కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 11/1 పేజీలు 26-30
  • అత్యవసర భావంతో సేవచేయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అత్యవసర భావంతో సేవచేయుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యుద్ధ కాలపు శిక్షణ
  • సేవా జీవితం మొదలగుట
  • ఒక అమూల్యమైన సహాయకారి
  • ఇండోనేషియాలో మిషనరీ సేవ
  • అల్లర్ల మధ్య సేవచేయుట
  • అదనపు వ్యతిరేకత జయింపబడుట
  • దక్షిణ అమెరికాకు
  • నిశ్చయంగా యెహోవా నాకు తోడైయుండెను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా నాకు తన చిత్తం చేయడం నేర్పించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • నా తల్లిదండ్రుల ఆదర్శం నన్ను బలపరిచింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 11/1 పేజీలు 26-30

అత్యవసర భావంతో సేవచేయుట

హాన్స్‌ ఫాన్‌ ఫ్యూరే చెప్పినది

నెదర్లాండ్స్‌లో వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచీ అధ్యక్షుడైన, పౌల్‌ కుష్‌నీర్‌, 1962లో ఒక ఉదయాన, రొటర్‌డామ్‌ ఓడరేవు ప్రాంతంలో నన్ను కలిసాడు. మసక వెలుతురు ఉన్న కేఫ్‌లో ఒక బల్లకు అటుచివర నుండి నా వైపు చూస్తూ, ఆయనిలా అన్నాడు: “నీవు ఈ నియామకాన్ని అంగీకరిస్తే, నీకూ నీ భార్యకు వెళ్లడానికి మాత్రమే టిక్కెట్టు దొరుకుతుందని నీవు గ్రహిస్తున్నావా, హాన్స్‌?”

“అవును, సూజీ కూడా దానికి అంగీకరిస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను.”

“అయితే, సూజీతో చర్చించు. నీ నిర్ణయాన్ని ఎంత తొందరగా నాకు తెలిపితే అంత మంచిది.”

మరుసటి ఉదయం అతనికి మా జవాబు దొరికింది: “మేము వెళ్తాము.” డిశంబరు 26 1962న అమస్ట్‌ర్‌డమ్‌నందు మంచుతో కప్పబడిన షిపోల్‌ విమానాశ్రయంలో బంధువులను స్నేహితులను కౌగలించుకుని, వారికి వీడ్కోలు చెప్పి విమానంలో బయల్దేరి ఇంతవరకూ మిషనరీలు వెళ్లని ప్రాంతానికి—నెదర్లాండ్స్‌ న్యూ గినియాకు (ఇప్పుడు పశ్చిమ ఇరియన్‌, ఇండోనేషియా)—పాపువన్ల దేశానికి వెళ్లాము.

ఈ సవాలుదాయకమైన నియామకాన్ని అంగీకరించడానికి మాకు సందేహాలు ఉండెనా? లేనే లేవు. దేవుని చిత్తం చేయడానికి మేము మా జీవితాలను మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాం, మరి ఆయన మాకు మద్దతు ఇస్తాడని మేము విశ్వసించాము. మా జీవితాల్లో వెనక్కి తిరిగి చూస్తే, యెహోవాయెడల మాకున్న దృఢనమ్మకం ఎన్నడూ వ్యర్థమవ్వలేదని మేము గమనించ గలుగుతున్నాము. కానీ ఇండోనేషియాలో ఏమి జరిగిందో చెప్పే ముందు, మా తొలి సంవత్సరాలను గురించి మీకు నన్ను కొంత చెప్పనివ్వండి.

యుద్ధ కాలపు శిక్షణ

ధైర్యంగల సాక్షియైన ఆర్థర్‌ వింక్లర్‌ 1940లో మా కుటుంబాన్ని దర్శించినప్పుడు, నేను కేవలం పదేళ్లవాన్ని. క్రైస్తవ మత సామ్రాజ్యం యొక్క అబద్ధ బోధలను గురించి బైబిలు ఏమి చెబుతోందో తెలుసుకున్నప్పుడు నా తలిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు. అప్పట్లో నెదర్లాండ్స్‌ నాజీ జర్మనులచే ఆక్రమించబడినందుకు అక్కడి యెహోవాసాక్షులు హింసను ఎదుర్కొంటున్నారు కాబట్టి, నిషేధించబడిన వారి సంస్థతో సహవసించాలా లేదా అని నా తలిదండ్రులు నిర్ణయించవలసి వచ్చింది. వాళ్లు చివరకు సహవసించడానికే తీర్మానించుకున్నారు.

దాని తరువాత, నా తల్లి యొక్క ధైర్యము, స్వేచ్ఛను ఆఖరుకు ప్రాణాన్ని సహితం పణంగా పెట్టడానికి ఆమె సమ్మతించడం నన్నెంతో ప్రభావితం చేశాయి. ఒకసారి ఆమె తన సైకిలుపై 11 కిలోమీటర్లు ప్రయాణించి, బైబిలు కరపత్రాలు ఉన్న సంచీతో చీకటిలో వేచి ఉండింది. ఒక నిర్ణీత సమయంలో ఒక ప్రత్యేకమైన ముమ్మర ప్రచారం ఆరంభించడానికి, ఆమె తనకు వీలైనంత వేగంగా సైకిలు తొక్కుతూ, తన సంచిలోనుండి కరపత్రాలను వీధుల్లో వేస్తూ వెళ్లింది. ఆమెను వెంబడిస్తూ సైకిలు తొక్కుతున్న ఇంకొక వ్యక్తి, చివరకు ఆమెను దాటి ముందుకు వెళ్లి, ఆయాసంతో, ఇలా అరిచాడు: “ఏమండీ, ఏమండీ, మీరు ఎదో పడేసుకుంటున్నారు!” అమ్మ ఈ విషయాన్ని మాకు చెప్పినప్పుడు మేము నవ్వు ఆపుకోలేక పోయాము.

అప్పుడు నేను చాలా చిన్నవాన్ని, కానీ నా జీవితంతో నేను ఏమి చేయదలచానో నాకు తెలిసి ఉండింది. దాదాపు 1942 మధ్యభాగంలో మా కూటాల్లో ఒక దానిలో, “వచ్చే సమావేశంలో బాప్తిస్మం తీసుకోడానికి ఎవరు ఇష్టపడుతున్నారు?” అని నిర్వాహకుడు అడిగినప్పుడు నేను నా చేయి పైకెత్తాను. అటువంటి నిర్ణయం యొక్క అర్థం ఏమిటో నేను గ్రహించానో లేదోనని సందేహించి నా తలిదండ్రులు ఒకరినొకరు కలతగా చూసుకున్నారు. కానీ నాకు 12 సంవత్సరాల వయస్సే ఉన్నా, దేవునికి సమర్పించుకోడం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను.

నాజీలు మమ్మల్ని వెంటాడుతూ ఉండగా ఇంటింటికీ వెళ్లి ప్రకటించాలంటే జాగ్రత్త అవసరమై యుండింది. మమ్మల్ని నాజీలకు పట్టించ్చే వారి ఇళ్లకు వెళ్లకుండా జాగ్రత్త పడడానికి, నాజీ సానుభూతి పరులు తమ కిటికీలకు పోస్టర్లు అంటించిన దినాల్లో, నేను సైకిలుపై వెళ్లి వాళ్ల చిరునామాలను వ్రాసుకున్నాను. ఒకసారి ఓ వ్యక్తి నన్ను గమనించి ఇలా బిగ్గరగా అన్నాడు: “చాలా బాగుంది, ఆబ్బాయీ. వాళ్ల పేర్లు వ్రాయి—అందరిని వ్రాసుకో!” ఆతురతే గానీ నాలో అంత ఆలోచన లేకపోయింది! ఇక 1945లో యుద్ధం ముగియడంతో సువార్త ప్రకటించడానికి ఎక్కువ స్వాతంత్ర్యం దొరుకుతుందన్న ఉత్తరాపేక్ష విషయమై మేము ఆనందించాము.

సేవా జీవితం మొదలగుట

నా పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత, 1948 నవంబరు 1న, పయనీరుగా నా మొదటి పూర్తికాల సేవ నియామకాన్ని అందుకున్నాను. ఒక నెల తరువాత సహోదరుడైన వింక్లర్‌ నేను ఎవరితో కలసి జీవిస్తున్నానో ఆ కుటుంబాన్ని దర్శించాడు. నేను ఎలా ఉన్నానో చూడడానికి ఆయన వచ్చి ఉంటాడు, ఎందుకంటే దాని తరువాత కొంత కాలానికి ఆమ్‌స్టర్‌డమ్‌లోని సొసైటీ యొక్క బ్రాంచీ కార్యాలయంలో పనిచేయడానికి నేను ఆహ్వానింపబడ్డాను.

తరువాత ప్రాంతీయ కాపరిగా యెహోవాసాక్షుల సంఘాలను దర్శించడానికి నేను పిలువబడ్డాను. తరువాత, 1952 ముగింపులో, మిషనరీ శిక్షణ పొందడానికి న్యూయార్క్‌లోని వాచ్‌టవర్‌ గిలియడ్‌ బైబిల్‌ పాఠశాల యొక్క 21వ తరగతికి హాజరవ్వడానికి నేను ఆహ్వానాన్ని పొందాను. కావున, 1952 చివరలో, న్యూ ఆమ్‌స్టర్‌డమ్‌ అను సముద్ర నౌకలో నెదర్లాండ్స్‌ నుండి మేము ఎనిమిది మందిమి అమెరికాకు ప్రయాణించాము.

మా పాఠశాల విద్యాక్రమం ముగింపుకు వచ్చినప్పుడు, మా అధ్యాపకులలో ఒకరైన మాక్స్‌వెల్‌ ఫ్రెండ్‌ ఇలా అన్నారు: “మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాల్లో చాలావాటిని మర్చిపోతారు, కానీ మూడు విషయాలు మీతో కూడ ఉంటాయని మేము ఆశిస్తున్నాము: విశ్వాసము, నిరీక్షణ, మరియు ప్రేమ.” యెహోవా సంస్థ అత్యవసర సేవాభావంతో పనిచేయడాన్ని గూర్చిన అమూల్యమైన జ్ఞాపకాలు కూడ నా మనస్సు, హృదయంలో నిలిచి ఉన్నాయి.

దాని తరువాత నాకు ఒక పెద్ద ఆశాభంగం కలిగింది. మా డచ్‌ గుంపులో సగం మందిని—నాతో సహా—మళ్లీ నెదర్లాండ్స్‌కే తిరిగి వెళ్లమని నియమించారు. నాకు ఆశాభంగం కలిగినా, నేను కలత చెందలేదు. కేవలం ప్రాచీనకాలం నాటి మోషేవలె, పరదేశంలో నియామకం కొరకు 40 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని నేను నిరీక్షించాను.—అపొస్తలుల కార్యములు 7:23-30.

ఒక అమూల్యమైన సహాయకారి

తండ్రివంటి నా స్నేహితుడైన, ఫ్రిట్జ్‌ హర్ట్‌సాంగ్‌, నా వివాహ పథకాల గురించి విన్నప్పుడు, అతనిలా నమ్మకంగా అన్నాడు: “అంతకంటే మంచి ఎంపిక ఇంకొకటి లేదని నేను అనుకుంటున్నాను.” సూజీ తండ్రి, కేసే స్టూఫా, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలకు విరుద్ధంగా జరిగిన పోరాటంలో ప్రముఖుడు. కానీ 1946లో యెహోవా సాక్షులు అతన్ని కలిసినప్పుడు, అతను బైబిలు సత్యాలను వెంటనే అంగీకరించాడు. త్వరలోనే అతను, అతని ఆరుగురు పిల్లల్లో ముగ్గురు—సూజీ, మెరియన్‌, కెనెత్‌—బాప్తిస్మం తీసుకున్నారు. ఈ పిల్లలందరు 1947 మే 1న పయనీర్లుగా పూర్తికాల పరిచర్య మొదలు పెట్టారు. కేసే 1948లో తన వ్యాపారాన్ని అమ్మివేసి, తాను కూడా పయనీరు చేయడం మొదలు పెట్టాడు. ఆ తరువాత అతడిలా అన్నాడు: “అవి నా జీవితం యొక్క సంతోషభరితమైన సంవత్సరాలు!”

ఆమ్‌స్టర్‌డమ్‌ బ్రాంచి కార్యాలయంలో పని చేయడానికి ఆమె ఆహ్వానింపబడినప్పుడు, 1949లో నాకు సూజీతో పరిచయం మొదలైంది. ఆ తర్వాతి సంవత్సరం, ఆమె, ఆమె చెల్లి మెరియన్‌, గిలియడ్‌ 16వ తరగతికి హాజరవ్వడానికి, వెళ్లి, అటునుండి తమ మిషనరీ నియామకమైన—ఇండోనేషియాకు—నౌకలో ప్రయాణించి వెళ్లిపోయారు. అక్కడ ఐదు సంవత్సరాల మిషనరీ సేవ తరువాత, 1957 ఫిబ్రవరిలో, సూజీ నెదర్లాండ్స్‌కు వచ్చింది. అప్పుడు మా వివాహమయ్యింది. ఆ సమయంలో, నేను ప్రాంతీయ కాపరిగా సేవచేస్తున్నాను, మరియు మా వివాహ సంవత్సరాలన్నింటిలో, రాజ్య సేవ నిమిత్తం వ్యక్తిగత త్యాగాలను చేయడానికి ఆమె చాలాసార్లు సుముఖత చూపించింది.

మా వివాహం తర్వాత, నెదర్లాండ్‌ యొక్క వివిధ ప్రాంతాలోన్ని సంఘాలను దర్శిస్తూనే ఉన్నాము. సూజీయొక్క క్లిష్టమైన నియామకాలోన్ని మిషనరీ పని, ఒక సంఘం నుండీ ఇంకొక దానికి సైకిల్‌ మీద వెళ్లవలసిన మా ప్రయాణాలకు ఆమెను బాగానే సిద్ధపర్చింది. మేము 1962లో మా ప్రాంతీయ పనిలో ఉన్నప్పుడు సహోదరుడు కుష్‌నీర్‌ నన్ను రొటర్‌డామ్‌లో దర్శించి పశ్చిమ ఇరియన్‌, ఇండోనేషియాకు వెళ్లమని మమ్మల్ని ఆహ్వానించాడు.

ఇండోనేషియాలో మిషనరీ సేవ

మేము మెనోక్‌వరీ నగరానికి—పూర్తిగా ఒకభిన్న ప్రపంచానికి—వచ్చాము! అక్కడ ఉష్ణమండల రాత్రుల భయగ్రస్త శబ్దాలు, వేడి, దుమ్ము ఉన్నాయి. కౌపీనాలు మాత్రమే ధరించి, పెద్ద కత్తులు పట్టుకొని, మా తెల్లని చర్మాన్ని ముట్టడానికి సరిగ్గా మా వెనకే తిరగడానికి చాలా ఇష్టపడే లోతట్టు ప్రాంతపు పాపువన్లు అక్కడ ఉన్నారు—ఇదంతా అలవాటు అవ్వడం అంత సులభంగా లేకుండింది.

మేము వచ్చిన కొన్ని వారాలకు, యెహోవా సాక్షులకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ చర్చీ పుల్‌పీట్‌ల నుండి మత నాయకులు ఒక లేఖను చదివారు, మరియు హాజరైన వారందరికి దాని ఒక్కొక్క ప్రతిని అందజేశారు. ప్రాంతీయ రేడియో స్టేషనులో ఆ లేఖను చదివి వినిపించడం కూడా జరిగింది. తరువాత ముగ్గురు మత నాయకులు మమ్మల్ని దర్శించి మేము లోతట్టు ప్రాంతానికి వెళ్లి అక్కడ, వారు “అన్యులు” అని పిలిచిన వారి మధ్య పని చేయమని మమ్మల్ని దబాయింపుగా అడిగారు. ఒక పాపువన్‌ ఉన్నత పోలీసు అధికారి కూడా వెళ్లిపొమ్మని మమ్మల్ని తొందర పెట్టాడు, మరియు రహస్య పోలీసుల సభ్యుడు ఒకడు మా హత్యకు పథకం వేయబడుతుందని మాకు చెప్పాడు.

అయిననూ, అందరూ మమ్మల్ని వ్యతిరేకించ లేదు. త్వరలో నెదర్లాండ్స్‌కు వెళ్లిపోబోతున్న పాపువన్ల రాజకీయ సలహాదారుడైన, ఒక డచ్‌ వ్యక్తి మమ్మల్ని చాలామంది పాపువన్ల దళపతులకు పరిచయం చేశాడు. “యెహోవా సాక్షులు మీకు తెలిసిన దానికంటే మంచి క్రైస్తవ మతాన్ని తీసుకువస్తారు. కావున, మీరు వారిని ఆహ్వానించాలి” అని అతను వారికి చెప్పాడు.

తరువాత, ఒక ప్రభుత్వ అధికారి వీధిలో సూజీ దగ్గరికి వచ్చి ఆమెతో ఇలా రహస్యంగా చెప్పాడు: “మీరు ఇక్కడ ఒక క్రొత్త పని మొదలు పెట్టారని మాకు తెలుపబడింది, కాబట్టి మేము మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వలేము. అయితే . . . మీకు కనక ఒక చర్చీ ఉంటే మరీ బాగుండేది.” అదొక చక్కని సూచన! మేము వెంటనే మా ఇంట్లోని అడ్డు గోడలను తేసేసి, బెంచీలను పేర్చి, ఒక స్పీకర్‌ స్టాండ్‌ను పెట్టి, “రాజ్య మందిరము” అని ఉండే ఒక బోర్డును బయట తగిలించాము. అప్పుడు మేము ఆ అధికారిని మమ్మల్ని దర్శించమని ఒకసారి పిలిచాము. అతను తల ఊపి, చిరునవ్వు నవ్వి, ‘మంచి తెలివి ప్రదర్శిచారు,’ అని చెబుతున్నట్లుగా, తన తల ప్రక్క భాగాన్ని తన చూపుడు వ్రేలుతో తట్టాడు.

మేము వచ్చిన ఒకటిన్నర సంవత్సరాలకు, 1964 జూన్‌ 26న మా బైబిలు విద్యార్థులలో మొదటి 12 మంది పాపువన్లు బాప్తిస్మం తీసుకున్నారు. కొద్ది రోజులకే, ఇంకా 10 మంది బాప్తిస్మం తీసుకున్నారు, మరి మా కూటాల హాజరు సగటున 40కి పెరిగింది. మాకు సహాయం చేయడానికి ఇద్దరు ఇండోనేషియన్‌ పయనీర్లు పంపబడ్డారు. మనోక్వరీలో సంఘం దృఢంగా స్థాపించబడిన తరువాత, 1964 డిశంబరులో ఇండోనేషియా యొక్క బ్రాంచి మాకు ఇంకొక ప్రకటించు నియామకాన్ని ఇచ్చింది.

మేము వెళ్లక ముందు, ప్రభుత్వ పౌరసంబంధాల విభాగం యొక్క ప్రధాన అధికారి మమ్మల్ని కలుసుకొని ఇలా చెప్పాడు: “మీరు వెళ్తునందుకు నేను దుఃఖపడుతున్నాను. మీరు వారి ఫలాలను తెంచేసుకుంటున్నారని వారు చెబుతూ, మిమ్మల్ని పంపి వేయమని మత నాయకులు నాతో మొర్ర పెట్టుకున్నారు. కానీ నేను వారికిలా చెప్పాను: ‘కాదు, బదులుగా, సాక్షులు మీ చెట్లను ఫలభరితం చేస్తున్నారు,’” అతనింకా ఇలా అన్నాడు: “మీరు ఎక్కడికి వెళ్లినా గానీ, పోరాడుతూనే ఉండండి. మీరు గెలుస్తారు!”

అల్లర్ల మధ్య సేవచేయుట

రాజధాని, జకార్తాలో మేము సేవిస్తుండగా, 1965 సెప్టెంబరు నెలలో ఒకరోజు రాత్రి, కమ్యూనిష్టు తిరుగుబాటు దారులు చాలామంది సైన్యాధికారులను చంపి, జకార్తాను తగులబెట్టారు, మరియు చివరికి దేశ అధ్యక్షుడైన సూకార్నోను పదవీచ్యుణ్ణి చేసేంత అలజడిని దేశమంతటా బయల్దేర దీసారు. ఇంచుమించు 4,00,000 మంది తమ ప్రాణాలు కోల్పోయారు!

ఒకసారి ప్రక్క వీధిలో కాల్పులూ, తగులబెట్టడం జరుగుతుండగా మేము సువార్త ప్రకటించాము. ఆ మరుసటి రోజు, దగ్గరలోని కమ్యూనిస్టుల వసతిని ఒకదాన్ని సైన్యం ధ్వంసం చేయబోతుందని మేము విన్నాము. అప్పుడు మేము ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు గృహస్థులు భయబ్రాంతులైనట్లు కన్పించారు, కానీ మా బైబిలు వర్తమానాన్ని వారు విన్నప్పుడు, వారు స్థిమితపడి మమ్మల్ని లోనికి ఆహ్వానించారు. వాళ్లతో మమ్మల్ని కలిగి ఉన్నందుకు తాము క్షేమంగా ఉన్నామని వాళ్లు భావించారు. క్లిష్ట పరిస్థితుల్లో యెహోవాపై ఆధారపడాలని మరియు సమతూకంగా ఉండాలని ఆ కాలం మాకందరికీ నేర్పింది.

అదనపు వ్యతిరేకత జయింపబడుట

మేము 1966 చివరలో దక్షిణ మొల్యూకా ద్వీపాల దృశ్యాలుండే అంబోన్‌ పట్టణానికి వెళ్లాము. స్నేహపూర్వకంగా, కలివిడిగా ఉండే అక్కడి జనాబాలో, చాలా ఆత్మీయ ఆసక్తిని మేము కనుగొన్నాము. మా చిన్న సంఘం అతి వేగంగా పెరిగింది, కూటాలకు హాజరయ్యే సంఖ్య వందకు చేరుకుంది. కావున క్రైస్తవమత సామ్రాజ్య చర్చీ అధికారులు మమ్మల్ని అంబోన్‌ నుండి వెళ్లగొట్టమని అక్కడి అధికారిపై ఒత్తిడి తెచ్చేందుకు మత వ్యవహారాల కార్యాలయాన్ని దర్శించారు. కానీ అక్కడ అధికారి బల్లపై, వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క పుస్తకాలు ప్రస్ఫుటంగా ప్రదర్శించబడి ఉండడం వాళ్లు చూశారు! అధికారి మనస్సును మార్చలేక, మమ్మల్ని అంబోన్‌ నుండే కాక మొత్తం ఇండోనేషియా నుండే బహిష్కరించునట్లు చేయడానికి వాళ్లు జకార్తాలోని మత మంత్రిత్వ శాఖ అధికారులను కలిసారు.

ఈసారి వాళ్లు విజయం సాధించినట్లు కన్పించింది, ఎందుకంటే మమ్మల్ని బహిష్కరించే తేదిగా ఫిబ్రవరి 1, 1968 నిర్ణయించబడింది. అయితే, జకార్తాలోని మన క్రైస్తవ సహోదరులు కొందరు మత మంత్రిత్వ శాఖలోని ఒక ముస్లిమ్‌ ఉన్నత అధికారిని కలిసారు. ఆ తీర్మానాన్ని తారుమారు చేయడానికి ఆయన సహాయం చేశాడు. దానికి తోడుగా, ముందున్న ఒక విధానం మార్చబడి, మరికొంతమంది మిషనరీలు రావడానికి అనుమతి లభించింది.

కావున, తరువాతి పది సంవత్సరాల్లో, ఉత్తర సూమాత్రాలోని అందమైన పర్వతాలు, అడవులు, మరియు సరస్సులుగల పరిసర ప్రాంతాల్లో, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, ఫిలిప్పీన్స్‌, స్వీడన్‌, మరియు అమెరికా నుండి వచ్చిన మిషనరీలతో మేము కలిసి పని చేశాము. ప్రకటించు పని ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో ముఖ్య మత గుంపుగా ఉన్న బాటాక్‌ వారి మధ్య వెల్లివిరిసింది.

అయినను, 1976 డిశంబరులో మన ప్రకటించు పనిని నిషేధింప జేయడంలో మత కుతంత్రులు చివరకు విజయం సాధించారు. తర్వాతి సంవత్సరంలో చాలామంది మిషనరీలు ఇతర దేశాల్లో నియామకాల కొరకు వెళ్లిపోయారు. చివరకు, 1979లో మేము కూడా వెళ్ల వలసి వచ్చింది.

దక్షిణ అమెరికాకు

ఈసరికి మేము 50 సంవత్సరాల వయస్కులం, మేము ఇంకొక దేశానికి వెళ్లి, అక్కడి పరిస్థితులకు అణుగుణంగా జీవించగలమా అని ఆశ్చర్యపోయాము. “మనము ఇంకొక క్రొత్త నియామకాన్ని అంగీకరిద్దామా లేక బదులుగా ఎక్కడో ఒకచోట స్థిరపడిపోదామా?” అని సూజీ అడిగింది.

దానికి నేనిలా జవాబిచ్చాను, “చూడు, సూజీ, యెహోవా మనల్ని ఎక్కడికి ఆహ్వానించాడో, అక్కడంతా ఆయన మన విషయమై శ్రద్ధ తీసుకున్నాడు. మన భవిష్యత్తు ఇంకా ఏ దీవెనలను తెస్తుందో ఎవరికి తెలుసు?” అలా, మేము మా క్రొత్త నియామకానికి దక్షిణ అమెరికా దేశమైన సూరినామ్‌కు వచ్చాము. రెండు నెలల్లోనే మేము మళ్లీ ప్రయాణ పనిలో ఉన్నాము మరియు అది మాకు తొందరగానే అలవాటు అయిపోయింది.

నలభైఐదు సంవత్సరాలకన్నా ఎక్కువున్న మా పూర్తికాల పరిచర్యను పునఃపరిశీలిస్తూ, మేము మిషనరీ పనిలో ముందుకు కొనసాగడానికి మా తలిదండ్రులు యిచ్చిన మద్దతు ఎంత ప్రాముఖ్యంగా ఉండిందో సూజీ, నేను గ్రహించాము. నేను నా తలిదండ్రులను ఆరు సంవత్సరాల తర్వాత 1969లో చూసినప్పుడు, మా నాన్నగారు నన్ను ప్రక్కకు తీసుకెళ్లి ఇలా చెప్పారు: “ఒకవేళ అమ్మ కనుక ముందు చనిపోతే, నీవు ఇంటికి రానవసరం లేదు. నీ నియామకంలోనే ఉండు. అంతా నేను చూసుకొన గలను. కానీ దానికి బదులుగా జరిగితే, దాని గురించి నీవు మీ అమ్మను అడగాల్సిందే.” అమ్మకూడ అలానే అంది.

సూజీ తలిదండ్రులకు కూడా అలాంటి నిస్వార్థ స్వభావమే ఉండింది. ఒకసారి సూజీ 17 సంవత్సరాలు వారినుండి దూరంగా ఉంది, అయినా కానీ వాళ్లు ఆమెకు ఒక్కటి కూడా మనసువిరిచే మాట వ్రాయలేదు. ఒకవేళ మా తలిదండ్రులకు ఎటువంటి సహాయమూ లభించక పోయింటే, మేము ఇంటికి తిరిగి వచ్చి ఉండే వాళ్లము. విషయమేమంటే, మా తలిదండ్రులకు మిషనరీ పని అంటే అదే ఉన్నత భావం ఉండింది మరియు, చివరకు మరణం వరకూ కూడా, మా మనస్సులో నెలకొల్పిన అదే అత్యవసర భావంతో వారు యెహోవాను సేవించారు.—1 సమూయేలు 1:26-28ను పోల్చండి.

మాకు క్రమంగా ఉత్తరాలను వ్రాసిన వారి ద్వారా కూడ మేము ప్రోత్సహించబడ్డాము. ముప్పయికంటే ఎక్కువున్న మా మిషనరీ సేవా సంవత్సరాల్లో ఒక్క నెల కూడా తప్పిపోకుండా వ్రాసిన వాళ్లు కొంతమంది ఉన్నారు! కానీ అన్నింటికంటే మిన్నగా, భూమిపైని తన సేవకులను ఎలా దృఢపరచాలో తెలిసిన మన ప్రేమగల పరలోకపు తండ్రైన యెహోవాను మనస్సులో ఉంచుకున్నాము. కావున, మేము ఎదురు చూచిన సంఘటనల ముగింపునకు మేము వస్తుంటే, సూజీ, నేను యెహోవాను అత్యవసర భావంతో సేవించడానికి కొనసాగడం ద్వారా యెహోవా “దినపు రాకడకొరకు కనిపెట్టుచు” ఉండాలని ఇష్టపడుతున్నాము.—2 పేతురు 3:12.

[26వ పేజీలోని చిత్రం]

వివాహం 1957లో జరిగింది

[29వ పేజీలోని చిత్రం]

ఆరుగురు యౌవనులు పయనీర్లుగా ఉండడం—ఎంతటి పులకింత!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి