అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా యెహోవా తీర్పు
“యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్యవర్తనులు, . . . వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రావలెనైరి.”—యిర్మీయా 23:14.
1. దైవిక బోధలో నిమగ్నమైయున్నవారు ఎందుకు చాలా గంభీరమైన బాధ్యతను స్వీకరిస్తారు?
దైవిక బోధలో నిమగ్నమైయున్నవారెవరైనా చాలా గంభీరమైన బాధ్యతను వహిస్తారు. యాకోబు 3:1 యిలా హెచ్చరిస్తుంది: “నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.” ఔను, సామాన్య క్రైస్తవులకంటే దేవుని వాక్యాన్ని బోధించేవారు అంగీకారమైన లెక్కఒప్పచెప్పవలసిన అతిగంభీరమైన బాధ్యతను కల్గియున్నారు. అబద్ధ బోధకులకు దీని భావమేమైయుంటుంది? యిర్మీయా కాలంలోనున్న పరిస్థితిని మనమొకసారి చూద్దాం. ఈనాడు జరుగుతున్న దానికి ఏవిధంగా ఇది ముందుసూచనగా వుందో మనం గమనిద్దాము.
2, 3. యెరూషలేము అబద్ధ బోధకుల సంబంధంగా యిర్మీయా ద్వారా యెహోవా ఏ తీర్పు తీర్చాడు?
2 సా.శ.పూ. 647లో, యోషీయారాజు ఏలుబడిలో 13వ సంవత్సరమున యిర్మీయా యెహోవాకు ప్రవక్తగా నియమింపబడ్డాడు. యూదాకు విరుద్ధంగా యెహోవా ఫిర్యాదును కల్గియుండెను, కాబట్టి దానిని ప్రకటించుటకు ఆయన యిర్మీయాను పంపాడు. దేవుని దృష్టిలో యెరూషలేము ప్రవక్తలు, లేదా బోధకులు “ఘోరమైన క్రియలు” చేస్తూ వుండిరి. వారి చెడుతనము ఎంత గొప్పదంటే దేవుడు యెరూషలేము యూదాలను, సొదొమ గొమొర్రాలతో పోల్చాడు. దీని గురించి మనకు యిర్మీయా 23వ అధ్యాయం తెలియజేస్తుంది. పధ్నాల్గవ వచనం యిలా చెబుతుంది:
3 “యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమవలెనైరి, దాని నివాసులు గొమొర్రావలెనైరి.”
4. యెరూషలేము బోధకుల చెడ్డ నైతిక మాదిరి ఎలా నేడు క్రైస్తవమత సామ్రాజ్యాన్ని పోలి ఉంది?
4 నిజమే, ఈ ప్రవక్తలు, లేదా బోధకులు, చాలా అవినీతికరమైన మాదిరి నుంచారు, దానితో ప్రజలుకూడా అలాగే చేయటానికి ప్రోత్సహించబడ్డారు. క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఈనాటి పరిస్థితులను గమనించండి! వారు యిర్మీయా కాలంలోని వారివలెనే లేరా? ఈనాడు మతనాయకులు వ్యభిచారులను, సలింగ సంయోగులను మతనాయకుల హోదాలలో ఉండుటకు అనుమతిస్తున్నారు, మరి చర్చి సేవలనుకూడా నిర్వహించుటకు వారిని అనుమతిస్తున్నారు. చర్చి సభ్యులలో చేరిన చాలామంది కూడా అవినీతిపరులే అనడంలో ఆశ్చర్యమున్నదా?
5. క్రైస్తవమత సామ్రాజ్య అవినీతికర పరిస్థితి ఎందుకు సొదొమ, గొమొర్రాల పరిస్థితిని మించివుంది?
5 యెరూషలేము నివాసులను యెహోవా సొదొమ, గొమొర్రావారితో సరిపోల్చాడు. కాని క్రైస్తవమత సామ్రాజ్య అవినీతికర పరిస్థితి సొదొమ, గొమొర్రాలకంటే చాలా చెడ్డదిగావున్నది. ఔను, యెహోవా దృష్టిలో క్రైస్తవమత సామ్రాజ్యం మరెక్కువ నిందింపదగినదిగా వుంది. దాని బోధకులు క్రైస్తవ నీతిచట్టాన్ని హేళన చేశారు. ఇది అన్నిరకాల చెడును చేయుటకు పురికొల్పే కపట ఆకర్షణలతో నైతికంగా భ్రష్టమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఈ నైతిక పరిస్థితి ఎంతగా వ్యాప్తిలోనుందంటే, ఈనాడు చెడు అనేది సాధారణమైందిగా దృష్టించబడుతున్నది.
“అసత్యవర్తనులుగా ఉండుట”
6. యెరూషలేము ప్రవక్తల చెడుతనాన్ని గురించి యిర్మీయా ఏమి చెప్పాడు?
6 ఇపుడు 14వ వచనం యెరూషలేము ప్రవక్తల గురించి ఏమి చెబుతుందో చూడండి. వారు “అసత్యవర్తనులుగా” నుండిరి. పదిహేనవ వచనం తరువాతిభాగం యిలా చెబుతుంది: “యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను.” ఆ తరువాత, 16, 17 వచనాలలో యిలా చదువబడుతుంది: “సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. . . . ఒకడు తన హృదయమూర్ఖత చొప్పున నడవగా వానితో—మీకు కీడురాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు.”
7, 8. క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు ఎందుకు యెరూషలేము అబద్ధ ప్రవక్తలవలె ఉన్నారు, చర్చికి వెళ్లే వారిని ఇది ఎలా ప్రభావితం చేసింది?
7 యెరూషలేములోని అబద్ధ ప్రవక్తలవలే, క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు కూడా అసత్యంలో నడుస్తూ, దేవుని వాక్యంలో లేనటువంటి, బోధలను, మతభ్రష్ట సిద్ధాంతాలను వ్యాప్తిచేస్తున్నారు. ఈ అబద్ధ బోధలలో కొన్ని ఏమైయున్నవి? ఆత్మ అమరత్వం, త్రిత్వము, పర్‌గెటరీ, ప్రజలను నిత్యమూ బాధించే నరకాగ్ని. ప్రజలు వినాలని కోరే వాటినే ప్రకటిస్తూ వారు వినువారిని కేవలం రంజింపజేస్తున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యానికి దేవుని సమాధానముంది కాబట్టి, అది యేవిధమైన దుర్దశనూ ఎదుర్కొనబోదని వారు పదేపదే చెబుతున్నారు. కాని మతగురువులు “తమకు తోచిన దర్శనమునుబట్టి” మాట్లాడుచున్నారు. అది అబద్ధమే. అలాంటి అబద్ధాలు నమ్మేవారు ఆత్మీయంగా విషపూరితమగుదురు. వారు దారితప్పింపబడి తమ నాశనానికే నడిపించ బడుతున్నారు!
8 ఈ అబద్ధబోధకులను గూర్చి 21వ వచనంలో యెహోవా ఏమిచెబుతున్నాడో పరిశీలించండి: “నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తివచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.” అలాగే ఈనాడు, మతగురువులు దేవునిచే పంపబడనూలేదు, వారాయన సత్యాలను బోధించడమూ లేదు. ఫలితమేమైయుంది? చర్చికి వెళ్లేవారిని వారి పరిచారకులు లోకసంబంధ తత్వజ్ఞానంతో నింపిన కారణంగా వారు బైబిలుకు సంబంధించిన విషయాలలో అజ్ఞానులుగా నున్నారు.
9, 10. (ఎ) యెరూషలేము అబద్ధ బోధకులకు ఎలాంటి స్వప్నాలు కలిగాయి? (బి) అలాగే క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులు ఎలా “మాయా స్వప్నములను” బోధించారు?
9 అంతేకాకుండా, మతగురువులు ఈనాడు అబద్ధ నిరీక్షణలను ఘోషిస్తున్నారు. ఇరవైఐదవ వచనాన్ని గమనించండి: “కలకంటిని, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికినమాట నేను వినియున్నాను.” అవి ఎలాంటి కలలైయున్నవి? మనకు 32వ వచనం యిలా చెబుతుంది: “మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరోధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.”
10 ఎలాంటి మాయా స్వప్నములను, లేదా నిరీక్షణలను ఈ మతగురువులు బోధించారు? మానవజాతికి ఈనాడు శాంతి, సమాధానము ఐక్యరాజ్యసమితి ద్వారా మాత్రమే వస్తుందనే నిరీక్షణను వారు బోధించారు. ఇటీవల సంవత్సరాలలో వారు ఐక్యరాజ్యసమితిని “శాంతి, సమైక్యతలకున్న అంతిమ నిరీక్షణ,” “శాంతి, న్యాయాలకు మహోన్నత న్యాయసభ,” “ప్రపంచశాంతికిగల ముఖ్య లౌకికనిరీక్షణ” అని పిలిచారు. ఏమి భ్రమ! దేవుని రాజ్యమే మానవజాతికిగల ఏకైక నిరీక్షణ. కాని మతగురువులు యేసు సువార్తలో మూలాంశమైయున్న పరలోక ప్రభుత్వమునకు సంబంధించిన సత్యాలను ప్రకటించుటగాని, బోధించుటగాని చేయలేదు.
11. (ఎ) దేవుని స్వంత నామంపై యెరూషలేము అబద్ధ బోధకులు ఏ చెడ్డ ప్రభావాన్ని చూపారు? (బి) యిర్మీయా తరగతికి వ్యతిరేకంగా, దైవిక నామానికి సంబంధించి నేటి అబద్ధ మత బోధకులు ఏమి చేశారు?
11 ఇరవైయేడవ వచనము మనకింకా ఎక్కువ చెబుతుంది. “బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారు.” ప్రజలు దేవుని నామము మరచిపోయేటట్లు యెరూషలేము అబద్ధ ప్రవక్తలు చేశారు. ఈనాటి అబద్ధమత బోధకులుకూడా అదే చేయలేదా? అంతకంటే నీచంగా, వారు దేవుని నామమైన యెహోవాను మరుగుచేశారు. దానిని ఉపయోగించ నవసరంలేదని బోధించి, వారు దానిని తమ బైబిలు అనువాదాలలోనుండి తొలగించారు. వారు దేవుని నామం యెహోవాయని ప్రజలకు బోధించే వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కాని యిర్మీయా తరగతియైన, ఆత్మీయాభిషక్త క్రైస్తవులలో శేషించినవారు, వారి సహచరులతోపాటుగా, యేసు చేసినట్లుగానే చేశారు. వారు లక్షలాదిమందికి దేవుని నామమునుగూర్చి బోధించారు.—యోహాను 17:6.
వారి నిందను బయల్పరచుట
12. (ఎ) అబద్ధ మత బోధకులపై ఎందుకు అధిక రక్తాపరాధం ఉంది? (బి) రెండు ప్రపంచ యుద్ధాల్లో మత నాయకుల పాత్ర ఏమైయుండింది?
12 మతగురువులు వారి జనులను నాశనకర విశాలమార్గంలో నడిపిస్తున్న అబద్ధ బోధకులని యిర్మీయా తరగతివారు వారిని పదేపదే బట్టబయలుచేశారు. ఔను, ఆ కలలుగనేవారు యెహోవా న్యాయదండనకు ఎందుకు పాత్రులైయున్నారో శేషించినవారు స్పష్టంగా వివరించారు. ఉదాహరణకు, యెహోవా సేవకులు తరచూ, మహాబబులోనులో “భూమిమీద వధింపబడిన వారందరి” రక్తము కనబడినదని చెబుతున్న ప్రకటన 18:24ను సూచిస్తుంటారు. మతభేదాలవల్ల జరిగిన యుద్ధాలన్నింటిని గూర్చి ఆలోచించండి. అబద్ధమత బోధకుల మీదనున్న రక్తాపరాధం ఎంత గొప్పదో కదా! వారి బోధలు చీలికలకు కారణమైనవి, అవి వేర్వేరు విశ్వాసాలుగల్గిన ప్రజలమధ్య, జాతీయ గుంపులమధ్య మరింత ద్వేషాన్ని రేపాయి. మొదటి ప్రపంచ యుద్ధాన్ని గూర్చి, ప్రీచర్స్ ప్రజంట్ ఆర్మ్స్ అను పుస్తకం యిలా చెబుతున్నది: “మతగురువులు [మతనాయకులు] యుద్ధానికి ఆవేశపూరిత ఆత్మీయ ప్రాధాన్యతనిచ్చి, ఒత్తిడిచేశారు. . . . దాంతో చర్చి యుద్ధవ్యవస్థలో భాగమై, పూర్తిగా లీనమైపోయింది.” రెండవ ప్రపంచయుద్ధంలో కూడా అదే జరిగింది. మతగురువులు యుద్ధంలో పాల్గొంటున్న దేశాలకు పూర్తి మద్దతునిచ్చి, వారి సైన్యాలను ఆశీర్వదించారు. రెండు ప్రపంచయుద్ధాలూ క్రైస్తవమత సామ్రాజ్యంలోనే ప్రారంభమైనవి, వాటిలో తోటిమతాలవారు ఒకరినొకరు వధించుకున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యంలోనే వున్న లౌకిక, మతపరమైన చీలికలు ఈనాటికి కూడా రక్తపాతం కలుగజేయుటలో కొనసాగుతున్నవి. వారి అబద్ధబోధల నుండి ఎంతటి ఘోరఫలితం వచ్చిందో కదా!
13. క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులకు యెహోవాతో సంబంధంలేదని యిర్మీయా 23:22 ఎలా నిరూపిస్తుంది?
13 దయచేసి యిర్మీయా 23వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించండి: “వారు నా సభలో చేరినవారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందురు.” క్రైస్తవమత సామ్రాజ్య మతప్రవక్తలు యెహోవా సన్నిహిత గుంపులో చేరియున్నట్లయిన, నమ్మకమును బుద్ధిమంతుడైన దాసునివలే ఆయనతో అతి దగ్గరి సంబంధంకల్గివుంటే, వారుకూడా దేవుని ప్రమాణాలకు తగినట్లు జీవించెదరు. క్రైస్తవమత సామ్రాజ్యపు ప్రజలు దేవుని స్వంత వాక్యమును వినేటట్లుగా వారుకూడా తయారుచేసియుండేవారు. బదులుగా, ఆధునిక అబద్ధ బోధకులు వారి అనుచరులను దేవుని విరోధియైన సాతానుకు గ్రుడ్డి సేవకులనుగా తయారు చేశారు.
14. క్రైస్తవమత సామ్రాజ్య మత నాయకులను గూర్చిన ఏ శక్తివంతమైన సత్యాలు 1958లో బయలుపర్చబడ్డాయి?
14 మతగురువులను గూర్చిన సత్యాన్ని యిర్మీయా తరగతిచే బట్టబయలు చేయడమనేది చాలా శక్తివంతమైనది. ఉదాహరణకు, న్యూయార్క్ నగరంలో 1958లో జరిగిన యెహోవాసాక్షుల దైవచిత్తము అనే అంతర్జాతీయ సమావేశంలో, వాచ్‌టవర్ సంస్థ ఉపాధ్యక్షుడు చేసిన ప్రకటనలోని ఒక భాగం యిలా చెబుతుంది: “నిక్కచ్చిగా లేదా నిర్మొహమాటంగా మేము ప్రకటించేదేమనగా, అన్నిరకాల నేరం, దోషం, వైషమ్యం, పగ, ద్వేషం, ఉన్మాద గందరగోళానికిగల మూలకారణం తప్పుడు మతమైన అబద్ధమతమే; దీని వెనుకనున్నది మానవుని అదృశ్య శత్రువు, అపవాదియైన సాతాను. ప్రపంచ పరిస్థితులకు మరెక్కువ బాధ్యులైన మనుష్యులెవరనగా మతబోధకులు, నాయకులు; వీరిలో మరెక్కువ నిందితులెవరనగా క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులే. . . . ఇదంతయూ మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత ఈ సంవత్సరాలన్నిటి నుండి, క్రైస్తవమత సామ్రాజ్యానికి దేవునితోగల సంబంధం యిర్మీయా కాలంలోని ఇశ్రాయేలు వంటిదే. ఔను, యెరూషలేముకు సంభవించడం యిర్మీయా చూసిన దానికంటే ఎక్కువ భయంకరమైన, విధ్వంసకరమైన నాశనాన్ని క్రైస్తవమత సామ్రాజ్యం ఎదుర్కొంటుంది.”
అబద్ధ బోధకులకు జరిగే తీర్పు
15. మత నాయకులు శాంతిని గూర్చిన ఏ ప్రవచనాలు చేశారు? అవి నెరవేర్చబడతాయా?
15 ఈ హెచ్చరిక చేయబడినా, మతగురువులు అప్పటినుండి ఏవిధంగా ప్రవర్తించారు? వారు 17వ వచనం చెప్పినట్లుగానే ప్రవర్తించారు: “వారు నన్ను తృణీకరించు వారితో—మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో—మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.” ఇది సత్యమేనా? లేదు! మతగురువులు ప్రవచించిన ఈ ప్రవచనముల అసత్యమును యెహోవా బయలుపరుస్తాడు. తన నామములో వారు చెప్పేది ఆయన నెరవేర్చడు. అయినప్పటికి, దేవునితో సమాధానమనే మతగురువుల అబద్ధ అభయం చాలా మోసకరమైనది!
16. (ఎ) ఈ ప్రపంచ నైతిక వాతావరణం ఎలా ఉంది, దానికి ఎవరు బాధ్యులు? (బి) ఈ ప్రపంచపు దిగజారిపోయిన నైతిక ఉద్దేశాలను గురించి యిర్మీయా తరగతి ఏమి చేస్తున్నది?
16 ‘ఏంటి, నేను మతగురువుల అబద్ధబోధలతో మోసగింపబడతానా? ఎన్నడూ అలా జరుగదు!’, అని మీరు తలస్తున్నారా? అయితే, అలా పూర్తినమ్మకంతో ఉండవద్దు! గుర్తుంచుకోండి, మతగురువుల అబద్ధబోధలు కపటంతోకూడిన భయంకర నైతిక వాతావరణాన్ని పెంపొందించాయి. వారి అనుకూలమైన బోధలు దాదాపు దేన్నయినా సమర్థిస్తాయి, అది ఎంత అనైతికమైనదైననూ సరే. ఈ నీచమైన నైతిక వాతావరణం అన్నిరకాల వినోదము, చలనచిత్రాలు, టివీ, పత్రికలు, సంగీతం మొదలైనవాటి అన్నిభాగాలలోను వ్యాపించివుంది. కాబట్టి, కుయుక్తిగా మనస్సునాకట్టుకొనేలా కన్పించే ఈ నీచమైన నైతిక వాతావరణ ప్రభావంక్రింద పడిపోతామనే భయంతో, మనం అత్యంత జాగరూకత కల్గియుండాలి. యౌవనులు నీచమైన వీడియోలు, సంగీతానికి బానిసలు కాగలరు. గుర్తుంచుకోండి, మతాధికారుల అబద్ధబోధలు, వారు దేవుని నీతిప్రమాణాలను పాటించుటలో తప్పిపోయిన ఫలితంగా, ప్రజలు దేన్నయినా సమర్థించే మనోభావాన్ని కల్గివున్నారు. యిర్మీయా తరగతివారు ఈ అనైతిక ఉద్దేశాలతో పోరాడుతూ క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ముంచి వేస్తున్న చెడుతనాన్ని విసర్జించుటకు యెహోవా సేవకులకు సహాయం చేస్తున్నారు.
17. (ఎ) యిర్మీయా చెప్పిన ప్రకారం, దుష్ట యెరూషలేముపైకి ఏ తీర్పు రానైయుంది? (బి) క్రైస్తవమత సామ్రాజ్యానికి త్వరలోనే ఏమి సంభవిస్తుంది?
17 గొప్ప న్యాయాధిపతియైన యెహోవా నుండి క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు ఏ తీర్పును పొందుతారు? దీనికి 19, 20, 39, 40 వచనాలు సమాధానమిస్తున్నవి: “ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తలమీదికి పెళ్లునదిగును. తన కార్యమును సఫలపరచువరకును తన హృదయాలోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు. . . . కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను. ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను.” అదంతయూ దుష్ట యెరూషలేముకు దాని ఆలయానికి సంభవించింది, దుష్ట క్రైస్తవమత సామ్రాజ్యానికి ప్రస్తుతము తటస్థించనైయున్నది అలాంటి నాశనమే!
“యెహోవా భారమును” ప్రకటించుట
18, 19. యిర్మీయా యూదాకు ఏ “యెహోవా భారాన్ని” ప్రకటించాడు, ఏ సూచనలతో?
18 అయితే, యిర్మీయా తరగతి, వారి సహవాసుల బాధ్యత యేమైయున్నది? మనకు 33వ వచనం యిలా చెబుతుంది: “ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము—మీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు.”
19 “భారము” అనే హెబ్రీ పదము రెండు భావాలను కల్గివుంది. ఇది ఒక గంభీరమైన దైవిక వాక్కులను లేదా ఒక వ్యక్తిని అణచివేసే, అలసట కల్గించేదానిని సూచిస్తుంది. ఇక్కడ ‘యెహోవా భారము’ అనే మాట గంభీరమైన ప్రవచనమును అనగా యెరూషలేము నిశ్చయంగా నాశనమవుతుందనే దేవునివాక్కును సూచిస్తుంది. మరి యిర్మీయా యెహోవానుండి వచ్చిన గంభీరమైన ప్రవచనార్ధక దేవునివాక్కులను పదేపదే చెప్పినపుడు, ప్రజలు వాటిని వినడానికి యిష్టపడ్డారా? లేదు, ప్రజలు ‘ప్రస్తుతము నీదగ్గర ఏ (గంభీరమైన) ప్రవచనం వుంది? నీ ప్రవచనం అలసటతో కూడిన మరొక భారమైయుంటుందని మాకు తెలియును!’ అని యిర్మీయాను ఎగతాళి చేశారు. కాని యెహోవా వారికి యేమని చెప్పాడు? “మీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును” అని చెప్పాడు. ఔను, ఈ ప్రజలు యెహోవాకు భారముగావుండిరి, ఆయనకు ఇక ఎన్నటికిని భారముగా లేకుండా వారిని నిర్మూలము చేయనైయున్నాడు.
20. నేడు “యెహోవా భారము” ఏమైయుంది?
20 ఈనాడు “యెహోవా భారమేమైయుంది”? ఇది దేవుని వాక్యంనుండి వచ్చిన గంభీరమైన ప్రవచన సందేశమైయున్నది. ఇది హఠాత్తుగా రానైయున్న క్రైస్తవమత సామ్రాజ్య నాశనాన్ని గురించిన శిక్షావిధులతో నిండివుంది. యెహోవా ప్రజలుగా మనమైతే, ఈ “యెహోవా భారమును” ప్రకటించే గంభీరమైన బాధ్యతను కల్గియున్నాము. అంతము సమీపించుకొలది, క్రైస్తవమత సామ్రాజ్యంలోని మూర్ఖ ప్రజలందరు యెహోవాకు “భారమని,” ఔను, ‘ఎంత భారమో కదా!’ అని మనము చెప్పవలసియున్నాము, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని విపత్తుకు విడిచిపెట్టడంద్వారా ఆయన త్వరలో ఈ “భారాన్ని” వదిలించుకుంటాడు.
21. (ఎ) సా.శ.పూ. 607లో యెరూషలేము ఎందుకు నాశనం చేయబడింది? (బి) యెరూషలేము నాశనం తరువాత, నేడు మనకే ధైర్యాన్నిస్తూ, అబద్ధ ప్రవక్తలకు ఏమి జరిగింది, యెహోవా నిజ ప్రవక్తలకు ఏమి జరిగింది?
21 యిర్మీయా కాలంలో, సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసినపుడు యెహోవా తీర్పు అమలుపర్చబడింది. ప్రవచింపబడిన విధంగా, మూర్ఖులైన విశ్వాసరహిత ఇశ్రాయేలీయులకు అది నీచమైన అవమానమైయుండెను. (యిర్మీయా 23:39, 40) వారు పదేపదే అగౌరవపరచిన యెహోవా, చివరకు వారి చెడుతనానికి ఫలితంగా వారిని విడిచిపెట్టాడని అది వారికి చూపించింది. చివరకు, గర్విష్ఠులైన వారి అబద్ధప్రవక్తల నోళ్లు మూసివేయబడ్డాయి. కాని యిర్మీయా నోరు ప్రవచిస్తూనే ఉండెను. యెహోవా ఆయనను విడువలేదు. దీనికి తగినట్లుగానే, క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు, వారి అబద్ధాలను నమ్మేవారి జీవాన్ని నాశనం చేయుటకు యెహోవా గంభీరమైన నిర్ణయం చేసినపుడు ఆయన యిర్మీయా తరగతిని వినాశనం చేయడు.
22. యెహోవా తీర్పుల ద్వారా క్రైస్తవమత సామ్రాజ్యం ఏ పరిస్థితికి దిగజార్చబడుతుంది?
22 ఔను, సా.శ.పూ. 607 తర్వాత పాడైపోయి నివసింప యోగ్యముకాని యెరూషలేము పరిస్థితి యేవిధంగా ఉండిందో, క్రైస్తవమత సామ్రాజ్యంయొక్క సంపన్నత తీసివేయబడి, సిగ్గుమాలినదానిలా బయలుపర్చబడినప్పుడు ఖచ్చితంగా అలాగేవుంటుంది. అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా యెహోవా విధించిన యోగ్యమైన తీర్పు ఇదే. ఆ తీర్పు తప్పకుండా వస్తుంది. పూర్వం ఏవిధంగానైతే యిర్మీయా ప్రేరేపిత సందేశాలన్నీ నెరవేర్చబడినవో, అలాగే అవి ఈ ఆధునిక నెరవేర్పులో కూడా నిజమౌతాయి. కాబట్టి, మనమంతా యిర్మీయా వలెనేవుందాం. ఆయన న్యాయతీర్పులు ఎందుకు అబద్ధ మతబోధకులందరిపైనా పూర్తిస్థాయిలో రాబోతున్నాయో వారు తెలుసుకునేలా మనం ధైర్యంగా యెహోవా గంభీర ప్రవచనాల్ని ప్రజలకు ప్రకటించుదాము!
పునఃసమీక్ష ప్రశ్నలు
◻ యెహోవా దృష్టిలో ప్రాచీన యెరూషలేము ఎంతగా చెడిపోయింది?
◻ క్రైస్తవమత సామ్రాజ్యంవారు ఏ మార్గాల్లో ‘అసత్యవర్తనులుగా’ ఉన్నారు?
◻ ఆధునిక దిన మత నాయకుల నింద ఎలా బయలుపర్చబడింది?
◻ ఏ “యెహోవా భారము” ఇప్పుడు ప్రకటించబడుతున్నది?
[8వ పేజీలోని చిత్రం]
యిర్మీయా “ఘోరమైన క్రియల”ను బహిర్గతం చేశాడు
[9వ పేజీలోని చిత్రం]
“తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు”
[10వ పేజీలోని చిత్రం]
యెరూషలేము తాను నాశనమైన తరువాత, క్రైస్తవమత సామ్రాజ్య అంతిమ గతి ఎలా ఉంటుందో సూచిస్తుంది