కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/1 పేజీలు 20-24
  • యెహోవా సేవలో ఒక ఉత్తమ, ప్రతిఫలదాయకమైన జీవితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సేవలో ఒక ఉత్తమ, ప్రతిఫలదాయకమైన జీవితం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నా జీవితాన్ని మార్చివేసిన ఒక సాయంత్రం
  • తొలి సంవత్సరాల్లో మా పరిచర్య
  • మా విశ్వాసాన్ని పరీక్షించే ఓ మార్పు
  • తృటిలో తప్పిన ప్రమాదాలు
  • ఒక న్యాయ విచారణలో సహాయం చేయుట
  • యుద్ధం ముగిసింది—మా సేవ కొనసాగింది
  • యెహోవాను సేవించాలని తీర్మానించుకున్నాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యెహోవా ప్రేమగల హస్తం క్రింద సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • నిశ్చయంగా యెహోవా నాకు తోడైయుండెను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/1 పేజీలు 20-24

యెహోవా సేవలో ఒక ఉత్తమ, ప్రతిఫలదాయకమైన జీవితం

లేయా కాల్యా చెప్పినది

అది 1914వ సంవత్సరం, ఫిన్‌లాండ్‌లోని ఒక నగరమైన టుర్కూ అనే మా పల్లెప్రాంతంలో ఒక అందమైన వసంతకాల దినం ముగియనై ఉంది. హఠాత్తుగా, ఒక గొప్ప యుద్ధం ప్రారంభమైందన్న వార్తతో ప్రశాంతత అంతా చెదిరిపోయింది. వెంటనే, సంఘటనల భావాన్ని గూర్చి ఆలోచిస్తున్న వారితో వీధులన్నీ నిండిపోయాయి. పెద్దవారి గంభీరమైన మొహాలు, ఏం జరుగబోతుందా అని పిల్లలమైన మేము ఆశ్చర్యపోయేలా చేశాయి. అప్పుడు నేను తొమ్మిది సంవత్సరాల వాడిని, పిల్లల శాంతియుతమైన ఆటలు యుద్ధ ఆటలుగా మారిపోవటం నాకు గుర్తుంది.

ఫిన్‌లాండ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో (1914-18) పాల్గొననప్పటికీ, 1918లో దేశం అంతర్యుద్ధంతో సర్వనాశనమైపోయింది. వేరువేరు రాజకీయ ఉద్దేశాలున్నందుకు బంధువులు, మునుపటి స్నేహితులు కూడా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఆయుధాలను చేపట్టారు. ఏడుగురితో కూడిన మా కుటుంబం ఈ ద్వేషాన్ని అనుభవించింది. తన అభిప్రాయాల్ని వెలిబుచ్చడంలో సూటిగా ఉండే మా నాన్న, నిర్భంధింపబడి, ఏడు సంవత్సరాల జైలు శిక్ష వేయబడ్డాడు. తరువాత ఆయన విడుదల చేయబడ్డాడు, కాని అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది.

ఈ భయంకరమైన సమయంలో మా కుటుంబం ఆకలి, అనారోగ్యంతో బాధపడింది. నా ముగ్గురు చెల్లెళ్లు మరణించారు. టెంపేర్‌ నగరంలో నివసించే మా నాన్న అన్నయ్య, మా దుస్థితిని గురించి తెలుసుకుని, మా అమ్మానాన్నను, మిగిలివున్న ఇద్దరు పిల్లలమైన మమ్మల్ని తనతోపాటు ఉండమని ఆహ్వానించాడు.

సంవత్సరాల తరువాత, ఇంకా టెంపేర్‌లో నివసిస్తుండగా, నేను సిల్వి అనే అందమైన అమ్మాయిని కలిశాను. ఆమెకు కూడా నాలాంటి గతమే ఉంది. ఆమె తండ్రి అంతర్యుద్ధంలో చంపబడ్డాడు, తరువాత పోరి పట్టణవాసి, వారి కుటుంబానికి సన్నిహిత స్నేహితుడు అయిన కార్లో (కాల్లే) వెసాన్‌టో, ఆమెను, ఆమె అక్కను, ఆమె తల్లిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అతను సిల్వి తల్లికి ఉద్యోగం వచ్చేలా, ఇద్దరు అమ్మాయిలు బడికి వెళ్లేలా ఏర్పాటు చేశాడు. కొంతకాలానికి, సిల్వి ఉద్యోగం కొరకు టెంపేర్‌కు వచ్చింది, అప్పుడే మేము కలిసాము.

నా జీవితాన్ని మార్చివేసిన ఒక సాయంత్రం

నాకు సిల్వికి 1928లో ప్రధానము అయ్యింది, ఒక రోజు మేము కాల్లే వెసాన్‌టోను, అతని కుటుంబాన్ని దర్శించటానికి పోరికి ప్రయాణమయ్యాము. మరే సంఘటన అంత నిశ్చయాత్మకంగా నా జీవితాన్ని ప్రభావితం చేయలేదు. కాల్లే పందెం గుర్రాల యజమాని, వాటిని పందెంలో పరుగెత్తించేవాడు కూడా, కాని ఆయన ఆ వ్యాపారం మానేసాడు. ఆయన, ఆయన భార్య దేవుని రాజ్య సువార్త యొక్క ఆసక్తిగల ప్రచారకులయ్యారు. “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఎన్నటికీ మరణించరు” అనే మాటలను తన రెండంతస్థుల ఇంటి బయటిగోడపై పెయింటు చేయించడానికి ఆయన ఎలా మనుష్యులను ఏర్పాటు చేసుకున్నాడో 1990 ఇయర్‌ బుక్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్నెసస్‌ వివరిస్తుంది. వేగంగా వెళుతున్న ట్రెయిన్‌లో నుండి కూడా సుళువుగా చదువగలిగేంత పెద్దగా ఉంది ఆ వాక్యము.

ఆ రాత్రి కాల్లే నేను తొలి ఉదయ కాలం వరకు మాట్లాడుకున్నాము. “ఎందుకు? ఎందుకు? ఎందుకు?” నేను అడిగాను, కాల్లే వివరించాడు. నేను అక్షరార్థంగా బైబిలు మూల సత్యాలను ఒక్కరాత్రిలోనే నేర్చుకున్నాను. అనేక బోధలను వివరించే లేఖనాలను నేను వ్రాసి పెట్టుకున్నాను. తరువాత, నేను ఇంటికి తిరిగి వచ్చాక, ఒక నోట్‌ పుస్తకంలో ఆ లేఖనాలన్నీ ఒకొక్క పదం వ్రాసుకున్నాను. నేను బైబిలుతో ఇంకా ఎక్కువ పరిచయం కలిగిలేను కాబట్టి, నేను పనిచేస్తున్న నిర్మాణపని జరిగే స్థలం వద్ద నేను సాక్ష్యమివ్వటానికి ఈ నోట్‌ పుస్తకాన్ని ఉపయోగించేవాడిని. అబద్ధమత బోధలను నేను వెల్లడిస్తూ, అనేక సార్లు కాల్లే యొక్క ఈ మాటలను మళ్లీ మళ్లీ వాడేవాడిని: “మీరు నిజంగా మోసగింపబడ్డారు!”

తమ కూటాల కొరకు టెంపేర్‌లో ఎక్కడైతే ఒక 30 మంది బైబిలు విద్యార్థులు సమకూడేవారో ఆ చిన్న ఇంటి చిరునామా కాల్లే నాకు ఇచ్చాడు. అక్కడ నేను, ఆ ఇంటి యజమాని అయిన అండెర్‌సన్‌ సహోదరుని ప్రక్కన తలుపు వద్ద ఒక మూలకు నక్కి కూర్చునేవాణ్ణి. నేను అంత క్రమంగా హాజరయ్యేవాణ్ణి కాదు, కాని ప్రార్థన చాలా సహాయకరంగా ఉండేది. పని వద్ద గంభీరమైన సమస్య ఉన్నప్పుడు, నేను ఒకసారి ఇలా ప్రార్థించాను: “దేవా, దయచేసి నీవు ఈ కష్టంలో నాకు సహాయం చేస్తే నేను ప్రతి కూటానికి హాజరౌతానని వాగ్దానం చేస్తున్నాను.” కాని పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి. తరువాత నేను యెహోవాకు షరతులు పెడుతున్నానని గ్రహించాను, అందుకని నా ప్రార్థనిలా మార్చాను: “ఏమి జరిగినప్పటికీ, నేను ప్రతి కూటానికి హాజరౌతానని వాగ్దానం చేస్తున్నాను.” దానితో నా విపత్తులు తొలగిపోయాయి, నేను కూటాలకు క్రమంగా హాజరయ్యేవాడిని.—1 యోహాను 5:14.

తొలి సంవత్సరాల్లో మా పరిచర్య

సిల్వి నేను 1929లో వివాహం చేసుకున్నాము, 1934లో ఇద్దరం నీటి బాప్తిస్మం ద్వారా యెహోవాకు సమర్పించుకున్నాము. ఆ రోజుల్లో మా పరిచర్యలో గ్రామఫోన్‌ను, రికార్డులను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకునివెళ్లి, ఉచితంగా మీకు ఒక బైబిలు ప్రసంగం వినిపించవచ్చా అని అడిగేవారము. ప్రజలు తరచూ వెంటనే మమ్మల్ని ఆహ్వానించేవారు, రికార్డు చేయబడిన ప్రసంగం వారు వినిన తరువాత, వారు సంభాషణలో పాల్గొని, మా సాహిత్యాన్ని అంగీకరించేవారు.

అధికారుల అంగీకారంతో, ఆంప్లిఫయర్ల ద్వారా ఇవే బైబిలు ప్రసంగాలను పార్కులలో వినిపించేవారము. పల్లె ప్రాంతాల్లో మేము లౌడ్‌స్పీకర్లను పైకప్పుకుగాని, పొగగొట్టాలపైన గాని పెట్టేవారము. పట్టణవాసులు పెద్ద గుంపులుగా సమకూడే ప్రాంతమైన చెరువు గట్టుపై కొన్నిసార్లు మేము వినిపించేవారము. మేము కేవలం ఆంప్లిఫయర్లు పడవలో తీసుకుని వెళ్లి గట్టు వెంబడి మెల్లిగా తేలివెళ్లేవారము. ఆదివారాలలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రకటించడానికి విలువైన ఆంప్లిఫయర్లను, ఎంతో సాహిత్యాన్ని బస్సు మీద తీసుకుని వెళ్లేవారము.

మా విశ్వాసాన్ని పరీక్షించే ఓ మార్పు

నేను 1938లో పయినీరుగా పూర్తికాల సేవలో ప్రవేశించాను, కాని ఇటుకలు వేసేవానిగా నేను పనిచేయడం కొనసాగించాను. ఇప్పుడు ప్రయాణ కాపరి అని పిలువబడుతున్న ప్రయాణ సేవకునిగా రమ్మని సంస్థ బ్రాంచి ఆఫీసు నుండి వచ్చిన ఆహ్వానాన్ని నేను ఆ తరువాతి వసంతకాలంలో అందుకున్నాను. టెంపేర్‌లోని మా సంఘంతో పనిచేయడం నేనానందించేవాడిని కాబట్టి ఆ సేవను అంగీకరించాలన్న నిర్ణయం అంత సుళువుగా లేకుండినది. అంతేగాక, మాకు స్వంత ఇల్లు ఉంది; మాకు త్వరలోనే బడికి వెళ్లడం ప్రారంభించే ఆరు సంవత్సరాల కుమారుడున్నాడు; ఒక దుకాణంలో పనిచేయటాన్ని సిల్వి కూడా ఆనందించేది. అయినా, మేమిద్దరం కలిసి మాట్లాడుకున్న తరువాత, ఈ రాజ్య సేవాధిక్యతను నేను అంగీకరించాను.—మత్తయి 6:33.

తరువాత మరో కష్టతరమైన కాలం ప్రారంభమైంది. నవంబరు 30, 1939న సోవియట్‌ దళాలు ఫిన్‌లాండ్‌లోకి ప్రవేశించడంతో యుద్ధం ప్రారంభమైంది. ఫిన్‌లాండ్‌ శాంతి ఒప్పందానికి అంగీకరించ వలసి వచ్చేంత వరకు, 1940 మార్చి వరకు వింటర్‌ యుద్ధం అని పిలువబడిన ఈ యుద్ధం కొనసాగింది. ప్రకృతి కూడా యుద్ధం చేస్తున్నట్లు అనిపించింది, ఎందువల్లనంటే, అదే నేను చూసిన వాటిలోకెల్లా అతి చల్లని శీతాకాలము. వాతావరణం మైనస్‌ 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా నేను ఒక సంఘం నుండి మరో సంఘానికి సైకిలుపై ప్రయాణించేవాడిని!

యెహోవాసాక్షుల పని ఫిన్‌లాండ్‌ నందు 1940లో నిషేధింపబడింది. తరువాత అనేకమంది ఫిన్‌లాండ్‌ యౌవన సాక్షులు చెరసాలలో వేయబడి, అమానుష పరిస్థితులలో బలవంతంగా అలాగే ఉంచబడ్డారు. కృతజ్ఞతా పూర్వకంగా, 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధకాలమంతటిలో నేను సంఘాలకు సేవచేయగలిగాను. దీని కొరకు నేను సిల్వి, ఆర్టో వాళ్లకు ఒక్కోసారి కొన్ని నెలలు దూరంగా ఉండవలసి వచ్చేది. అంతేగాక, చట్టవ్యతిరేక పని చేస్తున్నందుకు నిర్భంధింపబడే ప్రమాదం నిరంతరం ఉండేది.

సాహిత్యాలున్న ఒక పెద్ద సంచి, ఒక గ్రామ్‌ఫోను, రికార్డులు, ఒక సూట్‌ కేస్‌వున్న సైకిలు నడిపిస్తూ నేను బహుశ వింతగా కనిపించివుండవచ్చు. నేను నాతోపాటు గ్రామ్‌ఫోను రికార్డులను ఉంచుకోవడానికి ఒక కారణం ఏమిటంటే, ఒకవేళ నేను నిర్భంధింపబడితే, నేను రష్యా దేశస్థుల కొరకు వెతుకుతున్న భూపరిశీలన చేసే ప్యారాచూటిస్టును కాదని నిరూపించుకోవచ్చు. చూడండి, ఒకవేళ నేను ప్యారాచూటిస్టునైతే, దూకే సమయంలో రికార్డులు విరిగిపోయి ఉండేవి కదా అని నేను వాదించవచ్చు.

అయినప్పటికీ, ఒక గూఢాచారి గురించి హెచ్చరింపబడిన ప్రాంతాన్ని దర్శిస్తుండగా, ఒక సాక్షుల కుటుంబం పొరపాటుగా నేను గూఢాచారి ననుకున్నారు. ఒక శీతాకాల చీకటి రాత్రి నేను వారి తలుపు తట్టాను, తలుపు తెరవటానికి వారు చాలా భయపడ్డారు. కాబట్టి నేను ఆ రాత్రంతా వెచ్చగా ఉండటానికి గడ్డిలో దూరి ధాన్యంకొట్టులో గడిపాను. మరునాడు ఉదయం వారి సందేహం నివృత్తి అయ్యింది. తరువాత నా దర్శనమంతటిలో ఆ కుటుంబ సభ్యులు నాకు ఆతిథ్యమివ్వడంలో మరింత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారనే చెప్పాలి!

యుద్ధ సంవత్సరాలలో, కేవలం నేను, యెహాన్నెస్‌ కాస్‌కినన్‌ అనే సహోదరుడు మాత్రమే మధ్య, ఉత్తర ఫిన్‌లాండ్‌లోని సంఘాలలో సేవచేశాము. మేమిద్దరం, అంటే ఒకొక్కరం దాదాపు 600 కిలోమీటర్ల పొడవున్న చాలా పెద్ద ప్రాంతాన్ని గూర్చి శ్రద్ధ వహించవలసి ఉండింది. మేము దర్శించవలసిన సంఘాలు ఎన్నో ఉండేవి, అందుకే మేము ఒక్కో సంఘంతో కేవలం రెండు లేక మూడు రోజులు మాత్రమే కలిసి ఉండగలిగేవాళ్లము. రైళ్లు అరుదుగా సమయానికి వచ్చేవి, బస్సులు కొన్నే ఉండి, జనాలతో ఎంత ఎక్కువగా నిండివుండేవంటే మేము మా గమ్యాలను చేరామంటే అది ఒక అద్భుతంలా ఉండేది.

తృటిలో తప్పిన ప్రమాదాలు

ఒకసారి, వింటర్‌ యుద్ధ తొలికాలంలో, నేను హెల్‌సిన్‌కీలోని బ్రాంచి కార్యాలయానికి వెళ్లి, నిషేధింపబడిన సాహిత్యం ఉన్న నాలుగు బరువైన పెట్టెలను తీసుకుని నాతోపాటు రైలులో తీసుకువెళ్లి సంఘాలకు అందజేయడానికి బయలుదేరాను. రిహిమాకి రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు, విమానాల ద్వారా బాంబుదాడిని గూర్చిన హెచ్చరిక వినిపించింది. రైలులోవున్న సైనికులు తమ స్నోసూట్లు వేసుకున్నారు, ప్రయాణికులు వెంటనే రైలును విడిచి స్టేషన్‌కు ఎదురుగావున్న ఒక ఖాళీ మైదానానికి వెళ్లాలని ఆదేశింపబడ్డారు.

నా పెట్టెల ప్రాధాన్యతను గూర్చి చెప్పి, వాటిని మోసుకెళ్లమని నేను సైనికులను కోరాను. నలుగురు తలాఒక పెట్టె తీసుకున్నారు, మంచు కప్పివున్న మైదానంలో దాదాపు 200 మీటర్లు మేము పరుగెత్తాము. మేము నేలపై పడిపోయాము, ఎవరో నాతో ఇలా అన్నారు: “పౌరుడా, అస్సలు కదలవద్దు! దాడిచేసేవారు కదలిక గమనిస్తే, మనపై బాంబులు వేస్తారు.” ఎంతో కుతూహలంతో నేను జాగ్రత్తగా నా మొహం తిప్పి ఆకాశం వైపు చూశాను, అక్కడ నేను 28 విమానాలను లెక్కపెట్టాను!

హఠాత్తుగా బాంబు పేలుళ్లతో భూమి దద్దరిల్లింది. స్టేషన్‌కు ఏమి కాలేదు కాని, మేము వచ్చిన రైలుపై బాంబులు వేయబడ్డాయి. నాశనమైపోయిన రైలు, మెలితిరిగిపోయిన పట్టాలతో అదెంత భయంకరమైన దృశ్యంగా మారిందో! మరునాడు ఉదయం నేను పెట్టెలతో నా ప్రయాణం కొనసాగించాను, సైనికులు మరో రైల్లో వారి ప్రయాణం కొనసాగించారు. యుద్ధం తరువాత వారిలో ఒకరు సాక్షి అయ్యారు, పెట్టెలతోవున్న వింతైన పౌరుని గురించి ఆ తరువాత సైనికులు మాట్లాడుకున్నారని అతడు నాకు చెప్పాడు.

కొంతకాలం తరువాత సహోదరుడైన కాస్‌కినన్‌, ఉత్తర ఫిన్‌లాండ్‌లోని రోవెనేమి నగరమందలి చిన్న సంఘంలో సేవచేయడానికి ప్రయాణించి వస్తూ, రైలు దిగక ముందే నిర్భంధింపబడ్డాడు. అతడు చెరసాలకు తీసుకుపోబడ్డాడు, అక్కడతడు చాలా హింసింపబడ్డాడు. అదే సంఘంలో నేను సేవచేయవలసిన సమయం వచ్చినప్పుడు, కోవూ అనే చిన్న స్టేషన్‌లో రైలు దిగిపోవడానికి నేను ఏర్పాట్లు చేసుకున్నాను. మిగతా దారి నేను ఒక పాలవ్యానులో వెళ్లగలిగేలా హెల్మీ పల్లారి అనే ఒక సహోదరి ఏర్పాటు చేసింది. రోవెనేమి సంఘానికి నా ప్రయాణం విజయవంతమైంది. కాని వెనక్కి వెళ్లేటప్పుడు నేను కష్టపడవలసి వచ్చింది.

మేము రైలు స్టేషన్‌కు వెళ్తుండగా ఆ దారిలో వెళుతున్న వారందరి పత్రాలను పరిశీలిస్తున్న ఇద్దరు సైనికాధికారులను నేను, నా సహచరుడు ఎదుర్కోవలసి వచ్చింది. “వారి వైపు చూడకండి. మీ కళ్లు సూటిగా ఉంచండి,” అని చెప్పాను నేను. వారు అసలు ఉనికిలోనే లేరన్నట్లు మేము వారి మధ్యన నడిచివచ్చాము. తరువాత వాళ్లు మమ్మల్ని వెంటాడటం మొదలుపెట్టారు. చివరికి, నేను రైలు స్టేషన్‌ వద్ద, జనంలో వారిని తప్పించుకుని కదులుతున్న రైలులోకి ఎక్కేయగలిగాను. ఆ దినాల్లో ప్రయాణ పనిలో ఉత్సాహానికి కొదువుండేది కాదు!

ఒకసారి నేను నిర్భంధింపబడి, సైనికులను ఎన్నుకునే కమీటీ వద్దకు తీసుకువెళ్లబడ్డాను. నన్ను యుద్ధానికి పంపాలన్నది వారి ఉద్దేశము. కాని ఫోను మ్రోగింది, నన్ను ఇంటర్వ్యూ చేయబోయే సైనికాధికారి ఫోను ఎత్తాడు. అవతలి వైపునుండి ఒక వ్యక్తి ఇలా అరవడం నేను వినగల్గాను: “మీరెందుకీ అనారోగ్యకరమైన, ఉపయోగంలేని వ్యక్తులను పంపిస్తున్నారు? మేము చేయగల్గిందల్లా వారిని వెనక్కి పంపడమే. పనికి ఉపయోగపడే వ్యక్తులే మాకు కావాలి!” కృతజ్ఞతాపూర్వకంగా, నాకు ఆరోగ్యపరమైన సమస్య ఉందని చూపించే వైద్య సర్టిఫికెట్టు నావద్ద ఉంది. నేను అది అందజేసినప్పుడు, నేను వెళ్లటానికి అనుమతింపబడ్డాను, కాబట్టి సంఘాల్లో నేను చేస్తున్న సేవ నిర్విఘ్నంగా కొనసాగింది!

ఒక న్యాయ విచారణలో సహాయం చేయుట

యుద్ధోన్మాదం పెరిగిపోతూనే ఉంది, నా స్నేహితుడు అహితి లాసిటీ నిర్భంధింపబడ్డాడు. అతని భార్య నన్ను పిలిపించింది. నేను వారి ఇంటికి వెళ్లినప్పుడు, అతని కాగితాల్లో, నగరంలోని బహిరంగ పార్కులలో రికార్డు చేయబడిన ప్రసంగాలు ఇవ్వటానికి అహితికి స్థానిక పోలీసులు అనుమతిచ్చినట్లు తెల్పే పత్రాన్ని నేను కనుగొన్నాను. ఆ పత్రాన్ని తీసుకుని మేము కోర్టుకు వచ్చాము. వారు దోషారోపణ చదవడం ముగించిన తరువాత, నేను పత్రాన్ని సహోదరుడు లాసిటీకి అందజేసాను. కోర్టు వినటానికి ఒక గ్రామ్‌ఫోను, రికార్డు చేయబడిన కొన్ని బైబిలు ప్రసంగాలను న్యాయాధిపతి ఒక సైనికున్ని తీసుకురమ్మన్నాడు. ప్రతి ప్రసంగాన్ని విన్న తరువాత, చెప్పబడిన దానిలో తప్పేమి నాకు కనిపించడం లేదని న్యాయాధిపతి అన్నాడు.

తరువాత కోర్టు తీర్పు వినడానికి వేచివుండమని అహితిని, అతని భార్యను, నన్ను వరండాలోకి పంపించారు. అక్కడ మేము అయోమయస్థితిలో ఎదురు చూస్తూ నిలబడ్డాము. చివరికి మేమొక స్వరం ఇలా చెప్పడం విన్నాము: “నిందితుడు కోర్టు రూమ్‌లోకి రావాలి.” సహోదరుడైన లాసిటీ విడుదల చేయబడ్డాడు! మేము మా పనులలో అంటే సహోదరుడు, సహోదరి లాసిటీ తమ స్థానిక సంఘంలో, నేను ప్రయాణ పనిలో కొనసాగుతుండగా, మా హృదయాలు నిజంగా యెహోవా యెడల కృతజ్ఞతతో నిండిపోయాయి.

యుద్ధం ముగిసింది—మా సేవ కొనసాగింది

యుద్ధం ముగిసినప్పుడు మా ప్రకటన పనిపైనున్న నిషేధం ఎత్తివేయబడింది, సహోదరులు చెరసాల నుండి విడుదల చేయబడ్డారు. ఎన్నో సంవత్సరాల నా సేవలో, రాజ్య పనిలో తమ భర్తలతో సహకరించడంలో క్రైస్తవ సహోదరీలు నిర్వహించిన పాత్రను బట్టి నేను ఎంతో ప్రభావితుడనయ్యాను. ప్రాముఖ్యంగా, సిల్వి చేసిన త్యాగాలు, ఇచ్చిన మద్దతు కొరకు నేను కృతజ్ఞుడిని. ఫలితంగా, నేను 33 సంవత్సరాలు నిరాటంకంగా ప్రయాణ పనిలో, ఆ తరువాత ప్రత్యేక పయినీరుగా కొనసాగ గల్గాను.

నేను, సిల్వి ఆర్టోను పాఠశాల విద్య ముగించిన తరువాత పయినీరు సేవ ప్రారంభించి, ఆంగ్ల భాష నేర్చుకుని, అమెరికాలోని వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరు కమ్మని ప్రోత్సహించాము. అతడు 1953లో గిలియడ్‌ పట్టభద్రుడయ్యాడు. తరువాత అతడు ఏవాను వివాహం చేసుకుని, సర్క్యూట్‌ పని, బేతెలు సేవ, ప్రత్యేక పయినీరు సేవ వంటి పూర్తికాల పరిచర్యలోని అనేక అంశాలలో వారిద్దరూ కలిసి భాగం వహించారు. వారు ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తూనే నన్ను, సిల్విని గూర్చి శ్రద్ధ తీసుకోవడానికి 1988లో మా నివాస నగరమైన టెంపేర్‌కు వచ్చారు.

మా శక్తి ఇప్పుడు బాగా నశించిపోయినప్పటికీ, మమ్మల్ని ప్రోత్సహించటానికి ఎన్నో జ్ఞాపకాలు గల ఉత్తమ, ఆశీర్వాదకరమైన జీవితాన్ని సిల్వి నేను అనుభవించాము. మేము చూసిన అభివృద్ధిని గురించి ఆలోచించడం ఎంతో ప్రతిఫలదాయకంగా ఉంటుంది. నేను 1939లో సంఘాలను దర్శించడం ప్రారంభించినప్పుడు, ఫిన్‌లాండ్‌లో 865 మంది రాజ్య ప్రచారకులుండేవారు, కాని ఇప్పుడు అక్కడ 18,000 కంటే ఎక్కువమంది ఉన్నారు!

నేను గతంలో 1938లో పూర్తికాల పరిచర్య ప్రారంభించినప్పుడు, 55 సంవత్సరాల తరువాత కూడా నేను దానిలో భాగం వహించడాన్ని ఆనందిస్తానని ఎంత మాత్రం అనుకోలేదు. వయస్సు పెరుగుతున్నప్పటికీ, వాగ్దానం చేయబడిన మా ప్రతిఫలం కొరకు ఎదురుచూస్తూ, మేము యెహోవా శక్తితో కొనసాగుతున్నాము. “యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును,” అనే కీర్తనల గ్రంథకర్త మాటల యందు మేము విశ్వాసముంచుతాము.—కీర్తన 100:5.

[21వ పేజీలోని చిత్రం]

లియో, సిల్వి కాల్యా 1934లో యెహోవాకు సమర్పించుకున్నారు

[23వ పేజీలోని చిత్రం]

వారి సమర్పిత సేవ 60 సంవత్సరాలకు చేరుతుండగా లియో, సిల్విల ఇటీవలి ఫోటో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి