పెద్దలు మరియు పరిచారకుల మధ్య అనుగుణ్యతను కాపాడుకొనుట
పెంతెకొస్తు సా. శ. 33 తర్వాత వెంటనే కొంతకాలానికి క్రొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘములో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. అవసరంలో ఉన్న విధవరాండ్రను గూర్చి శ్రద్ధ తీసుకోవడానికి ఒక ఏర్పాటు చేయబడింది. కాని కొంత కాలం తర్వాత “అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.”—అపొస్తలుల కార్యములు 6:1.
ఈ ఫిర్యాదులు అపొస్తలుల చెవులను చేరాయి. “అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి—మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;” అని వారితో చెప్పారు.—అపొస్తలుల కార్యములు 6:2, 3.
ఇది క్రైస్తవ సంఘములో ఉండవలసిన సంస్థీకరణ యొక్క ప్రాముఖ్యమైన సూత్రాన్ని వివరిస్తుంది. ఇతరులు బరువైన ఆత్మీయ విషయాల యెడల శ్రద్ధ వహిస్తూ ఉండగా, కొంతమంది బాధ్యతగల వ్యక్తులు రోజువారీ విషయాలను చూడడానికి ఉపయోగించబడ్డారు. ఇది నూతనంగా ఏర్పడిన పద్ధతేమి కాదు. ప్రాచీన ఇశ్రాయేలులో, అహరోను అతని సంతానం వారు దేవునికి బలులు అర్పించడానికి యాజకులుగా నియమింపబడ్డారు. అయితే ‘మందిరపు సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని’ గూర్చి శ్రద్ధ వహించడంలో లేవీయులు వారికి సహాయం చేయాలని యెహోవా తెలియజేశాడు. (సంఖ్యాకాండము 3:5-10) అలాగే, నేడు అధ్యక్షులకు పరిచారకులు సహాయం చేస్తారు.
పెద్దలు మరియు పరిచారకుల పాత్ర
పెద్దలు మరియు పరిచారకులు ఉన్నతమైన యోగ్యతలు కలిగి ఉండాలని లేఖనాలు చూపుతున్నాయి. (1 తిమోతి 3:1-10, 12, 13; తీతు 1:6-9) వారు పోటీదారులు కాదుగాని సంఘాన్ని నిర్మించడమనే ఒకే లక్ష్యం కొరకు పనిచేస్తారు. (ఎఫెసీయులు 4:11-13 పోల్చండి.) అయినప్పటికీ, సంఘములో వారు నిర్వహించే పనులలో కొన్ని తేడాలు ఉన్నాయి. మొదటి పేతురు 5:2 నందు అధ్యక్షులకు యిలా చెప్పబడింది: “బలిమిచేతకాక దేవుని చిత్తప్రకారము యిష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.” ఈ పరిశుద్ధ బాధ్యతను ఎలా నిర్వహిస్తారనుటలో వారు దేవునికి లెక్క ఒప్పజెప్పవలసి ఉంది.—హెబ్రీయులు 13:17.
పరిచారకుల మాటేమిటి? వారు బోధించే తమ సామర్థ్యంలో యోగ్యులై వుండాలని లేఖనాలు కోరడం లేదు. వారి బాధ్యతలు పెద్దల బాధ్యతల నుండి కొంత వేరుగా ఉన్నాయి. సా. శ. మొదటి శతాబ్దంలో, శ్రద్ధ చూపించవలసిన వస్తుసంబంధమైనవి, రోజువారీవి, లేక యాంత్రికమైనవి, బహుశ లేఖనాలను ఎత్తి వ్రాయడానికి వస్తువులను కొనడం లేక ఎత్తి వ్రాయడం వంటి వాటితో సహా నిస్సందేహంగా ఎన్నో పనులు ఉండేవి.
నేడు పరిచారకులు సంఘ జమా లెక్కలను, సేవాప్రాంతాన్ని చూడడం, పత్రికలు, పుస్తకాలు పంచిపెట్టడం, రాజ్యమందిరాన్ని గురించి శ్రద్ధ వహించడం వంటి వివిధ ముఖ్యమైన పనులను నెరవేర్చడంలో కొనసాగుతారు. సామర్థ్యంగల కొంతమంది పరిచారకులను బోధించడం, కొన్నిసార్లు సంఘ పుస్తక పఠనాన్ని నిర్వహించడం, సేవా కూటమిలో భాగం నిర్వహించడం, బహిరంగ ప్రసంగాలివ్వడం వంటి వాటిలోనూ ఉపయోగించుకొనవచ్చును.
పెద్దలు, పరిచారకులు అనుగుణ్యతతో కలిసి పనిచేసినప్పుడు, సంఘ ఆత్మీయ మరియు సంస్థాపరమైన అవసరతలను గూర్చి సమతూకమైన విధంగా శ్రద్ధ తీసుకొనబడటం జరుగుతుంది. అప్పుడు సంఘ సభ్యులు సంతోషంగా, దృఢంగా, ఆత్మీయరీతిగా ఫలవంతంగా ఉంటారు. ఎఫెసులోని అభిషక్తులకు పౌలు ఏమి వ్రాశాడో గుర్తుచేసుకోండి: “తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.”—ఎఫెసీయులు 4:16.
పెద్దలు మరియు పరిచారకులు కూడా అలాంటి అనుగుణ్యతనే అంటే అంగీకారం, సమ్మతి, సహకారం, ఐక్యతను పెంపొందింప జేసుకోవడానికి కృషిచేయాలి. అయితే, అలాంటి అనుగుణ్యత యాదృచ్ఛికంగా రాదు. దాన్ని అలవర్చుకొని, జాగ్రత్తగా కాపాడుకోవాలి.
పెద్దలు ఏమి చేయగలరు
ఒక ముఖ్యమైన యత్నం ఏమనగా, పెద్ద మరియు పరిచారకుని సంబంధం, యజమాని దాసుడు లేక యజమాని ఉద్యోగి సంబంధం వంటిది కాదని తెలుసుకోవడం. నిజమైన అనుగుణ్యత ఉంటే, పెద్దలు పరిచారకులను తమ తోటి దేవుని పరిచారకులుగా దృష్టిస్తారు. (1 కొరింథీయులు 3:6-9 పోల్చండి.) రోమీయులు 12:10 “ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని చెబుతుంది. కాబట్టి పెద్దలు పరిచారకులను కించపర్చే విధంగా లేక హీనపర్చే విధంగా చూడకూడదు. వారి సరైన చొరవను త్రొక్కిపెట్టే బదులు ప్రోత్సహిస్తారు. పరిచారకులను గౌరవంతో చూడడం వారిలోనున్న శ్రేష్టమైనదాన్ని వెలికి తీసి, సంఘంలో తమ పనిని బట్టి వారు ఆనందించటానికి సహాయం చేస్తుంది.
తమ కాపుదల క్రిందనున్న దేవుని మందను కాసే తమ బాధ్యత క్రిందికి పరిచారకులుగా ఉన్న సహోదరులు కూడా వస్తారని పెద్దలు గుర్తుంచుకోవాలి. నిజమే, అలాంటి బాధ్యతాయుతమైన పురుషులు పరిపక్వతకెదిగిన క్రైస్తవులై ఉండాలి. అయినా, మిగతా మందవలెనే వారికి ఎప్పటికప్పుడు వ్యక్తిగత శ్రద్ధ అవసరమౌతుంది. పెద్దలు వారి ఆత్మీయ అభివృద్ధి గురించి అత్యాసక్తి కలిగివుండాలి.
ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు యౌవనుడైన తిమోతిని కలిసినప్పుడు, ఆయన వెంటనే తిమోతి సామర్థ్యాన్ని గ్రహించి “అతడు తనతోకూడ బయలుదేరి రావలెనను” కోరిక వ్యక్తపర్చాడు. (అపొస్తలుల కార్యములు 16:3.) తిమోతి పౌలు ప్రయాణ సహచరునిగా సేవచేశాడు, ఫలితంగా అమూల్యమైన తర్ఫీదు పొందాడు. అంతెందుకు, కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు కొరింథులోని క్రైస్తవులకు యిలా వ్రాశాడు: “ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీయొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును . . . మీకు జ్ఞాపకము చేయును.”—1 కొరింథీయులు 4:17.
పెద్దలారా, మీ సంఘంలోని పరిచారకుల పూర్తి సామర్థ్యాన్ని మీరు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారా? బహిరంగ ప్రసంగాలు, బైబిలు పరిశోధనలలో వ్యక్తిగత తర్ఫీదివ్వడం ద్వారా వృద్ధి చెందడానికి మీరు సహాయం చేస్తున్నారా? కాపరి సందర్శనం చేసేటప్పుడు అర్హులైనవారిని మీతో రమ్మని ఆహ్వానించారా? మీరు వారితో ప్రాంతీయ సేవలో కలిసి పనిచేస్తారా? తలాంతులను గూర్చిన యేసు ఉపమానంలో, యజమాని నమ్మకమైన సేవకులను “భళా, మంచి దాసుడా,” అని అన్నాడు. (మత్తయి 25:23) తమ పనులను చక్కగా నిర్వహించే పరిచారకులను మీరు ఉదారంగా, పొగిడి, మెచ్చుకునే విధంగా ఉన్నారా? (సామెతలు 3:27 పోల్చండి.) అలాకాకపోతే, తమ పని మెచ్చుకొనబడలేదని వారు బాధపడతారా?
అనుగుణ్యతతో పనిచేసే సంబంధాన్ని కలిగి ఉండడానికి సంభాషణ కూడా ప్రాముఖ్యమే. (సామెతలు 15:22 పోల్చండి.) బాధ్యతలను వ్యక్తిగత యిష్టా అయిష్టాల మేరకు లేక క్రమంలేని రీతిలో అప్పగించడం లేక తీసివేయడం చేయకూడదు. సంఘంలో ఒక సహోదరుని సామర్థ్యాలను శ్రేష్టమైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చో పెద్దలు ప్రార్థనాపూర్వకంగా చర్చించాలి. (మత్తయి 25:15 పోల్చండి.) ఒక పని అప్పగించినప్పుడు, ఆయన నుండి ఏమి కోరబడుతుందో సహోదరునికి పూర్తిగా వివరించాలి. సామెతలు 11:14 యిలా హెచ్చరిస్తుంది: “నాయకులు లేని జనులు చెడిపోవుదురు.”
అకౌంట్సు, పత్రికలు, లేక సాహిత్య విభాగాన్ని మరో సేవకుని నుండి తీసేసుకోమని ఒక సహోదరునికి ఊరికే చెప్పడం మంచిది కాదు. కొన్నిసార్లు క్రొత్తగా పని అప్పగింపబడిన సేవకుడు సరిగాలేని లేక అసంపూర్ణ రికార్డులను పొందవచ్చు. ఎంత బాధాకరం! మొదటి కొరింథీయులు 14:40 యిలా సూచిస్తుంది: “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.” సహోదరులకు తర్ఫీదిచ్చి, వారు సంఘ విధానాలను అన్వయించుకొనేలా చేసి, అలాంటి విధానాలను అనుసరించడంలో వారికి తాము మాదిరులుగా ఉండడంలో పెద్దలు చొరవ తీసుకోవాలి. ఉదాహరణకు ప్రతి మూడు నెలలకు సంఘ అకౌంట్సును తనిఖీ చేయడానికి పెద్దలు ఏర్పాటు చేయాలి. అలాంటి ప్రాముఖ్యమైన ఏర్పాటును నిర్లక్ష్యం చేయడం సమస్యలకు దారితీయవచ్చు, సంస్థాపరమైన సూచనల యెడల పరిచారకులకున్న గౌరవం తగ్గిపోవచ్చు.
ఒక వేళ ఒక సహోదరుడు ఫలానా పనిని నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు అనిపిస్తే? అతన్ని అతని పనినుండి వెంటనే తొలగించే బదులు, పెద్దలు విషయాల్ని అతనితో మాట్లాడాలి. బహుశా తర్ఫీదు లేకపోవడం సమస్య అయివుండవచ్చు. సహోదరునికి ఆ పనిని చేపట్టడంలో సమస్యలు అలాగే కొనసాగుతుంటే, బహుశా అయన వేరే పనిని మంచిగా చేయవచ్చు.
దీనత్వాన్ని చూపించడం ద్వారా కూడా పెద్దలు సామరస్యాన్ని పెంపొందింపజేయవచ్చు. ఫిలిప్పీయులు 2:3 క్రైస్తవులను యిలా ప్రోత్సహిస్తుంది: “కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని యెంచుకొనుడి.” కాబట్టి ఒక అటెండెంటు ఒక పెద్దను హాలులోని ఫలానా స్థలంలో కూర్చోమని చెప్పినప్పుడు, నేను పెద్దను గనుక నేను విధేయత చూపించవలసిన అవసరం లేదని తర్కించకుండా సహకరించడానికి ప్రయత్నించాలి. అటెండెంటు కేవలం హాలులోని వేరు వేరు ప్రాంతాలలో కూర్చోవాలని చెప్పబడిన సలహాను అనుసరించాలని చూస్తుంటే, అందరూ అలా చేయాలని పద్ధతి లేదని అతడు గుర్తుంచుకోవాలి.a పరిచారకునికి అప్పగింపబడిన విషయాలపై అనవసరంగా నిర్ణయాన్ని తారుమారు చేయడాన్ని ఒక పెద్ద విడనాడుతాడు.
పరిచారకులు అనుగుణ్యత కొరకు పనిచేయడం
“ఆలాగుననే పరిచారకులు మాన్యులై,” యుండాలని అపొస్తలుడైన పౌలు పేర్కొన్నాడు. (1 తిమోతి 3:8) తమకు అప్పగించబడిన పనులు వారి పవిత్ర సేవలో భాగంగా తలంచడం, వాటిని గంభీరంగా తీసుకోవడమనేది ఉద్రిక్తత పెరగకుండా ఆపడానికి ఎంతో సహాయపడగలదు. మీరొక పరిచారకుడైతే, మీరు మీ పనులను ఉత్సాహంతో చేస్తారా? (రోమీయులు 12:7, 8) మీరు మీ పనులను చేయడంలో నిపుణత సాధించగలిగేలా మీరు ఎంతో ఎక్కువ కృషి చేస్తున్నారా? మీరు నమ్మదగిన, ఆధారపడగల వ్యక్తులై యున్నారా? అప్పగించబడిన పనులను గురించి మీరు ఇష్టపూర్వకమైన స్ఫూర్తిని చూపిస్తారా? ఆఫ్రికా దేశంలోని ఒక ప్రాంతంలో ఒక పరిచారకుడు సంఘంలో మూడు వేర్వేరు పనులను గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నాడు. అతని దృక్పథం ఏమైయుంది? “అన్ని పనులు చేయాలంటే కొంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మరి ఎక్కువగా కష్టపడడం మనల్ని చంపదు.” వాస్తవానికి, ఎక్కువగా స్వచ్ఛందంగా తమను తాము అర్పించుకొనే వారు ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు.—అపొస్తలుల కార్యములు 20:35.
పెద్దలతో సంపూర్ణంగా సహకరించడం ద్వారా అనుగుణ్యతను వృద్ధిచేయడానికి కూడా మీరు ఎంతో చేయవచ్చు. “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి,” అని హెబ్రీయులు 13:17 చెబుతుంది. నిజమే, పెద్దలు అసంపూర్ణ మానవులు, వారిలో లోపాలెన్నడం సులభంగా ఉండవచ్చు. అయినా విమర్శించే దృక్పథం అపనమ్మకాన్ని కల్గిస్తుంది. అది మీ ఆనందాన్ని నాశనం చేసి, సంఘంలోని ఇతరులను ఎంతో తీవ్రంగా ప్రభావితం చేయగలదు. అందుకే అపొస్తలుడైన పేతురు ఈ సలహా యిచ్చాడు: “చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; . . . దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.”—1 పేతురు 5:5, 6.
మీకు సేవాధిక్యతలు యివ్వబడటం లేదని మీరు భావిస్తే, అలాంటి సలహా ప్రాముఖ్యంగా మంచిది. బహుశా మీరు ‘అధ్యక్షపదవికి’ అర్హత సంపాదించుకుంటున్నారు, కాని మీరు నియమింపబడలేదు. (1 తిమోతి 3:1) దీన మనస్సు కలిగి ఉండడం “ఓపికతో కనిపెట్టు”కొను సుస్వభావమును అలవర్చుకొనడానికి సహాయం చేస్తుంది (విలాపవాక్యములు 3:26) పెద్దలపట్ల, మీ మంచి సంబంధాలను కచ్చితంగా దెబ్బతీసే ప్రతీకార భావాన్ని పెంచుకోడానికి బదులు మీరు అభివృద్ధి పర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని వారిని అడగండి. సలహాను అంగీకరించి, దాన్ని అన్వయించుకోవడంలో మీరు చూపే నిజమైన సుముఖత నిస్సందేహంగా ఆత్మీయ పెరుగుదలకు ఒక నిదర్శనంగా కనిపిస్తుంది.
ఒక పరిచారకునికి విశేషమైన సామర్థ్యాలు లేక విద్యాపరమైన, సాంఘిక సౌలభ్యాలు ఉంటే, తన సమతుల్యాన్ని కాపాడుకోడానికి దైవిక దీనత్వం, నమ్రత ఆయనకు సహాయపడతాయి. పెద్దలకంటే ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నించడం లేక తన స్వంత సామర్థ్యాలపై దృష్టి నిలిపేలా చేయడం ఆయనకు ఎంత శోధనకరంగా ఉండవచ్చు! సామెతలు 11:2 మనకిలా గుర్తుచేస్తున్నది: “వినయముగలవారి యొద్ద జ్ఞానమున్నది.” ఒక నమ్రతగల సహోదరుడు తన పరిధులు తెలుసుకుని ఉంటాడు. అతడు వెనుక ఉండి నిశ్శబ్దంగా పనిచేయడానికి, పెద్దలకు మద్దతు యివ్వటం కొరకు తన సామర్థ్యాలను ఉపయోగించడానికి యిష్టపడతాడు. తనకు లోకసంబంధంగా ఎక్కువ జ్ఞానం ఉన్నప్పటికీ, పెద్దలకు ఎక్కువగా ఉండే లక్షణాలైన ఆత్మీయ జ్ఞానం, వివేచన వంటి ప్రాముఖ్యమైన విషయాల్లో తాను వెనుకబడి ఉండవచ్చునని గ్రహించుకోటానికి అతనికి నమ్రత సహాయం చేస్తుంది.—1 కొరింథీయులు 1:26–2:13; ఫిలిప్పీయులు 1:9.
స్పష్టంగా, పెద్దలు మరియు పరిచారకులు ప్రముఖ పాత్రలు నిర్వహిస్తారు. సంఘంలో ఉన్న అందరినీ అభివృద్ధి పరచడానికి వారు యిద్దరూ కలిసి ఎంతో చేయవచ్చు. కాని అలా చేయడానికి, వారు “సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, . . . దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచు” కొనుచూ అనుగుణ్యతగా కలిసి పనిచేయాలి.—ఎఫెసీయులు 4:2, 3.
[అధస్సూచీలు]
a ఆగస్టు 15, 1992 ది వాచ్‌టవర్ 12వ పేజీ చూడండి.
[27వ పేజీలోని చిత్రాలు]
పెద్దలు పరిచారకులను తమ క్రింది పనివారిగా కాదు గాని తమతోటి దేవుని పరిచారకులుగా దృష్టిస్తారు