కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 12/15 పేజీలు 25-29
  • రాజ్య పనిలో మన దృష్టిని “తేటగా” ఉంచుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్య పనిలో మన దృష్టిని “తేటగా” ఉంచుకొనుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • దృష్టిని సరిగ్గా కేంద్రీకరించి ఉంచుకొనడం
  • విస్తరింపబడిన రాజ్య పరిచర్య
  • మన ప్రచురణలయెడల మెప్పు
  • విస్తరణ కొరకు కట్టుట
  • దేవుని రాజ్యంపై దృష్టి నిలుపబడి ఉంది
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 12/15 పేజీలు 25-29

రాజ్య పనిలో మన దృష్టిని “తేటగా” ఉంచుకొనుట

జర్మన్‌ డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ (జి.డి.ఆర్‌.), లేక తూర్పు జర్మనీగా పిలువబడిన, దేశం గట్టిగా ఎంతోకాలం నిలువలేదు. ఇంచుమించు లైబీరియా లేక అమెరికాలో ఉన్న టెనెస్సే రాష్ట్రం అంతటి పరిమాణంలో ఉన్న దాని భూభాగము, పశ్చిమ జర్మనీగా పిలువబడిన ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీతో కలపబడినప్పుడు, నలభై ఒక్క సంవత్సరాల దాని ఉనికి అక్టోబరు 3, 1990లో అంతమొందింది.

రెండు జర్మనీలు తిరిగి ఏకం కావడం అంటే ఎన్నో సంస్కరణలు జరగ వలసి ఉండింది. ఈ రెండు దేశాలను కూడా వేరుపరచినవి, కేవలము భౌతిక హద్దులు మాత్రమే కాదు, ఆలోచనా విధానంలో ఉన్న సరిహద్దు కూడా. అక్కడున్న ప్రజలకు ఇది ఏ భావాన్ని కలిగి ఉంది, మరి యెహోవాసాక్షుల జీవితాలు ఎలా మారాయి?

నవంబరు 1989లో ప్రారంభమై, తిరిగి ఏకం చేయడాన్ని సాధ్యపరచిన వెండే తిరుగుబాటు నాలుగు దశాబ్దాల కఠిన కమ్యూనిస్టు పరిపాలన తరువాత వెనువెంటనే వచ్చింది. ఆ దశాబ్దాల్లో, యెహోవాసాక్షుల కార్యకలాపాలు నిషేధింపబడ్డాయి, మరి కొన్ని సమయాల్లో వారికి కల్గిన హింస ఎంతో తీవ్రంగా ఉండేది.a తూర్పు జర్మనీకి స్వాతంత్ర్యం లభించినప్పుడు, సుఖంగా జీవించాలనే కోరిక ప్రజలందరిలో ప్రబలిపోయింది. ఆ ఆశ భంగమయ్యే సరికి, చాలామంది దిగ్భ్రమ చెందారు, నిరాశ చెందారు, భ్రమనుండి తొలగింపబడ్డారు. రెండు జర్మనీలను కూడా సాంఘికంగా, రాజకీయంగా, మరియు ఆర్థికంగా ఏకం చేయాలన్న సవాలు చాలా కష్టతరంగా తయారయ్యింది.

డెర్‌ స్పైగల్‌లోని “162 టాగే డాయిటసే గెషిక్టే” (జర్మన్‌ చరిత్ర యొక్క 162 దినాలు) అనే ప్రత్యేక నివేదిక ప్రకారం, తిరిగి ఏకం చేయబడిన వెంటనే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మరియు అద్దెలు పెరుగుతాయన్న భయం చాలా ఎక్కువగా ప్రబలిపోయింది. “నాకు సరిపడేంత పెన్షను ఉంటుందా?” అని మునుపటి తూర్పు జర్మనీలోని చాలామంది అడిగారు. మరి ఇళ్ల విషయమేంటి? “తూర్పు జర్మనీ అంతటా, పాత భవంతులు పాడైపోతున్నాయి, అన్ని వీధులూ నివసించడానికి అయోగ్యంగా తయారవుతున్నాయి.” కాలుష్యం భయంకరంగా పెరిగిపోయింది.

మరి అలాంటి సాంఘిక మరియు ఆర్థిక సంక్షోభంలో ఉన్న మునుపటి తూర్పు జర్మనీలోని యెహోవాసాక్షులు ఎలా మనుగడ సాగించారు?

దృష్టిని సరిగ్గా కేంద్రీకరించి ఉంచుకొనడం

యెహోవాసాక్షులకు భిన్నాభిప్రాయాలు లేవు. వారు తూర్పున ఉన్నా పశ్చిమాన ఉన్నా, వారి బైబిలు ఆధారిత విశ్వాసం ఒకటే. మారుతున్న వాళ్ల సాంఘిక పర్యావరణంలో, చాలామంది సాక్షులు యెహోవాను సేవించాలనే ముఖ్య గురిపై తమ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా తమ ఆత్మీయ సమతూకాన్ని కలిగి ఉన్నారు. అది ఎందుకంత ఆవశ్యకం?

ఎందుకంటే “ఈ లోకపు నటన గతించుచున్నది.” (1 కొరింథీయులు 7:31) వెండే కంటేముందు నిషేధం ఉన్నప్పుడు ప్రకటించడానికి ధైర్యం అవసరమైయుండేది అని ఒక క్రైస్తవ పెద్ద చెబుతున్నాడు; అది యెహోవాపై ఆధారపడాలని సాక్షులకు నేర్పింది మరియు బైబిలును ఉపయోగించడంలో వారికి శిక్షణనిచ్చింది. అయితే, ఇప్పుడు, “మేము వస్తుసంబంధమైన ఆశ మరియు అనుదిన చింతల చేత ప్రక్కదారి పట్టకుండా ఉండడానికి చాలా జాగ్రత్త పడాలి.”

స్వాతంత్ర్యం, అభివృద్ధి చాలాసార్లు వస్తుసంబంధ పరిమాణంలో కొలవబడుతుంటాయి. ఆ ప్రాంతంలోని చాలామంది ప్రజలు వారు ముందు కలిగి ఉన్న కార్యకలాపాలను, ఆనందాలను తిరిగి పొందాలని భావిస్తున్నారు. ఒకరు పట్టణంలోని కోబల్‌స్టోన్‌ దారులు, దక్షిణాన తురిన్‌జియా మరియు సాక్సనీ పల్లెలో ప్రయాణించి వెళ్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. దారులు బాగుచేయించవలసిన స్థితిలో ఉండవచ్చు, ఇల్లు చిన్నగా ఉండవచ్చు, కానీ దూరదర్శిని యొక్క సాటిలైట్‌ డిశ్‌ ఆంటినాలు మాత్రం కావలసినన్ని అక్కడ ఉంటాయి! కళ్లు చూసే ప్రతిదీ కలిగి ఉండడం వలన భద్రత, సంతోషం లభిస్తాయని నమ్మడానికి ఒక వ్యక్తి మోసపరచ బడడం చాలా సులభం. అది ఎంత ప్రమాదకరమైన ఉచ్చు!

తన కొండమీది ప్రసంగంలో, భౌతిక వస్తువులకు, అనుదిన చింతలకు అనవసర అవధానాన్ని ఇవ్వడం వలన వచ్చే ప్రమాదాలను గూర్చి యేసు మాట్లాడాడు. “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు” అని యేసు హెచ్చరించాడు. ఆయనింకా ఇలా చెప్పాడు: “దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమై యుండును.” (మత్తయి 6:19, 22) ఆయన భావమేమిటి? ఏది కేంద్రీకరిస్తుందో, ఏది మనస్సుకు స్పష్టమైన దృశ్యాలను ప్రసరింపజేస్తుందో అదే తేటగా ఉన్న కన్ను. తేటగా ఉన్న ఆత్మీయ కన్ను దేవుని రాజ్యం యొక్క దృశ్యాన్ని స్పష్టంగా ఉంచుతుంది. తన కన్నును తేటగా ఉంచుకొని, దేవుని రాజ్యంపై స్పష్టంగా దృష్టి కేంద్రీకరించుకొని, చింతలను వెనక్కి నెట్టాలన్న ఒక క్రైస్తవుని తీర్మానం ఆయన ఆత్మీయంగా సమతుల్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

వెండే జరుగుతున్న సమయంలో బైబిలుపై ఆసక్తి చూపిన ఒక జంట యొక్క అనుభవంతో దీన్ని ఉదహరించవచ్చును. వాళ్లు జ్వికావు, సాక్సనీ నివాసులు. వారి వ్యాపారం కొరకు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది, అయిననూ అన్ని క్రైస్తవ కూటాలకు హజరౌతూ, వారు ఆత్మీయ ఆసక్తులను ముందుంచారు. “మా వ్యాపార దృష్ట్యా చూస్తే, మేము సమయాన్ని వెచ్చించలేము,” వారిలా ఒప్పుకున్నారు, “కానీ ఆత్మీయంగా చూస్తే మాకది కావాలి.” ఎంత జ్ఞానవంతమైన నిర్ణయం!

సాక్సనీలోనే ఉన్న ప్లెవున్‌లోని ఒక కుటుంబాన్ని కూడా పరిశీలిద్దాం. భర్త చేతి గడియారాలు బాగుచేసే వ్యక్తి. అతను ఎంతో పనితనం కలవాడు, తన స్వంత వ్యాపారాన్ని కలిగి ఉన్నాడు. వెండే తరువాత, తానుండే స్థలం అద్దె చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అతనేం చేయాలి? “దానికి చాలా ఎక్కువ డబ్బు అవసరమౌతుంది, మరి నేను సత్యం కొరకు జీవించడానికే సత్యాన్ని నేర్చుకున్నాను.” కావున ఆయన కొద్దిగా అసౌఖర్యంగా ఉన్నా, తక్కువ అద్దె ఉండే స్థలానికి మారాడు. అవును, ఆ వాచీ బాగు చేసే వ్యక్తి తన దృష్టిని తేటగా ఉంచుకోవడాన్ని గూర్చి చాలా త్వరగా నేర్చుకున్నాడు.

కాని కొద్దిమంది, చాలా ఆలస్యంగా నేర్చుకున్నారు. ఒక క్రైస్తవ పెద్ద, క్రొత్తగా ప్రవేశపెట్టబడిన ఫ్రీ-మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ చాలా లాభసాటిగా ఉందని తర్కిస్తూ, వ్యాపారరంగంలోకి దిగాడు. వ్యాపార పనులు తన ఆత్మీయతకు అడ్డంకు కానివ్వొద్దని ఒక ప్రయాణ కాపరి దయా పూర్వకంగా ఆయనను కోరాడు. కానీ, దుఃఖకరంగా, అదే జరిగింది. కొన్ని నెలల తరువాత ఆ సహోదరుడు పెద్దగా ఉండకుండా రాజీనామా ఇచ్చాడు. ఆయన తరువాత యిలా వ్రాశాడు: “నా స్వంత అనుభవాన్ని ఆధారం చేసుకొని, ఏ సహోదరుడైనా సేవా ఆధిక్యతల కొరకు ప్రయత్నిస్తూ ఉంటే, స్వంత వ్యాపారాన్ని మొదలు పెట్టవద్దు అని నేను సలహా ఇస్తాను.” ఒక క్రైస్తవుడు తన స్వంత వ్యాపారాన్ని కలిగి ఉండడం తప్పు అని దీని భావం కాదు. కానీ మనకు మన స్వంత వ్యాపారం ఉన్నా లేకపోయినా, ఆర్థిక చింతలకు మరీ ఎక్కువ అవధానాన్ని ఇవ్వడం మనల్ని అనుకోకుండా ధనానికి బానిసలను చేయవచ్చు. యేసు దాని పర్యవసానాన్ని చూపించాడు: “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును.” (మత్తయి 6:24) జర్మన్‌ కవి అయిన గొతే యిలా చెప్పాడు: “తాము స్వతంత్రంగా ఉన్నామని అబద్ధంగా తలంచే వారు తప్ప నిరాశాజనకంగా బందీలైనవారు మరెవరూలేరు.”

మనము అక్షరార్థమైన పెనుగాలిలో చిక్కుకొని ఉంటే మన గమ్యాన్ని సరిగ్గా చూడడానికి మన కళ్లను కొద్దిగా మూసి చూడాలి లేక మన కళ్ల చుట్టు చేతులను చుట్టి ఉంచాలి. రాజకీయ, ఆర్థిక, లేక సాంఘిక సంక్షోభాలతో చుట్టుముట్టబడి ఉన్నప్పుడు, మన ఆత్మీయ గమ్యాలను దృష్టిలో ఉంచుకోడానికి ఏకాగ్రత అవసరం. రాజ్య పనిలో తమ దృష్టిని “తేటగా” ఉంచుకోడానికి కొందరు క్రైస్తవులు ఏమి చేస్తున్నారు?

విస్తరింపబడిన రాజ్య పరిచర్య

మునుపటి తూర్పు జర్మనీ అంతటా, సాక్షులు మునుపెన్నటి కంటే ఎక్కువ సమయాన్ని ప్రకటించు పనికి వెచ్చిస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో, క్షేత్ర సేవలో గడిపిన సగటు సమయం 21 శాతం పెరిగింది. దాని ఫలితం గృహ బైబిలు పఠనాలు గణనీయంగా 34 శాతం పెరగడము. అంతేకాక, క్రమ పయనీర్ల సంఖ్య రెండు సంవత్సరాల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు నాలుగింతలు హెచ్చుగా ఉంది! ఇతరులు కలత చెంది, ఫిర్యాదు చేస్తుండగా, ఇంతకు ముందు తూర్పు జర్మనీగా ఉన్న దానిలో 23,000ల కంటే ఎక్కువమంది క్రైస్తవులు తమ దృష్టిని తేటగా ఉంచుకొనడం ద్వారా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇది రాజ్య పనిలో ఆశ్చర్యకరమైన పెరుగుదలకు దోహదపడింది.—యెహోషువ 6:15 పోల్చండి.

కార్యకలాపాలు విస్తరించాయంటే ఎక్కువమంది సాక్షులు జీవిస్తున్న దక్షిణాది క్షేత్రం చక్కగా శ్రద్ధ తీసుకొనబడుతుందని అర్థం. అక్కడున్న చాలా స్థలాలు చరిత్ర ప్రసిద్ధిగాంచినవి. మీరు చక్కని పింగాణీ పాత్రలను ఇష్టపడే వారైతే, డ్రెజ్‌డెన్‌కు దగ్గర్లో ఉన్న మైసెన్‌ పట్టణం, ప్రపంచంలోని అతి నాజూకైన పింగాణీ వస్తువులకు ఉనికిపట్టని మీరు గుర్తిస్తారు. మైసెన్‌ ఇప్పుడు 130 మంది రాజ్య ప్రచారకులున్న పట్టణం. లేక “జర్మనీ యొక్క రాజసమైన రాజధాని” అయిన వేమర్‌ను గమనించండి. నగరం నడిబొడ్డులో ఉన్న గొతే-షిలెర్‌ జ్ఞాపకార్థ చిహ్నం, ఆ ఇద్దరు రచయితలతో వేమర్‌కు ఉన్న గౌరవప్రద సంబంధాలకు అద్దంపడుతోంది. మరి అక్కడున్న చాలామందికి అది ఘనతకు కారణంగా ఉంది. నేడు వేమర్‌ తన 150 కంటే ఎక్కువ మంది సువార్త ప్రచారకుల విషయమై గర్వించవచ్చు.

అయితే, ఉత్తరాన మాత్రం, ప్రచారకులు కొద్దిమందే ఉన్నారు మరియు సంఘాల మధ్య చాలా ఎక్కువ దూరం ఉండడంచేత పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. పని చేసే వారు చాలామంది తమ ఉద్యోగాలను నిలుపుకోడానికి అక్కడ ఎక్కువ సమయం గడపాల్సిన ఒత్తిడికి గురౌతున్నారు. ఉత్తరాన పూర్తికాల ప్రచారకునిగా సేవచేస్తున్న ఒక సహోదరుడు యిలా వివరిస్తున్నాడు: “నిషేధం ఉన్నప్పుడు ప్రతి ఒక్క సహోదరునికి క్షేత్ర సేవలో యెహోవా రక్షణ అవసరమై యుండేంది, కానీ ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. మాకు ప్రకటించడానికి స్వేచ్ఛ ఉంది, కానీ పని విషయంలో మాకు ఆయన నడిపింపు అవసరం. ఆ విధమైన మార్పుకు అలవాటు పడాల్సి ఉంటుంది.”

తరచుగా ప్రకటించ గల్గుతున్నందుకు ప్రచారకులు ఆనందిస్తున్నారా? వుల్ఫ్‌గ్యాంగ్‌ అభిప్రాయం ఏమిటంటే: “ఒకే ప్రచారకుడు తాను పని చేసిన ప్రాంతంలో మళ్లీ మళ్లీ పని చేయడం చాలా మంచిది. ప్రజలు అతన్ని నమ్మడానికి మొదలుపెడతారు అలా వాళ్లు కొంచెం కలివిడిగా ఉండగల్గుతారు.” అంతేకాకుండా, ఇంటివారు “అటుగా వెళ్లేవారు వినేంత దూరంలో ఉన్నాకానీ, తమ యింటివద్ద మతాన్ని గురించి మాట్లాడటానికి ఇబ్బందిపడటం లేదు. మతం ఇక ఎంత మాత్రం నిషిద్ధ అంశంగా లేదు.” రాల్ఫ్‌ మరియు మార్టీనాలు యిలా ఒప్పుకుంటున్నారు. “మా క్షేత్రంలో బహు తరచుగా పని చేయడంవలన మేము ఆనందిస్తున్నాము. మేము ప్రజలను వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు, అనేక రకాలైన ప్రచురణలు అందుబాటులో ఉండటం మాకెంతో పులకరింపుగా ఉంది.”

మన ప్రచురణలయెడల మెప్పు

రాల్ఫ్‌ మరియు మార్టీనాలు లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌? అనే పుస్తకాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. నాస్తికత్వాన్ని హత్తుకున్న మునుపటి తూర్పు జర్మనీలోని చాలామందికి, ఈ పుస్తకం ఒక అద్భుతమైన బైబిలు పఠన మూలంగా పనిచేస్తోంది. అటువంటి సమాచారాన్నే కలిగి ఉన్న ఒక చిన్న ప్రచురణను కూడా వారు కోరుకున్నారు. “డ్రెజ్‌డెన్‌లో 1992 ‘వెలుగు ప్రకాశకులు’ జిల్లా సమావేశాల్లో దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్‌ విడుదల అయినప్పుడు మేము ఎంతగా ఆనందించామో. అది మా ప్రార్థనలకు జవాబుగా ఉంది.”

సాక్షులుకాని అనేకమంది వాచ్‌టవర్‌ ప్రచురణలను మెచ్చుకుంటున్నారు. జూలై 1992న, సాంఘిక విద్యను బోధించే ఒక అధ్యాపకురాలు ఆ ప్రచురణలపట్ల తన “అత్యున్నత గౌరవాన్ని మరియు హృదయపూర్వక వందనాలను” తెలియజేయడానికి ఉత్తరం వ్రాసింది. ఆమె తన ప్రసంగాలను సిద్ధపర్చడంలో వాటిని ఉపయోగిస్తుంది. జనవరి 1992లో రాస్టాక్‌లోని ఒక స్త్రీ తన ఇంటికి వచ్చిన ఇద్దరు సాక్షులనుండి మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తక ప్రతిని అంగీకరించింది. జర్మన్‌ బ్రాంచి కార్యాలయానికి ఆమె యిలా వ్రాసింది: “నేను లూథరన్‌ చర్చికి చెందిన దాన్ని. యెహోవాసాక్షుల సంస్థ యొక్క కార్యకలాపాల యెడల నాకు అత్యున్నత గౌరవం ఉంది. దేవుని నడిపింపు లేకుండా మానవుడు ఉనికియందుండలేడని వారు ఉద్ఘాటిస్తారు.”

క్రైస్తవమత చర్చిలు తమ సభ్యులకు ఎంత మేరకు ఆత్మీయ నడిపింపు ఇచ్చారు? డె జైట్‌ అనే ప్రఖ్యాతిగాంచిన వార్తాపత్రిక, లూథరన్‌ చర్చీ “శాంతియుత విప్లవానికి తల్లిగా కొంతకాలమే ఘనతను అనుభవించింది, దాని ప్రజాదరణ త్వరితగతిన తగ్గిపోతున్నట్లుంది” అని డిశంబరు 1991లో వ్యాఖ్యానించింది. నిజానికి, లూథరన్‌ చర్చి ప్రతినిధి యిలా విలపించాడు: “ప్రజలు ఫ్రీ-మార్కెట్‌ వ్యవస్థలోని జీవితాన్ని పరదైసుగా భావించి తికమక పడుతున్నారు.” మగ్డేబర్గ్‌లోని ఒక చర్చి సభ్యుడు సమాచారాన్ని కోరుతూ జర్మన్‌ బ్రాంచికి వ్రాశాడు. ఎందుకు? ఆ పెద్దమనిషి యిలా వ్రాస్తున్నాడు: “ఎన్నో సంవత్సరాలు అపనమ్మకంతో పేలవంగా నవ్విన తరువాత, ఈ లోకము అంత్యదినాల్లో ఉందని, మరి మనము సమీప భవిష్యత్తులో గొప్ప విపత్తులను ఎదుర్కొంటామని నాకు పూర్తిగా నిరూపించబడింది.”—2 తిమోతి 3:1-5.

విస్తరణ కొరకు కట్టుట

వెండేకు ముందు, తూర్పు జర్మనీలో రాజ్య మందిరాలు అనుమతింపబడేవి కావు. ఇప్పుడు అవి చాలా అత్యవసరం; వాటిని నిర్మించడానికే ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. సత్యారాధనలోని మరో ఆకృతి అయిన ఈ నిర్మాణ పని గణనీయమైన మార్పుకు లోనైయ్యింది. ఈ మార్పు ఎంత త్వరితగతిని జరుగుతోందో ఒక సహోదరుని అనుభవం ఉదహరిస్తుంది.

మార్చి 1990లో, తూర్పు జర్మనీలోని యెహోవాసాక్షులకు చట్టపర గుర్తింపు లభించిన కొన్ని గంటలకే, ఒక సహోదరుడు తన జీవితంలోనే మొదటిసారిగా మైకును ఉపయోగిస్తూ, కొంతమంది సాక్షులనుద్దేశించి ప్రసంగించమని ఆహ్వానించబడ్డాడు. రెండున్నర సంవత్సరాల తరువాత, అతను సహవసిస్తున్న సంఘం ఒక క్రొత్త రాజ్య మందిరాన్ని ప్రతిష్ఠించింది. మరి 1992 ముగింపుకల్లా, 16 సంఘాల కొరకు ఏడు రాజ్య మందిరాలు నిర్మింపబడ్డాయి. ఇంకో 30 రాజ్య మందిరాలు, ఆలాగే ఒక ఆకర్షణీయమైన సమావేశ మందిరం కొరకు పథకాలు వేయబడుతున్నాయి.

దేవుని రాజ్యంపై దృష్టి నిలుపబడి ఉంది

“వెండే తరువాత కొద్ది రోజులకు, చాలామంది ప్రజలు బైబిలును తిరస్కరించారు. వారు చివరకు మంచి పరిస్థితులు వస్తాయని వాగ్దానం చేసిన నూతన ప్రభుత్వంపై తమ నమ్మకాలను ఉంచారు” అని ఒక క్రైస్తవ పెద్ద చెబుతున్నాడు. మరి వారి నమ్మకం నెరవేరిందా? “రెండు సంవత్సరాల్లో వారు తమ మనస్సులను మార్చుకున్నారు. మానవ ప్రభుత్వాలు శాంతి మరియు నీతిని ఎన్నటికీ తీసుకురాలేవని ప్రజలు ఇప్పుడు మాతో ఏకీభవిస్తున్నారు.”

పాశ్చాత్య ఆలోచనల స్వర్ణ యుగంగా భావించిన దాన్ని ఆహ్వానిస్తూ, తూర్పు జర్మనీలో కఠినమైన సమాజవాదం యొక్క గ్రహణం విషయమై చాలామంది ఆనందించారు. కానీ వాళ్లు నిరాశ చెందారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, యెహోవాసాక్షులు తమ దృష్టిని తేటగా ఉంచుకుని, ఆకాశంలో తారలా మెరుస్తున్న దేవుని రాజ్యంపై దాన్ని దృఢంగా నిలుపుతారు. అటువంటి నమ్మకం ఎప్పటికీ నిరాశకు దారీ తీయదు.—రోమీయులు 5:5.

[అధస్సూచీలు]

a ఏప్రిల్‌ 15, మే 1, మరియు మే 15, 1992 ది వాచ్‌టవర్‌లలో 1-3 భాగాలుగా వచ్చిన “జెహోవా కేర్డ్‌ ఫర్‌ అజ్‌ అండర్‌ బ్యాన్‌,” అనే శీర్షికలను చూడండి.

[26వ పేజీలోని చిత్రాలు]

జర్మనీలోని సాక్షులు రాజ్య పనిలో వీలైనంత ఎక్కువ చేయడానికి తమ స్వాతంత్ర్యాన్ని ఉపయోగిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి