కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 10/1 పేజీలు 5-9
  • అరుదైన క్రైస్తవ వారసత్వం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అరుదైన క్రైస్తవ వారసత్వం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తండ్రి బైబిలు సత్యాని నేర్చుకొనుట
  • పరిచర్యలో తొలి ప్రారంభం
  • నా తల్లిదండ్రులతోపాటు దేవుని సేవించుట
  • తాతయ్య అమ్మమ్మల నుండి శిక్షణ
  • హింసా సంవత్సరాలు
  • తల్లిదండ్రుల నడిపింపుకు కృతజ్ఞురాల్ని
  • వివాహము, ప్రయాణ సేవాపని
  • తల్లిదండ్రులనుగూర్చి శ్రద్ధవహించుట
  • మా అమ్మానాన్నలు మాకు దేవుడ్ని ప్రేమించడం నేర్పించారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మా ఘనమైన ఆత్మీయ వారసత్వం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • దేవునితో, మా అమ్మతో సమాధానంగా ఉండగలిగాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మా నాన్న లేదా అమ్మ ఆరోగ్యం బాగోకపోతే?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 10/1 పేజీలు 5-9

అరుదైన క్రైస్తవ వారసత్వం

బ్లాసమ్‌ బ్రాంట్‌ చెప్పింది

నేను పుట్టిన రోజున శాన్‌ ఆంటోనియో, టెక్సాస్‌లో మంచు కురుస్తుంది. అది 1923, జనవరి 17వ తేది. బయటంతా బాగా చలిగా ఉన్నప్పటికి, నేను ఆ రోజున క్రైస్తవ తల్లిదండ్రులైన జడ్జి, హెలెన్‌ నారిస్‌ల వెచ్చని వడిలోకి ఆప్యాయంగా ఆహ్వానించబడ్డాను. నాకు జ్ఞాపకమున్న తొలినాటి నుండి మా తల్లిదండ్రులు చేసిన ప్రతిది యెహోవా దేవుని ఆరాధన మీదే కేంద్రీకృతమైవుంది.

నా తల్లికి ఎనిమిదేండ్ల వయసున్నప్పుడు 1910లో ఆమె తల్లిదండ్రులు పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గునుండి టెక్సాస్‌లోని ఆల్‌విన్‌ వ్యవసాయ ప్రాంతానికి తరలి వెళ్లారు. అక్కడ పొరుగువారి నుండి బైబిలు సత్యాలను నేర్చుకొనడానికి వారెంతో ఆనందించారు. అప్పటినుండి మా అమ్మ తన మిగతా జీవితకాలం ప్రజలలో రాజ్యనిరీక్షణ పట్ల ఆసక్తిని కలిగించడానికి ప్రయత్నించింది. తర్వాత కుటుంబము టెక్సాస్‌లోని హూస్టన్‌కు మారినప్పుడు ఆమె 1912లో బాప్తిస్మము తీసుకొంది.

మా అమ్మ, ఆమె తల్లిదండ్రులు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి మొదటి ప్రెసిడెంటైన చార్లెస్‌. టి. రస్సల్‌గారిని ఆయన హూస్టన్‌ సంఘాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు మొదట కలిశారు. తరచు ఆ కుటుంబములో అప్పుడు పిల్‌గ్రిమ్స్‌ అని పిలువబడే సొసైటి ప్రయాణ ప్రతినిధులు విడిదిచేసేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అమ్మ ఆమె తల్లిదండ్రులతోపాటు ఇల్లినాయ్స్‌లోని చికాగోకు తరలివెళ్లినప్పుడు, అక్కడున్న సంఘాన్ని కూడా సహోదరుడు రస్సల్‌ దర్శించేవాడు.

మా అమ్మమ్మకు 1918లో స్పానిష్‌ ఫ్లూ సోకింది. దానిఫలితంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వేడి వాతావరణంగల ప్రాంతంలో జీవించడం మంచిదని డాక్టర్లు ఆమెకు సిఫారసు చేశారు. తాతయ్య అప్పుడు పుల్‌మ్యాన్‌ అనే రైలు కంపెనీలో పనిచేసేవాడు గనుక, ఆయన తిరిగి టెక్సాస్‌కు బదిలీ చేయించుకున్నాడు. అక్కడ శాన్‌ ఆంటోనియోనందు సంఘంలో ఆసక్తిగా పనిచేస్తున్న జడ్జి నారిస్‌ అనే ఒక యువకున్ని మా అమ్మ కలిసింది. వెంటనే ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. కాల గమనంలో వారి వివాహమయ్యింది, జడ్జి నా తండ్రి అయ్యాడు.

తండ్రి బైబిలు సత్యాని నేర్చుకొనుట

జడ్జి (న్యాయమూర్తి), అనే ఈ అసాధారణ పేరు ఆయనకు పుట్టుకతో పెట్టబడింది. ఆయన తండ్రి మొదట తనను చూసినప్పుడు, “ఈ బిడ్డ జడ్జి అంతటి గంభీరతగలవాడు” అని అన్నాడు. చివరకు అదే ఆయన పేరయ్యింది. నాన్నకు 16 యేండ్లప్పుడు, 1917లో వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ముద్రించిన వేర్‌ ఆర్‌ ది డెడ్‌? వాట్‌ ఈజ్‌ ది సోల్‌? అనే కరపత్రాలు అందాయి. మా నాన్నగారి తండ్రి అప్పటికి రెండేళ్ల క్రితమే మరణించారు. చనిపోయినవారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న ఆయన ప్రశ్నలకు ఈ కరపత్రాలు సమాధానమిచ్చాయి. ఆ పిమ్మట కొంతకాలానికే ఆయన బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరుకావడం మొదలు పెట్టాడు. యెహోవాసాక్షులు ఆ కాలంలో అలా పిలువబడేవారు.

వెంటనే సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాన్న యిష్టపడ్డాడు. ప్రకటించేందుకు ఆయనొక ప్రాంతాన్ని తీసుకొని పాఠశాల అయిన వెంటనే, అక్కడకు తనసైకిలు మీద వెళ్లి కరపత్రాలను పంచేవాడు. ఆయన రాజ్యవర్తమానాన్ని ఇతరులతో పంచుకొనడంలో పూర్తిగా నిమగ్నమై 1918, మార్చి 24వ తేదీన యెహోవాకు తన సమర్పణ సూచనగా, బాప్తిస్మము తీసుకున్నాడు.

ఆ మరుసటి సంవత్సరమే అమ్మ శాన్‌ ఆంటోనియో సంఘమునకు వచ్చింది. “ఆ నిండునవ్వు, నీలి కండ్లకు ఆకర్షితుడనయ్యానన్నాడు” నాన్న. త్వరలోనే వారిద్దరు పెండ్లిచేసుకొనే యిష్టాన్ని వ్యక్తపరచుకున్నారు. కాని అమ్మ తల్లిదండ్రులను ఒప్పించడం వారికి చాలా కష్టమయ్యింది. అయినా 1921, ఏప్రిల్‌ 15వ తేదీన వారు వివాహం చేసుకున్నారు. పూర్తి కాల సేవే వారిద్దరి ధ్యేయము.

పరిచర్యలో తొలి ప్రారంభం

సీడర్‌ పాయింట్‌, ఒహాయో నందు 1922లో జరిగే సమావేశానికి హాజరుకావడానికి అమ్మా నాన్న సిద్ధపడుతున్నపుడు నేను కడుపులో ఉన్నట్లు తెలుసుకున్నారు. నేను పుట్టిన కొద్దిరోజులకే, 22యేండ్ల వయస్సులోనే నాన్న సంఘములో సర్వీస్‌ డైరెక్టరుగా నియమించబడ్డాడు. అంటే ఆయన ప్రాంతీయ సేవా ఏర్పాట్లన్నీ చూసేవాడు. కొన్ని వారాల్లోనే అమ్మ, నాన్నలు నన్ను యింటింటి పరిచర్యకు తీసుకెళ్లడం మొదలయ్యింది. నిజానికి మా తాతయ్య, అమ్మమ్మలు కూడా నన్ను వాళ్లతోపాటు పరిచర్యకు తీసుకెళ్లడానికి యిష్టపడేవారు.

నేను రెండేండ్ల వయస్సులో ఉన్నపుడే నా తల్లిదండ్రులు టెక్సాస్‌లోని డాలస్‌కు తరలివెళ్లి, మూడు సంవత్సరాల తర్వాత అక్కడ పూర్తికాల పరిచర్య పయినీర్లుగా పని ప్రారంభించారు. రాత్రులందు వారు నన్ను కారు వెనుక సీటులో పడుకోబెట్టి వారు రోడ్డు ప్రక్కన మంచం వేసుకొని పడుకునే వారు. ఇది ఆనందంగానే ఉండేదికాని, వారు ఇంకా పయినీరు జీవితానికి సిద్ధంగాలేరని త్వరలోనే అర్థమైపోయింది. నాన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి, ఆయన మరలా పయినీరు సేవను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒక చిన్న వాహన గృహాన్ని (ట్రైలర్‌) నిర్మించాడు.

నేను స్కూలుకు వెళ్లడం ప్రారంభించక ముందే అమ్మ నాకు వ్రాయడం చదవడం నేర్పించింది. నేను నాలుగు ఎక్కాల వరకు నేర్చుకున్నాను. ఆమె శ్రద్ధంతా ఎప్పుడూ నాకు నేర్పాలనే ఉండేది. ఆమె పాత్రలు కడిగిన వెంటనే వాటిని ఆరబెట్టడానికి తన ప్రక్కనే కుర్చీవేసి నన్ను నిలబెట్టేది. ఆ సమయంలో ఆమె నాకు లేఖనాలను గుర్తుంచుకోడానికి, రాజ్య గీతాలను పాడటానికి నేర్పించేది. అప్పుడు మేము ఈ గీతాలను హిమ్స్‌ అని పిలిచేవారము.

నా తల్లిదండ్రులతోపాటు దేవుని సేవించుట

మేమందరము 1931లో గగుర్పాటు కలిగించిన సమావేశానికి కొలంబస్‌, ఒహాయోలో హాజరయ్యాము. అక్కడే మేము యెహోవాసాక్షులు అనే పేరును స్వీకరించింది. అప్పటికి నాకు ఎనిమిదేండ్లే అయినప్పటికి, ఆ పేరు నేను విన్నవాటన్నిటిలో బహు సుందరమైన పేరుగా నాకు తోచింది. మేము ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే డాడి వ్యాపారం అగ్నికి ఆహుతయ్యింది. అమ్మ నాన్న, మరలా పయినీరు సేవచేయడానికి ఇది “ప్రభువు చిత్తమేమో” అని అనుకున్నారు. అలా 1932, వేసవి నుండి అనేక సంవత్సారాలు మేము పూర్తికాల పరిచర్యను ఆనందించాము.

అప్పటికి ఇంకా శాన్‌ ఆంటోనియోలోనే ఉంటున్న మా అమ్మవాళ్ల తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేలా నా తల్లిదండ్రులు మధ్య టెక్సాస్‌లో పయినీరు సేవ చేసేవారు. ఒకచోటునుండి మరొకచోటకు నియమించబడుతున్నందువలన నేను తరచుగా పాఠశాలలు మారాల్సి వచ్చేది. కొన్నిసార్లు అనాలోచనపరులైన స్నేహితులు, నా తలిదండ్రులు నన్నేదో సరిగా చూడడం లేదన్నట్లు, “ఒకచోట నిలకడగా ఉండి ఆ అమ్మాయికి ఒక గృహాన్ని ఎందుకు ఏర్పాటుచేయకూడదు?” అనేవాళ్లు. అయితే నేను మాత్రం మా జీవితం ఎంతో ఉల్లాసవంతంగా ఉందని భావిస్తూ, అమ్మా నాన్నలకు వారి పరిచర్యలో సహాయం చేస్తుండేదాన్ని. నిజానికి తరువాత కాలంలో నా జీవన విధానంగానే మారిన జీవితానికి శిక్షణపొందుతూ, సిద్ధపరచబడ్డాను.

అనేక నెలలుగా నేను అమ్మా నాన్నలతో నాకు బాప్తిస్మం తీసుకోవాలని ఉందని చెబుతుండే దాన్ని. ఆ విషయంగూర్చి వారూ తరచు నాతో మాట్లాడేవారు. వాళ్లేమో నీ నిర్ణయం ఎంత గంభీరమైందో ఆలోచించుకోమని చెప్పేవారు. నా జీవితంలో అతి ప్రధానమైన ఈ సంఘటన జరిగే ఆ రోజు, 1934 డిశంబరు 31వ తేదీ రానేవచ్చింది. అయినా దానికి ముందు రాత్రి యెహోవాను నేను ప్రార్థనలో సమీపించేలా నాన్న చూశాడు. ఆయన ఇంకో మంచి పనిచేశాడు. మమ్ములందరిని సమకూర్చి మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్థన చేశాడు. తన చిన్న బిడ్డ ఆయనకు సమర్పించుకునే నిర్ణయం తీసుకుంటున్నందున తానెంతో సంతోషిస్తున్నట్లు యెహోవాకు తెలియజేసాడు. రాబోయే యుగాల్లో కూడా నేను ఆ రాత్రిని మరచిపోనని మీరు కచ్చితంగా నమ్మవచ్చు.

తాతయ్య అమ్మమ్మల నుండి శిక్షణ

నేను 1928 నుండి 1938 మధ్యకాలంలో శాన్‌ ఆంటోనియోలోని మా తాతయ్య అమ్మమ్మలను దర్శించడంలో చాలా కాలం గడిపాను. వారితో సాధారణంగా గడిపే కాలం నా తల్లిదండ్రులతో గడిపేటట్లే ఉండేది. మా అమ్మమ్మ కల్‌పోర్చర్‌గా పనిచేసింది. పూర్వం పయినీర్లను ఆ పేరుతో పిలిచేవారు. ఆమె అటు తరువాత దినంలో కొంత భాగం మాత్రమే చేసే పయినీరుగా సేవచేసింది. మా తాతయ్య 1929 డిశంబరులో పయినీరుగా నియమించబడ్డాడు. అందుచేత ప్రాంతీయ సేవ ఎల్లప్పుడు అనుదిన కార్యక్రమంగా ఉండేది.

తాతయ్య రాత్రుల్లు నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని నక్షత్రాల పేర్లు చెప్పేవాడు. తనకు జ్ఞాపకమున్న పద్యాలు చెప్పేవాడు. ఆయన రైల్వేలో పనిచేస్తున్నప్పుడు, చాలా సార్లు ఆయనతోపాటు పుల్‌మ్యాన్‌ రైలులో ప్రయాణించాను. నాకెప్పుడైనా కష్టంగా ఉంటే ఆయనకు చెప్పుకునే దాన్ని. ఆయన ఓదార్చి కళ్ల నీళ్లు తుడిచేవాడు. అయినా ఎప్పుడైనా నేను అయుక్తంగా ప్రవర్తించినందుకు శిక్షించబడినప్పుడు, ఓదార్పు కొరకు ఆయన దగ్గరకు వెళ్తే, ఆయన తేలిగ్గా (అప్పట్లో ఆయన మాటలు నాకు అర్థమయ్యేవి కావుగాని, ఆయన గొంతులో భావం స్పష్టంగా అర్థమయ్యేది): “తల్లీ, తప్పుచేస్తే, శిక్ష తప్పదమ్మా” అనేవాడు.

హింసా సంవత్సరాలు

రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమయినప్పుడు, యెహోవాసాక్షులు హింసను, దొమ్మి ముట్టడులను అనుభవించారు. అమ్మ 1939 చివర్లో, బాగా జబ్బున పడడంతో చివరకు ఆపరేషన్‌ అవసరమయ్యింది. అందుచేత మేము మరలా శాన్‌ ఆంటోనియోకు తిరిగి వెళ్లాము.

మేము శాన్‌ ఆంటోనియోలో పత్రికలను పంచుతున్నప్పుడు అల్లరి మూకలు చుట్టుముట్టేవారు. అయినా, ప్రతివారం కుటుంబ సమేతంగా వెళ్లి, ఎవరికి నిర్ణయించబడిన మూలల్లో వాళ్లం నిలబడేవారం. నా కళ్లముందే వారు నాన్నను పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లడం అనేకసార్లు నేను చూశాను.

పయినీరు సేవను అమ్మ మానుకోవలసి వచ్చినప్పటికి నాన్న మాత్రము దానిని కొనసాగించడానికి ప్రయత్నించారు. అయితే దినంలో కొంత సమయం మాత్రమే పని చెయ్యడం మూలంగా ఆయన చాలినంత డబ్బు సంపాదించలేకపోయేవాడు. అందువలన ఆయన కూడా మానుకోవలసి వచ్చింది. నేను 1939లో నా పాఠశాల చదువు ముగించిన తర్వాత, నేను కూడా ఉద్యోగం చేయడం మొదలు పెట్టాను.

నాన్న పేరు జడ్జి (న్యాయమూర్తి). ఈ పేరు ఆ సంవత్సరాలలో ఉపయోగపడింది. ఉదాహరణకు, శాన్‌ ఆంటోనియో పట్టణం ఉత్తర భాగాన సాక్ష్యమివ్వడానికి కొంతమంది స్నేహితులు గుంపుగా వెళ్లారు. ఇంతలో న్యాయవ్యవహారాలు చూసే ఓ ముఖ్య అధికారి వారినందరిని జైల్లో వేయడం ప్రారంభించాడు. మా అమ్మమ్మ తాతయ్యలతో పాటు ఆయన 35 మందిని అరెస్టుచేశాడు. వాళ్లు నాన్నకు ఈ సంగతిని తెలియపరచాగానే నాన్న అక్కడకు వెళ్లాడు. ఆయన ఈ అధికారి ఆఫీసులోకి వెళ్లి, “నేను జడ్జి నారిస్‌ని, శాన్‌ ఆంటోనియో నుండి వచ్చానన్నాడు.”

“చెప్పండి జడ్జిగారు, నేను మీకేం చెయ్యాలి” అన్నారు ఈ అధికారి.

“నేను వీళ్లను జైలునుండి విడిపించడానికి వచ్చాను” అని నాన్న సమాధానమిచ్చాడు. ఆ మాటతో ఆ అధికారి బెయిలు లేకుండానే, ఏమి ప్రశ్నించకుండానే వారిని విడిచిపెట్టాడు.

నాన్నగారు, డౌన్‌టౌన్‌ ఆఫీసు బిల్డింగులలో సాక్ష్యమివ్వడానికి ఇష్టపడేవాడు. ప్రత్యేకంగా లాయర్లను, జడ్జిలను కలవడమంటే ఆయనకు ఎంతో ఇష్టము. వాళ్ల రిసిప్షనిస్ట్‌తో యిలా చెప్పేవాడు: “నేను జడ్జి నారిస్‌ను. పలానా న్యాయమూర్తిని కలవాలని వచ్చాను.”

ఆయన జడ్జిని కలిసినవెంటనే ఎప్పుడు ఆయన మొదటి మాటలు ఇలా ఉండేవి: “నేను వచ్చిన ఉద్దేశాన్ని చెప్పేముందుగా, ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. మీకంటె ముందునుంచే నేను జడ్జిని, నా జీవితకాలమంతా జడ్జినే.” తర్వాత ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో వివరించేవాడు. ఇది వారిమధ్య స్నేహపూర్వకమైన సంభాషణకు దారితీసేది. ఆ రోజుల్లో ఆయన చాలామంది జడ్జిలతో మంచి సంబంధాన్ని పెంచుకున్నాడు.

తల్లిదండ్రుల నడిపింపుకు కృతజ్ఞురాల్ని

ఒడుదుడుకులతో నిండిన యుక్తవయస్సున్న సంవత్సరాలలో, నేనేమౌతానేమోననే భయంతో కనిపెడుతూ అమ్మనాన్నలు దిగులుతోనున్న కాలాలు నాకు తెలుసు. పిల్లలందరిలాగానే నేనుకూడా అమ్మానాన్నలను వారినుండి కాదనే సమాధానం వస్తుందని తెలిసే ఫలాంది చేస్తానంటూ, ఫలాన చోటికి వెళ్తానంటూ చాలాసార్లు పరీక్షించాను. కొన్నిసార్లు ఏడ్చేదాన్ని. వాళ్లెప్పుడైనా, “నీ యిష్టం, నీ యిష్టమొచ్చినట్లే చెయ్‌, మాకేమి సంబంధంలేదు,” అని అంటే ఎంతో కలత చెందేదాన్ని.

వారు నియమించిన ప్రమాణాల విషయంలో వారిని నేను మార్చలేననే సంగతి తెలిసి నాలోనేను భద్రతా భావాన్ని పొందేదాన్ని. నిజానికి ఇతర యౌవనస్థులు వివేకయుక్తంకాని వినోదానికి ఆహ్వానించినప్పుడు, “అమ్మో, డాడి వెళ్లనియ్యడు,” అని చెప్పేందుకు నాకు సులభమయ్యేది. నాకు 16 యేండ్లు రాగానే డాడి కారు డ్రైవింగ్‌ నేర్పించారు. నేను డ్రైవింగ్‌ లైసెన్సు పొందాను. అప్పుడే నాకు యింటి తాళాలు కూడా ఇచ్చారు. ఆయన నన్ను నమ్మాడని నేనెంతో మురిసిపోయాను. నాలో నేను పెద్దదాన్నయ్యాననే భావన, బాధ్యత నాపై మోపబడిందనే భావన, నాపైన ఉంచబడిన నమ్మకాన్ని వమ్ముచేయకూడదనే కోరిక కలిగాయి.

ఆ దినాల్లో వివాహాన్ని గూర్చిన లేఖన ఉపదేశము అంతగా లేదు. కాని నాన్నకు మాత్రం బైబిలును గూర్చి, ‘ప్రభువునందే వివాహం’ చేసుకోవాలని అది చెప్పే సంగతి గూర్చి తెలుసు. నేనెప్పుడైనా లోకసంబంధీకుడైన కుర్రాన్ని ఇంటికి తీసుకువస్తే, లేక సహవాసం చేస్తే తానెంతో బాధపడతాడని స్పష్టంగా చెప్పేవాడు. ఆయన ఉద్దేశము సరైందేనని నాకు తెలుసు. ఎందుకంటే వారు “ప్రభువునందు వివాహం” చేసుకున్నందున వారిలో సంతోషాన్ని, ఐక్యతను చూశాను.

నాకు 18 ఏండ్లప్పుడు, 1941లో సంఘములోని ఒక యువకునితో ప్రేమలో పడ్డాననిపించింది. అతను పయినీరు సేవచేస్తున్నాడు, లా కూడా చదువుతున్నాడు. నేనెంతో ఉల్లాసపడ్డాను. మేమిద్దరం పెండ్లి చేసుకోవాలనుకుంటున్నామని అమ్మానాన్నలకు చెప్పినప్పుడు నిరుత్సాహపర్చకుండా, అనంగీకారం తెల్పకుండా వాళ్లు యిలా అన్నారు “బ్లాసమ్‌, మీరు చాలా చిన్న వయసులో వున్నారని మేము భావిస్తున్నాము ఒక సంవత్సరం ఆగితే బాగుంటుందని మా ఉద్దేశమన్నారు. మీరు నిజంగా ప్రేమించుకుంటే ఒక్క సంవత్సరంలో పెద్ద నష్టమేమీ రాదన్నారు.”

ఆ జ్ఞానయుక్తమైన సలహాను అంగీకరించినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. ఈ సంవత్సరంలోపల నేను కొంత పరిపక్వత కెదగడంతో, అతనిలో సరైన వివాహ జతకు తగిన లక్షణాలు లేవని గుర్తించగలిగాను. క్రమేణ అతను యెహోవా సంస్థను విడిచిపెట్టాడు. నా జీవితంలో విపత్తు తప్పిపోయింది. నమ్మదగిన నిర్ణయానికి నడపగల జ్ఞానయుక్తమైన తల్లిదండ్రులు ఉండటం ఎంత ఆశీర్వాదకరం!

వివాహము, ప్రయాణ సేవాపని

రోజులో కొంత సమయం ఉద్యోగం చేస్తూ పయినీరు సేవ యందు కొంతకాలం పనిచేస్తూ ఆరేండ్లు గడిపిన తర్వాత 1946లో శీతాకాలంలో నేను కలిసిన వారందరిలో అతి ఉత్తముడైన ఒక యువకుడు రాజ్యమందిరానికి వచ్చాడు. జెన్‌ బ్రాంట్‌ అనే యువకుడు మా సంఘాన్ని దర్శించడానికి వచ్చిన ప్రయాణ సేవకునికి సహవాసిగా నియమించబడ్డాడు. ప్రాంతీయకాపరిని అప్పుడు అలా పిలిచేవాళ్లం. ఇద్దరం పరస్పరం ఆకర్షితులమై 1947, ఆగస్టు 5న వివాహం చేసుకున్నాము.

త్వరలో, నాన్న, జెన్‌ కలిసి ఒక అకౌంటింగ్‌ ఆఫీసును ప్రారంభించారు. కాని నాన్న జెన్‌తో చెప్పిన మాటలేమంటే: “ఏ రోజైతే ఈ ఆఫీసు, దైవపరిపాలన సంబంధమైన నియామకానికిగాని, లేక కూటాలకుగాని అడ్డం వస్తుందో, ఆరోజే దాని తలుపులు మూసేసి, తాళపు చెవి విసిరి పారేస్తాను.” ఈ ఆత్మీయ దృష్టిని యెహోవా ఆశీర్వాదించాడు. ఈ ఆఫీసు మాకు కావలసిన భౌతిక అవసరతలను కొరతలేకుండా తీర్చింది. మాకు పయినీరు సేవచేయడానికి తగిన సమయం కూడా లభించింది. నాన్న, జెన్‌ వ్యాపారంలో మంచి సిద్ధహస్తులు. ఇది మమ్ములను సులభంగా ధనికులను చేయగలిగేది. కాని వారికెన్నడు ఆ గురిలేదు.

జెన్‌ 1954లో ప్రాంతీయ కాపరిగా సేవచేయడానికి ఆహ్వానించబడ్డాడు. అంటే మా జీవితంలో పెద్ద మార్పులన్న మాట. నా తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు? మరొక సారి వారి శ్రద్ధంతా దేవుని రాజ్యాసక్తులను గూర్చి, పిల్లల ఆత్మీయ క్షేమాన్ని గూర్చే. వాళ్లెన్నడూ “మాకు మనవళ్లు కావాలని” అనలేదు. బదులుగా ఎప్పుడూ, “మీరు పూర్తికాల సేవలో కొనసాగేలా మేం మీకేం చేయగలం” అనేవారు.

మేము వారిని విడిచిపెట్టి వెళ్లేరోజొచ్చినప్పుడు, మమ్ములను ప్రోత్సహించడం, మేము పొందిన గొప్ప ఆధిక్యతనుబట్టి సంతోషించడమే జరిగింది. మేము వారిని విడిచి వెళ్తున్నామనే భావాన్ని వారు మాలో ఎన్నడూ కలిగించేవారు కాదు. బదులుగా నూటికి నూరు శాతం మద్దతు ఇచ్చేవారు. మేము వారిని విడిచివచ్చిన తర్వాత కూడా వారు మరో పది సంవత్సరాలు పయినీరు పనిలో రద్దీగా గడిపారు. నాన్న శాన్‌ ఆంటోనియోలో సిటీ ఓవర్‌సీర్‌గా నియమించబడ్డారు. ఆ స్థానంలో ఆయన 30 సంవత్సరాలు సేవచేశాడు. ఆ పట్టణంలో 1920వ దశకమందున్న ఒకే సంఘం నుండి 1991లో ఆయన చనిపోయేసరికి 71 సంఘాలు పెరగడాన్ని ఆయన చూశాడు.

నాకు, జెన్‌కు జీవితం ఉల్లాసంతో నిండింది. మేము 31 రాష్ట్రాలలోని ప్రియ సహోదర సహోదరీలకు సేవచేసే గొప్ప ఆనందాన్ని అనుభవించాము. అన్నిటిలోకెల్లా బహుశా ఉన్నతమైంది, 1957లో వాచ్‌టవర్‌ బైబిలు స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 29వ తరగతికి హాజరయ్యే ఆధిక్యత పొందడం. తిరిగి మేము ప్రయాణ సేవ పనికే వచ్చాము. ప్రాంతీయ కాపరిగా, జిల్లా కాపరిగా 30 సంవత్సరాలు సేవచేసిన తర్వాత, 1984లో సొసైటి దయతో జెన్‌ను శాన్‌ ఆంటోనియోలో ప్రాంతీయ కాపరిగా సేవచేయడానికి నియమించారు. ఎందుకంటే అప్పటికి మా తల్లిదండ్రులు వారి ఎనభైయవ దశకంలో ఉండి, ఆరోగ్యపరంగా క్షీణించారు.

తల్లిదండ్రులనుగూర్చి శ్రద్ధవహించుట

మేము శాన్‌ ఆంటోనియోకు తిరిగి వచ్చిన సంవత్సరంన్నరకు అమ్మ పాక్షికంగా సృహలేని స్థితిలోకి వెళ్లి మరణించారు. కనీసం నేను ఆమెతో చెప్పాలనుకున్న కొన్నింటిని చెప్పలేకుండా పోయేంత ఆకస్మాత్తుగా ఆమెకు ఆ జబ్బు వచ్చింది. ఇది నన్ను డాడితో కావలసినంతగా మాట్లాడేలా మేల్కొల్పింది. వివాహమైన 65 సంవత్సరాల తర్వాత ఆయనలో అమ్మ లేని లోటు ఎంతో కన్పించింది. కాని మేమైతే ఆయన్ని ప్రేమించి ఆయనకు తోడుగా ఉండడానికి అందుబాటులో ఉన్నాము.

నాన్న జీవితాంతము, క్రైస్తవ కూటాలకు హాజరు కావడంలో, పఠించడంలో, సేవను కొనసాగించడంలో చూపిన మాదిరి మరణం వరకు కొనసాగింది. ఆయనకు చదవడం అంటే చాలా యిష్టం. మేము సేవకు వెళ్లినప్పుడు ఆయనొక్కడే ఇంట్లోవుండేవాడు గనుక, నేను ఇంటికి వచ్చి “నాన్నా, ఒంటరిగా వున్నట్లు అనిపించిందా?” అని అడిగేదాన్ని. ఆయనేమో, చదవడం పరిశోధించడంలోనే పూర్తిగా నిమగ్నమైనందున, ఆయనకు కనీసం ఆ తలంపు కూడా మనస్సుకు వచ్చేది కాదు.

మేము జీవితకాలం కాపాడుకున్న మరో అలవాటు ఉంది. నాన్న ఎప్పుడూ కుటుంబం కలిసి భోంచేయాలని పట్టుబట్టేవాడు. కనీసం దినవచనాన్ని చర్చించే సమయమైన ఉదయకాల అల్పాహార సమయంలో. నేను చిన్నదానిగా ఉన్నప్పుడు దినవచనం చూసుకొనందే నన్నెన్నడూ బయటికి పంపించేది లేదు. కొన్నిసార్లు, “నాన్నా, నాకు స్కూలుకు (లేక పనికి) ఆలస్యమవుతుంది” అనేదాన్ని.

“నీవు వచనాన్ని చూసుకోవడం మూలంగా ఆలస్యం కావడం లేదు. నీవు పెందలకడనే లేవలేదు. అందుకే ఆలస్యమౌతుంది” అనేవాడు. నేను ఆగి ఆయన మాట ప్రకారం చేసేదాన్ని. ఈ మంచి మాదిరిని ఆయన జీవితకాలపు ఆఖరు దినాల వరకూ కొనసాగేలా కచ్చితంగా చూశాడు. ఇది నాకు ఆయన వదిలివెళ్లిన మరో వారసత్వం.

నాన్న చివరి వరకు మానసికంగా చురుగ్గా ఉన్నాడు. ఆయనకు శ్రద్ధవహించే పనిని సులభతరం చేసిన మరో విషయమేమంటే ఆయన ఎప్పుడూ తొందరపెట్టడం గాని, ఫిర్యాదు గాని చేసేవాడు కాదు. అప్పుడప్పుడు ఆయన తనకున్న ఆర్తరైటిస్‌ను (కీళ్లనొప్పులు) గూర్చి చెప్పేవాడు. కాని నేను ఆయనకు అది ఆర్తరైటిస్‌ కాదు “ఆడామిటిస్‌” (ఆదాము నుండి వచ్చిన జబ్బు అన్నట్లు) అని గుర్తుచేసేదాన్ని. ఆయన నవ్వేవాడు. నేను, జెన్‌ నాన్న ప్రక్కన కూర్చొని ఉండగా 1991, నవంబరు 30వ తేదీన ఆయన దీర్ఘనిద్రలోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు నాకు 70 యేండ్లకు పైబడ్డాయి. అయినా ఇప్పటికి ప్రేమగల నా తల్లిదండ్రుల మంచి మాదిరినుండి ప్రయోజనం పొందుతునే ఉన్నాను. తల్లిదండ్రుల నుండి నేను పొందిన ఈ స్వాస్థ్యం యెడల రానైయున్న యుగాలలోను నా పూర్ణ మెప్పును ప్రదర్శించటమే నా మనఃపూర్వక ప్రార్థన.—కీర్తన 71:17, 18.

[5వ పేజీలోని చిత్రం]

అమ్మ, నేను

[7వ పేజీలోని చిత్రాలు]

1. నా మొదటి సమావేశము: సాన్‌ మార్కోస్‌, టెక్సాస్‌, సెప్టెంబరు 1923

2. నాన్న చివరి సమావేశము: ఫోర్టువర్త్‌, టెక్సాస్‌, జూన్‌ 1991 (నాన్న కూర్చొనియున్నాడు)

[9వ పేజీలోని చిత్రం]

జెన్‌, బ్లాసమ్‌ బ్రాంట్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి