‘దేవా, నన్ను పరిశోధించుము’
“దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. . . . నిత్య మార్గమున నన్ను నడిపింపుము.”—కీర్తన 139:23, 24.
1. యెహోవా తన సేవకులతో ఎలా వ్యవహరిస్తాడు?
మనందరము మన పరిస్థితులను అర్థము చేసికొని, ఏదైన తప్పుచేస్తే ఆ విషయంలో సహాయంచేస్తూ, మనము చేయగలిగిన దానికంటే ఎక్కువగా మనలను కోరకుండా ఉండే వ్యక్తి మనతో వ్యవహరించాలని యిష్టపడతాము. యెహోవా దేవుడు తన సేవకులతో అలాగే వ్యవహరిస్తాడు. కీర్తన 103:14 చెప్పేదేమంటే: “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసికొనుచున్నాడు.” తన తండ్రిని పరిపూర్ణంగా ప్రతిబింబించే యేసుక్రీస్తు కూడా అందించే ఆప్యాయకరమైన ఆహ్వానం, ఇలా ఉంది: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీమీద నాకాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి [నా కాడి క్రిందకు రండి NW అథఃస్సూచి]; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.
2. (ఎ) యేసుక్రీస్తు విషయంలో (బి) క్రీస్తు అనుచరుల విషయంలో, యెహోవా దృష్టికీ, మానవుల దృష్టికి మధ్యనున్న తారతమ్యాన్ని చూపండి.
2 యెహోవా తన సేవకులను దృష్టించు విధానానికి మానవులు వారిని దృష్టించు విధానానికి తరచు ఎంతో భేదమున్నది. ఆయన విషయాలను విభిన్న కోణమునుండి చూస్తాడు. ఇతరులకు వాటినిగూర్చి ఏమీ తెలియని సంగతులను ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ‘మనుష్యులవలన తృణీకరింపబడిన వాడును, విసర్జింపబడినవాడును’ ఆయెను. మెస్సీయగా ఆయనయందు విశ్వాసముంచనివారు ఆయనను ‘ఎన్నిక చేయలేదు.’ (యెషయా 53:3; లూకా 23:18-21) అయినప్పటికి దేవుని దృష్టిలో ఆయన “ప్రియకుమారుడు,” “ఈయనయందు నేనాందించుచున్నాను” అని తండ్రిచే అనబడినవాడు. (లూకా 3:22; 1 పేతురు 2:4) యేసుక్రీస్తు అనుచరులలో సహితం, వారికున్న బీదరికాన్నిబట్టి, వారనుభవించే శ్రమనుబట్టి తక్కువగా చూడబడ్డవారు కలరు. అయినా యెహోవా దృష్టిలో, ఆయన కుమారుని దృష్టిలో అటువంటివారు ధనికులుగా ఉండవచ్చును. (రోమీయులు 8:35-39; ప్రకటను 2:9) ఈ దృక్పథంలో భేదమెందుకు?
3. (ఎ) తరచు మానవులు ప్రజలను దృష్టించుదానికంటె, యెహోవా ప్రజలను దృష్టించుట ఎందుకు చాలా భిన్నముగా ఉంటుంది? (బి) మనము లోపల ఎటువంటి వారమైయున్నామో పరిశీలించుకొనుట, ఎందుకు చాలా ప్రాముఖ్యము?
3 యిర్మీయా 11:20 ఇలా జవాబిస్తుంది: ‘యెహోవా . . . జ్ఞానేంద్రియములను, హృదయమును, పరిశోధించుచున్నాడు.’ మనము లోపల ఏమైయున్నామో దానిని అనగా ఇతరుల దృష్టికి మరుగై మనలో దాగివున్న వ్యక్తిత్వపు ఆకృతిని ఆయన చూస్తాడు. ఆయన తన పరిశీలనలో, తనతో సంబంధమేర్పరచుకొనడానికి కావలసిన ప్రాముఖ్యమైన లక్షణాలకు, పరిస్థితులకు ప్రాధాన్యతనిస్తాడు. అవి మనకు నిత్య ప్రయోజనాన్ని చేకూర్చగలవు. దానిని మనం తెలిసికొనుట ఒక అభయంగా ఉండగలదు. నెమ్మదికరంగా ఉండగలదు. మనము అంతరంగంలో ఏమైయున్నామో దానికే యెహోవా ప్రాధాన్యతనిస్తున్నందున, ఆయన తన నూతనలోకంలోకి కావాలనుకునే ప్రజలవంటివారంగా మనముండాలంటే అంతరంగంలో మనమేమైయున్నామో పరిశీలించుకొనుట ప్రాముఖ్యము. అలాంటి పరిశీలనను చేసుకొనడానికి ఆయన వాక్యము మనకు సహాయపడుతుంది.—హెబ్రీయులు 4:12, 13.
దేవుని తలంపులు ఎంత ప్రియమైనవి!
4. (ఎ) దేవుని తలంపులు తనకెంతో ప్రియమైనవని చెప్పుటకు కీర్తన రచయితను పురికొల్పినదేమి? (బి) అవి మనకును ఎందుకు ప్రశస్తమైనవి కావాలి?
4 తన సేవకులనుగూర్చిన దేవుని జ్ఞానముయొక్క వెడల్పు లోతులను, వారికి కావలసిన ఏ అవసరతనైనను అందించగల దేవుని అసాధారణ సామర్థ్యాన్ని ధ్యానించిన తరువాత, కీర్తన రచయిత దావీదు: “దేవా నీ తలంపులు నా కెంత ప్రియమైనవి” అని వ్రాశాడు. (కీర్తన 139:17) ఆయన లిఖితవాక్యములో బయలుపరచబడిన ఆ తలంపులు, ఎంతటి మహావివేకంగానైనా కనిపించే ఏ మానవ తలంపులకంటెను ఎంతో ఉన్నతమైనవి. (యెషయా 55:8, 9) మన జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైనవాటిపై దృష్టినిలిపి, ఆయన సేవలో ఆసక్తిగా ఉండేలా దేవుని తలంపులు సహాయంచేస్తాయి. (ఫిలిప్పీయులు 1:9-11) అవి మనకు దేవుడు విషయాలను ఎలా దృష్టిస్తాడో అలాగే మనమును వాటిని దృష్టించుటకు సహాయంచేస్తాయి. మనపట్ల మనము నిజాయితీగా ఉండేందుకు, నిజంగా హృదయములో మనము ఎలాంటి వ్యక్తులమైయున్నామో చూసుకొనడానికి అవి మనకు సహాయపడతాయి. అలా చేసేందుకు మీరు యిష్టపడతారా?
5. (ఎ) “అన్నిటికంటె ముఖ్యముగా” దేన్ని కాపాడుకొనమని దేవునివాక్యము మనలను ప్రోత్సహిస్తుంది? (బి) కయీనునుగూర్చిన బైబిలు వృత్తాంతము మనకెలా ప్రయోజనకరం కాగలదు? (సి) మనము మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికి, యెహోవాను సంతోషపెట్టేదేదో అర్థంచేసికోడానికి అది ఎలా మనకు సహాయంచేస్తుంది?
5 మానవులు బయటికి కనిపించే వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి మనస్సు చూపుతుంటారు. కాని మనకు బైబిలు సలహా ఏమంటే: “అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” (సామెతలు 4:23) అలా చేయడానికి బైబిలు మనకు నీతి సూత్రాల ద్వారా, అందుకు తగిన మాదిరులద్వారా సహాయపడుతుంది. కయీను హృదయములో తన తమ్ముడు హేబెలుపట్ల పగతో మండిపోతూ, ద్వేషాన్ని కలిగివుండే సాధారణ వంతు చొప్పున దేవునికి బలి అర్పించినట్లు అది మనకు తెల్పుతుంది. ఆయనవలె ఉండవద్దని మనలనది పురికొల్పుతుంది. (ఆదికాండము 4:3-5; 1 యోహాను 3:11, 12) అది మనకు మోషే ధర్మశాస్త్రం కోరిన విధేయతను లిఖించిపెట్టింది. అంతేగాక ధర్మశాస్త్రం కోరే అతి ప్రధానమైన సంగతిని అనగా యెహోవాను ఆరాధించేవారు పూర్ణహృదయముతోను, మనస్సుతోను, ఆత్మతోను, బలముతోను ఆరాధించాలనేదానిని నొక్కితెల్పుతుంది. దాని తరువాత ప్రధానమైనది నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించవలెనను ఆజ్ఞయని అది చూపుతుంది.—ద్వితీయోపదేశకాండము 5:32, 33; మార్కు 12:28-31.
6. సామెతలు 3:1ని అన్వయించుకోవడంలో మనలను మనము ఏ ప్రశ్నలను అడుగుకోవాలి?
6 సామెతలు 3:1 మనలను కేవలము దేవుని ఆజ్ఞలకు లోబడటమే కాకుండా, మనము చూపే విధేయత నిజంగా హృదయంలోనుండి వచ్చేటట్లు చూసుకోవాలని ప్రోత్సహిస్తుంది. మనము వ్యక్తిగతంగా ఇలా ప్రశ్నించుకోవాలి, ‘దేవుడు కోరేవాటికి నేను చూపే నా విధేయతలో నిజంగా అది ఉందా?’ కొన్ని విషయాలలో మన ఉద్దేశము లేక ఆలోచనా లోపముగలదైతే—మనలో తప్పిదములేదని ఎవరము చెప్పలేనివారమైతే—మనము ఇలా అడుగుకొనవలసిన అవసరమున్నది, ‘ఆ పరిస్థితి నుండి అభివృద్ధిచెందుటకు నేనేమి చేస్తున్నాను?’—సామెతలు 20:9; 1 యోహాను 1:8.
7. (ఎ) మత్తయి 15:3-9లో యేసు పరిసయ్యులను ఖండించిన విషయం, మన హృదయాన్ని కాపాడుకొనుటలో మనకు ఎలా సహాయం చేయవచ్చును? (బి) ఏ పరిస్థితులలో మన మనస్సుకు, హృదయానికి క్రమశిక్షణ ఇచ్చుటలో మనం కఠినమైన చర్యలు గైకొనవలసిన అవసరం ఏర్పడవచ్చును?
7 యూదా పరిసయ్యులు ఒకవైపు యుక్తితో, స్వార్థపర ఆసక్తితో నిండినవాటిని అభ్యసిస్తూనే దేవుని గౌరవిస్తున్నామన్నట్లు నటిస్తున్నప్పుడు, యేసువారిని వేషధారులని, వారి ఆరాధన వ్యర్థమని ఖండించెను. (మత్తయి 15:3-9) అంతేగాక, హృదయాన్ని చూసే దేవున్ని సంతోషపెట్టడానికి, బయటకు నీతియుక్తమైన జీవితాన్ని గడుపుతూనే, లోపల మోహసంబంధమైన అనుభూతిని పొందేలా, అవినీతికర తలంపులలో అదేపనిగా మునిగివుండటాన్నికూడా విసర్జించాలని యేసు హెచ్చరించాడు. మన మనస్సును, హృదయాన్ని క్రమశిక్షణలో పెట్టుకొనుటకు మనము కఠినమైన పద్ధతులను అవలంభించవలసి ఉండవచ్చును. (సామెతలు 23:12; మత్తయి 5:27-29) మనము మన లౌకిక ఉద్యోగ కారణంగానో, విద్యాసంబంధమైన లక్ష్యాలనుబట్టో, లేక వినోదాన్ని ఎన్నుకొనే దాన్నిబట్టో లోకాన్ని అనుకరించే వారంగా తయారవుతూ, దాని ప్రమాణాలకు అనుగుణ్యంగా మనలనది మలచడానికి అనుమతిస్తుంటే అటువంటి క్రమశిక్షణ అవసరము. దేవుని వారమని చెప్పుకుంటూ లోకంతో స్నేహంచేయడానికి ఇష్టపడేవారిని “వ్యభిచారిణులారా” అని శిష్యుడైన యాకోబు పిలిచిన విషయాన్ని మనమెన్నటికి మరచిపోకూడదు. ఎందుకనగా, “లోకమంతయు దుష్టునియందున్నది.”—యాకోబు 4:4; 1 యోహాను 2:15-17; 5:19.
8. దేవుని ప్రశస్త తలంపులనుండి పూర్తిగా ప్రయోజనం పొందుటకు, మనమేమి చేయవలసి ఉన్నాము?
8 ఈ విషయాల్లోను మరి ఇతర విషయాల్లోను దేవుని తలంపులనుండి పూర్తి ప్రయోజనం పొందడానికి, వాటిని చదవడానికి లేక వినడానికి కొంత సమయాన్ని మనము కేటాయించుకొనడం అవసరము. అంతకంటే ఎక్కువగా మనము వాటిని పఠించి, వాటినిగూర్చి మాట్లాడి, వాటిని ధ్యానించాలి. కావలికోటను చదివే అనేకమంది పాఠకులు బైబిలు చర్చించబడే యెహోవాసాక్షుల కూటాలకు క్రమంగా హాజరవుతుంటారు. అలాచేయడానికి వారు ఇతర విషయాలనుండి సమయాన్ని సమకూర్చుకుంటారు. (ఎఫెసీయులు 5:15-17) తద్వారా వారు వస్తుసంబంధమైన సంపదకంటె విలువైనదానిని తిరిగి పొందుతున్నారు. మీరును అలా భావించడం లేదా?
9. క్రైస్తవ కూటములకు హాజరయ్యే కొందరు ఇతరులకంటె తొందరగా ఎందుకు అభివృద్ధిచెందుతారు?
9 అయితే, ఈ కూటాలకు హాజరయ్యే కొంతమంది ఇతరులకంటె త్వరితగతిన ఆత్మీయ అభివృద్ధి పొందవచ్చును. వారిజీవితంలో సత్యమును ఎక్కువగా అమలు పరుస్తారు. దీనికి కారణమేంటి? తరచు, వారి వ్యక్తిగత పఠనంలో పట్టుదల ముఖ్య కారణమవుతుంది. మనము రొట్టెవలననే జీవించము అనే విషయాన్ని వారు గుణగ్రహిస్తారు; భౌతిక ఆహారాన్ని క్రమంగా తినడం ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయాహారాన్ని కూడా ప్రతిదినము తీసుకోవడం అంతే ప్రాముఖ్యము. (మత్తయి 4:4; హెబ్రీయులు 5:14) అందుచేత వారు ప్రతిరోజూ కొంత సమయాన్ని బైబిలును లేక బైబిలును వివరించే ప్రచురణలను చదవడానికి గడిపేందుకు ప్రయత్నిస్తారు. వారు పాఠాలను ముందుగానే పఠించి, లేఖనాలను చూసుకొని, సంఘకూటాలకు సిద్ధపడతారు. కేవలం చదవడమే కాకుండా, వారు దానిని ధ్యానిస్తారు. పఠించే పద్ధతిలో వారు చదువుతున్నది వారి జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగియుండాలో దానిని తీవ్రంగా తలపోస్తూ పఠిస్తారు. వారి ఆత్మీయత పెరిగేకొలది: “నీ ధర్మశాస్త్రము నా కెంతో ప్రియముగా నున్నది! . . . నీ శాసనములు ఆశ్చర్యములు,” అని వ్రాసిన కీర్తన రచయితవలెనే భావించగలుగుతారు.—కీర్తన 1:1-3; 119:97, 129.
10. (ఎ) ఎంతకాలము మట్టుకు దేవునివాక్యాన్ని పఠించడంలో కొనసాగటం ప్రయోజనకరంగా ఉంటుంది? (బి) లేఖనాలు దీనిని ఎలా చూపిస్తున్నవి?
10 దేవుని వాక్యాన్ని మనము ఒక సంవత్సరం, 5, లేక 50 యేండ్లు చదివినప్పటికి అదెన్నటికి చదివిందే చదువుతున్నట్లుండదు. దేవుని తలంపులు మనకు ప్రియమైనవి కానట్లుండవు. దేవునివాక్యము నుండి మనలో ఎవరెంత నేర్చుకున్నను, మనకు తెలియనిది ఇంకా చాలా ఉన్నది. దావీదు ఇలా అన్నాడు: “వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను, లెక్కకు ఎక్కువైయున్నవి.” దేవుని తలంపులు మనము లెక్కించగలవాటికంటె ఉన్నతమైనవి. దేవుని తలంపులను పగలంతా లెక్కించి పడుకొన్నప్పటికీ, తెల్లవారి ఉదయం లేచినవెంటనే మరలా తలంచడానికి ఇంకా బోలెడన్ని ఉంటాయి. అందుకే దావీదు ఇలా వ్రాశాడు: “నేను మేల్కొంటినా, యింకను నీ యొద్దనే యుందును.” (కీర్తన 139:17, 18) యెహోవానుగూర్చి ఆయన మార్గాలనుగూర్చి నేర్చుకోడానికి మనకు యుగయుగములు ఎంతో ఉంటుంది. అంతా తెలుసునన్న స్థితికి మనమెన్నటికి రాలేము.—రోమీయులు 11:33.
యెహోవా ద్వేషించే దానిని ద్వేషించుట
11. దేవుని తలంపులను తెలిసికొనడమేగాక ఆయన భావాలను పంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యము?
11 మన తలలో వాస్తవాలను నింపుకోవాలనే ఉద్దేశముతోనే మనము దేవుని వాక్యమును పఠించడం కాదు. దానిని మన హృదయంలోకి చొప్పించుకొనిపోనిచ్చేకొలది, దేవుని భావాలలో పాలుపంచుకొనుటకు ప్రారంభిస్తాము. అదెంత ముఖ్యము! అలాంటి భావాలను పెంచుకోకపోతే, దాని ఫలితమేమి కావొచ్చు? బైబిలు చెప్పేదానిని మనము తిరిగి చెప్పగలిగినను, అది నిషేధించినదానిని కోరదగినదిగాను, చెయ్యాలని కోరేదానిని భారమైనదిగాను మనము తలంచవచ్చును. నిజమే, చెడును ద్వేషించినప్పటికి మన మానవ అసంపూర్ణత మూలంగా మనలో పోరాటం జరుగుతుండవచ్చు. (రోమీయులు 7:15) కాని, లోపల మనము ఏమైయున్నామో, సరైనదానికి అనుగుణ్యంగా మన ఆంతర్యమును చక్కదిద్దుకోడానికి మనము మనఃపూర్వక కృషి చేయకపోతే ‘హృదయాలను పరిశోధించు’ యెహోవాను సంతోషపెట్టగలమని అనుకొందుమా?—సామెతలు 17:3.
12. దైవ సంబంధమైన ప్రేమ, దైవసంబంధమైన ద్వేషము ఎంత ప్రాముఖ్యము?
12 దైవసంబంధమైన ప్రేమ సరైన దానిని చేయడంలో సంతోషించునట్లు ఎలా చేస్తుందో, ఆలాగే దైవతలంపుతో కూడిన ద్వేషము చెడునుండి వైదొలగడానికి శక్తివంతమైన రక్షణగా ఉంటుంది. (1 యోహాను 5:3) పదేపదే లేఖనాలు మనలను ద్వేషాన్ని, అలాగే ప్రేమను పెంపొందింపజేసుకోవాలని ప్రోత్సహిస్తున్నవి. “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.” (కీర్తన 97:10) “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొనుడి.” (రోమీయులు 12:9) దానిని మనము చేస్తున్నామా?
13. (ఎ) దుష్టుల నాశనమునుగూర్చి దావీదు చేసిన ఏ ప్రార్థనతో మనము పూర్తిగా ఏకీభవిస్తాము? (బి) దావీదు ప్రార్థనలో చూపబడినట్లు, ఏ దుష్టులను నాశనం చేయమని ఆయన దేవుని ప్రార్థించాడు?
13 దుష్టులను భూమిమీదనుండి పెరికివేసి, నీతి నివసించే క్రొత్త భూమిని తెస్తాననే తన సంకల్పాన్ని యెహోవా స్పష్టంగా తెలియజేసాడు. (కీర్తన 37:10, 11; 2 పేతురు 3:13) నీతిని ప్రేమించేవారు ఆ కాలం రావాలని కనిపెడుతున్నారు. “దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు, నరహంతకులారా, నా యొద్దనుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు” అనే కీర్తన రచయిత దావీదు ప్రార్థనతో వారు పూర్తిగా ఏకీభవిస్తారు. (కీర్తన 139:19, 20) అలాంటి దుష్టులను వ్యక్తిగతంగా తానే చంపాలని దావీదు ఉద్దేశము కాదు. యెహోవానుండే ప్రతిఫలం వస్తుందని ఆయన ప్రార్థించాడు. (ద్వితీయోపదేశకాండము 32:35; హెబ్రీయులు 10:30) వారు ఏదోవిధంగానైనా దావీదును వ్యక్తిగతంగా కష్టపెట్టినవారు కాదు. వారు దేవుని నామాన్ని అపకీర్తిపాలుచేస్తూ, ఆ నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు. (నిర్గమకాండము 20:7) వారు యథార్థతలేనివారై, ఆయనను సేవిస్తున్నామని చెప్పుకొంటారేగాని, ఆయన నామాన్ని వారి స్వంత పథకాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తారు. దేవునికి శత్రువులుగా కావాలనుకునేవారిని దావీదు ఏ మాత్రము ప్రేమించేవాడు కాదు.
14. సహాయం చేయబడగల దుష్టులెవరైనా ఉన్నారా? అయితే, ఎలా చెయ్యాలి?
14 యెహోవాను ఎరుగని ప్రజలు కోట్లాదిమంది ఉన్నారు. వారిలో అనేకమంది దుష్టత్వము అని దేవుని వాక్యము చూపేవాటిని తెలియక చేస్తుంటారు. వారు ఆ మార్గాన్ని అలానే అనుసరిస్తే, మహాశ్రమలలో నాశనమయ్యేవారితోపాటు నాశనమౌతారు. అయినా, దుష్టుని మరణమందు యెహోవాకు సంతోషములేదు. మనము కూడా సంతోషించము. (యెహెజ్కేలు 33:11) సమయము అనుమతించినంత వరకు అలాంటి వ్యక్తులు యెహోవా మార్గాలను నేర్చుకొని వాటిని అన్వయింపజేసుకొనేలా సహాయము చేయడానికి ప్రయత్నిస్తాము. అయితే యెహోవాయెడల అమితమైన ద్వేషాన్ని ప్రదర్శించు కొందరి సంగతేమిటి?
15. (ఎ) ‘నిజమైన శత్రువులు’ గా కీర్తన రచయిత భావించిన వారు ఎవరు? (బి) యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని “ద్వేషిస్తామని” మనమెలా చూపగలము?
15 వారినిగూర్చి కీర్తన రచయిత ఇలా అన్నాడు: “యెహోవా నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా? వారియందు నాకు పూర్ణద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను.” (కీర్తన 139:21, 22) వారు యెహోవాను తీవ్రంగా ద్వేషిస్తున్నందున దావీదు వారిని అసహ్యంగా చూశాడు. ఆయనమీద తిరుగుబాటు చేయుటద్వారా ఆయనపైగల ద్వేషాన్నిచూపు మతభ్రష్టులు కూడా వారిలో చేరివున్నారు. వాస్తవానికి మతభ్రష్టత యెహోవాపై తిరుగుబాటు చేయడమైయున్నది. కొందరు మతభ్రష్టులు దేవుడు మాకు తెలుసు మేము ఆయనను సేవిస్తున్నామని చెప్పుకొన్నను, ఆయన వాక్యము చేయాలని కోరువాటిని, దాని బోధలను వారు తిరస్కరిస్తారు. వారిలో మరికొందరు బైబిలు నమ్ముతామని చెప్పినను, యెహోవా సంస్థను తిరస్కరిస్తూ దాని పనిని ఆటంకపరచడానికి గట్టిగా పనిచేస్తారు. సరైందేదో తెలుసుకున్న తర్వాత వారు బుద్ధిపూర్వకంగా అలాంటి చెడుతనమును ఎన్నుకున్నప్పుడు, వారి చెడుతనము వారి నిర్మాణంలో విడదీయలేనంతరీతిగా నాటుకుపోయినప్పుడు, అలా విడదీయలేనంత గట్టిగా చెడుతనమునకు హత్తుకుపోయిన వారిని క్రైస్తవుడు నిశ్చయంగా ద్వేషించవలసి ఉన్నాడు (ఆ పదానికి బైబిలు చూపు భావంలో). అలాంటి మతభ్రష్టులను యెహోవా ఎలా భావిస్తున్నాడో అలాగే నిజక్రైస్తవులును భావిస్తారు. వారి మతభ్రష్టత్వపు అభిప్రాయాలనుగూర్చి ఆతురత ప్రదర్శించరు. బదులుగా దేవునికి తమ్మునుతాము శత్రువులుగా చేసికొన్నవారియెడల ‘అసహ్యభావమును’ కలిగివుంటారు. అయితే ఉగ్రతను అమలుపరచేపనిని దేవునికే విడిచిపెడతారు.—యోబు 13:16; రోమీయులు 12:19; 2 యోహాను 9, 10.
దేవుడు మనలను పరిశోధించునప్పుడు
16. (ఎ) యెహోవా, నన్ను పరిశోధించుమని దావీదు ఎందుకు కోరాడు? (బి) మన స్వంత హృదయాన్నిగూర్చి దేన్ని వివేచించడానికి మనకు సహాయం చేయమని మనము దేవుని కోరాలి?
16 దావీదు మాత్రం ఏవిధంగానైనా, దుష్టునివలె నుండుటకు యిష్టపడలేదు. చాలమంది ప్రజలు వారు లోపల ఏమైయున్నారో దాచుకొంటారు. కాని దావీదు మాత్రం దీనత్వంతో ఇలా ప్రార్థించాడు: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్యమార్గమున నన్ను నడిపింపుము.” (కీర్తన 139:23, 24) ఇచ్చట హృదయాన్ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు దావీదు భావము భౌతిక అవయమునుగూర్చి కాదు. ఆ మాటయొక్క సూచనార్థక భావానికి అనుగుణ్యంగా, ఆంతర్య పురుషుడు, లోపల తాను ఏమైయున్నాడో దానిని సూచిస్తున్నాడు. మనము కూడా దేవుని మన హృదయాన్ని పరిశోధించి, వివేచించమని కోరి, మన కోరికలు, అనురాగాలు, భావోద్రేకాలు, సంకల్పాలు, ఆలోచనలు లేక ఉద్దేశాలేమైనా అయుక్తంగా ఉన్నవేమో చూడమని కోరాలి. (కీర్తన 26:2) యెహోవా మనలను ఇలా ఆహ్వానిస్తున్నాడు: “నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము.”—సామెతలు 23:26.
17. (ఎ) మౌనప్రదమైన మన తలంపులను కప్పివుంచేబదులు మనము ఏమి చేయాలి? (బి) మన హృదయములో చెడు తలంపులను కనుగొనటములో ఆశ్చర్యమేమైనా ఉందా, దానిగూర్చి మనమేమి చేయాలి?
17 చెడుకోరికలు, చెడుభావాలు, లేక ఏదైన చెడుగా ప్రవర్తించినందువల్ల మనలో ఆయాసకరమైన, మౌనకరమైన తలంపులు దాగివుంటే, దానిని సరిదిద్దుకొనడానికి నిశ్చయంగా మనము యెహోవా సహాయమును కోరుకుంటాము. “ఆయాసకరమైన మార్గము,” అనేదానికి బదులు మొఫత్స్ తర్జుమా “చెడు విధానము” అనే మాటను ఉపయోగిస్తుంది; ది న్యూ ఇంగ్లీషు బైబిలు: “నిన్ను (అనగా దేవున్ని,) దుఃఖపెట్టే మార్గమేమైనా” అని చెబుతుంది. మనమట్టుకు మనమే మౌనకరమైన మన తలంపులను స్పష్టంగా అర్థంచేసికొనకపోవచ్చును, లేక ఆ సమస్యను దేవునికి ఎలా విన్నవించుకోవాలో తెలియకపోవచ్చును. కాని ఆయన మన పరిస్థితిని అర్థంచేసికొంటాడు. (రోమీయులు 8:26, 27) మన హృదయంలో చెడుభావాలుంటే అందుకు మనము ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగని వాటిని మనము సమర్థించుకోకూడదు. (ఆదికాండము 8:21) వాటిని పూర్తిగా తీసివేసుకోడానికి దేవుని సహాయాన్ని కోరాలి. మనము నిజంగా యెహోవాను ఆయన మార్గాలను ప్రేమిస్తే, అలాంటి సహాయంకొరకు నమ్మకంగా ఆయనను సమీపించవచ్చును. ఎందుకనగా: “దేవుడు మన హృదయముకంటె అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు.”—1 యోహాను 3:19-21.
18. (ఎ) నిత్యమార్గాన యెహోవా మనలను ఎలా నడుపును? (బి) యెహోవా నడిపింపును అనుసరించడంలో మనము కొనసాగితే, ఏ ఆప్యాయకరమైన మెప్పును పొందడానికి మనము కనిపెట్టవచ్చు?
18 కీర్తన రచయిత “నిత్యమార్గమున” నన్ను నడుపుమని యెహోవాకు ప్రార్థనచేసినట్లుగా, దీనులైన, విధేయతగల తన సేవకులను యెహోవా నిశ్చయంగా అలా నడుపును. నిత్యమార్గమున నడుపుట అనగా చెడుచేసినందువలన కాలం నిండకముందే మరణించే మరణము పొందకుండాను, అలాగే నిత్యజీవము పొందు మార్గమునను నడుపును. పాపమును పరిహారముచేయు యేసు బలి విలువ అవసరతను మనము గుర్తించునట్లు ఆయన చేయును. ఆయన తన వాక్యముద్వారాను, సంస్థద్వారాను తన చిత్తముచేయునట్లు మనకు కావలసిన ప్రాముఖ్య ఉపదేశము దయచేస్తాడు. మనము బయటకు ఎట్టివారమని చెప్పుకుంటున్నామో లోపలను అలాంటివారంగానే ఉండునట్లు ఆయనిచ్చే సహాయమునకు స్పందించు ప్రాముఖ్యతను ఆయన నొక్కితెల్పుతున్నాడు. (కీర్తన 86:11) అద్వితీయ సత్యదేవుడైన ఆయనను సేవించడానికై నీతియుక్తమైన నూతనలోకములో పరిపూర్ణ ఆరోగ్యంతో, నిత్యము జీవించు ఉత్తరాపేక్షతో ఆయన మనలను ప్రోత్సహిస్తున్నాడు. ఆయన నడిపింపునకు నమ్మకంగా స్పందించుటలో కొనసాగితే, ఆయన తన కుమారునితో: “నీయందు నేనాందించుచున్నానని” చెప్పినట్లే మనతోను చెప్పును.—లూకా 3:22; యోహాను 6:27; యాకోబు 1:12.
మీ వ్యాఖ్యానమేమిటి?
◻ తన సేవకులను గూర్చిన యెహోవా దృష్టి మానవుల దృష్టికి ఎందుకు భిన్నంగా ఉండును?
◻ మన హృదయాన్ని పరిశోధించునప్పుడు దేవుడు చూసేదానిని వివేచించుటకు మనకు ఏది సహాయం చేయ గలదు?
◻ వాస్తవాలను నేర్చుకొని, మన హృదయాన్ని కాపాడుకొనుటకు ఎటువంటి పఠనము మనకు సహాయము చేయును?
◻ దేవుడు చెప్పేదాన్ని తెలిసికోవడమేకాక, ఆయన భావాలను కూడా తలంచి, వాటిని పంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యము?
◻ ఎందుకు మనము వ్యక్తిగతంగా: “దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము” అని ప్రార్థించాలి?
[16వ పేజీలోని చిత్రం]
పఠించునప్పుడు దేవుని తలంపులను, ఆయన భావాలను మీ స్వంతం చేసుకొనడానికి ప్రయత్నించండి
[18వ పేజీలోని చిత్రం]
యెహోవా తలంపులు “యిసుక కంటెను లెక్కకు ఎక్కువైనవి”
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.