క్షామాన్ని గూర్చి ప్రవచించబడింది
ఇటీవల సంవత్సరాల్లో క్షామాన్ని గూర్చి తరచూ కనిపించే వార్తాపత్రిక నివేదికలు, బాద కల్గించే అంశంగా మారింది. ఇతియోపియాలోను మరెక్కడ చూసినా కష్టాలననుభవిస్తున్న వారి మరిచిపోలేని చిత్రాలు కన్పిస్తున్నాయి. సొమాలియానందు 1992లో యుద్ధం, అనావృష్టివలన సంభవించిన కరువుకు బలైనవారిపై ప్రపంచం దృష్టిమళ్లింది. ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ 1992 సెప్టెంబర్‌లో ఇలా నివేదించింది: “ఎంతమంది సొమాలీయులు చనిపోయారని ఎవరికీ తెలియదు, అయితే రెడ్‌క్రాస్ 1,00,000 కన్నా ఎక్కువమంది చనిపోయి ఉండవచ్చని ఊహిస్తుంది. వందల మంది కాకపోతే వేలమంది ప్రతిరోజు చనిపోతున్నారు.”
ఆ సంఖ్య క్షామబాధితుల దురవస్థను, వేదనను పూర్తిగా తెలియజేయడంలేదు. రెఫ్యూజీ ఇంటర్నేషనల్ యొక్క ఐరోపా ప్రతినిధి, ఎవెట్ ప్యెర్‌పోలి, రెఫ్యూజీ అనే యుఎన్ పత్రికలో ఇలా వ్రాసింది: “న్యూయార్క్‌లో, జెనీవాలో శరణార్థుల సమస్య తేటగా కన్పిస్తుంది; సంఖ్యలను చూపుతారు, మరి వాటి ప్రక్కనున్న సున్నాలెన్నో తెలుసుకొనడం చాలా కష్టంగా ఉంటుంది. వేల కిలోమీటర్ల దూరంలో, అదుపుతప్పిన అరాచకం చెలరేగుతున్న దేశసరిహద్దుల్లో గంభీరమైన భావోద్రేకాలు మీ గొంతు పిసికినట్లుంటుంది. అనేకములైన కష్టాల పరిమాణం చూసినప్పుడు ఆర్తనాదం చేయాలనిపిస్తుంది.”
రెడ్‌క్రాస్ సంస్థ సొమాలియాలో చేసిన సహాయం, ప్రయత్నం ఇదివరకు చేసిన మానవ సేవోపశమన ప్రక్రియలలోకెల్లా పెద్దదని అంటుంటే, కొందరు పరిశీలకులు సర్వసామాన్యంగా చేయవలసిన సహాయాన్ని కూడా చాలా ఆలస్యంగా చేసిందని ఫిర్యాదు చేశారు. ప్యెర్‌పొలి ఇలా విలపిస్తుంది: దానం చేసే రాజ్యాలు “చిన్నాభిన్నమవుతున్న ఆఫ్రికాకు మద్దతునిచ్చి అలసిపోయి, సహాయం కొనసాగించడానికి విముఖత చూపిస్తున్నాయి. . . . వాళ్లు ఆఫ్రికా దేశస్థులను, వారి హీనమైన పాలక వర్గాన్ని, వారి నాయకుల పేరాశను, అంతం లేదనిపించే వారి పోరాటాలను నిందిస్తున్నారు.”
బైబిలు “అక్కడక్కడ” కరువులు తటస్థించు కాలము వచ్చునని ముందే చెప్పింది. కరువుతోపాటు యుద్ధం, భూకంపం, తెగుళ్లు ఎక్కువగుట దేవుని రాజ్యం సమీపించిందని సూచిస్తున్నాయి. (లూకా 21:11, 31) దేవుని దయగల రాజ్యం క్రింద సమస్త మానవజాతికి ఆహారం సమృద్ధిగా లభిస్తుందని బైబిలు చెబుతుంది. “భూమిపై ధాన్యము సమృద్ధిగానుండును,” అని కీర్తనల రచయిత వ్రాశాడు. “పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.