వారు మాకు మాదిరి ఉంచారు
క్రాగ్ జాంకర్ చెప్పినది
ఎనిమిది సంవత్సరాలుగా నేను నా భార్య గేలె, పయినీర్లుగా అంటే యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులుగా ఉన్నాము. గత ఆరు సంవత్సరాల నుండి మేము ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసుల మధ్య సేవచేస్తున్నాము. మేము కేవలం మా తలిదండ్రులు, తాతయ్య అమ్మమ్మలు మా యెదుట ఉంచిన మంచి మాదిరిని అనుసరిస్తున్నాము.
మీకు మా తాతయ్య అమ్మమ్మల గురించి ముఖ్యంగా చెప్పనివ్వండి. మేమెప్పుడు వారిని ప్రేమగా ఓపా, ఓమా అని పిలిచేవాళ్లము, అవి డచ్ భాషలో తాతయ్య, అమ్మమ్మ అనే పదాలకు సమానమైనవి. మా తాతయ్య చార్లెస్ హెర్రిస్ ఇప్పటికీ మెల్‌బోర్న్‌లో పయినీరు సేవచేస్తున్నాడు, అక్కడ ఆయన దాదాపు 50 సంవత్సరాలు నివసించాడు.
బైబిలు సత్యాలు నేర్చుకొనుట
ఆస్ట్రేలియా ద్వీప రాష్ట్రమైన టాస్‌మానియాలోని చిన్న పట్టణంలో ఓపా జన్మించాడు. ఆయనకు 14 సంవత్సరాలున్నప్పుడు, నావికులు సముద్రంలో ఉపయోగించే పెట్టెను 1924లో ఒక వేలంలో వాళ్ల నాన్న కొన్నాడు. ఆత్మీయభావంలో చెప్పాలంటే, అది నిజమైన సంపదగానే వెల్లడైంది, ఎందుకంటే దానిలో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సంస్థ తొలి అధ్యక్షుడైన చార్లెస్ తేజ్ రస్సెల్ రాసిన కొన్ని పుస్తకాలున్నాయి.
స్పష్టంగా, ఓపా తండ్రికి ఆ పుస్తకాలంటే ఆసక్తి లేదు, కాని ఓపా వాటిని చదవడం మొదలుపెట్టి, వాటిలో ప్రాముఖ్యమైన బైబిలు సత్యాలున్నాయని వెంటనే గుర్తించాడు. ఇప్పుడు యెహోవాసాక్షులుగా పిలువబడుతున్న అంతర్జాతీయ బైబిలు విద్యార్థులను, అంటే ఆ పుస్తక ప్రచురణకర్తలను వెదకడం ప్రారంభించాడు. తాను నేర్చుకుంటున్న బైబిలు సత్యాలను గూర్చిన మరింత వివరణ పొందడానికి వారితో మాట్లాడాలని ఆయన ఇష్టపడ్డాడు.
చాలా విచారణ చేసిన తర్వాత, ఇతరులకు బోధించడంలో చురుకుగా ఉన్న ముగ్గురు పెద్దవయస్సుగల స్త్రీలను ఆయన కనుగొన్నాడు. వాళ్లు యౌవనుడైన చార్లెస్‌పై చాలా మహత్తరమైన ప్రభావాన్ని కలుగజేశారు. చివరికి, 1930లో ఆయన యెహోవా దేవునికి సమర్పించుకుని నీటి బాప్తిస్మం తీసుకున్నాడు. మాంసం దుకాణంలో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన ఉత్తరంగా సిడ్నీకి ప్రయాణించాడు, అక్కడే ఆయనకు పూర్తికాల సువార్తికునిగా పని అప్పగించబడింది.
ఆస్ట్రేలియాలో పయినీరు సేవ చేయుట
తరువాతి కొన్ని సంవత్సరాల్లో, చార్లెస్ ప్రకటనపని చేసిన ప్రాంతాల్లో సిడ్నీ నందలి సముద్ర తీర ప్రాంతమైన బోండీ, అలాగే న్యూ సౌత్ వేల్స్ నందలి గ్రామీణ ప్రాంతాలు కూడా చేరివున్నాయి. తర్వాత ఆయన ఖండానికి మరోవైపున వేల కిలోమీటర్ల దూరంలోవున్న పశ్చిమాస్ట్రేలియాలోని పెర్త్‌నందు నియమించబడ్డాడు. ఆరునెలల వరకు ఆయన పెర్త్ నందలి వ్యాపార ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చాడు, తర్వాత మరో ఇద్దరు పయినీర్లతోపాటు ఆస్ట్రేలియా వాయవ్య ప్రాంతంలో విశాలంగావుండి అక్కడక్కడా జనాభావున్న ప్రాంతానికి నియమించబడ్డారు.
ఆర్తర్ విల్లీస్, జార్జ్ రోలెస్టన్, చార్లెస్, ఈ ముగ్గురు ప్రకటించే ప్రాంతం ఇటలీ దేశానికి నాలుగింతలు పెద్దది! జనాబా స్వల్పంగా ఉండేది, గ్రామీణ ప్రాంతమంతా బంజరు భూమిగా ఉండి, వేడి అధికంగా ఉండేది. కొన్నిసార్లు పశుశాలలని పిలువబడే గోష్టముల మధ్య దాదాపు 500 కిలోమీటర్లకంటే ఎక్కువదూరం ప్రయాణించవలసి ఉంటుంది. వారు ఉపయోగించిన వాహనం 1930 ప్రామాణికం ప్రకారం కూడా శిథిలస్థితిలో ఉండేది, కాని వారికి దృఢ విశ్వాసం, గట్టి తీర్మానం ఉండేవి.
ఇరుకైన, గుంటలుగల రోత రోడ్లపై ఒంటెలు బారులు తీరి వెళుతుండేవి, అక్కడక్కడ ప్రమాదకరమైన చెట్ల మొద్దులను (బుల్‌డస్ట్ అని పిలువబడే) మెత్తని దుమ్ము కప్పేసి ఉండేది. అందుకే తరచూ కారు బ్రేకులు విరిగిపోతుండేవి. రెండు సందర్భాల్లో వెనుక చక్రము ఇరుసు విరిగిపోయింది, అనేకసార్లు టైర్లు పగిలిపోయాయి. పయినీర్లు ప్రయాణం కొనసాగించడానికి తరచూ పాతటైర్ల నుండి కొంతభాగాన్ని తీసుకుని ప్రస్తుతం వాడుతున్న టైర్ల లోపలి భాగంలో వేసేవారు.
నేను యౌవనునిగా ఉన్నప్పుడు, అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లోనే కొనసాగడానికి ఏది వారిని ప్రోత్సహించిందని నేను ఓపాను అడిగాను. ప్రజల నుండి వేరుగా ఉండటం ద్వారా యెహోవాతో సన్నిహితంగా ఉండవచ్చునని ఆయన వివరించాడు. అప్పుడప్పుడు శారీరకంగా కష్టం కలిగించిన విషయాలు ఆత్మీయ ఆశీర్వాదాన్ని తెచ్చాయని ఆయన చెప్పాడు.
అనేకులు వస్తుసంపదను పోగుచేసుకోవడంలో అధికంగా నిమగ్నమై ఉండటాన్ని బట్టి ఓపా ఏమాత్రం ఆధిక్య భావం లేక స్వయం నీతిపరత్వం లేకుండా, ఆశ్చర్యాన్ని వ్యక్తపర్చాడు. “వీలైనంత తక్కువ సామానుతోనే జీవితం బాగుంటుంది, అవసరమైనప్పుడు ఆరుబయట నిద్రించడానికి యేసు ఇష్టపడినప్పుడు, మన పని నియామకానికి అవసరమైతే అలాగే చేయడానికి మనం సంతోషించాలి” అని ఆయన నాకు గుర్తుచేశాడు. (మత్తయి 8:19, 20) వాస్తవానికి ఆయన, ఆయన తోటివాళ్లు అదే చేశారు.
విదేశీ సేవ కొరకు ఆహ్వానింపబడుట
ఓపా 1935లో ఒక క్రొత్త ప్రకటనా పని నియామకాన్ని అంటే దక్షిణ పసిఫిక్ యొక్క ద్వీపవాసులకు సాక్ష్యమిచ్చే పని నియామకాన్ని అందుకున్నాడు. ఇతరులు ఆరుగురితో ఆయన వాచ్‌టవర్ సంస్థ యొక్క లైట్‌బేరర్ అనే 52 అడుగులు గల ఓడలో ప్రయాణించాడు.
ఆస్ట్రేలియా ఉత్తర భాగమైన కోరల్ నదివద్ద ఉన్నప్పుడు ఒకసారి, లైటబేరర్ ఇంజను చెడిపోయింది. అక్కడ అస్సలు గాలి లేదు, కాబట్టి వాళ్లు తీరం నుండి ఎన్నో కిలోమీటర్లు దూరం ప్రయాణించలేకపోయారు. గ్రేట్ బారియర్ రీఫ్‌వద్ద పడవ మునిగిపోయే ప్రమాదమున్నప్పటికీ, ఓపా దాని ఆహ్లాదకరమైన ప్రశాంతతకు ముగ్ధుడయ్యాడు. ఆయన తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు: “సముద్రం నిమ్మళంగా ఉంది, ఆ ప్రశాంతమైన సముద్రంపై ప్రతి సాయంకాల సూర్యాస్తమయాన్ని నేనెన్నటికీ మరచిపోలేను. ఆ దృశ్యం ఎంత రమ్యంగా ఉందంటే, అది నా జ్ఞాపకంలో శాశ్వతంగా ముద్రించబడింది.”
సంతోషకరంగా, వాళ్లు ఒడ్డుకు కొట్టుకొని పోకముందే, గాలి తిరిగి వీచింది, వాళ్లు తెరచాప క్రింద సురక్షితంగా పపువా న్యూ గినియా నందలి మోర్స్‌బై తీరానికి చేరి, అక్కడే ఇంజను రిపేరు చేయించుకున్నారు. మోర్స్‌బై తీరాన్నుండి వాళ్లు థర్స్‌డే ద్వీపానికి, అక్కడి నుండి ఇండోనేషియా యొక్క పెద్ద ద్వీపమైన జావాకు ప్రయాణించారు. “భూమధ్య రేఖ పొడవునా పొదగబడిన ముత్యాల హారం” అని వర్ణించబడే ఈ దేశం యెడల ఓపా గాఢమైన ప్రేమను పెంచుకున్నాడు. ఆ సమయంలో ఇండోనేషియా డచ్ కాలనీగా ఉండేది, కాబట్టి తాతయ్య డచ్, ఇండోనేషియా భాషలు రెండూ నేర్చుకున్నాడు. ఆయన తన ప్రకటన పనిలో సాహిత్యాన్ని డచ్, ఇండోనేషియా, చైనీస్, ఇంగ్లీష్, అరబిక్ వంటి ఐదు భాషల్లో అందజేసేవాడు.
బైబిలు సాహిత్యాన్ని ఓపా చాలా విజయవంతంగా అందజేసేవాడు. బటావ్య నందలి వాచ్‌టవర్ డిపో పర్యవేక్షకునిగా ఉన్న క్లెమ్ డెస్చాన్ మన ప్రకటన పనిని దగ్గరగా గమనిస్తున్న డచ్ అధికారి యెదుటికి పిలువబడ్డాడు. “తూర్పు జావాలో మీ వాళ్లు ఎంతమంది పనిచేస్తున్నారు?” అని అధికారి విచారణ చేశాడు.
“కేవలం ఒక్కరే,” అని సహోదరుడు డెస్చాన్ జవాబిచ్చాడు.
“నన్ను అది నమ్మమంటావా? అంతటా అందజేయబడిన మీ సాహిత్యాన్ని బట్టి చూస్తే మీకు సేవకులు పెద్ద సైన్యంలా ఉన్నట్లుందే!” అని అరిచాడు అధికారి.
ఓపా, అది తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే అభినందనగా భావిస్తాడు. ప్రతి నెల 1,500 నుండి 3,000 వరకు సాహిత్యాలను అందజేయడం ఆయనకు అసాధారణమైన విషయమేమి కాదు, గనుక ఆయన దానికి నిజంగా అర్హుడే.
వివాహం, నిషేధం, యుద్ధం
డిశంబరు 1938లో ఓపా, మా అమ్మమ్మ అయిన విల్‌హిల్‌మెనా అనే ఇండోనేషియా యౌవన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఓమా లేక అమ్మమ్మ దయ, నెమ్మది గలది, కష్టపడిపనిచేసేది, మృదుభాషిణి. ఆమె నా చిన్నతనంలో నా సన్నిహిత స్నేహితురాలు గనుక నాకు తెలుసు.
వాళ్ల వివాహమైన తర్వాత ఓపా, ఓమా ఇద్దరూ కలిసి తమ పయినీరు సేవను కొనసాగించారు. అప్పటికి, లైట్‌బేరర్ యొక్క మరో గుంపు సభ్యులు ప్రపంచంలోని ఇతర స్థలాలకు చెదరిపోవడమో లేక వారి ఇళ్లకు తిరిగి వెళ్లడమో జరిగింది. కాని ఓపా ఇండోనేషియాను తన గృహంగా చేసుకున్నాడు, అక్కడే ఉండిపోడానికి ఆయన నిర్ణయించుకున్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధం సమీపిస్తుండగా, ఇండోనేషియాను పరిపాలిస్తున్న డచ్ ప్రభుత్వం మతనాయకుల వత్తిడి క్రింద పనిచేస్తూ, యెహోవాసాక్షుల పనిపై ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టింది, చివరికి మన పని నిషేధింపబడింది. కాబట్టి కేవలం బైబిలును మాత్రమే ఉపయోగిస్తూ, ప్రకటన పని చాలా కష్టపడి చేయవలసివచ్చేది. ఓపా, ఓమా దర్శించిన దాదాపు ప్రతి పట్టణంలో వాళ్లు అధికారుల యెదుటికి తీసుకురాబడి విచారణ చేయబడ్డారు. వారు నేరస్థుల వలె చూడబడ్డారు. నిషేధం విధింపబడిన కొంతకాలానికే, క్రైస్తవ తటస్థతను కలిగివున్నందుకు ఓమా బావ జైల్లో వేయబడ్డాడు. ఆయన ఒక డచ్ చెరసాలలో మరణించాడు.
ఓపా, ఓమా ఒక పెద్ద బండివున్న ట్రక్కులో నివసించారు. ఈ వాహన గృహాన్ని ఉపయోగిస్తూ, వాళ్లు జావా అంతటా ప్రకటించారు. జపాన్ సైనిక ఆక్రమణ ప్రమాదం రానైయుండగా, 1940లో వారికి ఒక కుమార్తె కలిగింది, ఆమె నాకు తల్లి అయ్యింది. అప్పటి వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సంస్థ అధ్యక్షుడైన జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ రెండేళ్ల క్రితం ఇచ్చిన ప్రసంగాంశాన్ని బట్టి వారు ఆమెకు విక్టరీ అని పేరుపెట్టారు. పాప పుట్టినప్పటి నుండి వారు పయినీరు సేవ కొనసాగించారు.
బోర్నియో నుండి డచ్ ఓడలో ఓపా, ఓమా, విక్టరీ తిరిగివస్తుండగా, 1942 తొలిభాగంలో జపాన్ దేశస్థుల యుద్ధనౌక నుండి పెద్ద తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది. దీపాలన్నీ ఆరిపోయాయి, ప్రజలు అరిచారు. ఈవిధంగా యుద్ధం మా కుటుంబీకుల జీవితాల్లోకి ప్రవేశించింది. వారు సురక్షితంగా తీరానికి తిరిగివచ్చినప్పటికీ, కేవలం కొన్ని దినాల తర్వాత జపాన్ దేశస్థులు జావాను ఆక్రమించారు, ఓపా మరియు ఓమాను గూర్చిన విషయాలు ఒక డచ్ అధికారి జపాన్ సైనికులకు తెలియజేశాడు.
జపాన్ దేశస్థులు వారిని కనుగొన్నప్పుడు, చివరికి చిన్నారి విక్టరీ ఆటవస్తువులతో సహా వారివద్ద నుండి వారి వస్తువులన్నీ తీసుకొనబడ్డాయి, వారిద్దరూ వేరు వేరు కాన్సన్‌ట్రేషన్ క్యాంపులకు తీసుకువెళ్లబడ్డారు. విక్టరీని ఓమా వద్ద ఉండనిచ్చారు, తరువాతి మూడున్నర సంవత్సరాల వరకు ఓపా వారిని చూడలేదు.
కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో జీవితం
ఆయన బంధింపబడిన కాలంలో, ఓపా పట్టణం నుండి పట్టణానికి అంటే సురాబాయా నుండి నగ్వీకి, అక్కడి నుండి బాన్‌డంగ్‌కు, అక్కడి నుండి చివరికి చిమాహెకు బదిలీ చేయబడ్డాడు. అందరూ కలిసి తప్పించుకొనే పథకం వేస్తారని, దాన్ని నివారించడానికి ఇలా తదేకంగా వాళ్లను మారుస్తుండేవారు. ఖైదీలు ఎక్కువమంది డచ్‌వారు, కొంతమంది బ్రిటీషు వారు, కొందరు ఆస్ట్రేలియా వారు. క్యాంపుల్లో ఉన్నప్పుడు, ఓపా మంగలిపని నేర్చుకున్నాడు, ఆయన ఇప్పటికీ ఆ పని చేస్తుంటాడు. ఆయన వద్ద ఉంచుకోడానికి అనుమతింపబడిన ఏకైక మతసంబంధమైన పుస్తకం బైబిలు—తన కింగ్ జేమ్స్ వర్షన్.
ఈ మధ్యలో, ఓమా, విక్టరీ కూడా ఒక క్యాంపు నుండి మరోదానికి మార్చబడేవారు. ఈ క్యాంపుల్లో, “సామాజిక సేవల” కొరకు బయట పనిచేయడానికి క్యాంపు సేనాధిపతి స్త్రీలను పిలిచేవాడు. అయినా ఏదో కారణాన్ని బట్టి, ఓమా ఎన్నడూ ఎంపిక చేయబడలేదు. జపాన్ సైనికులకు వేశ్యలుగా ఉపయోగించడానికి ఆ స్త్రీలను తీసుకువెళ్లేవారని తర్వాత ఆమెకు తెలిసింది.
జపాన్ సైనికులకు ఆడపిల్లలంటే ఇష్టం లేదు కాబట్టి, ఓమా ఎప్పుడూ విక్టరీని మగపిల్లల దుస్తుల్లో ఉంచి, ఆమె వెంట్రుకలు చిన్నగా కత్తిరించేది. విక్టరీ అంటే జపాన్ సామ్రాజ్య సైన్యానికా లేక అమెరికన్లకా? అని క్యాంపు సేనాధిపతి తెలుసుకోవాలనుకున్నప్పుడు విక్టరీ అనే పేరు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది.
“భూ ప్రభుత్వాలన్నిటిపై దేవుని రాజ్యానికి విక్టరీ (విజయం)!” అని మా అమ్మమ్మ సగర్వంగా జవాబిచ్చింది.
“జపాన్ సామ్రాజ్య సైన్యానికి విజయం” అని చెప్పడానికి నిరాకరించినందుకు శిక్షగా, ఓమాను, ఐదు సంవత్సరాల ఆమె కుమార్తెను మండే ఎండలో ఎనిమిది గంటలపాటు కదలకుండా నిలబడమన్నారు. నీడలేదు, నీళ్లులేవు, కూర్చోకూడదు, ముందుకు తలవాల్చకూడదు. కాని యెహోవా సహాయంతో వాళ్లు ఈ భయంకరమైన కఠిన పరీక్షను ఎదుర్కొనగలిగారు.
ఓమా బంధింపబడిన ఒక సంవత్సరానికే, ఆమె భర్త చనిపోయాడని క్యాంపు సేనాధిపతి ఆమెకు చెప్పాడు! ఆమె దుఃఖంగా ఓపా ఫోటోను తన పాడైన పెట్టెలో అడుగున పెట్టేసి, బాధపడుతూనే కొనసాగింది.
చెరసాల-క్యాంపు జీవితం కష్టంగా ఉండేది. ప్రతిదిన ఆహారంలో ఒకొక్కరికి ఉదయాన ఒక చిన్న గిన్నెడు కర్ర పెండలం, మధ్యాహ్న భోజనం కొరకు సగ్గుబియ్యంతో చేసిన 190 గ్రాముల రొట్టె, సాయంకాలం భోజనానికి ఒక చిన్నగిన్నెడు అన్నం దానితోపాటు పలుచగావున్న కూరగాయల చారు ఇవ్వబడేవి. అలాంటి తక్కువ ఆహారం కారణంగా, కుపోషణ సర్వసామాన్యమైపోయింది, విరోచనాలకు గురైనవారు రోజు చనిపోతుండేవారు.
ఓపా బంధింపబడిన కాలంలో, ఆయనకు పెల్లాగ్రా, న్యూట్రిషనల్ ఎడెమ (క్షుద్భాద) వచ్చింది. చిన్నదైన విక్టరీ ఆకలితో చనిపోకుండా ఉండాలని ఓమా తన ఆహారాన్ని ఆమెకిచ్చేది కాబట్టి ఓమా కూడా దాదాపు చనిపోయినట్లు అయ్యింది. క్రూరత్వం, ఆకలి నిరంతర సహవాసులయ్యాయి. వారు కేవలం తమ దేవుడైన యెహోవాకు సన్నిహితంగా ఉండటం వల్ల జీవించగల్గారు.
ఓపాకు ప్రీతికరమైన మాటల్లో ఒకటి నాకు బాగా జ్ఞాపకముంది: “దేవుడైన యెహోవాకు అనుగుణంగా ఉండడమే స్వాతంత్ర్యం.” అలా, కఠినమైన చెరసాల శిక్షను అనుభవిస్తున్నప్పటికీ ఓపా నిజమైన భావంలో తనకు తాను స్వతంత్రంగా ఉన్నట్లే పరిగణించుకున్నాడు. ఆయనకు, ఓమాకు యెహోవా యెడలవున్న ప్రేమ వారికి ‘అన్నిటిని సహించడానికి సహనాన్నిచ్చి’ నిజంగా సహాయం చేసింది. (1 కొరింథీయులు 13:7) దేవునితో అదే సన్నిహిత సంబంధాన్ని కలిగివుండటానికి నేను గేలె ప్రయత్నిస్తున్నాము.
స్వాతంత్ర్యం మరియు ఒక విశేషమైన పునఃకలయిక
చివరికి, 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్ లొంగిపోయిన కొంతకాలానికి ఓపా ట్రెయిన్‌లో తీసుకెళ్లబడుతున్నాడు. జకార్తా నుండి బాన్‌డంగ్‌కు వెళ్తుండగా, ఇండోనేషియా సైనికులు ట్రెయిన్ ఆపారు. జపాన్ వారితోవున్న విరోధాలు అంతమైనప్పటికీ, డచ్‌వారి నుండి స్వాతంత్ర్యం కొరకు ఇండోనేషియావారు పోరాడుతున్నారు. హఠాత్తుగా ఆయనను ట్రెయిన్‌లో నుండి దించేసే సరికి ఓపా ఇంగ్లీషులో మాట్లాడడానికి బదులు డచ్ భాష మాట్లాడడం ప్రారంభించాడు. ఇండోనేషియా వారికి డచ్ భాష శత్రువుల భాష, శత్రువు చంపబడాలి.
అదృష్టవశాత్తు, సైనికులు ఓపాను తనిఖీ చేస్తున్నప్పుడు, వాళ్లకు ఆయన ఆస్ట్రేలియన్ డ్రైవరు లైసెన్సు దొరికింది, దాని గురించి ఆయన అసలు పూర్తిగా మర్చిపోయాడు. సంతోషభరితంగా, ఇండోనేషియావారు ఆస్ట్రేలియావారితో యుద్ధం చేయడం లేదు. ఈనాటికి, తనను ఆస్ట్రేలియా పౌరునిగా నిరూపించిన లైసెన్సు కనుగొనబడటం దైవిక చర్యగా ఓపా భావిస్తాడు, అక్కడే కొన్ని గంటల క్రితం అదే గుంపువారు ట్రెయిన్‌లో వెళ్తున్న 12 మంది డచ్ మనుష్యులను చంపేశారు.
ఈ సంఘటన జరిగిన కొంతసేపటికి, ఓమా విక్టరీ ఇద్దరూ యుద్ధం జరిగిన ప్రాంతం నుండి వెళ్లడానికి ప్రయాణ సౌకర్యం కొరకు ఎదురుచూస్తున్నారు. వాళ్లు రోడ్డు ప్రక్కన కూర్చొని ఉండగా, సైనికులను, పౌరులను తీసుకువెళ్తున్న ట్రక్కుల పెద్ద లైను పోతూవున్నది. హఠాత్తుగా, కచ్చితమైన కారణం ఏమి లేకుండానే లైను ఆగిపోయింది. ఓమా సమీపంలోవున్న ట్రక్కు యొక్క తెరిచివున్న వెనుక భాగంలోకి చూసింది, ఆమె అమితాశ్చర్యపోయేలా, ఒక క్షీణించిపోయిన వ్యక్తి కూర్చొనివున్నాడు, ఆమె వెంటనే అతన్ని గుర్తుపట్టింది. ఆయన ఆమె భర్త! వారి పునఃకలయిక భావాన్ని ఏ పదాలు వర్ణించలేవు.
మళ్లీ ఆస్ట్రేలియాకు
తాతయ్య తన కుటుంబంతో మళ్లీ ఆస్ట్రేలియాకు 1946లో తిరిగి వచ్చినప్పుడు, అంటే 11 సంవత్సరాలు ఇండోనేషియాలో గడిపిన తర్వాత, వారికి జీవితం అంత సుళువుగా లేకుండెను. వారు యుద్ధ క్షతగాత్రులుగా, అభాగ్యులుగా, సరైన ఆహారం లేక, అనేకమంది స్థానికులచే అనుమానింపబడేవారిగా తిరిగివచ్చారు. ఆసియా నుండి వలసవచ్చినవారిగా ఓమా, విక్టరీ పూర్తి జాతివైషమ్యాన్ని ఎదుర్కొన వలసివచ్చింది. తన కుటుంబం కొరకు గృహాన్ని ఏర్పాటు చేయడానికి, వారి గురించి శ్రద్ధ వహించడానికి ఓపా ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయవలసి వచ్చేది. ఇన్ని కష్టాలున్నప్పటికీ, వారు సహించి తమ ఆత్మీయతను అలాగే కాపాడుకోగల్గారు.
ఇప్పుడు, 48 సంవత్సరాల తర్వాత, ఓపా మెల్‌బోర్న్‌లో నివసిస్తున్నాడు, అక్కడ ఆయన ఇంటింటి పరిచర్యలో శక్తివంతంగా పాల్గొంటున్నాడు. విక్టరీ, ఆమె పిల్లలు సత్యాన్ని హత్తుకోవడం, వారి జీవితాలను యెహోవాకు సమర్పించుకోవడం, ప్రతి ఒక్కరు పూర్తికాల పయినీరు సేవలో ప్రవేశించడం ఆయన చూశాడు.
నా తండ్రి అయిన డెస్ జాంకర్, విక్టరీ 1950 దశక తొలిభాగంలో బాప్తిస్మం తీసుకున్నారు, డెస్ 1958లో ఆస్ట్రేలియా బేతేలు కుటుంబ సభ్యుడయ్యాడు. ఆయన ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న విక్టరీని వివాహం చేసుకున్న తర్వాత, వారు కొంతకాలం పయినీరు సేవ చేశారు, తర్వాత వారు ప్రయాణ సేవ కొరకు ఆహ్వానింపబడ్డారు. తర్వాత నేను జన్మించాను, కాబట్టి నన్ను పెంచడానికి వారు ప్రయాణ కాపరి సేవను విడిచిపెట్టారు. అయినా, 27 సంవత్సరాల తర్వాత నాన్న ఇంకా పయినీరు సేవచేస్తూనే ఉన్నారు.
ఓమా 1990 తొలిభాగంలో ప్రశాంతంగా ఇంటి దగ్గరే మరణించింది, ఆ ఇంట్లోనే మా అమ్మ పెంచబడింది. నేను కూడా అదే మెల్‌బోర్న్ ఇంట్లోనే పెరిగాను, నా తమ్ముడు, చెల్లి కూడా అక్కడే పెరిగారు. ఒక ఇంటిని కలిసి పంచుకోవడం మా కుటుంబానికి నిజంగా ఆశీర్వాదంగా ఉండేది. కొన్నిసార్లు అది ఇరుకుగా ఉండేది, కాని దాని గురించి చింతించడం నాకు గుర్తులేదు. మా వివాహమైన మొదటి నాలుగు సంవత్సరాలు కూడా, నా భార్య గేలె, అక్కడే దానిలోనే సర్దుకుని ఉండి, అలా ఉండటాన్ని ఆమె ఇష్టపడింది. చివరికి మేము మా క్రొత్త నియామకాన్ని బట్టి విడిచి వెళ్లవలసి వచ్చినప్పుడు నేను ఏడ్చాను. ఆ ఇంటిలో నేను ఎంతో మద్దతును, ప్రేమను పొందాను.
నా తలిదండ్రులు, వారికంటే ముందు వారి తలిదండ్రులు చేసినదే మేము చేయగల్గుతున్నందుకు ఇప్పుడు గేలె, నేను ఎంతో సంతోషిస్తున్నాము. మేము ఇంటిని విడిచి వచ్చినప్పుడు, మేము రావడానికి గల కారణాన్ని బట్టి, అంటే పూర్తికాల సేవలో యెహోవా చిత్తాన్ని చేయడాన్ని బట్టి మేము ఓదార్పు పొందాము. ఎన్నో సంవత్సరాలపాటు జపాన్ కాన్సన్‌ట్రేషన్ క్యాంపులో ఉంచబడినప్పటికీ, విపరీతమైన పేదరికం ఉన్నప్పటికీ, కఠినమైన నియామకాలను చేపట్టడంలో అదే ఓదార్పును పొందిన మా విశ్వాసులైన పూర్వీకుల చక్కని మాదిరిని అనుసరించడానికి మేము చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నాము.—2 కొరింథీయులు 1:3, 4.
“నీ కృప జీవము కంటె ఉత్తమము” అని రాజైన దావీదు యెహోవాకు చెప్పిన ప్రేరేపిత మాటల్లో ఓపా ఎప్పుడు ఓదార్పును పొందాడు. (కీర్తన 63:3) ఆ కృపను నిరంతరం అనుభవించాలనే గాఢమైన కోరిక మా తాతయ్యగారికి ఎప్పుడూ ఉండేది. దాన్ని ఆయనతో పంచుకోవాలనేది ఆయన కుటుంబమంతటి ఆకాంక్ష.
[21వ పేజీలోని చిత్రాలు]
ఓమా, ఓపా హారిస్
[23వ పేజీలోని చిత్రం]
క్రేయిగ్ జాంకర్ (వెనక), తన భార్య, తలిదండ్రులు, తమ్ముడు, చెల్లితో