కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/1 పేజీలు 4-7
  • దుష్టుని ప్రతినిధులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దుష్టుని ప్రతినిధులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటి తిరుగుబాటు
  • ఇతర దేవదూతల తిరుగుబాటు
  • మానవజాతి శత్రువులు
  • ఇంకెంతకాలం వాటిని సహించాలి?
  • ఆత్మ సామ్రాజ్యమందలి పరిపాలకులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దేవదూతల గురించిన సత్యం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దుష్టత్వం వెనకున్నది ఎవరో బహిర్గతమైంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/1 పేజీలు 4-7

దుష్టుని ప్రతినిధులు

మానవుని వ్యవహారాలలో దయ్యాల పాత్రను గురించి బైబిలు ఇచ్చిన వివరణ, మరో విధంగా జవాబు దొరకని దుష్టత్వాన్ని గూర్చిన మూల ప్రశ్నలకు జవాబిస్తున్నది. ఉదాహరణకు, బాల్‌కాన్స్‌లో జరుగుతున్న యుద్ధం గురించి ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ నుండి వచ్చిన ఈ వ్యాఖ్యను గమనించండి: “వారిని బెదిరించి, బాధించి, ఇళ్లలో నుండి వెళ్లగొట్టడానికి రూపొందించిన భీతిగొల్పే పథకంలో ఓ భాగంగా . . . [సైనికులు] 20,000 మంది ముస్లిం స్త్రీలను, అమ్మాయిలను మానభంగం చేసినట్లు ఒక యూరప్‌ పరిశోధకుల బృందం తెలియజేసింది.”

టైమ్‌ పత్రికలోని ఒక వ్యాసం ఆ పరిస్థితిని వివరించటానికి ఇలా తంటాలు పడింది: “కొన్నిసార్లు యుద్ధంలోవున్న యౌవనులు వారి పెద్దలను, వారి పైఅధికారులను ప్రీతిపర్చటానికి, తండ్రి నుండి కుమారుడు పొందేటటువంటి ఓ విధమైన అంగీకారాన్ని పొందడానికి మానభంగం చేస్తారు. మానభంగం తన సైనికగుంపు క్రూరత్వానికి తాను కట్టుబడి ఉన్నాననడానికి నిదర్శనం. గుంపు యొక్క మొండి సంకల్పాలతో ఏకీభవించటానికి, ఒక యౌవనుడు భయంకరమైన పనులు చేయటానికే తన వ్యక్తిగత మనస్సాక్షిని చంపుకుంటాడు. ఇలా ఒక వ్యక్తి అక్రమం చేయడం ద్వారా తన బంధాన్ని స్థిరపరచుకొంటాడు.”

కాని “గుంపు యొక్క మొండి సంకల్పాలు,” ఎందుకు దాని సభ్యుల వ్యక్తిగత మనస్సాక్షికంటే హీనస్థితిలో ఉన్నాయి? దాదాపు ప్రతి వ్యక్తి తన పొరుగువానితో సమాధానంగా జీవించాలనే కోరుకుంటాడు. అయితే యుద్ధ సమయాల్లో ప్రజలు మానభంగం చేయడం, హింసించడం, ఒకరినొకరు చంపుకోవడం వంటివి ఎందుకు చేస్తున్నారు? ఒక కీలకమైన కారణమేమంటే, దయ్యాల శక్తులు పనిచేస్తుండడమే.

దయ్యాల పాత్రను అర్థం చేసుకోవడం అనేది, “వేదాంతుల సమస్య” అని కొందరు పిలిచే దానికి కూడా పరిష్కారాన్నిస్తుంది. ఇక్కడివ్వబడిన మూడు ప్రతిపాదనలతో ఎలా రాజీపడాలి అన్నదే సమస్య: (1) దేవుడు సర్వశక్తిమంతుడు; (2) దేవుడు ప్రేమగలవాడు, మంచివాడు; (3) ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వీటిలో ఏ రెండింటితోనైనా రాజీపడటం సాధ్యమౌతుంది గాని, మూడింటితో మాత్రము ఎన్నటికీ రాజీపడలేము అని కొందరి అభిప్రాయం. దేవుని వాక్యమే జవాబిస్తుంది, ఆ జవాబులో అదృశ్య ఆత్మలు, దుష్టుని ప్రతినిధులు చేరివున్నారు.

మొదటి తిరుగుబాటు

దేవుడు తానే ఒక ఆత్మ అని బైబిలు మనకు తెలియజేస్తున్నది. (యోహాను 4:24) తరువాత కొంతకాలానికి ఆయన ఇతర కోట్లాది ఆత్మీయ ప్రాణులకు అంటే దేవుని కుమారులైన దేవదూతలకు సృష్టికర్త అయ్యాడు. దేవుని సేవకుడైన దానియేలు దర్శనంలో పదికోట్ల దూతలను చూశాడు. యెహోవా సృష్టించిన ఆత్మీయ వ్యక్తులందరూ నీతిగలవారై, ఆయన చిత్తానికి అనుగుణ్యమైనవారై యుండిరి.—దానియేలు 7:10; హెబ్రీయులు 1:7.

ఆ తరువాత, దేవుడు “భూమికి పునాదులు వేసినప్పుడు,” ఈ దేవుని కుమారులైన దేవదూతలు “ఏకముగా కూడిపాడి,” “ఆనందించి జయధ్వనులు చేశారు.” (యోబు 38:4-7) కాని వారిలో ఒకడు, న్యాయంగా సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను తాను పొందాలనే కోరికను పెంచుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా ఈ దూత తనను తాను సాతానుగా (“ఎదురు తిరుగువాడు” అనే భావం), అపవాదిగా (“కొండెములు చెప్పువాడు” అనే భావం) చేసుకున్నాడు.—యెహెజ్కేలు 28:13-15 పోల్చండి.

సాతాను మొదటి స్త్రీయైన హవ్వతో మాట్లాడటానికి ఏదెనులో ఒక సర్పాన్ని ఉపయోగించుకుని, ఆ తోటలోని ఫలానా చెట్టు పండును తినవద్దని దేవుడు ఇచ్చిన సూటియైన ఆజ్ఞకు అవిధేయురాలయ్యేలా ఆమెను ప్రేరేపించాడు. అటు తరువాత ఆమె భర్త ఆమెతో చేరిపోయాడు. అలా, మొదటి మానవ జంట యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో ఆ దూతతో కలిశారు.—ఆదికాండము 2:17; 3:1-6.

ఏదెనులో జరిగిన సంఘటనలు విధేయతకు సంబంధించినంత వరకు స్పష్టమైన గుణపాఠమేనని అనిపించినప్పటికీ, అక్కడ సాతాను ఇంకా రెండు నైతిక వివాదాంశాలను లేవనెత్తాడు. మొదటిదేమంటే, యెహోవా పరిపాలన తన ప్రాణులపై సరియైన విధంగా, వారి ఆసక్తులకు తగినట్లుగా ఉన్నదా లేదా అనే వివాదాన్ని సాతాను లేవనెత్తాడు. తమను తాము పరిపాలించుకోవడంలో బహుశా మానవులే బాగా చేయగలరు అన్నాడు. రెండవదేమంటే, విధేయత ఏ వస్తుదాయక ప్రయోజనాలను కలిగించనప్పుడు, జ్ఞానంగల ఏ జీవియైనా దేవునికి యథార్థంగా, నమ్మకంగా ఉండగలరా అని సాతాను ప్రశ్నించాడు.a

దేవుని గుణాలైన శక్తి మరియు ప్రేమలతో దుష్టత్వపు ఉనికిని సమాధానపరచటమనే “వేదాంతుల సమస్యకు” పరిష్కారాన్ని తెలుసుకోవటానికి, ఏదెనులో లేవదీయబడిన వివాదాంశాలు మరియు యెహోవా గుణగణాలను గూర్చిన సరైన గ్రహింపు మనకు సహాయం చేస్తుంది. యెహోవా అపరిమితమైన శక్తిని కలిగివున్నాడని, ఆయనే ప్రేమ యొక్క నిజస్వరూపం అన్న విషయం నిజమైనప్పటికీ, ఆయన జ్ఞానవంతుడు, న్యాయవంతుడు కూడా. ఆయన ఈ నాలుగు గుణాలను సంపూర్ణ సమతుల్యంతో ప్రదర్శిస్తాడు అందుకే, ఆయన తన అపరిమితమైన శక్తిని, ఆ ముగ్గురు తిరుగుబాటుదారులను వెంటనే నాశనం చేయటానికి ఉపయోగించలేదు. అలాంటి చర్య న్యాయమైనదే అయినప్పటికీ, అది జ్ఞానయుక్తమైనది, ప్రేమగలదైవుండేది కాదు. అంతేకాక అదొక ప్రేమగల చర్య అని కొంతమంది భావించే విధంగా, ఆయన దాన్ని కేవలం క్షమించి, మరచిపోలేదు. అలా చేసివుంటే అది జ్ఞానవంతమైందీ, న్యాయవంతమైందీ అయ్యుండేది కాదు.

సాతాను లేవనెత్తిన వివాదాంశాలను పరిష్కరించటానికి సమయం అవసరమైంది. దేవునికి వేరై మానవులు తమను తాము సరైన విధంగా పరిపాలించుకోగలరా లేదా అనేది నిరూపించబడటానికి సమయం పడుతుంది. ఆ ముగ్గురు తిరుగుబాటుదారులను బ్రతకనివ్వడం ద్వారా, క్లిష్ట పరిస్థితులలో కూడా దేవున్ని నమ్మకంగా సేవించడం ద్వారా సాతాను ఆరోపణ తప్పని నిరూపించుటలో మానవులు భాగం వహించడం సాధ్యమయ్యేలా యెహోవా చేశాడు.b

తినవద్దన్న పండు తింటే, వాళ్లు చనిపోతారని యెహోవా ఆదాము హవ్వలకు స్పష్టంగా చెప్పాడు. హవ్వ చనిపోదని సాతాను ఆమెకు అభయమిచ్చినప్పటికీ, వారు చనిపోయారు. సాతాను కూడా మరణశిక్ష క్రింద ఉన్నాడు; ఈలోగా అతడు మానవజాతిని తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి బైబిలిలా తెలియజేస్తున్నది: “లోకమంతయు దుష్టుని యందున్నది.”—1 యోహాను 5:19; ఆదికాండము 2:16, 17; 3:4; 5:5.

ఇతర దేవదూతల తిరుగుబాటు

ఏదెనులో ఈ సంఘటనలు జరిగిన కొంతకాలానికే, యెహోవా సర్వాధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటులో ఇతర దేవదూతలు కలిశారు. బైబిలిలా తెలియజేస్తున్నది: “నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” వేరే మాటల్లో చెప్పాలంటే, ఈ దేవదూతలు “[పరలోకంలో] తమ నివాసస్థలమును విడిచి” భూమికి వచ్చి, మానవ శరీరం దాల్చి, స్త్రీలతో ఇంద్రియ సుఖాలను అనుభవించారు.—ఆదికాండము 6:1, 2; యూదా 6.

ఆ వృత్తాంతం ఆదికాండము 6:4 నందు ఇంకను ఇలా కొనసాగింది: “ఆ దినములలో నెఫీలులనువారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.” దేవదూతలు తండ్రులై, యిహలోక స్త్రీలకు పుట్టిన ఈ సంకరజాతి కుమారులు అసాధారణ బలం కలిగి, “శూరులు”గా ఉండిరి. వారు దౌర్జన్యకారులు, లేక నెఫీలులు, ఈ పదానికి హెబ్రీభాషలో “ఇతరులను పడగొట్టేవారు” అని అర్థముంది.

ఈ సంఘటనలు తరువాత ప్రాచీన నాగరికతా ఇతిహాసాలలో చోటుచేసుకున్నాయన్నది గమనించదగిన విషయం. ఉదాహరణకు, ఒక 4,000 సంవత్సరాల పూర్వపు బబులోను సంబంధ పురాణగాథ “ఏ కన్యను చెరచకుండా తన ప్రియునికి [విడువని] కామదాహంగల” బలవంతుడైన, దౌర్జన్యపూరితుడైన అర్థదేవుడగు గిల్గామేష్‌ మానవాతీత దౌర్జన్యాల గురించి వివరిస్తుంది. గ్రీకు ఇతిహాసం నుండి, మానవాతీత హెర్‌క్యులస్‌ (లేక హెరాక్లెస్‌) మరో ఉదాహరణ. దేవుడైన జీయిస్‌ తండ్రిగా, మనిషియైన అల్కెమెనెకు జన్మించిన హెర్‌క్యులస్‌ ఉన్మాద ఆవేశంలో తన భార్యను, పిల్లలను చంపిన తరువాత దౌర్జన్యకాండను కొనసాగించటానికి బయల్దేరాడు. అలాంటి కట్టుకథలు ఒక తరం నుండి మరో తరానికి మారినప్పుడు బహుగా వక్రీకరించబడినప్పటికీ, నెఫీలులు, వారి తిరుబాటుదారులైన దేవదూత తండ్రులను గురించి బైబిలు చెబుతున్నదానితో అవి సంబంధం కల్గివున్నాయి.

ప్రపంచాన్ని యెహోవా గొప్ప జలప్రళయంతో నాశనం చేయటానికి సంకల్పించేంతగా భూమి దౌర్జన్యంతో నిండిపోయేలా దుష్ట దూతలు, వారి మానవాతీత కుమారులు ప్రభావితం చేశారు. దైవభక్తిలేని మానవులందరితో పాటు నెఫీలులు కూడా మరణించారు; తప్పించుకుని జీవించిన మానవులు, కేవలం నీతిమంతుడైన నోవహు, అతని కుటుంబమే.—ఆదికాండము 6:11; 7:23.

అయినా, దుష్ట దేవదూతలు మరణించలేదు. బదులుగా, వారు తమ మానవ శరీరాలను విడిచిపెట్టి, ఆత్మీయ ప్రపంచానికి తిరిగి వెళ్లారు. వారి అవిధేయత మూలంగా, నీతియుక్త దేవదూతలతో కూడిన దేవుని కుటుంబంలోకి తిరిగి చేరటానికి వారికి అనుమతి లభించలేదు; నోవహు కాలంలో చేసినట్లు మళ్లీ మానవ శరీరాలను దాల్చటానికి కూడా వారికి అనుమతివ్వబడలేదు. ఇప్పటికీ, వారు “దయ్యాల అధిపతియైన” అపవాదియగు సాతాను అధికారం క్రింద, మానవజాతి వ్యవహారాలలో నాశనకరమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు.—మత్తయి 9:34; 2 పేతురు 2:4; యూదా 6.

మానవజాతి శత్రువులు

సాతాను అతని దయ్యాలు ఎప్పుడూ ఘాతుకంగా, క్రూరంగానే ఉన్నారు. సాతాను యోబుకున్న జంతుజాలములను వివిధ రీతుల్లో లేకుండా చేసి, అతని సేవకులలో అనేకమందిని చంపేసాడు. తరువాత అతడు, వారు ఉన్న ఇంటిని “గొప్ప సుడిగాలి” కొట్టేలా చేసి యోబు పదిమంది పిల్లలను చంపేసాడు. దాని తరువాత, సాతాను యోబును “అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో” మొత్తాడు.—యోబు 1:7-19; 2:3, 7.

దయ్యాలు కూడా అలాంటి దుష్ట స్వభావాన్నే కనపరుస్తాయి. యేసు కాలంలో, అవి ప్రజలను మూగవారిగాను, గ్రుడ్డివారిగాను చేశాయి. ఒక మనిషి తనను తాను రాళ్లతో కొట్టుకునేలా చేశాయి. అవి ఒక అబ్బాయిని నేలమీద పడవేసి “విలవిలలాడించెను.”—లూకా 9:42; మత్తయి 9:32, 33; 12:22; మార్కు 5:5.

సాతాను అతని దయ్యాలు మునుపటికన్నా ద్వేషపూరితంగా ఉన్నట్లు ప్రపంచ నలుమూలలనుండి వస్తున్న నివేదికలు చూపిస్తున్నాయి. అవి కొంతమందికి అనారోగ్యం కలుగజేస్తున్నాయి. నిద్రలేకుండా చేయడం ద్వారా లేక భయంకరమైన కలలు వచ్చేలా చేయడం ద్వారా, లేక వారిపై లైంగికంగా దౌర్జన్యం చేయడం ద్వారా అవి ఇతరులను బాధిస్తున్నాయి. మరికొందరినైతే పిచ్చివారైపోయేలా చేయడం, చంపేయడం, లేక ఆత్మహత్య చేసుకొనేలా కూడా చేస్తున్నాయి.

ఇంకెంతకాలం వాటిని సహించాలి?

సాతాను అతని దయ్యాలు నిరంతరం సహించబడవు. ఒక మంచి కారణాన్నిబట్టి యెహోవా వాటిని మనదినం వరకు ఉనికిలో ఉండనిచ్చాడు, కాని ఇప్పుడు వాటికి సమయం ఆసన్నమైంది. ఈ శతాబ్ద తొలికాలంలో, వాటి క్రియల వలయాన్ని పరిమితం చేయటానికి ఒక ముఖ్యమైన చర్య గైకొనబడింది. ప్రకటన గ్రంథం ఇలా వివరిస్తున్నది: “అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును [పునరుత్థానుడైన యేసుక్రీస్తు] అతని దూతలును ఆ ఘటసర్పముతో [సాతాను] యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.”—ప్రకటన 12:7-9.

దాని ఫలితమేమిటి? ఆ వృత్తాంతమిలా కొనసాగుతుంది: “అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి;” సాతాను అతని దయ్యాలు ఇక పరలోకంలో లేరు గనుక నీతిపరులైన దేవదూతలు ఉత్సహించగలరు. కాని భూమిపైనున్న ప్రజల మాటేమిటి? బైబిలిలా చెబుతున్నది: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”—ప్రకటన 12:12.

కోపోద్రేకులైయున్న సాతాను అతని అనుయాయులు తమకు రానైయున్న అంతానికి ముందు సాధ్యమైనంత శ్రమను కలిగించాలనే ఉద్దేశం కలిగివున్నారు. ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి, అంతేగాక రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి వాటికంటే తక్కువైనవి 150 యుద్ధాలు జరిగాయి. ఈ తరం యొక్క దౌర్జన్యాన్ని ప్రతిబింబించే “జెర్మ్‌ వార్‌ఫేర్‌,” “ది హోలోకాస్ట్‌,” “కిల్లింగ్‌ ఫీల్డ్స్‌,” “రేప్‌ కాంప్స్‌,” “సీరియల్‌ కిల్లర్స్‌,” మరియు “ది బాంబ్‌” వంటి పదబంధాలు మన పదాలలో చేరిపోయాయి. మత్తుపదార్థాలు, హత్య, బాంబు దాడులు, మానసిక రుగ్మతగల వ్యక్తి నరమాంసం తినటం, సామూహిక హత్యలు, కరువు, హింసలు మొదలైన కథలతో వార్తలు నిండిపోయాయి.

ఈ సంఘటనలు తాత్కాలికమే అన్నది శుభవార్త. సమీప భవిష్యత్తులో దేవుడు, సాతాను అతని దయ్యాలకు వ్యతిరేకంగా మళ్లీ చర్య తీసుకుంటాడు. దేవుని నుండి వచ్చిన దర్శనాన్ని వివరిస్తూ, అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను; ఆ పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.”—ప్రకటన 20:1-3.

అటుతరువాత అపవాది, అతని దయ్యాలు “కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను,” ఆ పిదప వాళ్లు నిత్యనాశనమౌతారు. (ప్రకటన 20:3, 10) అది ఎంతటి అద్భుతమైన సమయమై యుంటుంది! మరెన్నడూ ఉండకుండా సాతాను అతని దయ్యాలు నిర్మూలింపబడిన తరువాత, యెహోవా “సర్వములో సర్వమగును.” ప్రతి ఒక్కరూ నిజంగా “బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—1 కొరింథీయులు 15:28; కీర్తన 37:11.

[అధస్సూచీలు]

a ఈ విషయం దేవుని సేవకుడైన యోబు గురించి సాతాను చెప్పినపుడు విశదపర్చబడింది: “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును.”—యోబు 2:4, 5.

b దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడనే దానిపై వివరమైన చర్చ కొరకు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని చూడండి.

[7వ పేజీలోని చిత్రం]

ఇలాంటివాటికి కేవలం మనిషి ఒక్కడే బాధ్యుడా, లేక ఒక దుష్ట, అదృశ్య శక్తి ఆ నిందలలో పాలుపంచుకుంటాడా?

[క్రెడిట్‌ లైను]

కువాయిట్‌లో కాలుతున్న చమురు బావులు, 1991: Chamussy/Sipa Press

[7వ పేజీలోని చిత్రం]

దయ్యాలు మానవజాతిని ఇక బాధపెట్టని కాలం ఎంత అద్భుతంగా ఉంటుందో!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి