యెహోవాకు స్తుతిగీతములు పాడండి
“యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను.”—నిర్గమకాండము 15:1.
1. యెహోవా యొక్క ఏ గుణాలు, లక్షణాలు ఆయనను స్తుతించటానికి మనకు కారణాన్నిస్తున్నాయి?
యెహోవాను లేక యావేను స్తుతించమని 150వ కీర్తన పదమూడు సార్లు ఆజ్ఞాపిస్తున్నది. చివరి వచనం ఇలా ప్రకటిస్తుంది: “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.” యెహోవా మన స్తుతిని పొందుటకు అర్హుడని యెహోవాసాక్షులుగా మనకు తెలుసు. ఆయన విశ్వాధిపతి, సర్వోన్నతుడు, నిత్యుడగు రాజు, మన సృష్టికర్త, మన ఉపకారి. ఆయన అనేక విధాలుగా సాటిలేనివాడు, విశేషమైనవాడు, అనుపమానుడు, అద్వితీయుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిగలవాడు, న్యాయంలో పరిపూర్ణుడు, ప్రేమ యొక్క మూర్తిమంతమునై యున్నాడు. ఆయన అందరికంటే మంచివాడు; యథార్థవంతుడు. (లూకా 18:19; ప్రకటన 15:3, 4) ఆయన మన స్తుతి నొందదగినవాడా? కచ్చితంగా ఆయన మన స్తుతి నొందదగినవాడే!
2. యెహోవాకు కృతజ్ఞత చెల్లించటానికి మనకు ఏ కారణాలున్నాయి?
2 యెహోవా మన ఆరాధనను, స్తుతినే కాదు, ఆయన మన కొరకు చేసిన వాటన్నిటి కొరకు మన కృతజ్ఞతను, మన అభినందనను కూడా పొందనర్హుడు. ఆయన “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చేవాడు. (యాకోబు 1:17) ఆయన సమస్త జీవానికి ఊట, మూలము. (కీర్తన 36:9) ఆయన మన మహాగొప్ప సృష్టికర్త గనుక, మానవజాతి సభ్యులుగా మనం అనుభవించేవన్నీ ఆయనిచ్చినవే. (యెషయా 42:5) తన ఆత్మ ద్వారా, తన సంస్థ ద్వారా, తన వాక్యం ద్వారా మనకు వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఇచ్చేవాడు ఆయనే. ఆయన తన కుమారున్ని మనకు విమోచన క్రయధనంగా ఏర్పాటు చేయడం ద్వారా మన పాపాలకు క్షమాపణ ఉంది. (యోహాను 3:16) ‘నీతి నివసించే క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమిని’ గూర్చిన రాజ్య నిరీక్షణ మనకున్నది. (2 పేతురు 3:13) తోటి క్రైస్తవులతో మనకు చక్కని సహవాసమున్నది. (రోమీయులు 1:11, 12) ఆయన సాక్షులుగా ఉండగల ఆధిక్యత, ఆశీర్వాదాలు మనకున్నాయి. (యెషయా 43:10-12) మనకు అత్యంత విలువైన ప్రార్థనాధిక్యత ఉంది. (మత్తయి 6:9-13) నిజంగా, యెహోవాకు స్తుతి చెల్లించటానికి మనకు ఎన్నో కారణాలున్నాయి!
మనం యెహోవాను స్తుతించగల మార్గాలు
3. మనం మరే అనేక రీతుల్లో యెహోవాను స్తుతించి, ఆయనకు మన కృతజ్ఞతను తెలియజేయగలము?
3 యెహోవా సమర్పిత సేవకులుగా మనం ఆయననెలా స్తుతించి, మన కృతజ్ఞతను తెలియజేయగలము? క్రైస్తవ పరిచర్యలో భాగం వహించడం—ఇంటింటికీ సాక్ష్యమివ్వడం, పునర్దర్శనాలు చేయడం, బైబిలు పఠనాలు నిర్వహించడం, వీధి సాక్ష్యమివ్వడంలో పాల్గొనడం వంటివి చేయడం ద్వారా మనం అలా చేయవచ్చు. అవకాశం దొరికినప్పుడు తటస్థ సాక్ష్యమివ్వడం ద్వారా కూడా మనము ఆయన్ను స్తుతించగలము. అంతేగాక, మన నీతియుక్తమైన ప్రవర్తన ద్వారా, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, తల చక్కగా దువ్వుకోవడం ద్వారా కూడా మనం యెహోవాను స్తుతించవచ్చు. ఈ విషయాల్లో మాదిరికరంగా ఉన్నందుకు యెహోవాసాక్షులు తరచూ మెచ్చుకొనబడ్డారు. అంతేగాక, ప్రార్థన ద్వారా మనం యెహోవాను స్తుతించి, కృతజ్ఞతలు తెలియజేయవచ్చు.—1 దినవృత్తాంతములు 29:10-13 చూడండి.
4. మన ప్రేమగల పరలోకపు తండ్రిని స్తుతించుటకు అతి చక్కని మార్గాల్లో ఒకటి ఏది?
4 అంతేకాకుండా, మన ప్రేమగల పరలోకపు తండ్రిని మనం స్తుతించటానికి మరో చక్కని మార్గం ఏమిటంటే, ఆయనను, ఆయన సుగుణాలను శ్రావ్యమైన రాజ్య గీతములతో ప్రస్తుతించడము. అత్యంత అందమైన సంగీత సాధనం మానవ స్వరమేనని అనేకమంది సంగీతకారులు, స్వరకర్తలు అంగీకరిస్తారు. గీతమాలపిస్తున్న మానవ స్వరాన్ని వినడంలో ఎంతో సంతృప్తి ఉంది గనుకనే శాస్త్రీయ సంగీత విద్వాంసులు సంగీతరూపకాలను వ్రాయటానికి ప్రేరేపించబడ్డారు.
5. ఏ కారణాలనుబట్టి మనం రాజ్య గీతములను పాడటాన్ని గంభీరంగా తీసుకోవాలి?
5 మానవులు పాడుతున్నప్పుడు, ముఖ్యంగా వారు స్తుతిని, కృతజ్ఞతను గూర్చిన పాటలు పాడుతున్నప్పుడు వినటాన్ని యెహోవా ఎంతగా ఆనందిస్తుండవచ్చు! సంఘ కూటాలు, ప్రాంతీయ సమావేశాలు, ప్రత్యేక సమావేశ దినాలు, జిల్లా సమావేశాలు, అంతర్జాతీయ సమావేశాలు వంటి మన అనేక సమావేశాల్లో మనం రాజ్య గీతములను పాడటాన్ని మనం నిజంగా గంభీరంగా తీసుకోవాలి. మన పాటల పుస్తకం నిజంగా శ్రావ్యమైన ఆలాపనలతో నిండివుంది, వాటి అందాన్ని బయటివారు తరచూ మెచ్చుకొన్నారు. రాజ్య గీతములను పాడటంలో మనం ఎంతగా నిమగ్నమైతే, అంత ఆనందాన్ని ఇతరులకు కలుగజేస్తాము, మనకై మనం ప్రయోజనం పొందుతాము.
బైబిలు కాలాల్లో యెహోవాకు స్తుతిగీతములు పాడుట
6. ఎర్ర సముద్రం వద్ద తాము విడుదల చేయబడినందుకు ఇశ్రాయేలీయులు ఎలా తమ మెప్పును ప్రదర్శించారు?
6 ఎర్ర సముద్రం వద్ద ఫరో సైన్యం నుండి విడుదల చేయబడినందుకు మోషే, మిగతా ఇశ్రాయేలీయులు విజయోత్సాహంతో పాడారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వాళ్ల పాట ఈ మాటలతో ప్రారంభమైంది: “యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను.” (నిర్గమకాండము 15:1, 2) తాము అద్భుతరీతిగా విడుదల నొందిన తరువాత ఇశ్రాయేలీయులు ఆ మాటలు పాడినప్పుడు వారి ఉత్సాహాన్ని, ఆనందాన్ని మనం చక్కగా ఊహించవచ్చు!
7. ఇశ్రాయేలీయులు పాటల ద్వారా యెహోవాను స్తుతించినట్లు తెలియజేసే మరే ఇతర ప్రముఖ సంఘటనలు హెబ్రీ లేఖనాల్లో వ్రాయబడివున్నాయి?
7 దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకొని వచ్చినప్పుడు పాడటం, సంగీత వాయిద్యాలను వాయించడం ద్వారా యెహోవా స్తుతించబడ్డాడని మనం 1 దినవృత్తాంతములు 16:1, 4-36 నందు చదువుతాము. నిజంగా అది ఆనందకరమైన సందర్భం. రాజైన సొలొమోను యెరూషలేములో ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు కూడా యెహోవాకు వాయిద్యసంగీతంతో కూడిన స్తుతిని చెల్లించడం జరిగింది. మనం 2 దినవృత్తాంతములు 5:13, 14 నందు ఇలా చదువుతాము: “బూరలు ఊదువారును పాటకులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి—యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరమునిండ నిండెను, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.” అది ఏమి చూపిస్తున్నది? మానవాతీత మేఘముచే సూచించబడినట్లుగా యెహోవా వారి శ్రావ్యమైన స్తుతిని వింటున్నాడని, దానితో ఆయన ప్రీతిపర్చబడ్డాడని చూపిస్తుంది. తరువాత, నెహెమ్యా దినాల్లో యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించేటప్పుడు రెండు సమూహముల వారు గానము చేశారు.—నెహెమ్యా 12:27-42.
8. ఇశ్రాయేలీయులు పాడటాన్ని గంభీరంగా తీసుకొనేవారని ఏది చూపిస్తుంది?
8 వాస్తవానికి, ఆలయం వద్ద ఆరాధనలో పాడటం ఎంత ప్రాముఖ్యమైన భాగంగా ఉండేదంటే సంగీత సేవకొరకు 4,000 మంది లేవీయులు ప్రత్యేకంగా ఉంచబడ్డారు. (1 దినవృత్తాంతములు 23:4, 5) వారు గాయకులతోపాటు ఉండేవారు. సంగీతం, ప్రత్యేకంగా గాయకులు ఆరాధనలో, ధర్మశాస్త్రం యొక్క బరువైన విషయాలను నేర్పించటానికి కాదుగాని, ఆరాధనకు కావలసిన సరైన స్ఫూర్తినివ్వటానికి ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగివుండిరి. యెహోవాను ఉత్సాహపూరిత ఆత్మతో ఆరాధించటానికి ఇది ఇశ్రాయేలీయులకు సహాయం చేసింది. ఈ విషయం కొరకై చూపించబడుతున్న ఆసక్తిని, సిద్ధపాటును వివరంగా గమనించండి: “యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.” (1 దినవృత్తాంతములు 25:7) యెహోవాకు స్తుతి పాడటాన్ని వారెంత గంభీరంగా తీసుకున్నారో గమనించండి. వారు పాటలో శిక్షణ ఇవ్వబడ్డారు, వారు నిపుణులైయుండిరి!
9. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో పాడటానికి ఏ ప్రాధాన్యత ఇవ్వబడింది?
9 మన సామాన్యశకపు మొదటి శతాబ్దానికి వస్తే, మనమేమి కనుగొంటాము? తాను అప్పగింపబడబోవు రాత్రి, ఆయన మనస్సులో ఎన్నో భారమైన విషయాలున్నప్పటికీ, యెహోవాకు స్తుతులు పాడటంతో తన పస్కా ఆచరణను ముగించటం, తన మరణ జ్ఞాపకార్థకాన్ని ప్రారంభించటం చేయవలసిన అవసరం ఉందని ఆయన భావించాడు. (మత్తయి 26:30) మరియు, “మధ్యరాత్రి వేళ,” పౌలు సీల దెబ్బలు కొట్టబడి, చెరసాలలో వేయబడిన తరువాత “దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి” అని మనం చదువుతాము.—అపొస్తలుల కార్యములు 16:25.
స్తుతిగీతములు పాడటం—మన ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన భాగము
10. దేవున్ని పాటల ద్వారా స్తుతించటాన్ని గూర్చి ఆయన వాక్యం ఏ ఆజ్ఞలనిస్తున్నది?
10 రాజ్య గీతములు పాడటం మీరు మీ హృదయపూర్వక శ్రద్ధ నివ్వవలసినంత ప్రాముఖ్యమైనది కాదని బహుశ మీరు భావిస్తున్నారా? అలాగైతే, స్తుతులు పాడటానికి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఇస్తున్న ప్రాముఖ్యత దృష్ట్యా మీరు విషయాన్ని పునఃపరిశీలించుకోరా? అంతెందుకు, దేవుని వాక్యం యెహోవాను స్తుతించి, ఆయనకు స్తుతిగీతములు పాడమనే ఆజ్ఞలతో నిండివుంది! ఉదాహరణకు, యెషయా 42:10 నందు మనమిలా చదువుతాము: “సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.”—కీర్తన 96:1; 98:1 కూడా చూడండి.
11. పాడటాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు ఏ హెచ్చరికనిస్తున్నాడు?
11 పాడటం మన స్ఫూర్తిని ఉత్తేజపరచగలదని అపొస్తలుడైన పౌలుకు తెలుసు, అందుకే ఆయన రెండుసార్లు ఆ విషయాన్ని గూర్చి చెప్పాడు. ఎఫెసీయులు 5:18, 19 నందు మనమిలా చదువుతాము: “అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును [యెహోవా NW] గూర్చి పాడుచు కీర్తించుచుండుడి.” కొలొస్సయులు 3:16 నందు మనమిలా చదువుతాము: “సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచూ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని [యెహోవా NW] గూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.”
12. ఒకరికొకరు బోధించుచూ, బుద్ధి చెప్పుకొనుటకు మన గీతములు మనకు సహాయం చేసే ఏ ఉదాహరణలు మనకున్నాయి?
12 ‘కీర్తనలతోను, దేవునికి మీ హృదయములలో పాడుచు, ఆత్మసంబంధమైన పాటలతోను, మీ హృదయములో సంగీతంతో పాడుచూ’ అని అంటూ ప్రతి సందర్భములోను పౌలు పదేపదే పాడటాన్ని గూర్చి చెప్పడం గమనించండి. దీని ద్వారా మనం “ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచూ” ఉండవచ్చునని చెప్పడం ద్వారా ఆయన కొలొస్సయులకు తన సలహాలనిచ్చాడు. కచ్చితంగా మనమలాగే చేయవచ్చు, దాన్ని మనం మన పాటల పేర్లలో కూడా చూడవచ్చు—“సృష్టియావత్తు యెహోవాను స్తుతించుడి!” (సంఖ్య 5), “స్థిరంగా, నిశ్చలంగా ఉండండి!” (సంఖ్య 10), “రాజ్య నిరీక్షణ కొరకు ఆనందంగా ఉండండి!” (సంఖ్య 16), “వారికి భయపడకండి!” (సంఖ్య 27), “మన దేవుడైన యెహోవాను స్తుతించండి!” (సంఖ్య 100), ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.
13. పాడటం మన ఆరాధనలో ఒక భాగం అనేదాని ప్రాముఖ్యతను “నమ్మకమును బుద్ధిమంతుడునగు దాసుడు” ఎలా చూపించాడు?
13 ఈ ఆజ్ఞలకు అనుగుణ్యంగా “నమ్మకమును బుద్ధిమంతుడునగు దాసుడు,” సంఘ కూటాలు, ప్రాంతీయ సమావేశాలు, ప్రత్యేక సమావేశ దినాలు, జిల్లా సమావేశాలు, అంతర్జాతీయ సమావేశాల వంటి మన సమావేశాలను రాజ్య గీతములు పాడటంతో ప్రారంభించటాన్ని, ముగించటాన్ని ఏర్పాటు చేశాడు. (మత్తయి 24:45) అంతేగాక, ఈ సమావేశాల్లో ఇతర సమయాల్లో కూడా పాటలు పాడటాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా మన కూటాలు రాజ్య గీతాన్ని పాడటంతో ప్రారంభమవుతాయి గనుక, మన ఆరాధనలోని ఆ భాగంలో పాల్గొనేలా తగిన సమయానికి రావటాన్ని మనం ఒక ముఖ్య విషయంగా గుర్తించవద్దా? కూటాలు పాడటంతో ముగుస్తాయి గనుక, ముగింపు పాట దాని తర్వాత వెంటనే ఉండే ప్రార్థనల వరకు మనం ఆగివుండవద్దా?
14. మన కార్యక్రమాల కొరకు తగిన పాటలను ఎన్నుకోవటాన్ని గురించి మనకు ఏ ఉదాహరణలు ఉన్నాయి?
14 మన కూటాల్లోని పాటలు కార్యక్రమంతో పొందిక కలిగివుండేలా జాగ్రత్తగా ఎంపిక చేసుకొనబడతాయి. ఉదాహరణకు, 1993 “దైవిక బోధ” జిల్లా సమావేశంలో క్రైస్తవులను సాతాను, ప్రపంచం, అపరిపూర్ణ శరీరంతో పోరాడమని ప్రోత్సహించే “సత్యాన్ని మీ సొంతం చేసుకోండి” అనే 191వ పాట, ఈ మూడు శత్రువులను వివరించే ప్రసంగాల తర్వాత వెంటనే పాడబడింది. అలాగే “పిల్లలు—దేవుని ప్రశస్తవరాలు” అనే 164వ పాట పిల్లలకు తర్ఫీదు నివ్వవలసిన తలిదండ్రుల బాధ్యతలను ఉన్నతపర్చే ప్రసంగం తర్వాత ఉండినది. “యిర్మీయా వలె నుండుడి” అనే 70వ పాట తర్వాత యిర్మీయా ప్రవచనాలపై ఆధారపడిన ప్రసంగాల పరంపర కొనసాగింది. మన రాజ్య పరిచర్య నందలి అనేక అంశాలపై ఒక గోష్ఠి తర్వాత “నాకిష్టము” అనే 156వ పాట పరిచర్యయే ప్రధానాంశంగావున్న పాటయై ఉంది. కావలికోట పఠనం, సేవా కూటము, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వంటి వాటికొరకు పాటలను ఎంపికచేసుకోవడంలో కూడా అదే శ్రద్ధ తీసుకొనబడుతుంది. పెద్దలు బహిరంగ ప్రసంగాలిచ్చేటప్పుడు, కార్యక్రమాన్ని ప్రారంభించటానికి ఉపయోగించే పాటను సూచించేటప్పుడు తమ ప్రసంగాంశానికి తగినట్లు ఉండే పాటను వారు ఎన్నుకోవాలి.
15. కూటాధ్యక్షుడు పాడవలసిన పాట యెడల గుణగ్రహణాన్ని ఎలా పెంచగలడు?
15 పాడవలసిన పాటను ప్రకటిస్తూ, అధ్యక్షుడు ఆ పాట యొక్క పేరును గాని లేక మూలాంశాన్ని గాని చెప్పటం ద్వారా దాని యెడల మెప్పును పెంపొందింపజేయవచ్చు. మనం సంఖ్యలు కాదుగాని లేఖనాధార మూలాంశాలను పాడతాము. అంతేగాక పేరు క్రింద ఇవ్వబడిన లేఖనాన్ని కూడా సూచిస్తే సంఘం పాటను ఎక్కువగా గుణగ్రహించటానికి సహాయకరంగా ఉంటుంది. ఆ తర్వాత, పాట యొక్క స్ఫూర్తిలోకి అందరూ ప్రవేశించగలిగేలా కొన్ని సూచనలివ్వవచ్చు.
పాడటం ద్వారా యెహోవా మంచితనం యెడల మెప్పును ప్రదర్శించండి
16. మన పాటల్లోని స్ఫూర్తిలోకి మనమెలా ప్రవేశించగలము?
16 మన రాజ్య గీతముల గేయాలు పూర్తి భావంతో నిండివుంటాయి గనుక, మనం పాడుతున్నప్పుడు వాటి పదాలపై శ్రద్ధ నుంచడం అవసరం. మనం ప్రతి పాట యొక్క ఉద్దేశం లేక భావంలోకి ప్రవేశించగోరతాము. కొన్ని, ప్రేమ, లేక ఒక ఆత్మఫలానికి సంబంధించినవి హృదయపూర్వకమైనవి. (గలతీయులు 5:22) వీటిని మనం తీవ్రతతో, ఉల్లాసంతో పాడతాము. వేరేవి ఆనందకరమైనవి, వాటిని మనం సంతోషంగా పాడటానికి ప్రయత్నించాలి. మరి వేరేవి ఉధృతమైనవి, సేనాప్రయాణగీతములు, మరి వీటిని ఉత్సాహంతో, దృఢనమ్మకంతో పాడాలి. మన దైవపరిపాలన పరిచర్య పాఠశాలలో, మనం మన అందింపుల్లో ఉత్తేజాన్ని, భావనను, అలాగే ఉత్సాహాన్ని కనపర్చాలని సలహా ఇవ్వబడతాము. మన పాటలు పాడేటప్పుడు ఉత్తేజం, భావన, ఉత్సాహాన్ని ప్రదర్శించటం కూడా ఎంతో ప్రాముఖ్యము.
17. (ఎ) అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఏ గద్దింపును మనం మన పాడటానికి అన్వర్తించుకోవటానికి ఇష్టపడము? (బి) మనం మన పాటల్లో ఉన్న సలహాను గంభీరంగా తీసుకుంటే ఏమి జరుగుతుంది?
17 మనం మన రాజ్య గీతములను మన మనస్సులు ఎక్కడో ఉంచుకొని, పదాల భావాన్ని పూర్తిగా గుణగ్రహించకుండా పాడితే, మనం ఒక విధంగా, తమ పెదవులతో దేవున్ని స్తుతించినప్పటికీ తమ హృదయాలు ఆయన నుండి దూరంగా ఉంచినందుకు హెచ్చరింపబడిన అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులను పోలి ఉండమా? (మత్తయి 15:8) మనం రాజ్య గీతములు పాడే విధానానికి ఆ గద్దింపు అన్వర్తించబడాలని మనం కోరుకోము, కాదంటారా? మన రాజ్య గీతములను పాడటానికి న్యాయం చేకూర్చడం ద్వారా మనల్ని మనమేకాక, చిన్న పిల్లలతోసహా మన చుట్టూ ఉన్న వారినందరిని మనం ఉత్తేజపరుస్తాము. అవును, మన రాజ్య మందిరాల్లో పాడే వారందరూ ఈ పాటల్లో ఉన్న సలహాను గంభీరంగా తీసుకుంటే, అది పరిచర్యలో ఆసక్తి కలిగివుండటానికి శక్తివంతమైన ప్రోత్సాహంగా ఉండి, తప్పు చేయగల ఉరిలో పడిపోకుండా కాపాడుతుంది.
18. రాజ్యగీతములు పాడటం ఒక స్త్రీపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది?
18 అనేకసార్లు, మనం మన రాజ్యగీతములను పాడటాన్ని బట్టి బయటివారు ప్రభావితులయ్యారు. ఒకసారి కావలికోట ఈ విషయాన్ని ప్రచురించింది: “[మన] పాడటం కూడా ప్రజలు యెహోవా దేవున్ని గూర్చిన జ్ఞానాన్ని పొందడానికి సహాయం చేస్తుందని, న్యూయార్క్ నగరంలోని యాంకి స్టేడియంలో 1973లో జరిగిన ‘డివైన్ విక్టరి’ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్న ఒక స్త్రీ అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. ఆమె తనంతట తానే ఒక స్థానిక రాజ్యమందిరానికి మొదటిసారి వచ్చి, రెండు కూటాలకు అలాగే ఉంది. ‘బహుమతిపై దృష్టి నిల్పుము’ అని సంఘము పాడినప్పుడు, ఆమె అందులోని మాటలు, వారు పాడిన విధానాన్ని బట్టి ఎంతగా ప్రభావితురాలైందంటే, నేనుండవలసినది ఇక్కడే అని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె సాక్షుల్లో ఒకరిని కలిసి, బైబిలు పఠనం కొరకు అడిగింది, యెహోవా క్రైస్తవ సాక్షి యగుటకు ఆమె అభివృద్ధి చెందింది.”
19. మన రాజ్యగీతములను హృదయపూర్వకంగా పాడటాన్ని గూర్చి ఏ చివరి ప్రోత్సాహం ఇవ్వబడింది?
19 సరిపోల్చగా, మన అనేక కూటాల్లో, ప్రేక్షకులు తమ భావాలను, మెప్పును చూపించటానికి కొన్ని అవకాశాలే ఉన్నాయి. కాని మనందరం రాజ్య గీతములను పాడటంలో హృదయపూర్వకంగా భాగం వహించడం ద్వారా యెహోవా మంచితనాన్ని గూర్చి మనమెలా భావిస్తున్నామనేది వ్యక్తపర్చవచ్చు. అంతేకాక, మనందరం కలిసినప్పుడు మనం మంచి స్ఫూర్తిని కలిగివుండమా? కాబట్టి మనం పాడటానికి ఇష్టపడాలి! (యాకోబు 5:13) నిజంగా, యెహోవా మంచితనాన్ని, ఆయన కృపాబాహుళ్యాన్ని మనమెంతగా మెచ్చుకుంటే, మనం అంతగా ఆయనకు పూర్ణాత్మతో స్తుతిగీతములు పాడతాము.
మీరెలా జవాబిస్తారు?
◻ యెహోవాను స్తుతించటానికి రెండు ప్రముఖమైన కారణాలు ఏవి?
◻ మనం మరే అనేక రీతుల్లో యెహోవాను స్తుతించవచ్చు?
◻ మన ప్రేమగల పరలోకపు తండ్రిని స్తుతించటానికి చక్కని మార్గాల్లో ఒకటి ఏది?
◻ యెహోవాను పాటల ద్వారా స్తుతించటాన్ని గూర్చి మనకు ఏ లేఖనాధార ఉదాహరణలున్నాయి?
◻ మనం మన రాజ్యగీతములను పాడటానికి ఎలా న్యాయం చేకూర్చగలము?
[11వ పేజీలోని బాక్సు]
ఆ పాటలను ఆనందించండి!
అనేక పాటలను నేర్చుకోవడంలో కొద్దిమందికి కొంత కష్టం కలిగినట్లు అనిపిస్తున్నది. అయినా, ఈ పాటల్లో వేటిని పాడటానికైనా కొన్ని సంఘాల వారికి పెద్ద సమస్య కాలేదు, కష్టమనిపించలేదు. మొదట్లో అపరిచితంగా అనిపించే వాటిని నేర్చుకోవటానికి బహుశ మరికొంత ప్రయత్నం అవసరమవుతుంది. అలాంటి పాటలతో పరిచయమేర్పడినప్పుడు, నేర్చుకోవటానికి ఏ ప్రయాస లేకుండానే నేర్చుకొన్న పాటలకంటే వీటినే సంఘం ఎక్కువగా మెచ్చుకొంటుంది. అప్పుడు సంఘంలోని వారందరు వాటిని ధైర్యంగా పాడవచ్చు. అవును, వారు ఆ పాటలను ఆనందించవచ్చు.
[12వ పేజీలోని బాక్సు]
సామాజిక సమావేశాల్లో రాజ్యగీతములు పాడండి
మనం రాజ్యగీతములు పాడటమనేది రాజ్య మందిరానికే పరిమితమై ఉండనవసరం లేదు. పౌలు సీల చెరసాలలో ఉన్నప్పుడు యెహోవాకు స్తుతిగీతములు పాడారు. (అపొస్తలుల కార్యములు 16:25) శిష్యుడైన యాకోబు ఇలా చెప్పాడు: “ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.” (యాకోబు 5:13, అథఃస్సూచి) సామాజిక సమావేశాల్లో అందరూ సంతోషంగా ఉంటారు. మరి రాజ్యగీతములెందుకు పాడకూడదు? పాడటంతోపాటు పియానో లేక గిటార్ వాయిద్యం కూడా ఉంటే అప్పుడు ఇది విశేషంగా బాగుంటుంది. లేదా, మన రాజ్యగీతముల పియానో టేపులు కూడా ఉన్నాయి; అనేక సాక్షుల కుటుంబాల వద్ద ఈ టేపుల ఆల్బం ఉంది. పాడటానికి సహాయకరంగా ఉండటమేగాక అవి రమ్యమైన నేపథ్యసంగీతంగా కూడా బావుంటాయి.
[8, 9వ పేజీలోని చిత్రం]
ఎర్రసముద్రంవద్ద తమ విడుదల తరువాత, ఇశ్రాయేలీయులు తమ ఆనందాన్ని పాటలో వ్యక్తపర్చారు
[10వ పేజీలోని చిత్రం]
ఆనందదాయకమైన పాట నేడు క్రైస్తవ ఆరాధనలో ఒక భాగము