పాఠకుల ప్రశ్నలు
బైబిలు తరచూ “తండ్రిలేని పిల్లవాడు” అని ప్రస్తావిస్తుంది గనుక, ఆడపిల్లలపై తక్కువ శ్రద్ధ ఉన్నట్లు అది సూచిస్తోందా?
ఎన్నటికి కాదు.
తలిదండ్రులు లేని పిల్లలపై దేవుడు శ్రద్ధ చూపుతున్నాడని కనపర్చే అనేక లేఖనాల్లో, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చర్స్ “తండ్రిలేని పిల్లవాడు” అనే పదసముదాయాన్ని వాడడం జరిగింది. దేవుడు ఇశ్రాయేలీయులకు యిచ్చిన ఆజ్ఞల్లో ఈ శ్రద్ధను స్పష్టం చేశాడు.
ఉదాహరణకు, దేవుడు యిలా పేర్కొన్నాడు: “విధవరాలినైనను తండ్రిలేని పిల్లవాడినైనను (NW) బాధపెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు మీ కుమారులు తండ్రిలేనివారగుదురు.” (నిర్గమకాండము 22:22-24) “ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తండ్రిలేని పిల్లవానికిని విధవరాలికిని న్యాయము” తీర్చును.—ద్వితీయోపదేశకాండము 10:17, 18; 14:29; 24:17; 27:19.
అనేక బైబిలు తర్జుమాలు “తండ్రిలేని పిల్లలు” లేక “అనాధ” అని ఈ వచనాల్లో పేర్కొన్నవి, అలా అబ్బాయిలను అమ్మాయిలను యిమిడ్చినవి. అయితే, అలా పేర్కొనడం, పురుషలింగంలో ఉన్న హెబ్రీ మూల పదం (యాథోమ్) యొక్క గుణ విశేషణాన్ని అలక్ష్యం చేస్తుంది. దానికి బదులుగా, కీర్తన 68:5లో ఉన్నట్లుగా న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ కచ్చితంగా “తండ్రిలేని పిల్లవాడు (కుమారులు)” అని ఉపయోగించింది, అక్కడ యిలా ఉంది: “తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని పిల్లవానికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు.” హెబ్రీ మూల పదానికిగల, అటువంటి భావాన్ని గుర్తిస్తూ, కీర్తన 68:11 నందున్న స్త్రీలింగ క్రియా విశేషణము యిలా చదువబడుతోంది: “దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.”a
“తండ్రిలేని పిల్లవాడు” అనేది యథోమ్ పదానికి ప్రధాన వాక్కు అయినప్పటికి, తండ్రి లేని ఆడపిల్లపై శ్రద్ధ కనపర్చేదాన్ని గూర్చి చెప్పడంలేదని దానినుండి అర్థం చేసుకోకూడదు. ఎత్తి చూపబడిన భాగాలు, యింకా యితరత్రావి కూడా, మహిళలపై విధవరాండ్రపై శ్రద్ధ తీసుకోవాలని దేవుని ప్రజలు ప్రోత్సహించబడుతున్నట్లు చూపుతున్నవి. (కీర్తన 146:9; యెషయా 1:17; యిర్మీయా 22:3; జెకర్యా 7:9, 10; మలాకీ 3:5) ధర్మశాస్త్రంలో, తండ్రిలేని సెలోపెహాదు కుమార్తెలకు ఆస్తి వచ్చేట్లు న్యాయ నిర్ణయం ధృవపర్చిందనే వృత్తాంతాన్ని కూడ దేవుడు యిమిడ్చాడు. అటువంటి పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు ఆ తీర్పే న్యాయం అయ్యింది. అలా తండ్రి లేని అమ్మాయిల హక్కులను అది ఆదరించింది.—సంఖ్యాకాండము 27:1-8.
యేసు పిల్లలపట్ల కనికరం ప్రదర్శించినప్పుడు ఆయన ఆడ మగ అనే తేడాను చూపించలేదు. బదులుగా, అక్కడ యిలా వ్రాయబడింది: “తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి—‘చిన్న బిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపర్చవద్దు.’ దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డలవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.”—మార్కు 10:13-16.
“చిన్న బిడ్డలు” అని యిక్కడ ఉపయోగింపబడిన గ్రీకు పదము నపుంసక లింగంలో ఉంది. గ్రీకు లెక్సికన్ చెప్పిన ప్రకారం, ఈ పదం “అబ్బాయిలకు అమ్మాయిలకూ ఉపయోగించబడింది.” పిల్లలందరి యెడల, అంటే అమ్మాయిలయెడల అబ్బాయిల యెడల యెహోవా కనపర్చిన అదే శ్రద్ధను యేసు కూడ ప్రతిబింబిస్తున్నాడు. (హెబ్రీయులు 1:3; మరియు ద్వితీయోపదేశకాండము 16:14; మార్కు 5:35, 38-42 పోల్చండి.) కాబట్టి, హెబ్రీ లేఖనాల్లో “తండ్రిలేని పిల్లవాని”పై శ్రద్ధ కనపర్చమని యివ్వబడిన సలహా, మనమందరమూ తలిదండ్రులులేని లేక తల్లో తండ్రో లేని పిల్లలందరి యెడల శ్రద్ధ తీసుకోవాలనే సలహానిస్తోందని గుర్తించాలి.
[అధస్సూచీలు]
a యూదుల తనాఖ్ నందు యిలా ఉంది: “ప్రభువు ఆజ్ఞను సెలవిచ్చియున్నాడు; వార్తను తెచ్చే స్త్రీలు గొప్ప గుంపు.”