అబద్ధమాడనేరని దేవునిచే బలపర్చబడుట
మేరీ విల్లీస్ చెప్పినది
ప్రపంచ ఆర్థికమాంద్య ప్రభావం 1932 నాటికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాలకు చేరింది. ఆ సంవత్సరంలో, నేను 19 సంవత్సరాల వయస్సులో ఉండగానే, ఎల్లెన్ డేవిస్‌కు నాకు 1,00,000 చదరపు కిలోమీటర్లున్న ప్రాంతంలో ప్రకటించే పని అప్పగించబడింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ముఖ్య పట్టణమైన పెర్త్‌లోవున్న మా ఇంటినుండి దాదాపు 950 కిలోమీటర్లు ఈశాన్యంగా ఉన్న చిన్న పట్టణమైన విలూనె నుండి మేము ప్రారంభించాలి.
మేము అక్కడికి వెళుతుండగా మార్గమధ్యలో, నేను మరియు ఎల్లెన్ ఒక స్నేహపూరితుడైన రైల్వే గార్డుతోపాటు రైలులోని సరుకులగదిలో ఉండేవారిమి. ప్రతి స్టేషనులో రైలు ఆగినపుడల్లా, ఎంతసేపు ఆగుతుందో గార్డు మాకు దయతో చెప్పేవాడు. అది మాకు, రైలు దిగి అక్కడ నివసించేవారికి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని కలిగించేది. చివరికి, ఎక్కువగా గనుల్లో పని చేసేవాళ్లు నివసించే పట్టణమైన విలూనెలో సుడిగాలి వీస్తున్న సమయంలో మేము దిగాము.
విలూనె వద్ద రైల్వేస్టేషను పట్టణం నుండి దాదాపు రెండు మైళ్ల దూరంలో ఉంది. మేమిద్దరం ఏమంత బలమైన వారం కాదు, మాదగ్గర సాహిత్యమున్న మూడు బరువైన పెట్టెలు, రెండు సూట్‌కేసులు ఉన్నాయి. మేము ఏం చేయాలి? మేము ఒక పెట్టెను ఓ కర్రకు వ్రేలాడగట్టి, కర్ర రెండు చివరలను చెరొకవైపు పట్టుకున్నాము. అలా మేము పెట్టెలను ఒకదాని తర్వాత మరొకటి తీసుకెళ్లాము. మూడు పెట్టెలను, మా సూట్‌కేసులను పట్టణంలోకి రెండు మైళ్లు తీసుకెళ్లటానికి ఏడు సార్లు తిరుగవలసివచ్చింది. మా చేతులు నెప్పి పుట్టేవి కాబట్టి మధ్యలో మేము తరచూ అక్కడక్కడ ఆగేవాళ్లము.
దుమ్ము, కాయలు గాచిన చేతులు, అరిగిన కాళ్లతోపాటు మేము సాహసం, సవాలుతో కూడిన పనిని ఆనందించాము. ఈ గ్రామీణ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి పరీక్షతోకూడిన ప్రారంభాన్ని ఎదుర్కోవడంలో మమ్మల్ని బలపరుస్తూ యెహోవా మాతోనే ఉన్నట్లు మేమిద్దరం భావించాము. ఆ ప్రయాణంలో మా ప్రయాసల ఫలితంగా యౌవనుడైన బాబ్ హార్న్ సత్యాన్ని హత్తుకోవడంతో మా పనిపై ఆయన ఆశీర్వాదముండటాన్ని చూశాము. బాబ్ కొన్ని సంవత్సరాలు బేతేలు సేవలో గడిపి, 1982లో అతని మరణం వరకు దాదాపు 50 సంవత్సరాలు యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగినందుకు మేము సంతోషిస్తున్నాము.
మేము విలూనె నుండి తీరం వెంబడివున్న గెరాల్డ్‌టన్ పట్టణానికి 450 మైళ్లకంటే ఎక్కువైన మా ప్రయాణంలో ప్రకటించాము. అక్కడి నుండి మేము వెనక్కి పెర్త్‌కు వచ్చాము. కొన్ని రాత్రులు మేము బాహాటంగా ఉండే రైల్వే వెయిటింగ్ రూముల్లో నిద్రపోయాము, ఒకసారి రైలు పట్టాల ప్రక్కన గడ్డివాములో కూడా నిద్రపోయాము.
ఇంటివద్ద చేసిన గోదుమ బిస్కెట్లతో నిండిన దిండు కవరును మేము మాతో కూడా తెచ్చుకొన్నాము. మా ప్రయాణంలో సగభాగం వరకు ఇవే మా ముఖ్య ఆహారంగా ఉండేవి. బోర్డింగులు, మెస్సులలో గిన్నెలు కడగటం, నేల తుడవటం ద్వారా మేము మా ఆహారాన్ని సంపాదించుకొనేవాళ్లము. కొన్నిసార్లు వేడి ఎండలో రకరకాల కాయధాన్యాలను ఏరటానికి పనిచేసేవాళ్లం. ఆసక్తివున్నవారు బైబిలు సాహిత్యాన్ని తీసుకుని వారు ఇచ్చే చందా మా ఖర్చులకు సహాయకరంగా ఉండేది.
యెహోవా యందు విశ్వాసముంచి, ఆ రోజుల్లో ఎదురైన అనేక కష్టతరమైన పరిస్థితులను సంతోషంగా ఎదుర్కోటానికి మా అమ్మ నుండి పొందిన తొలి తర్ఫీదు, ఆమె మాదిరి నన్ను బలపర్చాయి.
ఓ క్రైస్తవ వారసత్వం
సృష్టికర్తయందు మా అమ్మకు ప్రగాఢ విశ్వాసం ఉండేది, నాకు గుర్తున్నంత వరకు ఆమె పిల్లలమైన మాతో ఆయన గురించి చెప్పేది. అయితే, పాఠశాల వద్ద ఒక దుఃఖకరమైన దుర్ఘటనలో ఏడేండ్ల మా అన్నయ్య చనిపోవడంతో ఆమె విశ్వాసం తీవ్రంగా పరీక్షించబడింది. దేవుని యెడల కోపం పెంచుకోవటానికి బదులు అమ్మ బైబిలును శ్రద్ధగా పఠించడం ప్రారంభించింది. ఆమె వీలైతే అలాంటి దుఃఖాలకు కారణం తెలుసుకోవాలనుకుంది. బైబిలు సత్యం కొరకు ఆమె చేసిన పరిశోధన ఫలించింది, ఆమె 1920వ పడి తొలికాలంలో నీటి బాప్తిస్మం ద్వారా నిజమైన దేవుడైన యెహోవాకు సమర్పించుకొంది.
అప్పటి నుండి ఆమె మాతో చేసే చర్చలలో దేవుని వాగ్దానాలు ఎంత కచ్చితంగా నెరవేరుతాయనే విషయాన్ని తరచూ నొక్కి చెప్పేది. ఏమి జరిగినప్పటికీ, ‘దేవుడు అబద్ధమాడనేరడని’ గుర్తుంచుకొమ్మని ఆమె మమ్మల్ని ఎప్పుడూ కోరేది. (తీతు 1:2) ఫలితంగా, నా చెల్లి, నేను, నా యిద్దరు అన్నలు, మా కుటుంబాలు, మనుమలతోసహా యెహోవా దేవున్ని స్తుతించేవారంగా ఉన్నాము. నా చెల్లి కుమారులు ఆలెన్, పాల్ ఇద్దరూ ప్రయాణ కాపరులుగా సేవచేస్తున్నారు.
ప్రకటించాలనే తొలి కోరిక
నాకు 13 సంవత్సరాలప్పుడు, నేను చదువులో అంత చురుకుగా ఉండేదాన్ని కాదు కాబట్టి 1926లో పాఠశాల కెళ్లటం మానేశాను. అయినా బైబిలు గురించి నేను ఏమి నేర్చుకొన్నానో అది ఇతరులతో పంచుకోవాలనే బలమైన కోరిక నేను పెంపొందించుకొన్నాను. ఎవరికైనా సహాయం చేయటానికి తగినంతగా నేను విద్యాభ్యాసం చేయలేదని నాన్న భావించాడు, కాని అమ్మ ఇలా చెప్పింది: “కేవలం రానైయున్న ఆర్మగెద్దోను యుద్ధం గురించి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని ఆమె చెప్పినా దేవుని రాజ్యాన్ని ప్రకటించినట్లే.” కాబట్టి నేను 1930 వరకు బాప్తిస్మం పొందనప్పటికీ నా తొలి యౌవనదశలోనే ఇంటింటి ప్రకటనపనిలో పాల్గొనటం ప్రారంభించాను. బాప్తిస్మం తీసుకున్న వెంటనే, పెర్త్ పరిసర ప్రాంతాల్లో పూర్తికాల సువార్త ప్రకటన పని ప్రారంభించాను.
ఆ తరువాతి సంవత్సరం, 1931లో, యెహోవాసాక్షులు అనే మా క్రొత్త పేరును వాడటం మొదలు పెట్టాము. అయినా, దేవుని ఈ పరిశుద్ధ నామాన్ని మేము ఉపయోగించటాన్ని గృహస్థులు అనేకమంది అభ్యంతరపెట్టి, కఠినంగా ప్రతిస్పందించారు. అసంతోషకరమైన వ్యతిరేకతలున్నప్పటికీ నేను పరిచర్యలో కొనసాగాను. తన సేవకులు ‘తాను అందజేసే సామర్థ్యంపై ఆధారపడవచ్చునని’ దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆయన అబద్ధమాడటంలేదని నేను దృఢంగా విశ్వసించాను.—1 పేతురు 4:11; ఫిలిప్పీయులు 4:13.
“గొప్ప సమూహాన్ని” గుర్తించుట
విస్తారమైన ఆస్ట్రేలియా ఖండానికి ఆవలివైపు నాకు 1935లో పని అప్పగించబడింది. అలా, అప్పటినుండి సంవత్సరాలుగా నేను పెర్త్‌లోని మా పాత ఇంటి నుండి దాదాపు 2,500 మైళ్ల దూరంలోవున్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని న్యూ ఇంగ్లాండ్ జిల్లా పరిసరాల్లో పయినీర్‌గా సేవచేశాను.
అప్పటివరకు నేను యేసు మరణ జ్ఞాపకార్థ సాంవత్సరికమందు పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసం చిహ్నాలలో భాగం వహించేదాన్ని. అది, ప్రాముఖ్యంగా ఆసక్తిగల పూర్తికాల పరిచారకులుగా ఉన్నవారు చేయదగిన పనే అని భావించబడినప్పటికీ, నాకు పరలోక నిరీక్షణ ఉందని నేను ఎన్నడూ భావించలేదు. తర్వాత, 1935లో, భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ గల గొప్ప సమూహము సమకూర్చబడుతున్నదని మాకు విశదపర్చబడింది. ఆ గొప్ప సమూహంలో భాగమై ఉన్నామని గ్రహించుకున్నందుకు మాలో అనేకులము ఆనందించాము, చిహ్నాలలో భాగం వహించడం మానేశాము. (యోహాను 10:16; ప్రకటన 7:9) యెహోవా వాగ్దానం చేసినట్లుగానే, బైబిలు సత్యం అంతకంతకూ క్రమంగా ప్రకాశించింది.—సామెతలు 4:18.
ప్రకటించటంలో క్రొత్త పద్ధతులు
మేము 1930వ పడి మధ్యకాలంలో, మా పరిచర్యలో గ్రామ్‌ఫోన్లను ఉపయోగించటం ప్రారంభించాము. అందుకని, బరువైన గ్రామ్‌ఫోన్లనే కాకుండా రికార్డులను, సాహిత్యాలున్న మా సంచీలను పెట్టుకోవటానికి మా బలిష్టమైన సైకిళ్లకు ముందు వెనుక కారియర్లు బిగించుకోవాల్సి వచ్చింది. నా సైకిలుపై బరువంతా ఉన్నప్పుడు నేను మరింత జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది, ఎందుకంటే ఒకవేళ అది పడిపోతే మళ్లీ దాన్ని ఎత్తటానికి చేతకానంత బరువు ఉండేది!
ఆ సమయంలోనే మేము సమాచార యాత్రలు అని పిలువబడే వాటిని కూడా మొదలుపెట్టాము. పట్టణంలోని ప్రముఖ వీధుల వెంబడి మేము వెళ్లేటప్పుడు, మేము దృష్టినాకర్షించే స్లోగన్లు వ్రాసివున్న ప్లేకార్డులను, శరీరం మీద, భుజముల నుండి ఆకర్షణీయమైన స్లోగన్లు ముద్రించబడిన పోస్టర్లను ధరించేవారము. ఇది విశ్వాసాన్ని పరీక్షించే కష్టభరితమైన పని అని నాకనిపించేది, ప్రాముఖ్యంగా, నేను నిర్భంధించబడి రాత్రంతా చిన్న గదిలో ఉంచబడినప్పుడు నేనలా భావించాను. మరునాడు ఉదయం కనీసం తల కూడా దువ్వుకోనివ్వకుండా కోర్టులోకి తీసుకువెళ్లినప్పుడు చాలా అవమానకరంగా ఉండేది. అయినా యెహోవా వాగ్దానం చేసినట్లే ఆయన మరలా ఒకసారి నన్ను ఘనపర్చాడు. నన్ను నిర్భందించిన కానిస్టేబుల్ వాదం కేవలం నా ప్లేకార్డు అతని మతానికి విరుద్ధంగా ఉందన్నదే కాబట్టి, కేసు కొట్టివేయబడింది.
మరలా పశ్చిమానికి
మరలా 1940వ పడి తొలికాలంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా నందలి గ్రామీణ ప్రాంతాల్లోనే నాకు పని అప్పగించబడింది. అక్కడ నేను గుర్తుంచుకోదగిన అనుభవాలను, ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుతూనే ఉన్నాను. నార్‌తామ్‌లో నాకు అప్పగించబడిన పనిలో ఉన్నప్పుడు, పట్టణం నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో నేను ఒక పనిరద్దీగల గృహిణి అయిన ఫ్లో టిమిన్స్‌ను కలిశాను. ఆమె రికన్సిలియేషన్ అనే పుస్తకాన్ని తీసుకుంది, త్వరలోనే ఆమె యెహోవా దేవుని సమర్పిత సాక్షి అయ్యింది. ఆమె ఇప్పటికీ రాజ్య సేవలో చురుకుగా ఉంది, అప్పుడు నాలుగు సంవత్సరాలున్న ఆమె కుమార్తె ఇప్పుడు పెరిగి పెద్దదై, ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్నది.
ఇంకా మరిచిపోలేని ఇతర అనుభవాలు కూడా ఉన్నాయి. ఒకసారి, నేను నా భాగస్వామి గుర్రపు బగ్గీలో నార్‌తామ్ నందలి వంతెన దాటుతుండగా, దానికి చాలా క్రింద సుడులు తిరిగే ఏవాన్ నదినీటిలో పడిపోతామేమో అనిపించేలా హఠాత్తుగా గుఱ్ఱం చాలా వేగంగా పరుగెట్టడం మొదలు పెట్టింది. దాదాపు ఒక మైలు కంటే ఎక్కువ దూరం వెళ్లిన తర్వాత గుర్రం నెమ్మదించింది.
వివాహము, కుటుంబము
అనేక సంవత్సరాలుగా పయినీరు సేవచేసిన ఆర్థర్ విల్లీస్‌ను 1950లో నేను వివాహం చేసుకున్నాను. మేము వెస్ట్ ఆస్ట్రేలియా దేశంలోని పిన్‌జెల్లి నగరంలో స్థిరపడ్డాము, అక్కడే మాకు కుమారుడు బెంట్లే, కుమార్తె యూనీస్ జన్మించారు. పిల్లలు పాఠశాల విద్య ముగిస్తుండగా ఆర్థర్ మళ్లీ పయినీర్ సేవ ప్రారంభించటానికి నిర్ణయించుకొన్నాడు. వారు అర్హులైన వెంటనే క్రమ పయినీరు సేవ ప్రారంభించటానికి వారి తండ్రి మంచి మాదిరి వారిద్దరినీ ప్రోత్సహించింది.
ఆర్థర్ తరచూ పిల్లలను ప్రకటించటానికి దూరంగా గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. ఒక్కోసారి, వారితోపాటు ఆయన ఇంటినుండి దూరంగా వారం, లేదా అంతకంటే ఎక్కువ రోజులు రాత్రి బయట గడుపుతూ ఉండిపోయేవాడు. ఆయన అలా వెళ్లినప్పుడు నేను ఇంటివద్ద ఉండి, వారు ముగ్గురూ పయినీర్ సేవ చేయగలిగేలా నేను మా కుటుంబ ఫర్నిచర్ వ్యాపారాన్ని చూసుకునేదాన్ని.
ఆదివాసుల మధ్య పరిచర్య
ఒకరోజు ఉదయం తమ గ్రామీణ ప్రయాణం నుండి కుటుంబం తిరిగివచ్చిన తర్వాత కొద్దిసేపటికి, మేము ఎదురు చూడని ఒక వ్యక్తి వచ్చాడు ఆ వచ్చిన వ్యక్తి ఆదివాసి, అతనిలా అడిగాడు: “నేను తిరిగి రావటానికి ఏమి చేయాలి?” మొదట మేము కలవరపడ్డాము. ఆ వ్యక్తి త్రాగుబోతుతనాన్ని బట్టి క్రైస్తవ సంఘం నుండి అనేక సంవత్సరాల క్రితం బహిష్కరించబడినవాడని ఆర్థర్ అతన్ని గుర్తించాడు. అతడు అప్పటి నుండి బాగా త్రాగటం, ఎక్కువగా అప్పులు చేయటం వంటివాటికి పేరుపొందాడు.
పరిశుభ్రమైన యెహోవా సంస్థలోకి తిరిగి రావాలంటే అతడేమి చేయవలసిన అవసరం ఉందో ఆర్థర్ అతనికి వివరించాడు. అతడు ఎక్కువేమి చెప్పకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు, మేము అతడేమి చేస్తాడా అనుకున్నాము. తరువాతి కొన్ని నెలల్లో మేమెవ్వరం ఊహించనిది జరిగింది. ఆ వ్యక్తి చేసుకున్న మార్పులు దాదాపు నమ్మశక్యం కానివి! ఆయన తన త్రాగుడు సమస్యను అధిగమించడమే కాదు, గ్రామంలో ఉన్నవారిని దర్శించి, వారికి తన అప్పుల గురించి గుర్తుచేసి, తాను అప్పువున్నది వారికి తీర్చేశాడు! నేడు ఆయన మరలా క్రైస్తవ సహోదరుడుగా ఉన్నాడు, ఆయన కొంతకాలం పయినీరుగా సేవచేశాడు.
పిన్‌జెల్లిలో అనేకమంది ఆదివాసులున్నారు, దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకుని, అంగీకరించటానికి ఈ దీనులైన ప్రజలకు సహాయం చేస్తూ, మేము అత్యంత సంతృప్తికరమైన పరిచర్యను ఆనందించాము. సత్యాన్ని నేర్చుకోవడంలో అనేకమంది ఆస్ట్రేలియా ఆదివాసులకు సహాయం చేయడంలో భాగం వహించగల్గటం విశ్వాసాన్ని ఎంతో దృఢపర్చేదిగా ఉండేది!
పిన్‌జెల్లిలో ఒక సంఘం ప్రారంభించబడింది, మొదట్లో, దాని సభ్యులు అనేకులు ఆదివాసులే. వారిలో చాలామందికి మేము చదవటం వ్రాయటం నేర్పాల్సి వచ్చింది. ఆ తొలి సంవత్సరాల్లో వారి యెడల చాలా పక్షపాత వైఖరి ఉండేది, కాని వారి పరిశుభ్రమైన జీవన విధానాన్నిబట్టి, నమ్మదగిన పౌరులుగా ఉండటాన్నిబట్టి క్రమంగా పట్టణవాసులు ఆదివాసులను గౌరవించటం ప్రారంభించారు.
యెహోవా యొక్క విఫలం కాని సహాయం
దేవున్ని 57 సంవత్సరాలు నమ్మకంగా సేవించిన నా ప్రియమైన భర్త ఆర్థర్, 1986లో మరణించాడు. పిన్‌జెల్లి నందలి వ్యాపారస్తులందరి చేత, జిల్లా ప్రజల చేత ఆయన ఎంతో గౌరవించబడ్డాడు. ఈ హఠాత్ నష్టాన్ని భరించే శక్తినివ్వడం ద్వారా యెహోవా మరలా ఒకసారి నన్ను బలపర్చాడు.
నా కుమారుడు బెంట్లే, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పెద్దగా సేవచేస్తున్నాడు, అక్కడే అతడు, అతని భార్య లోనా తమ కుటుంబాన్ని సత్యమందు పెంచారు. నేటివరకు పూర్తికాల సేవలోవున్న నా కుమార్తె యూనీస్ నా గొప్ప సంతోషానికి మరో కారణము. ఆమె, ఆమె భర్త జెఫ్ పయినీర్లుగా సేవచేస్తున్నారు. నేనిప్పుడు వారితో కలిసి నివసిస్తున్నాను, నేను క్రమంగా సహాయ పయినీర్ సేవ చేయగలిగేలా ఆశీర్వదింపబడ్డాను.
దాదాపు 60 సంవత్సరాలకుపైగా, తన సేవకులను బలపర్చి, వారు ఏ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినా ఎదుర్కోవటానికి వారికి సహాయం చేస్తానన్న యెహోవా ప్రేమపూర్వక వాగ్దాన నెరవేర్పును నేను అనుభవించాను. మనమాయనను ఎప్పుడూ అనుమానించకపోతే లేక ఆయన మనకు చేసిన వాటికి కృతజ్ఞత చూపించటానికి విఫలం కాకపోతే ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుని బాహుబలం నాకు తోడుగా ఉందని భావించినప్పుడు నా విశ్వాసం బలపర్చబడింది, మనం కనీసం గ్రహించను కూడా గ్రహించలేనంతటి దీవెనలు ఆయనెలా ఇస్తాడో నేను చూశాను. (మలాకీ 3:10) నిజంగా దేవుడు అబద్ధమాడనేరడు!
[27వ పేజీలోని చిత్రం]
మేరి 1933లో
[29వ పేజీలోని చిత్రం]
మేరి మరియు ఆర్థర్ తరువాతి సంవత్సరాల్లో