రాహాబు—విశ్వాస క్రియలనుబట్టి నీతిమంతురాలిగా తీర్చబడింది
కొంచెం ఊహించండి! ఒక వేశ్య దేవుని దృష్టిలో నీతిమంతురాలిగా తీర్చబడింది. “ఎన్నటికీ అలా జరగదు!” అని చాలామంది అనవచ్చు. అయిననూ, ప్రాచీన కనాను పట్టణమైన యెరికో నందలి వేశ్యయైన రాహాబుకు అదే జరిగింది.
బైబిలు రచయితయైన యాకోబు దాన్నిలా వ్రాశాడు: “మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి. అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా? ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.” (యాకోబు 2:24-26) రాహాబు ఎందుకు నీతిమంతురాలిగా తీర్చబడింది? దేవునితో అటువంటి ఆధిక్యతా స్థానాన్ని పొందడానికి ఆమె ఏమి చేసింది?
ఇశ్రాయేలీయులు వస్తున్నారు!
మనము సా.శ.పూ 1473వ సంవత్సరానికి వెళ్దాము. ఆ దృశ్యాన్ని ఊహించండి. యెరికో అతి పటిష్ఠంగా ఉంది. ఆ పట్టణ గోడలపై వేశ్యయైన రాహాబు ఇల్లు ఉంది. ఆ అనుకూల స్థలంనుండి ఆమె తూర్పువైపున ఉన్న యొర్దాను నదిలో పొంగి పారుతున్న జలాలను చూడగలదు. (యెహోషువ 3:15) దాని తూర్పువైపు తీరాన, 6,00,000 మంది సైనిక బలంతో ఉన్న ఇశ్రాయేలీయుల గుడారాలను ఆమె గమనించియుండవచ్చు. వారు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు!
యుద్ధాల్లో ఇశ్రాయేలీయుల విజయాలను గురించి రాహాబు విన్నది. యెహోవా శక్తి కార్యాలను గూర్చి కూడా ఆమె విన్నది, ప్రాముఖ్యంగా ఎర్ర సముద్రము గుండా ఇశ్రాయేలీయులు తప్పించుకోడానికి మార్గం తెరవడాన్ని గూర్చి ఆమె వినియుండవచ్చు. కావున, పొంగుతున్న యొర్దాను నీరు ఒక పెద్ద ఆటంకమేమి కాదు. ఇది ఒక నిర్ణయాత్మక సమయం! మరి రాహాబు ఎలా ప్రతిస్పందిస్తుంది?
రాహాబు తన నిర్ణయాన్ని తీసుకుంది
త్వరలోనే, రాహాబు ఇద్దరు అనుకోని అతిథులను ఎదుర్కొంటుంది—వారు ఇశ్రాయేలీయుల గుడారాలనుండి వచ్చిన వేగులవారు. వారు బసకొరకు వెదుకుతున్నారు, మరి ఆమె వాళ్లను తన ఇంట్లో చేర్చుకుంటుంది. కానీ వారి ఉనికిని గురించిన వార్త యెరికో రాజు చెవిన పడింది. వారిని పట్టుకోడానికి తన వద్ద ఉన్న చట్టాన్ని అమలుపరిచే అధికారులను ఆయన వెంటనే పంపుతాడు.—యెహోషువ 2:1, 2.
రాజు అధికారులు వచ్చేసరికి, రాహాబు యెహోవా దేవుని పక్షాన నిలుచుటకు తన నిర్ణయాన్ని తీసుకుంది. “నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము” అని ఆ రాజుద్యోగులు దబాయిస్తారు. రాహాబు ఆ వేగులవారిని తన మిద్దెమీద ఎండడానికి రాశివేసి ఉన్న జనుములో దాచి ఉంచింది. ఆమె వారితో యిలా చెప్పింది: “మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా [పట్టణపు] గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు.” (యెహోషువ 2:3-5) రాజు మనుష్యులు ఆ విధంగానే చేసారు, కాని వారి ప్రయత్నం విఫలమౌతుంది.
రాహాబు శత్రువులను తప్పుదారి పట్టించింది. వెంటనే ఆమె ఇంకా కొన్ని చర్యలు గైకొంది. అవి యెహోవాపై ఆమె కలిగియున్న విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించేవి. ఆమె మీద్దె మీదికి వెళ్లి వేగులవారితో ఇలా చెబుతుంది: “యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని . . . నేనెరుగుదును.” దేవుడు 40 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల ఎదుట “యెర్ర సముద్రపు నీరును” ఎలా “ఆరిపోచేసెనో” మేము విన్నాము గనుక దేశ జనులంతా భయపడుతున్నారని రాహాబు ఒప్పుకుంటుంది. ఇశ్రాయేలీయులు అమ్మోరీయుల ఇద్దరు రాజులను నాశనం చేశారని కూడా జనులకు తెలుసు. రాహాబు యిలా చెబుతుంది, “మేము వినినప్పుడు, మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.”—యెహోషువ 2:8-11.
రాహాబు యిలా వేడుకుంటుంది: “నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగియున్న వారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.”—యెహోషువ 2:12, 13.
ఆ మనుష్యులు అందుకు అంగీకరించి ఏమి చేయాలో రాహాబుకు చెబుతారు. వేగులవారిని యెరికో గోడల బయట, క్రిందికి దింపడానికి ఉపయోగించిన ఎర్రని త్రాడును ఆమె కిటికీ నుండి వ్రేలాడదీయాలి. ఆమె తన కుటుంబాన్ని తన యింట్లోకి సమకూర్చుకోవాలి, రక్షణ కొరకు వాళ్లంతా అక్కడే ఉండాలి. వెళ్లిపోతున్న వేగులవారికి రాహాబు, ఆ పట్టణం ఎక్కడ ఎలా ఉంది మరియు తమ శత్రువుల బారినుండి ఎలా తప్పించుకోవచ్చు అనే సహాయక సమాచారాన్ని అందిస్తుంది. అలానే ఆ వేగులవారు చేస్తారు. ఆ ఎర్ర త్రాడును వ్రేలాడదీసి, తన కుటుంబ సభ్యులను సమకూర్చిన తరువాత, రాహాబు జరుగబోయే సంఘటనల కొరకు ఎదురు చూస్తుంది.—యెహోషువ 2:14-24.
రాహాబు ఏమి చేసింది? తన విశ్వాసం సర్వోన్నత దేవుడైన యెహోవాపై ఉందని ఆమె నిరూపించుకుంది! ఆమె ఇక ఆయన కట్టడల అనుసారంగా జీవిస్తుంది. అవును, ఆమె అటువంటి విశ్వాస క్రియలనుబట్టి నీతిమంతురాలిగా తీర్చబడుతుంది.
గోడలు కూలాయి
కొన్ని వారాలు గడిచాయి. యాజకులతో కలిసి—కొందరు పొట్టేలు కొమ్ము బూరలు, మరికొందరు పరిశుద్ధ నిబంధన మందసమును మోస్తూ,—ఇశ్రాయేలీయులు యెరికో చుట్టుముట్టుతున్నారు. వారు రోజుకు ఒక్కసారి చొప్పున ఆరు రోజులనుండి అలా చేస్తున్నారు. అయితే, ఈ ఏడవ రోజున, వాళ్లు పట్టణంచూట్టూ ఇప్పటికే ఆరుసార్లు తిరిగారు. అదుగో వారు మళ్లీ వెళ్తున్నారు!
ఏడవసారి తిరగడం పూర్తయ్యింది, బూరనుండి పెద్ద ధ్వనులు అంతటా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు బిగ్గరగా అరుస్తారు. దానితో, యెహోవా యెరికో యొక్క రక్షణకరమైన గోడలు ఉరుముల వంటి పెద్ద శబ్దంతో పడిపోయేలా చేస్తాడు. రాహాబు యిల్లు ఉన్న భాగం మాత్రమే నిలిచి ఉంటుంది. మిగతా పట్టణము దాని నివాసులు మాత్రం నాశనం చేయబడ్డారు. ఆమె విశ్వాసము క్రియలచేత చూపబడింది, పశ్చాత్తాపము చెందిన వేశ్య తన కుటుంబంతోపాటు భద్రపర్చబడింది, మరియు ఆమె యెహోవా ప్రజల మధ్య జీవించడం మొదలు పెడుతుంది.—యెహోషువ 6:1-25.
రాహాబు లక్షణాలను కొంచెం గమనిద్దాం
రాహాబు పనికిరాని బద్ధకస్థురాలు కాదు, ఎందుకంటే ఆమె మిద్దెపైన ఎండవేయబడిన జనుము ఉంది. జనపనారను సన్నపు నార చేయడానికి ఉపయోగిస్తారు. రాహాబు యింట్లో ముదురు ఎరుపు దారం కూడా చాలా ఉంది. (యెహోషువ 2:6, 18) కావున ఆమె సన్నపు నార తయారు చేస్తుండవచ్చు, అలాగే రంగులు వేసే కళ కూడా ఆమెకు తెలిసియుండవచ్చు. అవును, రాహాబు శ్రమించే స్త్రీ. అన్నింటికన్నా మిన్నగా, ఆమె యెహోవాయెడల గౌరవంతో కూడిన భయాన్ని కలిగి ఉంది.—సామెతలు 31:13, 19, 21, 22, 30.
మరి రాహాబుకున్న ఇంకొక వృత్తి సంగతేమిటి? ఆమె కేవలం ఒక సత్రానికి యజమానురాలు మాత్రమే కాదు. లేఖనాలు, వేశ్యను సూచించే హెబ్రీ మరియు గ్రీకు పదాలను ఉపయోగిస్తూ ఆమెను గుర్తిస్తున్నాయి. ఉదాహరణకు, జొహానాహా అనే హెబ్రీ పదం యొక్క అర్థం ఎప్పుడూ కూడా అక్రమ సంబంధాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా, కనానీయుల మధ్య వ్యభిచారమనేది అవమానకరమైన వృత్తేమి కాదు.
యెహోవా, వేశ్యను ఉపయోగించడం ఆయన గొప్ప కనికరాన్ని ప్రదర్శిస్తుంది. బాహ్య రూపాలు మనల్ని మోసపర్చవచ్చు, కానీ దేవుడు “హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:7) కావున, సరైన మనస్సు గల వేశ్యలు తమ వ్యభిచారం విషయమై పశ్చాత్తాపపడితే వారు యెహోవా దేవుని క్షమాపణను పొందవచ్చు. (మత్తయి 21:23, 31, 32 పోల్చండి.) రాహాబు దైవిక అనుగ్రహాన్ని పొందినదై తానే తన పాపము నుండి నీతియుక్తమైన నడవడి వైపునకు మరలింది.
ఇశ్రాయేలు వేగులవారు దేవుని కట్టడలకు అనుగుణంగా జీవించారు, కావున వారు లైంగిక కారణాల విషయమై రాహాబు ఇంట్లో దిగలేదు. వారు ఒక వేశ్య యింట్లో గనుక ఉంటే, అనుమానం వచ్చే అవకాశాలు అంత ఎక్కువ ఉండవు అన్నదే వారి కారణమై ఉండవచ్చు. అది పట్టణ ప్రాకారంపై ఉండడం, సులభంగా తప్పించుకోడానికి కూడా దోహదపడుతుంది. ఇశ్రాయేలీయుల విషయమైన దైవిక నడిపింపును గురించిన వార్తలవలన ఆమె మనస్సు ఎంత చక్కగా ప్రతిస్పందించిందంటే ఆమె పశ్చాత్తాపము చెంది తన మార్గాలను మార్చుకుంది. కాబట్టే, అటువంటి పాపి వద్దకు యెహోవా వారిని నడిపించాడన్నది స్పష్టమౌతోంది. కనానీయుల అవినీతికరమైన అలవాట్లను బట్టి ఇశ్రాయేలీయులు వారిని తమ వద్దనుండి పారద్రోలాలని దేవుడు చేసిన ప్రకటన, మరియు రాహాబుపట్ల అలాగే యెరికోను జయించుటకు ఆయన కుమ్మరించిన ఆశీర్వాదం, వేగులవారు వ్యభిచరించ లేదను విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.—లేవీయకాండము 18:24-30.
వేగులవారిని వెదుకుతున్న వారికి రాహాబు చెప్పిన తప్పుదారి పట్టించే మాటల విషయం ఏమిటి? దేవుడు ఆమె ప్రవర్తనను అంగీకరించాడు. (రోమీయులు 14:4 పోల్చండి.) తన విశ్వాసాన్ని చూపుతూ, ఆయన సేవకులను రక్షించడానికి ఆమె అపాయాన్ని ఎదుర్కొనడానికి పూనుకుంది. యెహోవా దృష్టిలో ద్వేషపూరిత అబద్ధాలు తప్పుకానీ, సరైన సమాచారం తెలుసుకో నవసరం లేని వ్యక్తులకు దాన్ని గురించి చెప్పవలసిన అగత్యత ఒక వ్యక్తికి లేదు. పూర్తి వివరాలు లేక సూటి సమాధానాలు ఇవ్వడం అనవసర హానిని తెస్తుంది అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు సహితం అలా చేయకుండా ఊరుకున్నాడు. (మత్తయి 7:6; 15:1-6; 21:23-27; యోహాను 7:3-10) కావున, శత్రు అధికారులను తప్పుదారి పట్టించడానికి రాహాబు చేసిన దాన్ని కూడా ఈ వెలుగులోనే దృష్టించాలి.
రాహాబు పొందిన ప్రతిఫలము
విశ్వాసం ఉంచినందుకు రాహాబు ఎలా ప్రతిఫలం పొందింది? యెరికో నాశనం చేయబడినప్పుడు ఆమె సంరక్షింపబడడం నిజంగా యెహోవానుండి వచ్చిన దీవెనే. తరువాత, ఆమె అరణ్యంలో యూదా గోత్రపు వారికి పెద్దయైన నయస్సోను కుమారుడైన శల్మానును (శల్మా) వివాహం చేసుకుంది. దైవభక్తి గలవాడైన బోయజు తలిదండ్రులుగా, శల్మాను రాహాబులు ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పుట్టిన వంశ క్రమంలో ఒక భాగమయ్యారు. (1 దినవృత్తాంతములు 2:3-15; రూతు 4:20-22) ఇంకా ప్రాముఖ్యంగా, మత్తయి వ్రాసిన యేసుక్రీస్తు వంశావళిలో పేర్కొనబడిన కేవలం నలుగురు స్త్రీలలో, పూర్వము వేశ్యగా ఉండిన రాహాబు ఒకామె. (మత్తయి 1:5, 6) యెహోవానుండి ఎంతటి ఆశీర్వాదము!
ఒక ఇశ్రాయేలీయురాలు కాకపోయినా, ఒకప్పుడు వేశ్యయైనా, రాహాబు తనకు యెహోవాయందు పూర్తి విశ్వాసం ఉందని తన క్రియల ద్వారా నిరూపించుకున్న స్త్రీగా ఒక అసాధారణ ఉదాహరణ అయ్యింది. (హెబ్రీయులు 11:30, 31) వేశ్యా జీవితాన్ని వదులుకున్న ఇతరులవలె, ఆమె ఇంకొక ప్రతిఫలాన్ని కూడా అందుకుంటుంది—భూపరదైసులో జీవాన్ని పొందడానికి మృతులనుండి ఆమె పునరుత్థానం అవుతుంది. (లూకా 23:43) క్రియలతో కూడిన ఆమె విశ్వాసాన్ని బట్టి, రాహాబు ప్రేమగలవాడూ మరియు క్షమించువాడైన మన పరలోకపు తండ్రి అంగీకారాన్ని పొందగలిగింది. (కీర్తన 130:3, 4) మరియు ఆమె చక్కని మాదిరి, నీతిని ప్రేమించే వారందరూ నిత్యజీవం కొరకు యెహోవా వైపు చూడడానికి తప్పకుండా ప్రోత్సాహాన్ని అందజేస్తుంది.
[23వ పేజీలోని చిత్రం]
రాహాబుకు విశ్వాసం ఉందని ఆమె క్రియలు నిరూపించాయి గనుక ఆమె నీతిమంతురాలిగా తీర్చబడింది
[24వ పేజీలోని చిత్రాలు]
పురావస్తు శాస్త్రజ్ఞులు ప్రాచీన యెరికో శిథిలాలను, వాటితోపాటు అంతకుముందున్న గోడలోని ఒక చిన్న భాగాన్ని కనుగొన్నారు
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.