రాజ్య ప్రచారకుల నివేదిక
దేవుడు పక్షపాతి కాడు
దాదాపు 1,900 సంవత్సరాల క్రితం, అపొస్తలుడైన పేతురు శతాధిపతియైన కొర్నేలికి ఇలా సాక్ష్యమిచ్చాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) కొర్నేలి దేవుని యందు భయము, నీతి యెడల ప్రేమ గలవాడు. ఆయన పేతురిచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించి క్రైస్తవుడయ్యాడు.
నేడు కూడా అదే సూత్రం సత్యము—దేవుడు పక్షపాతి కాడు. జర్మనీ నందలి ఒక అనుభవాన్ని బట్టి మనం దీన్ని తెలుసుకోవచ్చు. రిపోర్టు ఇలా ఉంది:
“మా సంఘ ప్రాంతంలో, పెద్ద రష్యా సైనిక శిబిరాలుండేవి. బెర్లిన్ గోడ పడిపోయిన కొంతకాలానికి, 1989లో, పెద్దలు ప్రచారకులలో ఎవరికైనా రష్యన్ భాష వచ్చా అని అడిగారు. మాలో కొంతమందికి వచ్చు, ఈ ప్రాంతంలో పనిచేయడానికి మేము వెళ్లాము, అది నిజమైన ఆనందంగా నిరూపించబడింది. అనేకమైన అనుభవాలలో ఒకటి ఈ క్రింద ఇవ్వబడినది.
“మేము సైనికాధికారితో మాట్లాడినప్పుడు, నేను ఒక బాప్తిస్మం తీసుకోని ప్రచారకుని (ఆ తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు) వెంట ఉన్నాను. మేము చెప్పాలనుకున్నది సైనికాధికారి విని, తన సైనికులతో మాట్లాడమని మమ్మల్ని ఆహ్వానించాడు. వాళ్లు దేవుని గురించి, బైబిలు గురించి వినాలని ఆయన చెప్పాడు, కాబట్టి మళ్లీ రావడానికి మేము అనుమతి తీసుకున్నాము.
“రష్యన్ భాష ధారాళంగా మాట్లాడగల ఒక సహోదరిని అనువాదకురాలిగా ఉండడానికి మాతో రమ్మని మేము అడిగాము. సైనిక శిబిరాల్లోని క్లబ్బులో, మేము సాహిత్యం కొరకు ఒక బల్లను ఏర్పాటు చేసుకుని 68 మంది సైనికులతో మాట్లాడి, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాము. ఆ తర్వాత వాళ్లు 35 పుస్తకాలు, దాదాపు 100 పత్రికలు సంతోషంగా తీసుకున్నారు. మేము క్లబ్‌రూము విడిచి వెళ్లుతున్నప్పుడు, సాహిత్యాన్ని గురించి చిన్న గుంపులు మాట్లాడుకోవడం చూశాము.
“మేము జూలై 4, 1992న తిరిగి రావడానికి ఒప్పందం చేసుకున్నాము. మేము ఉదయం 10:50కి వచ్చినప్పుడు, మేము వస్తామని సైనికులు ఎదురుచూస్తున్నారని సైనిక శిబిరాల గేటు వద్దనున్న గార్డు చెప్పాడు. ఒక సైనికాధికారి మమ్మల్ని క్లబ్బురూములోకి తీసుకువెళ్లాడు, మునుపు మావద్ద గ్రంథాలయం కొరకు సాహిత్యం తీసుకున్న ఒక స్త్రీ మేము వచ్చామన్న సంగతిని సైనిక శిబిరాల్లో ప్రకటనా పత్రాలను అంటించడం ద్వారా ప్రచారం చేసింది. మన ప్రపంచవ్యాప్త పని గురించి ముగ్గురు సహోదరులు ప్రసంగించి, మనమెందుకు బైబిలును నమ్మవచ్చో చూపించారు. తర్వాత మేము ప్రేక్షకులను ప్రశ్నలడగమని, వాటికి బైబిలు నుండి సమాధానాలిచ్చాము. ఆ ప్రశ్నల్లో ఒకటి, సైనిక సేవల గురించి యెహోవాసాక్షుల స్థానమేమిటి, వారిలో ఎవరైనా సైనికులా? మునుపు నాతో వచ్చిన బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడు తాను తూర్పు జర్మనీ సైన్యంలో చేసిన 25 సంవత్సరాల సేవ గురించి, వాటిలో చివరి సంవత్సరాలు వైమానికదళ అధిపతిగా చేసిన సేవగురించి, వివరించే అవకాశం అతనికి లభించింది. దేవుని గురించి, బైబిలు గురించి తాను ఎలా నేర్చుకున్నాడో, ఇప్పుడు యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఉండాలని ఉందని వివరించాడు. వారు విన్నదాన్ని బట్టి సైనికులు ప్రభావితులయ్యారు. మేము తెచ్చిన సాహిత్యమంతా ఏడు నిమిషాల్లో సైనికుల చేతుల్లోకి పోయింది, చాలామంది బైబిళ్లు కావాలని అడిగారు. మేము ఒక పుస్తకాల దుకాణం నుండి ఏడు రష్యన్ భాష బైబిళ్లను సంపాదించగల్గాము, వాటిని పొందినందుకు వారు సంతోషించారు. ఆత్మీయంగా ఆకలిగొని ఉన్న వీరికి బైబిలు సమాచారాన్ని అందజేయడం నిజమైన ఆనందాన్నిచ్చింది, దానికి తగినట్లు వాళ్లు చర్యగైకొంటారని మేము నిరీక్షిస్తున్నాము.”
నిజంగా, దేవుడు పక్షపాతికాడు. ఎవరైనా, ఎక్కడున్నవారైనా, యథార్థ హృదయం గలవారిని ఆయన తన వాక్యం ద్వారా రమ్మని పిలుస్తాడు. తన గురించి, తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి నేర్చుకోడానికి ఆయన వారిని ఆహ్వానిస్తాడు, జీవితంలోని అన్ని రంగాల నుండి వచ్చినవారు అలాగే చేస్తున్నారు.—యోహాను 17:3.