తలిదండ్రులారా, మీ పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం
“నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.”—కీర్తన 128:3.
1. మొక్కలను పెంచడమూ పిల్లలను పెంచడమూ ఎలా పోల్చబడగలవు?
అనేక విషయాల్లో పిల్లలు మొక్కలవలె పెరిగి వృద్ధి చెందుతారు. కాబట్టి బైబిలు, పురుషుని భార్యను “ఫలించు ద్రాక్షావల్లి” అనీ, పిల్లలను, “[అతని] బల్లచుట్టూ ఒలీవ మొక్కలు” అని పోల్చడంలో ఆశ్చర్యంలేదు. (కీర్తన 128:3) ప్రత్యేకంగా వాతావరణమూ నేల పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు చిన్న మొక్కలను పంట కొరకు పెంచడం అంత సులభం కాదని ఓ రైతు మీకు చెబుతాడు. అదే విధంగా, ఈ “అపాయకరమైన కాలములలో,” బాగా సర్దుకుపోగల, దైవభక్తి గల పెద్దవారిగా పిల్లలను పెంచడం కూడా చాలా కష్టమైందే.—2 తిమోతి 3:1-5.
2. ఓ మంచి పంట కోయడానికి సహజంగా ఏమి అవసరం?
2 మంచి పంటను కోయడానికి, ఓ రైతుకు సారవంతమైన నేల, వెచ్చని సూర్యరశ్మి, నీరు అవసరం. నాటడం, కలుపును తీయడంతో పాటు అతను క్రిమి సంహారకాలనూ యితర రక్షణకర శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. పెరిగే సమయంలో కోతకాలం వచ్చేంత వరకూ కష్టకాలం రావచ్చు. పంట నష్టమైనప్పుడు ఎంత బాధగా ఉంటుందో కదా! అయితే, ఎంతో కష్టం చేసిన తర్వాత, ఓ మంచి పంటను కోసినప్పుడు ఆ నాటినవాడు ఎంత తృప్తి పొందుతాడో కదా!—యెషయా 60:20-22; 61:3.
3. ప్రాముఖ్యత విషయంలో మొక్కలూ పిల్లలూ ఎలా పోల్చబడగలరు, మరి ఎలాంటి శ్రద్ధను పిల్లలు పొందాలి?
3 ఒక విజయవంతమైన, ఫలవంతమైన మానవ జీవితం ఓ రైతు కోతకంటే ఎంతో విలువైంది. కనుక, పిల్లలను విజయవంతంగా పెంచడం, ఓ పెద్ద పంటను పెంచడం కంటే కూడా అధిక సమయాన్నీ ప్రయాసను వినియోగిస్తుందనడంలో ఆశ్చర్యంలోదు. (ద్వితీయోపదేశకాండము 11:18-21) జీవన వనంలో నాటబడిన ఓ పసి బాలునికి నీరుపోసి, ప్రేమతో పెంచి, హితకరమైన సరిహద్దులను కడితే, వాడు జబ్బుపట్టిన నైతిక విలువలున్న లోకంలో సహితం ఆత్మీయంగా పెరిగి వికసిస్తాడు. అయితే తప్పుగా వ్యవహరించబడినా లేక అణగద్రొక్కబడినా, పిల్లవాడు లోలోన వడలిపోయి, ఆత్మీయంగా చనిపోయే అవకాశం ఉంది. (కొలొస్సయులు 3:21; యిర్మీయా 2:21; 12:2 పోల్చండి.) వాస్తవానికి, పిల్లలందరికీ ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమే!
పసితనం నుండే ప్రతిదిన శ్రద్ధ
4. “బాల్యమునుండే” పిల్లలకు ఎలాంటి శ్రద్ధ అవసరం?
4 తలిదండ్రులు తమ పసిబాలునికి ఎడతెగని అవధానమివ్వాల్సి వస్తుంది. అయితే, ప్రతి రోజు పిల్లవానికి శారీరక భౌతిక శ్రద్ధ మాత్రమే అవసరమా? దేవుని సేవకుడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు యిలా రాశాడు: “రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు.” (2 తిమోతి 3:15) కనుక, తిమోతి పసితనం నుండే తన తలిదండ్రుల నుండి ఆత్మీయ అవధానం కూడా పొందాడు. అయితే పసితనం ఎప్పుడు ప్రారంభమౌతుంది?
5, 6. (ఎ) జన్మించని వారిని గూర్చి బైబిలు ఏమని చెబుతోంది? (బి) జన్మించని పిల్లవాని ప్రయోజనార్థమై తలిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఏది సూచిస్తుంది?
5 పౌలు యిక్కడ ఉపయోగించిన గ్రీకు పదం (బ్రెఫోస్) యింకా జన్మించని శిశువుకు కూడా వర్తిస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను తల్లియైన ఎలీసబెతు తన బంధువైన మరియతో యిలా చెప్పింది: “ఇదిగో నీ శుభవచనము నా చెవినపడగానే నా గర్భములోని శిశువు [బ్రీఫోస్] ఆనందముతో గంతులు వేసెను.” (లూకా 1:44) అలా, జన్మించని వారుకూడా శిశువులని సంబోధించబడుతున్నారు. గర్భం వెలుపల జరిగేవాటికి కూడా వాళ్లు ప్రతిస్పందించగలరని బైబిలు చూపుతోంది. నేడు తరచూ ప్రోత్సహించబడుతున్న జన్మించని పిల్లలపై కనపర్చే శ్రద్ధలో జన్మించని శిశువు యొక్క ఆత్మీయాభివృద్ధికై చూపవలసిన అవధానం యిమిడివుందా?
6 ఇది పరిశీలించాల్సిన విషయమే, ఎందుకంటే జన్మించని వారు తాము వినేదాన్ని బట్టి ప్రయోజనాన్ని పొందగలరు లేక ప్రతికూల ప్రభావానికి గురికాగలరని రుజువులు చూపుతున్నాయి. ఓ సంగీత నిర్దేశకుడు తాను రిహార్సిల్ చేస్తున్న అనేక కూర్పులు విచిత్రంగా తనకు పరిచయం ఉన్నట్లు అనిపించింది, ప్రత్యేకంగా సెల్లో వాయిద్యంలో అలా తోచింది. ఆ సంగీత కూర్పులను ఓ సెల్లో వాద్యకారిణియైన తన తల్లితో ప్రస్తావించినప్పుడు, అతను తన గర్భంలో ఉన్నప్పుడు అవే సంగీత కూర్పులను ఆమె రిహార్స్ చేసిందని ఆమె చెప్పింది. అదే విధంగా, తమ తల్లులు అదే పనిగా దూరదర్శినిలోని భావోద్రేక కార్యక్రమాలను చూస్తూ ఉన్నట్లైతే, దాని వల్ల జన్మించని శిశువు ప్రతికూలంగా ప్రభావితం చెందవచ్చు. అలా, ఓ వైద్య పత్రిక “పిండం భావోద్రేక కార్యక్రమాలకు అలవాటుపడడాన్ని” గూర్చి మాట్లాడింది.
7. (ఎ) జన్మించని తమ పిల్లవాని ప్రయోజనము కొరకు అనేక తలిదండ్రులు ఎలాంటి శ్రద్ధను కనపర్చారు? (బి) పిల్లవానికి ఏ సామర్థ్యాలుంటాయి?
7 పసివారికి అనుకూలమైన ప్రోత్సాహం వల్ల వచ్చే ప్రయోజనాలను గుర్తిస్తూ అనేక మంది తలిదండ్రులు, తమ బిడ్డ పుట్టకముందే ఆ శిశువుకు చదివి, మాట్లాడి, పాడి వినిపిస్తుంటారు. మీరు కూడా అదే చేయవచ్చు. కాని మీ మృదువైన ధ్వని ద్వారా, దాని ప్రేమపూర్వక స్వరం ద్వారా ప్రయోజనం పొందవచ్చును. పుట్టిన తర్వాత బహుశా మీరు అనుకున్న దానికంటే ముందే శిశువు మీ మాటలను గ్రహిస్తాడు. కేవలం రెండు మూడు సంవత్సరాలకే శిశువు క్లిష్టమైన భాషను కేవలం వినడం ద్వారానే నేర్చుకుంటాడు. ఓ శిశువు, బైబిలు సత్యమైన “స్వచ్ఛమైన భాషను” కూడా నేర్చుకోవడానికి మొదలుపెట్టవచ్చును.—జెఫన్యా 3:9.
8. (ఎ) తిమోతి “బాల్యమునుండే” పరిశుద్ధ లేఖనాలను ఎరిగి ఉన్నాడని బైబిలు చెప్పినప్పుడు దాని భావమేంటి? (బి) తిమోతి విషయంలో ఏది నిజమని రుజువైంది?
8 తిమోతి ‘పరిశుద్ధ లేఖనములు బాల్యమునుండి ఎరుగును’ అని పౌలు అన్నప్పుడు ఆయన భావమేంటి? తిమోతి బాలునిగా ఉన్నప్పటి నుండే కాదు, చంటి బిడ్డగా ఉన్నప్పటి నుండే ఆత్మీయ శిక్షణను పొందుతున్నాడని ఆయన భావం. ఇది గ్రీకు పదమైన బ్రెఫోస్కు అనుగుణంగా వుంది, అది సాధారణంగా నవజాత శిశువును సూచిస్తుంది. (లూకా 2:12, 16; అపొస్తలుల కార్యములు 7:19) అతను జ్ఞాపకము చేసికోగల సమయము నుండి తిమోతి తన తల్లి యునీకే ద్వారా అమ్మమ్మ లూయిస్ ద్వారా ఆత్మీయ ఉపదేశాన్ని పొందాడు. (2 తిమోతి 1:5) ‘మొక్కనెటు వంచితే అలాగే చెట్టు పెరుగుతుందనే’ సామెతను తిమోతికి తప్పకుండా అన్వయించవచ్చు. అతను ‘నడువవలసిన త్రోవ అతనికి నేర్పబడింది,’ తత్ఫలితంగా అతను దేవుని చక్కటి సేవకుడయ్యాడు.—సామెతలు 22:6; ఫిలిప్పీయులు 2:19-22.
అవసరమైన ప్రత్యేక శ్రద్ధ
9. (ఎ) తలిదండ్రులు ఏది చేయడం నివారించాలి, ఎందుకు? (బి) పిల్లవాడు పెరుగుతూ ఉన్నప్పుడు తలిదండ్రులు ఏమి చేయాల్సి ఉంటుంది, మరి ఏ మాదిరిని వారు అనుసరించాలి?
9 పిల్లలు విభిన్న లక్షణాలుగల మొక్కల్లాంటి వారు, ఒకే విధమైన శ్రద్ధకు వాళ్లందరు ప్రతిస్పందించరు. వివేకం గల తలిదండ్రులు వారిలోని తేడాలను గౌరవించి, ఓ బాలుని మరొకనితో పోల్చడం నివారిస్తారు. (గలతీయులు 6:4 పోల్చండి.) మీ పిల్లలు ఉపయుక్త పెద్దలుగా వికసించాలంటే, మీరు వారి వేర్వేరు వక్తిత్వ లక్షణాలను గమనించి, మంచి వాటిని పెంపొందిస్తూ చెడ్డవాటిని పెరికివేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు వానిలో ఓ బలహీనతనో లేక బహుశ మోసం, వస్తుసంబంధమైన ఆశ, లేక స్వార్థం వంటి వాటి యెడల మొగ్గును పసిగడితే అప్పుడు ఏం చేస్తారు? యేసు తన అపొస్తలుల బలహీనతను సరిదిద్దినట్లుగా, దాన్ని దయాపూర్వకంగా సరిదిద్దండి. (మార్కు 9:33-37) ప్రత్యేకంగా, ప్రతి పిల్లవాడినీ వానికున్న బలమైన అంశాలను, మంచి లక్షణాలను గూర్చి వానిని మెచ్చుకోండి.
10. ప్రత్యేకంగా పిల్లలకు ఏమి అవసరం, అది ఎలా అందించబడగలదు?
10 పిల్లలకు ప్రత్యేకంగా కావల్సంది ప్రేమపూర్వక వ్యక్తిగత శ్రద్ధ. యేసు తన పరిచర్యలోని పనితొందర గల చివరి రోజుల్లో సహితం పసివారికి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధను కనపర్చడానికి సమయం వినియోగించాడు. (మార్కు 10:13-16, 32) తలిదండ్రులారా, ఆ మాదిరిని అనుసరించండి! స్వార్థరహితంగా మీ పిల్లలతో సమయం గడపడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా వారికి యథార్థమైన ప్రేమను కనపర్చడంలో సిగ్గుపడకండి. యేసు చేసినట్లు వారి చుట్టూ చేతులు వేయండి. వారికి వెచ్చదనాన్ని, అనురాగం వొలికించేలా ఆలింగనం చేసుకుని ముద్దులివ్వండి. చాలా చక్కగా సర్దుకుపోయిన యౌవనుల తలిదండ్రులను యితర తలిదండ్రులకు వారిచ్చే సలహా ఏమిటని ప్రశ్నించినప్పుడు, వారిలో అనేకుల ప్రతిస్పందనలు యిలా ఉన్నాయి: ‘ఎక్కువగా ప్రేమించండి,’ ‘కలిసి సమయం గడపండి,’ ‘వారు చెప్పేదాన్ని నిజంగా వినండి,’ ‘ప్రసంగాలు కాకుండా నడిపింపును అందించండి,’ ‘యథార్థంగా ప్రవర్తించండి.’
11. (ఎ) తమ పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధ యివ్వడాన్ని తలిదండ్రులు ఎలా దృష్టించాలి? (బి) తలిదండ్రులు తమ పిల్లలతో విలువైన సంభాషణను ఎప్పుడు ఆనందించగలరు?
11 అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధను కనపర్చడం ఆనందదాయకంగా ఉంటుంది. ఓ విజయవంతమైన తండ్రి యిలా రాశాడు: “మా యిద్దరు కొడుకులు చిన్నగా ఉన్నప్పుడు, వారిని పడుకోబెట్టడానికి సిద్ధం చేయడం, వారికి చదివి వినిపించడం, వారికి దుప్పటి కప్పడం వారితో కలిసి ప్రార్థించడం వంటి సమయాలు తలిదండ్రులకూ పిల్లవానికీ యిద్దరికీ ప్రోత్సాహాన్నివ్వగల సంభాషణలకు అవకాశాన్నిస్తాయి. (రోమీయులు 1:11, 12 పోల్చండి.) తమ “వాలి”ని ఆశీర్వించమని మూడేళ్ల కుర్రవాడు దేవున్ని ప్రార్థిస్తుండగా ఒక దంపతులు విన్నారు. తర్వాత వచ్చిన రాత్రుల్లో కూడా వాడు “వాలి” కొరకు ప్రార్థించాడు, వాడు ప్రార్థించేది ఆనాడు హింసలు అనుభవిస్తున్న మలావిలోని సహోదరులకని గ్రహించినప్పుడు వారు ఎంతో ప్రోత్సాహించబడ్డారు. నేను కేవలం నాలుగేళ్ల వయస్సున్నప్పుడే, మా తల్లి గిన్నెలు కడుగుతున్నప్పుడు, నేను కుర్చీ మీద నిల్చుని వాటిని ఆరబెడుతుండగా నేను లేఖనాలను వల్లించడానికి, రాజ్య కీర్తనలు పాడడానికి మా అమ్మ సహాయపడేది అని ఓ స్త్రీ చెప్పింది. మీరు మీ పిల్లలతో విలువగల సంభాషణను పంచుకుని వారితో ఆనందించడానికి సమయాన్ని కేటాయించడాన్ని గూర్చి ఆలోచించగలరా?
12. క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలకు వివేకయుక్తంగా ఏమి అందించగలరు, ఏ విధానాలు ఉపయోగించాలి?
12 వివేకమంతులైన క్రైస్తవ తలిదండ్రులు క్రమమైన పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మీరు ప్రశ్నా జవాబు పద్ధతిని ఉపయోగిస్తూనే, ప్రత్యేకంగా మీ పసివారికి ఆహ్లాదకరమైన సంభాషణ జరిగే విధంగా పఠన కార్యక్రమాలను మీరు మలచుకోగలరా? దానిలో, బైబిలు సన్నివేశాల చిత్రాలను గీయడం, బైబిలు కథలను చెప్పడం, లేక మీ పిల్లవాడు మీరు తయారుకమ్మనిచ్చిన ఓ నివేదికను వినడం వంటివి యిమడ్చవచ్చును. పిల్లలు దేవుని వాక్యంపై మక్కువ పెంచుకునేలా దాన్ని వీలున్నంత రుచికరంగా తయారు చేయండి. (1 పేతురు 2:2, 3) ఓ తండ్రి యిలా చెప్పారు: ‘పిల్లలు పసివారిగా ఉన్నప్పుడు, మేం వారితో నేలపై పాకుతూ ప్రఖ్యాత బైబిలు పాత్రలున్న చారిత్రాత్మక సంఘటనలను నటించాం. పిల్లలకు అది బాగా నచ్చింది.’
13. అభ్యాస కార్యక్రమాల విలువ ఏమిటి, ఈ సందర్భాల్లో మీరు వేటిని రిహార్స్ చేయవచ్చు?
13 అభ్యాస కార్యక్రమాలు కూడా విలువగల సంభాషణకు నడుపుతాయి, ఎందుకంటే పిల్లలు నిజజీవిత పరిస్థితులకొరకు తయారు కావడానికి అవి సహాయపడతాయి. నాజీ హింసా సమయంలో దేవుని యెడల నమ్మకంగా నిలిచిన 11 మంది క్యుసారొ పిల్లల్లో ఒక అమ్మాయి తన తలిదండ్రులను గూర్చి యిలా చెప్పింది: “మేము ఎలా ప్రవర్తించాలో, బైబిలుతో ఎలా మేము ప్రత్యుత్తరమివ్వాలో వారు చూపించారు. [1 పేతురు 3:15] ప్రశ్నలు వేస్తూ జవాబులు చెబుతూ మేం తరచూ అభ్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే వారము.” మీరు కూడా అలాగే ఎందుకు చేయకూడదు? తలిదండ్రుల్లో ఒకరు యింటివారిగా నటిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడాలన్న దాన్ని మీరు అభ్యసించవచ్చు. లేక నిజ జీవిత శోధనలతో ఎలా వ్యవహరించాలో అభ్యసించవచ్చు. (సామెతలు 1:10-15) “కష్టతరమైన పరిస్థితులకొరకు ముందుగా సిద్ధపడడం పిల్లవాని సామర్థ్యాన్నీ, నమ్మకాన్నీ బలపరుస్తుంది” అని ఒకామె వివరిస్తోంది. “ఆ అభ్యాసంలో, సిగరెట్టు, మత్తుపానీయం లేక మాదక ద్రవ్యాన్ని మీ పిల్లవానికి అందించే స్నేహితుని పాత్ర చేరివుంటుంది.” ఈ కార్యక్రమాలు మీ పిల్లవాడు అలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తాడో గ్రహించడానికి మీకు సహాయపడుతుంది.
14. మీ పిల్లలతో ప్రేమపూర్వకమైన, అనురాగంతో కూడిన చర్చలను జరపడం ఎందుకంత ప్రాముఖ్యం?
14 మీ పిల్లవానితో సంభాషించేటప్పుడు, ఈ మాటల రచయిత చేసినట్లుగా అదే అనురాగ భావంతో మాట్లాడండి: “నా కుమారుడా, నా ఉపదేశమును గైకొనుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ జేయును.” (సామెతలు 3:1, 2) మీరు విధేయతను కోరుతున్నారని, ఎందుకంటే విధేయత శాంతిని, దీర్ఘాయువునూ వాస్తవానికి దేవుని నూతన లోకంలో నిత్యజీవాన్ని యిస్తుందని మీరు ప్రేమపూర్వకంగా వివరించడం మీ పిల్లల హృదయాలను చలింపజేయదా? దేవుని వాక్యం నుండి మీరు సహేతుకంగా తర్కించేటప్పుడు మీ పిల్లవాని వ్యక్తిత్వాన్ని జ్ఞాపకముంచుకోండి. దీన్నీ ప్రార్థనాపూర్వకంగా చేయండి అప్పుడు యెహోవా మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు. అలాంటి ప్రేమానురాగాలతో కూడిన బైబిలు ఆధారిత చర్చలు, చక్కని ఫలితాలనూ శాశ్వత ప్రయోజనాలనూ తీసుకురాగలవు.—సామెతలు 22:6.
15. తమ పిల్లలు వారి సమస్యలను పరిష్కరించుకోడానికి తలిదండ్రులు ఎలా సహాయం చేయగలరు?
15 ఒకవేళ అలాంటి సంభాషణ మీరు ఏర్పాటుచేసుకున్న పఠన సమయంలో జరగకపోయినా, యితర విషయాలవల్ల మీ అవధానం మరల్చకండి. పిల్లవాడు చెప్పేవాటిని శ్రద్ధగా వినడమే కాకుండా, ఆ ఆలోచన ఏలా వ్యక్తపర్చబడిందో గమనించండి. “మీ పిల్లవాని వంక చూడండి” అని ఓ నిపుణుడు చెప్పాడు. “అతనికి మీ పూర్తి శ్రద్ధనివ్వండి. మీరు వినడమేకాకుండా, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రత్యేక ప్రయత్నం చేసిన తలిదండ్రులు తమ పిల్లలో జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురాగలరు.” నేటి పిల్లలు పాఠశాలల్లో, యితరత్రా స్థలాల్లో గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. తలిదండ్రులుగా మీ పిల్లవాడు మీతో స్వేచ్ఛగా మాట్లాడేటట్లు చేస్తూ వాడు దేవుని దృక్కోణం నుండి విషయాలను దృష్టించడానికి సహాయపడండి. సమస్యను పరిష్కరించడం మీకు అగోచరమనిపిస్తే, లేఖనాలనూ “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందించిన ప్రచురణలను పరిశోధించండి. (మత్తయి 24:45) అన్ని విధాలా, సమస్యను పరిష్కరించడానికి మీ పిల్లవానికి అవసరమైన ప్రత్యేకమైన శ్రద్ధను కనపర్చండి.
మీ సమయాన్ని కలిసిగడపడం విలువైనదిగా ఎంచండి
16, 17. (ఎ) నేడు విశేషంగా యౌవనులకు ప్రత్యేకమైన శ్రద్ధ, ఉపదేశం ఎందుకు అవసరం? (బి) తలిదండ్రుల నుండి క్రమశిక్షణను పొందుతున్న పిల్లలు ఏ విషయాన్ని తెలుసుకుని ఉండాలి?
16 మనం “అంత్యదినములలో” జీవిస్తున్నాము, అంతేకాకుండా యివి “అపాయకరమైన కాలములు” గనుక యౌవనులకు నేడు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. (2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-14) “దాని పొందినవారి ప్రాణము రక్షించు” నిజమైన జ్ఞానం అందించే రక్షణ తలిదండ్రులకూ పిల్లలకూ అవసరము. (ప్రసంగి 7:12) దైవిక జ్ఞానంలో బైబిలు ఆధారిత జ్ఞానాన్ని సరిగ్గా అన్వయించడం యిమిడి ఉంది గనుక దేవుని వాక్యాన్ని గూర్చిన క్రమమైన ఉపదేశం పిల్లలకు అవసరం. కాబట్టి, మీ పిల్లలతో లేఖనాలను పఠించండి. వారికి యెహోవాను గూర్చి చెప్పండి, ఆయన కోరేవాటిని గూర్చి జాగ్రత్తగా వివరించండి, ఆయన దివ్య వాగ్దానాల నెరవేర్పును గూర్చిన ఆనందదాయకమైన ఉత్తరాపేక్షను వారిలో సృజించండి. అలాంటి విషయాలను యింట్లో మాట్లాడండి, మీ పిల్లవానితో మీరు నడిచేటప్పుడు—వాస్తవానికి, ప్రతి అనుకూల సందర్భంలోనూ మాట్లాడండి.—ద్వితీయోపదేశకాండము 6:4-7.
17 అన్ని మొక్కలూ ఒకే పరిస్థితుల్లో ఫలించవని రైతులకు తెలుసు. మొక్కలకు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. అదేవిధంగా, ప్రతి పిల్లవాడు వేరుగా ఉంటాడు, మరి వానికి ప్రత్యేకమైన శ్రద్ధ, ఉపదేశం, క్రమశిక్షణా అవసరం. ఉదాహరణకు, ఓ పిల్లవాడు చెడునడతను మానుకోడానికి తలిదండ్రులు ఉరిమి చూస్తే సరిపోతుంది. వేరే పిల్లవానికి గట్టి క్రమశిక్షణ అవసరం కావచ్చు. అయితే మీ పిల్లలందరికీ, మీరు కొన్ని నిర్దష్ట మాటలనూ, చర్యలను ఎందుకు అయిష్టపడతారో తెలియజేయాలి. అంతేకాకుండా క్రమశిక్షణ ఒకేవిధంగా ఉండడానికిగాను తలిదండ్రులిద్దరూ సహకరించాలి. (ఎఫెసీయులు 6:4) లేఖనాలతో అనుగుణంగా ఉన్న స్పష్టమైన నడిపింపును క్రైస్తవ తలిదండ్రులు యివ్వడం ప్రత్యేకంగా ప్రాముఖ్యము.
18, 19. క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలయెడల ఏ బాధ్యతను కల్గివున్నారు, ఆ పని సరిగ్గా జరిగినట్లయితే ఏమి ఫలించగలదు?
18 ఓ రైతు మొక్కలను నాటేపని పెంచేపనిని సరైన సమయంలో చేయాలి. అతను తన పంటను వేయడంలో ఆలస్యం చేసినా లేక అశ్రద్ధ చేసినా, కొంత పంటనే కోస్తాడు లేక ఏమీ కోయలేడు. అవును, వచ్చే నెల కాదు వచ్చే ఏడాది కాదు ప్రత్యేకమైన అవధానం యిప్పుడే అవసరమైన పెరిగే “మొక్కల’ వంటి వారు మీ పిల్లలు. దేవుని వాక్యానికి అనుగుణంగా వారి ఆత్మీయ అభివృద్ధిని పెంపొందించడానికి, వారిని వడలింపజేసి ఆత్మీయంగా చనిపోయేలా చేసే లౌకిక ఆలోచనలను పెరికి వేయడానికి గల అమూల్య అవకాశాలను జారవిడవకండి. మీరు మీ పిల్లలతో గడిపే గండలూ రోజులను విలువైనవిగా ఎంచుకోండి ఎందుకంటే ఈ కాలము బహు త్వరగా గడిచిపోతుంది. యెహోవా నమ్మకమైన సేవకులుగా సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైన దైవిక లక్షణాలను మీ పిల్లల్లో పెంపొందించడానికి గట్ట కృషి చేయండి. (గలతీయులు 5:22, 23; కొలొస్సయులు 3:12-14) ఇది వేరే వారిపని కాదు; యిది మీ పనే, మరి అలా చేయడానికి దేవుడు మీకు సహాయం చేయగలడు.
19 మీ పిల్లలకు గొప్ప ఆత్మీయ వారసత్వాన్ని యివ్వండి. వారితో దేవుని వాక్యాన్ని పఠించి, ఆరోగ్యదాయకమైన వినోదాన్ని కలిసి ఆనందించండి. మీ పిల్లలనూ క్రైస్తవ కూటాలకు తీసుకు వెళ్లండి, రాజ్య ప్రచార పనిలో వారిని మీ ప్రక్కనే ఉంచండి. మీ ప్రియమైన పిల్లల్లో యెహోవా అంగీకారాన్ని పొందగల వ్యక్తిత్వాన్ని నిర్మించండి, అప్పుడు వారు మీ తదుపరి జీవితంలో ఎక్కువ సంతోషాన్ని తీసుకురాగలరు. అవును, “నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.”—సామెతలు 23:24,25.
ఓ గొప్ప ప్రతిఫలం
20. యౌవనుల తలిదండ్రులు విజయవంతం కావడానికి ఏది కీలకం?
20 పిల్లలను పెంచడం చాలా క్లిష్టమైన, దీర్ఘాకాలీన పని. ‘నీ భోజనపు బల్లచుట్టు ఒలీవ మొక్కలవలె’ ఉన్న వారిని రాజ్య ఫలాన్ని ఫలించే దైవ భయమున్న పెద్దవారిగా పెంచడం 20 ఏళ్ల యోజన అని వర్ణించబడుతోంది. (కీర్తన 128:3; యోహాను 15:8) పిల్లలు పడుచు వయస్సుకు వచ్చేసరికి, ఈ యోజన మరింత కష్టతరమౌతుంది, అప్పుడు వారిపై ఒత్తిడులు పెరుగుతాయి గనుక తలిదండ్రులు వారికి సహాయం చేసే ప్రయత్నాలను ఉద్ధృతం చేయవలసివస్తుంది. అయితే, విజయానికి కీలకం మాత్రం మారదు—అవే అవధానం, అనురాగం, అవగాహన, మీ యౌవనులుక వ్యక్తిగత అవధానం నిజంగా అవసరమని జ్ఞాపకముంచుకోండి. ప్రయోజనార్థమై యథార్థమైన ప్రేమపూర్వకమై శ్రద్ధను మీరు కనపర్చగల వ్యక్తిగత అవధానం వారి ప్రయోజనార్థమైన యథార్థమైన ప్రేమపూర్వక శ్రద్ధను కనపర్చడం ద్వారా మీరు ప్రదర్శించగలరు. వారికి సహాయపడడానికి, వారికి, నిజంగా అవసరమైన మీ సమయం, ప్రేమ, శ్రద్ధలను అందిస్తూ మిమ్మల్ని మీరు వ్యయపర్చుకోవాలి.
21 యెహోవా మీకు అప్పగించిన అమూల్య ఫలాన్ని శ్రద్ధగా చూసుకునేందుకు మీరు చేసిన ప్రయత్నాలకు దక్కే పారితోషికం, ఏ వ్యవసాయదారుని విస్తారమైన పంటకన్నా ఎంతో సంతృప్తికరంగా వుంటుంది. (కీర్తన 127:3-5) కాబట్టి తలిదండ్రులారా, మీ పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధను అందించడంలో కొనసాగండి. వారి మంచి కొరకు, మన పరలోక తండ్రియైన యెహోవా మహిమార్థమై అలా చేయండి.
మీరెలా జవాబిస్తారు?
◻ మొక్కలను పెంచడమూ పిల్లలను పెంచడమూ ఎలా పోల్చబడగలవు?
◻ ఓ పిల్లవానికి నిత్యమూ బాల్యంనుండే ఎలాంటి శ్రద్ధ కనపర్చాలి?
◻ ఏ ప్రత్యేకమైన శ్రద్ధ పిల్లలకు కనపర్చాల్సిన అవసరం ఉంది, అది ఎలా యివ్వబడగలదు?
◻ మీ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ ఎందుకు కనపర్చాలి?
21. పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధనివ్వడం వల్ల ఏ ప్రతిఫలం లభించగలదు?