కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/1 పేజీలు 29-31
  • ‘మోసకరమైన కథల్ని విసర్జించుడి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మోసకరమైన కథల్ని విసర్జించుడి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యం యొక్క పరీక్షించే మాటలు
  • మానవాతీత కథలు
  • దయ్యాల సాక్ష్యాన్ని నిరాకరించుట
  • అధ్యయనం కోసం చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మీరు నేర్చుకొన్న వాటిని ఆచరిస్తూనే ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా ఇచ్చే స్పష్టమైన హెచ్చరికలను మీరు పాటిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • అపవాదిని ఎదిరించండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/1 పేజీలు 29-31

‘మోసకరమైన కథల్ని విసర్జించుడి’

బైబిలు అంతా ప్రజల అనుభవాలతో, కథలతో నిండి ఉంది. మనం వాటిని చదవడాన్ని ఆనందించడమే కాదు గాని వాటి నుండి మనం ప్రయోజనం కూడా పొందవచ్చు. రోమాలో ఉన్న క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.”—రోమీయులు 15:4.

అనుభవాలను చెప్పడంలో పౌలు తానే భాగం వహించాడు. పౌలు బర్నబాల మొదటి మిషనరీ యాత్ర ముగింపును గూర్చి బైబిలు ఇలా చెబుతుంది: “వారు [సిరియలోని అంతియొకకు] వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు . . . వివరించిరి.” (అపొస్తలుల కార్యములు 14:27) నిస్సందేహంగా ఈ అనుభవాలతో సహోదరులు గొప్పగా ప్రోత్సహింపబడ్డారు.

అయినా, అన్ని అనుభవాలు ప్రోత్సాహకరమైనవి కావు. ప్రేరేపింపబడినవాడై పౌలు తిమోతిని ఇలా హెచ్చరించాడు: ‘అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను, మోసకరమైన కథల్ని విసర్జించుడి.’ (1 తిమోతి 4:7) యథార్థ క్రైస్తవులు “యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టకూడదని” ఆయన తీతుకు వ్రాసాడు.—తీతు 1:14.

ఈ మోసకరమైన కథలు లేక కల్పనా గాథలు ఏమిటి? ఈ రెండు పదాలు మైతోస్‌ (“కల్పన”) అనే గ్రీకు పదం నుండి వస్తున్నాయి. ఈ పదం “వాస్తవంతో సంబంధం లేని (మతపరమైన) కథ” అని వివరిస్తుందని ది ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా తెలియజేస్తుంది.

పౌలు కాలంనాటి లోకం పూర్తిగా అలాంటి కథలతోనే నిండిపోయింది. బహుశ పౌలు కాలం కంటే దాదాపు రెండు వందల సంవత్సరాలకన్నా ముందే వ్రాయబడిన తోబిత్‌ యొక్క అప్రమాణిక పుస్తకం దానికి ఒక ఉదాహరణ. ఈ కథ మనకు ఒక సదాచార యూదుని గురించి తెలియజేస్తుంది, అతని కంట్లో పక్షి రెట్ట పడటం వల్ల అంధుడౌతాడు. తరువాత అతడు అప్పును వసూలు చేసుకుని రావటానికి తన కుమారుడైన తోబయస్‌ను పంపిస్తాడు. దారిలో ఒక దూత నడిపింపు ద్వారా తోబయస్‌ ఒక చేప గుండె, కాలేయం, పిత్తాశయాలను సంపాదించుకుని వస్తాడు. తరువాత అతడు ఒక విధవరాలిని కలుస్తాడు, ఆమెకు ఏడు సార్లు వివాహమైనప్పటికీ, ఆమె ప్రతి భర్తను పెళ్లిరోజు రాత్రే ఒక దయ్యం చంపేస్తుంది, కాబట్టి ఆమె కన్యగానే ఉంటుంది. దూత చెప్పడంతో తోబయస్‌ ఆమెను వివాహం చేసుకుని, చేప గుండెను, కాలేయాన్ని కాల్చడం ద్వారా దయ్యాన్ని వెళ్లగొట్టేస్తాడు. చేప పిత్తాశయంతో అతడు తరువాత తన తండ్రి చూపును తిరిగి వచ్చేలా చేస్తాడు.

స్పష్టంగా ఈ కథ నిజంకాదు. అది కల్పితమైంది, మూఢ నమ్మకాన్ని ఉన్నత పర్చేదే కాకుండా, దానిలో తప్పు ఉంది. ఉదాహరణకు తోబిత్‌ ఉత్తర తెగలవారి తిరుగుబాటును, ఇశ్రాయేలీయులు నీనెవెకు కొనిపోబడటాన్ని కూడా చూశాడని వృత్తాంతం తెలియజేస్తుంది, ఇశ్రాయేలు చరిత్రలో ఈ రెండు సంఘటనల మధ్య 257 సంవత్సరాల కాలం ఉంది. అయినా, తోబిత్‌ చనిపోయేనాటికి 112 సంవత్సరాలవాడని కథ తెలియజేస్తుంది.—తోబిత్‌ 1:4, 11; 14:1, ది జెరూసలేమ్‌ బైబిల్‌.

దేవుని విశ్వాసులైన సేవకుల ద్వారా చెప్పబడిన సత్యవంతమైన “హితవాక్య ప్రమాణము”నకు అలాంటి కల్పనాకథలు అపరిచితం. (2 తిమోతి 1:13) అవి ఊహించి చెప్పబడినవి, అవి చారిత్రక వాస్తవానికి విరుద్ధమైనవి, అవి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లే. ఇలాంటి కథలను క్రైస్తవులు విసర్జించాలి.

సత్యం యొక్క పరీక్షించే మాటలు

అలాంటి కథలే ఈనాడు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. పౌలు ఇలా వ్రాశాడు: “[జనులు] హితబోధను సహింపక, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.” (2 తిమోతి 4:3, 4) భూమి యందలి కొన్ని ప్రాంతాల్లో, మానవాతీత కథలు చాలా వ్యాప్తి చెందివున్నాయి, జనాదరణ పొందాయి. కాబట్టి క్రైస్తవులు, మతపరమైన కథలు బైబిలుకు అనుగుణ్యంగా ఉన్నాయో లేదో చూడటానికి జ్ఞానయుక్తంగా, వాటి “మాటలను పరీక్షించాలి.”—యోబు 12:11.

స్పష్టంగా అనేకం బైబిలుకు అనుగుణ్యంగా లేవు. ఉదాహరణకు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, మానవ ఆత్మ అమర్త్యమైనదనే ఉద్దేశాన్ని సమర్థించే కథలు వినడం సామాన్యం. క్రొత్తగా జన్మించిన శిశువు శరీరంలో, లేక ఒక ఆత్మగా, లేక జంతువుగా, లేక వేరే స్థలంలో ఉండే వ్యక్తిగా తిరిగి కనిపించటానికే ఒక వ్యక్తి ఎలా మరణిస్తాడో ఈ కథలు వర్ణిస్తాయి.

అయినప్పటికీ, మానవ ఆత్మలు అమర్త్యమైనవి కావని, ఆత్మలు చనిపోతాయని దేవుని వాక్యం చూపిస్తుంది. (యెహెజ్కేలు 18:4) అంతేకాక, మృతులు సమాధిలో నిర్జీవంగా ఉంటారని, ఆలోచించలేరని, మాట్లాడలేరని, మరేమి చేయలేరని బైబిలు చెబుతున్నది. (ప్రసంగి 9:5, 10; రోమీయులు 6:23) అలా, ఆత్మ అమర్త్యమైనదనే ఉద్దేశాన్ని ప్రోత్సహించే అబద్ధ కథలచే మోసగింపబడినవారు, పౌలు చెప్పినట్లుగా, బైబిలు యొక్క “హితబోధను” “సహించని” వారు.

మానవాతీత కథలు

ఇతర కథలు గారడీ, మాంత్రికుల పనులకు సంబంధించినవి. ఉదాహరణకు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, ఈ గారడీలకు, మాంత్రికులకు భయంకరమైన శక్తులు ఉంటాయని, వారు తమను తాము లేక ఇతరులను సరీసృపాలు, కోతులు, పక్షులలా మార్చివేయగలరని; తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి గాలిలో ఎగురగలరని; ప్రత్యక్షం, అదృశ్యం కాగలరని; గోడలలో నుండి వెళ్లగలరని; భూమిలో పాతిపెట్టిన వస్తువులను చూడగలరని చెప్పబడుతుంది.

అలాంటి కథలు విస్తృతంగా నమ్మబడుతూ, అత్యధికంగా ఉన్నాయి గనుక, అవి నిజమేనని క్రైస్తవ సంఘంలోని కొంతమంది కూడా నమ్మేలా ప్రభావితం చేయబడవచ్చు. సాధారణ మానవులు అలాంటి పనులు చేయలేకపోయినప్పటికీ, ఆత్మీయ ప్రాణులైన దయ్యాల నుండి మానవాతీత శక్తులను పొందిన వారు అలాంటివి చేయగలరని వారు తర్కించవచ్చు. ఈ ముగింపుకు బహుశా 2 థెస్సలొనీకయులు 2:9, 10 ఆధారం కావచ్చు, అదిలా చెబుతుంది: “నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యం విషయమైన ప్రేమను అవలంభింపక పోయిరి గనుక, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్నవారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును.”

సాతాను శక్తివంతమైన పని చేసే సమర్థత కలిగివున్నట్లు ఈ లేఖనం చూపిస్తుందన్నది నిజమే కాని, సాతాను “అబద్ధ విషయమైన సమస్త బలమునకు, నానావిధములైన సూచకక్రియలకు” అలాగే “దుర్నీతిని పుట్టించు సమస్త మోసమునకు” మూలకర్త అని కూడా అది తెలియజేస్తుంది. అలాగే, సాతాను “సర్వలోకమును మోసపుచ్చుచున్న” ప్రధాన మోసగాడని బైబిలు చూపిస్తున్నది. (ప్రకటన 12:9) నిజంకాని విషయాలను ప్రజలు నమ్మేలా చేయడంలో అతడు సిద్ధహస్తుడు.

దీని మూలంగా, అభిచారం, మాంత్రిక విద్యలలో ఇమిడివున్న వారి సాక్ష్యాలు, ఒప్పుకోవటాలు కూడా నమ్మబడటం లేదు. అలాంటి ప్రజలు నిజంగా తాము అలాంటివి చూసి, విని, లేక అనుభవించామని నమ్మవచ్చు; అయినా, వాస్తవానికి, వారలా చేయలేదు. ఉదాహరణకు, చనిపోయినవారి ఆత్మలతో సంభాషించామని అనుకునేవారు ఉన్నారు. కాని వారు పొరపాటు పడుతున్నారు, మోసగింపబడుతున్నారు, వారు సాతాను మోసానికి బలౌతున్నారు. మృతులు “మౌనస్థితిలోనికి దిగిపోతారని” బైబిలు చెబుతున్నది.—కీర్తన 115:17.

మోసాన్ని గూర్చిన అపవాది యొక్క చరిత్ర దృష్ట్యా, మానవాతీత కథల నిజత్వం ఏవిధంగానైనా శంకించదగినది. వాటిలో అనేకం మూఢ నమ్మకాల ఊహాకల్పనలు, మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా అవి ఎక్కువ చేయబడ్డాయి.

అలాంటి కల్పనా కథలను మళ్లీ మళ్లీ చెబితే, అబద్ధానికి జనకుడైన అపవాదియగు సాతాను ఆసక్తులు పెంపొందింప బడతాయి. (యోహాను 8:44) యెహోవాకు హేయమైన తాంత్రిక ఆచారాలలో అవి ఆసక్తిని రేకెత్తిస్తాయి. (ద్వితీయోపదేశకాండము 18:10-12) అవి ప్రజలను భయం, మూఢనమ్మకాల సాలెగూటిలో చిక్కుకునేలా చేస్తాయి. అందుకే పౌలు క్రైస్తవులకు “కల్పనాకథలను . . . లక్ష్యపెట్టవద్దని” సలహా ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు.—1 తిమోతి 1:3, 4.

దయ్యాల సాక్ష్యాన్ని నిరాకరించుట

ఒకవేళ ఆ కథలు నిజంలా అనిపిస్తే అప్పుడెలా? కొన్నిసార్లు, దయ్యాలు లేక దయ్యం పట్టినవాళ్లు యెహోవా ఉన్నతత్వాన్ని, ఆయన సాక్షుల నిజత్వాన్ని గూర్చి చెప్పిన అనుభవాలు చెప్పబడ్డాయి. క్రైస్తవులు అలాంటి కథలను మళ్లీ మళ్లీ చెప్పాలా?

లేదు, వారలా చెప్పకూడదు. యేసు దేవుని కుమారుడని అపవిత్రాత్మలు కేకలు వేసినప్పుడు, “తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాడని” బైబిలు చెబుతున్నది. (మార్కు 3:12) అలాగే, పౌలు బర్నబాలు “సర్వోన్నతుడైన దేవుని దాసులని” “రక్షణమార్గము ప్రచురించువారని” చెప్పడానికి ఒక బాలికను దయ్యము పురికొల్పినప్పుడు, పౌలు ఆమెలో నుండి దయ్యాన్ని వెళ్లగొట్టాడు. (అపొస్తలుల కార్యములు 16:16-18) యేసు గాని, పౌలు గాని, లేక బైబిలు రచయితలెవరైనా గాని దయ్యాలు దేవుని సంకల్పాన్ని గురించి, లేక ఆయన ఎన్నుకొనబడిన సేవకుల గురించి సాక్ష్యమివ్వటాన్ని అనుమతించలేదు.

భూమి మీదికి రాకముందు యేసుక్రీస్తు కూడా ఆత్మీయ లోకంలోనే జీవించాడన్నది గమనించదగిన విషయము. ఆయనకు సాతాను వ్యక్తిగతంగా తెలుసు. అయినప్పటికీ, యేసు తన శిష్యులను సాతాను చర్యలతో రంజింపజేయలేదు, లేక అపవాది ఏమి చేయగలడు, ఏమి చేయలేడు అనే వివరాలను వారికి తెలియజేయలేదు. సాతాను అతని దయ్యాలు యేసుకు స్నేహితులు కారు. వారు వెలివేయబడినవారు, తిరుగుబాటు చేసేవారు, పరిశుద్ధమైన దానిని అసహ్యించుకునేవారు, దేవుని శత్రువులు.

మనం ఏమి తెలుసుకోవలసిన అవసరం ఉందో బైబిలు మనకు చెబుతుంది. దయ్యాలు ఎవరో, వారు మనుష్యులను ఎలా తప్పుదోవపట్టిస్తారో, వారిని మనం ఎలా తప్పించుకోవచ్చో అది మనకు వివరిస్తుంది. యెహోవా, యేసు దయ్యాల కంటే ఎంతో శక్తిమంతులని అది చూపిస్తుంది. మనం యెహోవాను యథార్థంగా సేవిస్తే, దుష్టాత్మలు మనకు ఏవిధమైన శాశ్వత హానిని చేయలేవని అది మనకు బోధిస్తుంది.—యాకోబు 4:7.

అందుకే క్రైస్తవులు మంచి కారణంతో, కల్పనా కథలను, దేవున్ని వ్యతిరేకించేవారి ఆసక్తులను పెంపొందించడం కంటే మరెక్కువేమి చేయని కథలను విసర్జిస్తారు. యేసు ‘సత్యాన్ని గూర్చి సాక్ష్యమిచ్చినట్లే’ ఈనాడు ఆయన అనుచరులు కూడా చేస్తారు. (యోహాను 18:37) వారు జ్ఞానయుక్తంగా బైబిలిచ్చిన ఆజ్ఞను పాటిస్తారు: “ఏవి సత్యమైనవో . . . వాటిమీద ధ్యానముంచుకొనుడి.”—ఫిలిప్పీయులు 4:8.

[31వ పేజీలోని చిత్రం]

తాంత్రికసంబంధమైన వాటన్నిటినీ నిజ క్రైస్తవులు కచ్చితంగా విసర్జించాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి