“యేసుక్రీస్తు ప్రభువు”—ఎలా, ఎప్పటి నుండి?
“ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు—నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.” ఇది కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం కీర్తన 110:1 యొక్క తర్జుమా. ఇక్కడ “ప్రభువు” ఎవరు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు?
మొదటి ప్రశ్నకు హెబ్రీ లేఖనం యొక్క మరింత కచ్చితమైన తర్జుమా వెంటనే సమాధానమిస్తుంది. “యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు: . . . ” అలా, పెద్ద అక్షరాలతోవున్న “ప్రభువు” సర్వోన్నత దేవుడైన యెహోవాను సూచిస్తుంది. కింగ్ జేమ్స్ వర్షన్ దైవిక నామాన్ని ప్రభువు అనే మాటకు భిన్నమైన “ప్రభువు”ను ఉపయోగించినప్పటికీ, పేర్ల విషయంలో గందరగోళం చేయడం ఇది మొదటిసారి కాదు, హెబ్రీ నుండి తర్జుమా చేయబడిన ప్రాచీన గ్రీకు సెప్టాజింట్, తర్వాతి ప్రతులలో యెహోవాకు “ప్రభువు” అనే ఉపయోగించింది. ఎందుకు? ఎందుకంటే దైవిక నామం, (יהוה) అనే నాలుగక్షరాల పదానికి బదులు “ప్రభువు” అనే పేరును ఉపయోగించింది. పండితుడైన ఎ. ఇ. గార్‌వీ ఇలా చెప్పాడు: “యూదుల సమాజమందిరంలో లేఖనాలు చదువబడుతున్నప్పుడు, నిబంధన పేరైన యహావహా [యెహోవా]ను ఉపయోగించడానికి బదులు, ప్రభువు (కైరియోస్) అనే పేరును ఉపయోగించడం ఎంతో సుళువైనదని, సరైనదని వివరించబడి యుండవచ్చును.”
బైబిలు యెహోవాను “సర్వోన్నత ప్రభువు” అని గుర్తిస్తున్నది. (ఆదికాండము 15:2, 8; అపొస్తలుల కార్యములు 4:24; ప్రకటన 6:10) ఆయన “ప్రభువు,” “భూలోకమునకు ప్రభువు” అని కూడా పిలువబడ్డాడు. (నిర్గమకాండము 23:17; యెహోషువ 3:13; ప్రకటన 11:4) అయితే, కీర్తన 110:1 నందలి మరొక “ప్రభువు” ఎవరు, ఆయన యెహోవాచే “ప్రభువు”గా ఎలా గుర్తించబడ్డాడు?
“ప్రభువు”గా యేసుక్రీస్తు
నాలుగు సువార్తల్లో, ఎంతో తరచుగా లూకా మరియు యోహానులలో యేసు “ప్రభువు”గా పేర్కొనబడ్డాడు. సామాన్య శకము మొదటి శతాబ్దంలో, ఆ బిరుదు గౌరవానికి, మర్యాదకు సూచనయైన “అయ్యా” అనే పదానికి సమానమైనది. (యోహాను 12:21; 20:15, కింగ్‌డమ్ ఇంటర్లీనియర్) మార్కు సువార్తలో యేసును సంబోధించేటప్పుడు “బోధకుడు,” లేక రబ్బూనీ అనే పదం, అత్యంత తరచుగా ఉపయోగింపబడింది. (మార్కు 10:51ను లూకా 18:41తో పోల్చండి.) దమస్కుకు వెళ్తున్న దారిలో “ప్రభువా, నీవెవడవు” అనే సౌలు ప్రశ్నలో కూడా అలాగే సామాన్యంగా మర్యాదపూర్వకంగా విచారణ చేస్తున్న భావంలోనే ఉంది. (అపొస్తలుల కార్యములు 9:5) కాని యేసు అనుచరులు తమ బోధకున్ని తెలుసుకున్నప్పుడు, వారు “ప్రభువు” అనే పేరును ఉపయోగించడం కేవలం గౌరవాన్నే కాక మరెంతో సూచించిందన్నది వాస్తవము.
ఆయన మరణ పునరుత్థానముల తర్వాత, అయితే పరలోకానికి ఆరోహణం కాకముందు, యేసు తన శిష్యులకు ప్రత్యక్షమై ఈ భీతిగొల్పే ప్రకటన చేశాడు: “పరలోకమందును, భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” (మత్తయి 28:18) తర్వాత, పెంతెకొస్తునాడు, కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ ప్రభావంతో పేతురు కీర్తన 110:1ని సూచిస్తూ ఇలా చెప్పాడు: “మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెను.” (అపొస్తలుల కార్యములు 2:34-36) మ్రానుపై అవమానకరమైన మరణం పొందునంతవరకు ఆయన చూపిన యథార్థతను బట్టి, యేసు పునరుత్థానం చేయబడి, అత్యున్నత బహుమానం పొందాడు. అప్పుడు ఆయన పరలోకంలో తన అధికారంలోకి ప్రవేశించాడు.
అపొస్తలుడైన పౌలు, దేవుడు “సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు మాత్రమేగాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టు కొనియున్నాడు” అని వ్రాస్తూ పేతురు మాటలను దృఢపర్చాడు. (ఎఫెసీయులు 1:20, 21) యేసుక్రీస్తు ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలన్నిటి కంటే ఉన్నతమైంది, అది నూతన లోకంలోకి కూడా కొనసాగుతుంది. (1 తిమోతి 6:15) “తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని” ప్రతి ఒక్కరు అంగీకరించేలా, ఆయన “అధికముగా” హెచ్చింపబడి ఆయనకు “ప్రతి నామమునకు పైనామము” ఇవ్వబడెను. (ఫిలిప్పీయులు 2:9-11) కీర్తన 110:1 యొక్క మొదటి భాగం అలా నెరవేర్చబడింది, “దూతలు, అధికారులు, శక్తులు” యేసు అధికారానికి లోబడ్డాయి.—1 పేతురు 3:22; హెబ్రీయులు 8:1.
హెబ్రీ లేఖనాల్లో, “ప్రభువులకు ప్రభువు” అనే మాట కేవలం యెహోవాకే వర్తిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 10:17; కీర్తన 136:2, 3) కాని పేతురు ప్రేరేపింపబడినవాడై క్రీస్తుయేసు గురించి ఇలా చెప్పాడు: “అందరికి ప్రభువు [లేక, “మనందరి ప్రభువు,” గుడ్‌స్పీడ్].” (అపొస్తలుల కార్యములు 10:36) వాస్తవానికి ఆయన “మృతులకును సజీవులకును ప్రభువు.” (రోమీయులు 14:8, 9) క్రైస్తవులు యేసుక్రీస్తును తమ ప్రభువుగా, యజమానిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు, ఆయన అమూల్యమైన రక్తంతో కొనబడినవారిగా, ఆయనచే పరిపాలింపబడే వారిగా వారాయనకు ఇష్టపూర్వకంగా విధేయత చూపిస్తారు. సా.శ. 33 పెంతెకొస్తు నాటినుండి యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తన సంఘంపై పరిపాలిస్తున్నాడు. అయితే ఇప్పుడు, 1914 నుండి, ‘తన శత్రువులు తనకు పాద పీఠముగా’ చేయబడి రాజుగా అధికారముతో పరిపాలించునట్లు ఆయనకు రాజ్యాధికారము ఇవ్వబడినది. మరియు ఇప్పుడు కీర్తన 110:1, 2 యొక్క పూర్తి నెరవేర్పుగా ఆయన ‘తన శత్రువుల మధ్య పరిపాలనను’ ముగించు సమయము ఆసన్నమైయుంది.—హెబ్రీయులు 2:5-8; ప్రకటన 17:14; 19:16.
అయితే, తన మరణ పునరుత్థానానికి ముందు “సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది” అని చెప్పిన యేసు మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? (మత్తయి 11:25-27; లూకా 10:21, 22) ఇది ఇంత వరకు చర్చించిన కథనం లాంటిది కాదు. మత్తయి, లూకా యీ రెండింటిలోను, యేసు తండ్రిని “బాగా ఎరుగును” గనుక లోక జ్ఞానులకు మరుగు చేయబడి, ఆయన ద్వారా వెల్లడి చేయబడిన జ్ఞానాన్ని గురించి యేసు మాట్లాడుతున్నాడని ఆ సందర్భం తెలియజేస్తుంది. ఆయన నీటిలో బాప్తిస్మం తీసుకుని దేవుని ఆత్మీయ కుమారునిగా అభిషేకించబడినప్పుడు, యేసు పరలోకంలో తాను కలిగివున్న మానవ పూర్వపు ఉనికిని, దానితోపాటువున్న సమస్త జ్ఞానాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు, కాని ఆయనకు తర్వాత లభించిన అధికారం నుండి ఇది వేరైనది.—యోహాను 3:34, 35.
యేసుక్రీస్తును ప్రభువుగా గుర్తించుట
యెహోవా దేవున్ని “ప్రభువు” అని స్పష్టంగా సూచించే హెబ్రీ లేఖనాలనుండి వచనాలను తర్జుమా చేసేటప్పుడు కొన్ని క్రైస్తవ గ్రీకు లేఖనాల అనువాదాలు సమస్యను కలిగిస్తాయి. ఉదాహరణకు, లూకా 4:19ని కింగ్ జేమ్స్ వర్షన్‌లో లేదా ది న్యూ జెరూసలేమ్ బైబిల్‌లోనున్న యెషయా 61:2తో పోల్చండి. యెహోవా యొద్ద నుండి యేసు “ప్రభువు” అనే పేరును తీసుకున్నాడని, శరీరధారియైన యేసు యెహోవాయేనని, కొంతమంది ప్రజలు చెబుతారు, కాని ఈ వాదనకు లేఖనాధారం లేదు. యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఒకరికొకరు వేరైయున్నారని లేఖనాల్లో ఎప్పుడు జాగ్రత్తగా తెలియజేయబడ్డారు. యేసు ఆయన తండ్రి నామాన్ని తెలియజేసి, ఆయనకు ప్రాతినిధ్యం వహించాడు.—యోహాను 5:36, 37.
హెబ్రీ లేఖనాల నుండి తీసుకొనబడిన దృష్టాంతాలు గ్రీకు లేఖనాల్లో ఎలా కనిపిస్తాయో ఈ క్రింది ఉదాహరణల్లో గమనించండి. కీర్తన 2:1, 2 నుండి అపొస్తలుల కార్యములు 4:24-27 నందు ఎత్తివ్రాయబడిన దానిలో యెహోవా దేవుడు, ఆయన అభిషక్తుడు లేక మెస్సీయను గురించి కూడ చెప్పబడింది. యెషయా 40:13, 14 నుండి రోమీయులు 11:33, 34 నందు ఎత్తివ్రాయబడిన దానిలో సమస్త జ్ఞాన వివేచనలకు మూలమైన దేవుని గురించి ఉదహరించబడింది. కొరింథీ సంఘానికి వ్రాస్తూ, పౌలు మళ్లీ యిలా ఉదహరిస్తున్నాడు, “ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు?” ఆయనిలా చెబుతున్నాడు: “మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.” ప్రభువైన యేసు తన అనుచరులకు యెహోవా మనస్సును, మరి అనేక ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేసాడు.—1 కొరింథీయులు 2:16.
కొన్నిసార్లు హెబ్రీ లేఖనాల్లోని విషయం యెహోవాను ఉదహరించవచ్చు, కాని ఆయన శక్తిని, అధికారాన్ని ఇవ్వడాన్నిబట్టి అది యేసుక్రీస్తు నందు నెరవేర్చబడింది. ఉదాహరణకు, కీర్తన 34:8 మనల్ని “యెహోవా మంచివాడని రుచిచూచి తెలుసుకొనుడి” అని ఆహ్వానిస్తుంది. కాని పేతురు “ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న యెడల” అని చెబుతూ దాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు అన్వర్తించాడు. (1 పేతురు 2:3) పేతురు ఒక సూత్రాన్ని తీసుకుని అది యేసుక్రీస్తు విషయంలో కూడా ఎలా నిజమైయుందో చూపిస్తున్నాడు. యెహోవా, యేసుక్రీస్తు ఇద్దర్నీ గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకొనడం ద్వారా, దానికి అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా, తండ్రినుండి, ఆయన కుమారుని నుండి క్రైస్తవులు గొప్ప దీవెనలను పొందవచ్చు. (యోహాను 17:3) పేతురు అన్వయింపు సర్వోన్నత ప్రభువైన యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తులను ఒకే వ్యక్తిగా చేయదు.—1 పేతురు 2:3 యొక్క అధఃస్సూచిని చూడండి.
“మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము” అని అపొస్తలుడైన పౌలు చెప్పినప్పుడు యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంబంధిత స్థానాలు స్పష్టం చేయబడ్డాయి. (1 కొరింథీయులు 8:6; 12:5, 6) ఎఫెస్సులోని క్రైస్తవ సంఘానికి వ్రాస్తూ ‘ఒకే ప్రభువు’ అయిన యేసుక్రీస్తు ‘అందరికీ తండ్రియైన ఒక్కడే దేవుని’ నుండి ఎంతో వేరైయున్నాడని పౌలు గుర్తించాడు.—ఎఫెసీయులు 4:5, 6.
యెహోవా అందరికంటే ఉన్నతుడు
ప్రకటన 11:15 నందలి “ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలును” అనే మాటలు 1914వ సంవత్సరం నుండి నిజమని నిరూపించబడ్డాయి. ది న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ థియోలజీ (సంపుటి 2, 514 పేజీ) ఇలా చెబుతున్నది: “క్రీస్తు సమస్త అధికారాన్ని పొందినప్పుడు (1 కొరిం. 15:25), తండ్రియైన దేవునికి ఆయన తానే లోబడును. అలా యేసు అధికారం దాని సంకల్పాన్ని నెరవేరుస్తుంది, దేవుడు సర్వంలో సర్వమౌతాడు. (1 కొరిం. 15:28).” తన వెయ్యేండ్ల పరిపాలనాంతంలో, క్రీస్తు యేసు తనకు ముందు అప్పగింపబడిన శక్తిని, అధికారాన్ని సర్వశక్తిగల దేవుడైన తన తండ్రికి తిరిగి అప్పగిస్తాడు. గనుక, “మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన” యెహోవాకు సరైన విధంగా సమస్త మహిమ, ఆరాధన ఇవ్వబడుతుంది.—ఎఫెసీయులు 1:17.
యేసు ఇప్పుడు ప్రభువులకు ప్రభువు అయినప్పటికీ, ఆయన దేవుళ్లకు దేవుడని ఎన్నడు పిలువబడలేదు. యెహోవా అందరికంటే ఉన్నతునిగానే నిలిచివుంటాడు. ఈ విధంగా, యెహోవా “సర్వములో సర్వమగును.” (1 కొరింథీయులు 15:28) యేసు యొక్క అధికారం ఆయనకు తగినవిధంగా క్రైస్తవ సంఘంపై శిరస్సు స్థానాన్నిస్తుంది. ఈ ప్రపంచంలో మనం ఉన్నత స్థానాల్లో అనేకమంది శక్తివంతులైన “ప్రభువులను” చూసినప్పటికీ, మనం మన విశ్వాసాన్ని ప్రభువులకు ప్రభువైన వానియందే ఉంచుతాము. అయినా, యేసుక్రీస్తు తన ఉన్నతపర్చబడిన, గొప్ప స్థానంలో ఉండికూడా, “దేవుడు అందరిని పరిపాలించేలా” తన తండ్రికి లోబడి ఉంటాడు. (1 కొరింథీయులు 15:28, ది ట్రాన్స్‌లేటర్స్ న్యూ టెస్ట్‌మెంట్) వారు ఆయనను తమ ప్రభువుగా అంగీకరించినప్పటికీ, దీనత్వం విషయంలో యేసు తన శిష్యులకు ఎంత చక్కని మాదిరి నుంచాడు!
[30వ పేజీలోని బాక్సు]
“క్రొత్త నిబంధన రచయితలు దేవున్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు, తండ్రి అనే వారి భావం. వారు యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు వారు ఆయన దేవుడని అనరు, దేవుడని భావించరు. ఆయన దేవుని క్రీస్తు, దేవుని కుమారుడు, దేవుని జ్ఞానము, దేవుని వాక్యమైయున్నాడు. నైసియా సిద్ధాంతానికి దగ్గరగా ఉన్న పరిశుద్ధ యోహాను యొక్క భూమిక కూడా క్రీస్తు తండ్రి కంటే తక్కువవాడనే తెలియజేస్తుంది; ఈ భూమిక ఆంగ్లంలో కనిపించేదాని కంటే గ్రీకులో [ధియోస్] అంత స్పష్టంగా ఏమీ లేదు.”—జాన్ మార్టిన్ క్రీడ్ వ్రాసిన “ది డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్.”