అత్యంత విలువైన సంపదను నేను కనుగొన్నాను
ఫ్లారెన్స్ విడోసన్ చెప్పినది
రాత్రి కావస్తుండగా, ఒక చెరువు దగ్గర గుడారం వేసుకోవటానికి నిర్ణయించుకున్నాము. ఇద్దరు స్త్రీలు బసచేయడానికి అది అంత సురక్షితమైన స్థలం కాకపోయినప్పటికీ, ఈ ఒక్క రాత్రికి ఫరవాలేదనుకున్నాము. నేను డేరా వేస్తుండగా, మార్జెరే మా కొరకు రాత్రి భోజనం సిద్ధం చేసింది.
డేరా కొరకు నేను ఆఖరు మేకును కొట్టడం ముగించిన వెంటనే ఒక నల్లని చెట్టు మొద్దు వెనుక ఏదో కదలినట్లు గమనించాను. నేను మార్జెరేను “ఆ మొద్దు కదలినట్లు నీవు గమనించావా?” అని అడిగాను.
కొంచెం భయంతో ఆమె “లేదు” అని చెప్పింది.
“నిజంగా కదిలింది, ఆ కెటిల్ ఇలా ఇవ్వు!” అని కేకపెట్టాను.
దాన్ని, దానితో పాటు గొడ్డలిని భుజం మీద వేసుకుని, చెరువు వైపుకు బయలుదేరాను. నేను దాదాపు మొద్దు దగ్గరికి వెళుతుండగా, ఒక వ్యక్తి దాని వెనుక నుండి బయటికి వచ్చాడు.
నేను కంగారు పడకుండా “చెరువులోని నీళ్లు త్రాగటానికి తగినవేనా?” అని అడిగాను.
“అవి మంచివి కావు, కాని మీకు కావాలంటే త్రాగేనీరు నేను కొన్ని తెచ్చిస్తాను” అని కటువుగా జవాబిచ్చాడు.
వెంటనే నేను వద్దనగానే అతను హఠాత్తుగా వెనక్కి తిరిగి వెళ్లిపోవడంతో నా కంగారు తగ్గింది. నేను భయపడుతూనే వెనక్కి తిరిగివచ్చి ఏం జరిగిందో అంతా మార్జెరేకు చెప్పాను. మేము త్వరగా డేరా తీసివేసి, అన్నీ సర్దుకుని అక్కడి నుండి వెళ్లిపోయాము. అతను చెరసాల నుండి అప్పుడే విడుదలై వచ్చిన వ్యక్తి అని మాకు తరువాత తెలిసింది.
వెనుకటికి 1937లో ఆస్ట్రేలియా బంగారు గనులున్న ఆ ప్రాంతంలో అన్వేషకులు తరచూ బసచేస్తున్నను, మేము వేరే విధమైన అన్వేషకులము. దేవుని దృష్టిలో విలువైన ప్రజల కొరకు మేము వెతుకుతున్నాము.
నా కుటుంబ గత చరిత్ర
ఒక వంద సంవత్సరాలకు పూర్వం, విక్టోరియా జిల్లాలోని పోర్పెన్కె అనే చిన్న గ్రామంలో నా తండ్రి కమ్మరివానిగా ఉన్నాడు. నేను 1895లో జన్మించాను, బఫెల్లో పర్వతం క్రిందిబాగంలో, ఎవెన్స్ నది వద్ద నేను నా నలుగురు అన్నలతో కలిసి పెరిగాను. మా తలిదండ్రులు యూనియన్ చర్చికి క్రమంగా వెళ్లేవారు, నేను సండేస్కూలుకు వెళ్లేదాన్ని, అక్కడ మా తండ్రి పర్యవేక్షకునిగా ఉండేవాడు.
పెను తుఫాను వస్తున్న సమయంలో మా తల్లికి తీవ్రంగా గుండెనొప్పి రావడంతో ఆమె 1909లో మా తండ్రి చేతుల్లో మరణించింది. తరువాత, 1914 తొలిభాగంలో, మా అన్నల్లో ఒకరు ఇల్లు విడిచి వెళ్లిన, కొన్ని గంటల తరువాత అతడు నిర్జీవంగా ఇంటికి తేబడ్డాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య క్షమించరాని పాపం గనుక అతడు నరకానికి వెళ్తాడనే చర్చి బోధతో మా దుఃఖం ఇంకా ఎక్కువైంది.
తరువాత ఆ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది, నా అన్నలలో ఇద్దరు సైనికులలో చేర్చబడి విదేశాలకు పంపబడ్డారు. రక్తపాతం, బాధ యొక్క భయంకరమైన వార్తలు మమ్మల్ని, అంటే మా తండ్రితోపాటు ఆరుగురు యౌవన స్త్రీలము కలిసి, బైబిలు పుస్తకమైన యోహానును చదవటానికి ప్రేరేపించాయి.
నిజమైన సంపదను కనుగొనుట
చార్లెస్ టేజ్ రసెల్ వ్రాసిన ది టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అనే పుస్తకం ఎల్లెన్ హడ్సన్ వద్ద ఉండినది. దాని యెడల ఆమెకున్న ఆసక్తి గుంపులోని మమ్మల్నందరిని కూడా ప్రభావితం చేసింది. స్టడీస్ ఇన్ ది స్క్రిప్చ్‌ర్స్ యొక్క ఆరు సంపుటలలో అది ఒకటి మాత్రమే అని ఆమె తెలుసుకుని, మిగతావి కూడా పంపించమని కోరుతూ మెల్బోర్న్లోని అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సంఘానికి ఉత్తరం వ్రాసింది. మా వారపు పఠనాల్లో ది డివైన్ ప్లాన్ ఆఫ్ ది ఏజస్ అనే మొదటి సంపుటిని ఉపయోగించటానికి మా గుంపు అంగీకరించింది.
అసలు అగ్నిమయమైన నరకం లేదని తెలుసుకోవడంతో నాకు మా నాన్నకు కలిగిన సంతోషం గురించి ఊహించండి. నా సహోదరుడు నరకాగ్నిలో ఉన్నాడేమోనన్న భయం పోయింది. నిద్రిస్తున్న వారివలె మరణించిన వారు స్మారకంలో ఉండరని, హింస అనుభవిస్తూ ఎక్కడో జీవించడం లేదన్న సత్యాన్ని మేము నేర్చుకున్నాము. (ప్రసంగి 9:5, 10; యోహాను 11:11-14) మేము నేర్చుకుంటున్న సత్యాలను పొరుగువారికి ప్రకటించటానికి వెళ్లడానికి మా బైబిలు పఠన గుంపులోని కొంతమంది నిర్ణయించుకున్నారు. దగ్గర ఉన్న ఇళ్లకు వెళ్లటానికి మేము నడిచివెళ్లే వారము, కాని గ్రామాల్లో ప్రకటించటానికి సైకిళ్లను లేక రెండు చక్రాలు, ఒక గుర్రం గల గుర్రపు బళ్లను ఉపయోగించేవాళ్లము.
యుద్ధవిరమణ దినాన అంటే నవంబరు 11, 1918న నేను మొదటిసారి ఇంటింటి పరిచర్యను చవిచూసాను. మా పఠన గుంపులో నుండి ముగ్గురం ది పీపుల్స్ పుల్పీట్ అనే కరపత్రాన్ని పంచి పెట్టడానికి వాంగరాటె అనే పట్టణానికి 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాము. సంవత్సరాల తరువాత, ఆస్ట్రేలియాలోని గ్రామ ప్రాంతాల్లో ప్రకటన పని చేస్తున్నప్పుడు ముందుగా ప్రస్తావించబడిన అనుభవం నాకు కలిగింది.
నేను 1919లో ఒక బైబిల్ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యాను. అక్కడ ఏప్రిల్ 22, 1919న నీటి బాప్తిస్మం ద్వారా నేను యెహోవాకు సమర్పించుకున్నాను. పరలోక రాజ్య ఆత్మీయ సంపద యెడల, యెహోవా భూసంస్థ యెడల అక్కడి ఆత్మీయ విందు నా మెప్పును ఎక్కువ చేసింది.—మత్తయి 13:44.
నేను సమావేశం ముగిసిన తరువాత ఇంటికి తిరిగి రాకుండా, ఒక పూర్తికాల సువార్తికురాలైన జేన్ నికోల్సన్‌తో కలిసి ఒక నెలపాటు సాక్ష్యపు పని చేయటానికి ఆహ్వానాన్ని అంగీకరించాను. కింగ్ నది పొడుగునా ఉన్న పొలాలు, పశువులు గల సమాజాల్లో ప్రకటించే పని మాకు అప్పగించబడింది. కేవలం కొన్ని సంవత్సరాల క్రితం, ఈ పర్వత ప్రాంతం ది మాన్ ఫ్రమ్ స్నోయీ రివర్ అనే చిత్రనిర్మాణ స్థలంగా ఉండెను.
మేము 1921లో ది హార్ప్ ఆఫ్ గాడ్ అనే ఒక మంచి బైబిలు పఠన సహాయకాన్ని పొందాము. మా నాన్న దాన్ని సండేస్కూల్ తరగతులలో పాఠ్యపుస్తకంగా ఉపయోగించడం మొదలు పెట్టినప్పుడు, అనేకమంది తలిదండ్రులు అభ్యంతరం చెప్పి, ఆయన్ని రాజీనామా చేయమన్నారు. ఆయన వెంటనే అలాగే చేశాడు. తరువాత మేము, “అదేమిటి? అక్కడెవరున్నారు? వారు అక్కడి నుండి బయటికి రాగలరా?” వంటి చమత్కారవంతమైన కవరు ప్రశ్నలతోవున్న హెల్ అనే చిన్న పుస్తకాన్ని పొందాము. ఆ విషయంపై ఇవ్వబడిన స్పష్టమైన బైబిలు సాక్ష్యాలకు మా నాన్న ఎంతగా సంతోషించాడంటే, ఆయన వెంటనే దాని కాపీలను ఇంటింటికీ పంచిపెట్టడం మొదలెట్టాడు. ఆయన మా గ్రామంలో, ఇంకా చుట్టుప్రక్కలవున్న గ్రామాల్లో వందలాది కాపీలను పంచిపెట్టాడు.
మా నాన్నతో కలిసి చేసిన ప్రచార యాత్రలు
చివరికి, ఇతర ప్రాంతాల్లోని వారికి రాజ్య సమాచారాన్ని అందజేయటానికి నాన్న ఒక వాహనాన్ని కొన్నాడు. కమ్మరి వానిగా మా నాన్న గుర్రాలతో ఎక్కువ పరిచయం కలిగివున్నాడు కాబట్టి నేనే ఆ వాహనాన్ని నడిపేదాన్ని. మొదటగా చెప్పాలంటే, మేము రాత్రిళ్లు హోటళ్లలో గడిపేవారిమి. కాని త్వరలోనే అలా హోటళ్లలో ఉండటం చాలా ఖర్చుతో కూడినదిగా ఉన్నట్లు నిరూపించబడటంతో, మేము బయట డేరాలు వేసుకుని ఉండటం ఆరంభించాము.
కారు ముందు సీటును వెడల్పుగా వేసుకునేలా నాన్న చేశాడు, అలా నేను కారులో నిద్రపోయేదాన్ని. నాన్న నిద్రపోవటానికి మేము ఒక చిన్న డేరాను తయారు చేశాము. కొన్ని వారాలు బయట డేరాలు వేసుకుని గడిపిన తరువాత మేము మళ్లీ పోర్పెన్కె తిరిగివచ్చేవాళ్లం, అప్పుడు నాన్న తన కమ్మరి దుకాణం తెరిచేవాడు. తరువాతి ప్రచారపు యాత్ర ఖర్చులకు సరిపడే డబ్బు వచ్చేలా ఎప్పుడూ ఎంతోమంది ఖాతాదారులుండేవారు, కాబట్టి మేమెప్పుడూ ఆశ్చర్యపడేవాళ్లము.
మా సందర్శనాలకు అనేకమంది యోగ్యులైన వ్యక్తులు అనుకూలమైన విధంగా ప్రతిస్పందించి, చివరికి గృహ బైబిలు పఠనాలకు కూడా అంగీకరించారు. పోర్పెన్కె నుండి వచ్చిన మా చిన్న గుంపు ఎక్కడైతే సేవ చేసిందో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏడు సంఘాలు, అదీ తమ స్వంత రాజ్య మందిరాలతో ఉన్నాయి. వాస్తవానికి, “కార్యములు అల్పములై యున్న కాలమును” ఎవరు తృణీకరించగలరు?—జెకర్యా 4:10.
నేను మా నాన్న 1931లో ఘోరమైన రోడ్లపై దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ప్రత్యేకమైన కూటానికి హాజరయ్యాము. అక్కడ మేము “యెహోవాసాక్షులు” అనే మన క్రొత్త పేరును తీసుకున్నాము. మేమిద్దరం కూడా ఈ విశేషమైన, లేఖనాధారిత పేరును బట్టి చాలా సంతోషించాము. (యెషయా 43:10-12) అప్పటి వరకు మేము గుర్తింపబడిన పేరైన “అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు” అనే అల్ప ప్రత్యేకతగల పేరుకంటే ఇది మమ్మల్ని ఎంతో విశదంగా గుర్తిస్తుంది.
ఒకరోజు బెతాంగ పట్టణంలో మేము సాక్ష్యమిస్తుండగా, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెందిన స్థానిక పరిచారకున్ని నేను కలిసాను. అతడు చాలా కోపం తెచ్చుకుని, మేము ఎవరెవరికైతే పుస్తకాలను అందజేసామో వారందరి యొద్దకు వెళ్లి, వాటిని తనకు ఇచ్చివేయవలసిందని బలవంతపెట్టాడు. తరువాత అతడు పట్టణం మధ్యలో బహిరంగంగా ఆ పుస్తకాలను కాల్చివేసే పని నిర్వహించాడు. కాని అతడు చేసిన తుచ్ఛమైన పని బెడిసికొట్టింది.
ఏం జరిగిందో నేను సంస్థ బ్రాంచి కార్యాలయానికి తెలియజేసినప్పుడు, వారు మతనాయకులు చేసిన దాన్ని గర్హిస్తూ ఒక బహిరంగ ఉత్తరాన్ని ముద్రించారు. ఆ ఉత్తరాన్ని జిల్లా అంతటా పంచిపెట్టడానికి కార్ల నిండా వచ్చిన సాక్షులతో ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. నాన్న నేను మళ్లీ ఆ పట్టణాన్ని దర్శించినప్పుడు మునుపటి కన్నా ఎక్కువ పుస్తకాలను అందజేయగల్గాము. “నిషిద్ధ” సాహిత్యంలో ఏమి ఉందో తెలుసుకోవాలని పట్టణ వాసులు ఆసక్తి కలిగివున్నారు!
మా ప్రకటన ఫలితంగా ఈశాన్య విక్టోరియాలో బైబిలు సత్యాన్ని హత్తుకున్న మొదటి వ్యక్తి మిల్టన్ గిబ్. మా దర్శనాల మధ్యన, మేము ఆయనకిచ్చిన సంస్థ ప్రచురణలన్నీ ఆయన బాగా చదివాడు. మా పునర్దర్శనాల్లో ఒకసారి, “ఇప్పుడు నేను మీ శిష్యుల్లో ఒకడిని” అని మమ్మల్ని ఆశ్చర్యపర్చాడు.
ఆయన నిర్ణయాన్ని బట్టి సంతోషించినప్పటికీ, నేను ఇలా వివరించాను: “కాదు మిల్టన్గారు మీరు మా శిష్యుల్లో ఒకరు కాకూడదు.”
“అయితే నేను రూథర్‌ఫోర్డ్ [వాచ్‌టవర్ సంస్థ అప్పటి అధ్యక్షుడు] శిష్యుల్లో ఒకడిని.”
మళ్లీ నేను “రూథర్‌ఫోర్డ్ శిష్యుల్లో కూడా ఒకడివి కాదు, గాని క్రీస్తు శిష్యుల్లో ఒకడివి అవుతావని నిరీక్షిస్తాను,” అని అన్నాను.
నేను అనేక సంవత్సరాలు వెతుకుతూ గడిపిన అమూల్యమైన సంపదలలో ఒకరిగా మిల్టన్ గిబ్ నిరూపించబడ్డాడు. ఆయన, ఆయన ఇద్దరు కుమారులు క్రైస్తవ పెద్దలుగా ఉన్నారు, ఆయన ఇతర కుటుంబ సభ్యులు సంఘంలో ఉత్సాహవంతులుగా ఉన్నారు.
అనేక విపత్తులను ఎదుర్కొనడం
జనవరి 1941లో ఆస్ట్రేలియాలో యెహోవాసాక్షుల పనిపై నిషేధం విధింపబడినప్పటికీ, మేము కేవలం బైబిలును మాత్రం ఉపయోగిస్తూ, ప్రకటన పనిని కొనసాగించాము. ఆరోగ్యం పూర్తిగా పాడైన నా తండ్రిని చూసుకోవటానికి నన్ను ఇంటికి పిలవడంతో నా పయినీరు సేవ, లేక పూర్తికాల పరిచర్యకు అంతరాయం కల్గింది. తరువాత నా ఆరోగ్యం కూడా చెడిపోవడంతో ఒక పెద్ద శస్త్రచికిత్స అవసరమైంది. మళ్లీ ఆరోగ్యం పుంజుకోవడానికి కొంత కాలం పట్టింది, కాని నేను “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అనే దేవుని వాగ్దాన సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. (హెబ్రీయులు 13:5) ఒక క్రైస్తవ సహోదరి నన్నిలా ఓదార్చింది: “ఫ్లో, నీవెప్పుడూ ఒంటరి దానివి కాదని గుర్తుంచుకో. నీవు యెహోవా కలిస్తే ఎప్పుడూ మీదే పైచేయి.”
తరువాత మా ప్రియమైన నాన్న 13 వారాలు పూర్తి అనారోగ్యంతో బాధపడ్డాడు. జూలై 26, 1946న ఆయన కన్నుమూసాడు. ఆయన తన పూర్తి జీవితాన్ని అనుభవించాడు, ఆయనది పరలోక నిరీక్షణ. (ఫిలిప్పీయులు 3:14) కాబట్టి, తొలి సంవత్సరాలన్నీ మా నాన్నతో గడిపిన నేను 51 సంవత్సరాల వయస్సులో ఒంటరిదాన్నైపోయాను. తరువాత నేను, నాకు కాబోయే భర్తను కలిసాను. మేము 1947లో వివాహం చేసుకుని ఇద్దరం కలిసి పయినీరు సేవ చేయడం మొదలు పెట్టాము. కాని ఆయనకు 1953లో పక్షవాతం వచ్చి దుర్భలుడవటంతో ఈ సంతోషదాయకమైన సమయం ఎంతో కాలం నిలువలేదు.
నా భర్త సంభాషణాశక్తి బాగా దెబ్బతినడంతో, ఆయనతో సంభాషించడం దాదాపు అసాధ్యమైపోయింది. ఆయన్ని చూసుకోవడంలో అది చాలా కష్టమైన భాగంగా ఉండేది. ఆయన ఏం చెప్పాలని పోరాడుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు కలిగే మానసిక వత్తిడి వాస్తవానికి ఎంతో ఎక్కువనే చెప్పాలి. దగ్గర్లో ఎక్కడా సంఘంలేని ఏకాంత ప్రదేశంలో మేము నివసిస్తున్నప్పటికీ, ఆ కష్టతరమైన సంవత్సరాల్లో యెహోవా మమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను సంస్థాపరమైన ఇటీవలి సమాచారమంతటితో పరిచయం కలిగి ఉంటూ, కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ద్వారా అందజేయబడుతున్న ఆత్మీయాహార సరఫరా ఎప్పటికప్పుడు తీసుకునేదాన్ని. డిశంబరు 29, 1957న నా ప్రియమైన భర్త మరణించాడు.
అడిలైడ్‌లో పరిచర్య
మళ్లీ నేను ఒంటరిదాన్నైపోయాను. నేనేం చేయాలి? కొంత కాలం తరువాత మళ్లీ నేను పూర్తికాల పరిచారకురాలిగా అంగీకరింపబడతానా? నేను అంగీకరింపబడ్డాను, కాబట్టి నేను నా ఇల్లు అమ్మేసి, దక్షిణాస్ట్రేలియా ముఖ్య పట్టణమైన అడిలైడ్‌లో మళ్లీ క్రొత్తగా పయినీరు సేవ మొదలుపెట్టాను. ఆ సమయంలో అక్కడ పయినీర్ల అవసరత ఎంతగానో ఉండింది, నేను అభివృద్ధి చెందుతున్న సంఘంలో పనిచేయటానికి నియమించబడ్డాను.
నగర ట్రాఫిక్‌లో వాహనం నడపటం నాకు భయంగా ఉండటంతో, నేను నా కారు అమ్మి సైకిలు వాడటం మొదలు పెట్టాను. నాకు 86 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు నేను దాన్ని వాడాను, ఆ ప్రాంతమంతటిలో నేను “నీలం రంగు సైకిలు మీది చిన్న స్త్రీ” అని అందరికీ తెలిసిపోయాను. కొంత కాలానికి నేను ట్రాఫిక్‌లో మరీ భయపడేదాన్ని; నా సైకిలు ముందు చక్రం వణుకుతుండేది. ఒక మధ్యాహ్నం నేను ఒక గుంటలో పడిపోవడంతో చివరకు సైకిలు నడపటం కూడా మానివేసాను. ‘ఇది చివరిసారి’ అని నాకు నేను చెప్పుకుని, మళ్లీ నేను నడక మొదలు పెట్టాను.
కొన్ని సంవత్సరాల క్రితం, ఒక జిల్లా సమావేశానికి హాజరౌతున్నప్పుడు, నా కాళ్లు నిస్సత్తువవ్వడం మొదలుపెట్టాయి, చివరికి నాకు తుంటి కీళ్లపై రెండు సార్లు శస్త్రచికిత్స జరిగింది. ఒక పెద్ద కుక్క నన్ను పడవేసే వరకు నేను శస్త్రచికిత్స తరువాత బాగానే నడిచేదాన్ని. దానితో మళ్లీ అదనపు చికిత్స అవసరమయ్యింది, తరువాత నడవటానికి నాకు ఒక ఊత అవసరమయ్యింది. నా మనస్సు ఇంకా చురుకుగానే ఉంది. దాన్ని ఒక స్నేహితుడు ఇలా చెప్పాడు: “మీ యౌవన మనస్సుకు తగినట్లు వయస్సు మళ్లుతున్న మీ శరీరం ఉండలేకపోతున్నది.”
చాలా సంవత్సరాలుగా, అడిలైడ్‌లో సంఘాలు పెరిగి, విస్తరించి, విభాగింపబడటం నేను చూశాను. తరువాత, 1983లో నేను 88 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, విక్టోరియా రాష్ట్రంలోని క్యాబ్రాం పట్టణంలోవున్న ఒక కుటుంబంతో నివసించటానికి నేను అడిలైడ్‌ను విడిచి వెళ్లాను, అక్కడే నేను పది సంతోషకరమైన సంవత్సరాలను గడిపాను. ఇప్పటికీ నేను ప్రాంతీయ సేవకు వెళ్లగల్గుతున్నాను; సంఘంలోని నా స్నేహితులు వచ్చి, క్రమంగా పత్రికలు తీసుకునేవారి యొద్దకు నన్ను తీసుకువెళ్తారు. నేను మాట్లాడగల్గేలా వారు దయతో బయటికి నా కారు వద్దకే వస్తారు.
నా 98 సంవత్సరాల జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు, నాతోపాటు యెహోవాను స్తుతించిన అనేకమంది విశ్వాసులైన, నమ్మకస్థులైన వారిని, ప్రాముఖ్యంగా మా నాన్నను నేను ప్రియంగా గుర్తుచేసుకుంటాను. పయినీరు సేవలో నా భాగస్వాములుగా ఉన్న విశ్వాసులైన వారందరి కంటే నేను ఎక్కువ కాలం జీవించాను. దేవుని పరలోక రాజ్యంలో జీవపు బహు మానం పొందే నిరీక్షణగల వారితో మళ్లీ ఐక్యపరచబడినప్పుడు నాకెంతటి ఆనందం కలుగుతుంది, నిజంగా అది అత్యంత విలువైన సంపద!
[28వ పేజీలోని చిత్రం]
ఏప్రిల్ 22, 1919న నేను బాప్తిస్మం తీసుకున్నాను
[31వ పేజీలోని చిత్రం]
నేను 100 సంవత్సరాలను చేరుకుంటున్నప్పటికీ యెహోవాను సేవిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను