దుష్టాత్మలను ఎవరు నమ్ముతారు?
అదృశ్య ఆత్మలు మీ జీవితాన్ని ప్రభావితం చేయగలవని మీరు నమ్ముతారా? అనేకులు లేదు అని కచ్చితంగా జవాబివ్వవచ్చు. దేవుని ఉనికిని అంగీకరిస్తూనే వారు, దుష్టుని మానవాతీత శక్తులున్నారనే నమ్మకాన్ని పరిహసిస్తారు.
పాశ్చాత్య దేశాల్లో అదృశ్య ఆత్మల యెడల విస్తృత అపనమ్మకానికి గల కారణాల్లో ఒకటేమనగా, భూమి విశ్వానికి కేంద్రమని, పరలోకానికి భూమి క్రిందనున్న నరకానికి మధ్యన అది ఉందని శతాబ్దాలుగా చేసిన క్రైస్తవమత సామ్రాజ్య బోధ యొక్క ప్రభావమే. ఈ బోధ ప్రకారం, దేవదూతలు పరలోక ఆనందాన్ని అనుభవించేవారు, దయ్యాలు నరకానికి సంబంధించిన వ్యవహారాలను చూసేవారు.
వైజ్ఞానిక పరిశోధనలు విశ్వము యొక్క నిర్మాణాన్ని గూర్చిన తప్పుడు ఆలోచనలను ప్రజలు త్రోసిపుచ్చేలా చేయడంతో, ఆత్మీయ ప్రాణులను నమ్మడం అనాగరికమైపోయింది. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా తెలియజేస్తుంది: “పదహారవ శతాబ్దమందలి కోపర్నికస్ రూపొందించిన సిద్ధాంత ఫలితంగా, (పోలండ్ దేశ ఖగోళ శాస్త్రజ్ఞుడైన కోపర్నికస్ సిద్ధాంతాలపై ఆధారపడిన) భూమి విశ్వమునకు కేంద్రంగా గాక, అనంత విశ్వ నక్షత్రవీధిలో ఒక చిన్న భాగమైయున్న సూర్య కుటుంబములోని గ్రహం మాత్రమేనని తేలిన తరువాత, దూతలు దయ్యాలను గూర్చిన నమ్మకాలు ఏమాత్రం సముచితంగా కన్పించలేదు.”
అనేకులు దుష్టాత్మలను నమ్మనప్పటికీ, నమ్మేవారు లక్షలాదిమంది ఉన్నారు. అవిధేయులైన దూతలు గతంలోను, యిప్పుడును అనేక మతాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈ చెడ్డ దూతలు ఆత్మీయతను పాడుచేసేవారిగానే కాకుండా యుద్ధాలు, కరువు, భూకంపాల వంటి దుర్ఘటనలకు కారకులుగాను, అనారోగ్యం, మానసిక రుగ్మతలు, మరణం వంటి వాటిని ఎక్కువచేసే ప్రతినిధులుగా కూడా పనిచేస్తున్నారు.
క్రైస్తవ, యూదా మతాలలో ప్రముఖ దుష్టాత్మయైన అపవాదియగు సాతాను, ముస్లింలచే ఇబ్లిస్ అని పిలువబడుతున్నాడు. ప్రాచీన పర్షియా మతమైన జోరాష్ట్రియానిసమ్‌లో అతడు అంగ్రే మిన్‌యూగా కనిపిస్తాడు. సా.శ. రెండు, మూడు శతాబ్దాలలో అభివృద్ధి చెందిన గ్నాస్టిక్ మతంలో అతడు డెముర్జ్‌గా పరిగణించబడేవాడు. అది అసూయగల, తక్కువవాడైన దేవునికి ఇవ్వబడిన పేరు. మానవజాతిలోని అనేకులు తెలియక అతడికి ఆరాధన చేశారు.
ప్రాచ్యమతాల్లో అతని క్రింద పనిచేసే ఇతర దుష్టాత్మలు ప్రముఖపాత్ర వహిస్తాయి. అసురులు (దయ్యాలు) దేవతలను (దేవుళ్లను) ఎదిరిస్తారని హిందువులు నమ్ముతారు. అసురులలో విశేషంగా, సమాధులలో తిరిగే క్రూరులైన రాక్షసులు అతి భయంకరులు.
బౌద్ధులైతే, పరమానందము అంటే నిర్వాణము చెందకుండా మనిషిని నిరోధించే వ్యక్తిత్వంగల శక్తులే దయ్యాలని నమ్ముతారు. వారిలో రతి (కోరిక), రాగా (సుఖం), తన్‌హ (అలజడి) అనే ముగ్గురు కుమార్తెలుగల మారా అనేవాడు ప్రధాన శోధకుడు.
గ్వా లేక ప్రకృతి దయ్యాల నుండి రక్షించుకోటానికి చైనాలోని ఆరాధికులు చలిమంటలు, కాగడాలు, టపాకాయలను ఉపయోగిస్తారు. భయంకరమైన టెంగూతోసహా అనేక దయ్యాలున్నాయని, అర్చకుడు వెళ్లగొట్టేంత వరకు మనుష్యులను ఆవరించివుండే అనేక దయ్యాలున్నాయని జపాన్ మతాలు కూడా నమ్ముతాయి.
ఆసియా, ఆఫ్రికా, ఓషియేనియా, అమెరికా ఖండాలలోని నిరక్షరాస్యులు అభ్యసించే మతాలవారు ఆత్మీయ ప్రాణులు పరిస్థితులనుబట్టి వాటి కదలికల స్వభావాన్ని బట్టి అవి సహాయకరంగా లేక హానికరంగా ఉంటాయని నమ్ముతారు. విపత్తును తప్పించుకోటానికి, ఆశీర్వాదాలను పొందటానికి ప్రజలు ఈ ఆత్మలను పూజిస్తారు.
ఇంద్రజాలం, అభిచారం యెడలవున్న విస్తృత ఆసక్తి వీటికి తోడౌతున్నది, దుష్టాత్మల యందు నమ్మకముంచడానికి సుదీర్ఘమైన, సర్వత్రా వ్యాపించియున్న చరిత్ర ఉందనుట విశదమే. కాని అలాంటి ప్రాణులు ఉనికిలో ఉన్నాయని నమ్మడం కారణసహితమేనా? అవి ఉనికిలో ఉన్నాయని బైబిలు చెబుతుంది. అయినా, అవి ఉనికిలో ఉన్నట్లైతే, మనిషికి హాని కలిగించేలా అవి ప్రభావం చూపటానికి దేవుడెందుకు అనుమతిస్తున్నాడు?