దేవుడు మిమ్ములను నిజంగా ఎరుగునా?
“యెహోవా, . . . నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.”—కీర్తన 139:1, 3.
1. మనమెదుర్కొను చింతలను, సమస్యలను, వత్తిడులను ‘ఇతరులు అర్థంచేసికోరు,’ అనే భావన ఎంత ప్రబలంగా ఉన్నది?
మీరు అనుభవించే చింతలను, వత్తిడులను, సమస్యలను ఎవరైనా నిజంగా అర్థంచేసుకోగలరా? వారికి ఏమి జరుగుతుందో పట్టించుకొనే కుటుంబాలు లేక బంధువులు లేని యౌవన, వృద్ధ ప్రజలు లక్షలాదిగా ప్రపంచమంతట ఉన్నారు. కుటుంబాలలో సహితం అనేకమంది భార్యలు—ఔను భర్తలు కూడా—వారిని క్రుంగదీసే వత్తిడులను వారి వివాహ జతలు నిజంగా అర్థం చేసుకోవడంలేదని భావిస్తున్నారు. కొన్నిసార్లు కలతచెంది, “మీరు నన్ను అర్థంచేసుకోరు!” అని తిరుగుబాటు చేస్తుంటారు. చాలామంది యౌవనస్థులు కూడా వారిని అర్థంచేసుకొనేవారు ఎవరూ లేరనే ముగింపుకొచ్చారు. అయితే, ఇతరులు తమను ఎక్కువగా అర్థంచేసుకోవాలని కోరిన వారిలో కొంతమంది జీవితాలు ఆ తరువాత ఎంతో అర్థవంతంగా తయారైనవి. ఇది ఎలా సాధ్యము?
2. గొప్ప సంతృప్తితో నిండిన జీవితాలను కలిగివుండడానికి యెహోవా ఆరాధికులకు ఏది సహాయపడగలదు?
2 తోటిమానవులు వారి భావాలను పూర్తిగా అర్థం చేసుకొన్నా, చేసికొనకపోయినా వారు అనుభవిస్తున్నవాటిని దేవుడు అర్థంచేసుకోగలడని, ఆయన సేవకులుగా తమ సమస్యలను వారే ఒంటరిగా ఎదుర్కోవలసిన అవసరం లేదని వారు నమ్ముతున్నందున అలా సాధ్యమవుతుంది. (కీర్తన 46:1) అంతేగాక వివేకముగల క్రైస్తవ పెద్దల సహాయంతోపాటు, వారు తమ వ్యక్తిగత సమస్యలను మించి సుదీర్ఘంగా ఆలోచించేలా దేవుని వాక్యము వారికి సహాయంచేస్తుంది. వారి నమ్మకమైన సేవ దేవుని దృష్టిలో ప్రశస్తమైందని, అంతేగాకుండా యేసుక్రీస్తుద్వారా ఆయనచేసిన ఏర్పాటులందు, నిరీక్షించువారికి సురక్షితమైన భవిష్యత్తున్నదని గుణగ్రహించేలా లేఖనాలు వారికి సహాయం చేస్తాయి.—సామెతలు 27:11; 2 కొరింథీయులు 4:17, 18.
3, 4. (ఎ) “యెహోవా దేవుడ”నియు, మరియు “ఆయన మనలను చేసెను” అనే వాస్తవాన్ని గుణగ్రహించడం తన సేవలో సంతోషాన్ని కనుగొనడానికి మనకు ఎలా సహాయపడుతుంది? (బి) యెహోవా ప్రేమగల శ్రద్ధలో మనకెందుకు సంపూర్ణ నమ్మకమున్నది?
3 “సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి” అని చెప్పే కీర్తన 100:2తో మీకు పరిచయముండవచ్చును. ఎంతమంది నిజంగా యెహోవాకు ఆ పద్ధతిలో సేవచేస్తున్నారు? అలాచేయడానికి బలమైన కారణాలను 3వ వచనము చూపుతోంది. అది మనకు ఇలా జ్ఞాపకం చేస్తుంది: “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.” హెబ్రీ ప్రతిలో ఆయన ఆ స్థలంలో ‘ఎలో’హిమ్,’ అని సూచించబడ్డాడు. అనగా అది ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ప్రభావాన్ని, మహిమను సూచిస్తున్నది. ఆయనే అద్వితీయ సత్యదేవుడు. (ద్వితీయోపదేశకాండము 4:39; 7:9; యోహాను 17:3) ఆయన సేవకులు ఆయన దైవత్వాన్ని గుర్తిస్తారు. అది కేవలం వారికి అలా బోధించబడిన వాస్తవమైనందునగాక, వారి అనుభవంగా గుర్తించి, ఆయనకు చూపే విధేయత, నమ్మకము, భక్తిద్వారా వారు దానిని రుజువుపరుస్తారు.—1 దినవృత్తాంతములు 28:9; రోమీయులు 1:20.
4 యెహోవా సజీవుడైన దేవుడై, మన హృదయాలనుకూడా చూడగలడు గనుక, ఆయన కన్నులకు ఏదీ మరుగై ఉండదు. మన జీవితాలలో జరిగే సమస్తాన్ని ఆయన పూర్తిగా ఎరిగియున్నాడు. మనము ఎదుర్కొనే సమస్యలను ఎందువలన ఎదుర్కొంటున్నామనేదేగాక, దానివలన మనము అనుభవించే మానసిక, భావోద్రేక బాధలను కూడా ఆయన అర్థం చేసుకొనగలడు. మనలనుగూర్చి మనకు తెలిసినదానికంటె మన సృష్టికర్తగా ఆయనకే ఎక్కువ తెలుసు. మన పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎలా సహాయం చెయ్యాలో, శాశ్వత ఉపశమనాన్ని ఎలా యివ్వాలో ఆయనకు తెలుసు. మనము హృదయపూర్వకంగా ఆయనయందు నమ్మకముంచేకొలది తన బాహువులో గొర్రెపిల్లను చేర్చుకునే గొర్రెలకాపరివలె ఆయన ప్రేమతో మనకు సహాయంచేస్తాడు. (సామెతలు 3:5, 6; యెషయా 40:10, 11) కీర్తన 139యొక్క పఠనము ఆ నమ్మకాన్ని బలపరచడానికి ఎంతగానో దోహదపడగలదు.
మన మార్గములన్నిటిని చూచువాడు
5. యెహోవా మనలను ‘పరిశీలిస్తున్నాడు’ అంటే భావమేమిటి, అది ఎందుకు కోరదగింది?
5 ప్రగాఢమైన మెప్పుతో కీర్తనల రచయిత దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు.” (కీర్తన 139:1) ఆయననుగూర్చి యెహోవాయొక్క జ్ఞానము లోతైనదను నిశ్చయత దావీదుకున్నది. దేవుడు దావీదును, బహుశా మానవులు ఆయనను చూసినట్లు చూడలేదు. అనగా ఆయన భౌతిక రూపాన్ని, మాట్లాడగల సామర్థ్యాన్ని, వీణ వాయించగల నైపుణ్యాన్ని మాత్రమే చూడలేదు. (1 సమూయేలు 16:7, 18) యెహోవా దావీదు ఆంతర్యాన్ని, ఆయన ఆత్మీయ సంక్షేమాన్ని గూర్చి ప్రేమతోకూడిన శ్రద్ధగలవాడై పరిశోధించాడు. నీవుకూడా యెహోవాకు సమర్పించుకున్న సేవకులలో ఒకడవైతే, ఆయన దావీదును ఎలా ఎరిగియుండెనో ఆలాగే నిన్నుకూడా ఆయన ఎరిగియుండును. ఇది నీలో కృతజ్ఞతను, భక్తిప్రదమైన భయంతోకూడిన భావాలను కలిగించదా?
6. మనము చేసే ప్రతిది, మన ఆలోచనలు సహితం యెహోవాకు తెలుసునని, కీర్తన 139:2, 3 ఎలా చూపుతుంది?
6 దావీదు చర్యలన్ని యెహోవా దృష్టికి బాహాటమైయున్నవి. ఆ సంగతి దావీదుకు తెలుసు. ఆయన “నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును” అని వ్రాశాడు. “నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలనచేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.” (కీర్తన 139:2, 3) యెహోవా భూమికి ఎంతో దూరంగా, పరలోకంలో ఉన్నంత మాత్రాన, అది ఆయన్ని దావీదు ఏమిచేస్తున్నాడో, ఏమి ఆలోచిస్తున్నాడో తెలిసికొనకుండా నిరోధించదు. దావీదు చర్యలన్నిటిని వాటి స్వభావాన్ని తెలుసుకొనుటకు ఆయన రాత్రులందును, పగటియందును “పరిశీలన చేసియున్నా”డు లేక జాగ్రత్తగా గమనించాడు.
7. (ఎ) దావీదు జీవితంలోని సంఘటనలను ఆధారంగా తీసుకొని, దేవుడు ఎరిగియున్న మన జీవితంలోని కొన్ని సంఘటనలనుగూర్చి వ్యాఖ్యానించండి. (బి) ఈ గుర్తింపు మనపై ఎలా ప్రభావం చూపాలి?
7 దేవునియెడల ప్రేమ, విడిపించు ఆయన శక్తిలో నమ్మకముగలవాడై పిలిష్తీయుడైన గొల్యాతుతో యుద్ధంచేయుటకు యౌవనుడైన దావీదు స్వచ్ఛందంగా బయలుదేరిన విషయం, యెహోవా ఎరిగిన సంగతే. (1 సమూయేలు 17:32-37, 45-47) ఆ తర్వాత, ప్రజల ద్వేషము దావీదు హృదయానికి బాధ కలిగించినప్పుడు, రాత్రులందు కన్నీళ్లు విడుచునంతగా ఆయనపై ఒత్తిడి పెరిగినప్పుడు యెహోవా తన మొరను విన్నాడనే సంగతినిబట్టి ఆయన ఆదరణపొందెను. (కీర్తన 6:6, 9; 55:2-5, 22) అంతేగాక, నిద్రలేని రాత్రిలో కృతజ్ఞతతో నిండిన దావీదు హృదయము, యెహోవానుగూర్చి ధ్యానించిన సంగతి కూడా యెహోవాకు తెలుసు. (కీర్తన 63:6; ఫిలిప్పీయులు 4:8, 9 పోల్చండి.) ఒకరోజు సాయంకాలం దావీదు స్నానం చేస్తున్న పొరుగువాని భార్యను చూశాడు. ఆసంగతి కూడా యెహోవాకు తెలుసు. కనీసం కొంచెం కాలంపాటైనా, పాపపు యిచ్ఛ, దేవున్ని తన తలంపులనుండి మరుగుచేయునట్లు అనుమతించగా దావీదుకు ఏమి సంభవించిందో ఆయన చూశాడు. (2 సమూయేలు 11:2-4) ఆ తదుపరి దావీదు పాపపు తీవ్రతను ఎత్తిచూపుటకు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు నోటనుండి వెలువడిన మాటలను యెహోవా విన్నాడు, ఆ మాటలను ఉద్భవింపజేసిన పశ్చాత్తాప హృదయమును ఆయన గమనించాడు. (2 సమూయేలు 12:1-14; కీర్తన 51:1, 17) మనము ఎక్కడకు వెళ్తున్నాము, ఏమి చేస్తున్నాము, మన హృదయంలో ఏముంది అనే వాటిని మనము తీవ్రంగా తలంచునట్లు ఇది చేయవద్దా?
8. (ఎ) ‘మన నోటి మాటలు’ దేవునితో మనకున్న స్థానంపై ఏవిధంగా ప్రభావం చూపగలవు? (బి) నాలుకను ఉపయోగించుటలోగల బలహీనతను ఎలా జయించగలము? (మత్తయి 15:18; లూకా 6:45)
8 మనము చేసే ప్రతిదానిని దేవుడు ఎరిగియున్నాడు గనుక, మనలోని ఒక శరీర అవయవాన్ని, చివరకు చిన్న నాలుకను సహితం ఎలా ఉపయోగిస్తున్నామనేదాన్ని ఆయన ఎరిగియున్నాడనే విషయం మనలను ఆశ్చర్యపర్చకూడదు. రాజైన దావీదు దానిని గుర్తించి ఇలా వ్రాశాడు: “యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.” (కీర్తన 139:4) యెహోవా గుడారములోనికి అతిథిగా ఆహ్వానించబడేవారు, ఇతరులపై కొండెములు చెప్పక, తమ సన్నిహిత స్నేహితునిపైకి నిందను తెచ్చే చిన్నపెద్ద వదరు మాటలను వ్యాప్తిచేయడానికి తమ నాలుకను ఉపయోగించని ప్రజలుగా ఉంటారని దావీదుకు తెలుసు. తమ హృదయములందు సహితం సత్యము పలుకువారిపైనే యెహోవా అనుగ్రహముంటుంది. (కీర్తన 15:1-3; సామెతలు 6:16-19) మనలో ఎవరము మన నాలుకను పరిపూర్ణంగా స్వాధీనమందు ఉంచుకొనలేము. కానీ, దావీదు తన పరిస్థితిని వృద్ధిచేసికొనగల పరిస్థితి ఏమీ లేదను బలహీనమైన ముగింపుకు రాలేదు. యెహోవాను స్తుతించే గీతాలను సమకూర్చి, పాడటంలో ఆయన ఎంతో సమయాన్ని గడిపాడు. దేవుని నుండి సహాయంపొందు అవసరతను ఆయన నిరభ్యంతరంగా వ్యక్తపరచి దానికొరకు ప్రార్థించాడు. (కీర్తన 19:12-14) మనము నాలుకను ఉపయోగించే విషయంలో కూడా ప్రార్థనా పూర్వక శ్రద్ధనివ్వవలసియున్నామా?
9. (ఎ) కీర్తన 139:5లోని వర్ణన, దేవునికి మన పరిస్థితి చాలా విపులంగా తెలుసునని ఎలా సూచిస్తుంది? (బి) ఇది మనకు దేన్నిగూర్చి నమ్మకం కలిగివుండేలా చేస్తుంది?
9 యెహోవా మనలనుగాని, మన పరిస్థితినిగాని కేవలం ఒక పరిమితమైన దృక్కోణంనుండి చూడడు. ఆయన అన్ని వైపుల నుండి పూర్తి స్వరూపాన్ని తిలకిస్తాడు. ముట్టడింపబడిన ఒక పట్టణాన్ని సాదృశ్యంగా ఉపయోగిస్తూ, దావీదు ఇలా వ్రాశాడు: “వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు.” దావీదు విషయంలో దేవుడు ముట్టడించు శత్రువు కాక, జాగ్రత్తగా పరిశీలించు సంరక్షకునిగా ఉన్నాడు. అందుకే మరలా ఇలా అంటున్నాడు: “నీ చేయి నామీద ఉంచియున్నావు.” అనగా ఆయనను ప్రేమించువారి నిత్య ప్రయోజనార్థమై దేవుని అదుపు, రక్షణ ఉన్నదని ఆయన సూచిస్తున్నాడు. “ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము అది నాకందదు” అని దావీదు వ్యక్తపరచెను. (కీర్తన 139:5, 6) తన సేవకులనుగూర్చి దేవుడు కలిగియున్న జ్ఞానము ఎంతో విపులమైంది, సంపూర్ణమైంది. దానిని మనము సంపూర్ణంగా అర్థం చేసుకొనజాలము. కాని యెహోవా మనలను నిజంగా అర్థం చేసుకుంటాడని, ఆయన అందించే సహాయము అత్యంత శ్రేష్టమైందని నమ్మకముంచుటకు అవసరమైనంత తెలిసికొనివున్నాము.—యెషయా 48:17, 18.
మనమెక్కడ ఉన్నా, దేవుడు మనకు సహాయము చేయగలడు
10. కీర్తన 139:7-12లోని స్పష్టమైన వర్ణననుండి ప్రోత్సాహకరమైన ఏ సత్యము తేటపరచబడింది?
10 యెహోవా ప్రేమగల శ్రద్ధను మరొక స్థాయిలో దృష్టిస్తూ, కీర్తన రచయిత ఇంకా ఇలా అంటున్నాడు: “నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?” యెహోవాయొద్దనుండి పారిపోయే ప్రయత్నం చేయాలనుకునే కోరిక ఆయనకు లేదు; బదులుగా తాను ఎక్కడవున్నప్పటికి, యెహోవాకు తెలుస్తుందని, ఆయన పరిశుద్ధాత్మద్వారా తనకు సహాయముచేయగలడని ఆయనకు తెలుసు. “నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడిచేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగుచేయును, నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేననుకొనినయెడల, చీకటియైనను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏక రీతిగా ఉన్నవి.” (కీర్తన 139:7-12) మనమెక్కడికి వెళ్లినా, ఏ పరిస్థితిని ఎదుర్కొనిన, యెహోవా దృష్టినుండిగాని లేక ఆయన ఆత్మ మనకు సహాయముచేయుటనుండి మనలను అవి దూరము చేయలేవు.
11, 12. (ఎ) చూడగలిగి, సహాయముచేయగల యెహోవా సామర్థ్యపు విలువను గుణగ్రహించుటలో యోనా కొంతకాలము తప్పిపోయినప్పటికి, యోనా విషయంలో అది ఎలా ప్రదర్శించబడింది? (బి) యోనా అనుభవం మనకెలా ప్రయోనజకరం కావాలి?
11 ఒకస్థాయిలో యోనా ఆ విషయాన్ని మరచిపోయాడు. నీనెవె ప్రజలకు ప్రకటించే పనిని యెహోవా ఆయనకు అప్పగించాడు. ఏదో కారణాన్నిబట్టి ఆయన తాను ఆపనిని చేయలేననుకున్నాడు. బహుశా అస్సీరీయులకున్న క్రూరమైన పేరునుబట్టి యోనా నీనెవెకు వెళ్లి ఆ పనిచేయడానికి భయపడియుండవచ్చును. కనుక, కనబడకుండా పారిపోదామని ఆయన ప్రయత్నించాడు. యొప్పే ఓడరేవుకు వెళ్లి, తర్షీషునకు (ఇది సాధారణంగా స్పెయినుకు సంబంధించినదిగా ఎంచబడుతూ, నీనెవెకు పడమటివైపు 3,500 కిలోమీటర్ల దూరములోనున్నది) వెళ్లేందుకు ఓడకు కేవు ఇచ్చి బయలుదేరాడు. అయినా, ఓడ ఎక్కడాన్ని, దాని క్రింది భాగానికి వెళ్లి నిద్రపోతుండటాన్ని యెహోవా చూశాడు. ఆ తరువాత ఓడలోనుండి ఎత్తివేయబడినప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడో యెహోవాకు తెలుసు. యోనా పెద్ద చేప గర్భములోనుండే తాను చేసికొనిన మొక్కుబళ్లను చెల్లిస్తానని ప్రార్థన చేసినప్పుడు దానిని యెహోవా విన్నాడు. నేలమీద ఆయనను మరలా కక్కివేయునట్లు చేయడంద్వారా తన పనిని నిర్వహించడానికి యోనాకు మరొక అవకాశము ఇవ్వబడింది.—యోనా 1:3, 17; 2:1–3:4.
12 యోనా మొదటినుండే తన పనిని నిర్వహించడానికి సహాయంచేసేందుకై యెహోవా ఆత్మపైనే ఆధారపడివుంటే ఎంత బాగుండేది! అయినప్పటికి, తర్వాత యోనా వినయంతో తన అనుభవమును వ్రాసిపెట్టాడు. యెహోవాయందు నిలపడానికి యోనాకు కష్టమైన ఆ నమ్మకాన్ని, అనేకులు ప్రదర్శించడానికి అది తోడ్పడింది.—రోమీయులు 15:4.
13. (ఎ) యెజెబెలు రాణి ఎదుటనుండి పారిపోకముందు అప్పగించబడిన ఏ పనులను ఏలియా నమ్మకంగా నెరవేర్చాడు? (బి) చివరకు ఇశ్రాయేలు ప్రాంతానికి వెలుపల దాగుకొనడానికి ఏలియా వెళ్లినప్పుడుకూడా యెహోవా ఎలా సహాయంచేశాడు?
13 ఏలియా అనుభవము దీనికి కొంత భిన్నంగా ఉన్నది. వారి పాపములకు ఫలితంగా కరవు అనుభవిస్తారన్న యెహోవా వర్తమానాన్ని ఆయన నమ్మకంగా ప్రకటించాడు. (1 రాజులు 16:30-33; 17:1) కర్మెలు పర్వతం దగ్గర యెహోవాకు, బయలుకు మధ్య జరిగిన పోటీలో ఆయన ధైర్యంగా సత్యారాధనను ఉన్నతపరచాడు. బయలు ప్రవక్తలైన 450 మందిని ఆయన కీషోను లోయలో హతముచేయించాడు. అయితే అందుకు ఆగ్రహం చెందిన యెజెబెలు రాణి ఆయనను చంపుటకు ప్రతిజ్ఞచేయగా, ఏలియా పారిపోయాడు. (1 రాజులు 18:18-40; 19:1-4) ఆకష్ట సమయంలో యెహోవా ఆయనకు సహాయంచేస్తాడా? నిశ్చయంగా చేస్తాడు. పరలోకానికెక్కినట్లుగా ఏలియా ఉన్నత పర్వతాన్ని ఎక్కినా; పాతాళంలోకి వెళ్లినట్లు కొండగుహలో దాగినా; భూమిమీద ఉదయించు వెలుగంత వేగంగా ఇంకొక దూర ద్వీపంలోకి పారిపోయినా, ఆయనను బలపరచి, నడిపించడానికి యెహోవా తోడైయుంటాడు. (రోమీయులు 8:38, 39 పోల్చండి.) ఏలియా ప్రయాణం కొరకు ఆహారమివ్వడం ద్వారానేకాక, అనేక అద్భుతాలను తన చురుకైన శక్తిద్వారా ప్రదర్శించుటవలనను యెహోవా ఆయనను బలపరచాడు. అలా బలపరచబడిన ఏలియా ప్రవక్తగా మరో చోట పనిచేయుటకు వెళ్లాడు.—1 రాజులు 19:5-18.
14. (ఎ) దేవుడు అన్నిచోట్లావుండే సర్వాంతర్యామి అనే ముగింపుకు రావడం ఎందుకు తప్పు? (బి) ఏ పరిస్థితులలో యెహోవా ప్రేమతో ఆధునిక కాలంలోని తన సేవకులను పోషించాడు? (సి) మనము షియోలుకు వెళ్లినను, అక్కడ కూడా దేవుడు ఎలా ఉండగలడు?
14 కీర్తన 139:7-12లోని మాటలు దేవుడు అన్నివేళల, అన్ని చోట్లా ఉండే సర్వాంతర్యామి అనే భావమునివ్వవు. లేఖనాలు స్పష్టంగా మరోవిధంగా తెలియజేస్తున్నవి. (ద్వితీయోపదేశకాండము 26:15; హెబ్రీయులు 9:24) అయినా ఆయన సేవకులను చేరుటకు ఏది ఆయనకు దూరము కాదు. దైవపరిపాలన సంబంధంగా దూర ప్రాంతాలలో నియమించబడిన ఆయన సేవకుల విషయములోను, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీ కాన్‌సెంట్రేషన్ క్యాంపులో వేయబడిన తన యథార్థసాక్షుల విషయంలోనూ, 1950వ దశకం చివర నుండి 1960వ దశకం మొదటి భాగంలో చైనాలో ఏకాంత శిబిరాలలో నిర్బంధించబడిన మిషనరీల విషయంలోను ఇది వాస్తవము. సెంట్రల్ ఆఫ్రికా దేశంలో తమ గ్రామాలను, చివరకు తమ దేశాన్ని కూడా అనేకమారులు విడిచివెళ్లవలసి వచ్చిన మన ప్రియ సహోదర సహోదరీల విషయంలోను ఇది నెరవేరినది. అవసరమైతే, మానవజాతి సామాన్య సమాధియైన షియోలుకైనా వెళ్లి ఆయన తన నమ్మకమైన సేవకులను పునరుత్థానంచేసి బయటకు తీసుకు రాగలడు.—యోబు 14:13-15; లూకా 20:37, 38.
మనలను నిజంగా అర్థం చేసుకొనువాడు
15. (ఎ) ఎప్పటినుండే యెహోవా మన అభివృద్ధిని పరిశీలించగలడు? (బి) కీర్తన రచయిత అంతరింద్రియములను సూచించుటద్వారా మనలనుగూర్చిన యెహోవా జ్ఞానము ఎంత అధికమో ఎలా సూచించాడు?
15 దావీదు ప్రేరేపితుడై, మనము పుట్టక మునుపుకూడా మనలనుగూర్చి దేవునికి తెలుసు అనే సత్యాన్ని మనముందుంచుతున్నాడు: “నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” (కీర్తన 139:13, 14) గర్భధారణ సమయంలో మన తల్లి, తండ్రుల కణముల కలయికయే మన భౌతిక, మానసిక బలముపై గొప్ప ప్రభావం చూపగల ఒక నమూనాను ఉత్పత్తిచేస్తుంది. ఆ బలమును దేవుడు అర్థంచేసికొంటాడు. ఈ కీర్తనలో అంతరింద్రియములను గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఇవి లేఖనాలలో తరచు మన స్వభావంయొక్క అంతర్గత లక్షణాలను సూచించడానికి ఉపయోగించబడ్డాయి.a (కీర్తన 7:9; యిర్మీయా 17:10) మనలనుగూర్చిన ఈ వివరాలు మనము పుట్టకముందే యెహోవాకు తెలుసు. మానవ శరీరాన్నికూడా ఆయన ఎంతో ప్రేమపూర్వక శ్రద్ధతో నిర్మించాడు. అందుకే తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిన కణము పిండమును కాపాడునట్లు ఒక రక్షణకర పొరను తయారుచేస్తుంది. అది పెరుగుతుండే పిండాన్ని కాపాడుతుంది.
16. (ఎ) చొచ్చుకొని చూడగల దేవున్ని దృష్టిశక్తిని కీర్తన 139:15, 16 ఏవిధంగా ఉన్నతపరుస్తుంది? (బి) ఇది మనలనెందుకు ప్రోత్సహించేదైయుండాలి?
16 చొచ్చుకొనివెళ్లి దేనినైనను లోపల చూడగల దేవుని దృష్టియొక్క శక్తిని నొక్కితెలుపుతూ కీర్తనల రచయిత ఇంకా ఇలా అంటున్నాడు: “నేను రహస్యమందు పుట్టిననాడు, భూమియొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగైయుండలేదు. [కావ్యరీతిలో తన తల్లిగర్భాన్ని సూచిస్తూ, ఆదాము సృష్టిలో మట్టిలోనుండి తీయబడినదానికి ముడిపెడుతున్నాడు] నేను పిండమునైయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన [శరీర భాగాలు] దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను.” (కీర్తన 139:15, 16) కనుక తోటి మనుష్యులు మనలను అర్థం చేసికొన్నను, చేసికొనకపోయిననూ యెహోవా మాత్రం నిశ్చయంగా అర్థంచేసికొంటాడు. ఇది మనపై ఎలా ప్రభావం చూపాలి?
17. దేవుని కార్యాలు అద్భుతమని మనము దృష్టించినప్పుడు ఇది మనలను ఏమిచేయుటకు నడిపించాలి?
17 కీర్తన 139 వ్రాసిన రచయిత తాను రాస్తున్న దేవుని కార్యాలు అద్భుతమని వ్యక్తపరస్తున్నాడు. మీరు కూడా అలానే భావిస్తారా? అద్భుతమైన ఒకసంగతి ఒకవ్యక్తిని తీవ్రంగా, గంభీర అవధానంతో తలంచేలా చేస్తుంది. బహుశా నీవుకూడా భౌతిక సృష్టినిగూర్చిన యెహోవా కార్యాలనుబట్టి అలానే స్పందించవచ్చును. (కీర్తన 8:3, 4, 9 పోల్చండి.) మెస్సీయ రాజ్యమును స్థాపించడంలో ఆయన చేసినదానినిగూర్చి, సువార్తను భూమియంతట ప్రకటించే విషయంలో ఆయన చేస్తున్నదాన్నిగూర్చి, ఆయన వాక్యము మానవ వ్యక్తిత్వాలను మారుస్తున్నదాన్నిగూర్చి మీరును అలాగే ఆలోచిస్తారా?—1 పేతురు 1:10-12 పోల్చండి.
18. దేవుడు చేసినపని భయమును పుట్టించేదిగా మనము కనుగొనినట్లయితే, అది మనపై ఎలా ప్రభావం చూపుతుంది?
18 మీ అనుభవంలో కూడా దేవుని కార్యాలను తలంచడం, నీలో భయాన్ని కలుగజేసి, నీ వ్యక్తిత్వంపైనా, నీ జీవితాన్ని నీవు ఉపయోగించే విధానంపైనా గొప్ప ప్రభావాన్ని చూపేంతగా నిన్ను పురికొల్పునట్లు సరైన భయాన్ని అది నీలో కలిగిస్తుందా? (కీర్తన 66:5 పోల్చండి.) అలా ఉన్నట్లయితే నీ హృదయము నిన్ను యెహోవాను స్తుతించుటకు ఆయనను ప్రేమించేవారికొరకు ఆయన సిద్ధపరచియుంచిన అద్భుతమైన వాటిని ఇతరులకు తెలియచెప్పడానికి నీకున్న అవకాశాన్నుపయోగించుటకు పురికొల్పుతుంది.—కీర్తన 145:1-3.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ ప్రచురించిన ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చ్‌ర్స్ చూడండి. వాల్యూమ్ 2, పేజీ 150.
మీ వ్యాఖ్యానమేమిటి?
◻ “యెహోవా దేవుడని” తెలిసికొనుట ఆయనను సంతోషముగా సేవించడానికి ఎలా సహాయపడుతుంది?
◻ మనము చేసే ప్రతిది దేవునికి తెలుసు అనే సంగతి మన జీవితాలపై ఎలాంటి ప్రభావమును చూపాలి?
◻ దేవుని దృష్టినుండి మనమెన్నడూ తొలగిపోమన్న వాస్తవం మనకెందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది?
◻ ఏ మానవుడు అర్థం చేసికొనలేనిరీతిగా దేవుడు మనలను ఎందుకు అర్థం చేసికొనగలడు?
◻ ఇటువంటి పఠనము మనలను యెహోవాను స్తుతించునట్లు ఎందుకు చెయ్యాలి?