కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 5/15 పేజీలు 15-20
  • యౌవనులారా—మీరు ఎవరి బోధను లక్ష్యపెడతారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యౌవనులారా—మీరు ఎవరి బోధను లక్ష్యపెడతారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దయ్యాలూ వాటి బోధలు
  • దయ్యాల బోధను ప్రబోధించడం
  • ఆత్మావలోకనం చేసుకోండి
  • దయ్యాల బోధను ఎదిరించండి
  • దైవిక బోధనుండి ప్రయోజనం పొందండి
  • సరైన ఎంపికను చేయండి
  • దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్య పోరాటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యేసుకు దయ్యాలను నాశనం చేయగల శక్తి ఉంది
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • దేవదూతల గురించిన సత్యం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవదూతలు ఎవరు, వాళ్లు ఏం చేస్తారు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 5/15 పేజీలు 15-20

యౌవనులారా—మీరు ఎవరి బోధను లక్ష్యపెడతారు?

“కొందరు . . . మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురు.”—1 తిమోతి 4:1.

1. (ఎ) యౌవనులకు ఏ ఎంపిక ఉంది? (బి) యెహోవా ఎలా బోధిస్తాడు?

యౌవనులకు యిక్కడ అడిగే ప్రశ్నేమిటంటే, మీరు ఎవరి బోధను లక్ష్యపెడతారు? యౌవనులైన మీకు ఎన్నుకునే అవకాశముందని యిది సూచిస్తుంది. ఈ ఎంపిక దైవిక బోధకు అనుకూలంగా ప్రతిస్పందించడమూ దయ్యాల బోధను అనుసరించడం మధ్య ఉంది. యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా, అంతేకాకుండా భూమిపైన తనకు ప్రతినిధులుగా ఏర్పర్చుకొన్నవారి పరిచర్య ద్వారా కూడా బోధిస్తాడు. (యెషయా 54:13; అపొస్తలుల కార్యములు 8:26-39; మత్తయి 24:45-47) అయితే దయ్యాలు కూడా బోధిస్తాయంటే మీకు ఆశ్చర్యంగా ఉందా?

2. ప్రత్యేకంగా ఈ కాలంలో, దయ్యాల బోధనుండి జాగ్రత్తగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

2 అపొస్తలుడైన పౌలు యిలా రాశాడు: “అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురు.” (1 తిమోతి 4:1) సాతాను అతని దూతలు, విశేషంగా చురుకుగా ఉన్న “అంత్యదినములలో” మనం జీవిస్తున్నాము గనుక, మీరు ఎవరి బోధను లక్ష్యపెడతారు అని మేము మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించామో మీరు అర్థం చేసుకోగలరా? (2 తిమోతి 3:1-5; ప్రకటన 12:7-12) సాతాను అతని దూతలూ తాము పనిచేసే విధానంలో చాలా కుయుక్తి, మోసము గలవారు గనుక, ఈ ప్రశ్నను మీరు శ్రద్ధగా పరిశీలించడం ప్రాముఖ్యము.—2 కొరింథీయులు 11:14, 15.

దయ్యాలూ వాటి బోధలు

3. దయ్యాలు ఏవి, వాటి ధ్యేయమేంటి, దాన్ని ఎలా సాధించాలని ప్రయత్నిస్తాయి?

3 దయ్యాలు ఒకప్పుడు యెహోవా దూతలే, అయితే వారు తమ సృష్టికర్తకు ఎదురుతిరిగి, అలా సాతాను మద్దతుదారులయ్యారు. (మత్తయి 12:24) ప్రజలను చెరిపి, దేవున్ని సేవించడం నుండి వారిని తిప్పివేయడమే వారి ఉద్దేశం. దీన్ని సాధించడానికి, యెహోవా ఖండించే స్వార్థపూరితమైన అవినీతికరమైన జీవిత విధానాన్ని ప్రబోధించే మానవ బోధకులను దయ్యాలు ఉపయోగించుకుంటాయి. (2 పేతురు 2:1, 12-15 పోల్చండి.) మునుపు నమ్మకమైన దూతలు దయ్యాలుగా ఎలా మారారన్న విషయాన్ని పునఃసమీక్షించడమనేది వారి బోధలనూ ఆ బోధలు ప్రబోధించే జీవన విధానాన్ని గుర్తించడానికి మీకు సహాయపడుతుంది.

4. (ఎ) నోవహు దినాల్లో అవిధేయులైన దూతలు భూమికి ఎందుకు వచ్చారు? (బి) దుష్ట దూతలకూ వారి సంతానానికి నోవహు జలప్రళయం నాడు ఏమి సంభవించింది?

4 నోవహు దినాల్లో, కొందరు దూతలు మానవుల అందమైన కుమార్తెలను చూసి ఎంతగా ఆకర్షితులయ్యారంటే, వారు భూమిమీదికి రావడానికి పరలోకంలో తమ స్థానాలను వదులుకున్నారు. స్త్రీలతో వారి లైంగిక సంయోగం నెఫీలులు అనే సంకరజాతి సంతానాన్ని ఉత్పత్తి చేసింది. ఆత్మీయ ప్రాణులు మానవులతో సహజీవనం జరిగించడం అసహజం గనుక, తర్వాత సొదొమలోని పురుషులూ అబ్బాయిలూ చేసిన సలింగ సంయోగం ఎంత తప్పో, అవిధేయులైన దూతలు చేసినది కూడా అంతే తప్పు. (ఆదికాండము 6:1-4; 19:4-11; యూదా 6, 7) వారి స్త్రీలు తమ సంకరజాతి పిల్లలతో జలప్రళయ నీటిలో నాశనమైనప్పటికి, దుష్టదూతలు తమ భౌతిక కాయాలను విడిచిపెట్టి, అపవాదియైన సాతానుకు తోడుగా ఉండే దయ్యాలుగా మారి పరలోకానికి చేరుకున్నారు.—2 పేతురు 2:4.

5. దయ్యాలు ఎలాంటి జీవులు, వారు దేవుని నియమాలను ఎలా చిన్నచూపు చూస్తున్నారు?

5 ఈ గత చరిత్ర దృష్ట్యా, దయ్యాలు ఎలాంటి జీవులో మీరు గ్రహించగలరా? ఈ లైంగిక పిచ్చిలో మునిగివున్న లోకాన్ని తెరవెనుక ఉండి నడిపించే లైంగిక ప్రవృత్తిగల నీచమైన వారు వీరే. వారు మరలా మానవులుగా శరీరం ధరించడానికి అనుమతి లేకపోయినప్పటికి, భూమిపైన వారు చెరపగలవారి లైంగిక విపరీతచర్యల ద్వారా సంతోషాన్ని పొందుతారు. (ఎఫెసీయులు 6:11, 12) శుద్ధత, నైతికత విషయాల్లో యెహోవా న్యాయవిధులు అనవసరంగా నిర్భింధించేవని భావింపజేస్తు వాటిని పడద్రోయాలని దయ్యాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ దుష్టదూతలు, లైంగిక అవినీతిని సంతోషకరమైన సహజమైన జీవన విధానమని సమర్థిస్తాయి.

దయ్యాల బోధను ప్రబోధించడం

6. దయ్యాలు తమ బోధను మోసకరమైన పద్ధతిలో ప్రబోధించే విషయంలో మనం ఎందుకు ఆశ్చర్యపోము?

6 దయ్యాలు తమ బోధలను మోసకర విధాల్లో ప్రబోధించడం మనలను ఆశ్చర్యపర్చకూడదు, ఎందుకంటే వారి నాయకుడైన అపవాదియగు సాతాను హవ్వను మోసగించడానికి ఉపయోగించిన విధం కూడా అదే. అతను ఏదో ఆమెకు సహాయపడాలనుకుంటున్నాడని అనిపించే విధంగా ఆమెతో మాట్లాడాడన్నది జ్ఞాపకంచేసుకోండి. “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని సాతాను అడిగాడు. తర్వాత అతను హవ్వతో, నిషేధించిన చెట్టు ఫలమును తినడం వల్ల ప్రయోజనం పొందగలదని మోసకరంగా చెప్పి దైవిక బోధను కించపర్చడానికి ప్రయత్నించాడు. “మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురని” అపవాది వాగ్దానం చేశాడు. (ఆదికాండము 3:1-5) అలా హవ్వ దేవునికి అవిధేయురాలు అయ్యేటట్లు అతని ఉరిలోపడిపోయింది, అవును మోసగించబడింది.—2 కొరింథీయులు 11:3; 1 తిమోతి 2:13, 14.

7. దయ్యాల మోసకరమైన బోధల ప్రభావం ఎలా ఉంది, మరి యిది ఏ హెచ్చరికను యిస్తుంది?

7 నేటి కాలంలో కూడా, అనేకులు మోసగించబడ్డారు. దయ్యాలు లైంగిక అవినీతిని ఎంత కుయుక్తితో ప్రబోధించారంటే, లైంగిక అవినీతిని ఎంత కుయుక్తితో ప్రబోధించారంటే, ముందు దాన్ని ఖండించినవారే దాన్ని ఆమోదించే స్థితికి వచ్చారు. ఉదాహరణకు, సలహాలిచ్చే ప్రముఖ అమెరికా పత్రికా శీర్షిక రచయిత్రి, అవివాహితులైన వ్యక్తులు లైంగిక సంబంధాలను కల్గివుండే విషయంలో వచ్చిన ఉత్తరానికి జవాబిస్తూ యిలా వ్రాసింది: “ఈ విషయంలో నన్ను నేను మార్చుకుంటానని నేను ఎన్నడు భావించలేదు, అయితే, పెళ్లిని గూర్చి గంభీరంగా తలంచే జంటలు తమ తమ సామర్థ్యాలను పరీక్షించుకోడానికి కొన్ని వారాంత యాత్రలకు కలిసి వెళ్లడం మంచిదని నేను నమ్ముతున్నాను.” తర్వాత ఆమె యింకా యిలా చెప్పారు: “అలా వ్రాసింది నేనేనని నమ్మలేకపోతున్నాను!” ఆమె వ్యభిచారాన్ని సిఫార్సు చేసిందన్న విషయాన్ని నమ్మలేకపోయింది, కానీ ఆమె నిజంగానే సిఫార్సు చేసింది! స్పష్టంగా, దేవుడు ఖండించే చర్యలను మనం దృష్టించే విధానంపైన దయ్యాల బోధ ప్రభావం పడకుండా మనం జాగ్రత్తపడాలి.—రోమీయులు 1:26, 27; ఎఫెసీయులు 5:5, 10-12.

8. (ఎ) “లోకము” అనే పదం బైబిల్లో ఎలా ఉపయోగించబడుతోంది? (బి) లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, మరి యేసు అనుచరులు ఈ లోకాన్ని ఎలా దృష్టించాలి?

8 సాతాను “ఈ లోకాధికారి” అనే విషయాన్ని మనమెన్నడూ మర్చిపోకూడదు. వాస్తవానికి, అపొస్తలుడైన యోహాను, “లోకమంతయు దుష్టునియందున్నదని” చెప్పాడు. (యోహాను 12:31; 1 యోహాను 5:19) నిజమే, కొన్నిసార్లు పూర్తి మానవజాతిని సూచించడానికి యేసు “లోకము” అనే పదాన్ని ఉపయోగించాడు. (మత్తయి 26:13; యోహాను 3:16; 12:46) అయితే తరచుగా, నిజ క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్న సంస్థీకరించబడిన మానవ సమాజాలన్నింటినీ సూచించడానికి “లోకము” అనే పదాన్ని ఉపయోగించాడు. ఉదాహరణకు, తన శిష్యులు ‘లోక (అవినీతికర మానవ సమాజము) సంబంధులు కాకూడదని,’ మరి వారు లోక సంబంధులు కారు గనుకనే లోకం వారిని ద్వేషిస్తుందని యేసు చెప్పాడు. (యోహాను 15:19; 17:14-16) అంతేకాకుండా మనం సాతాను పరిపాలించే లోకంతో స్నేహం చేయకూడదని బైబిలు హెచ్చరిస్తోంది.—యాకోబు 4:4.

9, 10. (ఎ) ఏ లౌకిక విషయాలు తగని లైంగిక కోరికలను రేపుతాయి? (బి) లోక వినోదం బోధించేదేమిటి, దాని వెనుక ఉన్నదెవరో గుర్తించడం ఎలా సాధ్యమౌతుంది?

9 అపొస్తలుడైన యోహాను యిలా ఉద్బోధించాడు: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి.” ఆయన యింకా యిలా అన్నాడు: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” (1 యోహాను 2:15, 16) దీన్ని గూర్చి ఆలోచించండి. ఉదాహరణకు అవినీతికర లైంగికత వంటి చెడు కోరికను ఉత్పన్నం చేసేవి ఈ లోకంలో ఏమున్నాయి? (1 థెస్సలొనీకయులు 4:3-5) లోకపు సంగీతం మాటేమిటి? కాలిఫోర్నియా పోలీసు పరిశోధక అధికారి యిలా చెప్పింది: “అసలు, నీవు నీ తలిదండ్రుల మాట విననవసరం లేదనీ, నీకు యిష్టం వచ్చినట్లు నీవు జీవించాలని సంగీతం బోధిస్తుంది.” ఇలాంటి బోధను అందించే సంగీతపు మూలం ఏదో మీరు గ్రహించగలరా?

10 సాతాను హవ్వతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి: ‘మంచి వాటిని నీవు పోగొట్టుకుంటున్నావు, నీకిష్టం వచ్చినట్లు నీవు జీవించు. ఏది మంచో ఏది చెడో నీకు నీవే నిర్ణయించుకో. దేవుడు చెప్పేదేమి నీవు విననవసరంలేదు.’ (ఆదికాండము 3:1-5) లోకపు సంగీతంలో ఎక్కువ వంతు అలాంటి సమాచారమే కనిపించడం లేదా? అయితే, దయ్యాలు కేవలం సంగీతం ద్వారానే బోధించవు. అవి వాణిజ్య దూరదర్శిని కార్యక్రమాలను సినిమాలనూ వీడియోలనూ ఉపయోగించి బోధిస్తాయి. అదెలా? లోక మాధ్యమాలు, దేవుని నైతిక బోధలు అణిచి వేసేవిగా కనిపించేట్లు చేసే వినోదాన్ని అందిస్తుంటాయి. అవి వ్యభిచారాన్ని అందిస్తుంటాయి. అవి వ్యభిచారాన్ని నొక్కివక్కాణిస్తూ అది కోరదగినదన్నట్లుగా ప్రదర్శిస్తూ దాన్ని సమర్థిస్తాయి.

11. నైతిక విషయంలో దూరదర్శిని తరచుగా ఏమి బోధిస్తుంది?

11 యు.ఎస్‌.న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్డ్‌ పత్రిక యిలా పేర్కొంది: “మూడు [అమెరికా] నెట్‌వర్క్‌లు 1991లో, అనేకులు దూరదర్శిని చూసే సమయంలో 10,000 లైంగిక సంఘటనలను ప్రదర్శించాయి; వివాహితుల మధ్య లైంగిక సంయోగాన్ని సూచించే ప్రతి ఒక్క సన్నివేశానికీ, వివాహం వెలుపల లైంగిక సంయోగాన్ని సూచించే 14 సన్నివేశాలను నెట్‌వర్క్‌లు చూపించాయి.” ఒక సంవత్సరంలోనే అనేకులు దూరదర్శిని చూసే సమయంలో లైంగిక అవినీతిని 9,000 సార్లకంటే అధికంగా చూపించడం ద్వారా, దూరదర్శిని ఏమి బోధిస్తుందని మీరంటారు? “సెక్స్‌ ఇన్‌ ది ఫ్రెమ్‌టైమ్‌ టెలివిషన్‌: 1979 వర్సస్‌ 1989,” అనే నివేదికను కలిసి రచించిన బార్రీ ఎస్‌. సాపొల్‌క్సి యిలా పేర్కొన్నాడు: “సరస సల్లాపాల్లో లేక లైంగిక ప్రవర్తనలో మునిగివున్న ప్రజలను దూరదర్శినిలో కొన్ని సంవత్సరాలపాటు ఓ యౌవనుడు చూస్తున్నట్లయితే, ఈ వేలకొలది సన్నివేశాలు కొన్ని సంవత్సరాలకు లైంగికత ఆహ్లాదకరమైందనీ, ఏ పరిణామాలూ లేనిదని బోధిస్తుంది.” ఈ విషయంలో ఏ అనుమానమూ లేదు: ఏ విధులు లేవనీ, వ్యభిచారం అంగీకారమైందేననీ, దేవుడు ఖండించే పద్ధతిలో జీవించడం వల్ల ఏ చెడు పరిణామాలు కల్గవనీ ప్రపంచ వినోదం పిల్లలకు బోధిస్తుంది.—1 కొరింథీయులు 6:18; ఎఫెసీయులు 5:3-5.

12. ప్రత్యేకంగా క్రైస్తవ యౌవనులకు లోక వినోదం ఎందుకు అపాయాన్ని తెస్తోంది?

12 ప్రపంచ సంగీతం, సినిమాలు, వీడియోలు, దూరదర్శిని యౌవనులను ఆకట్టుకోడానికి తీర్చిదిద్దబడ్డాయి. అవి దయ్యాల నీచమైన బోధలను ప్రచారం చేస్తున్నాయి! అయితే యిది ఆశ్చర్యం కలిగించాలా? దీన్ని గూర్చి ఆలోచించండి. అబద్ధమత, రాజకీయం సాతాను లోకంలో భాగమైనట్లయితే—అవి దానిలోని భాగమే. అప్పుడు లోకం ప్రబోధించే వినోదంపై దయ్యాల ప్రభావం ఏ మాత్రం లేదని నమ్మడంలో అర్థముందంటారా? ప్రత్యేకంగా యౌవనులైన మీరు “లోకము దాని ధోరణిలోకి మిమ్మల్ని మలచకుండా” జాగ్రత్తపడడం అవసరం.—రోమీయులు 12:2, జె. బి. ఫిలిప్స్‌ అనువదించిన ది న్యూ టెస్టమెంట్‌ ఇన్‌ మాడర్న్‌ ఇంగ్లీష్‌.

ఆత్మావలోకనం చేసుకోండి

13. ఎలాంటి ఆత్మావలోకనం చేసుకోవాలి?

13 మీరు ఎవరి బోధలను లక్ష్యపెడుతున్నారన్న విషయం కేవలం మీ మాటల ద్వారానే కాదు మీ ప్రవర్తన ద్వారా కూడా నిర్ణయించబడుతుంది. (రోమీయులు 6:15) కనుక మిమ్మల్ని మీరు యిలా ప్రశ్నించుకోండి, ‘ప్రపంచ ప్రచార సాధనాల ద్వారా నేను నేర్చుకుంటున్నవి, నా ప్రవర్తనపై నా జీవిత విధానంపై తగని విధంగా ప్రభావాన్ని కల్గివున్నాయా? దయ్యాల బోధలు నా జీవితంలో చోటుచేసుకుంటున్నాయా?’ ఈ ప్రశ్నలకు మీరు సరిగ్గా జవాబు చెప్పడానికి, బైబిలు చదవటంలో మీరు వ్యయపర్చే సమయాన్ని ప్రయాసను, క్రైస్తవ కూటాలకు హాజరు కావడానికి, దేవుని రాజ్యమును గూర్చి మీరు యితరులతో మాట్లాడడానికి గడిపే సమయాన్ని, దూరదర్శిని చూస్తూ, సంగీతం వింటూ, మీ ప్రియమైన క్రీడలో పాల్గొంటూ లేక అలాంటి యితర కార్యాల్లో మీరు యిమిడి పోయే సమయాన్ని ఎందుకు పోల్చి చూసుకోకూడదు? ఎంతో—వాస్తవానికి మీ జీవితమే సంక్లిష్టతలో ఉంది కనుక, నిజాయితీగా ఆత్మావలోకనం చేసుకోండి.—2 కొరింథీయులు 13:5.

14. మన ఆత్మీయ ఆరోగ్యాన్ని ఏది ప్రభావితం చేస్తుంది, ఏ గంభీరమైన ఆలోచనను మనం మన మనస్సులో ఉంచుకోవాలి?

14 మీరు భుజించే భౌతికాహారం మీ భౌతిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు బాగా తెలుసు. అదే విధంగా, మీ మనస్సుకూ మీ హృదయానికీ మీరెలాంటి ఆహారమిస్తారో దాన్నిబట్టి మీ ఆత్మీయ ఆరోగ్యం ప్రభావితం చెందుతుంది. (1 పేతురు 2:1, 2) మీ నిజమైన ఆసక్తులేవో అనే విషయంలో మిమ్మల్ని మీరు మోసగించుకోవచ్చు గానీ మన న్యాయాధిపతియైన యేసుక్రీస్తును మాత్రం మోసగించలేరు. (యోహాను 5:30) కనుక మిమ్మల్ని మీరు యిలా ప్రశ్నించుకోండి, ‘యేసు ఒకవేళ భూమి మీద ఉన్నట్లయితే, ఆయన నా గదిలోకి వచ్చి నేను వినే సంగీతాన్ని వింటే లేక నేను టివిలో చూసే వాటిని చూస్తే, నేను సిగ్గుపడతానా?’ గంభీరమైన వాస్తవమేంటంటే యేసు చూస్తూనే ఉన్నాడు, అంతేకాదు మన క్రియలు ఆయనకు తెలుసు.—ప్రకటన 3:15.

దయ్యాల బోధను ఎదిరించండి

15. దయ్యాల బోధను ఎదిరించడానికి క్రైస్తవులెందుకు గట్టి పోరాటాన్ని జరపాలి?

15 యౌవనులు తమ బోధలను లక్ష్యపెట్టడానికి దయ్యాలు తెచ్చే ఒత్తిడి ఉద్ధృతంగా ఉంటుంది. ఈ దుష్ట ఆత్మలు సరదా, సుఖంతో కూడిన క్షణికానంద జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. దేవున్ని ప్రీతిపర్చడానికి, ప్రాచీన కాలమందున్న మోషే, ఫరో యింటిలో ఓ ప్రాముఖ్యమైన సభ్యునిగా “అల్పకాలము పాప భోగము” అనుభవించడానికి నిరాకరించాడు. (హెబ్రీయులు 11:24-27) దయ్యాలు అందించే వాటిని నిరాకరించడం అంత సులభం కాదు. కనుక సరైంది చేయడానికి మీరు గట్టి సమరం సలపాల్సి ఉంటుంది. మనం పాపాన్ని వారసత్వంగా పొందాము, అంతేకాకుండా మన హృదయం ఎల్లప్పుడూ చెడు చేయడానికే ముందుకు పరుగులు తీస్తుంది గనుక ఇది తప్పకుండా నిజం. (ఆదికాండము 8:21; రోమీయులు 5:12) పాపభూయిష్ట కోరికల కారణంగా, అపొస్తలుడైన పౌలు తనకు తాను కఠినంగా ఉంటూ తన శరీరేచ్ఛలు తనపై అధికారం చెలాయించడానికి అనుమతించకుండా ఉండాల్సి వచ్చింది.—1 కొరింథీయులు 9:27; రోమీయులు 7:21-23.

16. యౌవనులు అవినీతికర ప్రవర్తనలో పాల్గొనే ఒత్తిడులను ఎలా ఎదిరించగలరు?

16 “దుష్కార్యము జరిగించుటకు సమూహమును వెంబడించే” శోధన మీకు కల్గినప్పటికి, మీ తోటివారి చెడు నడవడిని మీరూ అనుసరించకుండా ఆ ఒత్తిడిని ఎదిరించడానికి దేవుడు మీకు సహాయం చేయగలడు. (నిర్గమకాండము 23:2; 1 కొరింథీయులు 10:13) అయితే, దేవుని మాటలను మీ హృదయంలో దాచుకుంటూ ఆయన నడిపింపుకు మీరు చెవియొగ్గాల్సి ఉంటుంది. (కీర్తన 119:9, 11) యౌవనులు తమ్మును తాము ఏకాంతపర్చుకున్నప్పుడు లైంగిక కోరికలు అభివృద్ధిచెంది, దేవుని న్యాయవిధిని తప్పడానికి నడిపించగలవని గ్రహించడం అవసరం. “నేను నా స్నేహితుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు, నా శరీరం ఒకదాన్ని చేయాలని కోరుతుంది, నా మెదడు మరొకటి చేయమని చెబుతుంది,” అని ఓ యౌవనురాలు ఒప్పుకుంది. కాబట్టి మీ అవధులను గుర్తించండి, మీ హృదయం మోసకరమైనదని గ్రహించండి. (యిర్మీయా 17:9) మిమ్మల్ని మీరు ఒంటరిగా చేసుకోకండి. (సామెతలు 18:1) అనురాగ భావాలకు ఆనకట్టలు కట్టండి. మరి ప్రాముఖ్యంగా, యెహోవాను ప్రేమించి ఆయన న్యాయవిధులంటే లోతైన గౌరవం గల వ్యక్తులతోనే సన్నిహిత సహవాసాన్ని కల్గివుండండి.—కీర్తన 119:63; సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33.

17. దయ్యాల బోధను ఎదిరించడానికి క్రైస్తవ యువతకు ఏది సహాయపడగలదు?

17 మీ ఆత్మీయ దారుఢ్యం కొరకు తయారు చేయబడిన క్రైస్తవ ప్రచురణలను జాగ్రత్తగా పఠించండి. ఉదాహరణకు, కావలికోట, తేజరిల్లు! పత్రికల శీర్షికలనూ మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని “సరియైనది చేయుట కొరకు పోరాటము” అనే అధ్యాయాన్ని పరిశీలించండి. వాటిలో అందించబడిన లేఖనానుసారమైన ఉపదేశాలను మీ మనస్సులోకి, హృదయాంతరాల్లోకి యింకిపోవడానికి అనుమతించండి, అది మీకు బలాన్ని చేకూరుస్తుంది. దయ్యాల ఆధ్వర్యాన ఉన్న ఈ ప్రపంచంలో, సరైంది చేయడం అంత సులభం కాదన్న వాస్తవాన్ని మీరెన్నడు మరువరాదు. కనుక గట్టిగా పోరాడండి. (లూకా 13:24) మీ ఆత్మీయ శక్తిని నిర్మించుకోండి. సమూహమును అనుసరించే పిరికివారిని, బలహీనులను అనుకరించకండి.

దైవిక బోధనుండి ప్రయోజనం పొందండి

18. దైవిక బోధను అనుసరించడంలో గల కొన్ని ప్రయోజనాలేమిటి?

18 యెహోవా బోధలను లక్ష్యపెట్టడం ద్వారా ప్రయోజనకరమైనది మీరు కోల్పోవడం లేదు అన్నది జ్ఞాపకముంచుకోండి. ఆయన మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడు. అందుకనే “నీకు ప్రయోజనము కలుగునట్లు . . . ఉపదేశము” చేస్తున్నాడు. (యెషయా 48:17) కనుక యెహోవా బోధను లక్ష్యపెట్టి, చెడిన మనస్సాక్షి, ఆత్మాభిమాన లోపం, కోరని గర్భం, లైంగికపరంగా సంక్రమించే వ్యాధులు లేక అలాంటి విషాదభరిత విషయాల నుండి వచ్చే హృదయక్షోభను మీరు నివారించవచ్చు. మానవులు పరీక్షా సమయంలో దేవుని యెడల నమ్మకంగా ఉండరన్న సాతాను సవాలుకు తగిన జవాబును తన సేవకులు యిచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (యోబు 1:6-12) యెహోవాకు నమ్మకంగా ఉంటూ ఆయన హృదయాన్ని సంతోషపర్చినప్పుడు, ఈ లోకంపై ఆయన ప్రతికూల తీర్పును అమలుపర్చినప్పుడు మీరు తప్పించబడతారు, అయితే ఆయన విధులను తిరస్కరించేవారు మాత్రం నాశనమౌతారు.—సామెతలు 27:11; 1 కొరింథీయులు 6:9,10; 1 యోహాను 2:17.

19. యెహోవా బోధల ప్రయోజనాలను మెచ్చుకునే వారితో సహవసించడంలోని విలువ ఏమిటి?

19 యెహోవా తమకు చేసిన వాటిని మెచ్చుకునే వారితో మీరు సహవసించినట్లయితే, వారి అనుభవంనుండి మీరు నేర్చుకోగలరు. గతంలో మాదక ద్రవ్యాలకు బానిసై, అవినీతికి పాలుపడ్డ ఒకామె యిలా వివరించించి: “నేను యెహోవా మాటలు వినివుండకపోయినట్లయితే, ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని. నేను పెళ్లి చేసుకుందామనుకున్న వ్యక్తి ఎయిడ్స్‌ వల్ల చనిపోయాడు. నా గత లౌకిక సన్నిహిత స్నేహితులందరూ ఎయిడ్స్‌ వల్ల చనిపోయారు, లేక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వారిని తరచూ వీధుల్లో చూస్తుంటాను. తన న్యాయవిధులు ప్రజలను నడిపిస్తున్నందుకు, నేను యెహోవాకు ప్రతిదినం కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనం వాటిని పాటించాలేగాని అవి మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతాయి. నేను నా జీవితంలో మునుపెన్నడూ యింత సంతోషాన్ని, తృప్తిని, భద్రతను అనుభవించలేదు.” యెహోవా బోధలను లక్ష్యపెట్టడం మనకు ఎల్లప్పుడూ ప్రయోజనకరమన్నది అక్షరాలా నిజం!

సరైన ఎంపికను చేయండి

20, 21. (ఎ) యువతకు ఏ రెండు ఎంపికలున్నాయి? (బి) దైవిక బోధను లక్ష్యపెట్టడం వల్ల ఏ దీర్ఘకాలిక ప్రయోజనం ప్రాప్తిస్తుంది?

20 యౌవనులారా మేము మిమ్మల్ని యిలా కోరుతున్నాం. యెహోవాను సేవించడం ద్వారా సరైన ఎంపిక చేసుకోండి. తర్వాత ఆ నిర్ణయానికి హత్తుకుని ఉండడానికి తీర్మానించుకోండి. (యెహోషువ 24:15) వాస్తవంగా ఈ రెండు ఎంపికల్లో ఒకదాన్ని మాత్రమే మీరు ఎన్నుకోగలరు. వెడల్పైన, విశాలమైన ఒక మార్గం ఉందని యేసు చెప్పాడు—ఇష్టమొచ్చినట్లు చేయడానికి అనుమతించే సులభ మార్గం. ఆ మార్గం నిరీక్షణలేని నాశనానికి నడిపిస్తుంది. మరోకటి యిరుకు మార్గం. ఈ అవినీతికర, దయ్యాల ఆధ్వరంలో ఉన్న ప్రపంచంలో ఈ మార్గం గుండా ప్రయాణించడం కష్టతరంగా ఉంటుంది. అయితే, ఆ మార్గం దాని గుండా ప్రయాణించేవారిని దేవుని అద్భుతమైన నూతన లోకంలోకి నడిపిస్తుంది. (మత్తయి 7:13, 14) మీరు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు? ఎవరి బోధను మీరు లక్ష్యపెడతారు?

21 ఎంపికను యెహోవా మీ చేతుల్లో విడిచి పెడుతున్నాడు. మీరు ఆయనను ఆరాధించాలని ఆయన మిమ్మల్ని బలవంత పెట్టడు. “జీవమును కోరుకొనుడి” అని ఉద్బోధిస్తూ దేవుని ప్రవక్తయైన మోషే యిలా అన్నాడు: “జీవమును మరణమును, . . . మీ ముందుంచాను.” “నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొ”నడం ద్వారా ఈ ఎంపిక చేసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 29:2; 30:19, 20) మీరు వివేకయుక్తంగా దైవిక బోధను లక్ష్యపెట్టండి, అప్పుడు దేవుని మహిమాన్వత నూతన లోకంలో తుది లేకుండా జీవితాన్ని అనుభవించగలరు.

మీరెలా జవాబిస్తారు?

◻ దయ్యాలు అంటే ఏవి, అవి ఏమి బోధిస్తాయి?

◻ నేడు దయ్యాలు తమ బోధలను ఎలా ప్రబోధిస్తుంటాయి?

◻ దయ్యాల బోధలను ఎదిరించడం ఎలా సాధ్యపడుతుంది?

◻ యెహోవా బోధను లక్ష్యపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

[16వ పేజీలోని చిత్రం]

జలప్రళయానికి ముందు, అవిధేయులైన దూతలూ వారి సంతానం హింసనూ నీచత్వాన్ని ప్రబోధించాయి

[18వ పేజీలోని చిత్రం]

యేసు మీ ప్రియమైన సంగీతాన్ని వింటే మీరు సిగ్గుపడతారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి