మలావీ నుండి సువార్త!
నవంబరు 15, 1993న, ఆగ్నేయ ఆఫ్రికాలోని మలావీకి చెందిన వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి అధికారికంగా నమోదైంది. ఇది యెహోవాసాక్షులకు అధికారిక గుర్తింపును, బైబిలు సత్యాలను గూర్చి మలావీ ప్రజలకు ప్రకటించే స్వేచ్ఛనూ యిస్తుంది.
గతంలో 1948 నందు, మలావీలో యెహోవాసాక్షుల పనిని జరిగించడానికి వాచ్‌టవర్ సొసైటి వారి బ్రాంచి కార్యాలయం అక్కడ స్థాపించబడింది. మొదటిసారిగా జనవరి 8, 1957లో వాచ్‌టవర్ సొసైటి అక్కడ రిజిస్టరు చేయబడింది. అనేక సంవత్సరాల వరకు యెహోవాసాక్షులు సత్వర పెరుగుదలను అనుభవించారు. అయితే 1964లో ఉద్ధృతమైన హింస ప్రారంభమైంది. ఎందుకు?
దేవునికి విధేయులుగా యెహోవాసాక్షులు రాజకీయాల్లో తటస్థంగా ఉన్నారు. (యోహాను 17:16) విశదంగా, ఈ లేఖనాధార స్థానాన్ని కొందరు అర్థం చేసుకోలేకపోయారు. సాక్షులను ఉగ్రవాదులుగా, చట్టాన్ని వ్యతిరేకించేవారిగా తప్పుగా అర్ధం చేసుకున్నారు. కాబట్టి, ఈ శాంతి ప్రేమికులైన క్రైస్తవులను హింసించడాన్ని కొందరు సమర్థించుకున్నారు. అనేకానేక సాక్షులు తమ ఉద్యోగాల నుండి తీసివేయబడ్డారు, లేకపోతే అవమానపర్చబడ్డారు, కొట్టబడ్డారు, కొందరు తమ పిల్లల నుండి బలవంతంగా వేరు చేయబడ్డారు. అనేక మంది సాక్షులు చంపబడ్డారు.
తమ జీవితాలను కోల్పోతామనే భయంతో, 1972లో 30,000 కంటే ఎక్కువ మంది సాక్షులు, వారితో బైబిలును పఠిస్తున్నవారిలో ఆ దేశాన్ని విడిచిపెట్టవలసిన వచ్చింది. పొరుగు దేశమైన మోజాంబిక్‌లోని శరణార్థి శిబిరాల్లో వేలాది మంది నివాసమేర్పర్చుకున్నారు. అయితే 1975లో ఈ శరణార్థులు మలావీకి తిరిగి పంపబడ్డారు. అక్కడ వారు యింకా ఎక్కువ హింసను ఎదుర్కోవల్సి వచ్చింది. అనేకులు కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపుల్లో వేయబడ్డారు. ఈ శ్రమ జరుగుతున్న సమయంలో మలావీలోని అధికారిక సంస్థల జాబితా నుండి వాచ్‌టవర్ సొసైటి కొట్టివేయబడింది. ఆనాటి నుండి యెహోవాసాక్షులు వారి చట్టబద్ధ సంస్థతో సహా ఆ దేశంలో నిషేధించబడ్డారు.
ఇంత జరిగినా, సాక్షులు మాత్రం ప్రతీకారానికి బూనుకోలేదు. వారెన్నడూ మూకలను ఏర్పాటుచేయలేదు లేక ప్రభుత్వానికి విరుద్ధంగా కలహం రేపలేదు. బదులుగా, ప్రార్థనాపూర్వకంగా వారు క్రైస్తవ బాధ్యతగా, ప్రభుత్వ “పై అధికారులకు” తగిన గౌరవమునూ ఆదరణనూ చూపించారు. (రోమీయులు 13:1-7; 1 తిమోతి 2:1, 2) బైబిల్లో క్రైస్తవులకవసరమైన ఉన్నత సూత్రాలను సాక్షులు సమర్థించారు. అంతేకాదు వారలా చేయడం ద్వారా చక్కని మాదిరిని కనపర్చారు.
నేడు వారికి లభించిన నూతన స్వాతంత్ర్యంతో, మలావీలోని యెహోవాసాక్షులు ఈ ‘అనుకూల సమయమందు’ బైబిలు సత్యాలను అవశ్యముగా ప్రకటిస్తూ ఉండడానికి నిశ్చయించుకున్నారు.—2 తిమోతి 4:2.
[31వ పేజీలోని చిత్రం]
మలావీ బేతేలు కుటుంబంతో, 1960లో ఎం. జి. హెన్‌షెల్