రాజ్య ప్రచారకుల నివేదిక
ఆయన బైబిలు తర్ఫీదునొందిన తన మనస్సాక్షి ననుసరించాడు
“నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము” అని చెప్పినప్పుడు, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు యెహోవా సహాయం కొరకు ప్రార్థించాడు. (కీర్తన 26:11) తన యథార్థతను కాపాడుకున్నందుకు దేవుడు ఆయన యందు కనికరం చూపించాడు. యేసు తన పరలోక తండ్రి చిత్తం చేశాడు గనుక యెహోవా ఆయనను కూడా ఆశీర్వదించాడు, బైబిలు తర్ఫీదు నొందిన తన మనస్సాక్షి ననుసరించి దేవుని చిత్తాన్ని చేయటానికి నిర్ణయించుకున్నందుకు కొలంబియాలోని ఒక యౌవనస్థున్ని ఆయన ఆశీర్వదించాడు. ఈ యౌవనుడు ఇలా చెబుతున్నాడు:
“యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేయటం ప్రారంభించినప్పుడు, నేను ఒక కాథలిక్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నాను. అయినా, నేను మాస్కు హాజరైనప్పుడు నా మనస్సాక్షి అంగీకరించేది కాదు, కాబట్టి నేను స్కూల్ ప్రిన్సిపాల్ (ప్రీస్టు కూడా) దగ్గరకు, అనగా విద్యార్థులకు విద్యాసంబంధ విషయాల్లో సలహా ఇచ్చే వ్యక్తి యొద్దకు, నా గుంపు నాయకుని యొద్దకు వెళ్లి మాస్కు హాజరుకాకుండా ఉండటానికి అనుమతివ్వమని అడిగాను. నాకు అనుమతివ్వబడినప్పటికీ కొందరు నన్ను హాజరుకమ్మని బలవంతం చేయాలని చూశారు. యెహోవాసాక్షుల్లో ఒకరిగా నేను బాప్తిస్మం తీసుకొన్న తర్వాత వత్తిడి ఎక్కువైంది. నేను స్కూల్ నుండి తీసివేయబడితే ఇంటి నుండి దూరంగా పంపిస్తానని మా నాన్న నన్ను బెదిరించాడు. నేను విశ్వవిద్యాలయ విద్యనభ్యసించాలని, మంచి ఉద్యోగంలో ఉండాలని ఆయన ఉద్దేశం.
“కాథలిక్ బాధ్యతలను ఆచరించటం విడిచిపెట్టవద్దని ప్రిన్సిపాల్ పదే పదే హెచ్చరిస్తున్నాడు. సంవత్సరంలోని మొదటి మాస్ ఆచరించవలసిన సమయం వచ్చినప్పుడు, అది అయిపోయే వరకు నేను దాక్కున్నాను. స్కూల్ అండ్ జెహోవాస్ విట్నెసస్ అనే బ్రోషూర్ను నేను ఉపాధ్యాయునికి (ప్రీస్టుకు) ఇచ్చి, యెహోవాసాక్షుల్లో ఒకరిగా నేను మాస్కు హాజరు కాలేనని ఆయనకు చెప్పాను. ఆయనిలా అన్నాడు: ‘నీవు వేరే స్కూల్లో చేరటానికి ప్రయత్నించటం మంచిది.’ స్కూల్లో నుండి తీసివేయబడితే మా నాన్న ఇంట్లో నుండి కూడా వెళ్లగొడతాడని నాకు తెలుసు. అయినా, నేను యెహోవాకు ప్రార్థన చేసి నాతోటి విద్యార్థులకు సాక్ష్యమివ్వటంలో కొనసాగాను.
“సెలవు సమయం వచ్చింది. సెలవులైపోయాక, మళ్లీ స్కూల్లో మాస్ ఆచరించవలసిన సమయం వచ్చింది. ప్రార్థనాలయం యెదుట ప్రిన్సిపాల్, మరితర ప్రీస్టులు తప్పు ఒప్పుకోవటాన్ని వినటానికి సిద్ధంగా కూర్చున్నారు. నేను చాలా భయపడుతున్నాను. నేను వెళ్లి కూర్చున్నాను కాని, నా మనస్సాక్షి నన్ను బాధిస్తూనే ఉంది. పాడటం మొదలైనప్పుడు, నేనిలా తలంచుకున్నాను, ‘నేనిక్కడేం చేస్తున్నాను? యెహోవా నా దేవుడు. నేను పిరికివాడనై ఆయనను మోసపర్చలేను. ఆయనను నేను తక్కువ చేయలేను. ఆయన నన్ను విడిచిపెట్టడు.’ ధైర్యం కొరకు ప్రార్థించాను. తర్వాత, ప్రార్థనాలయంలో నుండి వెలుపలికి వచ్చి, తప్పు ఒప్పుకొనేవారి వరుసలో నిలబడ్డాను. నేను ప్రిన్సిపాల్ వద్దకు వచ్చినప్పుడు నేనిలా చెప్పాను: ‘టీచర్, నేను తప్పు ఒప్పుకోవటానికి రావడం లేదు’ ఆయన ‘నేనదే ఊహించాను’ అన్నాడు. రాబోయే పరిణామాలను ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాని మాస్లో పాల్గొనటానికి నా మనస్సాక్షి అంగీకరించటం లేదు. బైబిలు నుండి నేర్చుకున్న వాటికి వ్యతిరేకంగా నేను వెళ్లలేను అని ఆయనతో చెప్పాను.
“ఆయన నా వైపు చూచి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: ‘నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. సాక్షులైన మీరందరూ మెచ్చుకొనదగినవారే. మీకు దేవుడే మొదట, ఏమి జరిగినప్పటికీ మీరు ఆయన ఆజ్ఞలు పాటించటానికి సిద్ధంగా ఉంటారు. ఇలాగే కొనసాగు. నీవు చక్కగా ప్రవర్తిస్తున్నావు. దేవుని యెడల అలాంటి ఆసక్తిని, అలాంటి ప్రేమను చూపిస్తూ కాథలిక్లు కూడా మీలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి నుండి, నీవు మా మతసంబంధ సేవలలో పాల్గొన నవసరం లేకుండా మినహాయించబడుతున్నావు.’ నేనెంత సంతోషించాను! బైబిలు తర్ఫీదు పొందిన నా మనస్సాక్షిని అనుసరించటానికి తీర్మానించుకొన్నందుకు యెహోవా నన్ను ఆశీర్వదించాడు.
“మరునాడు ప్రిన్సిపాల్ విద్యార్థులకిలా చెప్పాడు: ‘వేరే మతాలు మనకంటే ముందున్నాయి. వారిలా మనమెందుకు ఆసక్తిగా, దేవుని యెడల లోతైన ప్రేమ కలిగి, అందరికంటే ఉన్నతంగా ఆయనను సేవించాలనే కోరిక కలిగి లేము? ఇది మన హృదయాల్లో ఉండవలసినది.’
“చివరికి ఆ ప్రిన్సిపాల్ రోముకు బదిలీ చేయబడ్డాడు, క్రొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ నేను పాల్గొనక పోవటాన్ని పట్టించుకోలేదు. పట్టభద్రుణ్ణయిన తర్వాత నా గమ్యమైన పూర్తికాల పరిచర్యను ప్రారంభించటానికి నాకు అనుకూలత కలుగజేస్తూ మా నాన్న ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు.”
బైబిలు తర్ఫీదు నొందిన తన మనస్సాక్షిని అనుసరించినందుకు యెహోవా ఈ యౌవనస్థున్ని ఆశీర్వదించాడు. ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడేవారందరిని ఆయన అలాగే ఆశీర్వదిస్తాడు.—సామెతలు 3:5, 6.