రాజ్య ప్రచారకులు భూవ్యాప్తంగా చురుకుగా ఉన్నారు
“మీరు . . . భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.”—అపొస్తలుల కార్యములు 1:8.
1. మన దినాల్లో తన అనుచరులు ఏ వర్తమానాన్ని ప్రకటిస్తారని యేసు చెప్పాడు?
యెహోవా తన కుమారున్ని ఏ పని చేయమని భూమిపైకి పంపించాడో దాని గురించి వివరిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “నేను . . . దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను.” (లూకా 4:43) అలాగే, తాను రాజ్యాధికారంతో తిరిగివచ్చినప్పుడు తన శిష్యులు భూమిపై చేసే పనిని గూర్చి చెప్తూ యేసు ఇలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.
2. (ఎ) రాజ్య వర్తమానానికి విస్తృత ప్రచారాన్ని ఇవ్వటం ఎందుకంత ప్రాముఖ్యము? (బి) మనమందరం మనల్ని మనం ఏ ప్రశ్న వేసుకోవాలి?
2 దేవుని రాజ్యాన్ని గూర్చిన వార్త ఎందుకంత ప్రాముఖ్యమైనది? రాజ్యానికి ఎందుకంత విస్తృత ప్రచారం అవసరం? ఎందుకంటే, అది యెహోవా విశ్వాధిపత్యాన్ని ఉన్నతపర్చే మెస్సీయ రాజ్యం గనుకే. (1 కొరింథీయులు 15:24-28) దాని ద్వారా యెహోవా ప్రస్తుత సాతాను విధానానికి వ్యతిరేకంగా తీర్పు తీర్చి, భూ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తానన్న తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. (ఆదికాండము 22:17, 18; దానియేలు 2:44) రాజ్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వబడేలా చేయటం ద్వారా, తర్వాత తన కుమారునితో సహ వారసులుగా ఉండుటకు తాను అభిషేకించబోయే వారిని యెహోవా కనుగొన్నాడు. రాజ్య ప్రకటన ద్వారా, నేడు ఒక విభాగించే పని కూడా జరుగుతున్నది. (మత్తయి 25:31-33) తన సంకల్పాన్ని గురించి భూ జనులందరూ తెలుసుకోవాలన్నది యెహోవా చిత్తము. తన రాజ్య నివాసులుగా జీవాన్ని ఎన్నుకొనే అవకాశం వారందరికి కలగాలన్నది ఆయన ఇష్టము. (యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 13:47) ఈ రాజ్యాన్ని ప్రకటించడంలో మీరు పూర్తిగా భాగం వహిస్తున్నారా?
అన్యరాజుల కాలముల అంతం కొరకు ఎదురుచూడటంలో
3. (ఎ) బైబిలు పఠనాల కొరకు గుంపులను ఏర్పాటు చేయటానికి చేసిన తన తొలి యాత్రలో సి. టి. రస్సెల్ తగినట్లుగా ఏ అంశాన్ని ఉపయోగించాడు? (బి) తమ జీవితాల్లో దేవుని రాజ్యం కలిగివుండవలసిన స్థానాన్ని గూర్చి ఆ తొలి బైబిలు విద్యార్థులు గుణగ్రహించినదేమిటి?
3 పూర్వం 1880లో, ది వాచ్‌టవర్ పత్రిక యొక్క మొదటి సంపాదకుడైన చార్లెస్ తేజ్ రస్సెల్, బైబిలు పఠనం కొరకు గుంపులు ఏర్పడటాన్ని ప్రోత్సహించటానికి అమెరికా ఈశాన్య ప్రాంతంలో పర్యటించాడు. ఆయన సంభాషించిన అంశం కూడా తగినట్లుగానే ఇలా ఉంది: “దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు.” వాచ్‌టవర్ యొక్క తొలి సంచికల్లో చూపబడినట్లు, దేవుని రాజ్యంలో భాగం పొందడానికి అర్హులవ్వాలంటే తమ జీవితాలను, తమ సామర్థ్యాలను, తమ సంపదలను రాజ్య సేవలో సంతోషంగా ఉపయోగిస్తూ, రాజ్యాసక్తిని తమ జీవితాల్లో ముందుంచుకోవాలని బైబిలు విద్యార్థులు (అప్పుడు యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు) గ్రహించారు. జీవితంలో మిగతావన్నీ రెండవ స్థానం వహించవలసిందే. (మత్తయి 13:44-46) దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ఇతరులకు ప్రకటించడం కూడా వారి బాధ్యతలో చేరివుంది. (యెషయా 61:1, 2) అన్యరాజుల కాలములు 1914లో అంతం కాకముందు వారు ఎంతవరకు దానిని చేశారు?
4. చిన్న గుంపైన బైబిలు విద్యార్థులు 1914కు ముందు ఎంత మేరకు బైబిలు సాహిత్యాన్ని పంచి పెట్టారు?
4 బైబిలు విద్యార్థులు 1870వ పడి నుండి 1914 మధ్యకాలంలో సంఖ్యలో కేవలం కొద్దిమందే ఉన్నారు. పంతొమ్మిది వందల పద్నాలుగునాటికి కేవలం 5,100 మంది మాత్రమే బహిరంగ సాక్ష్యమివ్వడంలో చురుకుగా భాగం వహించేవారు. కాని అదెంతటి విశేషమైన సాక్ష్యమైయుండెను! వాచ్‌టవర్ ప్రచురింపబడిన కేవలం రెండు సంవత్సరాల తర్వాత, 1881లో ఫుడ్ ఫర్ థింకింగ్ క్రిస్టియన్స్ అనే 162 పేజీల ప్రచురణను వారు పంచిపెట్టడం ప్రారంభించారు. కొన్ని నెలల్లోనే, వారు 12,00,000 కాపీలను అందజేశారు. కొన్ని సంవత్సరాల్లో, అనేక భాషల్లో కోటానుకోట్ల కరపత్రాలు ప్రతి సంవత్సరం పంచిపెట్టబడేవి.
5. కల్పోర్చర్లు ఎవరు, వారు ఎలాంటి స్ఫూర్తిని చూపించారు?
5 అలాగే 1881 మొదలుకొని, కొంతమంది కల్పోర్చర్ సువార్తికులుగా తమ సేవలను అందజేశారు. వీరు నేటి పయినీర్లకు (పూర్తికాల సువార్తికులు) దారి చూపిన వారు. కొంతమంది కల్పోర్చర్లు కాలినడకన లేక సైకిలుపై తాము నివసించిన దేశంలోని ప్రతి భాగంలోను వ్యక్తిగతంగా సాక్ష్యమిచ్చారు. ఇతరులు విదేశీ ప్రాంతాలకు వెళ్లారు, ఫిన్లాండ్, బార్బడోస్, బర్మా (ఇప్పుడు మ్యాన్మార్) వంటి స్థలాలకు సువార్తను మొదట తీసుకెళ్లింది వారే. వారు యేసుక్రీస్తు, ఆయన అపొస్తలుల వంటి మిషనరీ ఆసక్తిని కనపర్చారు.—లూకా 4:43; రోమీయులు 15:23-25.
6. (ఎ) బైబిలు సత్యాన్ని వ్యాప్తి చేయటానికి సహోదరుడు రస్సెల్ ఎంత విస్తృతంగా ప్రయాణించాడు? (బి) అన్యరాజుల కాలములు అంతం కాకమునుపు విదేశీ ప్రాంతాలలో సువార్త ప్రకటనను కొనసాగించటానికి ఇంకా ఏమి చేయబడింది?
6 సహోదరుడు రస్సెల్ తానే కూడా సత్యాన్ని వ్యాప్తిచేయటానికి విస్తృతంగా ప్రయాణించాడు. ఆయన అనేకసార్లు కెనడాకు వెళ్లాడు; పనామా, జమైకా, క్యూబాలలో ప్రసంగించాడు; ఐరోపాకు డజను సార్లు పర్యటించాడు; సువార్త ప్రకటన యాత్రలో భూమిని చుట్టివచ్చాడు. విదేశీ ప్రాంతాల్లో సువార్త ప్రకటించటాన్ని ప్రారంభించటానికి, నాయకత్వం వహించటానికి ఆయన ఇతర మనుష్యులను కూడా పంపించాడు. అడాల్ఫ్ వెబర్ 1890వ పడి మధ్యకాలంలో ఐరోపాకు పంపబడ్డాడు, ఆయన పరిచర్య స్విట్జర్లాండ్ నుండి ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, బెల్జియంల వరకు వ్యాపించింది. ఇ. జె. కొవార్డ్ కారిబియన్ ప్రాంతానికి పంపబడ్డాడు. రాబర్ట్ హాలిస్టర్ 1912లో ప్రాచ్యదేశాలకు పంపబడ్డాడు. అక్కడ, పది భాషల్లో ప్రత్యేకమైన కరపత్రాలు తయారు చేయబడ్డాయి, వాటి యొక్క లక్షలాది ప్రతులు ఇండియా, చైనా, జపాన్, కొరియాలలో స్థానిక పంపిణీదారులచే పంచిపెట్టబడ్డాయి. మీరప్పుడు జీవించివుంటే, మీ ప్రాంతంలో, మరితర ప్రాంతాల్లో ఉన్నవారికి సువార్త అందజేయటానికి తగిన ప్రయత్నాలు చేసేలా మీ హృదయం పురికొల్పబడి ఉండేది కాదా?
7. (ఎ) సాక్ష్యాన్ని ఉధృతం చేయటానికి వార్తాపత్రికలు ఎలా ఉపయోగించబడ్డాయి? (బి) “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” ఏమిటి, కేవలం ఒక సంవత్సరంలోనే దాన్ని ఎంతమంది చూశారు?
7 అన్యరాజుల కాలములు అంతానికి సమీపిస్తుండగా, సహోదరుడైన రస్సెల్ ఇచ్చిన బైబిలు ప్రసంగాలను ప్రచురించుటకు వార్తాపత్రికలు ఉపయోగించబడేవి. వారు 1914వ సంవత్సరాన్ని గురించి కాదుగాని, దేవుని సంకల్పం గురించి, దాని నెరవేర్పు యొక్క నిశ్చయతను గురించి ప్రాథమికంగా నొక్కి చెప్పేవారు. ఒకేసారి 1,50,00,000 మంది పాఠకులను చేరే దాదాపు 2,000 వార్తాపత్రికలు క్రమంగా ఈ ప్రసంగాలను ప్రచురించేవి. తర్వాత, 1914వ సంవత్సరం ముగుస్తుండగా, సంస్థ తమ “ఫోటో-డ్రామా ఆఫ్ క్రియేషన్”ను బహిరంగంగా చూపించటం ప్రారంభించింది. ఒక్కొక్కటి రెండుగంటల వ్యవధిగల నాలుగు అందింపులలో, సృష్టి నుండి వెయ్యేండ్ల పరిపాలన వరకు గల బైబిలు సత్యాలను అది అందజేసేది. కేవలం ఒక సంవత్సరంలోనే, ఉత్తరమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లలో 90 లక్షలకంటే ఎక్కువమంది ప్రేక్షకులు దాన్ని చూశారు.
8. బైబిలు విద్యార్థులు 1914 నాటికెల్లా సువార్తతో ఎన్ని దేశాలను చేరారు?
8 లభ్యమౌతున్న రికార్డుల ప్రకారం, 1914 చివరి కాలానికి, ఆసక్తిగల ఈ సువార్తికుల గుంపు దేవుని రాజ్యాన్ని గూర్చిన తమ ప్రకటనను 68 దేశాలకు వ్యాప్తి చేసింది.a కాని అది కేవలం ప్రారంభం మాత్రమే!
స్థాపించబడిన రాజ్యాన్ని ఆసక్తితో ప్రకటించుట
9. సీడార్ పాయింట్ సమావేశాల్లో, రాజ్య సాక్ష్యపుపనికి ఎలా ప్రత్యేక ప్రేరణ ఇవ్వబడింది?
9 బైబిలు విద్యార్థులు 1919లో ఒహాయో నందలి సీడార్ పాయింట్ వద్ద సమావేశమైనప్పుడు, వాచ్‌టవర్ సంస్థ ఆనాటి అధ్యక్షుడైన జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ ఇలా ప్రకటించాడు: “మెస్సీయ యొక్క రానైయున్న మహిమాన్విత రాజ్యాన్ని ప్రకటించటమే మా పనియైయుండెను, ఉన్నది.” అన్యరాజుల కాలముల అంతములో, 1914లో ‘మహిమగల రాజు తన మహాశక్తిని పొంది, ఆయన తన పరిపాలనను ప్రారంభించాడు’ అనే వాస్తవాన్ని రెండవ సీడార్ పాయింట్ సమావేశంలో, 1922లో, సహోదరుడు రూథర్‌ఫోర్డ్ ఉన్నతపర్చాడు. తర్వాత ఆయన ఇలా చెబుతూ అంశాన్ని ప్రేక్షకుల యెదుట ఉంచాడు: “మహిమగల రాజు తన పరిపాలనను ప్రారంభించాడని మీరు నమ్ముతున్నారా? అలాగైతే ఓ సర్వోన్నత దేవుని కుమారులారా, తిరిగి సేవకు వెళ్లండి! . . . వర్తమానాన్ని దూరతీరాలకు ప్రకటించండి. యెహోవా దేవుడని, యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని లోకమంతా తెలుసుకోవాలి. ఇది దినాలన్నింటిలోకెల్లా మహాగొప్ప దినం. రాజు పరిపాలిస్తున్నాడు చూడండి! మీరు ఆయన ప్రచార ప్రతినిధులు.”
10, 11. రేడియో, సౌండ్ కార్లు, ప్లేకార్డులు అన్నీ ప్రజలకు రాజ్య సత్యాన్ని అందజేయటానికి ఎలా ప్రభావవంతంగా ఉపయోగించబడ్డాయి?
10 ఆ సీడార్ పాయింట్ సమావేశాలు జరిగి 70 సంవత్సరాల కంటే పైనే గడిచాయి—తన కుమారుని మెస్సీయ పరిపాలన ద్వారా యెహోవా తన సర్వాధిపత్యాన్ని వ్యక్తపర్చటం ప్రారంభించి దాదాపు 80 సంవత్సరాలు గడిచాయి. దేవుని వాక్యంలో వారికి ఆజ్ఞాపించబడిన పనిని యెహోవాసాక్షులు నిజానికి ఎంతవరకు తుదముట్టించారు? దానిలో వ్యక్తిగతంగా మీరు ఎంత భాగాన్ని కలిగివున్నారు?
11 రాజ్య సమాచారానికి విస్తృత ప్రచారాన్నిచ్చే పరికరంగా ఉపయోగించుకొనేలా 1920వ దశాబ్దపు తొలిభాగంలో రేడియో అందుబాటులోకి వచ్చింది. రాజ్యాన్ని ప్రపంచ నిరీక్షణగా చూపించే సమావేశ ప్రసంగాలు 1930వ పడిలో రేడియో నెట్‌వర్క్‌లు లేక గొలుసు ప్రసారాలు, విశ్వాన్ని చుట్టివున్న టెలిఫోన్ వైర్ల ద్వారా అందజేయబడ్డాయి. రికార్డు చేయబడిన బైబిలు ప్రసంగాలను బహిరంగ స్థలాల్లో వినిపించటానికి లౌడ్స్పీకర్లు గల కార్లు కూడా వాడబడేవి. తర్వాత 1936లో స్కాట్లాండ్ నందలి గ్లాస్గోవ్లో బహిరంగ ప్రసంగాల గురించి ప్రచారం చేయటానికి వ్యాపార స్థలాలగుండా వెళ్లేటప్పుడు మన సహోదరులు ప్లేకార్డులు ధరించడం ప్రారంభించారు. మన సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు అనేకమంది ప్రజలకు సాక్ష్యం ఇవ్వటానికి ఇలాంటివన్నీ ప్రభావవంతమైన మార్గాలుగా ఉండేవి.
12. లేఖనాలు చూపిస్తున్నట్లుగా, మనం వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వటానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి ఏది?
12 అయినా క్రైస్తవులుగా, సాక్ష్యం ఇవ్వవలసిన బాధ్యత వ్యక్తిగతంగా మనకు ఉందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేవలం వార్తాపత్రికలను లేక రేడియో ప్రసారాలను ఆ పని చేయనిస్తే సరిపోదు. వేలాదిమంది యథార్థ క్రైస్తవులు—పురుషులు, స్త్రీలు, యౌవనులు—ఆ బాధ్యతను చేపట్టారు. ఫలితంగా, ఇంటింటి పరిచర్య యెహోవాసాక్షుల గుర్తింపు చిహ్నంగా తయారైంది.—అపొస్తలుల కార్యములు 5:42; 20:20.
లోకమంతటికి చేరుట
13, 14. (ఎ) కొంతమంది సాక్షులు తమ పరిచర్యను కొనసాగించటానికి వేరే పట్టణాలకు, వేరే దేశాలకు కూడా ఎందుకు వెళ్లారు? (బి) తమ జన్మ స్థలంలోని మనుష్యుల యెడల కొంతమందికి గల శ్రద్ధ సువార్తను వ్యాప్తి చేయటానికి ఎలా సహాయం చేసింది?
13 రాజ్య వర్తమానం లోకమందంతటను ప్రకటించబడాలని తెలుసుకుని, కొంతమంది యెహోవాసాక్షులు తమ స్వంత ప్రాంతం వెలుపలవున్న స్థలాలను చేరటానికి వ్యక్తిగతంగా తాము ఏమి చేయగలమని గంభీరంగా తలంచారు
14 అనేకమంది తమ జన్మస్థలం నుండి దూరంగా వెళ్లిన తర్వాత సత్యం నేర్చుకున్నారు. వాళ్లు వస్తుసంబంధ ప్రయోజనం కొరకు మారినప్పటికీ, మరెంతో ప్రశస్తమైనది కనుగొన్నారు, సత్యాన్ని పంచుకోటానికి తమ జన్మస్థలాలకు లేక దేశాలకు తిరిగి వెళ్లటానికి కొంతమంది పురికొల్పబడ్డారు. అలా, ఈ శతాబ్దపు తొలికాలంలో సువార్త ప్రకటన పని స్కాండినేవియా, గ్రీసు, ఇటలీ, తూర్పు ఐరోపా దేశాలు, మరితర అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు కూడా, 1990వ పడిలో, రాజ్య వర్తమానం అదే విధంగా విస్తరిస్తూ ఉంది.
15. యెషయా 6:8 నందు వ్యక్తపర్చబడినటువంటి దృక్పథాన్ని కలిగివున్న కొంతమందిచే 1920 మరియు 1930 పడులలో ఏమి సాధించబడింది?
15 దేవుని వాక్యంలోని ఉపదేశాన్ని తమ జీవితాలకు అన్వయించుకొని, కొందరు తాము మునుపు నివసించని స్థలాల్లో కూడా సేవ చేయడానికి తమను తాము లభ్యమయ్యేలా చేసుకొన్నారు. వీరిలో (తరచూ “బైబిల్ బ్రౌన్” అని పిలువబడే) డబ్ల్యూ. ఆర్. బ్రౌన్ ఒకరు. సువార్త పనిని వ్యాప్తిచేయుట కొరకు 1923లో, ఆయన ట్రినిడాడ్ నుండి పశ్చిమాఫ్రికాకు వెళ్లాడు. రాజ్య వర్తమానాన్ని ఆఫ్రికా తూర్పు తీరం వరకు తీసుకువెళ్లిన వారిలో ఫ్రాంక్ మరియు గ్రే స్మిత్, రాబర్ట్ నిస్బెట్, డేవిడ్ నార్మన్లు కూడా ఉన్నారు. ఇతరులు దక్షిణమెరికా ప్రాంతంలో సేవచేయడానికి సహాయపడ్డారు. జార్జ్ యంగ్ అనే కెనడా దేశస్థుడు 1920వ పడి తొలిభాగంలో అర్జెంటీనా, బ్రెజిల్, బొలీవియా, చిల్, పెరూలలో పరిచర్యలో భాగం వహించాడు. స్పెయిన్‌లో సేవచేసిన జాన్ మునీజ్ అర్జెంటీనా, చిల్, పరాగ్వే, ఉరుగ్వేలలో కూడా సేవచేశాడు. వీరంతా “నేనున్నాను నన్నుపంపుము” అని యెషయా 6:8 నందు వ్యక్తపర్చబడినటువంటి స్ఫూర్తినే ప్రదర్శించారు.
16. యుద్ధానికి ముందు సంవత్సరాల్లో జనాబా ఎక్కువగావున్న ప్రాంతాల్లోనే కాక మరెక్కడ కూడా సాక్ష్యమివ్వటం జరిగింది?
16 సువార్త ప్రకటన పని ఇంకా సుదూర ప్రాంతాలకు కూడా చేరుతూ ఉంది. సాక్షులచే నడుపబడే పడవలు న్యూఫౌండ్లాండ్ తీరాలన్నిటినీ, ఆర్కిటిక్ వరకు వున్న నార్వీజెన్ తీరంను, పసిఫిక్ ద్వీపాలను, ఆగ్నేయాసియా తీరాలను సందర్శించేవి.
17. (ఎ) సాక్షులు 1935 నాటికి ఎన్ని దేశాలను చేరారు? (బి) ఆ సమయంలో పని ఎందుకు ముగియలేదు?
17 ఆశ్చర్యకరమైన విధంగా, 1935వ సంవత్సరం నాటికెల్లా, యెహోవాసాక్షులు 115 దేశాల్లో ప్రకటిస్తూ పనిరద్దీని కలిగివుండిరి, సాక్ష్యపు యాత్రల మూలంగా లేక పోస్టు ద్వారా పంపబడిన సాహిత్యం ద్వారా మరో 34 దేశాలను వారు చేరారు. అయినప్పటికీ, పని ముగియలేదు. ఆ సంవత్సరం, యెహోవా, తన నూతన లోకంలోకి రక్షించబడే “ఒక గొప్ప సమూహాన్ని” పోగుచేయాలనే తన సంకల్పాన్ని వారు తెలుసుకొనేలా చేశాడు. (ప్రకటన 7:9, 10, 14) మరెంతో సాక్ష్యపు పని చేయవలసి ఉండెను!
18. రాజ్య ప్రకటన పనిలో గిలియడ్ పాఠశాల, పరిచారకుల శిక్షణ పాఠశాలలు ఏ పాత్ర వహించాయి?
18 రెండవ ప్రపంచ యుద్ధం భూమిని ముంచెత్తినప్పుడును, సాహిత్యంపైన లేదా అనేక దేశాల్లో యెహోవాసాక్షుల పనిపై నిషేధం విధించబడినప్పుడును, యింకా గొప్పగా అంతర్జాతీయ రాజ్య ప్రకటన పని చేయగలిగేలా భవిష్యత్ మిషనరీలకు తర్ఫీదు నివ్వడానికి వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ ప్రారంభించబడింది. చెప్పాలంటే, 200 కంటే ఎక్కువ దేశాల్లో గిలియడ్ పట్టభద్రులు సేవచేశారు. వారు కేవలం సాహిత్యం అందజేసి మరో ప్రాంతానికి వెళ్లిపోలేదు. వారు బైబిలు పఠనాలు నిర్వహించారు, కూటాలు ఏర్పాటు చేశారు, దైవపరిపాలనా బాధ్యతను చేపట్టగలిగేలా ప్రజలకు తర్ఫీదునిచ్చారు. ఇటీవల, పరిచారకుల శిక్షణా పాఠశాల నుండి పట్టభద్రులైన పెద్దలు, పరిచారకులు కూడా ఆరు ఖండాలలో ఈ పనికి సంబంధించిన ప్రాముఖ్యమైన అవసరతలు తీర్చడానికి సహాయం చేశారు. సమగ్ర అభివృద్ధి కొరకై గట్టి పునాది వేయబడింది.—2 తిమోతి 2:2ను పోల్చండి.
19. అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవచేయటానికి ఇవ్వబడిన ఆహ్వానానికి యెహోవా సేవకులు ఎంతమేరకు ప్రతిస్పందించారు?
19 పనిచేయబడని కొన్ని ప్రాంతాల్లో ఇతరులు సహాయం చేయటానికి వీలౌతుందా? ప్రపంచ వ్యాప్త సమావేశాల్లో, 1957లో వ్యక్తులు, కుటుంబాలు అనగా యెహోవా యొక్క పరిణతి చెందిన సాక్షులు—అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలి వెళ్లి, అక్కడే నివాసం ఏర్పరచుకోవటాన్ని గూర్చి తలంచమని ప్రోత్సహింపబడ్డారు. ఆ ఆహ్వానం అపొస్తలుడైన పౌలుకు దేవుడిచ్చిన లాంటి ఆహ్వానంవలెనే ఉంది, ఆయన దర్శనంలో ఒక వ్యక్తి ఇలా చెప్పటాన్ని చూశాడు: “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుము.” (అపొస్తలుల కార్యములు 16:9, 10) కొంతమంది 1950వ దశాబ్దంలో, మరి కొంతమంది ఆ తర్వాత తరలి వెళ్లారు. దాదాపు ఒక వెయ్యి మంది సాక్షులు ఐర్లాండుకు, అలాగే కొలంబియాకు వెళ్లారు; వందలాది మంది అనేక ఇతర ప్రాంతాలకు వెళ్లారు. తమ స్వంత దేశంలోనే అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వేలాది మంది తరలివెళ్లారు.—కీర్తన 110:3.
20. (ఎ) మత్తయి 24:14 నందలి యేసు ప్రవచన నెరవేర్పుగా 1935 నుండి ఏమి సాధించబడింది? (బి) గత కొద్ది సంవత్సరాల్లో, పని ఎలా ఉధృతం చేయబడింది?
20 యెహోవా ఆశీర్వాదం తన ప్రజలపై ఉండగా, రాజ్య ప్రకటన పని విశేషమైన వేగంతో ముందుకు వెళ్తోంది. ప్రచారకుల సంఖ్య 1935 నుండి దాదాపు 80 అంతలు పెరిగింది, పయినీరు ర్యాంకుల్లో అభివృద్ధి ప్రచారకుల అభివృద్ధి కన్నా 60 శాతం ఎక్కువగా ఉంది. గృహ బైబిలు పఠనాల ఏర్పాటు 1930వ పడిలో ప్రారంభించబడింది. ప్రతి నెల సరాసరి 45 లక్షలకంటే ఎక్కువ బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నాయి. రాజ్య ప్రచార పని కొరకు 1935 నుండి 1,500 కోట్ల కంటే ఎక్కువ గంటలు కేటాయించబడ్డాయి. క్రమమైన సువార్త ప్రకటన పని ఇప్పుడు 231 దేశాల్లో జరుగుతుంది. తూర్పు ఐరోపా, ఆఫ్రికా ప్రాంతాల్లో సువార్త ప్రకటన పని స్వేచ్ఛగా కొనసాగటానికి వీలయ్యింది, రాజ్య వర్తమానం ప్రేక్షకుల యెదుట ప్రముఖంగా ప్రదర్శించబడడానికి అంతర్జాతీయ సమావేశాలు ప్రభావవంతంగా ఉపయోగించబడ్డాయి. యెహోవా ఎంతో కాలం క్రితం, యెషయా 60:22 నందు వాగ్దానం చేసినట్లుగా, ఆయన నిజంగా ‘తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుచున్నాడు.’ దానిలో భాగం వహించటం మనకెంతటి గొప్ప ఆధిక్యత!
సాధ్యమైన ప్రతి ఒక్కరిని సువార్తతో చేరుట
21, 22. మనమెక్కడ సేవ చేస్తున్నప్పటికీ, ఎక్కువ ఫలవంతంగా ఉండటానికి మనం వ్యక్తిగతంగా ఏమి చేయవచ్చు?
21 పని ముగిసిందని ప్రభువు ఇంకా చెప్పలేదు. అనేక వేలమంది ఇప్పటికీ సత్యారాధనను చేపడుతున్నారు. గనుక ఉత్పన్నమయ్యే ప్రశ్నేమిటంటే, యెహోవా సహనం ఈ పని చేయుటకు అనుమతించిన సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొనుటకు మనకు సాధ్యమైనదంతా మనం చేస్తున్నామా?—2 పేతురు 3:15.
22 అసలు పనిచేయని ప్రాంతానికి ప్రతి ఒక్కరూ వెళ్లలేక పోవచ్చు. కాని మీకు తెరువబడివున్న అవకాశాలన్నిటిని మీరు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారా? మీ తోటి పని వారికి, ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు మీరు సాక్ష్యమిస్తారా? మీ ప్రాంతంలోని మారే పరిస్థితులకు అనుగుణ్యంగా మీరు మార్పు చేసుకుంటున్నారా? మారే పని విధానాలను బట్టి కేవలం కొద్దిమంది మాత్రమే గృహాల వద్ద ఉండవచ్చు, అలాంటి వారిని సాయంకాలాల్లో దర్శించటానికి తగిన విధంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారా? భవనాలు, ఆహ్వానింపబడని సందర్శకులు లోనికి అనుమతించబడని విధంగా కట్టబడి ఉంటే, మీరు టెలిఫోను ద్వారా లేక పోస్టు ద్వారా సాక్ష్యమిస్తున్నారా? ఆసక్తి ఉన్నట్లు కనుగొంటే మీరు గృహ బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్నారా? మీరు మీ పరిచర్యను సంపూర్ణంగా చేస్తున్నారా?—అపొస్తలుల కార్యములు 20:21ను పోల్చండి; 2 తిమోతి 4:5.
23. మనం ఆయన సేవలో ఏం చేస్తున్నామో యెహోవా గమనిస్తుంటాడు గనుక, మన విషయంలో ఏది వాస్తవమై ఉండాలి?
23 ఈ ప్రత్యేకమైన కాలాల్లో ఆయన సాక్షులుగా ఉండగలిగే గొప్ప ఆధిక్యత మనకివ్వబడినందుకు మనం నిజంగా మెచ్చుకుంటున్నామని యెహోవాకు స్పష్టంగా చూపించగలిగేలా మనమందరం మన పరిచర్యను కొనసాగిద్దాము. కలుషిత పాత విధానంపై యెహోవా తీర్పు విధించి, యేసుక్రీస్తు మహిమాన్విత వెయ్యేండ్ల పరిపాలనను ప్రవేశ పెట్టడాన్ని మనం కళ్లారా చూసే ఆధిక్యత కలిగివుందాము!
[అధస్సూచీలు]
a పంతొమ్మిది వందల తొంభైయవ దశాబ్ద తొలిభాగంలో భూమి విభాగింపబడిన దాని ప్రకారం లెక్కించటం జరిగింది.
పునఃసమీక్షలో
◻ రాజ్య వర్తమానం ప్రకటించటం ఎందుకంత ప్రాముఖ్యము?
◻ సువార్త 1914 వరకు ఎంతమేరకు ప్రకటించబడింది?
◻ రాజ్యం స్థాపించబడిన తర్వాత ఎంత ఉధృతమైన సాక్ష్యం ఇవ్వబడింది?
◻ పరిచర్యలో మన వంతును మరింత ఫలవంతం చేయగల్గేదేమిటి?
[16, 17వ పేజీలోని బాక్సు]
యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు
ప్రపంచ వ్యాప్తంగా 1993-94 కాలంలో వందలాది సమావేశాల్లో, జెహోవాస్ విట్నెసెస్—ప్రొక్లెయిమర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనే పేరుగల ఒక క్రొత్త పుస్తకం విడుదలను గూర్చి ప్రకటించబడింది. ఇది యెహోవాసాక్షులకు సంబంధించిన అధిక సమాచారం గల, విస్తృత చరిత్ర. అది 96 వేర్వేరు దేశాల నుండి సేకరించబడిన వెయ్యి కంటే ఎక్కువ చిత్రాలు కలిగి, అందంగా రూపొందించబడిన 752 పేజీల పుస్తకం. అది 1993 చివరి నాటికి 25 భాషల్లో ప్రచురింపబడింది, ఇంకా అనేక భాషల్లోకి అనువదించబడుతోంది.
ఆ పుస్తకాన్ని సమయానుకూలమైనదానిగా చేస్తున్నదేమిటి? ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు యెహోవాసాక్షులయ్యారు. వారు సహవాసం చేస్తున్న సంస్థ చరిత్రను గూర్చి వారందరు బాగా ఎరిగినవారై ఉండాలి. అంతేగాక, వారి ప్రకటన పని, ఆరాధనా విధానం ప్రపంచ వ్యాప్త జాతి, వర్గ గుంపులలో ప్రవేశించి, అన్ని ఆర్థిక, విద్యాసంబంధ స్థాయిలలోను, యౌవనస్థులు, పెద్దలు మొదలైన ప్రజలందరిచే హత్తుకొనబడింది. ఫలితంగా, జరుగుతున్న దాన్ని గమనిస్తున్న అనేకులకు సాక్షుల నమ్మకాల గురించే కాదు, వారి మూలం, వారి చరిత్ర, వారి సంస్థ, వారి ఉద్దేశాల గురించి కూడా ప్రశ్నలుంటాయి. ఇతరులు వారి గురించి వ్రాశారు కాని ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా మాత్రం కాదు. అయినా, ఆధునిక దిన యెహోవాసాక్షుల చరిత్ర గురించి స్వయంగా సాక్షులకు తప్ప మరెవరికీ అంతగా తెలియదు. ఈ పుస్తక సంపాదకులు ఆ చరిత్రను ఒక లక్ష్యంతో, యథార్థమైన విధంగా అందజేయటానికి ప్రయత్నించారు. అలా చేయడంలో, మత్తయి 24:14 నందు వ్రాయబడిన క్రీస్తు ప్రత్యక్షతయొక్క సూచనలోని అత్యంత ప్రముఖ అంశం, ఇప్పటి వరకు కలిగియున్న నెరవేర్పును వ్రాశారు మరియు అక్కడ ప్రవచించబడిన పనిలో లోతుగా పాల్గొన్నవారు మాత్రమే అందించగల వివరాలతో దానిని వ్రాశారు.
ఈ పుస్తకం ప్రాముఖ్యంగా ఏడు భాగాలుగా విభాగింపబడింది:
భాగము 1: ఈ భాగం యెహోవాసాక్షుల చారిత్రక ప్రారంభ మూలాన్ని వివరిస్తుంది. దానిలో 1870 నుండి 1992 వరకు గల వారి ఆధునిక దిన చరిత్ర యొక్క సంక్షిప్త, సమాచారంతో కూడిన స్థూలదృష్టి కూడా చేరివుంది.
భాగము 2: ఇందులో యెహోవాసాక్షులను ఇతర మత గుంపుల నుండి వేరుపర్చే నమ్మకాల క్రమమైన అభివృద్ధి యొక్క పునఃసమీక్ష ఉంది.
భాగము 3: ఈ పుస్తకంలోని ఈ భాగం వారి సంస్థ రూపం యొక్క అభివృద్ధిని పరిశీలిస్తుంది. వారి సంఘ కూటములు, సమావేశాలు, అలాగే వారు రాజ్య మందిరాలను, పెద్ద సమావేశ హాళ్లను నిర్మించే విధానం, బైబిలు సాహిత్యాన్ని ప్రచురించడానికున్న సౌకర్యాలు వంటి వాటి గురించిన ఆసక్తికరమైన వాస్తవాలను ఇది తెలియజేస్తుంది. దేవుని రాజ్యాన్ని ప్రకటించటంలో యెహోవాసాక్షులకు గల ఆసక్తిని, కష్టసమయాల్లో వారు ఒకరి యెడల ఒకరు శ్రద్ధ వహించడంలో చూపే ప్రేమను అది తెలియజేస్తుంది.
భాగము 4: విశ్వ వ్యాప్తంగా ప్రముఖ దేశాలకు, సుదూర ద్వీపాలకు దేవుని రాజ్యం ఎలా ప్రకటించబడిందనే అద్భుతమైన వివరాలను ఇక్కడ మీరు కనుగొంటారు. పంతొమ్మిది వందల పద్నాల్గవ సంవత్సరంలో 43 దేశాల్లోను, అయితే 1992 నాటికి 229 దేశాల్లో ప్రకటించటాన్ని ఒక్కసారి ఊహించండి! ఈ విశ్వ వ్యాప్త పనిలో భాగం వహించిన వారి అనుభవాలు వాస్తవానికి హృదయవిదారకమైనవి.
భాగము 5: రాజ్య ప్రకటన యొక్క ఈ పనినంతటినీ నెరవేర్చుట కొరకు బైబిళ్లను అలాగే బైబిలు సాహిత్యాన్ని రెండు వందలకంటే ఎక్కువ భాషల్లో ప్రచురించటానికి అంతర్జాతీయ సౌకర్యాలను అభివృద్ధి చేయడం అవసరమైంది. ఇక్కడ మీరు వారి పని యొక్క ఆ అంశాన్ని గూర్చి తెలుసుకొంటారు.
భాగము 6: సాక్షులలో కొంతమంది మానవ అపరిపూర్ణత వల్ల, ఇతరులు అబద్ధ సహోదరులవల్ల, ఇంకా అనేకమంది తీవ్రమైన హింసవల్ల శ్రమలను కూడా ఎదుర్కొన్నారు. పరిస్థితి అలాగే ఉంటుందని దేవుని వాక్యం హెచ్చరించింది. (లూకా 17:1; 2 తిమోతి 3:12; 1 పేతురు 4:12; 2 పేతురు 2:1, 2) వాస్తవంగా ఏం జరిగిందో, విజయవంతులు కావటానికి యెహోవాసాక్షులకు విశ్వాసం ఎలా సహాయం చేసిందో పుస్తకం యొక్క ఈ భాగం విశదంగా తెలియజేస్తుంది.
భాగము 7: చివరగా, తాము భాగమైయున్న సంస్థ నిజంగా దేవునిచే నడిపించబడుతున్నదని యెహోవాసాక్షులు ఎందుకు దృఢంగా నమ్ముతారో ఆ పుస్తకం తెలియజేస్తుంది. వారు వ్యక్తిగతంగా, సంస్థాపరంగా మెలకువ కలిగివుండవలసిన అవసరం ఉందని వారెందుకు భావిస్తారో అది చర్చిస్తుంది.
పైన చెప్పబడినవే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా యెహోవాసాక్షులచే ఉపయోగించుకొనబడుతున్న ప్రపంచ ముఖ్య కార్యాలయాలను అలాగే బ్రాంచి సౌకర్యాలను చూపించే అందమైన, అధిక సమాచారంతో కూడిన 50 పేజీల చిత్రాల విభాగం కూడా ఆకర్షణీయంగా రూపొందించబడిన ఈ పుస్తకంలో చేరివుంది.
మీరు ఇప్పటికే చదవకపోతే, ఈ అద్భుతమైన ప్రచురణను పొంది చదవటం ద్వారా మీరు నిజంగా ప్రయోజనం పొందుతారు.
దాన్ని చదివిన కొంతమంది వ్యాఖ్యలు
ఈ పుస్తకాన్ని ఇప్పటికే చదివినవారి ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి? ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి:
“జెహోవాస్ విట్నెసెస్—ప్రొక్లెయిమర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనే అద్భుతమైన, సజీవమైన పుస్తకాన్ని నేను ఇప్పుడే చదవటం ముగించాను. నమ్మకంగా, వినయంగా సత్యానికి కట్టుబడివుండే సంస్థ మాత్రమే అంత సూటిగా, ధైర్యంగా, సున్నితంగా వ్రాయగలదు.”
“దాని యథార్థత, సరళతను బట్టి అది అపొస్తలుల కార్యముల పుస్తకంలా ఉంది.”
“ఎంత చమత్కారవంతమైన క్రొత్త ప్రచురణ! . . . అది చారిత్రాత్మక ఉత్తమరచన.”
సగం పుస్తకం చదివిన తర్వాత ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “నేను ఆశ్చర్యపోయాను, చకితుణ్ణయ్యాను, దాదాపు కన్నీళ్లు వచ్చాయి. . . . నా వయస్సంతటిలో మరే ఇతర ప్రచురణ కూడా ఇంత భావావేశంతో కదిలించేదిగా ఉండలేదు.”
“యౌవనస్థుల విశ్వాసాన్ని, అలాగే నేడు సంస్థలోకి క్రొత్తగా వస్తున్నవారి విశ్వాసాన్ని ఈ పుస్తకం ఎలా బలపరచగలదని నేను తలంచిన ప్రతిసారి నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది.”
“నేను ఎల్లప్పుడు సత్యాన్ని మెచ్చుకొన్నాను, కాని దానంతటి వెనుక యెహోవా పరిశుద్ధాత్మ ఉందన్న విషయాన్ని ఈ పుస్తకం చదవటం వల్ల గుణగ్రహించాను.”
[18వ పేజీలోని చిత్రాలు]
సాక్షులు సంఖ్యలో కొద్దిమందే ఉన్నప్పుడు కూడా అనేకమంది ప్రజలకు రాజ్య సమాచారం అందజేయబడింది