మనిషి దేవుని స్వరూపంలో ఎలా ఉండగలడు?
“దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను” అని ప్రేరేపిత రికార్డు చెబుతున్నది, కాని దాని భావమేమిటి? మొదటి స్త్రీ, పురుషుడు ఎలా దేవుని స్వరూపమందు సృజింపబడ్డారు?—ఆదికాండము 1:27.
వారు శారీరకంగా దేవుని వలె ఉండిరా? కాదు, అది అసాధ్యం. మనిషి మానవత్వం గలవాడు, శరీరసంబంధి, భూమిపై నివసించడానికి వీలుగా రూపొందించబడ్డాడు. దేవుడు, ఏ మానవుడు కనీసం సమీపించలేని, ఊహించలేనంతటి పరలోక మహిమలో నివసిస్తున్న ఆత్మాస్వరూపి. (నిర్గమకాండము 33:18-20; 1 కొరింథీయులు 15:50) అయితే మరి, మనిషి ఎలా దేవుని స్వరూపమందు చేయబడ్డాడు? అంటే దేవుని విశేష గుణాలైన—ప్రేమ, న్యాయము, జ్ఞానము, శక్తి, మరితర లక్షణాలను కలిగివుండే సామర్థ్యం మనిషికి ఇవ్వబడిందని అర్థము.
యెహోవా లక్షణాలు
యెహోవా దేవుని లక్షణాలు ఆయన సృష్టి అంతటిలో ప్రతిబింబించాయి, కాని అవి మొదటి మానవ జతయైన ఆదాము, హవ్వలతో ఆయన వ్యవహరించేటప్పుడు నాటకీయంగా ప్రదర్శించబడ్డాయి. (రోమీయులు 1:20) మనిషి నివసించగల్గేలా సరైనవిధంగా భూమిని ఆయన సృష్టించినదానిలో ఆయన ప్రేమ వెల్లడించబడింది. ఒక పరిపూర్ణమైన తోడుగా, పురుషునికి భార్యను, అతని పిల్లలకు తల్లిని యెహోవా సృష్టించాడు. వారిద్దరినీ ఆయన అందమైన తోటలో ఉంచి, జీవం కొనసాగించడానికి, సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్తమును సమృద్ధిగా వారికి ఇచ్చాడు. అన్నిటికంటే అద్భుతమైంది, దేవుడు వారికి నిరంతరం జీవించే అవకాశాన్నిచ్చాడు.—ఆదికాండము 2:7-9, 15-24.
మొదటి మానవ జతను పరీక్షించడంలో దేవుని జ్ఞానము విశదమౌతుంది. యెహోవా యొక్క విశ్వవ్యాప్త కుటుంబంలో సభ్యులుగా వారు మిగిలి ఉండాలంటే, మానవజాతి తలిదండ్రులుగా వారు నిరంతరం జీవించాలంటే, వారు విశ్వాస్యత, స్వచ్చారాధనలలో మాదిరులుగా ఉండవలసిన అవసరత ఉంది. కాబట్టి యెహోవా తగిన పరీక్షలో వారి హృదయ పరిస్థితిని ప్రదర్శించే అవకాశాన్ని వారికి ఇచ్చాడు, ఆ పరీక్షలో వారు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఆయన వారికివ్వాలనుకున్న అద్భుతమైన ఆధిక్యతలను ఇవ్వటానికి ముందు మానవులు యెహోవాకు తమ విధేయతను, ప్రేమను నిరూపించుకోనే అవకాశాన్ని ఆయన వారికివ్వడం ఎంత న్యాయవంతంగా ఉంది!
తన సృష్టికి ఉన్నత ప్రమాణాలను ఏర్పరచి, వాటి విషయంలో రాజీ పడుటకు ఎంతమాత్రం అంగీకరించని ఆయన పట్టుదల యందు మనం ఆయన న్యాయాన్ని చూడవచ్చు. ఏది సరైనదో అదే చేయడానికి ఆదాము హవ్వలకు ఆయన ప్రతి అవకాశాన్ని ఇవ్వడంలో దాన్ని చూడవచ్చు. వారు అలా చేయటానికి విఫలమైనప్పుడు, తిరుగుబాటుకు నిర్ణయింపబడిన శిక్షను వారు అనుభవించేలా ఆజ్ఞాపించడంలో ఆయన న్యాయాన్ని చూడవచ్చు.
తన ఆజ్ఞప్రకారం తానే నడుచుకోవడంలో యెహోవా యొక్క శక్తిని మనం చూడవచ్చు. గొప్ప తిరుగుబాటుదారుడైన సాతాను, యెహోవా అబద్ధికుడని సూచించాడు, హవ్వ దేవునికి అవిధేయత చూపిస్తే సాతాను ఆమెకు ఎన్నో ఇస్తానన్నాడు. (ఆదికాండము 3:1-7) కాని సాతాను తన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు. యెహోవా ఆదాము హవ్వలను ఏదెను తోట నుండి తరిమి వేయటాన్ని అతడు ఆపలేకపోయాడు, “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని” ఆదాముకు దేవుడు చెప్పిన మాటల నెరవేర్పును అతడు ఆపలేక పోయాడు. (ఆదికాండము 3:19) అయినా, యెహోవా వెంటనే ఆ మరణ శిక్షను అమలుచేయలేదు, దీని ద్వారా మళ్లీ ఆయన తన ప్రేమను కనపర్చాడు. మానవజాతి యెడల తాను కలిగివున్న మొదటి సంకల్పం చివరకు నెరవేరేలా ఆదాము, హవ్వలు పిల్లలను కనేలా ఆయన సమయాన్ని అనుమతించాడు.—ఆదికాండము 1:28.
చివరకు, సాతాను క్రియలను నాశనం చేసి, దైవిక సర్వాధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి తిరుగుబాటు యొక్క దుఃఖకరమైన ఫలితాలను తీసివేసే సంతానాన్నిస్తానని యెహోవా దేవుడు చేసిన వాగ్దానం ద్వారా ఆయన న్యాయము, ప్రేమ, శక్తి మరియు జ్ఞానము వెల్లడౌతున్నాయి. (ఆదికాండము 3:15) ఎంతటి అద్భుతమైన సృష్టికర్తను మనం కల్గియున్నాము!
దేవున్ని అనుకరించుటకు ప్రయత్నాలు
ఇప్పుడు మానవులు పరిపూర్ణులు కాకపోయినప్పటికీ వారు దేవుని లక్షణాలను ప్రదర్శించవచ్చు. అందుకే తన కాలంనాటి క్రైస్తవులను పౌలు ఇలా ప్రోత్సహించాడు: “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:1) అయినా, చరిత్రంతటిలో అనేకులు దేవుని లక్షణాల యెడల పూర్తిగా అలక్ష్యం చూపించారు. నోవహు కాలంనాటికి, నోవహును అతని కుటుంబాన్ని మినహాయించి, మొత్తం మానవజాతినంతటిని నాశనం చేయాలని యెహోవా నిశ్చయించుకునేంతగా మనుష్యులు చెడ్డవారయ్యారు. నోవహు “నీతిపరుడును [న్యాయవంతుడును] తన తరములో నిందారహితుడునై యుండెను,” దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయన దేవుని యెడల తన ప్రేమను చూపించాడు.a “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:9, 22) “నీతిని ప్రకటించిన” వానిగా ఉండటం ద్వారా నోవహు, తన తోటి వారియెడల ప్రేమను, న్యాయం యెడల తనకున్న ఆసక్తిని చూపించాడు. (2 పేతురు 2:5) దేవుని నడిపింపు ప్రకారం ఒక పెద్ద ఓడను నిర్మించడం, ఆహారాన్ని నిల్వ చేయడం, జంతువులను పోగు చేయడం, యెహోవా ఆజ్ఞ ప్రకారం ఓడలోకి వెళ్లడం, వంటి వాటిని చేయటం ద్వారా ఆయన తన జ్ఞానాన్ని చూపించి, తన శారీరక శక్తిని తగిన రీతిగా ఉపయోగించాడు. తన దుష్ట పొరుగువారు తనను కలుషితం చేయడానికి అవకాశమివ్వకుండా ఉండటం ద్వారా ఆయన నీతి యెడల తన ప్రేమను కనపర్చాడు.
అలాగే దేవుని లక్షణాలను ప్రదర్శించిన అనేకమంది ఇతరులను గురించి బైబిలు వివరిస్తున్నది. వారిలో అత్యంత ప్రముఖుడు యేసుక్రీస్తు, ఆయన సంపూర్ణంగా దేవుని స్వరూపంలో ఉన్నాడు, అందుకే ఆయనిలా చెప్పగలిగాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:9) యేసు ప్రదర్శించిన లక్షణాల్లో ప్రేమ విశేషమైనది. తండ్రి యెడల, మానవజాతి యెడల ఆయనకున్న ప్రేమ, ఆయన తన పరలోక గృహాన్ని విడిచి, భూమిపై మనిషిగా జీవించుటకు పురికొల్పింది. తన నీతియుక్తమైన ప్రవర్తన ద్వారా, తన తండ్రిని ఘనపర్చుటకు, మానవజాతికి రక్షణ సువార్తను ప్రకటించుటకు అది ఆయనను పురికొల్పింది. (మత్తయి 4:23; యోహాను 13:31) తరువాత, మానవజాతి రక్షణ కొరకు, ప్రాముఖ్యంగా, దేవుని నామం పరిశుద్ధపరచబడుట కొరకు తన పరిపూర్ణ జీవితాన్ని బలిగా అర్పించుటకు యేసును ఈ ప్రేమ పురికొల్పింది. (యోహాను 13:1) దేవున్ని అనుకరించే ప్రయత్నంలో, యేసుక్రీస్తు మాదిరి కంటే మరి శ్రేష్ఠమైన మాదిరి మరొకటి ఉందా?—1 పేతురు 2:21.
నేడు మనం ఎక్కువగా దేవునివలె ఎలా ఉండవచ్చు?
నేడు మనం ఎలా దేవుని లక్షణాలను ప్రదర్శిస్తూ, దేవుని స్వరూపంలా ప్రవర్తించవచ్చు? మొదట ప్రేమ అనే లక్షణాన్ని పరిశీలించండి. యేసు ఇలా చెప్పాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును (యెహోవా, NW) ప్రేమింపవలెను.” మనం దేవుని యెడల ప్రేమను ఎలా చూపిస్తాము? అపొస్తలుడైన యోహాను ఇలా జవాబిస్తున్నాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—మత్తయి 22:37; 1 యోహాను 5:3.
యెహోవా ఆజ్ఞలను గైకొనాలంటే మనం వాటిని ఎరిగివుండాలి. దానిలో చదవడం, పఠించడం, దేవుని వాక్యమైన బైబిలును, బైబిలు సాహిత్యాన్ని ధ్యానించడం చేరివున్నాయి. కీర్తనల రచయిత వలె, మనమిలా చెప్పగలిగివుండాలి: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్తన 119:97) మనం దేవుని వాక్యాన్ని అంతకంతకు లోతుగా గ్రహిస్తే, మనం పూర్తిగా దేవుని ఆలోచనా విధానంతో నిండిపోతాము. మనం నీతిని ప్రేమించి, దుర్నీతిని ద్వేషిస్తాము. (కీర్తన 45:7) అక్కడే ఆదాము తప్పు చేశాడు. ఆయనకు యెహోవా ఆజ్ఞ తెలుసు, కాని దానికి హత్తుకొని ఉండేంతగా ఆయన దాన్ని ప్రేమించలేదు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, మనల్ని మనం తదేకంగా ఇలా ప్రశ్నించుకోవాలి, ‘ఇది నాకెలా వర్తిస్తుంది? దేవుని లక్షణాలకు అనుగుణ్యంగా నా ప్రవర్తనను మార్చుకోవడానికి నేనేమి చేయగలను?’
యేసు ఇంకా ఇలా చెప్పాడు: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” (మత్తయి 22:39) ఆరోగ్యవంతుడైన ప్రతి వ్యక్తి తనను తాను ప్రేమించుకుంటాడు, తనకు శ్రేష్ఠమైనది కావాలని కోరుకుంటాడు. అది తప్పు కాదు. కాని మనం మన పొరుగువారి యెడల కూడా అలాంటి ప్రేమనే చూపిస్తామా? “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము” అనే ఈ బైబిలు ఆజ్ఞను మనం పాటిస్తామా?—సామెతలు 3:27; గలతీయులు 6:10.
జ్ఞానమనే లక్షణం మాటేమిటి? బైబిలు దైవిక జ్ఞానం యొక్క నిధి గనుక మనం ఈ లక్షణాన్ని ప్రదర్శించాలంటే మనం బైబిలు చదువవలసి ఉంటుంది. కీర్తన 119:98-100 వరకు ఇలా చదువబడుతుంది: “నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.” సామెతలు 3:18 నందు జ్ఞానము “జీవవృక్షము” అని వర్ణించబడింది. మనం జ్ఞానాన్ని సంపాదించి దాన్ని అనుసరిస్తే, మనం దేవుని అంగీకారాన్ని, నిత్యజీవ ప్రతిఫలాన్ని పొందుతాము.—ప్రసంగి 7:12.
న్యాయం మాటేమిటి? ఈ దుష్ట లోకంలో, దేవున్ని ప్రీతిపర్చేవారికి న్యాయం అత్యవసరమైన లక్షణం. యేసు నీతిని (న్యాయాన్ని) ప్రేమించి, దుర్నీతిని ద్వేషించాడు. (హెబ్రీయులు 1:9) ఈనాడు క్రైస్తవులు కూడా అదే చేస్తారు. మంచి లక్షణాలను మెచ్చుకొనేలా న్యాయం వారిని పురికొల్పుతుంది. వారు ఈ లోకం యొక్క దుర్నీతి క్రియలను విసర్జించి, దేవుని చిత్తాన్ని చేయడం తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా చేసుకుంటారు.—1 యోహాను 2:15-17.
శక్తి విషయానికి వస్తే, మనందరికీ ఇది కొంతవరకు ఉంటుంది. మనకు సహజంగా, శారీరక, మానసిక శక్తి ఉంటుంది, మనం క్రైస్తవులుగా ఎదుగుతుంటే, మనం ఆత్మీయ భావంలో శక్తిని పెంపొందించుకుంటాము. మనం బలహీనులమై ఉన్నప్పటికీ, మనం యెహోవా చిత్తాన్ని చేసేంతగా యెహోవా తన పరిశుద్ధాత్మతో మన శక్తిని హెచ్చిస్తాడు. పౌలు ఇలా చెప్పాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) మనం యెహోవా ఆత్మ కొరకు ప్రార్థిస్తే అదే శక్తి మనకు కూడా ఇవ్వబడుతుంది.
సువార్త ప్రకటించుట
“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” అనే ఈ ఆజ్ఞకు విధేయత చూపించుటలో మనం దేవుని నాలుగు ప్రముఖ లక్షణాలను కనపర్చడాన్ని చూడవచ్చు. (మత్తయి 28:19, 20) అలాంటి విద్యాపని, ప్రతిస్పందించే వారికి జీవాన్ని కలుగజేస్తుంది. చాలామంది మొదట మనకు పూర్తి అపరిచితులే అయిననూ, అటువంటి వారిపట్ల ప్రేమ ఎంత చక్కగా ప్రదర్శించబడుతోంది!
అంతేగాక, అలాంటి బోధ జ్ఞానానికి మూలము. అది సహించగల్గే ప్రతిఫలాన్నిస్తుంది. మరే ఇతర పని గురించి ఇలా చెప్పవచ్చు: “నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు”? (1 తిమోతి 4:16) శిష్యులను చేసే పనిలో ఓడిపోయేవారుండరు. వినేవారు, బోధించేవారు ఇద్దరూ కూడా నిత్యాశీర్వాదాలను పొందుతారు.
న్యాయానికి సంబంధించి, క్రైస్తవులు తమ బైబిలు విద్యార్థులకు న్యాయమైన, నీతియుక్తమైన సూత్రాలను బోధిస్తున్నారు. “న్యాయకర్తయగు దేవుడైన” యెహోవాను సేవించడానికి మనం వారికి సహాయం చేస్తున్నాము. (మలాకీ 2:17) ఈనాడు యెహోవాను సేవించుటకు తమ జీవితాలను సమర్పించుకునేవారు, విశ్వాసంగా నడుచుకొనేవారు, నీతిమంతులుగా, న్యాయవంతులుగా, అర్మగిద్దోనును తప్పించుకొనేవారిగా లెక్కించబడతారు.—రోమీయులు 3:24; యాకోబు 2:24-26.
ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడం, బోధించడంలో ఎంతటి శక్తి ప్రదర్శించబడుతుంది! (మత్తయి 24:14) వినటానికి ఇష్టపడని వారనేకులున్న ప్రాంతాల్లో తదేకంగా ప్రకటించేందుకు సహనం అవసరం. కాని, అంతం వరకు సహించి ఉండుట కవసరమయ్యే శక్తిని యెహోవా తన ఆత్మ ద్వారా మనకిస్తాడు.—యెషయా 40:30, 31; మత్తయి 24:13; లూకా 11:13.
నిజమే, ఆదాము యొక్క అపరిపూర్ణ సంతానంగా, మనం ఈ మంచి లక్షణాలను సంపూర్ణంగా ప్రదర్శించలేక పోవచ్చు. అయినా, మానవుడు దేవుని స్వరూపమందు సృజించబడ్డాడని, మరింత ఎక్కువగా మనం దేవుని వలె నుండుటకు పాటుపడితే మనం జీవించివున్నందుకు గల కారణాన్ని కొంతవరకు నెరవేర్చినవారమౌతామని గుర్తుంచుకోండి. (ప్రసంగి 12:13) మనం మనకు సాధ్యమైనంత శ్రేష్ఠమైనది చేయడానికి ప్రయత్నించి, మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరితే, అప్పుడు మనం చివరకు పరిపూర్ణతకు ఎదిగే దేవుని నీతియుక్తమైన నూతన లోకంలోకి రక్షించబడుటకు నిరీక్షించవచ్చు. అప్పుడు, సంపూర్ణంగా అందరూ యెహోవా దేవుని లక్షణాలను ప్రదర్శిస్తున్న పరిపూర్ణ మానవులతో నింపబడిన పరదైసు భూమిపై మనముంటాము. ఎంత సంతోషం! చివరకు, నిండైన భావంలో చెప్పాలంటే, మానవులు దేవుని స్వరూపంలో ఉంటారు.
[అధస్సూచీలు]
a “నీతి” మరియు “న్యాయం” ఈ రెండు చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. గ్రీకు లేఖనాలలో, అవి రెండూ ఒకే పదం, డైకయోస్‌చే సూచింపబడ్డాయి.
[25వ పేజీలోని చిత్రం]
యెహోవా యొక్క దైవిక లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలో యేసు మనకు చూపించాడు
[26వ పేజీలోని చిత్రం]
చివరకు, మానవులంతా నిండైన భావంలో దేవుని స్వరూపమందు ఉంటారు