కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 7/1 పేజీలు 8-13
  • మీరు ఎవరి బల్ల యొద్ద భుజిస్తున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఎవరి బల్ల యొద్ద భుజిస్తున్నారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దయ్యముల బల్ల” నుండి వైదొలగడం
  • ‘నమ్మకమైన దాసుడు’ యెహోవా బల్లను సిద్ధపరుస్తున్నాడు
  • దయ్యాల బల్లమీద ఉన్న విషాహార విషయంలో అప్రమత్తంగా ఉండండి
  • యెహోవా బల్ల మాత్రమే నిలిచి ఉంటుంది
  • విషయసూచిక
    తేజరిల్లు!—2024
  • యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్య పోరాటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దయ్యాలను మనమెలా ఎదిరించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 7/1 పేజీలు 8-13

మీరు ఎవరి బల్ల యొద్ద భుజిస్తున్నారు?

“ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.”—1 కొరింథీయులు 10:21.

1. మన ముందు ఏ బల్లలున్నాయి, అపొస్తలుడైన పౌలు వాటిని గూర్చి మనకు ఏ హెచ్చరికను యిస్తున్నాడు?

అపొస్తలుడైన పౌలు రాసిన ఈ ప్రేరేపిత మాటలు, మానవజాతి ముందు రెండు సాదృశ్యమైన బల్లలను ఉంచినట్లు చూపిస్తున్నాయి. ప్రతి బల్ల, దాని మీద ఉంచబడిన సూచనార్థకమైన ఆహారం వల్ల గుర్తించబడుతోంది, అంతేకాక మనలో ప్రతి ఒక్కరమూ వాటిలో ఏదో ఒక బల్ల యొద్ద భుజిస్తూనే ఉన్నాము. అయితే, మనం దేవున్ని ప్రీతిపర్చాలనుకుంటున్నట్లైతే, మనం దేవుని బల్ల యొద్ద భుజిస్తూ అదేసమయంలో దయ్యాల బల్ల యొద్ద నుండి కూడా కొంచెం కొంచెం కొరుక్కు తినలేము. అపొస్తలుడైన పౌలు యిలా హెచ్చరించాడు: “అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ‘ప్రభువు బల్లమీద’ ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.”—1 కొరింథీయులు 10:20, 21.

2. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో యెహోవా యొక్క ఏ బల్ల ఉండేది, సమాధాన బలిలో ఎవరు పాలుపంచుకునేవారు? (బి) నేడు యెహోవా బల్ల యొద్ద పాలుపంచుకోవడం అంటే ఏమిటి?

2 పౌలు మాటలు, యెహోవా చట్టం క్రింద ప్రాచీన ఇశ్రాయేలీయులు అర్పించిన సమాధాన బలులను మనకు జ్ఞాపకం చేస్తాయి. దేవుని బలిపీఠం, బల్ల అని పిలువబడింది. మరి బలులర్పించడానికి జంతువును తీసుకువచ్చిన వ్యక్తి యెహోవాతో, యాజకులతో సమాధానం కల్గివున్నాడని చెప్పబడింది. అదెలా? మొదటిగా, ఈ అర్పణలో యెహోవా పాలుపొందుతాడు, ఎందుకంటే రక్తం బలిపీఠం మీద చిలకరించబడేది, అంతేకాకుండా దాని కింద ఉన్న అగ్ని జ్వాలల్లో కొవ్వు దహించబడేది. రెండవదిగా, యాజకుడు (ఆయన కుటుంబమూ), బలిగావించబడిన జంతువు యొక్క కాల్చిన ఛాతిభాగాన్నీ, కుడి జబ్బనూ తినడం ద్వారా దానిలో భాగం వహించేవాడు. మూడవదిగా, బలిని మిగిలిన దానినంతటిని తినడం ద్వారా బలినర్పించినవాడు అందులో భాగం వహిస్తాడు. (లేవీయకాండము 7:11-36) నేడు, యెహోవా బల్ల యొద్ద భాగం వహించడం అంటే, యేసు ఆయన అపొస్తలులు చూపిన మాదిరి ప్రకారంగా, ఆయన కోరే ఆరాధనను ఆయనకు చెల్లించడమే. అలా చేయడానికి యెహోవా తన వాక్యము ద్వారా, తన సంస్థ ద్వారా మనకు అందించే వాటి ద్వారా మనల్ని మనం ఆత్మీయంగా పోషించుకోవాలి. యెహోవా బల్ల యొద్ద ఆత్మీయ సమాధానాన్ని అనుభవించిన ఇశ్రాయేలీయులు, దయ్యాల బల్ల యొద్ద వాటికి బలులను అర్పించకుండా నిషేధించబడ్డారు. ఆత్మీయ ఇశ్రాయేలీయులు వారి సహచరులైన “వేరే గొఱ్ఱెలు” అదే దైవిక నిషేధంలో ఉన్నారు.—యోహాను 10:16.

3. మన దినాల్లో దయ్యాల బల్ల యొద్ద భాగం వహించే తప్పిదంలో ఎవరు పడగలరు?

3 మన రోజుల్లో దయ్యాల బల్ల యొద్ద భుజించే తప్పిదంలో ఒక వ్యక్తి ఎలా చిక్కుకోగలడు? యెహోవాకు విరుద్ధమైన ఏ పనియైనా పురోగమించడానికి సహకరించడం ద్వారా అలా చేయగలడు. మనలను యెహోవానుండి వైదొలగించడానికి రూపొందించిన దయ్యాల సమస్త ప్రచారాలూ దయ్యముల బల్లలో ఉన్నాయి. అలాంటి విషంతో తమ హృదయాన్ని మనస్సునూ నింపుకోవాలని ఎవరు కోరుకుంటారు? యథార్థ క్రైస్తవులు, నేడు అనేకమంది ప్రజలు యుద్ధం, సంపద అనే దేవుళ్లకు అర్పిస్తున్న బలులలో పాలుపంచుకోడానికి నిరాకరిస్తారు.—మత్తయి 6:24.

“దయ్యముల బల్ల” నుండి వైదొలగడం

4. మనమందరమూ ఏ ప్రశ్నను ఎదుర్కొంటున్నాము, దయ్యాల బల్ల యొద్ద తెలిసే పాలుపంచుకోవాలని మనము ఎందుకు కోరుకోము?

4 మనమందరమూ ఎదుర్కొనే ప్రశ్న ఏమిటంటే, ఏ బల్ల యొద్ద నేను ఆహారం భుజిస్తున్నాను? మనం ఒక బల్ల యొద్ద కాకపోతే మరో బల్ల యొద్ద భుజించ బద్ధులమై ఉన్నాము. ఆ వాస్తవాన్ని మనమెవరమూ తప్పించుకోలేము. (మత్తయి 12:30 పోల్చండి.) మనం తెలిసే దయ్యాల బల్లవద్ద భుజించాలని కోరుకోము. అలా చేయడం ద్వారా మనం సజీవుడును, అద్వితీయ సత్యదేవుడునైన యెహోవా అంగీకారాన్ని పోగొట్టుకునే అవకాశముంది. మరోవైపు, కేవలం యెహోవా బల్లవద్దే ఆహారం తీసుకున్నట్లైతే, అది ఆనందంతో కూడినదై నిత్యజీవానికి నడిపిస్తుంది! (యోహాను 17:3) ఓ వ్యక్తి తినేదాన్ని బట్టే ఆ రకమైన వ్యక్తి అవుతాడు అనే ఓ లోకోక్తి ఉంది. మరి, ఏ వ్యక్తియైనా మంచి శారీరక, మానసిక ఆరోగ్యం కావాలని కోరుకున్నట్లైతే, అతను తన ఆహార అలవాట్లను గమనిస్తూ ఉండాలి. క్రొవ్వు మోతాదు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు రసాయన మిశ్రమాలతో ఎంతో రుచికరంగా తయారు చేయబడినప్పటికీ, మన దీర్ఘకాల శారీరక ఆరోగ్యానికి ఎలా తోడ్పడవో, అలాగే దయ్యాల ఆలోచనలతో అల్లుకునిపోయిన లోకపు ప్రచారం కూడా మన మనస్సులను మలినపర్చే సూచనార్థక చెడు చిరుతిండే.

5. దయ్యాల బోధలకు గురికాకుండా నేడు మనం ఎలా తప్పించుకోగలము?

5 అంత్యదినములలో ప్రజలను “దయ్యముల బోధ” వల్ల ప్రక్కదారి పట్టిస్తారని అపొస్తలుడైన పౌలు ముందుగానే చెప్పాడు. (1 తిమోతి 4:1) అలాంటి దయ్యాల బోధలు అబద్ధ మత నమ్మకాల్లో మాత్రేమేకాక యితర విధాల్లో కూడా విస్తార ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఉదాహరణకు, మనము, మన పిల్లలు ఏ పుస్తకాలను ఏ పత్రికలను చదువుతున్నామో, ఎటువంటి దూరదర్శిని కార్యక్రమాలను చూస్తున్నామో, ఎటువంటి క్రీడలను ఎటువంటి సినిమాలను మనం చూస్తున్నామో అనే విషయాలను మనం విశ్లేషించి సరి చూసుకోవాలి. (సామెతలు 14:15) వినోదం కొరకు మనం కల్పిత కథలను చదువుతున్నట్లైతే, అది అర్థంలేని దౌర్జన్యాన్నీ, అవినీతికర లైంగికతనూ లేక మాంత్రిక సంబంధ అభ్యాసాలను ప్రబోధిస్తున్నదా? సంగతులు తెలుసుకోడానికి కల్పిత కథలు కాని దాని చదువుతున్నట్లైతే, అది ‘క్రీస్తును అనుసరింపని’ జీవిత విధానాన్ని లేక తత్వాన్ని ప్రబోధిస్తుందా? (కొలొస్సయులు 2:8) నిరర్థకమైన యోచనలు ప్రతిపాదించబడుతున్నాయా, లేక లౌకిక సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రోత్సహించబడుతోందా? అధికంగా ధనికులవ్వాలన్న నిర్ణయాన్ని అది పెంచుతుందా? (1 తిమోతి 6:9) క్రీస్తుకు సంబంధించని మోసకర బోధలను యుక్తిగా అందించే పుస్తకమా అది? వాటి జవాబు అవునన్నట్లైతే, అంతేకాకుండా అలాంటి వాటిని మనం చదవడం లేక అలా చూడడంలో మనము కొనసాగినట్లయితే, దయ్యాల బల్ల యొద్ద మనం భుజించే అపాయంలో ఉన్నామన్నమాట. నేడు, ఎంతో జ్ఞానయుక్తమైనవిగా తాజాగా కనిపించే లౌకిక తత్వజ్ఞానాన్ని ప్రబోధించే పుస్తకాలు లక్షలాది ఉన్నాయి. (ప్రసంగి 12:12) అయితే వీటిలో ఏ ఒకటీ నిజంగా కొత్తదికాదు; సాతాను హవ్వతో మోసపూరితంగా చెప్పింది ఎలాగైతే ఆమె ప్రయోజనార్థమై పనిచేయ లేదో అలాగే, ఇది కూడా ఒకరి ప్రయోజనానికి, లేక పురోగతికి పనిచేయదు.—2 కొరింథీయులు 11:3.

6. దయ్యాల చిరుతిండిని రుచి చూడడానికి సాతాను మనలను ఆహ్వానించినప్పుడు, దానికి తగినట్లు మనము ఎలా ప్రతిస్పందించాలి?

6 కనుక, సాతాను తన దయ్యాల సంబంధమైన చిరుతిండిని రుచి చూడడానికి మనలను ఆహ్వానించినప్పుడు, మనమెలా ప్రతిస్పందించాలి? సాతాను, యేసును శోధిస్తూ రాళ్లను రొట్టెలు చేసుకోమని అన్నప్పుడు ఆయన ఏం చేశాడో అదే మనమూ చేయాలి. యేసు యిలా జవాబిచ్చాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.” అంతేకాకుండా యేసు సాతానుకు సాగిలపడి నమస్కరించినట్లైతే “యీ లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను” ఆయనకు ఇస్తానని అన్నప్పుడు, యేసు యిలా స్పందించాడు: “సాతానా, పొమ్ము, ‘ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవించవలెను’ అని వ్రాయబడియున్నదనెను.”—మత్తయి 4:3, 4, 8-10.

7. యెహోవా బల్ల యొద్ద, అలాగే దయ్యాల బల్ల యొద్ద ఫలవంతంగా భుజించగలమని మనం అనుకుంటున్నట్లైతే మనలను మనం ఎందుకు మోసపర్చుకున్నట్లు అవుతుంది?

7 యెహోవా బల్లకు, ఆయన శత్రువులైన దయ్యాలు పరిచిన బల్లకు ఎన్నటికీ పొత్తుకుదరదు! అవును, అంతకుముందే అలాంటి ప్రయత్నం జరిగింది. ప్రవక్తయైన ఏలీయా కాలంలోని ప్రాచీన ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకోండి. ప్రజలు యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకున్నారు, కానీ బయలు వంటి దేవుళ్లు ఐశ్వర్యాన్ని యిస్తారని వారు నమ్మారు. అప్పుడు ఏలీయా ప్రజలను సమీపించి యిలా చెప్పాడు: “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడి.” నిశ్చయంగా ఇశ్రాయేలీయులు “మొదట ఒక కాలుమీద తర్వాత మరో కాలుమీద” కుంటుతున్నారనడంలో సందేహం లేదు. (1 రాజులు 18:21; ది జెరూసలెమ్‌ బైబిల్‌) బయలు యాజకులను తమ దేవుని దైవత్వాన్ని నిరూపించమని ఏలీయా సవాలు చేశాడు. బలిగా వధించబడినదానిపైకి ఆకాశంనుండి అగ్నిని పంపించగల్గినవాడే నిజమైన దేవునిగా నిరూపించబడతాడు. బయలు యాజకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, విఫలులయ్యారు. తర్వాత ఏలీయా సామాన్యమైన రీతిలో, “యెహోవావైన నీవే దేవుడవైయున్నావని . . . ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము” అని ప్రార్థించాడు. వెంటనే యెహోవానుండి వెలువడిన అగ్ని ఆకాశము నుండి దూసుకు వచ్చి, నీటితో బాగా తడిసిన జంతు బలిని దహించివేసింది. యెహోవా దైవత్వం యొక్క నమ్మకమైన ప్రదర్శనకు పురికొల్పబడిన ప్రజలు ఏలీయాకు విధేయులై 450 మంది బయలు ప్రవక్తలను హతమార్చారు. (1 రాజులు 18:24-40) కనుక ఈనాడు, మనం యింకా యెహోవాను నిజమైన దేవునిగా గుర్తించి, ఆయన బల్లవద్దనే భుజించడానికి దృఢనిర్ణయాన్ని తీసుకోకపోయినట్లైతే, అలా తీసుకోవాల్సివుంది.

‘నమ్మకమైన దాసుడు’ యెహోవా బల్లను సిద్ధపరుస్తున్నాడు

8. తన ప్రత్యక్షత సమయంలో తన శిష్యులకు ఆహారమివ్వడానికి ఏ దాసుని ఉపయోగించుకుంటానని యేసు ముందుగా చెప్పాడు, ఆ దాసుని గుర్తింపు ఏమిటి?

8 తన ప్రత్యక్షత సమయంలో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” తన సేవకులకు ఆత్మీయాహారాన్ని అందిస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ యిలా ప్రవచించాడు: “యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్తయి 24:45-47) ఈ దాసుడు అంటే ఏదో ఒక వ్యక్తికాదు కానీ సమర్పించుకున్న అభిషక్త క్రైస్తవుల తరగతే అని రుజువయ్యింది. ఈ తరగతి, అభిషక్త శేషంకొరకూ గొప్ప సమూహం కొరకు యెహోవా బల్లపైన అతి శ్రేష్ఠమైన ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచి పెడుతోంది. ప్రస్తుతం 40 లక్షలకంటే ఎక్కువమంది ఉన్న “గొప్ప సమూహము” యెహోవా విశ్వ సర్వాధిపత్యం పక్షాన, తన నామాన్ని పరిశుద్ధపరచే ఆయన రాజ్యం పక్షాన అభిషక్త శేషంతో పాటు నిలిచి ఉన్నారు.—ప్రకటన 7:9-17.

9. యెహోవాసాక్షులకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దాసుని తరగతి వారు దేనిని ఉపకరణంగా ఉపయోగిస్తున్నారు, మరి వారి ఆత్మీయ విందు ప్రవచనార్థకంగా ఎలా వివరించబడుతోంది?

9 ఈ నమ్మకమైన దాసుని తరగతి, యెహోవాసాక్షులందరికీ ఆత్మీయ ఆహారం అందించడానికి వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీని ఉపయోగిస్తూ ఉంది. క్రైస్తవమత సామ్రాజ్యము, ఈ విధానానికి సంబంధంగా యితరులు, జీవానిచ్చే ఆత్మీయాహార లేమితో అలమటిస్తుండగా యెహోవా ప్రజలు విందును జరుపుకుంటున్నారు. (ఆమోసు 8:11) ఇది యెషయా 25:6 నందున్న ప్రవచన నెరవేర్పుగా ఉంది: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును.” ఏడు ఎనిమిది వచనాలు చూపుతున్నట్లు, ఈ విందు నిత్యం కొనసాగుతుంది. నేడు యెహోవా దృశ్య సంస్థలో ప్రస్తుతమున్నవారికి అది ఎంత ఆశీర్వాదకరం, అంతేకాక భవిష్యత్తులోనూ అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కదా!

దయ్యాల బల్లమీద ఉన్న విషాహార విషయంలో అప్రమత్తంగా ఉండండి

10. (ఎ) దుష్ట దాసుని తరగతి ఏ విధమైన ఆహారాన్ని అందిస్తోంది, వారిని అలా పురికొల్పేదేమిటి? (బి) దుష్ట దాసుని తరగతి వారు మునుపటి తమ తోటి దాసులను ఎలా చూస్తారు?

10 దయ్యాల బల్లమీద ఉన్న ఆహారం విషపూరితమైంది. ఉదాహరణకు, దుష్ట దాసుని తరగతి, మతభ్రష్టులూ పంచిపెడుతున్న ఆహారాన్ని పరిశీలించండి. అది పోషణనివ్వదు లేక క్షేమాభివృద్ధి కలిగించదు. అది ఆరోగ్యదాయకం కాదు. కానేరదు కూడా, ఎందుకంటే మతభ్రష్టులు యెహోవా బల్లవద్ద భుజించడం మానేశారు. తత్ఫలితంగా, వారు మునుపు పెంపొందించుకున్న నూతన వ్యక్తిత్వమంతా యిప్పుడు పోయింది. వారిని ప్రోత్సహించేది, పరిశుద్ధాత్మ కాదు కానీ కడుపు మంటతో చెలరేగే ఆగ్రహమే. వారు ఒకే ఒక గమ్యాన్ని కల్గివున్నారు—యేసు ప్రవచించినట్లుగా తమతోటి మునుపటి దాసులను కొట్టడమే.—మత్తయి 24:48, 49.

11. ఆత్మీయ ఆహారం విషయంలో ఒకరి ఎంపికను గూర్చి సి. టి. రస్సల్‌ ఏమి రాశాడు, యెహోవా బల్లను విడిచిపెట్టేవారిని ఆయన ఎలా వివరించాడు?

11 ఉదాహరణకు యెహోవా బల్ల నుండి మరలిపోయి, తర్వాత గతమందలి తమ తోటి దాసులతో చెడుగా వ్యవహరించడం ప్రారంభించినవారిని గూర్చి 1909లో వాచ్‌టవర్‌ సొసైటి అధ్యక్షుడైన సి. టి. రస్సల్‌ వ్రాశాడు. ది వాచ్‌టవర్‌ అక్టోబరు 1, 1909 యిలా చెప్పింది: “సంస్థ నుండి దాని పని నుండి తమ్మును తాము వేరుపర్చుకున్న వారందరూ తమ మట్టుకు తాము ఆత్మయందు వర్ధిల్లరు, యితరులను విశ్వాసంలో నిర్మించేబదులు దానికి విరుద్ధమైనదాన్ని చేస్తున్నారు—మునుపు వారు దేని నిమిత్తం పనిచేశారో దానికే హాని కల్గించడానికి ప్రయత్నిస్తూ, తమకు తాము అలాగే తమలాంటి అహంకార మనస్సుగల యితరులకు హానికల్గించుకుంటూ మెల్లమెల్లగా అంధకార కూపంలోకి దిగజారిపోతారు. ఎవరైనా కొందరు వేరే బల్లల దగ్గర తమకు మంచి లేక యింకా శ్రేష్ఠమైన ఆహారం దొరుకుతుందని, లేక తమకు తామే మంచి లేక శ్రేష్ఠమైన దానిని ఉత్పన్నం చేయగలమని భావిస్తే తమ పద్ధతినే అవలంభించుకోనివ్వండి. . . . అయితే యితరులు తమ తృప్తిమేరకు ఆహారమును, వెలుగును కనుగొనడానికి ఎక్కడికైనా వెళ్లడానికి, అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి మనకు అభ్యంతరంలేదు కాని, మనకు వ్యతిరేకులుగా మారినవారు చేపడుతున్న విధానం వేరుగా ఉంది. వాళ్లు పురుష లక్షణంతో “మాకు శ్రేష్టమైంది దొరికింది మీకు యింక సెలవు” అని చెప్పే బదులు వీరు లోక ప్రజలకంటే అధ్వానంగా కోపం, పగ, ద్వేషం, విరోధం వంటి ‘శరీర కార్యాలు దయ్యముల కార్యాలు’ కనపరుస్తున్నారు. వారు పిచ్చితనంతో, సాతాను వెఱ్ఱితో నింపబడివున్నారు. కొందరు మనలను కరుస్తూ మనమే వాళ్లను కరుస్తున్నామని చెబుతారు. వారు తిరస్కారంతో కూడిన అబద్ధాలను చెప్పడానికీ రాయడానికీ, అంతేకాకుండా నీచంగా ప్రవర్తించడానికి ముందడుగేస్తారు.”

12. (ఎ) మత భ్రష్టులు తమ తోటి దాసులను ఎలా కొడతారు? (బి) తాపత్రయంతో మతభ్రష్టుల వ్రాతలనుండి మనం ఆహారం తీసుకోవడం ఎందుకు అపాయకరం?

12 అవును, మతభ్రష్టులు, వక్రీకరించబడిన పూర్తి అబద్ధాలతో నిండిన ప్రచురణలను ప్రచురిస్తుంటారు. తప్పుదోవ పట్టినవారిని చేజిక్కించుకునే ప్రయత్నంలో వాళ్లు సాక్షుల సమావేశాల దగ్గర కూడా పొంచి ఉంటారు. కనుక, అటువంటి వ్రాతలను చదవడానికో లేక వారి దుర్భాషలను వినడానికో మనం తాపత్రయం పెంచుకోవడం ప్రమాదకరం సుమా! అది మనకు వ్యక్తిగతంగా హానికరం కాదని మనం తలంచినా, దాని గాయం మాత్రం మిగులుతుంది. ఎందుకు? ఒక కారణమేమిటంటే, మత భ్రష్టులు ప్రచురించే కొన్ని ప్రచురణలు “ఇంపైన మాటల”తో “కల్పనావాక్యముల”తో అబద్ధాన్ని అందిస్తాయి. (రోమీయులు 16:17, 18; 2 పేతురు 2:3) దయ్యాల బల్ల నుండి మీరు దేన్ని అపేక్షిస్తారు? మత భ్రష్టులు కొన్ని వాస్తవాలను చూపించినప్పటికీ, నిజానికి అవి యెహోవా బల్ల యొద్ద నుండి యితరులను దూరంచేసే లక్ష్యంతో సాధారణంగా అసందర్భసహితమై ఉంటాయి. వారి వ్రాతలన్నీ కేవలం విమర్శిస్తూ కూలదోసేవిగానే ఉంటాయి! ఏదీ క్షేమాభివృద్ధికరమైనది కాదు.

13, 14. మత భ్రష్టుల ప్రచారం యొక్క ఫలాలు ఏమిటి?

13 యేసు యిలా అన్నాడు: “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు.” (మత్తయి 7:16) మరి యిప్పుడు మత భ్రష్టుల, వారి ప్రచురణల ఫలాలేమిటి? నాలుగు విషయాలు వారి ప్రచారంలో కనిపిస్తున్నాయి. (1) తగిన జ్ఞానం లేని అతి తెలివి. ఎఫెసీయులు 4:14 ఇలా చెబుతున్నది: వారు “మాయోపాయములచేత వంచిం”చేవారు. (2) అహంకారంతో కూడిన తెలివి తేటలు (3) ప్రేమ లేకపోవడం. (4) అనేక విధాల్లో అవినీతి. ఇవన్నీ దయ్యాల బల్ల మీది ఆహారంలోని పదార్థాలే. ఇవన్నీ కూడా యెహోవా ప్రజల విశ్వాసాన్ని దిగజార్చడానికే తయారు చేయబడ్డాయి.

14 ఇంకా మరో విషయం ఉంది. మత భ్రష్టులు ఎక్కడికి తిరిగి వెళ్లారు? అనేక విషయాల్లో, వాళ్లు క్రైస్తవమత సామ్రాజ్యం, దాని సిద్ధాంతాల అంధకారంలోకి తిరిగి ప్రవేశించారు. వాటిలో క్రైస్తవులందరూ పరలోకానికి వెళతారనే నమ్మకంతో సహా, అనేకులు రక్తం, తటస్థత అంతేకాకుండా దేవుని రాజ్యం గూర్చి సాక్ష్యమిచ్చే అవసరత విషయాల్లో లేఖనాధార స్థానాన్ని యిక ఏమాత్రమూ చేపట్టడంలేదు. అయితే మనం, మహాబబులోను అంధకారాన్ని తప్పించుకున్నాం, మరలా దానిలోనికి వెళ్లడానికి ఏమాత్రమూ యిష్టపడము. (ప్రకటన 18:2, 4) యెహోవా యథార్థమైన సేవకులుగా, “హితవాక్య ప్రమాణము”ను గైకొనడానికి ఎవరైతే మనకు సహాయపడుతున్నారో వారిని నోటి మాటద్వారా కొడుతూ యెహోవా బల్లను వ్యతిరేకించే ఆ ప్రచారాన్ని మనం కనీసం అలా తొంగి అయినా చూడాలని ఎందుకు అనుకోవాలి?—2 తిమోతి 1:13.

15. మత భ్రష్టులు వేసే నిందలను విన్నప్పుడు జ్ఞానయుక్తమైన పద్ధతిని మనం అవలంభించడానికి మనకు ఏ బైబిలు సూత్రం సహాయం చేస్తుంది?

15 మత భ్రష్టులు మోపే నిందలను తెలుసుకోవాలనే కుతూహలాన్ని కొందరు కల్గివుండవచ్చు. కానీ ద్వితీయోపదేశకాండము 12:29, 30, 31లో ఉన్న సూత్రాన్ని మనం మన హృదయంలోకి తీసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోని అన్య నివాసులను వారు తొలగించినప్పుడు యెహోవా మోషే ద్వారా వాళ్లు దేన్ని నివారించాలనే విషయాన్ని గూర్చి వారిని హెచ్చరించాడు. “వారు నీ యెదుటనుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు.” అవును, మానవ కుతూహలం ఎలా పనిచేస్తుందో యెహోవాకు తెలుసు. హవ్వను, లోతు భార్యను కూడా జ్ఞాపకముంచుకోండి! (లూకా 17:32; 1 తిమోతి 2:14) మత భ్రష్టులు చెప్పేవాటినీ చేసేవాటిని గూర్చి మనమెన్నడూ లక్ష్యపెట్టకుందాము. బదులుగా, ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగచేయడంలోనూ యెహోవా బల్ల యొద్ద నమ్మకంగా భుజించడంలోనూ పనితొందర కల్గివుందాము!

యెహోవా బల్ల మాత్రమే నిలిచి ఉంటుంది

16. (ఎ) సాతానుకు, వాని దయ్యాలకు, లోక రాజ్యాంగములు భుజిస్తున్న సూచనార్థక బల్లకు త్వరలోనే ఏమి సంభవిస్తుంది? (బి) దయ్యాల బల్ల యొద్ద భుజించడాన్ని కొనసాగించే మానవులకు ఏమి సంభవిస్తుంది?

16 త్వరలోనే, మహాశ్రమలు అకస్మాత్తుగా విరుచుకుపడి “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”లోని ముగింపుకు అతి త్వరగా పయనిస్తాయి. (ప్రకటన 16:14, 16) ఈ విధానాన్ని, అలాగే ప్రపంచ రాజ్యాలు భుజిస్తూ ఉన్న సూచనార్థక బల్లను యెహోవా నాశనం చేసినప్పుడు, యిది దాని తారాస్థాయికి చేరుకుంటుంది. అంతేకాకుండా అపవాదియైన సాతానుతో సహా అతని అదృశ్య సంస్థతో వాని దయ్యాల మూకలను కూడా పడద్రోస్తాడు. సాతాను ఆత్మీయ బల్ల యొద్ద అంటే దయ్యాల బల్ల వద్దే యింకా భుజించేవారు, అక్షరార్థమైన భోజనానికి బలవంతంగా హాజరుకావల్సివస్తుంది. దానికి హాజరుకావడం, భుజించేందుకుకాదు గానీ వారే ముఖ్య భోజనం అంటే నాశనం అవుతారు.—యెహెజ్కేలు 39:4; ప్రకటన 19:17, 18 చూడండి.

17. యెహోవా బల్ల యొద్ద మాత్రమే భుజించేవారికి ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?

17 కేవలం యెహోవా బల్లమాత్రమే నిలుస్తుంది. దాని యొద్ద మెప్పుదలతో భుజిస్తున్న వారు కాపాడబడి, నిరంతరం భుజించే ఆధిక్యత వారికి లభిస్తుంది. వారికి ఏవిధమైన ఆహార కొరతలను గూర్చిన భయముండదు. (కీర్తన 67:6; 72:16) వారు పరిపూర్ణ ఆరోగ్యంతో యెహోవా దేవున్ని పరదైసులో ఆరాధిస్తారు! చివరికి ప్రకటన 21:4లోని పులకరింపజేసే మాటలు మహిమాన్వితంగా నెరవేరుతాయి: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” వ్యతిరేకత యిక ఏమాత్రం ఉండదు గనుక, దైవిక అంగీకారమనేది పరదైసు భూమిని ఆక్రమించుకునే మానవజాతిపై కురుస్తుండగా, యెహోవా దేవుని విశ్వసర్వాధిపత్యం ప్రతిచోట ఎప్పటికీ ఉంటుంది. ఈ ప్రతిఫలాన్ని సంపాదించడానికి, శ్రేష్ఠమైన ఆత్మీయ ఆహారంతో పొంగిపొర్లుతున్న యెహోవా బల్ల యొద్ద మాత్రమే భాగం వహించడానికి నిశ్చయించుకుందాము!

మీరెలా జవాబిస్తారు?

◻ దయ్యాల బోధ వలన మనం తప్పుదోవపట్టకుండా ఎలా జాగ్రత్తపడగలము?

◻ యెహోవా బల్ల యొద్ద, అలాగే దయ్యాల బల్ల యొద్ద ఎందుకు మనం విజయవంతంగా భుజించలేము?

◻ మత భ్రష్టులు ఏ విధమైన ఆహారాన్ని పంచిపెడుతున్నారు?

◻ మత భ్రష్టులు వేసే నిందలను గూర్చి కుతూహలం కల్గివుండడం ఎందుకు అపాయకరం?

◻ మత భ్రష్టుల ఫలాలు ఏమిటి?

[10వ పేజీలోని చిత్రం]

యెహోవా బల్ల శ్రేష్ఠమైన ఆత్మీయాహారంతో పొంగిపొర్లుతోంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి