విలియమ్ విస్టన్—ధర్మవిరోధా లేక నిజాయితీ గల విద్వాంసుడా?
మీరు మీ నమ్మకాలకొరకు మీ ఉద్యోగాన్ని త్యాగం చేస్తారా? విలియమ్ విస్టన్ చేశాడు.
ఆయన బైబిలు బోధల విషయమై ఇంగ్లాండ్ చర్చీతో ఏకీభవించనప్పుడు, 18వ శతాబ్దం తొలి కాలంలో మత వివాదానికి కారణమయ్యాడు. తత్ఫలితంగా, ఆయనకు ధర్మవిరోధని ముద్రవేశారు. ఆవిధంగా ఆయన పద్ధతి ఆయనకు అవమానాన్ని తెచ్చిపెట్టింది గాని అది ఆయనకు గౌరవాన్ని కూడా సంపాదించింది.
విలియమ్ విస్టన్ ఎవరు? ఆయన ఏమి సాధించాడు?
ఓ బైబిలు విద్వాంసుడు
విలియమ్ విస్టన్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటిలోని సర్ ఐజక్ న్యూటన్తో పనిచేసిన ఎంతో తెలివిగల సహోద్యోగి. మీరు మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసీఫస్ వ్రాతలను ఇంగ్లీషులో చదివినట్లైతే, బహుశ మీరు 1736లో విస్టన్ అనువదించిన దాన్నే చదువుతుండవచ్చు. ఇతర అనువాదాలు ఉన్నప్పటికీ, అతని నోట్సులు వ్యాసాలతో సహా పాండిత్య ప్రస్తావనలు ఎంతో ఉన్నతమైనవిగా పరిగణించబడుతూ, ఇంకా ముద్రించబడుతున్నాయి. విస్టన్ సాధించినవాటిలో యిది అగ్రగణ్యమని అనేకులు భావిస్తుంటారు.
అయినప్పటికి, క్రైస్తవ గ్రీకు లేఖనాల నుండి విస్టన్ అనువదించిన ప్రిమిటివ్ న్యూ టెస్టమెంట్ను అలక్ష్యం చేయలేము. అది 1745లో అంటే ఆయన 78వ ఏట ప్రచురించబడింది. విస్టన్ నాలుగు సువార్తలనూ అపొస్తలుల కార్యములనూ కోడెక్స్ బెజాయ్ నుండి, పౌలు వ్రాసిన పత్రికలనూ క్లెరిమన్ కోడెక్స్ నుండి, ప్రకటనతో సహా మిగిలినవాటిని అలెగ్జాండ్రిన్ చేతి వ్రాతప్రతుల్లో నుండి అనువదించాడు. ఆయన 1 యోహాను 5:7లోని అప్రమాణిక భాగాన్ని జాగ్రత్తగా విడిచిపెట్టాడు. విస్టన్ ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఈ మూడు శ్రేష్ఠమైన పురాతన గ్రీకు మూలాలను ఎన్నుకున్నాడు.
స్పష్టంగా, విస్టన్ చేసినదానికి ఆయనకు బైబిలుపైన ఉన్న ప్రేమే ప్రేరణ నిచ్చింది. ప్రకృతి ఆరాధన ఆనాడు ఎంతో ప్రబలంగా ఉండేది. దేవున్ని నమ్మడానికి సముచితమైన ఏకైక ఆధారం హేతువాదం మాత్రమే దాని ఉపదేశం. విలియమ్ విస్టన్—హానెస్ట్ న్యూటొనియన్ అనే పుస్తకం ప్రకారం, ఆయన “పురాతన చరిత్రకు బైబిలు అమోఘమైన ఆధారమనే పారంపర్య దృక్పథాన్ని” దృఢంగా సమర్థించాడు. ఇక్కడ “న్యూటొనియన్” అనే పదం, ప్రిన్సిపియా అనే తన గణిత సూత్రాలకు సంబంధించి పేరుగాంచిన ఐజక్ న్యూటన్న్ను సూచిస్తుంది. ఆ గ్రంథంలో అతను గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని ప్రతిపాదించాడు. న్యూటన్ ఆలోచనలు విలియమ్ విస్టన్పై చాలా ప్రభావాన్ని చూపాయి. ఎలా?
విరుద్ధ వ్యక్తిత్వాలు
విలియమ్ విస్టన్ 1667లో ఉద్భవించిన ఇంగ్లాండ్ చర్చిలోని ఓ మతనాయకుని కుమారుడు. విస్టన్ 1693లో ప్రీస్టుగా నియమితుడైన తర్వాత, గణిత శాస్త్రం పఠించి న్యూటన్‌కు సహాయకునిగా పని చేయాలని కేంబ్రిడ్జ్ యూనివర్శిటికి వచ్చాడు. వారి మధ్య సన్నిహిత సంబంధమేర్పడింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు గణాంక ల్యూకాజన్ ప్రొఫెసర్‌గా న్యూటన్ తన పదవిని పరిత్యజించినప్పుడు విస్టన్ను తనకు మారుగా నియమించేటట్లు చేశాడు. తన వృత్తిలో కొనసాగుతూ విస్టన్ ఖగోళ శాస్త్రం, గణితంపై లెక్చర్లిచ్చేవాడు, అయితే న్యూటన్ ప్రభావం విస్టన్న్ను బైబిలు కాలవృత్తాంతం, సిద్ధాంతాల్లో లోతైన ఆసక్తిని కనపర్చడానికి పురికొల్పింది.
న్యూటన్ ఓ మతపరమైన వ్యక్తి. బైబిలు సంబంధిత వేయి సంవత్సరములందు సమర్పిత విశ్వాసిగా ఆయన దానియేలు, ప్రకటన గ్రంథాల ప్రవచనాలపై ఎంతో వ్రాశాడు. అయితే, ఆయన జీవిత కాలంలో ఆయన వ్రాసినవాటిలో ఒక్కటి కూడా ప్రచురించబడలేదు. ఆయన త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. అయితే, త్రిత్వ ఆయన చూసిన, సిద్ధాంతానికి వ్యతిరేక రుజువులను ప్రచురించే విషయం వచ్చేటప్పటికి, “తన త్రిత్వ వ్యతిరేక దృక్పథాలు బహిర్గతమౌతాయనే భయంతో న్యూటన్ వెనుదిరిగాడు” అని ది న్యూటన్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అభిప్రాయపడింది. ఎఫ్. ఇ. మాన్యూల్, ఐజక్ న్యూటన్, హిస్టారియన్ అనే పుస్తకంలో యీ విధంగా చెప్పాడు: “న్యూటన్ గుంపు తమ అభిప్రాయాలను రహస్యంగా ఉంచుకుంది లేక తమ ఉత్సాహాన్ని అణిచివేసుకుంది. . . . న్యూటన్ తన ఆలోచనలను రహస్యంగా ఉంచదల్చుకున్నాడు గాని విస్టన్ వాటిని గూర్చి బహిరంగంగా మాట్లాడాడు.” అలా ఈ యిద్దరు వ్యక్తులకు విరుద్ధ వ్యక్తిత్వాలుండేవి.
బహిష్కారం
అథనేషియన్ (ఒప్పందం)లో చెప్పబడిన అబద్ధ త్రిత్వ బోధ దృష్ట్యా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సిద్ధాంతమందు సంస్కరణ తేవాల్సిందిగా వత్తిడి చేస్తూ విస్టన్ 1708 జూలైలో కాంటర్బరి, యార్క్ ఆర్చి బిషప్పులకు వ్రాశాడు. ఆయన్ను జాగ్రత్తగా ఉండమంటూ సలహా యిచ్చారన్నది మనం అర్థం చేసుకోగలం. అయినా విస్టన్ విడిచిపెట్టలేదు. “నేను ఈ విషయాలను కూలంకషంగా పరిశీలించాను” అని అంటూ, “క్రైస్తవ చర్చీ ఎంతో కాలంగా ఈ విషయంలో ఘోరంగా మోసపోతోందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మరి దేవుని ఆశీర్వాదంవల్ల, అది నా అధికారం క్రింద ఉండి ఉంటేనా క్రైస్తవ చర్చీ యిక ఎన్నడూ మోసపోదు” అని అన్నాడు.
న్యూటన్ తన సాంఘిక, విద్యాపరపతి పోతుందని భయపడ్డాడు. గాని విస్టన్ భయపడలేదు. తన త్రిత్వ వ్యతిరేక నమ్మకాలను తయారుచేసిన తర్వాత, తన దృక్పథాలను వ్యక్తపరుస్తూ ఓ కరపత్రాన్ని రాశాడు. అయితే ఆగస్టు 1708లో ఈ సమాచారం సాంప్రదాయ విరుద్ధంగా కనిపించింది గనుక దాన్ని ప్రచురించడానికి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఆయనకు లైసెన్స్‌ను యివ్వలేదు.
ఇంగ్లాండ్ చర్చీకి విరుద్ధమైన సిద్ధాంతాలను బోధిస్తున్నాడన్న నేరం విస్టన్పై 1710లో మోపబడింది. ఆయన తప్పు చేశాడని, ఆయన్ను ప్రొఫెసర్ ఉద్యోగంనుండి పదవీచిత్యుని చేసి, కేంబ్రిడ్జ్ నుండి నిషేధించారు. అయితే, యింకా 5 సంవత్సరాల వరకూ కొనసాగిన న్యాయ కార్య వ్యవహారాలు జరుగుతున్నప్పటికి, విస్టన్ ధర్మవిరోధియని ఎన్నడూ నిందించబడలేదు.
న్యూటన్ త్రిత్వ విరుద్ధ ఆలోచనలు విస్టన్తో ఏకీభవిస్తున్నప్పటికీ అతను తన స్నేహితుని పక్షంలో ఒక్క మాటకూడా పలకలేదు, చివరికి ఆయన్ను బహిష్కరించాడు. చివరికి 1754లో న్యూటన్ వ్రాసిన త్రిత్వాన్ని బహిర్గతం చేసే బైబిలు ఆధారిత గ్రంథం ప్రచురించబడింది—అదీ ఆయన మరణించిన 27 సంవత్సరాల తర్వాత. అయితే, రెండు సంవత్సరాల ముందు చనిపోయిన విస్టన్కు సహాయపడ్డానికి అది చాలా ఆలస్యమైపోయింది.
ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ నుండి విస్టన్ బహిష్కరించబడ్డానికి న్యూటన్ కూడా కారకుడని బావించబడ్డాడు. అయితే విస్టన్ నిరుత్సాహం చెందలేదు. ఆయన, ఆయన కుటుంబం లండన్‌కు వెళ్లి అక్కడ ప్రాచీన క్రైస్తవత్వాన్ని ప్రబోధించడానికి ఒక సంస్థను స్థాపించాడు. అప్పట్లో ఆయనకు అతి ప్రాముఖ్య పనియైన నాలుగు సంపుటలున్న ప్రిమిటివ్ క్రిస్టియానిటి రివైవ్డ్ రాయడంలో తన శక్తినంతటినీ ధారపోశాడు.
చివరివరకు వివాదాస్పదంగా ఉండడం
ఓ వైజ్ఞానికునిగా విస్టన్, నావికులు సముద్రం లోతుపాతులను కనుక్కోగల వివిధ పద్ధతులను తెలుసుకున్నాడు. ఆయన ఆలోచనలు అవలంభించబడక పోయినప్పటికి, అతని పట్టుదల చివరికి నావిక క్రోనోమీటరును తయారు చేయడానికి సహాయపడింది. తన సమకాలికుల్లాగే బైబిలు ప్రవచనాలపైనున్న విస్టన్కున్న అనేక దృక్పథాలు, సరైనవి కావని నిరూపించబడినప్పటికి, సత్యాన్ని అన్వేషించడానికి ఆయన అన్ని మార్గాలనూ వెదికాడు. ఉల్కల కక్ష్య, నోవహు దినాల్లోని జలప్రళయం పరిణామాలను గూర్చిన ఆయన వ్రాసిన కరపత్రాలు, ఆయన విజ్ఞానము బైబిలు సత్యాల పక్షాన వాదించడానికి రాసినవాటిలో కొన్ని మాత్రమే. అయితే, ఆయన యితర వ్రాతలను అధిగమించేవేమంటే, త్రిత్వ సిద్ధాంతం లేఖనాధారితం కాదని బహిర్గతం చేసే వ్రాతలు.
ఆయన సహజంగా చేసేటట్లు, విస్టన్ ఇంగ్లాండ్ చర్చీని 1747లో విడిచిపెట్టాడు. ఓ మతగురువు అథనేషియన్ క్రీడ్ చదువుతుండగా ఆయన చర్చి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఆయన దాన్ని అక్షరార్థంగా సూచనార్థకంగా కూడా విడిచిపెట్టాడు. ఎ రిలిజియస్ ఎన్సైక్లోపీడియా విస్టన్న్ను గూర్చి యిలా చెబుతోంది: “ధైర్యంగా దాపరికం లేకుండా మాట్లాడ్డాన్ని, ఆయన వ్యక్తిత్వపు సత్యసంధతనూ, ఆయన జీవితపు స్థిరత్వాన్ని, ఆయన ప్రవర్తన యొక్క సూటితనాన్ని ఎవరైనా మెచ్చుకోవల్సిందే.”
విలియమ్ విస్టన్కు సత్యం అంటే రాజీపడేది కాదు, అంతేకాదు వ్యక్తిగత ఒప్పుదల మనుష్యుల మెప్పు ప్రశంసలకంటే ఎంతో విలువైనదని ఆయన భావించాడు. విస్టన్ వివాదాస్పద వ్యక్తిగా ఉన్నా, ధైర్యంగా బైబిలును దేవుని వాక్యంగా సమర్థించిన ఓ నిజాయితీ గల విద్వాంసుడు—2 తిమోతి 3:16, 17.
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
Copyright British Museum