ఇతియోపియాలోని “దైవిక బోధ” జిల్లా సమావేశము ఓ ప్రత్యేక ఆనందమయ సమయము
నిషేధం ఎత్తివేయబడినప్పటి నుండి జరిగిన జిల్లా సమావేశాల్లో యిది మొదటిది కాదు గానీ అది నిశ్చయంగా ప్రత్యేకమైందే. నవంబరు 11, 1991లో న్యాయసమ్మతమైన గుర్తింపు లభించిన తర్వాత, ఆ దేశంలోని అడిస్ అబాబా నడి బొడ్డునున్న అతి పెద్ద స్టేడియమైన సిటీ స్టేడియమ్లో యెహోవాసాక్షులు మూడోసారి కూడుకున్నారు. మొదట్లో ఈ స్థలం ఆదివారం నాడు అందుబాటులో లేని కారణంగా, అంతేకాకుండా అంత పెద్ద స్టేడియం మరొకటి అందుబాటులో లేనందున కార్యక్రమమంతటినీ మూడు రోజులకు, అంటే జనవరి 13-15, 1994 గురువారం నుండి శనివారం వరకు కుదించడం జరిగింది.
ఈ మూడు రోజులూ, నీలి ఆకాశం క్రింద మనోహరమైన సమశీతోష్ణ వాతావరణంలోనే గాక “దైవిక బోధ” యొక్క పూర్తి ప్రభావంతో ఆత్మీయ జ్ఞానాభివృద్ధిలో కూడా ఆహ్లాదకరంగా గడిచాయి. వేదిక చుట్టూ ఆకర్షణీయమైన పూల అమరికలతో సమావేశ అంశము అమ్హారిక్ భాషలో విశిష్టంగా కనిపించింది.
అయితే, ఈ సమావేశాన్ని విశిష్టమైనదానిగా చేసిందేమిటి? శ్రేష్ఠమైన కార్యక్రమంతో పాటు, ప్రతి ఒక్కరి ఆలోచనలూ భావాలూ మన ప్రేమపూర్వక అంతర్జాతీయ సహోదరత్వంపైనా, రాజ్యాభివృద్ధి రూపంలో తన ప్రజలపై దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా వ్యక్తమైనవాటిపైనా కేంద్రీకృతమై ఉన్నాయి. జిబౌటి, ఏమెన్తో సహా 16 దేశాల నుండి, సుమారు 270 మంది విదేశీ ప్రతినిధులు విచ్చేశారు. సగం కంటె ఎక్కువమంది ఐరోపా, ఉత్తర అమెరికాల శీతల వాతావరణం నుండి వచ్చారు. సందర్శకుల్లో, యెహోవాసాక్షుల పరిపాలక సభలోని యిద్దరు సభ్యులు, లోయిడ్ బారి, డానియేల్ సిడ్లిక్ కూడా ఉన్నారు.
సందర్శిస్తున్న తమ సహోదరుల యెడలగల హృదయపూర్వక ప్రేమతో కలగలిసిన ఇతియోపియా పారంపర్య ఆతిథ్యం, భాషాంతర అడ్డంకులను అధికమించిన ఉత్సాహం వెల్లివిరిసేట్లు చేసింది. వారి అభినందనలు కేవలం కరచలనాలకే పరిమితం కాక, ఆరింతలు ఆలింగనాలూ ముద్దుల వరకూ సాగింది! ఇతియోపియాలోని రాజ్య పనిని గూర్చి అనేక సందర్శకులు చదివారు, అంతేకాకుండా ఇతియోపియాలోని తమ సహోదరులు, జైళ్లు, యితర విధాల హింసలనుండి రక్షించబడినవారనీ, విశ్వాస పరీక్షలో విజయవంతులైనవారని కూడా వారికి తెలుసు.a అయితే, నేడు అనేక దేశాల్లో తగ్గుముఖం పడుతున్న మర్యాదనూ అంతేకాక ఆనందభరితమైన ముఖాలను చూపే అనేక మంది యౌవనులను చూసి సందర్శకులైన ప్రతినిధులు ఆశ్చర్యచకితులయ్యారు. అనేక మంది ఇతియోపియా సహోదరీలు అందంగా ఎంబ్రాయిడరీ చేసిన తెల్లటి పారంపర్య దుస్తులను ధరించారు. అది ఓ నిజమైన ఉత్సవ స్ఫూర్తిని చేర్చింది.
శుక్రవారం నాడు జరిగిన బాప్తిస్మము పులకరింపజేసేదిగా ఉంది. పది నుండి 80 ఏళ్ల వయస్సు నడుమనున్న 530 మంది కొత్తగా సమర్పించుకున్న వారు స్టేడియమ్ ఆట స్థలంలో సగం వరకు ఆక్రమించుకున్నారు. ఆ దేశంలోని 7గురు సాక్షులకు ఒక్కరికంటే ఎక్కువ చొప్పున ఉన్నారు—అపేక్షించినదాని కంటే యిది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి తన ప్రజలపై యెహోవా ఆశీర్వాదానికి యిది ఎంత చక్కని నిదర్శనం! ఇంత మంది బాప్తిస్మము తీసుకోవడం చూసి అనేకులు ఆనంద బాష్పాలను రాల్చారు, అంతేకాక 40 కంటే ఎక్కుమంది ఇటాలియన్ ప్రతినిధుల మధుర గానంతో అది మరింత అధికమైంది. అనేకులు యెషయా 60:5లోని ప్రవచనార్థక మాటలను మనస్సునకు తెచ్చుకున్నారు: “నీవుచూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.”
ఆనందించడానికిగల ప్రత్యేక కారణాలు
శుక్రవారం నాడు, ఇతియోపియా నందలి రాజ్య పని యొక్క తొలిదశలోని అల్ప ఆరంభాన్ని గూర్చిన విషయాలను ఇంటర్వ్యూల్లో తిరిగి చెప్పినప్పుడు, యెహోవా ఆశీర్వాదాలను గూర్చి మరింత నొక్కి చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో 1950, 1970లలో సేవచేసిన తొలి మిషనరీలతో యివి చేయబడ్డాయి. రే కాసన్, జాన్ కామ్ఫస్, హాలివుడ్ వార్డ్లు మొట్ట మొదటి సారి అడిస్ అబాబాకు వచ్చినప్పటి నుండి అంటే, సెప్టెంబర్ 14, 1950 నుండి ప్రారంభమైన తమ తమ బైబిలు విద్యాబోధ పనిని గూర్చి చెబుతుండగా, 8000 కంటే ఎక్కువ మంది విన్నారు. ఆ నాటి చక్రవర్తి పాలన, వీరు సాధారణ విద్యాబోధ కార్యక్రమాల్లో చురుకుగా ఉండాలని కోరింది. కనుక వివిధ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పట్టణం నడిబొడ్డున వయోజనుల విద్యాబోధ నిమిత్తం వారు ఓ పాఠశాలను నెలకొల్పారు. కానీ ఈ మిషనరీలు, తమ ఖాళీ సమయాల్లో దైవిక బోధపై కేంద్రీకృతమైన విద్యాబోధను వ్యాప్తి చేయడానికి పూనుకున్నారు. రెండువందల ఏభై అక్షరాలున్న క్లిష్టమైన అమ్హారిక్ భాషను నేర్చుకోవడానికి వారు ఎంతో శ్రమపడవలసివచ్చింది. వారు తమ మొట్ట మొదటి బైబిలు పఠనాన్ని విజయవంతంగా నిర్వహించేటప్పటికి అర్థ సంవత్సరం గడిచిపోయింది. సుమారు 43 సంవత్సరాల తర్వాత, ఈ మాజీ పాఠశాల ఉపాధ్యాయులుగా గుర్తుపెట్టుకున్న ప్రజలను వీధిలో వారు కలిశారు. అయితే సమావేశం వద్ద మాత్రం, విశ్వాసంలో దృఢగాత్రులైన డజన్లకొలది తమ మునుపటి బైబిలు విద్యార్థులతో తిరిగి కలవడంలోనూ, వారు వారికి పరిచయం చేసిన ఆత్మీయ పిల్లలతో, మనమండ్లతో కలవడానికి ఆనందించారు.—1 థెస్సలొనీకయులు 2:19, 20.
ఆనందభరితులైన, ఎంతో శ్రద్ధగల ప్రేక్షకులు, మునుపటి మిషనరీలతో జరిపిన ఇంటర్వ్యూలకే కాకుండా బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇశ్రాయేల్, ఇటలీ, కెన్యా, నెదర్లాండ్స్, అమెరికాల నుండి విచ్చేసిన విదేశీ ప్రతినిధులు తెచ్చిన అభివాదాలకు చాలాసేపటివరకూ కరతాళ ధ్వనులు చేశారు. ఇది మరోసారి దేవుని ప్రజల ప్రపంచవ్యాప్త ప్రేమపూర్వక సహోదరత్వాన్ని నొక్కి చూపింది. పరిపాలక సభలోని అభిషక్త సహోదరులందించిన ముఖ్య ప్రసంగాలూ అలాగే వారి హృదయపూర్వక ప్రార్థనలు కూడా ప్రేక్షకుల హృదయాలను తాకాయి. ఎంతో సహజంగా, జీవం ఉట్టిపడే విధంగా అందించబడిన, తమ సృష్టికర్తను జ్ఞాపకముంచుకునే యౌవనులను గూర్చిన నాటకం నందలి పాత్రల్లో, స్టేడియమ్లో కూర్చున్న యౌవనులు తమను తాము చూసుకున్నారు. ఇంగ్లీష్ భాషలో కొత్తగా వెలువడిన ప్రచురణలే కాకుండా, అమ్హరిక్ భాషలో వెలువడిన మూడు కొత్త ప్రచురణలు ఎంతో ఉత్సాహాన్ని రేపాయి.b
విశ్రాంతి సమయాల్లోనూ యితర సమయాల్లోనూ అనేక మంది అమూల్య వ్యక్తులతో పరిచయం చేసుకునే చక్కటి అవకాశాలు కలిగాయి. ఉదాహరణకు, సరిగ్గా మొదట్లో ఇతియోపియా నందలి అతి వృద్ధ ప్రచారకుడు తులు మెక్యురియా చేతితో చేసిన కర్రను చేత పుచ్చుకుని కూర్చున్నాడు. గత సంవత్సరం, పండు వయస్సులో అంటే, తన 113వ ఏట ఆయన ఓ యెహోవాసాక్షిగా బాప్తిస్మము పొందాడు. ఈ సమావేశంలో తన 80 ఏళ్ల భార్య తన మాదిరిని అనుసరించి తన ఆత్మీయ సహోదరి కూడా కావడం చూసే ఆనందం ఆయనకు దక్కింది. ఆయన కార్యక్రమమంతటిలోనూ ఉండడం యౌవనులకు ఓ పురికొల్పుగా ఉంది. అలాంటి వారిలో ఒకడు, పాఠశాలలో చదువుతూ ఉన్న యోహన్స్ గొరెవ్స్ 16 సంవత్సరాలవాడైనా, నాలుగు సంవత్సరాలుగా ఆయన క్రమపయినీరు ప్రచారకుడిగా చేస్తున్నాడు. అతనూ అతని కంటే చిన్నవారైన స్కూలుకు వెళ్లే ప్రాయంలోని మరితర పయినీర్లు, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగపర్చుకోవడానికి నేర్చుకున్నారు. దాన్ని వారు పొద్దున్నే స్కూలుకు వెళ్లే దారిలో లేక విశ్రాంతి మరియు స్కూలు సమయం తర్వాతి సమయాన్ని వినియాగించడం ద్వారా చేయగల్గారు.
యథార్థతకు ఎంత శ్రేష్ఠమైన ఉదాహరణలు!
ప్రేక్షకుల్లోని వందలాది మంది జైలు శిక్షను మునుపటి ప్రభుత్వాల క్రింద నిర్బంధాన్ని హింసను అనుభవించారు. మాన్డిఫ్రో ఇఫ్రూ అలాంటి ఐదు సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయితే యిప్పుడు అడిస్ అబాబాలో అనువాదం, ముద్రణ, షిప్పింగులను చూసుకోవడానికి కొత్తగా స్థాపించబడిన కార్యాలయమందు సేవచేయడంలో ఆయన ఆనందిస్తున్నాడు. ఆయనతో పాటు సేవచేసే యౌవనుడైన జెకర్యియాస్ ఎషటు, ఎనిమిది సంవత్సరాల క్రితం తన తండ్రి మూడేండ్ల జైలు శిక్షలో క్రైస్తవ తటస్థతను కనపర్చినందుకు హత్య చేయబడ్డప్పుడు తన యథార్థతను కాపాడుకోవడంలో తప్పిపోలేదు. తన తండ్రి జైలుకు వెళ్లినప్పుడు, ఐదుగురు పిల్లల్లో ఒకడైన జెకర్యియాస్ పది ఏళ్ల వాడు. ఇంకా పాఠశాలలో చదువుతున్న మెస్వాట్ గిర్మా, అతని అక్క యోలాన్ అనే ప్రస్తుత యౌవనులు, తమ తండ్రిని ఫోటోల ద్వారానే జ్ఞాపకముంచుకోగలరు, ఎందుకంటే వాళ్లు చాలా చిన్నగా ఉన్నప్పుడు వారి తండ్రి తటస్థతను బట్టి అకస్మాత్తుగా హత్య చేయబడ్డాడు. అతని యథార్థత వాళ్లను పురికొల్పింది, వాళ్ల తండ్రి మరణించే సమయానికి చేస్తున్నట్లే క్రమ పయినీరు సేవను యిప్పుడు వాళ్లిద్దరూ చేస్తున్నారు.
యథార్థతను కాపాడుకున్న మరో వ్యక్తి, రిఫ్ట్ లోయకు చెందిన ఓ మనోహరమైన ప్రాంతంలో ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్న టమిరాటగ్, తన క్రైస్తవ తటస్థత వల్ల, ఏడు వివిధ చెరసాలల్లో మూడు సంవత్సరాలు గడిపాడు కొన్ని సార్లు చెయిన్లతో కట్టబడ్డాడు, అంతేకాక తీవ్రమైన దెబ్బలకు గురిచేయబడ్డాడు. అయినప్పటికీ, చెరసాలలోని పన్నెండు కంటే ఎక్కువ మంది దేవుని రాజ్యం విషయంలో తమ స్థానాన్ని వహించేందుకు ఆయన సహాయపడ్డాడు.
ఇప్పుడు ప్రాంతీయ కాపరిగా పనిచేస్తున్న టెస్ఫు టెమెల్సో తాను పూర్తికాల ప్రత్యేక సేవకునిగా ఉన్నప్పుడు 17 సార్లు జైలులో వేయబడ్డాడు. ఆయన మీద కొట్టిన మచ్చలు ఉన్నాయి గానీ, తాను పూర్వం నియమించబడిన ప్రాంతాల్లో సంఘాలు ఉండడం చూసి ఉప్పొంగిపోతున్నాడు. అకాకి సంఘంలోని డజన్లకొలది సహోదర సహోదరీలు జైలు శిక్షనూ క్రూరత్వాన్ని అనుభవించినప్పటికీ, ఆ సంఘం వందమంది కంటే ఎక్కువ మంది ప్రచారకులకు పెరిగింది. వారు, ఇతియోపియాలోని యెహోవాసాక్షుల మొట్ట మొదటి రాజ్య మందిరాన్ని నిర్మించారు. రాజధానికి ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలోని చూడముచ్చటైన ప్రాంతంలో ఉన్న డస టౌన్ నుండి, ఐదుగురు వ్యక్తులు వచ్చారు వాళ్లు దాదాపు మరణాన్ని ఎదుర్కొని ఓ స్థానిక సహోదరునిపై జరిపిన హింస వల్ల అతను చనిపోవడం చూశారు. వారిలో మసిరెషా కాసా అనే ఓ పెద్ద, ఆరేండ్ల జైలు శిక్షలో కాపాడబడడానికి కారణం, అతను ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయినందుకు కాదుగానీ యెహోవాపై ఆధారపడడం నేర్చుకున్నందుకేనని ఆయన వివరించారు.—రోమీయులు 8:35-39; అపొస్తలుల కార్యములు 8:1 పోల్చండి.
ఇటీవల కూడా అనేకులు పరీక్షలందు తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. సమీపంలోని ఓ దేశంనుండి ఓ పెద్ద గుంపు సమావేశానికి విచ్చేసింది. ఆ దేశంలోని సాక్షుల తటస్థత వల్ల అక్కడ వారికి పోలీసు రక్షణ, ప్రయాణ పత్రాలూ పెళ్లి సర్టిఫికెట్లూ ఆసుపత్రి చికిత్స, ఉద్యోగాలు యివ్వబడవు. ఎర్ర సముద్రపు ఎరిట్రియన్ రేవు అయిన మెసివా సమీపంలో యుద్ధం చెలరేగినప్పుడు, ఓ సంఘమంతా పిల్లలతో సహా 39 మంది, తమ యిళ్లపై మునుపటి ప్రభుత్వం చేసే దాడుల నుండి తప్పించుకోడానికి నాలుగు నెలలపాటు వంతెన క్రింద జీవించారు. వేడి, ఒంటరితనం గల ఈ ఎడారి ప్రాంతంలో వారు జరుపుకునే ప్రతిదిన లేఖనాల చర్చలూ యితర కూటాలు వారికి ఎంతో బలాన్ని చేకూర్చాయి అంతేగాక యెహోవాతో అలాగే, ఒకరితో ఒకరు కూడా సన్నిహిత సంబంధాన్ని కల్గివుండడానికి అవి సహాయపడ్డాయి. బ్లూ సైల్ ఉద్భవించే స్థలం వద్ద పూర్తికాల సేవచేసే ఇద్దరు ప్రత్యేక పయినీర్లయిన సహోదరీలు ఆర్థడాక్స్ చర్చి వారు పురికొల్పిన మూకల బెదిరింపులనూ హింసనూ సహించారు, అయినప్పటికీ వారిద్దరూ రక్షించబడి, ఈ సమావేశంలో అనేకమంది తమ బైబిలు విద్యార్థులు వారి సమర్పణను బాప్తిస్మము ద్వారా కనపర్చుకోవడం చూశారు.
ఓ సహోదరుడు, సొమాలియాకు సమీపంలో ఉన్న నీరులేని ఒగాడన్ ప్రాంతం లోతట్టులో ఏకాంతంగా ఉద్యోగం చేసే శిక్షను అనుభవించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన, దైవిక బోధ నుండి ప్రయోజనం పొంది, యిప్పుడు యితరులకు బోధిస్తున్న డాక్టర్లతో సహా ఆసక్తి గల వారికి ప్రకటిస్తూ వారితో కూటాలను నిర్వహిస్తూ ఆత్మీయంగా మృతి చెందకుండా ఉన్నాడు. మరో చక్కటి యథార్థతా మాదిరి, అడిస్ అబాబాలోని ఓ ప్రత్యేక పయినీరు సేవకునిది. ఆర్థడాక్స్ మతనాయకులు పురికొల్పిన దొమ్మి మూక 1992లో, ఆయన్ను కర్కషంగా కొట్టి చావడానికి వదిలి వెళ్లింది. సంతోషకరంగా, ఆయన స్వస్థపడి అదే ప్రాంతంలో మరలా సేవచేయడం కొనసాగించాడు. ఆయన ముఖంలో వెలుగొందే చిరునవ్వు, ఆ బాధను రవ్వంతైనా చూపడంలేదు. ఆయనకూ అలాగే పరీక్షించబడిన యితరులకూ కొత్తవారికీ కూడా, ఈ “దైవిక బోధ” సమావేశం ఆనందభరితమైన ఉత్సవంగా ఉంది.
స్వచ్ఛంద సేవకులందరికీ అనేక సంవత్సరాల అనుభవం ఉందని సందర్శకులు అనుకునే విధంగా సమావేశ సంస్థీకరణ అంతా సరాళంగా సాగింది. వాస్తవానికి, గత రెండు సంవత్సరాల్లో వాళ్లు ఎంతో వేగంగా పురోభివృద్ధి సాధించారు. మూడు రోజుల సమావేశం చాలా త్వరగా గడిచిపోయింది. శనివారం నాటి శిఖరాగ్ర హాజరు 9,556. జాతీయ టివి, రేడియో, వార్తాపత్రికలు అనుకూలమైన సమాచారాన్ని అందించాయి. యెహోవా తన ప్రజలను ఆత్మీయంగా గొప్పవారిని చేస్తున్నట్లు అందరూ చూడగల్గారు. ప్రేక్షకుల్లో “దైవిక బోధ” నుండి ప్రయోజనం పొందడం ప్రారంభించిన వేలకొలది ఆసక్తి గల వ్యక్తులు కూడా ఉన్నారు. సుమారు ఐదు కోట్ల మంది ప్రజలుగల ఈ దేశంలో ఓ విశాలమైన ప్రాంతం యెహోవాసాక్షుల కొరకు తెరవబడి ఉంది, అయితే ఈ సమావేశము, ఈ విధానంలోని యథార్థమైన వ్యక్తులు కూడా దైవిక బోధ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి సహాయపడేందుకు తమ మిగిలిన సమయాన్ని వినియోగించుకోవాలనే అందరి నిశ్చయాన్ని బలపర్చింది.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ వారు ప్రచురించిన 1992 ఇయర్ బుక్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్ చూడండి.
b యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుటాఫ్ యిట్, మేకింగ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ హాపీ, జెహోవాస్ విట్నెసెస్—యునైటెడ్‌లీ డూయింగ్ గాడ్స్ విల్ వారల్డ్వైడ్.
[23వ పేజీలోని చిత్రాలు]
అడిస్ అబాబా, జనవరి 13-15, 1994
[24వ పేజీలోని చిత్రాలు]
అడిస్ అబాబా నందలి పయినీర్ల గుంపు; చెరసాలలో వేయబడి తమ యథార్థతను కాపాడుకున్న వారందరు (కింద); 113 ఏళ్ల సాక్షి, ఆయన భార్య