కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 12/15 పేజీలు 3-7
  • మంచుకురిసే కాలంలో యేసు జన్మించెనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచుకురిసే కాలంలో యేసు జన్మించెనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు విద్యార్థులకు ఏ ప్రాధాన్యతను కలిగి ఉంది?
  • బైబిలుపై ఆధారపడిన లెక్కలు
  • ఏ మూలం నుండి?
  • అది అంత ముఖ్యమా?
  • యేసు ఎప్పుడు పుట్టాడు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • క్రిస్టమస్‌—నిజంగా క్రైస్తవత్వానికి సంబంధించినదేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యేసు ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు?
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసు జన్మము—ఎక్కడ మరియు ఎప్పుడు?
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 12/15 పేజీలు 3-7

మంచుకురిసే కాలంలో యేసు జన్మించెనా?

“దట్టమైన మంచు యెరూషలేము అనుదిన జీవితాన్ని కుంటుపరుస్తుంది” మరియు “ఎడతెగక కురిసే మంచు ఉత్తరాన్ని ఊపేస్తుంది.” ఈ శతాబ్దంలో 1992 శీతాకాలం ఇజ్రాయేల్‌ నందు అతి శీతలమైనదిగా గుర్తింపబడింది గనుక ఇజ్రాయేల్‌నందలి పాఠకులకు ఆ సంవత్సరం ది జెరూసలేమ్‌ పోస్ట్‌లో అటువంటి వార్తాశీర్షికలను చూడటం మామూలు అయ్యింది.

జనవరికల్లా హెర్మోను కొండ శిఖరం 7 నుండి 12 మీటర్లు మంచుతో కప్పబడింది. శీతాకాలం ఇంకా ముగియలేదు. గోలన్‌ శిఖరాలు మొదలుకొని యెరూషలేము దిగువనున్న గలిలయ ఎగువ ప్రాంతం, దగ్గర్లో ఉన్న (కవరు పేజీపై కనబడుతున్న) బేత్లెహేము, దక్షిణాన నెగేబు వరకు ఉన్న ఇజ్రాయేలీయుల అనుదిన జీవితం మనోహరం మరియు సున్నితమైననూ, భయంకరమైన ఈ చలికాలం ద్వారా చాలాసార్లు అది కుంటుపడుతూ వచ్చింది. జెరూసలేమ్‌ పోస్ట్‌లోని ఒక శీర్షిక యిలా నివేదించింది: “గతవారం సోవియట్‌ వారి కెత్యుషె రాకెట్లు చేయలేకపోయిన పనిని దట్టమైన మంచుపాతం నిన్న చేయగలిగింది. అది మనుష్యుల నివాస స్థలాల్ని మూసివేసి, వారు తమ ఇండ్లలోనే బంధీలుగా ఉండేట్టు చేసింది.”

ఆ ఎముకలు కొరికే శీతాకాలం కేవలం పట్టణ వాసులకే కాదు అనేకులకు కూడ భారీనష్టాన్ని కలిగించింది. రాత్రివేళ ఉష్ణోగ్రత ఘనీభవించు స్థితికి పడిపోవడంతో వందలాది ఆవులు, దూడలు, ఆలాగే వేల సంఖ్యలో కోళ్లు చలికి గడ్డకట్టి చనిపోయాయని నివేదికలు వచ్చాయి. కురుస్తున్న మంచు చాలదన్నట్టు, అతిశీతలమైన బారీ వర్షాలు కూడా చాలామందిని పొట్టనబెట్టుకున్నాయి. ఒకరోజు, ఇద్దరు యౌవన గొర్రెల కాపర్లు వరద ప్రవాహంలో చిక్కుకున్న తమ అనేక గొర్రెలను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ, తాము కూడ కొట్టుకుపోయి వరద ప్రవాహంలో మునిగిపోయారు.

మధ్యప్రాచ్యంలోని శీతాకాలం మామూలుగా యిలా ఉండక పోయినా, ఎరెట్జ్‌ అనే ఇజ్రాయేలీ పత్రిక యిలా నివేదించింది: “యెరూషలేములో మంచు కురవడం మనం ఊహించేదాని కంటే ఎక్కువగానే ఉంటుందని ఇజ్రాయేల్‌ దేశంలో గత 130 సంవత్సరాలనుండి సేకరించి, రికార్డు చేయబడిన వాతావరణ శాస్త్ర వివరాలు తెలియజేస్తున్నాయి . . . 1949 నుండి 1980 వరకూ, యెరూషలేము పట్టణంలో ఇరవై నాలుగుసార్లు మంచు కురిసిన శీతాకాలాలు వచ్చాయి.” అయితే ఇది కేవలం వాతావరణ శాస్త్రం మరియు మానవ ఆసక్తికి అవసరమైనదేనా, లేక అది బైబిలు విద్యార్థులకు ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉందా?

బైబిలు విద్యార్థులకు ఏ ప్రాధాన్యతను కలిగి ఉంది?

యేసు జననాన్ని గురించి ఆలోచించేటప్పుడు, చాలామంది ప్రజలు చాలావరకు క్రిస్టమస్‌ సమయంలో ప్రదర్శింపబడే మనోహరమైన పశువుల తొట్టి దృశ్యాన్ని వారి మనస్సులో ఊహించుకుంటారు. అందులో బాల యేసు వెచ్చగా పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉంటాడు మరియు తన తల్లిచేత సంరక్షింపబడుతూ, పడుకొని ఉంటాడు, చుట్టు ప్రక్కల ప్రాంతమంతా మెత్తని పరుపువలే మంచు చేత కప్పబడి ఉంటుంది. ఈ ప్రచలిత అభిప్రాయం ఈ చారిత్రాత్మక సంఘటన యొక్క బైబిలు వివరణతో ఏకీభవిస్తుందా?

బైబిలు రచయితయైన లూకా యేసు జననాన్ని గురించి చాలా జాగ్రత్తగా వ్రాసిన వృత్తాంతమందు యిలా చెబుతున్నాడు: “ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత—భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు [బేత్లెహేము] నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకతొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి—సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.”—లూకా 2:8-14.

నేడు మీరు ఒక సగటు ఇజ్రాయేలీయునికి ఈ వృత్తాంతాన్ని చదివి వినిపించి ఈ సంఘటన, సంవత్సరంలో ఏ సమయమందు జరిగి ఉండవచ్చని అడిగితే, “ఏప్రిల్‌ నుండి అక్టోబరు మధ్యకాలంలో” అని అతను జవాబిస్తాడు. ఎందుకు? జవాబు చాలా సులభం. నవంబరు మొదలుకొని మార్చి వరకు ఇజ్రాయేల్‌లో శీతలంతో కూడిన వర్షాకాలం ఉంటుంది, మరి డిశంబరు 25 అయితే తప్పకుండా శీతాకాలంలోనే వస్తుంది. గొర్రెల కాపరులు రాత్రివేళ పొలంలో తమ మందలను కాస్తూ, బయట జీవిస్తుండరు. అలా ఎందుకుండరో, ఈ శీర్షిక ప్రారంభంలోని నివేదికలను గమనిస్తే మీరు బాగా అర్థం చేసుకోగలరు. యేసు జన్మించిన బేత్లెహేము, యెరూషలేముకు కొన్ని మైళ్ల దూరంలో సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. వాతావరణం మరీ అంత విపరీతంగా ఉండని సంవత్సరాల్లో కూడా, ఇక్కడ శీతాకాలంలో రాత్రివేళ చాలా చలిగా ఉంటుంది.—మీకా 5:2; లూకా 2:15.

యేసు జనన సమయంలోని చరిత్రను ఒకసారి గమనించడం, ఆయన డిశంబరులో మంచుకురిసే కాలంలో జన్మించలేదను వాస్తవంపై వెలుగు ప్రసరింప జేస్తుంది. యేసు తల్లియైన మరియ, తన ప్రసవకాలంలో ఉన్ననూ, నజరేతులోని తన ఇంటినుండి బేత్లెహేముకు ప్రయాణించవలసి వచ్చింది. రోమా పరిపాలకుడైన కైసరు ఔగుస్తు జారీచేసిన జనాబా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి ఆమె మరియు యోసేపు వెళ్లవలసి వచ్చింది. (లూకా 2:1-7) రోమన్ల పరిపాలనను వారు విధించే అధిక పన్నుల విషయమై యూదా జనాంగం అప్పటికే తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. అతి కష్టమూ, ప్రమాదకరమూ అయిన శీతాకాలంలో తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి అనేకమందిని ప్రయాణించవలసిందిగా ఆజ్ఞ జారీచేసి రోమా సామ్రాజ్యం వారినెందుకు అనవసరంగా రెచ్చగొడుతుంది? ప్రయాణించడానికి చాలా ఉల్లాసకరంగా ఉండే వసంతకాలంలోనో లేక శరత్కాలంలోనో అట్టి ఆజ్ఞ జారీ అయివుండవచ్చు అన్నది చాలావరకూ సహేతుకంగా లేదా?

బైబిలుపై ఆధారపడిన లెక్కలు

డిశంబరు లేక వేరే ఇతర శీతాకాల మాసాలు, యేసు జన్మ వృత్తాంత సంఘటనలకు అనుకూలమైనవి కావని చారిత్రాత్మక మరియు భౌతిక వాస్తవాలు రూఢి పరుస్తున్నాయి. దానికిపైగా, యేసు సంవత్సరంలోని ఏ సమయంలో పుట్టాడో ప్రవచనాల ద్వారా బైబిలు వెల్లడిచేస్తోంది. దీనిని ఎక్కడ చూపింది?

దానియేలు పుస్తకం, 9వ అధ్యాయంలో మెస్సీయను గురించిన అతి ప్రభావవంతమైన ప్రవచనాల్లో ఒకదాన్ని మనం కనుగొంటాము. ఆయన రాకడను అలాగే విధేయులైన మానవులు “యుగాంతము వరకుండునట్టి నీతిని” సంపాదించడానికి ఒక పునాదిని స్థాపించేలా, పాపపరిహారం కొరకు విమోచనా క్రయధన బలిని అర్పించడానికి ఆయన చనిపోవడాన్ని అది వర్ణిస్తుంది. (దానియేలు 9:24-27; మరియు మత్తయి 20:28 పోల్చండి.) ఈ ప్రవచనం ప్రకారం, ఇదంతా యెరూషలేమును తిరిగి నిర్మించమను ఆజ్ఞ బయలువెడలిన సా.శ.పూ. 455వ సంవత్సరంనుండి 70 వారముల సంవత్సరాల కాలంలో జరుగుతుంది.a (నెహెమ్యా 2:1-11) ఈ ప్రవచనంలోని సమయ విభజనను బట్టి, 70వ వారపు సంవత్సరాల ఆరంభంలో మెస్సీయ వస్తాడు అనే విషయాన్ని గ్రహించవచ్చు. మెస్సీయగా తన పాత్రను అధికారికంగా ప్రారంభిస్తూ, సా.శ.29లో యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు అది సంభవించింది. “అర్థవారమున,” లేక మూడున్నర సంవత్సరముల తరువాత, మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్న అన్ని బలుల విలువను అంతం చేస్తూ, మెస్సీయ మరణిస్తాడు.—హెబ్రీయులు 9:11-15; 10:1-10.

యేసు పరిచర్య కాలనిడివి మూడున్నర సంవత్సరాలని ఈ ప్రవచనం వెల్లడి చేస్తుంది. యేసు పస్కా నందు, (యూదుల క్యాలెండరు ప్రకారం) నీసాను 14న, సా.శ.33 వసంతకాలంలో మరణించాడు. ఆ సంవత్సరానికి సరిసమాన తేది ఏప్రిల్‌ 1 అవుతోంది. (మత్తయి 26:2) అక్కడ్నుంచి మూడున్నర సంవత్సరాలు వెనక్కి లెక్కపెడితే ఆయన బాప్తిస్మం సా.శ. 29 అక్టోబరు ప్రారంభంలో అని తెలుస్తోంది. యేసు బాప్తిస్మం సమయంలో 30 ఏండ్ల వాడని లూకా మనకు తెలియజేస్తున్నాడు. (లూకా 3:21-23) అంటే యేసు జననం కూడ అక్టోబరు ప్రారంభంలోనే జరిగిందని దీని అర్థం. లూకా వృత్తాంతానికి అనుగుణంగా, సంవత్సరం యొక్క ఆ సమయంలో గొర్రెల కాపరులు ఇంకా “పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు” ఉంటారు.—లూకా 2:8.

ఏ మూలం నుండి?

యేసు జన్మించిన సమయం అక్టోబరు తొలి భాగమని రుజువులు చూపిస్తున్నప్పుడు, అది డిశంబరు 25న ఎందుకు జరుపు కొనబడుతుంది? ఈ వేడుక యేసు జన్మించిన శతాబ్దాల తర్వాత అంగీకరించబడింది అని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చూపిస్తోంది: “నాల్గవ శతాబ్దంలో క్రీస్తు జననాన్ని డిశంబరు 25న జరుపుకోడాన్ని తూర్పు దేశపు అనేక చర్చీలు క్రమేపి అంగీకరించడం మొదలు పెట్టాయి. యెరూషలేములో క్రిస్టమస్‌కు చాలాకాలం వ్యతిరేకత ఉండింది, కానీ అది చివరకు అంగీకరించబడింది.”

క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లు క్రీస్తు తర్వాత అనేక శతాబ్దాలకు ఈ ఆచారాన్ని అంత సులభంగా ఎందుకు అంగీకరించారు? ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఈ విషయంపై ఇంకా ఎక్కువ వెలుగును ప్రసరింపజేస్తుంది: “క్రీస్తు జనన వేడుక సమయం శీతాకాలం మధ్య భాగంలో ఆచరింపబడే అన్యమత వ్యవసాయ సంబంధమైన మరియు సూర్యారాధన సంబంధమైన ఉత్సవాల సమయంలోనే యాదృచ్ఛికంగా రావడంతో క్రిస్టమస్‌కు సంబంధించిన పారంపర్య ఆచారాలు అనేక మూలాలనుండి అభివృద్ధి చెందాయి. రోమా సామ్రాజ్యంలో సాటర్‌నేలియా, (డిశంబరు 17) ప్రజలు ఆనందభరితులై బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయంగా ఉండేది. డిశంబరు 25 ఇరానీయుల మర్మ దేవుడును, నీతి సూర్యుడైన మిత్రా జన్మదినంగా కూడా పరిగణింపబడేది.”

ఇదంతా నిజంగా “యాదృచ్ఛికంగానే” జరిగిందా? ఎంత మాత్రం కాదు! సా.శ. నాల్గవ శతాబ్దంలో, కాన్స్‌టెంటైన్‌ చక్రవర్తి ఆధ్వర్యమున, రోమా సామ్రాజ్యం క్రైస్తవత్వాన్ని హింసించే ధోరణినుండి “క్రైస్తవత్వాన్ని” ఒక అంగీకృత మతంగా అంగీకరించి దానిని పోషించే సామ్రాజ్యంగా మారింది అన్నది చారిత్రక వాస్తవం. క్రైస్తవత్వం యొక్క నిజమైన అర్థం తెలియని చాలామంది జనులు, ఈ క్రొత్త విశ్వాసాన్ని అంగీకరించి, తమకు తెలిసిన అన్యమత పండుగలను క్రొత్తగా కనుగొన్న “క్రైస్తవ” పేర్లతో ఆచరించడం మొదలుపెట్టారు. క్రీస్తు జన్మదినాన్ని జరుపుకోడానికి “నీతి సూర్యుడు” పుట్టిన తేదీగా ఇదివరకే నియమించబడిన డిశంబరు 25 కంటే వేరే ఏ తేదీ సమంజసంగా ఉంటుంది?

అది అంత ముఖ్యమా?

పూర్వం యూదులైన యేసు తొలి అనుచరులు ఆయన జన్మదినాన్ని జరుపుకోలేదనడంలో సందేహం లేదు. ఎన్‌సైక్లోపీడియా జుడైకా, ప్రకారం “యూదా మత పద్ధతిలో జన్మదినాల ఆచరణ అసలు లేనే లేదు.” తొలి క్రైస్తవులు అటువంటి పండుగను ఎంత మాత్రం అంగీకరించి ఉండరు. ఆయన జన్మదినాన్ని జరుపుకోడానికి బదులు, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు ఇచ్చిన ఆజ్ఞను వారు గౌరవిస్తారు, అందును గూర్చి వారికి ఖచ్చితమైన తేదీ కూడా ఉంది, అదే నీసాను 14.—లూకా 22:7, 15, 19, 20; 1 కొరింథీయులు 11:23-26.

క్రీస్తుకు పూర్వం అనేక శతాబ్దాల ముందు, అప్పట్లో దేవుడు ఎన్నుకొన్న జనాంగమైన, యూదులు, వారికి కలుగబోవు బబులోను చెరయొక్క ముగింపును గూర్చి ప్రవచనార్థకంగా ఇలా హెచ్చరించబడ్డారు: “పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.” (యెషయా 52:11) వారు యెహోవా పవిత్ర ఆరాధనను పునఃస్థాపించడానికి తమ స్వదేశానికి తిరిగి రావలసి ఉండిరి. వారు బబులోనులో గమనించిన అపవిత్ర అన్య ఆచారాలు మరియు ఆరాధనా పద్ధతులను చేపట్టుట వారి ఆలోచనకే రాని విషయమై యుంటుంది.

అదే ఆజ్ఞ, క్రైస్తవుల కొరకు 2 కొరింథీయులు 6:14-18 నందు తిరిగి చెప్పబడటంలో ఆశ్చర్యం లేదు. క్రీస్తును నిరాకరించిన యూదా జనాంగం స్థానంలో, ఆయన అనుచరులు పవిత్ర ఆరాధన యొక్క ప్రతినిధులు అయ్యారు. ఇతరులు ఆత్మీయ అంధకారం నుండి సత్యం యొక్క వెలుగులోకి రావడానికి సహాయం చేయవలసిన బాధ్యత వారికి ఉంది. (1 పేతురు 2:9, 10) క్రీస్తు బోధలను అన్యమత సంబంధంగల ఆచారాలు, సెలవు దినాలతో మిళితం చేస్తే, వారు దాన్ని ఎలా చేయగలరు?

అది జనప్రియమైనదే కావచ్చు, కానీ ఒక “మంచుతో ముడిపడిన క్రిస్టమస్‌ను” జరుపుకోవడం “అపవిత్రమైన దానిని ముట్టడంతో” సమానమే. (2 కొరింథీయులు 6:17) దేవున్ని మరియు క్రీస్తును నిజంగా ప్రేమించే వారు దాన్ని తప్పక త్యజించాలి.

దాని పుట్టుపూర్వోత్తరాలు అన్యమత సంబంధమైనవి కావడమే కాక, యేసు అక్టోబరులో జన్మించాడు కాబట్టి, క్రిస్టమస్‌ సత్యానికి ప్రాతినిధ్యం వహించడం లేదను విషయాన్ని కూడా మనం గమనించాము. అవును, ఒకరి మనస్సులో ఏ దృశ్యం మెదలినా, యేసు మాత్రం మంచుకురిసే శీతాకాలంలో జన్మించలేదు.

[అధస్సూచీలు]

a ఈ ప్రవచనాన్ని గూర్చిన పూర్తి చర్చ కొరకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ వారిచే ప్రచురించబడిన, విల్‌ దేర్‌ ఎవర్‌ బీ ఎ వరల్డ్‌ వితౌట్‌ వార్‌? అనే బ్రోషూర్‌ 26వ పేజీని చూడండి.

[4, 5వ పేజీలోని చిత్రం]

తూర్పు వైపునుండి కన్పించే, మంచుకప్పబడిన యెరూషలేము

[క్రెడిట్‌ లైను]

Garo Nalbandian

[6వ పేజీలోని చిత్రం]

యెరూషలేము గోడల ప్రక్కన ఉన్న మంచు

[7వ పేజీలోని చిత్రం]

క్రింద చూపబడినట్లు వెచ్చని కాలంలో మాత్రమే గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందలతో రాళ్లు ఉండే కొండల ప్రాంతంలో ఉండగలరు

[క్రెడిట్‌ లైను]

Garo Nalbandian

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి