ఒంటరిదాన్నే అయినా ఎన్నడూ విడువబడలేదు
ఎడా లూయిస్ చెప్పినది
నేను ఎల్లప్పుడు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడ్డాను. నేను చేసే ప్రతిపనిలోనూ కచ్చితమైన అభిప్రాయాన్ని కల్గివుండేదాన్ని—ఇతరులు కొన్నిసార్లు దాన్ని మొండితనం అని అనేవారు. నిర్మొహమాటంగా మాట్లాడడం ఎంత సులభమో నాకు తెలుసు, మరి ఈ లక్షణం నా జీవితమంతటిలోనూ నాకు సమస్యలను తెచ్చిపెట్టింది.
అయితే, నా వ్యక్తిత్వ లోపాలవల్ల యెహోవా దేవుడు నన్ను తృణీకరించనందుకు నేను కృతజ్ఞురాలిని. ఆయన వాక్యాన్ని పఠించడం ద్వారా, నా వ్యక్తిత్వాన్ని నేను సరిచేసుకోగలిగాను, తద్వారా సుమారు 60 సంవత్సరాల పాటు ఆయన రాజ్యాసక్తులకు తోడ్పడ్డాను. చిన్నతనంనుండి కూడా నాకు గుర్రాలంటే ఇష్టం మరి నాకున్న కాస్త మంకుపట్టును అదుపులో పెట్టుకోవడంలో దేవుని సహాయం, ఓ గుర్రాన్ని అదుపులోపెట్టేందుకు కళ్లాన్ని ఎలా ఉపయోగించవచ్చో నాకు తరచూ జ్ఞాపకం చేసేది.
దక్షిణా ఆస్ట్రేలియానందు 1908లో, గాంబియర్ పర్వతం వద్దనున్న అందమైన నీలి చెరువు దగ్గిర నేను పుట్టాను. మా తలిదండ్రులకు ఓ పాలసరఫరా కేంద్రం ఉండేది, మరి ఎనిమిది పిల్లల్లో నేను పెద్ద కుమార్తెను. మేమందరమూ చాలా చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. కుటుంబ ఆదాయం కొరకు మా ఇద్దరు అన్నలూ ఇంటినుండి దూరంగా వెళ్లి పనిచేయవల్సివచ్చింది కనుక, ఆ పాలసరఫరా కేంద్రాన్ని చూసుకోవల్సిన బాధ్యతను నేనే వహించాల్సి వచ్చింది. ఆ కేంద్రంలో పని చాలా ఎక్కువగా ఉండేది, ఎంతో కష్టపడాల్సివచ్చేది.
బైబిలు సత్యంతో మొదటి పరిచయం
మా కుటుంబం ప్రెస్బిటేరియన్ చర్చికి హాజరయ్యేది, మరి మేము క్రమంగా వెళ్లి, చురుకుగా పాల్గొనేవాళ్లం. నేను సన్‌డే స్కూల్ టీచర్‌నయ్యాను మరి ఆత్మీయంగానూ నైతికంగానూ సరైనదని నేను విశ్వసించిన బాధ్యతను నేను గంభీరంగా తీసుకున్నాను.
మా తాత 1931లో మరణించారు, ఆయన సంపదలో ఆ నాటి వాచ్‌టవర్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ వ్రాసిన పుస్తకాలెన్నో ఉండేవి. దేవుని బూర (ఆంగ్లం) మరియు సృష్టి (ఆంగ్లం) పుస్తకాలను నేను చదవడం ప్రారంభించాను, నేను విశ్వసించి పిల్లలకు బోధిస్తున్న అనేక విషయాలకు బైబిలు మద్దతునివ్వడంలేదని నేను తెలుసుకున్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను.
మానవుని ఆత్మ అమర్త్యమైనది కాదని, మరణించిన అనేకమంది ప్రజలు పరలోకానికి వెళ్లరని మరియు నరకాగ్నిలో దుష్టులకు నిత్య బాధ ఉండదని తెలుసుకున్నప్పుడు నేను అదిరిపోయాను. ప్రతివారం ఆదివారం సబ్బాతును ఆచరించడం క్రైస్తవునికి అవసరంలేదని నేను కనుగొన్నప్పుడు కూడా నేను కలతచెందాను. కనుక, నేను ఒక గంభీరమైన తీర్మానాన్ని ఎదుర్కొనవల్సివచ్చింది: క్రైస్తవమత సామ్రాజ్యపు పారంపర్య బోధలకు హత్తుకుని ఉండాలా లేక బైబిలు సత్యాలను బోధించడం ప్రారంభించాలా. ప్రెస్బిటేరియన్ చర్చితో నేను నా సంబంధాలన్నింటిని తెంచుకోవాలని నిర్ణయించుకునేందుకు నాకు ఎక్కువ కాలం పట్టలేదు.
ఇప్పుడు నిజంగా ఒంటరిదాన్ని
నేను చర్చిని విడిచిపెడుతున్నానని మరి సన్‌డే స్కూల్లో ఇక ముందు బోధించననే నా తీర్మానాన్ని నేను ప్రకటించినప్పుడు, మా కుటుంబం, స్నేహితులు మరియు మా చర్చిలోని మునుపటి పరిచయస్థులు అసంతృప్తిచెందారు. మరి జడ్జి రూథర్‌ఫోర్డ్ ప్రజలు అని పిలువబడే వారితో నేను సహవసిస్తున్నట్లుగా వారు కనుగొనడం ఆ మండుతున్న వ్యర్థమైన మాటలకు మరికాస్త నూనెను పోసింది. నేను పూర్తిగా సహవసించడం మాననప్పటికీ, మా కుటుంబం మరియు మునుపటి నా స్నేహితులు నాతో ముందున్నంత స్నేహంగా లేరని వేరే చెప్పనవసరం లేదు.
నేను చదివే పుస్తకాల్లో ఇవ్వబడిన లేఖనాలను నేను ఎంత ఎక్కువగా పఠించి పరిశీలించానో అంత ఎక్కువగా బహిరంగంగా ప్రకటించే పని యొక్క అవసరతను నేను గమనించడం ప్రారంభించాను. యెహోవాసాక్షులు వారి బహిరంగ పరిచర్యలో భాగంగా ఇంటింటికి వెళుతుంటారని నేను తెలుసుకున్నాను. అయితే ఆ సమయంలో మా జిల్లాలో ఏ సాక్షులూ లేరు. కనుక, దేవుని రాజ్య సువార్తను ప్రకటించేందుకు ఎవరూ నన్ను ప్రోత్సహించలేదు లేక ఎలా చేయాలో నాకు చూపించలేదు. (మత్తయి 24:14) నేను ఎంతో ఒంటిరిదాన్నని భావించాను.
అయినప్పటికీ, ఇతరులకు బైబిలును ప్రకటించమని ఇచ్చిన ఆజ్ఞ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది, కనుక ఎలాగైనా సరే నేను తప్పక ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఎంతో ప్రార్థించిన తర్వాత, నా పఠనాల ద్వారా నేను నేర్చుకున్న విషయాలను చెప్పేందుకు అంతేకాకుండ ఈ విషయాలను వారి స్వంత బైబిళ్లనుండే చూపే ప్రయత్నం చేసేందుకు మా పొరుగువారి ఇళ్లకు వెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. నేను వెళ్లిన మొట్ట మొదటి ఇల్లు నా మునుపటి సన్‌డే స్కూల్ అధికారిది. నిరాశావహమైన అతని ప్రతిస్పందన, నేను చర్చిని విడిచిపెట్టడడం విషయంలో ఆయన ప్రతికూల వ్యాఖ్యానాలు నిశ్చయంగా ప్రోత్సాహకరమైన ప్రారంభం కాదు. అయితే ఆ ఇంటిని విడిచి ఇతర ఇళ్లకు నేను వెళుతుండగా నాలో ఏదో వెచ్చని దీప్తి, ఓ వింతైన అంతర్శక్తి ఉన్నట్లు నేను భావించాను.
వాస్తవానికి నాకు పూర్తి వ్యతిరేకతే లేదు, కానీ మునుపటి నా చర్చి సహవాసులను నేను కలిసి వారితో మాట్లాడినప్పుడు వారందరూ కనపర్చిన నిర్లక్ష్యానికి నేను ఆశ్చర్యపోయాను. “తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగించబడుదురు; . . . నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు” అని యేసు చెప్పిన మాటలను నాకు జ్ఞాపకం చేస్తు నాకు ఆశ్చర్యాన్ని నిరాశను కల్గించే రీతిగా నేను మా పెద్దన్న నుండి ఎంతో వ్యతిరేకతను అనుభవించాను.—లూకా 21:16, 17.
నేను చిన్నతనంలోనే అనుభవజ్ఞురాలినైన గుర్రపు రౌతునైయ్యాను, కనుక అతి త్వరగా ప్రజల ఇళ్లను చేరడానికి గుర్రం మీద వెళ్లడమేనని నేను నిర్ణయించుకున్నాను. అది నేను సమీపంలో ఉన్న గ్రామ ప్రాంతంలోని దూర ప్రదేశాలకు వెళ్లేందుకు నాకు సహాయపడింది. అయితే, ఒక మధ్యాహ్నం నా గుర్రం బురద రోడ్డుమీద జారిపడింది, దాంతో నా కపాలం దారుణంగా పగిలింది. కొంతకాలంవరకు, నేను బ్రతకనేమోననే భయం ఉండేది. అలా పడిన తర్వాత, రోడ్డులు బురదగా ఉంటే నేను గుర్రంమీద కాకుండ గుర్రపుబండిమీద (సల్కీ) ప్రయాణించేదాన్ని.a
సంస్థతో సంబంధం
నాకు ప్రమాదం సంభవించిన తర్వాత, ఇప్పుడు పయినీర్లు అని పిలువబడుతున్న పూర్తికాల ప్రచారకుల గుంపు మౌన్‌ట్ గాంబియర్ జిల్లాను సందర్శించారు. అలా మొట్టమొదటి సారిగా, నేను నా తోటి విశ్వాసులతో ముఖాముఖీగా మాట్లాడగలిగాను. వెళ్లేముందు, వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి వ్రాసి, మరింత క్రమమైన పద్ధతిలో బహిరంగ ప్రకటనా పనిని నేను ఎలా చేయగలనో అడిగి తెలుసుకోమని నన్ను ప్రోత్సహించారు.
సొసైటీకి వ్రాసిన తర్వాత, ఇళ్లవద్ద నన్ను నేను పరిచయం చేసుకునేందుకు ముద్రించబడిన సాక్ష్యపు కార్డులను, పుస్తకాలనూ చిన్న పుస్తకాలనూ నేను పొందాను. బ్రాంచి కార్యాలయంతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంబంధం కల్గివున్నందువల్ల నేను నా ఆత్మీయ సహోదర సహోదరీలతో కాస్త సన్నిహితంగా ఉన్నట్లుగా భావించాను. అయితే పయినీరు గుంపు ఆ ప్రదేశాన్ని విడిచి మరో పట్టణానికి వెళ్లినప్పుడు, నేను అంతకుముందుకంటే మరీ ఒంటరిదాన్నయ్యానని భావించాను.
ముఖ్యంగా గుర్రపుబండిద్వారా నేను ప్రయాణించేదాన్ని కనుక ప్రతి దినం నా సాక్ష్యపు పనివల్ల, ఆ జిల్లాలో నేను అందరికీ బాగా పరిచయస్థురాలినైపోయాను. అదే సమయంలో, నా ఇంటి పనులకుకూడా నేను శ్రద్ధనివ్వగలిగాను. అప్పటికల్లా మా కుటుంబం ఈ దినచర్యను వ్యతిరేకించడం మాని, అందులో జోక్యం కలుగజేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలనూ చేయలేదు. ఇలా నాలుగు సంవత్సరాలవరకూ నేను బాప్తిస్మం పొందని సువార్త ప్రచారకురాలిగా పనిచేశాను.
సమావేశము, చివరికి బాప్తిస్మము
ఏప్రిల్ 1938 నందు సహోదరుడైన రూథర్‌ఫోర్డ్ ఆస్ట్రేలియాను సందర్శించాడు. మత నాయకుల తీవ్ర వ్యతిరేకతవల్ల సిడ్నీ టౌన్ హాలుతో చేసుకున్న ఒప్పందం రద్దయిపోయింది. అయితే, చివరి నిమిషంలో క్రీడా మైదానాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి లభించింది. పథకాల్లో ఇలా బలవంతంగా వచ్చిన మార్పులు నిజంగా ప్రయోజనకరమయ్యాయి, ఎందుకంటే విశాలమైన ఆ క్రీడామైదానంలో ఇంకా వేలమంది కూర్చోగలిగారు. సుమారు 12,000 మంది వచ్చారు, వారిలో అనేకులు మా కూటం ఎడల మతనాయకుల ప్రేరేపిత వ్యతిరేకత వల్ల ఆసక్తిగల్గి వచ్చారని స్పష్టమైంది.
సహోదరుడైన రూథర్‌ఫోర్డ్ సందర్శన సందర్భంగా, సమీపంలోని సిడ్నీ పరిసర ప్రాంతాల్లో అనేక దినాల సమావేశం జరిగించబడింది. అక్కడే నేను చివరికి యెహోవాకు నా సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా కనపర్చాను. విశాలమైన ఆస్ట్రేలియా ఖండంనుండి అక్కడ చేరిన వందలమంది సహోదర సహోదరీలను కలిసినప్పుడు నేను పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరా?
గాంబియర్ పర్వతానికి తిరిగి రావడం
నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చాలా ఒంటరిగా భావించాను, కానీ రాజ్య సేవలో నాకు వీలున్నంతమట్టుకు నేను చేయగలదాన్నంతటినీ చేయాలని తీర్మానించుకున్నాను. కొంతకాలానికి నేను ఆగ్నూ కుటుంబంతో—హ్యూ, ఆయన భార్య వారి నలుగురు పిల్లలతో నేను బాగా పరిచయం పెంచుకున్నాను. వారు గాంబియర్ పర్వతంనుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోని మిలెసంట్ పట్టణంలో నివసించేవారు, మరి నేను ప్రతిసారి 50 కిలోమీటర్లు గుర్రపుబండిమీద వెళ్లివస్తూ, క్రమంగా బైబిలు పఠనాన్ని నిర్వహించేదాన్ని. వారు సత్యాన్ని అంగీకరించినప్పుడు నా ఒంటరితనం పోయింది.
కొద్ది కాలంలోనే, మేము ఒక సంస్థీకరించబడిన సాక్ష్యపు గుంపుగా ఏర్పర్చబడ్డాము. తర్వాత, సంతోషకరంగా, మా అమ్మగారు కాస్త ఆసక్తి కనబరుస్తూ, రానుపోను 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి క్రొత్తగా ఏర్పాటైన గుంపుతో పఠనం చేసేందుకు నాతో వచ్చింది. అప్పటినుండి, అమ్మ బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యమైనప్పటికీ ఎల్లప్పుడు ప్రోత్సాహకరంగానూ సహాయకరంగానూ ఉండేది. ఇక నాకు ఇప్పుడు ఏ ఒంటరితనమూలేదు.
మా చిన్న గుంపులో నుండి నలుగురు పయినీర్లు వచ్చారు. వారరెవరంటే, ముగ్గురు ఆగ్నూ పిల్లలైన క్రిస్టల్, ఎస్టెలి, బెట్టి మరియు నేను. తర్వాత, 1950వ పడిలో ఆ ముగ్గురు అమ్మాయిలూ వాచ్‌టవర్ గిలియడ్ బైబిలు పాఠశాలకు హాజరయ్యారు. వారు ఇండియాకు శ్రీలంకకూ మిషనరీలుగా నియమించబడ్డారు, అక్కడ ఎస్టెలి తీవ్రమైన ఆరోగ్య సమస్యలవల్ల ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేంతవరకు అంటే ఇటీవలదాకా వారు ఇంకా అక్కడే సేవచేశారు.
జనవరి 1941 నందు యెహోవాసాక్షుల పని ఆస్ట్రేలియానందు నిషేధించబడింది. కనుక మేము త్వరగా రంగంలోకి దిగాము. పరిచర్యలో ఉపయోగించే ప్రతిదానిని మేము పెట్టుకున్నాము—సాహిత్యాలను, ప్రయాణాల్లో తీసుకువెళ్లగల ఫోనోగ్రాఫులు, రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాలు ఇంకా ఇతరములను—ఓ పెద్ద పెట్టెలో పెట్టుకున్నాము. తర్వాత మేము ఆ పెట్టెను ఓ షెడ్‌లో పెట్టి, దాన్ని కప్పెట్టేందుకు కొన్ని బండ్ల గడ్డిని తెచ్చాము.
నిషేధమున్నప్పటికీ, మేము మా ఇంటింటి పరిచర్యను కొనసాగించాము, కాని ఇంటివారితో మాట్లాడేటప్పుడు కేవలం బైబిలును మాత్రమే ఉపయోగిస్తూ జాగ్రత్త వహించాము. నేను నా పత్రికలనూ చిన్న పుస్తకాలనూ నా గుర్రపు జీనులో దాచేదాన్ని, రాజ్య వర్తమానం విషయంలో నిజంగా ఆసక్తి కనిపించినప్పుడు మాత్రమే వాటిని తీసేదాన్ని. చివరికి, జూన్ 1943లో, నిషేధం ఎత్తివేయబడింది, మరోసారి మేము సాహిత్యాలను స్వేచ్ఛగా అందించగలిగాము.
క్రొత్త నియామకాలు
నేను 1943 నందు పయినీరునయ్యాను, తర్వాతి సంవత్సరం మరో నియామకంతో నేను మౌన్‌ట్ గాంబియర్‌ను విడిచాను. మొదట, నేను స్ట్రాత్‌ఫీల్డ్‌లోని సొసైటీ బ్రాంచి కార్యాలయంలో కొంతకాలం సేవచేసేందుకు ఆహ్వానించబడ్డాను. దీని తర్వాత వెంటనే, న్యూ సౌత్ వేల్ మరియు పశ్చిమ విక్టోరియానందలి చిన్న పట్టణాల్లో పనిచేయాలనే నియామకాలను పొందాను. అయితే, నాకు అతి ప్రతిఫలదాయకమైన నియామకాల్లో ఒకటి మెల్‌బోర్న్ పట్టణంలోని పెద్ద సంఘంతో పనిచేసేటప్పుడు వచ్చింది. ఒక చిన్న గ్రామ ప్రదేశం నుండి వచ్చిన నేను అక్కడ పనిచేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నాను.
విక్టోరియా జిల్లాలోని జిప్ల్సాండ్ ప్రాంతంలో నేను చేయవల్సిన సేవలో, నా పయినీరు సహచారిని హెలెన్ క్రోపర్డ్, నేను కలిసి ఎన్నో బైబిలు పఠనాలను నిర్వహించేవాళ్లం, మరి కొంతకాలానికి, అక్కడ ఓ సంఘం ప్రారంభమవ్వడం చూశాము. ఆ జిల్లాకు పెద్ద పట్టణ ప్రాంతం ఉండేది, మరి ప్రయాణించేందుకు, పాతదైన మరియు ఏ క్షణాన పాడవుతుందో తెలియని ఓ వాహనం మాకుండేది. కొన్నిసార్లు మేము దానిలో ప్రయాణించేవాళ్లం కానీ అనేక మార్లు మేము దాన్ని నెట్టుకుంటూ వెళ్లేవాళ్లం. ఒక గుర్రం కావాలని నేను ఎంతగా కోరుకున్నానో నేను చెప్పలేను! కొన్నిసార్లు, “ఒక గుర్రమిస్తానంటే (రాజ్యం తప్ప) ఏదైనా ఇచ్చేందుకు నేను సిద్ధమే!” అని నేను నిజంగానే చెప్పగలిగేదాన్ని. నేడు ఆ జిల్లాలోని అనేక పట్టణాల్లో, పటిష్టమైన సంఘాలూ చక్కని రాజ్యమందిరాలూ ఉన్నాయి.
ఆస్ట్రేలియా రాజధానియైన క్యాన్‌బిరానందు 1969లో నేను సేవా నియామకాన్ని పొందాను. అనేక విదేశీ ప్రతినిధుల కార్యాలయాల్లోని సిబ్బందిని మేము కలిసేవాళ్లం కనుక, సాక్ష్యమివ్వడంలో మా సామర్థ్యాన్నంతటినీ ఉపయోగించడం అవసరమైంది మరియు అది వివిధరకాలైన పరిస్థితులను మాకు అందించేది. నేను ఇప్పటికీ ఇక్కడే సేవచేస్తున్నాను కాని, ఇటీవలి సంవత్సరాల్లో ఈ పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంమీద నేను నా అవధానాన్నుంచాను.
పందొమ్మిదివందల డెబ్భైమూడునందు, అమెరికాలోని పెద్ద సమావేశాలకు హాజరయ్యే అవకాశం నాకు లభించింది. నా జీవితంలో మరో ప్రాముఖ్యమైన సంఘటనేమిటంటే, 1979లో సమావేశ ప్రతినిధిగా ఇశ్రాయేలు మరియు జోర్డాన్ ప్రాంతాలను సందర్శించడం. బైబిలు నందు ప్రస్తావించబడిన స్థలాలను నేరుగా చూడడం, అక్కడ జరిగిన సంఘటనలను ధ్యానించడం నిజంగా ఎంతో ఉత్తేజపూరితమైన అనుభవం. ఉప్పు నీటి అధికసాంద్రత గల మృత సముద్రంలో ఈదినప్పుడు ఎలా ఉంటుందో నేను అనుభవించగలిగాను అంతేకాకుండ, జోర్డాన్‌లోని పెట్రాను మేము సందర్శించిన సమయంలో ఒక గుర్రం మీద మరలా ప్రయాణించే అవకాశం నాకు లభించింది. సుదూర ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రాజ్య వర్తమానాన్ని అందించేందుకు గుర్రాలు నాకు తోడ్పడిన ఆ తొలి రోజులను నాకు జ్ఞాపకం చేశాయి.
ఎడతెగని పూర్తికాల సేవ
నేను వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ పూర్తికాల సేవలో కొనసాగాలనే నా కోరిక, పయినీరు సేవాపాఠశాల మరియు ప్రాంతీయ సమావేశాల్లో నిర్వహించబడే పయినీరు కూటాలూ అలాగే ప్రయాణ కాపరులనుండి ఎప్పుడూ నేను పొందే ఎడతెగని ప్రోత్సాహం వల్ల ఇంకా వర్ధిల్లుతూనే ఉంది. నేను ఒంటరిగా ఉండే రోజులు, గతించిన విషయాలుగా ఉండేటట్లు యెహోవా చూశాడని నేను యథార్థంగా చెప్పగలను.
నాకు ఇప్పుడు 87 సంవత్సరాలు, మరి 60 సంవత్సరాలపాటు యెహోవాను సేవించిన తర్వాత, నిర్మొహమాటంగా మాట్లాడేవారికి మరియు స్వాత్యంత్రంగా ఉండాలని కోరుకునేవారికి నేను ఓ ప్రోత్సాహపు మాటను చెప్పాలనుకుంటున్నాను: ఎల్లప్పుడూ యెహోవా నడిపింపుకు లోబడి ఉండడండి. మనం నిర్మొహమాటంగా మాట్లాడడాన్ని అదుపులోపెట్టుకునేందుకు యెహోవా సహాయపడతాడని మరియు మనం తరచూ ఒంటరిగా ఉన్నామని భావించినా ఆయన ఎన్నడూ మనలను విడనాడడని ఎల్లప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడని ఆశిద్దాం.
[అధస్సూచీలు]
a సల్కీ అన్నది తేలికైన రెండు చక్రాల వాహనం.