అధికారానికి ఏమి సంభవించింది?
ఆలోచనా పరులైన ప్రజలు అధికారం యొక్క అవసరతను గుర్తిస్తారు. ఏదో ఒక రకమైన అధికార వ్యవస్థ లేకుండా స్వల్పకాలంలోనే మానవ సమాజం అస్తవ్యస్తమైపోతుంది. అందుకే రాజ్యాంగ న్యాయశాస్త్రంపై ఓ సుప్రసిద్ధ ఫ్రెంచ్ పాఠ్య పుస్తకం యిలా పేర్కొంటోంది: “ఏ మానవ గుంపులోనైనా, రెండు తరగతుల ప్రజలు కనిపిస్తారు: శాసించేవారూ విధేయులయ్యేవారు, ఆజ్ఞలు జారీ చేసేవారూ దాన్ని పాటించేవారు, నాయకులూ సభ్యులు, పరిపాలకులూ పరిపాలింపబడేవారు. . . . ఏ మానవ సమాజంలోనైనా అధికారం నెలకొని ఉండడం కనిపిస్తుంది.”a
అయినప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధం నుండి, ప్రత్యేకంగా 1960లలో అధికారం యెడల గల వైఖరులు మారాయి. ఆ కాలాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తూ ఫ్రెంచ్ ఎన్‌సైక్లోపీడియా యూనివర్‌సాలిస్, “ఆచారాధిపత్య వ్యతిరేకత, అధికార వ్యతిరేకత అనే సమస్యను” గూర్చి మాట్లాడింది. అలాంటి సమస్య బైబిలు విద్యార్థులకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించదు. అపొస్తలుడైన పౌలు యిలా ప్రవచించాడు: “ఈ ప్రపంచం చివరి కాలాలు సంక్షోభ సమయాలని జ్ఞాపకముంచుకోండి. ప్రజలు తమ్మును తామూ, డబ్బునూ తప్ప వేరే దేన్నీ ప్రేమించరు; వారు డంబములు పలుకుతారు, అహంకారులు, దూషకులు; తలిదండ్రులకు అవిధేయులు . . . ; వారు ద్వేషంతో తీరని పగను కల్గివుంటారు, . . . అదుపులేకుండా దౌర్జన్యం జరిగిస్తారు . . . స్వయం ప్రాముఖ్యతతో ఉబికిపోయి ఉంటారు. తమ దేవునికంటే కూడా వారు తమ సౌఖ్యాలను ఎక్కువగా ప్రేమిస్తారు.”—2 తిమోతి 3:1-4, ది రివైజ్డ్ ఇంగ్లీష్ బైబిల్.
అధికార సంక్షోభం
ఈ ప్రవచనం మన దినాలనూ కాలాన్ని సరిగ్గా వర్ణిస్తోంది. కుటుంబం, పబ్లిక్ స్కూల్, విశ్వవిద్యాలయం, వ్యాపార సమారంభం, స్థానిక జాతీయ ప్రభుత్వాలు—అన్ని స్థాయిల్లోనూ అధికారం సవాలు చేయబడుతోంది. లైంగిక తిరుగుబాటు, మౌలిక రాప్ సంగీతం, విద్యార్థి ప్రదర్శనలు, ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి చేసే సమ్మెలు, ప్రజా తిరుగుబాటు, ఉగ్రవాద కార్యకలాపాలన్నీ అధికారం యెడల అగౌరవానికి సూచనలే.
ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, పారిస్‌లోని దిన పత్రిక లె మండ్ ఏర్పాటుచేసిన గోష్ఠిలో ప్రొఫెసర్ ఎవ్ మెనె యిలా పేర్కొన్నారు: “అధికారం న్యాయసమ్మతమైనప్పుడే అది నిలువగలదు.” ఈనాటి అధికార అస్థిరతకు గల ఒక కారణమేమంటే, అధికారంలో ఉన్నవారి నిజాయితీని అనేకులు శంకించడమే. అంటే, అధికారంలో ఉన్నవారి హక్కును వీరు అనుమానిస్తున్నారన్నమాట. అమెరికాలోని జనాబాలో 9 శాతం, ఆస్ట్రేలియాలో 10 శాతం, బ్రిటన్‌లో 24 శాతం, ఫ్రాన్స్‌లో 26 శాతం, ఇండియాలో 41 శాతం మంది ప్రజలు తమ ప్రభుత్వాలు పరిపాలించే న్యాయపర హక్కును కలిగిలేవని పరిగణిస్తున్నారని 1980లలో చేసిన అభిప్రాయ సేకరణ బయల్పర్చింది.
న్యాయసమ్మతమైన అధికారం కొరకు మానవుని అన్వేషణ
బైబిలు ప్రకారం, మానవుడు మొదట దేవుని అధికారం క్రింద ఉండేవాడు. (ఆదికాండము 1:27, 28; 2:16, 17) అయినప్పటికీ, ఆ తొలి దశలోనే మానవులు తమ సృష్టికర్త నుండి నైతిక స్వేచ్ఛను కోరారు. (ఆదికాండము 3:1-6) దైవపరిపాలనను, లేక దేవుని పాలనను తిరస్కరించినందువల్ల వారు యితర విధాలైన అధికారాలను ఎన్నుకోవాల్సి వచ్చింది. (ప్రసంగి 8:9) కొందరు తమ అధికారాన్ని బలవంతంగా చెలాయించారు. అట్టి వారికి శక్తే హక్కుగా ఉందని పరిగణించారు. వారు తమ యిచ్ఛను ప్రవేశపెట్టగల్గేంత బలంగా ఉంటే వారికి సరిపోయింది. అయితే అనేకులు పరిపాలించే తమ హక్కును న్యాయ సమ్మతమైందిగా ఉంచాలని భావించారు.
అనాది కాలాలనుండి అనేక పరిపాలకులు తామే దేవుళ్లమనో లేక తమకు దేవున్నుండి అధికారం వచ్చిందనో చెప్పుకోవడం ద్వారా దీన్ని చేసేవారు. ఇది, మెసొపొటోమియా తొలి పరిపాలకులు, పురాతన ఐగుప్తు యొక్క ఫరోలు చెప్పుకున్న “పరిశుద్ధ రాజరికం” యొక్క కల్పిత సిద్ధాంతము.
అలెగ్జాండర్ ది గ్రేట్, అతని తర్వాతివారైన గ్రీకు జాతీయ రాజులు అనేకమంది రోమా చక్రవర్తులు కూడా తాము దేవుళ్లమని చెప్పుకున్నారు దానికి తోడు తాము ఆరాధింపబడాలని కూడా అధికారంగా అడిగారు. అలాంటి పరిపాలకుల క్రింద ఉన్న విధానాలు “పాలక మతశాఖలు” అని పిలువబడేవి, మరి జయించబడిన విభిన్న ప్రజలు పాలకుని అధికారాన్ని బలపర్చేలా చేయడము వాటి ఉద్దేశంగా ఉండేది. పాలకుని ఆరాధించకపోవడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే చర్యగా ఖండించబడేది. ది లెగసీ ఆఫ్ రోమ్ అనే పుస్తకంలో ప్రొఫెసర్ ఎర్నెస్ట్ బార్క్‌ర్ యిలా వ్రాశారు: “[రోమా] చక్రవర్తిని దైవంగా భావించడం, తన దైవత్వపు లక్షణంగా అతను పొందే ప్రభుభక్తీ, స్పష్టంగా అతని సామ్రాజ్యానికి పునాదిగా లేక దృఢమైన ఐక్యబంధంగా ఉన్నాయి.”
కాన్‌స్టెన్‌టైన్ చక్రవర్తి (306-337 మధ్య పరిపాలించాడు) “క్రైస్తవత్వాన్ని” అధికారికంగా చేసినప్పటికీ, ఆ తర్వాత చక్రవర్తియైన థియోడియస్ I (379-395 మధ్య పరిపాలించాడు) దాన్ని రోమా సామ్రాజ్యపు రాష్ట్ర మతంగా స్వీకరించినప్పటికీ పరిస్థితి అలాగే కొనసాగింది. కొందరు “క్రైస్తవ” చక్రవర్తులు సా. శ. అయిదవ శతాబ్దం వరకూ దేవుళ్లుగా ఆరాధించబడేవారు.
“రెండు అధికారాలు,” “రెండు ఖడ్గములు”
పోప్ మతాధికారిత్వము మరింత శక్తివంతం అయ్యేకొలది, చర్చికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్యలు జటిలమయ్యాయి. కాబట్టి, అయిదవ శతాబ్దం చివర్లో పోప్ గెలాసియస్ “రెండు అధికారాలు” అనే సూత్రాన్ని ప్రవేశపెట్టాడు: ఇందులో రాజులు పోప్‌లకు లోబడి ఉంటారు. రాజుల రాజరికపు అధికారంతో సహా పోప్‌ల పరిశుద్ధ అధికారం కూడా ఉంటుంది. తర్వాత ఈ సూత్రం “రెండు ఖడ్గాల” సిద్ధాంతంగా కూడా వృద్ధి చెందింది: “ఆత్మీయ ఖడ్గాన్ని పోప్‌లు తమ ఆధీనంలో ఉంచుకుని, లౌకిక ఖడ్గాన్ని లౌకిక పాలకులకు యిచ్చారు. అయితే పాలకులు లౌకిక ఖడ్గాన్ని పోప్ నడిపింపు ప్రకారమే ఉపయోగించాలి.” (ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా) ఈ సిద్ధాంతంపై ఆధారపడే మధ్య యుగంలో, చక్రవర్తుల, రాజుల అధికారాన్ని న్యాయసమ్మతం చేయడం కొరకు చక్రవర్తులను, రాజులను నియమించే అధికారం తనకే ఉందని కాథోలిక్ చర్చి చెప్పుకుంది, అలా “పరిశుద్ధ రాజరికపు” కల్పిత భావాన్ని స్థిరపర్చింది.
అయితే యిది రాజకీయ పాలకులను పోప్‌ల అధికారం నుండి విడిపించే లక్ష్యంతో ఆ తర్వాత వృద్ధిచెందిన రాజుల దైవిక హక్కు అనేదానితో దీనిని కలిపి గలిబిలి చెందకూడదు. దైవిక హక్కు అనే సిద్ధాంతంలో రాజు తన అధికారాన్ని నేరుగా దేవున్నుండే పొందుతాడుగానీ రోమ్ నందలి పోప్ నుండి కాదు. ది న్యూ కాథోలిక్ ఎన్‌సైక్లోపీడియా యిలా చెబుతోంది: “పోప్ విశ్వ వ్యాప్తంగా ఆత్మీయ, లౌకిక అధికారాన్ని ప్రభుత్వాధినేతలపై ఉపయోగిస్తున్న సమయంలో, దైవిక హక్కు అనే ఆలోచన, జాతీయ ప్రభుత్వాల రాజులు తమ అధికారం కూడా పోప్ అధికారమంతే దైవికమైందని సమర్థించుకునే స్థితికి తెచ్చింది.”b
విస్తృత సర్వాధిపత్యపు కల్పన
సమయం గడిచేకొలది, మానవులు యితర అధికార మూలాలను సూచించారు. ప్రజల సర్వాధిపత్యం అందులో ఒకటి. ఈ ఆలోచన గ్రీసులో ప్రారంభమైందని అనేకులు భావిస్తారు. అయినను, పురాతన గ్రీకు ప్రజాస్వామ్యాన్ని కేవలం కొన్ని పట్టణ ప్రభుత్వాలు మాత్రమే అవలంభించాయి. అయినా వీటిలో కేవలం పురుష పౌరులే వోటు వేసేవారు. జనాబాలో సగం నుండి అయిదులో నాలుగవవంతు వరకున్న స్త్రీలు, దాసులు, పరదేశీయులు దానిలో పాల్గొనేవారు కాదు. అది నిజంగా విస్తృత ప్రజాధిపత్యం కాదు!
ప్రజాధిపత్యపు ఆలోచనను ఎవరు ప్రారంభించారు? ఆశ్చర్యకరంగా, మధ్యయుగంలో రోమా కాథోలిక్ వేదాంతులు దీన్ని ప్రవేశపెట్టారు. థామస్ ఆక్వినాస్ 13వ శతాబ్దంలో, సర్వాధిపత్యం దేవునినుండే పుడుతున్నప్పటికీ, అది ప్రజల చేతిలో ఉందనే ఆలోచనను కల్గివున్నాడు. ఆ ఆలోచన ప్రసిద్ధిగాంచింది. ది న్యూ కాథోలిక్ ఎన్‌సైక్లోపీడియా యిలా అంటోంది: “అధికారానికి ప్రజలే మూలం అనే ఈ ఆలోచన, 17వ శతాబ్దంలోని అనేకమంది కాథోలిక్ వేదాంతుల మద్దతును పొందింది.”
పోప్‌నే గానీ, బిషప్‌నే గాని, లేక యాజకులనుగాని ఎంపిక చేయడానికి ప్రజలు ఏమాత్రం అవకాశంలేని చర్చి వేదాంతులు ప్రజల సర్వాధిపత్యాన్ని గూర్చి ఎందుకు ప్రబోధిస్తారు? ఎందుకంటే, కొందరు ఐరోపా రాజులు పోప్ అధికారం క్రింద చాలా వ్యాకులత చెందారు. విస్తృత సర్వాధిపత్య సిద్ధాంతం, అవసరమనిపిస్తే చక్రవర్తినిగానీ లేక రాజునుగానీ పడద్రోసే అధికారాన్ని పోప్‌కు యిచ్చింది. చరిత్రకారులైన విల్, ఏరియల్ డ్యూరంట్‌లు యిలా రాశారు: “సర్వాధిపత్యాన్ని సమర్థించేవారిలో, పోప్ అధికారానికి విరుద్ధమైన రాజరికాన్ని బలహీనపర్చే ఓ ఆధారాన్ని కనుగొన్న అనేక మంది జేసూట్లు కూడా చేరివున్నారు. రాజుల అధికారం ప్రజల నుండి వస్తూ వారికి చెందిందే గనుక, అప్పుడది నిశ్చయంగా పోప్‌ల ఆధిపత్యంలోను ఉంటుందని కార్డినల్ బెల్లార్మైన్ వాదించారు, . . . లూయిస్ మోలినా అనే ఒక స్పానిష్ జేసూట్ లౌకిక అధికారానికి మూలమైన ప్రజలు న్యాయసమ్మతంగా, క్రమమైన పద్ధతి ద్వారా అక్రమ రాజులను తొలగించవచ్చునన్న నిర్ధారణకొచ్చాడు.”
అయితే, ఈ “క్రమమైన పద్ధతి”ని పోప్ ఏర్పాటు చేయవచ్చు. దీన్ని నిర్ధారిస్తూ ఫ్రెంచ్ కాథోలిక్ వారి ఎస్ట్‌వార్ యూనివర్సెల్ డి లాగ్లేజ్ కాటోలెక్, బయోగ్రఫే యూనివర్సెల్‌లోని వాటిని ఉల్లేఖించింది. అది ఇలా పేర్కొంటోంది: “బెల్లార్మైన్ . . . రాజులు తమ అధికారాన్ని ప్రజలనుండి పొందుతారనీ, అయితే ప్రజలు కేవలం పోప్ ప్రభావం క్రింద మాత్రమే తమ హక్కును వినియోగించుకోగలరనే కాథోలిక్క్‌ల సామాన్య సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు.” (ఇటాలిక్కులు మావి) అలా ప్రజల సర్వాధిపత్యమనేది, పాలకులను ఎంపిక చేయడానికీ అవసరమైతే వారిని తీసివేయడానికీ పోప్ చేతిలోని సాధనంగా మారింది. మరి ప్రాతినిధ్య కాథోలిక్ ఇటీవలికాలాల్లో, కాథోలిక్ వోటర్లను ప్రభావితం చేయడానికి అనుమతించింది.
ఆధునిక దిన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క న్యాయబద్ధమైన హక్కు, “పాలించబడేవారి అనుమతి”పై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇది “అధిక సంఖ్యాకుల అనుమతి,” అంతేకాకుండా వోటర్ల ఉదాసీన వైఖరి, రాజకీయ మోసకర ఉపాయాల కారణంగా, ఈ “అధిక సంఖ్య” వాస్తవానికి జనాబాలోని ఒక అల్ప సంఖ్యాక వర్గం మాత్రమే. నేడు, “పాలించబడేవారి అనుమతి” అంటే తరచూ “పాలించబడేవారు మౌనంగా అంగీకరించడం లేదా విరమించుకోవడం” అని భావము.
జాతీయ సర్వాధిపత్యపు కల్పన
తొలి పోప్‌లు ప్రబోధించిన పరిశుద్ధ రాజరికపు కట్టుకథ, రాజుల దైవిక హక్కుగా పరిణామం చెందటంతో అది మతాధికారానికి ఎదురు దెబ్బ తీసింది. అలాగే విస్తృత ప్రజా సర్వాధిపత్యపు సిద్ధాంతం కాథోలిక్ చర్చిపై పెద్ద దెబ్బ తీసింది. ఆంగ్లేయులైన థామస్ హోబస్, జాన్ లాకీ మరియు ఫ్రెంచ్ వారైన జీన్ జాక్ రౌసీ వంటి లౌకిక తత్వవేత్తలు 17, 18వ శతాబ్దాల కాలాల్లో విస్తృత ప్రజా సర్వాధిపత్య అభిప్రాయాన్ని గూర్చి ఆలోచించారు. పరిపాలకులు పరిపాలించబడేవారి మధ్య “సాంఘిక ఒప్పందం” యొక్క సిద్ధాంతపు విధానాలను వారు తీసుకుని వచ్చారు. వారి సూత్రాలు వేదాంతంపై కాక “సహజసూత్రాలపై” ఆధారపడి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ సిద్ధాంతం కాథోలిక్ చర్చికి మతాధికారత్వానికీ తీవ్రమైన హాని కలిగించే అభిప్రాయాలపై ఆధారపడి ఉన్నది.
రౌసీ మరణించిన కొద్దికాలానికే ఫ్రెంచ్ విప్లవం మొదలైంది. ఈ విప్లవం న్యాయసమ్మతాన్ని గూర్చిన ఆలోచనలను నాశనం చేసింది, కొత్తదైన మరోదాన్ని సృష్టించింది, అదే జాతీయ సర్వాధిపత్యం. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా యిలా వ్యాఖ్యానిస్తోంది: “రాజుల దైవిక హక్కును కులీనుల ఉన్నతత్వాన్నీ, రోమన్ కాథోలిక్ చర్చి ఆధిక్యతలనూ ఫ్రెంచ్ విసర్జించింది.” అయితే, బ్రిటానికా యిలా అంటోంది: “విప్లవం కొత్త ఆవిష్కరణను అనగా జాతీయ ప్రభుత్వాన్ని పరిణతికి తెచ్చింది.” విప్లవకారులకు ఈ కొత్త “ఆవిష్కరణ” ఎందుకు అవసరము?
ఎందుకంటే రౌసీ చాటించిన పద్ధతి క్రింద పాలకులను ఎన్నుకునే విషయంలో పౌరులందరికీ సమాన వంతు ఉంటుంది. దీని మూలంగా ఫ్రెంచ్ విప్లవ నాయకులు యిష్టపడని విశ్వవ్యాప్త వోటు హక్కుపై ఆధారపడిన ప్రజాస్వామ్యం ఫలిస్తుంది. ప్రొఫెసర్ డ్యువర్‌జర్ యిలా వివరించారు: “ప్రత్యేకంగా కోరదగినది కాదని దృష్టించిన ఆ ఫలితాన్ని నివారించడానికే 1789 నుండి 1791 వరకు సంవిధాన సభకు చెందిన పలుకుబడిగల మధ్యతరగతి సభ్యులు, జాతీయ సర్వాధిపత్యపు సిద్ధాంతాన్ని సృష్టించారు. వారు ప్రజలను ‘జాతి’తో గుర్తించేవారు, అది దాని యితర భాగాలకున్న, ప్రత్యేకంగా ఒక నిజమైన అస్తిత్వమని పరిగణిస్తారు. కేవలం జాతి మాత్రమే దాని ప్రతినిధులతో, సర్వాధిపత్యాన్ని చెలాయించే హక్కుదారియై ఉంది. . . . ప్రజాస్వామ్యంగా కనిపించే జాతీయ సర్వాధిపత్యపు సిద్ధాంతం నిజంగా ప్రజాస్వామ్యం కాదు, ఎందుకంటే అది ప్రత్యేకంగా నిరంకుశత్వాన్ని అలాగే ఏ విధమైన ప్రభుత్వాన్నైనా సమర్ధించడానికి ఉపయోగించబడగలదు.” (ఇటాలిక్కులు ఆయనవే.)
విఫలమయ్యే మానవ ప్రయత్నాలు
ఒక జాతి ప్రభుత్వాన్ని అధికారానికి న్యాయసమ్మతమైన మూలంగా అంగీకరించడం జాతీయతకు దారితీసింది. న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా యిలా పేర్కొంటోంది: “జాతీయత తరచుగా చాలా పాతదని భావించబడేది; రాజకీయ ప్రవర్తనలో అది ఒక శాశ్వత అంశమని తప్పుగా పరిగణించబడింది. అసలు, అమెరికన్, ఫ్రెంచ్ విప్లవాలు, మొట్ట మొదటి శక్తివంతమైన ప్రత్యక్షతలని పరిగణించబడవచ్చు.” ఈ విప్లవాలు వచ్చినప్పటి నుండి, జాతీయత అనేది అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలకు వ్యాపించింది. జాతీయత పేరులో ఘోరమైన యుద్ధాలు న్యాయసమ్మతం చేయబడ్డాయి.
బ్రిటిష్ చరిత్రకారుడైన ఆర్నాల్డ్ టోన్‌బీ యిలా రాశాడు: “వర్గవ్యవస్థ అనే పాత సీసాల్లోని ప్రజాస్వామ్యమనే కొత్త ద్రాక్షారసమందలి పులిసి పొంగిన పదార్థమే జాతీయతా ఆత్మ. . . . జాతీయతకూ వర్గవ్యవస్థకు మధ్య కుదిరిన ఈ విచిత్రమైన ఒప్పందం, మన ఆధునిక పాశ్చాత్య లోకపు వ్యవహారశీల రాజకీయంలో, ప్రజాస్వామ్యం కంటే ఎంతో బలమైనదిగా ఉంది.” జాతీయత అనేది శాంతియుతమైన ప్రపంచాన్ని సృజించలేదు. టోన్‌బీ యిలా అన్నాడు: “మత యుద్ధాలు ముగిసిన అతి తక్కువ వ్యవధిలోనే జాతీయతా యుద్ధాలు ప్రారంభమయ్యాయి; అంతేకాదు మన ఆధునిక పాశ్చాత్య లోకంలో మత మౌఢ్య స్ఫూర్తి, జాతీయ మౌఢ్య స్ఫూర్తి రెండూ ఒకే ఉన్మాద కోరికలచే విషయం స్పష్టమౌతోంది.”
“పరిశుద్ధ రాజరికం,” “రాజుల దైవిక హక్కు,” “విస్తృత ప్రజా సర్వాధిపత్యం,” “జాతీయ సర్వాధిపత్యాల” కల్పనల సహాయంతో పాలకులు తమ తోటి మానవులపై తమ అధికారాన్ని న్యాయసమ్మతం చేసుకోడానికి ప్రయత్నించారు. అయితే మానవ పాలకుల ఇతివృత్తాన్ని పరిశీలించిన మీదట ఓ క్రైస్తవుడు సొలొమోను వ్యక్తపర్చిన ఆలోచనను పంచుకోక తప్పదు: “ఒకడు మరియొకనిపై అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.
రాజకీయ ప్రభుత్యాన్ని ఆరాధించే బదులు క్రైస్తవులు దేవున్ని ఆరాధించి, అన్ని అధికారాలకూ ఆయనే న్యాయసమ్మతమైన మూలమని గుర్తిస్తారు. “యెహోవా, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.” (1 దినవృత్తాంతములు 29:11) అయితే, దేవునికి విధేయులు కావడం వల్ల, వారు లౌకిక, ఆత్మీయ రంగాల్లో అధికారానికి సరైన గౌరవాన్ని కనపరుస్తారు. వారు దీనిని సంతోషంతో ఎలా మరియు ఎందుకు చేయగలరు అనే విషయం తర్వాతి రెండు శీర్షికల్లో పరిశీలించబడుతుంది.
[అధస్సూచీలు]
a మారెస్ డ్యువెర్‌జా రాసిన డ్వ్రా కాన్స్‌టిట్యూసియోనెల్ ఏ ఇన్స్‌టిట్యూషన్స్ పాలిటిక్స్.
b ది కాథోలిక్ ఎన్‌సైక్లోపీడియా యిలా పేర్కొంటోంది: “‘రాజుల’ ఈ ‘దైవిక హక్కు’ను (రాజైనప్పటికీ లేక గణతంత్రమైనప్పటికీ అన్ని అధికారాలూ దేవుని నుండి కలిగాయన్న సిద్ధాంతానికి చాలా భిన్నంగా ఉంటుంది), కాథోలిక్క్ చర్చి ఎన్నడూ ఆమోదించలేదు. సంస్కరణ సమయంలో, కాథోలిక్ మతానికి పూర్తి భిన్నమైన రూపాన్ని సంతరించుకుంది; ఆత్మీయ సంబంధమైన, అలాగే ప్రజా అధికారాల సంపూర్ణత తమవేనని ఇంగ్లాండ్‌కు చెందిన హెన్రీ VIII, జేమ్స్ I వంటి ఏకచత్రాధిపతులు తెలిపారు.”
[15వ పేజీలోని చిత్రం]
చక్రవర్తులను, రాజులను నియమించే అధికారం తనకే ఉందని కాథోలిక్ చర్చి చెప్పుకుంది
[క్రెడిట్ లైను]
Consecration of Charlemagne: Bibliothèque Nationale, Paris