిచ్చింది: “మీరెలా భావిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. నేను యెహోవాసాక్షులలో ఒకరిని కాకమునుపు, నీవు నన్ను మతాన్ని గురించి మాట్లాడడానికి యితరుల యొద్దకు వెళ్లేలా చేసివుండేదానివి కాదు. కాని యిప్పుడు నాకు ఇష్టమే.” ఆ స్త్రీ కొంతసేపు ఆలోచించి యిలా ముగించింది: “మా మతానికి లేనిది, ఇతరులకు ఇవ్వగలిగేది, ఏదొకటి మీ మతంలో ఉంది. బహుశా నేను పరిశోధించి చూడాలి.”

19. ఆనందించడానికి మునుపెన్నటికంటే యిప్పుడు ఎందుకు తగిన సమయము?

19 మన రాజ్య మందిరాల్లో ప్రముఖంగా ప్రదర్శించబడివున్న 1994వ సంవత్సరపు సంవత్సరవచనం, మనకు ఎప్పుడూ యిలా గుర్తు చేస్తుంది: “నీ పూర్ణహృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము.” (సామెతలు 3:5) మనం ఆశ్రయం పొందే మన రక్షణ దుర్గమైన యెహోవా యందు విశ్వాసముంచడాన్ని బట్టి ఆనందించడం కంటే గొప్ప కారణం మనకు ఉండగలదా? కీర్తన 64:10 యిలా వివరిస్తుంది: “నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు.” యిది సంకోచించడానికి, నిరాశ చెందడానికి సమయం కాదు. హేబెలు కాలంనాటి నుండి యెహోవా సేవకులు చూడాలని కాంక్షించిన వాస్తవానికి, గడుస్తున్న ప్రతి నెల మనల్ని దగ్గర చేస్తుంది. ఆనందించడానికి మనకు మునుపెన్నడూ యింతకంటే ఎక్కువ కారణాలు లేవని తెలుసుకుని, మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచడానికి యిదే సమయము!

[అధస్సూచీలు]

a సమావేశాల్లో, నెలకొకసారి సంఘాల్లో, స్వచ్భంద విరాళాలు ఎంత వచ్చినది, ఎంత ఖర్చయినది సూచిస్తూ క్లుప్తంగా వ్యాఖ్యానించబడుతుంది. అలాంటి విరాళాలు ఎలా ఉపయోగించుకొనబడుతున్నాయో తెలుపుతూ అప్పుడప్పుడు ఉత్తరాలు పంపబడతాయి. ఆ విధంగా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పని యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ఒక్కరికి గుర్తు చేయబడుతుంది.

మీరెలా సమాధానమిస్తారు?

◻ నెహెమ్యా 8:10 ప్రకారం మనమెందుకు ఆనందించాలి?

◻ ద్వితీయోపదేశకాండము 26:11 మరియు 28:45-47 ఆనందించడం యొక్క ప్రాముఖ్యతను ఎలా చూపిస్తున్నాయి?

◻ ఎల్లప్పుడు ఆనందించడానికి ఫిలిప్పీయులు 4:4-9 వచనాలు మనకు ఎలా సహాయం చేస్తాయి?

◻ మనం ఆనందించడానికి 1994 సంవత్సర వచనం మనకు ఏ కారణాన్నిస్తున్నది?

[16వ పేజీలోని చిత్రం]

అంతర్జాతీయ సహోదరత్వంలో భాగమైయుండుటకు రష్యా మరియు జర్మను సాక్షులు ఆనందిస్తారు

[17వ పేజీలోని చిత్రం]

సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం ఆనందించడానికి ఒక కారణము

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి