జోసీఫస్ వ్రాసిన విభ్రాంతి కల్గించే వృత్తాంతాలు
అనాదిగా చరిత్రను పఠించే విద్యార్థులు జోసీఫస్ యొక్క అద్భుతమైన రాతలను తలపోస్తూ ఉన్నారు. యేసు మరణించిన కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత జన్మించిన జోసీఫస్, మొదటి శతాబ్దంలో యూదా జనాంగం గూర్చి యేసు ప్రవచించిన ప్రవచన నెరవేర్పును కన్నులారా చూసిన సాక్షియైన జోసీఫస్ ఓ సైన్యాధికారి, ఓ రాజ్యాధికారి, ఓ పరిసయ్యుడు, ఓ విద్వాంసునిగా ఉండేవాడు.
జోసీఫస్ రాతలు అవధానాన్ని చూరగొనే వివరణలతో ఉట్టిపడుతుంటాయి. అవి పాలస్తీనా గూర్చిన స్థలాకృతి, భౌగోళిక విషయాలకు వ్రాతపూర్వక గైడ్‌గా పనిచేస్తూ బైబిలు సిద్ధాంతంపై వెలుగును విరజిమ్ముతాయి. అనేకులు తమ పుస్తక భాండాగారంలో అతని వ్రాతలను చేర్చడానికి వాటిని అమూల్యంగా భావిస్తారు!
అతని తొలి జీవితం
జోసెఫ్ బెన్ మథియాస్ లేక జోసీఫస్ రోమా చక్రవర్తి కాలిగులా పరిపాలనలో మొదటి సంవత్సరం, అంటే సా.శ. 37లో జన్మించాడు. జోసీఫస్ తండ్రి యాజక కుటుంబానికి చెందినవాడు. తల్లి, హెస్మోనియన్ ప్రధాన యాజకుడైన జోనాతాన్ సంతతని ఆయన చెప్పుకున్నాడు.
జోసీఫస్ కౌమార దశలో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని ఆసక్తితో పఠించేవాడు. యూదా మతమందలి మూడు విభాగాలైన పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఎస్సినీయులను అతను జాగ్రత్తగా పరిశీలించాడు. చివరి దాన్ని ఇష్టపడి, బహుశ ఎస్సినీయుడైన బానెస్ అనే ఓ ఎడారి సన్యాసితో మూడు సంవత్సరాలు జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన 19వ ఏట దీన్ని విడిచిపెట్టి జోసీఫస్ యెరూషలేముకు తిరిగి వచ్చి పరిసయ్యులను చేరాడు.
రోమ్కు, మరలా వెనకకు
యూదయ రాజప్రతినిధియగు ఫెలిక్సు, విచారణ నిమిత్తం నీరో చక్రవర్తి వద్దకు పంపించిన యూదా యాజకుల పక్షాన మాట్లాడ్డం కొరకు సా.శ. 64లో జోసీఫస్ రోమ్కు వెళ్లాడు. మార్గ మధ్యలో ఓడ బ్రద్దలు కావడంతో, జోసీఫస్ వెంట్రుక వాసిలో మృత్యువును తప్పించుకున్నాడు. ఆరువందల మంది ఓడ ప్రయాణికుల్లో కేవలం 80 మంది మాత్రమే కాపాడబడ్డారు.
జోసీఫస్ రోమ్ను సందర్శిస్తున్న సమయంలో, ఓ యూదా నటుడు అతన్ని నీరో చక్రవర్తి భార్యయైన రాణీ పొపియాకు పరిచయం చేశాడు. అతని పని విజయవంతం కావడానికి ఆమె ప్రముఖ పాత్రను వహించింది. ఆ పట్టణ మహిమ జోసీఫస్పైన చెరగని ముద్రను వేసింది.
జోసీఫస్ యూదయకు తిరిగి వచ్చినప్పుడు, యూదుల మనస్సుల్లో రోమ్పై తిరుగుబాటు గట్టిగా నాటుకుపోయింది. రోమ్పై యుద్ధం వ్యర్థమని తన దేశస్థులకు నచ్చజెప్పడానికి అతను ప్రయత్నించాడు. వారిని నివారించలేక, బహుశ వారు అతన్ని మోసగాడనుకుంటారేమోనన్న భయంతో గలిలయలో యూదుల సేనాధిపతిగా నియామకాన్ని అంగీకరించాడు. జోసీఫస్ తన మనుష్యులను కూడబెట్టి వారికి శిక్షణనిచ్చి, కావలసిన సరకులను పొంది రోమ్ సేనలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడ్డాడు—అయితే అదంతా వ్యర్థమైపోయింది. గలిలయా వెస్పాసియన్ సేనల చేతిలో పడింది. నలభై అయిదు రోజుల ముట్టడి తర్వాత జొటాపాటాలోని జోసీఫస్ దుర్గం జయించబడింది.
జోసీఫస్ తన్ను తాను అప్పగించుకున్న తర్వాత, వెస్పాసియన్ చక్రవర్తి అవుతాడని తెలివిగా భవిష్యత్తును తెలిపాడు. ఇలా భవిష్యత్తును గూర్చి చెప్పడం వల్ల చెరసాల్లో ఉన్నాడు గానీ శిక్షనుండి తప్పించబడ్డాడు. అది నిజమైనప్పుడు జోసీఫస్ విడుదలయ్యాడు. అదే అతని జీవితంలో ఓ మలుపు. మిగిలిన యుద్ధ కాలమంతటిలో అతను రోమన్లకు భావం చెప్పేవానిగా, మధ్యవర్తిగా పనిచేశాడు. వెస్పాసియన్ ఆయన కుమారులైన టైటస్ డొమిటియన్ల సంరక్షణను వ్యక్తపరుస్తూ, జోసీఫస్ తన పేరుకు ఫ్లేవియస్ అనే యింటి పేరు చేర్చుకున్నాడు.
ఫ్లేవియస్ జోసీఫస్ రచనలు
జోసీఫస్ రాసిన అతి పురాతనమైన దాని పేరు ది జూయిష్ వార్. రోమ్ యొక్క గొప్ప శక్తిని యూదులకు చూపించడానికి, భవిష్యత్ తిరుగుబాటును నివారించడానికి అందించబడిందని నమ్ముతున్నారు. ఈ వ్రాతలు అంటియాకస్ ఎపిఫానెస్ (సా.శ.పూ రెండవ శతాబ్దంలో) యెరూషలేమును జయించడం మొదలుకొని సా.శ. 67లోని అల్లకల్లోలమైన పోరాటం వరకు యూదుల చరిత్రను పరిశీలిస్తున్నాయి. తర్వాత ఓ ప్రత్యక్ష సాక్షిగా, సా.శ. 73లో చెలరేగిన యుద్ధమూ దాని ముగింపునూ జోసీఫస్ చర్చించాడు.
జోసీఫస్ మరో వ్రాత 20 వాల్యూమ్‌లతో కూడిన యూదుల చరిత్ర ఉన్న ది జూయిష్ అంటిక్విటిస్. అది ఆదికాండము సృష్టి నుండి ప్రారంభమై, రోమ్తో యుద్ధం చేసేంత వరకు కొనసాగుతుంది. జోసీఫస్ పారంపర్య భావాలను, బాహ్య గమనికలనూ చేర్చి బైబిలు రచనా శైలిని అనుసరించాడు.
లైఫ్ అనే మామూలు పేరుతో జోసీఫస్ తన స్వంత జీవిత చరిత్రను రాసుకున్నాడు. దానిలో, యుద్ధాల్లో అతను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడానికి ప్రయత్నిస్తూ, టైబిరియాస్లోని జస్ట్స్ తనపైకి లేవనెత్తిన ఆరోపణలను తొలగించే ప్రయత్నం చేశాడు. నాల్గవది—రెండు వాల్యూమ్ల ఎగేనెస్ట్స్ ఎపియోన్—యూదులను గూర్చిన తప్పుడు వర్ణనకు వ్యతిరేకంగా వారి పక్షంగా వ్రాసినది.
దేవుని వాక్యంలోనికి అంతర్దృష్టి
నిస్సందేహంగా జోసీఫస్ చరిత్రంతా దాదాపు సరైందే. ఆయన రాసిన ఎగేనెస్ట్ ఎపియన్లో, అప్రమాణిక పుస్తకాలను ప్రేరేపిత లేఖనాల్లో భాగంగా యూదులు ఎన్నడు యిమడ్చలేదని చూపించాడు. అతను దైవిక వ్రాతల సత్య సంధతకూ, అంతర్గత సామరస్యతకు రుజువునిస్తున్నాడు. జోసీఫస్ యిలా అంటున్నాడు: “యూదులమైన మాకు, ఒకదానితో ఒకటి అంగీకరించని విరుద్ధమైనవి వందలకొలది పుస్తకాలు లేవు, . . . అయితే గడచిన సమయం గూర్చిన వృత్తాంతాలుగల కేవలం ఇరవైరెండు [మన ఆధునికదిన లేఖనాలు 39గా విభాగింపబడిన వాటి సరిసమానమైన] పుస్తకాలున్నాయి; అవి దైవికమని సరిగ్గానే నమ్మబడుతున్నాయి.”
ది జూయిష్ అంటిక్విటీస్ అనే పుస్తకంలో, జోసీఫస్ బైబిలు వృత్తాంతానికి ఆసక్తికరమైన వివరాలను చేరుస్తున్నాడు. అబ్రాహాము ఇస్సాకు చేతులను కాళ్లను కట్టి బలి అర్పించడానికి తీసుకువెళ్లినప్పుడు “అతనికి ఇరవై అయిదు సంవత్సరాలు” అని అన్నాడు. జోసీఫస్ ప్రకారం, ఇస్సాకు బలిపీఠాన్ని నిర్మించిన తర్వాత, “‘తన దేవుని నిర్ణయాన్ని, తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తాను మొదట జన్మించడానికే తగనని,’ . . . వెంటనే బలి అవ్వడానికి బలిపీఠం వద్దకు వెళ్లాడు.”
ప్రాచీన ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు నిర్గమించారన్న లేఖన వృత్తాంతానికి జోసీఫస్ ఈ వివరాలను చేరుస్తున్నాడు: “ఆయుధాలతో ఆరు వందల రథాలు, యాభైవేల గుర్రపురౌతులు, రెండు వందల కాల్బలము వారిని వెంబడించాయి.” జోసీఫస్ యింకా యిలా చెబుతున్నాడు: “సమూయేలు పన్నెండు సంవత్సరాల వయస్సు వాడైనప్పుడు అతను ప్రవచించడం ప్రారంభించాడు; అతను పడుకున్నప్పుడు, దేవుడు అతన్ని పేరు పెట్టి పిలిచాడు.”—1 సమూయేలు 3:2-21 పోల్చండి.
జోసీఫస్ యితర రచనలు పన్ను, న్యాయం, యితర సంఘటనలపై అంతర్దృష్టిని అందిస్తోంది. హేరోదు ఏర్పాటు చేసిన విందులో నాట్యంచేసి, బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడిగిన స్త్రీ పేరు సలోమి అని పేర్కొన్నాడు. (మార్కు 6:17-26) హేరోదులను గూర్చి మనకు తెల్సినదంతా జోసీఫస్ నివేదించిందే. “తన [హేరోదు] పెరిగే వయస్సును కప్పిపుచ్చుకోడానికి అతను తన తలకు నల్ల రంగు వేసుకున్నాడని” కూడా ఆయన చెబుతున్నాడు.
గొప్ప రోమ్ వ్యతిరేక తిరుగుబాటు
యెరూషలేము దాని ఆలయాన్ని గూర్చి యేసు ప్రవచించిన 33 సంవత్సరాలకే దాని నెరవేర్పు ప్రారంభమైంది. యెరూషలేములోని యూదా తిరుగుబాటు కుట్రదారులు రోమ్ బంధాన్ని త్రోసివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సా.శ. 66లో దీన్ని గూర్చిన వార్త, సిరియా గవర్నరైన సెస్టస్ గాలస్ ఆధ్వర్యాన రోమ్ సైన్యము సమకూర్చబడి పంపించబడ్డానికి కారణమైంది. తిరుగుబాటును అణచి తప్పిదస్థులను శిక్షించడమే వారి ధ్యేయం. యెరూషలేము పరిసరప్రాంతాల్లో నాశనం కలగజేసిన తర్వాత, సెస్టస్ మనుష్యులు ప్రాకారంగల పట్టణాన్ని చుట్టుముట్టారు. టెస్ట్యుడో అనే పద్ధతిని ఉపయోగించి, తమ శత్రువు నుండి రక్షణ పొందడానికి తాబేలు వీపులా తమ డాళ్లను చేర్చడంలో విజయవంతులయ్యారు. ఈ పద్ధతి సాధించిన విజయాన్ని ధృవపరుస్తూ జోసీఫస్ యిలా పేర్కొన్నాడు: “వేసిన బాణాలు పడి, వారికి ఏ హాని కలిగించకుండా జారి ప్రక్కన పడ్డాయి; కాబట్టి సైనికులు తమకు హాని కలిగించుకోకుండా గోడ పునాదులను సడలించి, ఆలయ ద్వారానికి నిప్పంటించడానికి అన్నిటినీ సిద్ధంచేశారు.”
“అప్పుడు, సెస్టస్ . . . ఆ స్థలం నుండి తన సేనలను తిరిగి పిలిపించుకుని . . . అకారణంగా ఆ పట్టణం నుండి వెనుదిరిగాడు” అని జోసీఫస్ చెప్పాడు. స్పష్టంగా, దేవుని కుమారుని మహిమపర్చాలన్న ఉద్దేశం లేకుండానే యెరూషలేములోని క్రైస్తవులు ఎదురు చూసిన పనిని జోసీఫస్ రాశాడు. అది యేసు ప్రవచన నెరవేర్పే! సంవత్సరాల పూర్వమే, దేవుని కుమారుడు యిలా హెచ్చరించాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపడకూడదు. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు.” (లూకా 21:20-22) యేసు ఆజ్ఞాపించినట్లు, ఆయన నమ్మకమైన అనుచరులు ఆ పట్టణం నుండి త్వరగా పారిపోయి దూరంగా జీవిస్తూ, తర్వాత విరుచుకుపడిన శ్రమనుండి తప్పించుకున్నారు.
రోమా సేనలు సా.శ. 70లో తిరిగి వచ్చినప్పుడు సంభవించిన పరిణామాలను జోసీఫస్ పూర్తి వివరణతో వ్రాసివుంచాడు. వెస్పాసియన్స్ మొదటి కుమారుడు, జనరల్ టైటస్ యెరూషలేమును దాని మహిమాన్విత ఆలయంతో జయించడానికి వచ్చాడు. పట్టణం లోపల, యుద్ధం చేసే తిరుగుబాటుదారులు ఆధీనమేర్పర్చుకోడానికి ప్రయత్నించారు. వారు అమితమైన చర్యలను చేపట్టారు, కనుక రక్తపాతం అధికంగా జరిగింది. కొందరు “తమ స్వగ్రామంలోని బాధల నుండి విముక్తి” కొరకు, “వారు తమ అంతర్గత విపత్తులతో ఎంతగా విసిగిపోయారంటే, రోమ్ తమపైకి దండెత్తాలని కోరారు,” అని జోసీఫస్ అన్నాడు. ధనవంతుల ఆస్తులను నాశనం చేసి, రోమన్లతో రాజీపడిపోతారనే అనుమానం గల ప్రముఖ వ్యక్తులను హత్యచేసిన “దొంగలు” అని ఆ అంతర్గత తిరుగుబాటుదారులను ఆయన పేర్కొన్నాడు.
పౌరపోరాటం జరుగుతుండగా, యెరూషలేములోని జీవిత పరిస్థితులు ఊహించలేని రీతిగా దిగజారిపోయాయి, చనిపోయినవారి శవాలు సమాధి చేయబడకుండానే మిగిలిపోయాయి. ఈ దేశద్రోహులు, “శవాలు ఒకదానిపై ఒకటి కుప్ప కూడుతున్నప్పుడు తమలో తాము పోరాడుకున్నారు” వారు తిండి కొరకు డబ్బుకొరకు ప్రజానీకాన్ని అణచివేశారు. బాధితుల ఘోష వినబడుతూనే ఉంది.
టైటస్, యూదులు తమ పట్టణాన్ని తన వశం చేసి తమ్మును తాము కాపాడుకొమ్మని ఉద్బోధించాడు. ఆయన “జోసీఫస్ను వారితో తమ స్వంత భాషలో మాట్లాడడానికి పంపించాడు; కారణం తమ దేశీయుని ఉద్బోధను వారు వింటారని అతను భావించాడు.” అయితే వారు జోసీఫస్ను తృణీకరించారు. ఇక అప్పుడు టైటస్ పూర్తి పట్టణం చుట్టూ కొసమొనలతో ఉన్న మ్రానులను గోడగా పాతించాడు. (లూకా 19:43) తప్పించుకునే ఏ ఆశా లేకుండా, కదలికలన్నీ నిషేధించబడినప్పుడు, కరువు “మనుష్యులను ఇళ్లతో కుటుంబాలతో నాశనం చేసింది.” ఎడతెరపి లేని పోరాటం మరణించినవారి సంఖ్య పెరిగేటట్లు చేసింది. తెలియకుండానే, టైటస్ బైబిలు ప్రవచనం నెరవేరుస్తూ యెరూషలేమును జయించాడు. ఆ తర్వాత దాని గొప్ప గోడలు రక్షిత కోటలను చూసి ఆయన యిలా చెప్పాడు: “ఈ దుర్గాల్లోనుండి యూదులను దేవుడు తప్ప మరెవరూ వెలికి తీయలేదు.” పది లక్షలకంటే ఎక్కువమంది యూదులు నాశనమయ్యారు.—లూకా 21:5, 6, 23, 24.
యుద్ధానంతరం
యుద్ధం తర్వాత జోసీఫస్ రోమ్కు తిరిగి వెళ్లాడు. ఫ్లేవియన్లు అందిస్తున్న వాటిని అనుభవిస్తూ, అతను రోమ్ పౌరునిగా వెస్పాసియన్ పాత భవనంలో జీవిస్తూ టైటస్ నుండి బహుమతులతో సామ్రాజ్య సంబంధమైన పెన్షన్లు అందుకున్నాడు. తర్వాత జోసీఫస్ వ్యాస వృత్తిని ఎన్నుకున్నాడు.
జోసీఫస్ “థియోక్రసి” అనే పదాన్ని కూర్చాడన్నది గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. యూదుల రాజ్యం గూర్చి అతను యిలా అన్నాడు: “మన ప్రభుత్వం, . . . దేవునికే అధికారాన్ని శక్తిని ఆపాదిస్తూ, అది దైవపరిపాలన అని పిలువబడగలదు.”
జోసీఫస్ తాను క్రైస్తవుడని ఎన్నడూ చెప్పుకోలేదు. అతను దేవుని ప్రేరణవల్ల రాయలేదు. అయితే, జోసీఫస్ రాసిన వృత్తాంతాల్లో జ్ఞానాభివృద్ధిని కలుగజేసే చారిత్రాత్మక విలువలున్నాయి.
[31వ పేజీలోని చిత్రం]
యెరూషలేము గోడలవద్ద జోసీఫస్