కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/1 పేజీలు 4-7
  • పోటీతత్వం గల సమాజంలో మనశ్శాంతి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పోటీతత్వం గల సమాజంలో మనశ్శాంతి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పోటీతత్వం యొక్క మూలం
  • పోటీలేకుండ విజయం
  • మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి
  • విజయానికి పోటీ కీలకమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • రక్షణ కేవలం క్రియలద్వారా కాదు, కృపద్వారా లభిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మీరు ‘ఆత్మానుసారంగా నడుచుకుంటూనే’ ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • పోటీతత్వాన్ని కలిగించకుండా శాంతిని పెంపొందించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/1 పేజీలు 4-7

పోటీతత్వం గల సమాజంలో మనశ్శాంతి

“ఎవడైనను మొదటి వాడై యుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెను,” అని యేసుక్రీస్తు తన అపొస్తలులకు సలహా ఇచ్చాడు. తమలో ఎవరు గొప్ప అని అపొస్తలులు తమలో తాము వాదించుకునేవారు. అలాంటి స్వభావాన్ని యేసు అసహ్యించుకుంటాడని వారికి తెలుసు. తన శిష్యులకు ఆత్మీయాభివృద్ధి కల్గించటానికి ఆయన ఎన్నడూ వారిని ఒకరిపై ఒకరు పోటీపడేలా చేయలేదు.—మార్కు 9:33-37.

భూమి మీదికి రాకముందు, యేసుక్రీస్తు మొదటి మానవ జతను సృష్టించడంలో భాగం వహించాడు, వారు ఎలా చేయబడ్డారో ఆయనకు తెలుసు. (కొలొస్సయులు 1:15, 16) క్రూరంగా ఇతరులతో పోటీపడకుండానే అభివృద్ధి చెందగల సామర్థ్యంతో మొదటి మానవులు సృష్టించబడ్డారు. తమలో నాయకుడెవరు అనేది నిర్ణయించటానికి తాము పోట్లాడుకోవలసిన అవసరతగాని, జీవన పోరాటానికి జంతువులతో పోటీపడవలసిన అవసరతగాని మానవులకు లేకుండెను.—ఆదికాండము 1:26; 2:20-24; 1 కొరింథీయులు 11:3.

పోటీతత్వం యొక్క మూలం

అయితే, ఈ తీవ్రమైన పోటీతత్వం మానవ సమాజంలో ఎలా అంత ప్రబల శక్తిగా తయారైంది? మానవ చరిత్రలోని మొదటి హత్య దీనికి ఒక ఆధారాన్నిస్తుంది. మొదటి మానవ దంపతుల పెద్ద కుమారుడైన కయీనుకున్న పోటీతత్వం ఈ దుస్సంఘటనకు దారితీసింది. హేబెలు బలిని దేవుడు ఇష్టపడ్డాడు, తనది ఇష్టపడలేదు గనుక కయీను తన సహోదరుడైన హేబెలును చంపాడు. కయీను “దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను” అని బైబిలు చెబుతున్నది.—1 యోహాను 3:12; ఆదికాండము 4:4-8.

అవును, దుష్టుడైన అపవాదియగు సాతాను ఈ పోటీతత్వ స్వభావానికి ఆరంభకుడు, దానిని వృద్ధిచేయువాడు. అతడు ఉన్నతాధిక్యతలు గల దేవుని కుమారుడైన దూతగా ఉండిననూ ఇంకా ఎక్కువ కావాలని కోరుకున్నాడు. (యెహెజ్కేలు 28:14, 15 పోల్చండి.) అతడు హవ్వను మోసపర్చినప్పుడు, అతడు తన కోరికను వెల్లడిచేశాడు. తినవద్దన్న పండు తినడం ద్వారా “దేవతలవలె” అవుతారని అతడు చెప్పాడు. (ఆదికాండము 3:4, 5) యెహోవా ప్రత్యర్థిగా, దేవునిలా ఉండాలని నిజానికి సాతానే కోరుకున్నాడు. దేవునితో పోటీపడాలనే తత్వం అతడు తిరుగుబాటు చేయటానికి పురికొల్పింది.—యాకోబు 1:14, 15.

ఈ తత్వం ఒక అంటువ్యాధి లాంటిది. సాతాను ప్రభావం క్రింద, ఆదిమ కుటుంబానికి దేవుడనుగ్రహించిన సమాధానం సమసిపోయింది. (ఆదికాండము 3:6, 16) దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటి నుండి అపవాదియగు సాతాను ఈ పోటీతత్వాన్ని పెంచిపోషిస్తూ మానవజాతిని పరిపాలిస్తున్నాడు, అంతేగాక విజయానికి తీవ్రమైన పోటీ కీలకమని స్త్రీపురుషులు నమ్మేలా మోసపుచ్చుతున్నాడు. అయినా, బైబిలిలా వివరిస్తుంది: “మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.” (యాకోబు 3:14-16) అలా సాతాను మనిషికి సంతోషము, మనశ్శాంతి దక్కకుండా చేశాడు.

పోటీలేకుండ విజయం

సాతాను ప్రోద్భలానికి వ్యతిరేకంగా, పోటీ లేని విజయాల ఉదాహరణల గురించి బైబిలు తెలియజేస్తుంది. వాటిలో ప్రముఖమైంది యేసుక్రీస్తు ఉదాహరణ. ఆయన దేవుని స్వరూపంలో ఉన్నప్పటికీ దేవునితో సమానంగా ఉండటాన్ని గూర్చి ఆయనెప్పుడూ తలంచలేదు గాని, దాసుని రూపం ధరించి భూమి మీదికి వచ్చాడు. అంతకంటే ఎక్కువగా, తనను తాను తగ్గించుకుని మ్రానుపై మరణించేంతగా ఆయన విధేయత చూపించాడు. పోటీతత్వానికి వ్యతిరేకమైన ఈ విధేయతా దృక్పథం, ఆయన దైవిక అనుగ్రహం పొందడానికి దారితీసింది. “అందుచేతను . . . దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులు 2:5-9) ఏ ప్రాణియైనా అంతకంటే గొప్ప విజయాన్ని సాధించగలదా? ఏ ప్రాణి ప్రీతిపర్చలేనంతగా ఆయన తన తండ్రిని ప్రీతిపర్చాడు, ఆయన ఏవిధమైన పోటీతత్వం లేక విరోధభావం లేకుండా దీన్ని చేశాడు.—సామెతలు 27:11.

పరలోకంలో ఉన్న అసంఖ్యాకమైన విశ్వాసంగల దేవదూతలు అదే దృక్పథాన్ని కనపరుస్తారు. యేసు దేవదూతల అధిపతియైనప్పటికీ, భూమి మీదికి వచ్చినప్పుడు వారికంటే కొంచెము తక్కువవానిగా చేయబడ్డాడు, అయినా వారు ఇష్టపూర్వకంగా ఆయన అవసరతలు తీర్చారు. పరిస్థితిని ఆధారంగా తీసుకుని, ప్రధానదూతగా అతనికున్న స్థానాన్ని ఆక్రమించటానికి ప్రయత్నించాలనే తలంపును వారు అనుమతించలేదు.—మత్తయి 4:11; 1 థెస్సలొనీకయులు 4:16; హెబ్రీయులు 2:7.

కొంతమంది అపరిపూర్ణ మానవులను “దేవదూతలకు తీర్పుతీర్చ” గల స్థానంలో అమర్త్యమైన ఆత్మీయ జీవాన్నిచ్చి ఉన్నతపర్చే దేవుని సంకల్పానికి అనుకూలంగా ప్రతిస్పందించిన దేవదూతల విధానాన్ని మనం పరిశీలించినప్పుడు పోటీ దృక్పథమంటే వారికున్న విముఖత మరీ స్పష్టమవుతుంది. (1 కొరింథీయులు 6:3) యెహోవాను సేవించడంలో దేవదూతలకు అపారమైన అనుభవం ఉంది, వారు మంచి చేయడంలో అపరిపూర్ణ మానవులకంటే ఎంతో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగివున్నారు. అయినా, భూమిపైనున్న అభిషక్తులకు దేవదూతలు సంతోషంగా సేవ చేస్తారు, వీరు పొందబోయే దాన్నిబట్టి దేవదూతలు ఎన్నడూ అసూయచెందరు. (హెబ్రీయులు 1:14) సర్వాధిపతియైన యెహోవా సింహాసనం యెదుట సేవ చేయడంలో కొనసాగటానికి వారి చక్కని, పోటీరహిత దృక్పథం వారికి సహాయం చేస్తుంది.

తరువాత, భూమిమీదికి పునరుత్థానం చేయబడే ప్రాచీన విశ్వాసులైన దేవుని సేవకుల గురించి ఆలోచించండి. అబ్రాహాము విశ్వాసం విషయంలో ఒక అసాధారణ మాదిరిగా ఉండి, “నమ్మినవారికందరికి అతడు తండ్రి” అని పిలువబడ్డాడు. (రోమీయులు 4:9, 11) సహనం విషయంలో యోబు శ్రేష్ఠమైన మాదిరినుంచాడు. (యాకోబు 5:11) మోషే “భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు,” ఆయన ఇశ్రాయేలీయులు స్వతంత్రులగుటకు నడిపించాడు. (సంఖ్యాకాండము 12:3) అపరిపూర్ణ మానవులలో వీరి కంటే మరెవరు విశ్వాసం, సహనం, మరియు సాత్వికం విషయంలో ఇంతకంటే మంచి మాదిరినుంచారు? అయినా, వారు దేవుని రాజ్యము క్రింద భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. (మత్తయి 25:34; హెబ్రీయులు 11:13-16) వారు, బాప్తిస్మమిచ్చే యోహానులా, “పరలోకరాజ్యములో అల్పుడైన వాని” కంటే తక్కువ వారిగా లెక్కించబడతారు. (మత్తయి 11:11) పరలోకంలో జీవం ఇవ్వబడిన వారితో తమ విశ్వాసం, సహనం, లేక సాత్వికం సమానమైనవని లేక కొన్నిసార్లు ఎక్కువైనవని పట్టుబట్టి, ఫిర్యాదు చేయటాన్ని గురించి వారు కనీసం ఆలోచించనైనా ఆలోచిస్తారా? కచ్చితంగా అలా ఆలోచించరు! దేవుని రాజ్యంలో భూసంబంధులుగా వారు సంతోషంగా ఉంటారు.

నేడు కూడా, పోటీ దృక్పథం లేని ప్రజల సాన్నిధ్యం కోరదగినది. మొదటి శీర్షికలో ప్రస్తావించబడిన యాసువో, బంగారం వ్యాపారం చేయాలనే తలంపులో పూర్తిగా అప్పుల్లో పడిపోయి, తన ఆస్తినంతటినీ కోల్పోయాడు. అతని “స్నేహితులు” అతన్ని విడిచిపెట్టారు. అతని భార్య యెహోవాసాక్షులతో బైబిలు పఠనం ప్రారంభించగా, తన కుటుంబానికి తాను కలిగించిన బాధకు అతడు పశ్చాత్తాపం చెందుతూ వారి కూటాలకు వెళ్లాడు. చివరికి, ఆయన తన పోటీతత్వాన్ని విడిచిపెట్టి, యెహోవాసాక్షుల్లో ఒకడయ్యాడు. బాధల సమయంలో అతనికి సహాయపడటానికి ఇష్టపడేవారైన క్రైస్తవ స్నేహితుల మధ్య ఉండుటకు అతడిప్పుడు ఆనందిస్తున్నాడు.

మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి

దయలేని, పోటీతత్వం గల సమాజంలో మనశ్శాంతిని కాపాడుకోవటం ఎల్లప్పుడూ సులభం కాదు. “ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయల” వంటివి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కొనకుండా ప్రజలను ఆటంకపరచే “శరీరకార్యములని” బైబిలు ఖండిస్తున్నదని గమనించుడని మనకు చక్కగా సలహా యివ్వబడింది. ఈ కార్యాలన్నీ పోటీతత్వంతో సన్నిహిత సంబంధాన్ని కలిగివున్నాయి. అపొస్తలుడైన పౌలు గలతీయులను ఇలా ప్రోత్సహించడంలో ఆశ్చర్యంలేదు: “ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.”—గలతీయులు 5:19-21, 26.

సందర్భానుసారంగా, పౌలు వ్రాసిన ఉత్తరం స్వయం ప్రాధాన్యతా పోటీని ఎదుర్కోటానికి కీలకాన్ని చూపించింది. ఆయనిలా అన్నాడు: “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.” (గలతీయులు 5:22, 23) మన మనస్సులలో నుండి విరోధాన్ని తీసివేయటానికి ఆత్మఫలాలు మనకు సహాయం చేస్తాయి. ఉదాహరణకు, ప్రేమ అనే లక్షణాన్ని పరిశీలించండి. పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు.” (1 కొరింథీయులు 13:4-7) ప్రేమను పెంపొందించుకోవటం ద్వారా మనం పోటీతత్వానికి మూల శక్తియైన అసూయను తీసేసుకోవచ్చు. ఇతర ఆత్మఫలాలు కూడా మన హృదయాలు, మనస్సుల్లో నుండి తీవ్రమైన, పోటీతత్వ ఛాయలను తుడిచివేసుకోవటానికి సహాయం చేస్తాయి. అంతెందుకు, ఫలితం ఏమైనప్పటికీ ఇతరులతో పోటీపడాలనే కోరిక ఏమైనా తలయెత్తుతుంటే ఆత్మ నిగ్రహంతో త్వరలోనే దానిని అణచివేయవచ్చు!—సామెతలు 17:27.

అయితే, ఈ లక్షణాలను పెంపొందించుకోవాలంటే, మనపై దేవుని ఆత్మ పనిచేయటానికి అనుమతించాలి. పట్టుదలతో ప్రార్థించడం ద్వారా, దేవుని ఆత్మను మనకు సహాయం చేయమని అడగటం ద్వారా మనం పరిశుద్ధాత్మ చేసే ఈ యుక్తమైన చర్యను ప్రోత్సహించవచ్చు. (లూకా 11:13) మన ప్రార్థనలకు సమాధానంగా, దేవుడు మనకేమి అనుగ్రహిస్తాడు? బైబిలిలా జవాబిస్తుంది: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”—ఫిలిప్పీయులు 4:6, 7.

యేసు అపొస్తలుల విషయంలో ఇది నిజమైంది. యేసు తన చివరి రాత్రి అపొస్తలులతో ప్రభురాత్రి భోజనాన్ని ఏర్పాటు చేసిన తరువాత కూడా, వారు తమలో ఎవరు గొప్ప అనే విషయం గురించి తగవులాడు కొంటూనేవున్నారు. (లూకా 22:24-27) వారి ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవటానికి సహాయం చేయాలని యేసు అనేక సందర్భాల్లో ప్రయత్నించాడు, కాని ఈ పోటీ దృక్పథం వారిలో లోతుగా నాటుకుపోయింది. (మార్కు 9:34-37; 10:35-45; యోహాను 13:12-17) అయితే, వివాదం తరువాత దాదాపు 50 రోజులకు వారు పరిశుద్ధాత్మను పొందాక, వారి దృక్పథం మారిపోయింది. పెంతెకొస్తు దినాన సమావేశమైన ఆసక్తిగల జనసమూహాన్ని ఉద్దేశించి ఎవరు ప్రసంగించాలనే విషయం మీద వాదన జరుగలేదు.—అపొస్తలుల కార్యములు 2:14-21.

క్రైస్తవ సంఘంలో మానవ ఆధిపత్యానికి తావు లేకుండెను. వారు సున్నతిని గూర్చిన సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు, యేసు మరణ సమయానికి కనీసం శిష్యుడు కూడా కాని యాకోబు, ఆ ప్రాముఖ్యమైన సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఆ క్రైస్తవ సంఘ పరిపాలక సభ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించాలన్న దానిపై వివాదం ఏర్పడిన సూచన ఏదీ లేదు. పోటీతత్వంతో అపొస్తలులు కళంకమైన సమయానికి, ఇప్పటికీ ఎంత తేడా ఉంది! పరిశుద్ధాత్మ సహాయంతో, వారు యేసు బోధలను జ్ఞాపకం చేసుకుని, ఆయన పాఠాల భావాన్ని గ్రహించటం మొదలు పెట్టారు.—యోహాను 14:26.

మన విషయంలోనూ ఇదే నిజం కాగలదు. పరిశుద్ధాత్మ సహాయంతో, ఇతరులకెట్టి నష్టం కల్గిననూ మనం అభివృద్ధి పొందాలని వారితో పోటీ పడాలనే వదలని ఆ కోరికను అధిగమించవచ్చు. అంతేగాక, అన్ని ఆలోచనలను అధిగమించే మనశ్శాంతిని మనం పొందవచ్చు. తీవ్ర పోటీకి మూలమైన అపవాదియగు సాతాను, త్వరలోనే అగాధంలో పడవేయబడతాడని, నిష్క్రియునిగా చేయబడతాడని బైబిలు మనకు రూఢిగా తెలియజేస్తుంది. (ప్రకటన 20:1-3) ఇరుగుపొరుగువారి మధ్య వైరుధ్యం ఇక ఉండదు. ఫలితంగా, అది ఏ అభివృద్ధిలేని సమాజమై ఉంటుందా? ఎంతమాత్రం కాదు! తమలో తాము పోటీ పడటం ద్వారా కాదుగాని, యేసు విమోచనా బలిని అన్వయించుకోవడం ద్వారా మానవులు పరిపూర్ణతకు ఎదుగుతారు.—1 యోహాను 2:1, 2.

ముందు ప్రస్తావించబడిన కానొస్కే కార్ల అమ్మకంలో రికార్డు సృష్టించి లోకసంబంధ విజయ వైభవాన్ని అనుభవించి, మానసికంగా, శారీరకంగా అలిసిపోయి, చివరికి ఉద్యోగం వదిలేసాడు. “ఇప్పుడు నా జీవితమంతా నిజమైన ఆనందంతో నిండిపోయింది,” అని అతడు చెబుతున్నాడు. యేసు జీవితం నిజమైన విజయానికి చిహ్నంగా ఎందుకుందో అతడు తెలుసుకోగలిగాడు. దేవుని ప్రపంచవ్యాప్త సంఘంలో తాను ఏమి చేయగలిగినప్పటికీ, దాని గురించి ఇప్పుడు అతడానందిస్తున్నాడు. అలా, పోటీ ఉండని నూతన లోకం కొరకు అతడు సిద్ధం చేయబడుతున్నాడు. మీ ప్రాంతంలో ఉన్న రాజ్యమందిరాన్ని దర్శించి, యెహోవాసాక్షులతో సహవసించడం ద్వారా మీరు కూడా ఈ నూతన లోక సమాజాన్ని దృశ్యీకరించుకోవచ్చు.

[7వ పేజీలోని చిత్రం]

దేవుని నూతన లోకంలో మానవ సమాజం శాంతి, సహకారాలను అనుభవించును

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి